అన్నమాచార్యులు
186 అలరఁ జంచలమైన ఆత్మలందుండ
For English Version Press Here
క్లుప్తముగా: మార్పును మనస్ఫూర్తిగా
అంగికరింపలేక బాధలు పడతాము.- షున్రియు సుజుకి
కీర్తన సారాంశం:
పల్లవి: చంచలస్వభావము కలిగిన జీవాత్మలకు ఈ ఉయ్యాలవలె అటునిటు (జీవన్మరణములలో) వూగుట
అలవాటైనది. అనేక మార్లు ప్రాణములనిచ్చు ఉఛ్ఛ్వాస పవనములలో నీభావము (దైవము) దాగివుంది.
చరణం 1: ఓక వైపు వుదయము (పుట్టుట), ఇంకో వైపు అస్తమయము (మరణించుట) అనే స్తంబములు మేరలు గాను నేల నుండి నక్షత్రమండలము
వరకు మితిమీఱుచున్న దిఙ్మండలములలో శాఖలువాఱుతున్నదీ ఉద్యమము. ఆ ఉయ్యాలకు ఎంతో అనువుగా, జాగ్రత్తగా అల్లి వుంచిన నాలుగు వేదములను బంగారు గొలుసులు నిలుపలేవేమో అనిపించుచున్నది.
(సత్యమును ఎంత విద్వత్తు కూడా పట్టి వుంచలేదని భావము). తనంతటతాను నిలబడగలుగు ఆ ధర్మదేవత
పీఠము వర్ణింపనలవికానిది.
చరణం 2: మేఘమండలము
మేలు కట్లుగా (అంబరముగా) ఈ ఉయ్యాల మెరుగుకు మెరుగై మేలయినది. (ధగధగా మెరిసిపోతుంటే
చూడలేకున్నాము). నల్లని కొండలవంటి నీ మేని కాంతికిది నిజమైన కవచము లేదా తొడుగు వంటిదాయె.
స్వామిని చూచుటకు వీలు కాదు అన్న అర్ధములో వాడారు. (ఇక్కడ నుంచి భూలోక విషయములు).
ఇక స్తనములు లయబద్ధముగా కదులుచుండగా, పైటకొంగులు రాచుకొనుచుండగా స్త్రీలు నీలో దాగి వున్న జగముల క్రమక్రమంగా ప్రక్కకు ఒరగిపోకుండా
నెమ్మదిగా అనునయముగా ఊపే ఉయ్యాల ఇది.
చరణం 3: ఈ ఉయ్యాలలో నున్న శ్రీదేవులకు భూదేవి ప్రతి ఊయల కదలికకు నిన్ను కౌగిలించుకొను భాగ్యము కలుగుతున్నది కదా! స్వామీ! ఈ దేవతా స్త్రీలకు ఈ ఉయ్యాలలోనే అప్పటికప్పుడే నీ హావభావ విలాసములు తెలుస్తాయి! దివ్యకాంతులకు నీ హావభావ విలాసమంతా మందంగా సాగే ఈ ఊయలలో ఘనంగా కనువిందు చేస్తోంది. ఇటువంటి నీ ఉయ్యాల సేవావైభవం బ్రహ్మాది దేవతలకు కన్నుల పండువగా, మా బోటి సామాన్యులకు ఊహాతీతంగా సాగుతోంది. కానీ ఓ తిరువేంకట విభుడవైన వెంకటపతీ! నీకు మాత్రం ఇదంతా చాలా వేడుకగా ఉన్నది సుమా!
విపులాత్మక వివరణము
ఉపోద్ఘాతము: ఈ పదము అన్నమయ్య గారి భావుకతకు నిదర్శనము. వారు తన మనసులో మెలుగు భావములను అలవోకగా కీర్తనలలోకి మార్చివేసినట్లు అనిపిస్తుంది. కానీ దాని వెనుక కఠోరమైన శ్రమ దాగి వున్నదని గుర్తించము.
అన్నమాచార్యులు ప్రపంచము ఊయలలా ఊగడము అనగా ఒక కొస నుండి మరొక కొసకు, ఒక స్థితి నుండి దానికి వ్యతిరేకమగు స్థితికి, ఒక భావము నుండి అభావమునకు కదలుటను ప్రకృతి సహజ నియమము అన్నారు. ప్రపంచము నందలి జీవులును అటులే ఆయా స్థాయిలను అనుభవింతురని అన్నారనుకోవచ్చును.
భగవంతుణ్ణి వూయలలో వుగించకపొతే లోకము ఒక ప్రక్కకు ఒరిగి పోవునని భామినులు తీరికలేకుండా వూచుచున్నారనె భావములో వ్రాసినారు. దీనిని ఒకరకముగ ప్రపంచము క్రొంగొత్త విషయములులేక పాత దానితో పులిసిపోవుననే భావముతో పొల్చవచ్చు. ఈ జీవితము నిలువవుంచు పదార్ధముగాదని, జీవనమొక ఎడతెరిపిలేని ప్రవాహమని సూచించిరి.
ఈ కీర్తనలో అన్నమాచార్యులవారు అనంతమగు సత్యముతో మమేకమై ఒకేపర్యాయములో బ్రహ్మాండములన్నీ సృష్టి స్థితి లయ కార్యక్రమములలో లయబద్ధముగా మునిగియుండు అత్యద్భుత దృశ్యమును ప్రత్యక్షముగా దర్శించిరని వూహించవచ్చును.
“పదిలముగ వేదములు
బంగారుచేరులై పట్ట వెరపై తోఁచె నుయ్యాల” అని ఎంత ప్రయత్నించిననూ
సత్యమును భాషలోను, భావములోను యిమిడ్చి పట్టలేమని సూచించిరి. ఆ
ధర్మదేవత పీఠము తనంతటతాను నిలబడగలుగునది అనిరి.
అధ్యాత్మ కీర్తన: రాగిరేకు: 11-1 సంపుటము: 1-67 |
అలరఁ జంచలమైన ఆత్మలందుండ నీయలవాటు సేసె
నీవుయ్యాల
పలుమారు నుచ్ఛ్వాసపవనమందుండ నీ-భావంబు
దెలిపె నీవుయ్యాల ॥పల్లవి॥ ఉదయాస్తశైలంబు లొనరఁ గంభములైన
వుడుమండలము మోఁచె నుయ్యాల
అదన నాకాశపద మడ్డదూలంబైన అఖిలంబు నిండె
నీవుయ్యాల
పదిలముగ వేదములు బంగారుచేరులై పట్ట
వెరపై తోఁచె నుయ్యాల
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప
నరుదాయ నుయ్యాల ॥అలర॥ మేలుకట్లయి మీకు మేఘమండలమెల్ల
మెఱుఁగునకు మెఱుఁగాయ నుయ్యాల
నీలశైలమువంటి నీమేనికాంతికిని నిజమైన
తొడవాయె నుయ్యాల
పాలిండ్లు గదలఁగా బయ్యదలు రాఁపాడ
భామినులు వడినూఁచు నుయ్యాల
వోలి బ్రహ్మాండములు వొరగునోయని భీతి
నొయ్యనొయ్యన వూఁచి రుయ్యాల ॥అలర॥ కమలకును భూసతికి కదలు కదలుకు మిమ్ముఁ
గౌఁగిలింపఁగఁ జేసె నుయ్యాల
అమరాంగనలకు నీ హావభావ విలాసమందంద చూపె
నీవుయ్యాల
కమలాసనాదులకుఁ గన్నులకు పండుగై గణుతింప
నరుదాయ నుయ్యాల
కమనీయమూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై
వుండె నుయ్యాల ॥అలర॥
|
Details
and explanations:
భావము: చంచలస్వభావము
కలిగిన జీవాత్మలకు ఈ ఉయ్యాలవలె అటునిటు (జీవన్మరణములలో) వూగుట అలవాటైనది. అనేక మార్లు
ప్రాణములనిచ్చు ఉఛ్ఛ్వాస పవనములలో నీభావము (దైవము) దాగివుంది.
వివరణము: మొదటి పంక్తిలో ఉయ్యాలవలె అటునిటు (జీవన్మరణములలో) వూగుట అనగా
మానవుడు తాను వున్న స్థితిని ముఖ్యముగా క్షణభంగురమగు భావనలను అలోచనలను ఎప్పటికీ వుండి
పోవాలని భావించుచూ దానినే కొనసాగించవలెనని చూచుటను అసహజ భావమని తెలియమనిరి.
రెండవ పంక్తిలో పలుమార్లు ప్రాణములనిచ్చు ఉఛ్ఛ్వాస పవనములలో
దైవము దాగివుంది అని; మన ఇప్పటి ఆధారములేని
భావనలను వదలి నిరంతరము మారుచున్న అలౌకికమగు దానిని తెలియమనిరి. ఉఛ్ఛ్వాసనిశ్వాసములను
నిలుపుట (కాపాడుకొనుట) యందలి ఆసక్తిని వదలి చూడమనిరి.
మొదటి చరణములో కూడా ఈ సమస్త దిశలలోనూ వ్యాపించియున్న దృశ్య ప్రపంచము
ఇటువంటి నాశమగు పదార్థములతోనే చేయబడి వున్నదని, అందుచేత క్షరము నందుండి అక్షరమును కానలేమనిరి. కావున వీనితో
ఎటువంటి సంబంధములేని దానిని కనుగొనమనిరి.
ముఖ్య పదములకు అర్ధములు: వుడుమండలము = నక్షత్రమండలము; అదన = భుజించుట, భక్షించుట; అదన నాకాశపదము = కనబడుచున్న మేర వరకు ఆక్రమించుకొని వున్న (చూపుల వేగముతో కనుచూపుల వరకు విస్తరించుకొని వున్న)
భావము: లెక్కకు
మిక్కిలి నిడివిగల ఆకాశము దూలముగా, ఓక వైపు వుదయము (వెలుగు, పుట్టుట, జ్ఞానము), ఇంకో వైపు అస్తమయము (మరణించుట, చీకటి, అజ్ఞానము) అనే
స్తంబములు మేరలు గాను నేల నుండి నక్షత్రమండలము వరకు మితిమీఱుచున్న దిఙ్మండలములలో శాఖలువాఱుతున్నదీ
ఉద్యమము. ఆ ఉయ్యాలకు ఎంతో అనువుగా, జాగ్రత్తగా అల్లి వుంచిన నాలుగు వేదములను బంగారు
గొలుసులు నిలుపలేవేమో అనిపించుచున్నది. (సత్యమును ఎంత విద్వత్తు కూడా పట్టి వుంచలేదని
భావము). తనంతటతాను నిలబడగలుగు ఆ ధర్మదేవత పీఠము వర్ణింపనలవికానిది.
వివరణము: అన్నమయ్య గారు వివరించిన
ఆ ఊయల నిరంతరము ఒక దశ నుండి మరోదానికి మారుతున్న మానవుని అంతరంగము వంటిదే. దానికి
గల హద్దులను వూహించ గలమేమో గానీ వీక్షించలేము. కావున వారు కాంచినది అనన్య సామాన్యమగు
దృశ్యము.
“పదిలముగ
వేదములు బంగారుచేరులై పట్ట వెరపై తోఁచె నుయ్యాల”/ “వదలకిటు
ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయ నుయ్యాల”తొ ఆ వుయ్యాల బల్లను ధర్మ పీఠముగా భావించితే
ఆ పీఠమును ఎంతో అనువుగా, జాగ్రత్తగా అల్లి వుంచిన
నాలుగు వేదములను బంగారు గొలుసులు నిలుపలేవేమో అను అనుమానమును వ్యక్తము చేసిరి.
ఈ మాట అన్నమయ్య గారు ఎందుకన్నారో విచారింతము. క్రింది
రెనె మాగ్రిట్ వేసిన సుప్రసిద్ధ చిత్రమును చూడామని ప్రార్థన. ఇక్కడ ఫ్రెంచి భాషలో
వ్రాసినదానికి 'ఇది పైపు కాదు' అని అర్ధము. “The Treachery of Images” అను పేరుగల ఈ చిత్రము ఎంతో అందముగాను, ఎంత స్పష్టముగానూ బొమ్మ
గీసినా అది నిజమగు వస్తువు కాజాలదని చెబుతుంది.
అన్నమాచార్యులు మన తృప్తి
కోసము కీర్తనలను వ్రాయలేదు. వారు ప్రజలను తట్టిలేపుటకు విశ్వప్రయత్నము చేసిరి.
ముఖ్య పదములకు అర్ధములు: మేలుకట్లయి = forming a canopy, అంబరములై;
తొడవాయె = కవచము, గవిసెన, తొడుగు
వంటిదాయె; ఓలి = వరుస, క్రమం; ఒయ్యన = మెల్లన;
భావము: మేఘమండలము
మేలు కట్లుగా (అంబరముగా) ఈ ఉయ్యాల మెరుగుకు మెరుగై మేలయినది. (ధగధగా మెరిసిపోతుంటే
చూడలేకున్నాము). నల్లని కొండలవంటి నీ మేని కాంతికిది నిజమైన కవచము లేదా తొడుగు వంటిదాయె.
స్వామిని చూచుటకు వీలు కాదు అన్న అర్ధములో వాడారు. (ఇక్కడ నుంచి భూలోక విషయములు)
ఇక స్తనములు లయబద్ధముగా కదులుచుండగా,
పైటకొంగులు
రాచుకొనుచుండగా స్త్రీలు నీలో దాగి వున్న జగములు క్రమక్రమంగా ప్రక్కకు ఒరగిపోకుండా
నెమ్మదిగా అనునయముగా ఊపే ఉయ్యాల ఇది.
వివరణము: "స్త్రీప్రాయమితరంజగత్” = భగవంతుడొక్కడే స్వతంత్రత కలిగిన పురుషుడు తక్కిన వారందరు భగవంతునకు పరతంత్రులు
కనుక స్త్రీలే" అని శాస్త్ర నిర్ణయము. దీనిపై ఆధారపడి వ్రాసినవే
అన్నమార్యుల శృంగార కీర్తనలు. జనులంతా ఆ ఉయ్యాల నూపుచున్నరు అని అర్ధము.
ఇక్కడ “పాలిండ్లు గదలఁగా బయ్యదలు రాఁపాడ భామినులు వడినూఁచు నుయ్యాల”తో స్వామి మానవులకు కామము ఒక విధి క్రింద (జీవమును కొనసాగించుటకు) ఏర్పాటు చేసినారనుకోవచ్చును. కానీ ఆ పదములు రేకెక్తించు భావములలొ మనము తగులుకొందమని భావము. కావున జరుగుతున్న జన్నాటకమును వీక్షించుటకు బదులు మనసు చూపు కామపు అలోచనలలో చిక్కుకుందుము అన్నారు.
‘వోలి బ్రహ్మాండములు వొరగునోయని భీతి
నొయ్యనొయ్యన వూఁచి రుయ్యాల’ మానవులు ఏదో ఒక భీతి ఉసిగొల్పగా
పనులు చేయుదురన్నభావమును సూచించారు. కానీ మనమెవరమండి బ్రహ్మాండములు వొరగ కుండా చెయ్యడానికి?
మన సామర్థ్యమెంత? ఐతే అటుల చేయుట ఎంతైననూ ఆవశ్యక
మనిపించును. ఇది మనిషి తీసుకొను అయుక్తమైన
చర్య. ఈ కాలములో అమెరికా (USA) వుల్కలు భూమిని తాకకుండా తీసుకొంటున్న
చర్యలు ఇటువంటివే.
ముఖ్య పదములకు అర్ధములు: కమలకును = శ్రీదేవికి; భూసతికి = భూదేవికి; అందంద = అప్పటికప్పుడే
భావము: ఈ ఉయ్యాలలో
నున్న శ్రీదేవి భూదేవులకు లకు ప్రతి ఊయల కదలికకు నిన్ను కౌగిలించుకొను భాగ్యము కలుగుతున్నది
కదా! స్వామీ! ఈ దేవతా స్త్రీలకు ఈ ఉయ్యాలలోనే అప్పటికప్పుడే నీ
హావభావ విలాసములు తెలుస్తాయి! దివ్యకాంతులకు నీ హావభావ విలాసమంతా మందంగా సాగే ఈ ఊయలలో
ఘనంగా కనువిందు చేస్తోంది. ఇటువంటి నీ ఉయ్యాల సేవావైభవం బ్రహ్మాది దేవతలకు కన్నుల పండువగా, మా బోటి సామాన్యులకు ఊహాతీతంగా
సాగుతోంది. కానీ ఓ తిరువేంకట విభుడవైన వెంకటపతీ! నీకు మాత్రం ఇదంతా చాలా వేడుకగా ఉన్నది
సుమా!