Wednesday, 27 May 2026

T-335 చాలుఁ జాలును భోగమయమున మైమఱపు

 తాళ్లపాక అన్నమాచార్యులు
335 చాలుఁ జాలును భోగమయమున మైమఱపు
For English Version Press Here

పరిచయం
 
ఇది నిస్సంశయముగా శృంగార కీర్తన అయినప్పటికీ వలపు తెరల వెనుక తాత్విక మలుపులలో పయనింప జేస్తారు. అసలు ఆయనకు ఇటువంటి పచ్చి శృంగార కీర్తనలలో మనము లీనమైనపుడు,  భోగము మైమరపులో ఆత్మ రక్షణ కొంత సడలి చెప్పిన విషయము  కొంతైనా లోపలిదాకా వెళ్ళునని కాబోలు. కీచక వధ కూడా వలపు ముసుగులో మొదలైన విషయము కూడా గమనించ వచ్చును. దాదాపు సమ ఉజ్జీలలో విజయం ఎటువైపైనా మారవచ్చును. ఇదే సమత్వంలోని తంటా.

మనిషి తన అంతరంగపు అసంపూర్ణతను, ఒంటరితనాన్ని స్వయంగా ఎదుర్కోలేక చేయునది నేను అనే భారాన్ని దించుకొనుటకు భోగములలో మైమరచుటకు ప్రయత్నించుట అన్న విషయంఈ కీర్తనలో అంతర్లీనమై కనిపిస్తుంది. 

శృంగార సంకీర్తన 

రాగి రేకు: 8-2  సంపుటము - సంకీర్తన: 5-45
చాలుఁ జాలును భోగమయమున మైమఱపు-
పాలుపడునట యేఁటి బ్రదుకురా వోరి              ॥పల్లవి॥

ఇందుమఖి నిను గౌఁగిలించి లోపలి జగము
కందునని నీ బిగువుఁ గౌఁగిలే వదలె
పొందైన వారితోఁ బొసఁగఁ గౌఁగిఁట జేర్పఁ
బొందుగాదట యేఁటి పొందురా వోరి   ॥చాలు॥

నెలఁత నీ వాలుఁగన్నులు మూసి జగమెల్లఁ
గలయఁ జీఁకట్లైన గక్కనను వదలె
వలచినంగనలు తమ వలసిన విలాసముల-
వలను నెరపని దేఁటి వలపురా వోరి   ॥చాలు॥

కొమ్మ నీవురముపై గోరు దివియుచు నాత్మ-
నిమ్మైన ననుఁదాక నిద్దరిని దాఁకె
దిమ్మరివి కోనేటితిమ్మ నీపైఁ బ్రియము
కుమ్మరించని దేఁటి కోర్కిరా వోరి        ॥చాలు॥
Details and Explanations:
పల్లవి:
చాలుఁ జాలును భోగమయమున మైమఱపు-
పాలుపడునట యేఁటి బ్రదుకురా వోరి          ॥పల్లవి॥ 
భావము:
కీర్తన పాదము
సాధారణ భావము
అంతరార్థము
చాలుఁ జాలును భోగమయమున మైమఱపు-
ఎంత భోగించినా అందులోనే మైమరచుటకు
దేనిని మైమరచుటకు భోగమయమై ఉందువో
పాలుపడునట యేఁటి బ్రదుకురా వోరి
(పాలుపడు = పూనుకొను, పైనవేసికొను, స్వాధీనమగు)
(దాని) కోసం బ్రతుకును అర్పించుట ఏందుకురా?
దానికే స్వాధీనమై బ్రదుకుట  ఎందుకురా? 
గూఢార్థవివరణము:

అన్ని భోగ సమయములలో కొంత మైమఱపు మనమంతా గమనించే ఉంటాం. ముఖ్యంగా కామములో ఇది మరింత వశము తప్పుతుంది. అన్నమాచార్యులు ఈ పల్లవిలో "దేనిని మైమరచుటకు భోగమయమై ఉందువో" అని గుంభనగా చొప్పించారు.
 
ఈ పల్లవిలో గమనించ వలసినది గొఱ్ఱె కసాయి వాణ్ణి నమ్మినట్లు, దేనిని మరచుటకు భోగమలను స్వీకరించుచున్నాడో దానిలోకే శరణంటాడు మానవుడు.

Bottom of Form


మొదటి చరణం: 
ఇందుమఖి నిను గౌఁగిలించి లోపలి జగము
కందునని నీ బిగువుఁ గౌఁగిలే వదలె
పొందైన వారితోఁ బొసఁగఁ గౌఁగిఁట జేర్పఁ
బొందుగాదట యేఁటి పొందురా వోరి          ॥చాలు॥ 
భావము:
కీర్తన పాదము
సాధారణ భావము
అంతరార్థము
ఇందుమఖి నిను గౌఁగిలించి లోపలి జగము కందునని
ఎంతో ఇష్టంతో చేరి కౌగిలించుకొన్న ఇందువదన తన సుకుమారతను యోచించి సౌందర్యము కందిపోవునని (నలుపెక్కునని)
ఆ మత్తును కొనసాగించుటకు నీకివ్వ బడిన ఈ శరీరము సుకుమారతను సాధ్యాసాధ్యాలను విచారించి
నీ బిగువుఁ గౌఁగిలే వదలె
నీ కౌగిలిని విడుచును. నీవు కోరినది దొరకినా అది నీ పట్టులో ఉండదు
ఆ జీవి తన విచారణలో దాని చుట్టూను జగమంతాను వున్న నీకౌగిలిని విడుచును.
పొందైన వారితోఁ బొసఁగఁ గౌఁగిఁట జేర్పఁ
(పొందు =ప్రాప్తింౘు, స్నేహము, ఆనుకూల్యము)  ఒకవేళ పొందిన అనుకూలవతిని చక్కగా గౌఁగిఁట తేల్చినా.    
పోనీ, ఉన్నదానితో సర్దుకుని భోగించ చూచినా
బొందుగాదట యేఁటి పొందురా వోరి
అయినా​ అది స్నేహము కాదట. నిజమైన పొందు ఏమిటో?    
అయినా​ అది బంధుత్వం కాదట. అసలైన చుట్టరికం ఏమిటో?
 గూఢార్థవివరణము: 
మనిషి 'తను ఏమిటి, తన సామర్థ్యం ఎంత' వంటి కొలతలతో జీవితాన్ని అంచనా వేయబోతాడు. ముఖ్యంగా తన సుకుమారతను సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయించబోతాడు. ఆ విచారణ కేవలము అతని అంచనా మాత్రమే. ఆ విచారణలో ఆ జీవి తనను చుట్టుముట్టివున్న జగమంతటిని ప్రక్కకుపెట్టి తనకు తెలిసిన చిన్ని నిజమే ఆధారముగా ముందుకువెళతాడు. సత్యమును (నీ కౌగిలిని) విడుచును. ఈ విధముగా సత్య సాధనలో మొదటి, కానీ అతి కీలకమగు తడబాటును మన ముందుంచారు.

పోనీయని ఉన్నదానితో సర్దుకుని భోగించ చూచినా అందులోని ఏర్పాటు ఎదోరకముగా బీఁటలువారుతుంది. మరి పగులువాఱని చుట్టరికం ఏమిటో? అన్ని అమరికలు ఎదో ఒక సమయంలో బద్దలగునవే.

రెండవ చరణం:
నెలఁత నీ వాలుఁగన్నులు మూసి జగమెల్లఁ
గలయఁ జీఁకట్లైన గక్కనను వదలె
వలచినంగనలు తమ వలసిన విలాసముల-
వలను నెరపని దేఁటి వలపురా వోరి          ॥చాలు॥ 
భావము:
కీర్తన పాదము
సాధారణ భావము
అంతరార్థము
నెలఁత నీ వాలుఁగన్నులు మూసి జగమెల్లఁ
ఓ నెలఁత నీవు కనులు మూసుకుని జగమంతా
ఓ జీవుడా నీవు కనులకు తెరలు కప్పుకుని ఎక్కడెక్కడ తిరిగి ఏం ప్రయోజనం?
గలయఁ జీఁకట్లైన గక్కనను వదలె
నీవెంత కలయ   దిరిగినా కనపడునది మూసిన కనుల చీకట్లే. గక్కనను వదలు.  
కనులు తెరిచినా కదా చీకట్లు విప్పుకునేది?
వలచినంగనలు తమ వలసిన విలాసముల-
వలచిన అంగనలకు తమకు వలసిన విలాసముల    
నీ కోరికలు విలాసముల
వలను నెరపని దేఁటి వలపురా వోరి
(వలను= దిక్కు, నేర్పు, ఉపాయం, ప్రదక్షిణము) ఉపాయంగా నెరవేర్చనిది ఏమి వలపురా?   
చుట్టూ ప్రదక్షిణములు చేయునది వలపు అంటావా?.
గూఢార్థవివరణము: 
మనసులోని పొరలు కనుల ముందటి దానిని చూడ నివ్వక తడబడుటను చూపారు. మాహాత్ములందరు సత్యము ఎదురుగానే ఉన్నదని చెప్పినా మనము చూడలేక తచ్చాడుతూనే ఉన్నాము. సత్య సాధనలో రెండవ విషయం ఇలా చూపారు. కోరికలు విలాసముల చుట్టూ ప్రదక్షిణములతో మనసు ఏకాగ్రత లేక  కనులు మూసిన సంగతి కూడా గ్రహించలేనిదగును.

మూడవ చరణం:
కొమ్మ నీవురముపై గోరు దివియుచు నాత్మ-
నిమ్మైన ననుఁదాక నిద్దరిని దాఁకె
దిమ్మరివి కోనేటితిమ్మ నీపైఁ బ్రియము
కుమ్మరించని దేఁటి కోర్కిరా వోరి          ॥చాలు॥ 
భావము:
కీర్తన పాదము
సాధారణ భావము
అంతరార్థము
కొమ్మ నీవురముపై గోరు దివియుచు నాత్మ-
(కొమ్మ= చక్కనిది) ఆ చక్కనిది (లక్ష్మీదేవి) నీ వక్షము పై కోరి ఆత్మలో దీపములా
ఒక్కసారిగా ఆ చక్కని వెలుగు నాపై కటాక్షీంచగా నా హృదయంలో-
నిమ్మైన ననుఁదాక నిద్దరిని దాఁకె
(ఇమ్మైన = పూర్తిగా, రుచించునట్లుగా completely closely) పూర్తిగా, రుచించునట్లుగా నన్ను తాకగా నిన్ను కూడా తాకినట్లయ్యెను.
సంపూర్ణముగా ఏ మాత్రము సందులేకుండ అలుముకొనగా మనిద్దరిని - నిన్ను నన్ను కూడా తాకినట్లయ్యెను.
దిమ్మరివి కోనేటితిమ్మ నీపైఁ బ్రియము
తిరుగుబోతువి! ఓ  కోనేటితిమ్మ రాయడా నీపై ప్రేమ-
నువ్వెక్కడుంటావో తెలియదు. కానీ ఓ  కోనేటితిమ్మ రాయడా నీపై ప్రేమ
కుమ్మరించని దేఁటి కోర్కిరా వోరి
-కుమ్మరించనిది కూడా ప్రేమేనా?
కాక ఇతరులపై కుమ్మరించినది కూడా ప్రేమేనా?
 గూఢార్థవివరణము:
ఈ చరణములో అన్నమాచార్యులు తీక్షణమైన సత్యమును ముందుంచారు. భగవంతుడెక్కడుంటాడో తెలియదు. కానీ, ఇతరులపై కుమ్మరించు ప్రేమలో మనిషికి తాను వెదుకుచున్న సంపూర్ణత దొరకునా?  కనులు తెరువకుండ చుట్టూ గాఢంగా కౌగిలివలె కప్పి ఉన్న దానిని తెలియలేము. కనులు తెరుచుటకు, మూసియుండుటకు మధ్య వ్యత్యాసమేమి? "కన్ను దెరచుటొకటి కనుమూయుటొకటే" అని ఆచార్యులు ఊరకనే అనలేదే! 

X-X-X THE END X-X-X

3 comments:

  1. ఒక శృంగార కీర్తనను మధించి అంత భవ్యమైన అంతరార్థాన్ని వెలికి తీయాలంటే జన్మాంతర సంస్కారము, పండిన జీవితము, పరిణతి చెందిన హృదయము ఉండాలి. మీ సునిశిత పరిశీలనా పటిమకు జోహార్లార్యా! 🙏🏼🙏🏼

    ReplyDelete
  2. మోక్షం అవుతుంది అన్నమాచార్యులు కీర్తనలు రాశారా లేకపోతే కీర్తన వ్రాసి మోక్షం పొందారు ఏమైనా సరే అన్నమయ్య శృంగారసం కీర్తనలు ఆధ్యాత్మికతకు చేరుటకు సులువైన రాజమార్గం కోసం తన లోపలికి వెళ్లే ప్రయత్నం ప్రతి ఒక్కరు చేయుటకు సులువు మూలాధారజ నాదయోగ మెరుగుట నిజమగుమోక్షం అని త్యాగరాజు వారు తెలిపి ఉన్నారు.

    ReplyDelete
  3. శ్రీనివాస్ గారన్నట్లు అన్నమయ్య దృష్టి మనిషి యొక్క దైనందిన సంఘర్షణల
    పైనే ఉన్నది. శృంగారాన్ని సాధనంగా తీసుకొని ఈ కీర్తనలోని గూఢార్థాన్ని వెలిబుచ్చారు. సంసారమందలి అసంపూర్ణతను భరించలేక భోగముల వైపు దృష్టి సారించి అందే ఆసక్తుడయి మైమరచి వాటికి దాసోహమై తనరు
    చున్నాడు.

    ఈ భోగములన్నీ అశాశ్వతములని. యిది నిజమైన బంధుత్వం కాదని, మొదటి చరణంలో ఆచార్యులవారు ఆధ్యాత్మిక ధోరణిలో చెప్తున్నారు. భోగములనెడి అజ్ఞానాంధకారంలో మ్రగ్గి కనులు మూసుకున్న మనిషి కనులు తెరచిన కదా జ్ఞానప్రకాశాన్ని దర్శించేది.

    దైనందిన జీవితంతో ముడిపడి ఆధ్యాత్మిక భావమును ఆచార్యులవారు ఎంత అద్భుతంగా ఆవిష్కరించారో ఈ కీర్తనలో.
    వారికి ప్రణతులు.

    ఓం తత్ సత్‌
    🙏🙏🙏
    కృష్ణమోహన్

    ReplyDelete

336 maṃci guṇamulugala maguvala sāja midi (మంచి గుణములుగల మగువల సాజ మిది)

  TALLAPAKA ANNAMACHARYULU 336 మంచి గుణములుగల మగువల సాజ మిది (ma ṃ ci gu ṇ amulugala maguvala s ā ja midi) తెలుగులో చదవడానికి ఇక్కడ నొక్కండి...