అన్నమాచార్యులు
4R ఇన్నియుఁ జదువనేల యింతా వెదకనేల
ఇన్నియుఁ జదువనేల — ఒక అన్వేషణ
మనిషి జీవితం అనేక పరస్పర విరుద్ధమైన కదలికల మధ్య సాగుతుంది. బయట కనిపించే
వైరుధ్యాలు మనస్సులోనూ ప్రతిబింబిస్తాయి. ఏది కావాలి, ఏది వద్దు; దేనిని స్వీకరించాలి, దేనిని విడిచిపెట్టాలి; ఏది బంధం, ఏది మోక్షం—ఈ ఎంపికల మధ్య మనస్సు నిరంతరం కదులుతూనే
ఉంటుంది. ఈ అయోమయాన్ని పరిష్కరించుకోవడానికి మనిషి అనేక సిద్ధాంతాలను ఆశ్రయిస్తాడు, పుస్తకాలను చదువుతాడు, సత్యాన్ని వెదుకుతాడు.
అయితే, “ఇన్నియుఁ జదువనేల యింతా వెదకనేల” అని అన్నమాచార్యులు మన ప్రయత్నాన్నే
ప్రశ్నిస్తున్నారు. చదవడం, వెదకడం ద్వారా సత్యాన్ని తెలుసుకోగలమా? మనం సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నామా, లేక మనకు ఇప్పటికే తెలిసిన విషయాల ఆధారంగా దానిని
అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నామా? వెంటనే, “కన్ను దెరచుటొకటి కనుమూయుటొకటే” అంటారు.
మనకు వేర్వేరుగా కనిపించే పుట్టుక, మరణం వంటి సంఘటనలను ఆయన ఒకటిగా చూస్తున్నారు. ఆయన
చూస్తున్నది ఏమిటి? మనకు ఎందుకు కనిపించడం లేదు?
తరువాతి చరణాలలో ఈ విచారణ వలెను–వలదు, పుట్టుట–పోవుట, ఇహపరములు వంటి విషయాల మీదుగా సాగుతుంది. ఇవి వేర్వేరు సమస్యలా? మనస్సు సృష్టించే విభజనలా? దేహాన్ని కేంద్రంగా చేసుకున్న మన అస్తిత్వ భావన, ఇహపరముల పట్ల ఆకర్షణ—ఇవన్నీ ఒకే చలనానికి భిన్న రూపాలా? అన్నమాచార్యులు మనం సాధారణంగా ప్రశ్నించని విషయాలను ప్రశ్నించేలా చేస్తారు.
ఈ కీర్తనను అర్థం చేసుకున్నామని త్వరగా నిర్ణయించరాదు. పదాలు సరళమైనవే; వాటి వెనుక ఉన్న పరిశీలనలు గంభీరమైనవి. ఈ వ్యాఖ్యానం అన్నమాచార్యుల మాటల దిశను
మాత్రమే సూచించగలదు. అందుకే ఈ కీర్తనను మన జీవితంలో జరుగుతున్న వాస్తవ చలనాలను
పరిశీలించడానికి ఒక అవకాశంగా చూడాలి. “ఇన్నియుఁ జదువనేల” అనే ప్రశ్నను మనకు మనమే వేసుకోవాలి.
|
అధ్యాత్మ కీర్తన:
|
|
రాగిరేకు: 311-4 సంపుటము:
4-64
|
|
ఇన్నియుఁ జదువనేల యింతా వెదకనేల కన్ను దెరచుటొకటి కనుమూయుటొకటే ॥పల్లవి॥ వలెననే దొకమాఁట వలదనే దొకమాఁట సిలుగులీ రెంటికిని చిత్తమే గురి వలెనంటే బంధము వలదంటే మోక్షము తెలిసే విజ్ఞానులకు తెరువిది యొకటే ॥ఇన్ని॥ పుట్టెడిదొకటే పోయెడిదొకటే తిట్టమై యీ రెంటికిని దేహమే గురి పుట్టుట సంశయము పోవుట నిశ్చయము వొట్టిన విజ్ఞానులకు నుపమిది యొకటే ॥ఇన్ని॥ పరమమనేదొక్కటే ప్రపంచమొక్కటే సిరుల నీ రెంటికిని జీవుఁడే గురి యిరవై శ్రీవేంకటేశుఁ డిహపరములకర్త శరణాగతులకెల్ల సతవిూతఁ డొకఁడే ॥ఇన్ని॥
|
Details and Explanations:
పల్లవి:
ఇన్నియుఁ జదువనేల యింతా వెదకనేల
కన్ను దెరచుటొకటి కనుమూయుటొకటే ॥పల్లవి॥
భావము:
|
కీర్తన పాదము
|
సాధారణ భావము
|
ఆధ్యాత్మిక భావము
|
|
ఇన్నియుఁ జదువనేల యింతా వెదకనేల
|
ఇంతగా చదువనేల? ఈ కనబడే ప్రపంచంలో
ఇంతగా వెదకనేల?
|
సత్యాన్ని తెలుసుకోవడానికి చదవడం, వెదకడం అనే ప్రయత్నాలు మాత్రమే మార్గాలా?
|
|
కన్ను దెరచుటొకటి కనుమూయుటొకటే
|
కన్ను తెరవడం (పుట్టుట) కన్ను మూయడం (మరణించుట)
ఒకటే అని తెలిస్తే చాలు కదా.
|
మనకు రెండు వేర్వేరు సంఘటనలుగా కనిపించే పుట్టుట, మరణించుటల మధ్య వ్యత్యాసాన్ని కవి
ప్రశ్నిస్తున్నారు. ఆయన ఏ స్థితి నుంచి ఈ మాట అంటున్నారు? ఆయన చూస్తున్నది మనకు అవగతం కానంతవరకు, మనది నిజంగా సత్యాన్వేషణేనా?
|
గూఢార్థవివరణము:
“ఇన్నియుఁ
జదువనేల యింతా వెదకనేల” అని అన్నమాచార్యులు మన ప్రయత్నాన్నే ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ
వ్యక్త ప్రపంచములోని విషయములు. వ్యక్తము అనగా జరిగిపోయినది. దానిని శోధించి ఏమి
సాధించగలం అని మనలను ప్రశ్నిస్తున్నారు.
భగవద్గీత రెండు 28 లో మనము వ్యక్తం అవ్యక్తము నుండి పుట్టుచున్నదని
తెలుసుకున్నాము. వ్యక్తం అవ్యక్తం నుండి
విడివడినది కావున దాని నుండి అవ్యక్తమును తెలుసుకొనలేము అని అన్నమాచార్యులు
చెబుతున్నారు. మరి మార్గమేమి?
వెనువెంటనే రెండవ పాదంలో, “కన్ను దెరచుటొకటి కనుమూయుటొకటే” అంటారు. మనము
ఈ ప్రపంచమును నిరంతర వాస్తవంగా
కాక (not as single unified truth) అనేక ముక్కలుగా చీలిన సత్యము లాగా అనుభవిస్తాము. అందుమూలమునమ పుట్టుట పోవుట
రెండు విడివిడి సంఘటనలుగా తెలియదుము. కానీ అన్నమాచార్యులు ఈ రెండింటినీ ఒకటిగానే చెబుతున్నారు. ఆయన
ఏ స్థితి నుంచి ఈ మాట అంటున్నారు? ఆయన చూస్తున్నది మనకు
ఎందుకు కనిపించడం లేదు?
సత్యం అనేది జేబులో పెట్టుకొని, అవసరమైనప్పుడు చూపించగల రూపాయి నోటులా ఒక
స్థిర ప్రమాణము కాదు. సత్యమును ఇదమిత్థముగా నిర్ణయించలేము. కావున సత్యం గురించి
తెలుసుకోవడం వేరు; సత్యాన్ని నేరుగా
చూడటం వేరు.
ఇక్కడ అన్నమాచార్యులు మనకు ఒక సిద్ధాంతాన్ని
అందించడం లేదు. సత్యాన్ని తెలుసుకోవాలనే మన ప్రయత్నం సరైన దిశలోనే ఉందా అని
ప్రశ్నిస్తున్నారు. ఆయన చూస్తున్నది మనకు అవగతం కానంతవరకు, మనది సత్యాన్వేషణేనా?
మొదటి చరణం:
వలెననే దొకమాఁట వలదనే దొకమాఁట
సిలుగులీ రెంటికిని చిత్తమే గురి
వలెనంటే బంధము వలదంటే మోక్షము
తెలిసే విజ్ఞానులకు తెరువిది యొకటే ||ఇన్ని||
భావము:
|
కీర్తన పాదము
|
సాధారణ భావము
|
ఆధ్యాత్మిక భావము
|
|
వలెననే
దొకమాఁట వలదనే దొకమాఁట
|
‘వలెను’ ఒక మాట ‘వలదు’ ఒక మాట
|
"వలెను"
"వలదు" రెండు కూడా కోరిక చుట్టూ తిరిగె చట్రములు. (ఈ రెండింటికి
ఆధారము కోరికయే)
|
|
సిలుగులీ
రెంటికిని చిత్తమే గురి
|
(సిలుగు = ఇబ్బంది, చిక్కు, సంకటస్థితి.) ఈ ఎంపికలలో మనస్సు
చిక్కుకుంటుంది.
|
సంకటంలో ఉన్న మనస్సు నుండే ఈ
రెండు చలనములు పుడుతున్నాయి.
|
|
వలెనంటే
బంధము వలదంటే మోక్షము
|
కావాలంటే బంధము; కాదనుకుంటే మోక్షము.
|
సాధారణంగా కోరిక బంధమనీ, తిరస్కరణ మోక్షమనీ భావిస్తాము. కానీ వీనిని ఎంపిక చేస్తున్న అదే మనస్సులోనే
కదా అవి పుడుతున్నాయి.
|
|
తెలిసే
విజ్ఞానులకు తెరువిది యొకటే
|
దీనిని తెలిసే విజ్ఞానులకు
తెరువు ఇది ఒక్కటే.
|
"వలెనంటే బంధము"
"వలదంటే మోక్షము" అను భిన్న ధృవములతో మనస్సు ఆడించే మాయను తెలియుట
విజ్ఞత. ఇది తెలిసే విజ్ఞానులకు తెరువు ఇది ఒక్కటే.
|
గూఢార్థవివరణము:
వలెననే దొకమాఁట వలదనే
దొకమాఁట / సిలుగులీ రెంటికిని చిత్తమే గురి:
మనకు ఏ విషయంలోనైనా ‘వలెను’, ‘వలదు’ అనే ఎంపికలు
ఎదురవుతుంటాయి. ఆ రెండూ ఒకే మనస్సులో పుడుతున్నాయి. పైగా, వాటిలో
చిక్కుకునేది కూడా మనస్సే. గమనించండి ఇంకొంచెం ఆలోచిస్తే, ‘వలెను’,
‘వలదు’ అనేవి కోరిక మనలో రేపే దుమారంలో భాగాలుగా కనిపిస్తాయి.
అన్నమాచార్యులు మొదటి రెండు పాదాలలో మన అంతరంగంలోని అస్థిరతను చూపారు.
వలెనంటే బంధము వలదంటే
మోక్షము: సాధారణంగా కోరికను బంధంగా, దానిని వదులుకోవడాన్ని
మోక్షంగా భావిస్తాము. కానీ కోరుకోవడం, వద్దనుకోవడం రెండూ ఒకే
మనస్సులో పుడుతున్నప్పుడు, ఒకటి బంధాన్ని, మరొకటి మోక్షాన్ని ఎలా ఇవ్వగలవు? వీటిలో ఒకదానిని
ఎంచుకోవడం సమస్యకు పరిష్కారం కాకపోవచ్చు కదా!
తెలిసే విజ్ఞానులకు
తెరువిది యొకటే: ఈ విషయాన్ని తెలిసే విజ్ఞానులు, మనస్సులో
పుట్టే కదలికలలోనే పరిష్కారాన్ని వెదకడం వల్ల సమస్య తీరదని స్పష్టంగా చూడగలరు.
అప్పుడు ‘వలెను’, ‘వలదు’ అనే విభజనలకు అతీతమైన తెరువును
గుర్తించగలరు.
రెండవ చరణం:
పుట్టెడిదొకటే పోయెడిదొకటే
తిట్టమై రెంటికిని దేహమే గురి
పుట్టుట సంశయము పోవుట నిశ్చయము
వొట్టిన విజ్ఞానులకు వుపమిది వొకటే ||ఇన్ని||
భావము:
|
కీర్తన పాదము
|
సాధారణ భావము
|
ఆధ్యాత్మిక భావము
|
|
పుట్టెడిదొకటే
పోయెడిదొకటే
|
మనకు తెలిసిన అన్ని ఆధారాలను
కలిపి చూస్తే పుట్టెడిదొకటే = ఈ ప్రపంచములోనే పుడుతున్నాము. పోయెడిదొకటే =తిరిగి
ఈ ప్రపంచములోకే జారుకుంటున్నాము.
|
సత్యమొకటే అని వేదములు
ఘోషించుచున్నవి. ఈ చరాచర జగత్తును
నడుపుచున్న సత్యములోని వారమే మనము. అటువంటప్పడు పుట్టుట, పోవుట అను సంఘటనలను వేర్వేరుగా చూచు మానసిక స్థితి ఏమి?
|
|
తిట్టమై
యీ రెంటికిని దేహమే గురి
|
(తిట్టము = చిత్రము వేసే ముందర రేఖలతో వేసుకొనే
స్థూలాకారము, basic plan, ఇక్కడ ‘నమూనా’గా తీసుకోవచ్చును) ఈ స్థూలదేహము పుట్టుట, పోవుటలకు గురి అగుచుండగా, దానిని విరోధించునదేమి?
|
దేహాన్ని కేంద్రంగా చేసుకుని
చూసే చూపులతోనే ఈ ప్రపంచం నుంచి వేరైనవారమని భావిస్తున్నామా? ఈ విభజనకు ఆధారమేమి?
|
|
పుట్టుట
సంశయము పోవుట నిశ్చయము
|
తిరిగి పుట్టుట అనిశ్చితము. పోవుట
నిశ్చయము.
|
పోవుట అనివార్యమని తెలిసినా, ఆ నిశ్చయాన్ని మనస్ఫూర్తిగా
అంగీకరించలేదే మనస్సు! అనివార్యమైనదాన్ని వాయిదా వేయడానికి, తన ఉనికిని పొడిగించుకోవడానికి
ప్రయత్నించేది ఏమిటి?
|
|
వొట్టిన
విజ్ఞానులకు నుపమిది యొకటే
|
(ఉపము = ఉపాయం, నేర్పు, యుక్తి; వొట్టిన = ఏమీలేని; వొట్టిన విజ్ఞానులకు = స్వచ్ఛమైన జ్ఞానము తప్పించి వేరే అభిప్రాయములు లేని
వారికి) స్వచ్ఛమైన అవగాహన కలవారికి ఈ ఒక్క సంశయమును దాటు నేర్పు తెలిసితే చాలు కదా!
|
సత్యము తప్ప వేరేమీ పరిగణనలోకి
తీసుకోని ఆ ఒక్క నేర్పు ఏమిటి?
|
పుట్టెడిదొకటే
పోయెడిదొకటే / తిట్టమై యీ రెంటికిని దేహమే గురి: మనం
ఈ ప్రపంచం నుంచే పుట్టి, తిరిగి అందులోకే
జారుకుంటున్నాము. అయినా, ఈ ప్రపంచం నుంచి వేరైనవారమనే భావన
మనలో బలంగా ఉంటుంది. ఈ స్థూలదేహం పుట్టుటకు, పోవుటకు
లోనవుతుంది. ఈ
దేహము శాశ్వతమైనది కాదని తెలిసినా, దేహాభిమానము వల్ల జీవన అవధిని పొడిగించుకోవడానికి మనస్సు చేసే ప్రయత్నాలు
మన దృష్టిని ప్రభావితం చేస్తుంటాయి. అటువంటి
స్థితిలో సత్యాన్ని యథాతథంగా చూడగలమా? అన్నమాచార్యులు
ఇక్కడ మన దృష్టిని దేహం మీద మాత్రమే కాక, దేహం ఆశ్రయముగా మనస్సు
నిర్మించుకున్న సంబంధాల మీద కూడా మళ్లిస్తున్నారు.
పుట్టుట
సంశయము పోవుట నిశ్చయము: మరణం
అనివార్యమైనా, ఆ మార్పును అంగీకరించనిదేమి? ప్రతిఘటించునదేమి? సహజమైన మనుగడకు సంబంధించిన
ప్రతిచర్యలా? అంతకంటే లోతైన కొనసాగింపు కోరికయా?
వొట్టిన
విజ్ఞానులకు నుపమిది యొకటే: (ఉపము = ఉపాయం, నేర్పు, యుక్తి;
వొట్టిన విజ్ఞానులు = స్వచ్ఛమైన జ్ఞానము తప్పించి వేరే అభిప్రాయములు
లేనివారు.) మనకు ప్రతీ విషయంపై అభిప్రాయాలు ఉంటాయి.
నిశ్చలనిశ్చయాలు మనవి. కానీ సత్యాన్ని ఇదమిత్థంగా నిర్ణయించలేము. దానికి ఒక
రూపాన్ని నిర్ధారించడం గానీ, మన దృష్టికి అందే
ప్రమాణాలతో దానిని స్థిరపరచడం గానీ సాధ్యం కాదు. మనకు అభిప్రాయాలు అంటూ ఉంటే—అవి
ఏమైనా కానీయండి—అవే ఆటంకాలను, విరోధాలను కలిగిస్తున్నాయా?
సత్యం గురించి
ఎన్నో అభిప్రాయాలు కలిగి ఉండటం ఒకటి; ఆ అభిప్రాయాల
జోక్యం లేకుండా సత్యాన్ని చూడటం మరొకటి. వొట్టిన విజ్ఞానులు అనే మాట మనల్ని
ఈ వ్యత్యాసం వైపు తీసుకెళ్తుంది. అయితే ఆ స్వచ్ఛమైన అవగాహన ఎలా సాధ్యమవుతుంది?
దేహాన్ని కేంద్రంగా చేసుకున్న మనస్సు తానే విధించుకున్న పరిమితులను
తాను తెలుసుకోగలదా?
ఈ చరణం పుట్టుక, మరణం, దేహం, మనస్సు, కొనసాగింపు అనే అంశాలను ఒకదానితో మరొకటి కలుపుతూ, మనం
సాధారణంగా ప్రశ్నించని ఆధారాలనే ప్రశ్నిస్తుంది. పదాలు సులభం; కానీ అవి చూపే నైపుణ్యం అంత సులభం కాదు.
మూడవ చరణం:
పరమమనేదొక్కటే ప్రపంచమొక్కటే
సిరుల నీ రెంటికిని జీవుఁడే గురి
యిరవై శ్రీవేంకటేశుఁ డిహపరములకర్త
శరణాగతులకెల్ల సతవిూతఁ డొకఁడే ||ఇన్ని||
భావము:
|
కీర్తన పాదము
|
సాధారణ భావము
|
ఆధ్యాత్మిక భావము
|
|
పరమమనేదొక్కటే
ప్రపంచమొక్కటే
|
పరము ఈ ప్రపంచము ఒక్కటే.
|
ఇహలోకము, పరలోకము అనే హద్దులు లేవు.
పరలోకమనే భావన ఎంత భద్రతనిచ్చినా, దానికై ఎదురుచూసే మనస్సు
ఇహలోకంలో చిక్కుకున్నట్లే.
|
|
సిరుల
నీ రెంటికిని జీవుఁడే గురి
|
(సిరులు = జాతరలు, ఆకర్షణలు ) ఈ రెండు లోకాలలోని ఆకర్షణలకు
జీవుడే గురి.
|
ఇహపరములలోని ఆకర్షణలు జీవుని
లక్ష్యంగా చేసుకుంటాయి. వాటి పట్ల ఇసుమంత మొగ్గు చూపినా, జీవుడు వాటి ఉచ్చులో
చిక్కుకుంటాడు. ఇహపరముల విచారణ అసలు
మోహము.
|
|
యిరవై
శ్రీవేంకటేశుఁ డిహపరములకర్త
|
(ఇరవు = స్థిరము) స్థిరముగా శ్రీ వేంకటేశ్వరుడు ఇహపరములలో ఒకడే
కర్త.
|
ఈ సంక్లిష్ట ప్రపంచాన్ని
నడిపించే కర్త ఒక్కడే. ప్రపంచంలోని అనేక చలనములకు మూలము అతడే. శరణాగతులు అతనిని
ప్రత్యక్షంగాను, తక్కినవారు పరోక్షంగాను తెలుసుకుంటారు.
|
|
శరణాగతులకెల్ల
సతవిూతఁ డొకఁడే
|
శరణాగతులందరికీ ఆయన ఒకడే
శాశ్వతమైన సత్యము.
|
వాస్తవమైన శరణాగతిలో
నిలిచివుండేది సత్యం ఒక్కటే.
|
గూఢార్థవివరణము:
పరమమనేదొక్కటే
ప్రపంచమొక్కటే:
ఇహలోకం, పరలోకం
అంటూ ప్రపంచాలు లేవని చెప్పినంత మాత్రాన, ఈ లోకంలో విచ్చలవిడిగా
జీవించవచ్చని అర్థం చేసుకోకూడదు. ముందటి చరణాలలో సత్యము అతి పదునైనదని, సామాన్య
అవగాహనకు దృక్పధమునకు చిక్కని విషయమును చూపారు. ఇహపరములలోని
ఆకర్షణల లక్ష్యం జీవుడు. ఇసుమంత మొగ్గు చూపినా, వాటి ఉచ్చులో
చిక్కుకుంటాడు. ఈ ఆకర్షణలు జీవికి తానున్న
వాస్తవ స్థితిని మరిపించి, ఊహాలోకంలో విహరించడానికి ఆస్కారం
కల్పిస్తాయి. కావున ఇహపరముల విచారణ అసలు మోహము.
పరలోకం అనే భావన
అతనికి గొప్ప మానసిక భద్రతను ఇవ్వవచ్చు. మతములు తమకు అనుకూలంగా పరము అనే
భావనను ఉపయోగించుకుంటాయి. అప్పుడు మరో ప్రపంచం మనిషి స్వయంగా పరిశీలించవలసిన
విషయంగా కాక,
నమ్మకం
ద్వారా చేరుకోవలసిన గమ్యంగా మారుతుంది. కానీ
అన్నమాచార్యులు ఈ విభజననే ప్రశ్నిస్తున్నారు. ఈ రెండు ప్రపంచాలను వేరుగా
చూపుతున్నది మనస్సు కాదా? మనిషికి ఒక ఉపకరణంగా ఉండవలసిన మనస్సు
అతనికి ఏ విధంగా సహాయపడుతోంది?
మనసుకు గల
హద్దులు జీవునివిగా తీసికొనుటచేత మనము మనసు చూపు ప్రపంచమునకే పరిమితమగు చున్నామా? దేనిని
నమ్మి "యిరవై శ్రీవేంకటేశుఁ డిహపరములకర్త" అని ప్రత్యక్షంగా
తెలియలేకున్నాము? ఈ విశాల ప్రపంచం వెనుక ఉన్న ఏకత్వం
దాగిలేదు. కానీ దానిని గుర్తించడానికి గల
పరికరమేమి?
ఇదే
అసలు ప్రశ్న.
ఇప్పుడు రెనే మాగ్రిట్ వేసిన దిగువన ఉన్న key to the fields (La clef des champs క్షేత్రమునకు మార్గము) పేరుతో
ఉన్న పెయింటింగ్‌ను శ్రద్ధగా చూడమని పాఠకులకు అభ్యర్థన. ఈ బొమ్మలో మనవైపుకు, ఆవలి వైపుకు (బాహ్య
ప్రపంచమునకు) మధ్య ఒక విరిగిపోయిన గాజు కిటికి వుంది.
ఆ ముక్కలను
గమనించిన, గాజు పగలక ముందు, మనం క్షేత్రము యొక్క పెయింట్
చేసిన చిత్రాన్ని మాత్రమే చూస్తున్నాము అని తెలియ వచ్చు. గాజు పగిలిన తర్వాత, మనం నిజమైన ‘క్షేత్రము'ను చుడగలుగుతున్నాము. ఆ
పెయింట్ చేసిన చిత్రము మన అంతఃకరణము అన్నమాట.
సామాన్యముగా మనము ఆ పెయింట్ చేసిన చిత్రమును వాస్తవానికి ప్రతీకగా తీసికొని
జీవిస్తున్నామన్న మాట.
మనిషికి తన
చూపును ప్రభావితం చేస్తున్న వాటిని గుర్తించడం కష్టం. మనస్సులో ప్రతి అనుభవం దాని
తాలుకు జాడను వదులుతుంది. అలాంటి జాడలు అనేకము పేరుకుపోతాయి. వాతావరణంలోని
ధూళికణాలు సూర్యకాంతిని చెదరగొట్టినట్లుగా, మనస్సులోని జ్ఞాపకాలు, అభిప్రాయాల
జాడలు మన చూపులను ప్రభావితం చేస్తాయి. అప్పుడు మనకు కనిపించేది మనస్సు చూచిన
దానిని ఎలా గ్రహించిందో తెలుస్తుందే కాని వాస్తవం కాదు. వాస్తవానికి చూచిన దానికి
మధ్య ఉన్న ఈ అడ్డు గోడలు తొలగుట ఎట్లు?
జిడ్డు
కృష్ణమూర్తి చెప్పిన మాటను ఇక్కడ గుర్తుచేసుకోవచ్చు: “It is the truth that liberates the man.”
సత్యాన్ని
తెలుసుకోవడానికి మనం చేసే ప్రయత్నం కన్నా, సత్యాన్ని అడ్డుకుంటున్న
మనస్సు కదలికలను గుర్తించడం ముఖ్యమని ఈ మాట సూచిస్తుంది. స్వేచ్ఛను సాధించాలనే
సంకల్పం కూడా మనస్సు నిర్మించిన మరో ప్రయత్నం. అందుకే
సత్యాన్ని చూడటానికి ఆటంకం కలిగిస్తున్నదేమిటో గమనించడం అవసరం.
మనస్సు పైన
పేర్కొన్న జాడలతో కలుషితమైన మురికి నీరు వంటిది. మనస్సు పనిచేస్తున్నంత సేపు
మురికి నీరు కదులుతూ ఉంటుంది. అవి తేటపడుటకు మనస్సు శాంతించవలెను. చర్యలున్నంత
సేపు నీరు తేటపడదు. కానీ మనము అనేక సార్లు చెప్పుకున్నట్లు మనస్సును నియంత్రించలేము.
ఆ శాంతి, ఏకాగ్రతలు
విడివిడి గణనలు కావు. అవి దేహము, మనస్సు ప్రకృతిలను కలుపు అపూర్వ విషయము.
అందులో ఆ సర్వము మిళితమై శాశ్వతమైన సత్యము గోచరము కాగలదని అంటున్నారు. అదియే శరణాగతి మరియు ఏకత్వము.
X-X-X THE
END X-X-X

No comments:
Post a Comment