తాళ్లపాక అన్నమాచార్యులు
140 మనుజుఁడై
పుట్టి మనుజుని సేవించి
మానవుని సేవ
for English
Version press this link
ఉపోద్ఘాతము: ఈ ప్రసిద్ధము, సంక్షిప్తము, సంక్లిష్టము అగు ఈ కీర్తనలో అన్నమాచార్యులు ప్రపంచమంతా నిండి ఒకే ఒక్క సత్యం ఉందని పునరుద్ఘాటించారు. మానవుడు, వంకరటింకర మలుపులు తిరిగిన మోహముల నుండి బయటపడటంలో విఫలుడవుతాడు. దారితప్పి దుఃఖమంది నిశ్చేష్టుడౌతాడు అన్నారు.
అన్నమాచార్యులు బహుశా పదాలలో వ్యక్తీకరించలేని భావనలను నిత్యజీవితంలో వాడు రోజువారీ పదాలను ఉపయోగించి, మెప్పించి అనుభవమునకు అందని లోకాలకు దారులు మలచారు. ఆయనొక విశ్వవిద్యాలయమునకు తీసిపోరు. మన మనస్సులలో దాచియుంచు జుగుప్సాకరమైన భావనలపై పచ్చి నిజాయితీతో కూడిన వర్ణనలు ఆయన ధైర్యసాహసాలకు గీటురాళ్ళు. అతి చిన్న పదము 'అటు'ను అత్యంత రమణీయముగా, సమర్ధముగా సత్యమునకు మిధ్యావాదానికిగల వ్యత్యాసమును చూపుటకు వాడి తన శైలి అనన్యసాధ్యము అని చాటిరి.
కీర్తన: రాగిరేకు: 32-2 సంపుటము: 1-196 |
మనుజుఁడై
పుట్టి మనుజుని సేవించి
అనుదినమును
దుఃఖమందనేలా ॥మనుజు॥ జుట్టెఁడు
గడుపుకై చొరనిచోట్లు చొచ్చి
పట్టెఁడు
గూటికై బతిమాలి
పుట్టిన
చోటికే పొరలి మనసు పెట్టి
వట్టిలంపటము
వదలనేరఁడు గాన ॥మనుజు॥ అందరిలోఁ
బుట్టి అందరిలోఁ బెరి-
గందరి
రూపము లటు దానై
అందమైన
శ్రీవేంకటాద్రీశు సేవించి
అందరాని
పదమందె నటు గాన ॥మనుజు॥ |
Details and Explanations:
భావము: మనుజుఁడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును దుఃఖమందనేలా?
వివరణము: ఇక్కడ దుఃఖము అనేది కన్నీరు, మనసిక క్షోభ మాత్రమే కాక అనవసరపు జంఝాటములలో పడి కొట్టుకొంటాడనే విస్తృత అర్థంలో ఉపయోగించబడింది. ఇతరులకు సేవ చేయడం వల్ల అసమంజసమైన, ఊహించలేని పర్యవసానాలుంటాయి. ఈ క్రింది భర్తృహరి వ్రాసిన నీతిశతకములోని సంస్కృత శ్లోకమును పరిశీలించండి:
భావము: సేవకుని గురించి యజమాని ఈ విధంగా తలపోస్తాడు:
అన్వయార్ధము: యోగులకే అర్ధముకాని సేవాధర్మమందున వ్యర్ధముగా జీవితమును
వెళ్ళబుచ్చకు.
ముఖ్య
పదాలకు అర్ధాలు: జుట్టెఁడు = చాపబడిన బొటనవేలికి చూపుడువేలికి గల మధ్య కొలత, జానేడు;
వదలనేరఁడు గాన = వదలివేయుట నేర్వడు కాన.
భావము: మొండివాడా! జానెడు
కడుపుకొరకు చొరరానిచోట్లు చొచ్చి, పట్టెఁడు గూటికై బతిమాలుదువే? ఆపై పుట్టిన చోటుపై మనసు పెట్టి అందులోనే పొర్లుతుంటావే?
ఉత్త రిత్త లంపటములు వదలివేయుట మాత్రము నేర్వవు!
వివరణము: ఇంద్రియాలకు ఒక్కోసమయంలో లొంగడం ఒకటి. కానీ మానసికంగా ప్రతిరోజూ మనను వేధించు విషయాలకు అలవాటు పడటం అనేది ఆలోచించాల్సిన సమస్య. ఖచ్చితంగా అన్నమాచార్యులు ఆహారమును నిరాకరించుటలేదు. అయితే, "సాయ౦కాలానికీ, రేపటికీ ఆహార౦ మాటేమిటి?" అని చెప్పే తలపును ప్రశ్నిస్తున్నారు? అందుబాటులో ఉన్న సమాచారమును విస్తరించడం ద్వారా మనస్సు ఆధారములేని ఊహలతో అవకాశాలను, దారులను నిర్మిస్తుంది. అందుకే 'జుట్టెఁడు గడుపుకై చొరనిచోట్లు చొచ్చి' ఖచ్చితమైనదే కాక కఠినమైన వాస్తవికత.
మానవుని ఈ నిరాధారమైన వ్యవసాయము అనేకానేక యుద్ధాలకు, వర్గీకరణలకు, మారణహోమమునకు దారితీసిందని మనందరికీ తెలుసు. ఈ ప్రపంచంలో మానవుడు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు మూలకారణాలలో ఒకటైన యీ విషయాన్ని తప్పక విశ్లేషించవలె. అర్ధముచేసుకోవలె. ముందుగా క్రింది రీని మాగ్రిట్టె గారు లో గీసిన 'లా కార్ట్ బ్లాంష్' (= తెల్లకాగితము) పేరిట ప్రపంచ ఖ్యాతినొందిన ఈ చిత్రమును జాగ్రత్తగా పరిశీలించండి.
పై చిత్రము పరిక్షించిన మీదట అది అసాధ్యమని తెలిసిపోతుంది. చిత్రములో చూపినట్లు గుర్రమును దాని రౌతును ఊహించుట పొందికలేని విషయమే. జాగ్రత్తగా గమనించితే అక్కడ మూడు భాగాలుగా కత్తిరించిన గుర్రపురౌతు బొమ్మను ఉంచారు. కానీ, విశ్లేషణతో సంబంధము లేకనే మనస్సు అక్కడ గుర్రము ఉన్నట్లు నమ్మును.
అధివాస్తవికతా కళాకారులు (సర్రియలిస్ట్) సాధారణ విషయములలో మెలికబెట్టుట ద్వారా మన పరిపాటి ఆలోచనల నుండి మనలను విడదీయడానికి ప్రయత్నిస్తారు. చిత్రం లోని కొన్ని విడివిడి భాగాలను తీసుకున్నప్పుడు మరియు అవి సరిగ్గా వరుసలో వుంచినప్పుడు వాటిని ఒకే వస్తువుగా మనమెదడు గ్రహించబోతుంది. దీనినే ప్రేరిత అనుసంధానము (induced closure) అనవచ్చు. దీనిపై మరికొంత వివరణ క్రింది బొమ్మలో పొందవచ్చు.
పై బొమ్మలలో దృష్టాంతీకరించినట్లు లేనిదానిని మనస్సు ఉన్నట్లు ఎట్లు చేకొనునో, అటులనే తరువాతి రోజు భోజనమునకు ఈ రోజే సుస్థిరము చేయుటకు చింతించుట - వృధా ప్రయాస అని అన్నమాచార్యులనిరి. కానీ, ప్రపంచములోని వార్తలలో ఆకలి మరణాలు, పేదఱికము, అసమానతలు, దోపిడి, పీడనలు, ధనికుల విలాసవంతమైన జీవితములు వగైరాలు సాధారణ మానవుని మనస్సుపై వాటి వాటి పంజాలు విసురును. దానితో మానవుడు తనకైతాను సృజించు తర్కముపై అధిక నమ్మకముంచి సత్యమును ప్రక్కకు నెట్టివేయును. అక్కడ గుర్రము ఉన్నదని నమ్మును.
పుట్టిన చోటికే పొరలి మనసు పెట్టి = మనిషి తన మనస్సులో నిరంతరం తన జనన స్థానాన్ని (స్త్రీ జననేంద్రియ అవయవాలు) తిరిగి తిరిగి సందర్శిస్తాడు. అక్కడా ఇక్కడా దొరుకు సమాచారమును కొద్ది కొద్దిగా సేకరిస్తూ మనసులో అతివ అవయవాలపై రహస్యంగా ఒక గ్రంథాలయాన్నే నిర్మించబోతాడు. ఇది మనిషి నిర్మించే మరొక కృత్రిమ నిర్మాణం అని ఇట్టే తెలిసిపోవును. దీనిని తన జీవశక్తికి ప్రతీకగానూ మరియు తన ఉనికిని బలపరచు సాధనముగానూ సర్దిచెప్పుకొని, లేని తృప్తిని పొంది, తద్వారా ఎనలేని శక్తిని సమకూర్చుకొని ఎదురుదాడికి సిద్ధమౌతాడు. అన్నమాచార్యులు మన మనస్సులో మెదలాడు అశ్లీల భావాలను వ్యక్తీకరించడానికి సిగ్గుపడని విప్లవకారుడు.
పైన వివరించిన ప్రేరిత అనుసంధానమే ఈ ప్రవృత్తికి కారణము. కానీ, మానవుడు వీటిని గుండెలమూలల్లో దాచుకుని పరిరక్షించుకుంటూ వస్తాడు. బయటకు చెప్పడు. అందుకే ఈనాడు అంతర్జాలములో శృంగార విషయములపై లెక్కకు మించిన సైట్లు కలవు. అన్నమాచార్యులు దీనినే "వట్టిలంపటము వదలనేరఁడు గాన" అనగా అర్థంలేని తగులములలో చిక్కుకోవడమే గాని వాటినుండి విడివడడం నేర్వడు అని విమర్శించిరి. ఈ రకముగా మానవుడు తను నిర్మించుకున్న పంజరములోనే బందీ అవుతాడు. ఇక దైవమును నిందించి ప్రయోజనమేమి?
అన్వయార్ధము: పరీక్షించునది, పరీక్షింపబడునది కూడా నీవే. ఇందు
సత్యమునకు తావేదీ? దీనిని గ్రహించి రెంటినీ తిరస్కరించివేనీ ఏమి మిగిలి ఉంటుందో
గమనించితివా?
భావము: యోగి సాధారణ మనిషిలా పుట్టి,
జీవిస్తాడు. యోగియైనవాడు ఆవలివైపుకు చేరి అందరి రూపములు తానే అగును. అందమైన శ్రీవేంకటాద్రీశు
సేవించి ఆవలి వైపుకు అసాధ్యమైన సోపానమును అధిరోహిస్తాడు.
వివరణము: యోగులందరూ సాధారణ మనిషిలాగనే పుట్టి జీవిస్తారు. కీర్తనలో ‘అటు’ అనునది అటువైపుకు ఇటువైపుకు గల సంధిని సూచించు కీలకమైన పదము. ఈ వైపు మన ప్రపంచం, భ్రాంతితో ఏర్పరచుకున్నది ఉంది. మరొక వైపు సత్యమే ప్రమాణముగల శాశ్వత ప్రపంచం. ‘అటు’ అనే పదం ఒక అడ్డంకిని, ఒక మలుపును సూచిస్తుంది. గొంగళిపురుగు సీతాకోకచిలుకగా రూపాంతరముతో దీనిని
పోల్చవచ్చు. ఈ బిందువు ఒక మానవునిగా అధిరోహించగల అంతిమ సోపానము.
ఇది జపములు తపస్సులు చేసి సంపాదించలేనిది. అందుకే అన్నమాచార్యులు "తగు మునులు ఋషులు తపములు సేయఁగ / గగనము మోచియుఁ గర్మము దెగదా" అన్నారు. కావున భగవద్గీతలో గహనా కర్మణో గతిః (4-17) అన్న విషయముపై ఏకాగ్రతతో కూడిన విచారణము, ఆత్మ పరిశీలన అత్యంత ముఖ్యము.
మొదటి చరణంలోని గంభీరమైన హెచ్చరికను గమనించండి. ఇది ఇచ్చిపుచ్చుకునే బేరం కాదు. కృత్రిమత్వాన్ని పూర్తిగా మానవుడు వీడగలడా? ఒక వ్యక్తి ఆ అవరోధాన్ని అధిగమించగలడా లేదా అనేది మనిషి చేతిలో లేదు. కానీ మనం మనస్సు అను కిటికీని తెరిచి ఉంచవలె. దానిగుండా లోనికి గాలి వచ్చునా అనునది నిర్ణయింపలేము. ఈ పని చేయక "నేను ఇది చేస్తే అది వస్తుందా" అని ఆలోచించు మనకు ‘అటు’ గురించిన ఊహాగానములు ఆకాశానికి నిచ్చనలే. సత్యమును చేకొనుము లేదా మోహమను సముద్రమున మునిగిపొమ్ము.
‘అందరి రూపములు’ అని ఇక్కడ ఎందుకు ప్రస్తావించారు అని ఆశ్చర్యం కలిగించవచ్చు. అయితే భగవద్గీత 6-29వ శ్లోకంలో సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని / ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః అని పేర్కొన్నట్లుగా, యోగి తనలోనే ప్రపంచాన్ని. ప్రపంచములోనే తనను అనుభూతి చెందుతాడు అన్నది అన్నమాచార్యులు చెప్పిరి.
ఇంతకు ముందు చాలాసార్లు పేర్కొన్నట్లు, ఈ వ్యాఖ్యానాల ఉద్దేశ్యం సైద్ధాంతిక అన్వేషణలు కాదు, వాస్తవమైన మరియు నమ్మదగిన మానవ అనుభవాలు. జిడ్డు కృష్ణమూర్తి జీవిత గాధలో, 1922 ఆగస్టులో, మొదటిసారిగా ఆయన తనలోనే ప్రపంచాన్ని అనుభూతి చెందగలిగాడు అని ప్రస్తావించారు. (మేరీ లుటియెన్స్ వ్రాసిన Years of Awakening లో 116వ పేజీని చూడ౦డి).
అన్నమాచార్యులు కైవల్యమును పొందిరని మనలో చాలా మందికి తెలుసు. 'అందరాని పదమందె నటు గాన#2: (= అసాధ్యమైన దశను అధిగమించడం) ద్వారా ఆయన సూచించునది ఆ దశనే.
ఈ అందమైన కీర్తనలో అన్నమాచార్యులు అంధ విశ్వాసం ద్వారా కాక, తెరిచిన కళ్ళతో అజ్ఞానాన్ని విసర్జించడం ద్వారా దైవికమగు ప్రేమను స్వీకరించుటకు శ్రోతలను భక్తిమార్గంలో పయనించమని ప్రభోదించిరి.
References and Recommendations for further reading:
#1 http://www.scottmcd.net/artanalysis/?p=115) (Read Mr. Scott McDaniel's Beautiful explanation on Blank Check by Rene Magritte )
#2 92. మోహము విడుచుటే మోక్షమది (mOhamu viDuchuTE mOkshamadi)
కీర్తన సంగ్రహ సారం:
పల్లవి: గుట్టులేని మనుజుఁడై పుట్టి
మనుజుని సేవించి అనుదినమును దుఃఖమందనేలా? అన్వయార్ధము: యోగులకే అర్ధముకాని సేవాధర్మమందున వ్యర్ధముగా జీవితమును
వెళ్ళబుచ్చకు.
చరణం 1: మొండివాడా! జానెడు కడుపుకొరకు చొరరానిచోట్లు చొచ్చి, పట్టెఁడు
గూటికై బతిమాలుదువే? ఆపై పుట్టిన చోటుపై మనసు పెట్టి అందులోనే పొర్లుతుంటావే? ఉత్త
రిత్త లంపటములు వదలివేయుట మాత్రము నేర్వవు! అన్వయార్ధము: పరీక్షించునది, పరీక్షింపబడునది కూడా నీవే. ఇందు సత్యమునకు
తావేదీ? దీనిని గ్రహించి రెంటినీ తిరస్కరించివేనీ ఏమి మిగిలి ఉంటుందో గమనించితివా?
చరణం 2: యోగి సాధారణ మనిషిలా పుట్టి,
జీవిస్తాడు. యోగియైనవాడు ఆవలివైపుకు చేరి అందరి రూపములు తానే అగును. అందమైన శ్రీవేంకటాద్రీశు
సేవించి ఆవలి వైపుకు అసాధ్యమైన సోపానమును అధిరోహిస్తాడు.