Tuesday, 14 April 2026

T-321 ఏల రట్టు సేసే వేమీ నేఁడు

 తాళ్లపాక అన్నమాచార్యులు
321 ఏల రట్టు సేసే వేమీ నేఁడు

ఉపోద్ఘాతము

ఈ కీర్తనలో చూపబడిన మనోస్థితి సులభంగా అనిపించినా, దాన్ని మాటలలో పూర్తిగా చెప్పడం కష్టం; అనుభవించగలిగితే మాత్రమే స్పష్టమవుతుంది. కాబట్టి భావాన్ని పూర్తిగా చెప్పలేం; దానికి దగ్గరగా మాత్రమే తీసుకెళ్లగలం.

ఇక్కడ శృంగారము అలంకారప్రాయము కాదు; అలౌకిక మేళవింపు. అది భక్తుని అనుభవాన్ని పట్టివుంచే మాధ్యమం. భావము పదములుగా వ్యక్తమవ్వక ముందే భక్తుని మనసులో రేగే అలజడిని, తటపాయింపును, సంశయాన్ని, సందేహాల వెల్లువను ఇది చూపిస్తుంది.

ఇక్కడ భక్తి అంటే చేతులు జోడించడమో, సాష్టాంగ నమస్కారములుగానీ కాదు; తనకు, సత్యమునకు మధ్య వచ్చే ఆటంకములకు భయపడకుండా, దైవముపై భారము వేసి నిలబడగల స్థితి.

కీర్తనలోని భావపురోగతి
పల్లవి ఊహించినదొకటి, అనుభవములో ఎదురయ్యేదొకటి — ఈ విరుద్ధతకు మనస్సు తడబడుతుంది.
మొదటి చరణం మొదట బయటపడటానికి భయం
రెండవ చరణం లోపల ద్వంద్వం.
మూడవ చరణంచివరకు ప్రయత్నమే అడ్డంకి అని గ్రహించడం

శృంగార ​ సంకీర్తన
రేకు: 292-1 సంపుటము: 9-247
ఏల రట్టు సేసే వేమీ నేఁడు
చాలుఁ జాలు మా యెడను సట సేయవలదు   ॥పల్లవి॥

పెదవుల మమ్మింతేసి పేరఁ బిలువకు మని
మొదల నిందుకుఁగానె మొక్కనా నీకు
అదనఁ గోపమున నీ యంకెకు రాకుండుదుము
యెదుట నప్పుడు నీవు యెగ్గు లెంచవలదు      ॥ఏల॥

కన్నుల నవ్వకు మని కాఁకలు సేయకు మని
నున్నని చెక్కులు చేతనొక్కనా నేను
పన్నిన పంతములను పరాకున నుండుదుము
వన్నెల నీ వంతేసి వాసు లెంచవలదు             ॥ఏల॥

పచ్చిసేసి నీవు మమ్ము బలిమిఁ బట్టకు మని
చెచ్చెర నీకుఁ బ్రియము చెప్పనా తొల్లె
యిచ్చల శ్రీవెంకటేశ యిటు నిన్నుఁ గూడితిమి
తచ్చనలుగావు యిఁకఁ దమకించవలదు          ॥ఏల॥
Details and Explanations:
పల్లవి:
ఏల రట్టు సేసే వేమీ నేఁడు
చాలుఁ జాలు మా యెడను సట సేయవలదు ॥పల్లవి॥
Phrase
Meaning in Telugu
ఏల రట్టు సేసే వేమీ నేఁడు
రట్టు = బహిరంగ పరచుట​, రహస్యము నలుగురికి తెలిసేలా చెప్పుట​, divulging a secret, exposure, scandal;
ఈ రకంగా నా గుట్టురట్టు చేస్తావేమి?
చాలుఁ జాలు మా యెడను సట సేయవలదు
సట = కపటము, మోసము
చాలు చాలు, నీ మోసాలింక చాలు.

భావము:
శృంగార​ భావం
అంతర్లీన భావం
ఈ రకంగా నలుగురిలో నా గుట్టురట్టు చేస్తావేమి? ఇక్కడో మాట అక్కడో మాట. చాలు చాలు, నీ మోసాలింక చాలు.
స్వామి!  నలుగురిలో నా గుట్టురట్టు చేస్తావేమి? నా పరువుపోదా? నీతో ఉండడానికి ఊహించిన దొకటి. జరుగుతున్నదొకటి. సులభమని చెప్పి మోసం చేస్తావా?
వివరణము:
సత్యము రహస్యము కాదు. అట్లని బహిర్గతమూ కాదు. సత్య దర్శనము పొందిన మహానుభావులు దాచకుండ అంతా చెబుతారు; కానీ వినేవారికి అది పూర్తిగా అందదు.
 
ఇక్కడ అన్నమాచార్యులు భక్తుని రూపంలో మనస్సు యొక్క అంతర మధనాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఊహించినదొకటి, అనుభవములో ఎదురయ్యేదొకటి — ఈ విరుద్ధతకు మనస్సు తడబడుతుంది.
 
సత్యాన్వేషణ అనేది మనం ఊహించినట్లుండే ప్రపంచం కాదు. ఊహించలేనిదాని వైపు ప్రయాణం; అక్కడ సమస్యలు ఉండవని కాదు — ఆ సమస్యలే ఆ ప్రయాణం. వాటిని సహించి, స్వీకరించగలిగినప్పుడే మార్గం స్పష్టమవుతుంది.

మొదటి చరణం:
పెదవుల మమ్మింతేసి పేరఁ బిలువకు మని
మొదల నిందుకుఁగానె మొక్కనా నీకు
అదనఁ గోపమున నీ యంకెకు రాకుండుదుము
యెదుట నప్పుడు నీవు యెగ్గు లెంచవలదు          ॥ఏల॥

భావము:
శృంగార​ భావం
అంతర్లీన భావం
ప్రియుడా, (నువ్వెవరో వారికి తెలియదు కాబట్టి) నలుగురిలో నన్ను పేరుపెట్టి పిలిచి నగుబాటు చేయకు. (నేను చెప్పినా వారికి అర్ధమవ్వదు). దాన్ని అదనుగా చేసుకుని నీ సమీపమునకు రాము. అప్పుడు నీవు మా అపరాధములు ఎంచ వలదు.
స్వామి!  నాలోని ఈ వింత అనుభవాన్ని బయటపెట్టినపుడు నలుగురు నవ్వుకుంటారు తప్ప అర్ధంచేసుకోరు. ఆ నా గుట్టురట్టు అయిపోతుందన్న కినుకతో నీ సమీపమునకు రావటానికి మనస్సు వెనుకడుగు వేస్తుంది; అప్పుడు ఆ దూరాన్ని అపరాధముగా ఎంచవలదు.
 వివరణము:
భక్తుని అసలు తటపాయింపును, అడ్డుకుంటున్న మనో భావనలను అన్నమాచార్యులు సూటిగా బయట పెడుతున్నారు.

Top of Form

Bottom of Form

రెండవ​ చరణం:
కన్నుల నవ్వకు మని కాఁకలు సేయకు మని
నున్నని చెక్కులు చేతనొక్కనా నేను
పన్నిన పంతములను పరాకున నుండుదుము
వన్నెల నీ వంతేసి వాసు లెంచవలదు          ॥ఏల॥

భావము:
శృంగార​ భావం
అంతర్లీన భావం
కాఁకలు సేయకు మని = తాపములు పెంచకుమని (నిఘంటుపు అర్ధము); కాకిలాగ గోలగోల చేయకుమని (సూచ్యార్ధము); వాసు = నాట్యపరిభాషయందు బాలిక; వాసు లెంచవలదు = అన్ని నాటకాలు ఆడవద్దు (సూచ్యార్ధము).

 

ఇదిగో! కన్నులతో కవ్వించొద్దని, కాకిలా గోల చేయకుమని, నా నున్నని చెక్కిళ్లను నీ చెక్కిళ్లతో రాస్తూ, నీ చేతులు నొక్కుతూ వేడుకుంటున్నాను. మేమేదో నీతో పంతాలు, పరాచకాలు ఆడుతుంటాము; అప్పుడప్పుడు పరాకుగా ఉంటాము. నువ్వేమో అప్పుడు నీ వన్నెలు చూపిస్తూ నాటకాలు మొదలెడతావు.
స్వామి! నేను నిన్ను తెలిసినట్టు బయట రచ్చ చేయకుమని అంటా; కానీ అంతర్గతంగా మాత్రం నాకు అదే ఎక్కువ మక్కువేమో.  మృదువుగా అంగీకరిస్తాను. కానీ చల్లగా దూరం జరిగిపోతాను.

ఒకవైపు నా పంతాలకే ప్రాముఖ్యత ఇస్తూ పరధ్యానంలో పడిపోతాను; ఆ పరధ్యానంలో నిన్ను మరచిపోతాను. కానీ పైపైకి మాత్రం నీవే ముఖ్యమని చూపించ బోతాను. ఇదే ద్వంద్వ స్థితి. 

మన అంతరంగంలో జరుగుతున్నదాన్ని ఉన్నది ఉన్నట్లే ఇది చూపిస్తుంది. దైవమును పూర్తిగా అంగీకరించలేని స్థితి.
 

మూడవ​​ చరణం:
పచ్చిసేసి నీవు మమ్ము బలిమిఁ బట్టకు మని
చెచ్చెర నీకుఁ బ్రియము చెప్పనా తొల్లె
యిచ్చల శ్రీవెంకటేశ యిటు నిన్నుఁ గూడితిమి
తచ్చనలుగావు యిఁకఁ దమకించవలదు          ॥ఏల॥

భావము: 
శృంగార​ భావం
అంతర్లీన భావం
పచ్చిసేసి=  నిష్ప్రయోజనము; చెచ్చెర=శీఘ్రముగా;  తచ్చనలుగావు = వేళాకోళములాడవద్దు

 

నాయిక​: "ముందుగానే నిష్ప్రయోజనముగా బలవంతం చేసి మమ్ము పట్టకుమని నీకు నయముగా చెప్పాను" ప్రియమైన శ్రీవెంకటేశ ఇటు నిన్ను వెంటనే కూడితిమి. పరిహాసములతో ఇక తొందర పెట్టకు.
స్వామి! నిన్ను బలవంతముగా చేరుదామని చేసిన ప్రయత్నాలు నీవు వలదంటే నేను వినలేదు. ముందే నీవు హితవు చెప్పినట్లు నా తరపు ప్రయత్నం ఆపాలి కదా! ప్రియమైన శ్రీవెంకటేశ ఇటు ఈ భూలోకములో నిన్ను వెంటనే దర్శించితిమి. వేళాకోళములతో సమయము వృథా చేయవద్దు. (గూడితిమి - తక్కిన  దాసులతో చేరి శ్రీవెంకటేశు కూడితిమి)

 

నిష్కాపట్యత,  గుండె తలుపులు తెఱచియుంచుట ఎంతో ముఖ్యమైనవి. ఇక్కడ "ఏల రట్టు సేసే వేమీ" యొక్క అర్ధము తెలియని కోణంలో బయట పడుతుంది.
వివరణము:
మొదటి రెండు చరణాలలో కనిపించిన ద్వంద్వ స్థితి ఇక్కడ సడలుతుంది. బలవంతపు ప్రయత్నం, పంతాలు, ఉపాయాలు — ఇవన్నీ అడ్డంకులే అని స్పష్టమవుతుంది.
 
నిష్కాపట్యత, గుండె తలుపులు తెరచి ఉంచుట — ఇవే ఈ చరణంలో వ్యక్తమవుతున్న మార్పు. ఇక్కడే “ఏల రట్టు సేసే వేమీ” అనే పల్లవి కొత్త కోణంలో అర్థమవుతుంది: బయటపడేది గుట్టు కాదు — మనసు.

వ్యాఖ్యానంతర సమీక్ష:
అంతరంగ కల్లోలం సార్వత్రికము.
సమస్య కల్లోలం కాదు;
దాచుకోవాలనే ప్రయత్నమే సమస్య.

X-X-The END-X-X

 

Sunday, 12 April 2026

T-320 ఎందు నీకు బ్రియమో యీ తెప్పతిరుణాళ్ళు

 తాళ్లపాక అన్నమాచార్యులు
320 ఎందు నీకు బ్రియమో యీ తెప్పతిరుణాళ్ళు

ఉపోద్ఘాతము

మనం జీవితమంతా తిరుణాళ్ళులాగా సాగాలని కోరుకుంటాం. కానీ వాస్తవంగా జరిగేదేమిటి? మహా అయితే అడపదడప వచ్చేవే తిరుణాళ్ళు. దీనినే కాస్త వ్యంగ్యం జోడిస్తూ అన్నమాచార్యులు ఇలా అన్నారు "తెప్పిరిల్లె నేఁట నేఁట తెప్పతిరుణాళ్ళు" మనం నిర్మించుకున్న ప్రపంచం నుండి తెప్పిరిల్లి అప్పుడప్పుడు జరుపుకునే తిరుణాళ్ళు అన్నారు.

ఈ ప్రపంచంలోని అల్లకల్లోలం మనందరికీ ప్రస్ఫుటం. మనము చేసే శాంతి ప్రయత్నాలు ప్రయత్నాలుగానే మిగిలిపోయాయి. ఆకలిమంటలు, మనిషికి మనిషికి మధ్య చెప్పలేని దూరం, దేశాల మధ్య విద్వేషం — ఇవన్నీ పెరుగుతూనే ఉన్నాయి. శాంతి మాట దేవుడెరుగు; కనీసం వత్తిడి లేని జీవితం కూడా అసాధ్యంగా కనబడుతోంది. 

మనమంతా సహజంగానే మనమూ, ప్రపంచం మారాలని కోరుకుంటాం. కానీ భౌతిక సుఖాలు పెరిగినా పరిస్థితులు మొత్తానికి దిగజారుతూనే ఉన్నాయి. జీవించడం క్రమంగా దుర్బరమవుతోంది. ఈ పరిస్థితుల్లో "అన్నమాచార్యుల కీర్తనలు మనకు ఎలా సహాయపడగలవో?" ఆలోచించాలి.

ఒక మూల కూర్చుని దైవస్మరణ చేసుకుంటే సరిపోతుందా? కానీ అలా ఉండనీయకుండా ఎన్నో సమస్యలు మనలను ఏదో ఒకటి చేయమని ప్రేరేపిస్తాయి. అలా మనమంతా ఏదో ఒకటి తెలిసి గానీ, తెలియక గానీ చేస్తూనే ఉన్నాం. ఆ కార్యాల పర్యవసానమే ఇప్పుడు మన ముందున్న ప్రపంచం. ప్రతి ఒక్కరి అంతరంగం మారకపోతే ఈ స్థితి అలాగే కొనసాగుతుంది.

మనం ఏది చేపట్టినా చివరకు అనర్ధానికే దారితీస్తోందని మనలో కొందరు గమనించి ఉంటారు. ఒకవైపు సమయం పరుగెడుతూ మనకు సవాలు విసురుతుంది; మరోవైపు ఏమి చేయాలో నిర్ణయించలేక తడబడుతుంటాం. అలాంటి సందర్భాల్లో శ్రీశ్రీ గారి మాటలు గుర్తుకు వస్తాయి. 

అభిప్రాయాల కోసం బాధల్ని లక్ష్య పెట్టని వారు మాలోకి వస్తారు
అభిప్రాయాలు మార్చుకుని సుఖాలు కామించేవాళ్ళు మీలోకి పోతారు. 

ఇలా మనం ఎంతో కొంత రాజీ పడుతూ జీవితం గడుపుతాం. ఇటువంటి రాజీల పరిణామమే మన ముందున్న ప్రపంచం. 

ఇది కొంచెం పక్కన పెట్టుదాం.

భగవద్గీత యుద్ధరంగంలో చెప్పబడింది. విశ్వరూపం చూపమని అర్జునుడు అడుగగా కృష్ణుడు అతని కోరికను మన్నిస్తాడు. కానీ విశ్వరూపం దర్శించిన తరువాత మహావీరుడైన అర్జునుడు ఇలా అంటాడు:

నభఃస్పృశం దీప్తమనేకవర్ణం
వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రమ్
దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా
ధృతిం న విందామి శమం చ విష్ణో ।।11-24 ।। 

హే విష్ణో! ఆకాశమును తాకుతూ, ఎన్నో వర్ణములతో ప్రకాశిస్తూ, పెద్దగా తెరిచిన నోర్లతో, అగ్నిగుండములవంటి కన్నులతో ఉన్న నీ స్వరూపమును చూస్తున్న నాకు భయంతో గుండె అదిరిపోతోంది. నేను ధైర్యాన్ని మరియు మానసిక ప్రశాంతతను కోల్పోయాను.” (గీతా 11-24) 

దంష్ట్రాకరాళాని చ తే ముఖాని
దృష్ట్వైవ కాలానలసన్నిభాని
దిశో న జానే న లభే చ శర్మ
ప్రసీద దేవేశ జగన్నివాస ।। 11-25 ।। 

ప్రళయ కాల సమయంలో కనిపించేటటువంటి ప్రజ్వలించే అగ్నిలా, భయంకరమైన దంతములతో ఉన్న ఎన్నో నోర్లతో ఉన్న నిన్ను, చూసిన పిదప, నేను ఎక్కడున్నానో మరియు ఎక్కడికి పోవాలో మర్చిపోతున్నాను. ఓ దేవదేవా, నీవే జగత్తుకి ఆశ్రయము; దయచేసి నామీద కృప చూపుము.

పైన ఉపోద్ఘాతం, అర్జునుని మాటలు — ఇవి ఒకే దిశలో సూచిస్తున్నాయి. యుగాలు మారినా పరిస్థితులు అంతగా మారవు. మానవుని సమస్య ఒకటే — భయం - తనలో తానుగా ఉండలేని భయం.

ఇక్కడ అన్నమాచార్యులు తెప్పతిరుణాళ్ళు” అనే చిత్రంతో సమత్వంతో తేలియాడే స్థితిని సూచిస్తున్నారు. ఇది పిరికితనానికి లోబడిన భక్తి కాదు.
 
మనం అలవాటు పడ్డ దృష్టి పరిధిని దాటకపోతే, అదే పాత మూసలోనే తిరుగుతూనే ఉంటాం. ఇదే ఈ కీర్తనలో దాగి ఉన్న సూచన.
అధ్యాత్మ​ సంకీర్తన
రేకు: 135-2 సంపుటము: 2-143
ఎందు నీకు బ్రియమో యీ తెప్పతిరుణాళ్ళు
దిందువడె సిరులతో తెప్పతిరుణాళ్ళు             ॥పల్లవి॥

పాలజలనిధిలోఁ బవ్వళించ పాముతెప్పఁ
దేలుచున్న దది దెప్పదిరుణాళ్ళు
వోలి నేకోదకమై వొక్క మఱ్ఱియాకుమీఁద
తేలుచున్నదది తెప్పతిరుణాళ్ళు      ॥ఎందు॥

అమృతము దచ్చునాఁడు అంబుధిలో మంధరము
తెమలఁ దేలించు తెప్పతిరుణాళ్ళు
యమునలో కాళింగునంగపుపడిగెమీఁద
తిమిరి తొక్కిన తెప్పతిరుణాళ్ళు         ॥ఎందు॥

అప్పుడు పదారువేలు అంగనల చెమటల-
తెప్పలఁ దేలిన తెప్పతిరుణాళ్ళు
వొప్పుగ శ్రీవేంకటాద్రి నున్నతిఁ గోనేటిలోన
తెప్పిరిల్లె నేఁట నేఁట తెప్పతిరుణాళ్ళు            ॥ఎందు॥
Details and Explanations:
పల్లవి:
ఎందు నీకు బ్రియమో యీ తెప్పతిరుణాళ్ళు
దిందువడె సిరులతో తెప్పతిరుణాళ్ళు              ॥పల్లవి॥

ప్రస్తావన​:
అన్నమాచార్యులు ఒక ప్రక్క ఉత్సవ భావం పలికిస్తూనే అంతర్లీనంగా సమత్వముతో కూడిన జీవితమును వర్ణించుచున్నారు.  "దిందువడె" = అనగా క్రింద పడునవి మరియు "సిరులు" అనగా జీవము ఉట్టి పడునవి, అస్తిత్వము కలిగినవి, భౌతిక రూపములు కలవి చూపుతున్నవి. ఇక్కడ "దిందువడె సిరులతో" అని విరోధోక్తులతో, పరస్పరము పొసగని వానితో కూడిన జీవనమును సూచించారు.

భావము:
ఉత్సవ భావం
అంతర్లీన భావం
స్వామీ! ఈ తెప్పతిరుణాళ్ళు నీకు ఎంత ప్రియమో! కోనేటిలో అలంకరించిన తెప్పపై విరాజిల్లుచు భక్తుల మధ్య విహరించుచున్న ఈ ఉత్సవం దర్శించువారందరికీ ఆనందమును పంచుచున్నది.
ఈ జగత్తు దిందువడె సిరులతో — క్రింద పడుతూ పైకి లేచే అలల వంటి రూపాలతో నిండి ఉన్నది.  అట్టి అధ్రువమగు మార్పుల మధ్య సమత్వముతో తేలియాడే స్థితియే నిజమైన తెప్పతిరుణాళ్ళు. 

మొదటి చరణం:
పాలజలనిధిలోఁ బవ్వళించ పాముతెప్పఁ
దేలుచున్న దది దెప్పదిరుణాళ్ళు
వోలి నేకోదకమై వొక్క మఱ్ఱియాకుమీఁద
తేలుచున్నదది తెప్పతిరుణాళ్ళు          ॥ఎందు॥

ప్రస్తావన​:
ఒకటి అంతులేని సంసార సముద్రము. అంచనా వేయలేని లోతు. దానికి కాలమే అటునిటు ఒడ్డులై నిలిచియున్నవి. చూచిన కొద్దీ కొనసాగుచుండును. ఇంకొకటి ప్రళయము. సర్వము నొక్కటై చీకటిలో కలిసిపోవుట​. 
ఉత్సవ భావం

అంతర్లీన భావం

పాలసముద్రములో ఆదిశేషుడనే పాముతెప్పపై పవళించిన స్వామి దర్శనం దేవతలకు మహోత్సవమై కనిపించింది.
ఎదుట అంతులేని జలరాశి. అగాధము. అనేక ఫణములు విప్పిన విష వూపిరుల మహాకాల సర్పం. కాలికింద భూమి లేదు. పైన ఆకసము లేదు. అట్టి విషవాయువుల సమక్షములో, అధారములేని చోట సమత్వముగా నిలిచి పవళించిన దొకటి.
ప్రళయకాలములో మర్రియాకుమీద తేలియాడే బాలమూర్తి దర్శనం మహోత్సవముగా భావింపబడింది.
ప్రళయకాలము. భూమి కుంగిపోయింది. సముద్రాలన్నీ ఏకమై ఒకే జలరాశిగా మారినవి. ఎగిసిపడే అలలు, ప్రచండ గాలులు. అట్టి అల్లకల్లొలమగు జలరాశిలో చిన్న మర్రియాకుపై సమత్వమున తేలియాడిన దొకటి.

Top of Form

Bottom of Form

రెండవ​ చరణం:
అమృతము దచ్చునాఁడు అంబుధిలో మంధరము
తెమలఁ దేలించు తెప్పతిరుణాళ్ళు
యమునలో కాళింగునంగపుపడిగెమీఁద
తిమిరి తొక్కిన తెప్పతిరుణాళ్ళు ॥ఎందు॥

ప్రస్తావన​:
ఒకటి మహా ప్రయత్నము. లేని దానికై ఆరాటం. అమృతముకై వెదుకులాట​. ఇంకొకటి మనుగడకు పెను సవాలు. కాళింగుని యమునా ప్రవేశం. 
ఉత్సవ భావం
అంతర్లీన భావం
దేవదానవులు మంధరమును వాసుకిని త్రాడుగా చేసి సముద్రమును చిలికిరి. ఆ పని సఫలమగునట్లు, ధర్మం నిలుచునట్లు అనిపింపచేసిన ఆ దేవదేవునికి తిరుణాళ్ళు.
అంబుధిలో మంధరపర్వతము తాబేలు అధారముగ తేలియున్నది. దేవాసురులు వాసుకిని త్రాడుగా చేసి లాగుచున్నారు. నాగు నోటి నుండి విషవాయువు ఎగసిపడుచున్నది. సముద్ర అలలు ఉద్ధృతముగా లేచుచున్నవి. కాలికింద భూమి లేదు. పాము చర్మం చిట్లి రక్తపు వాసన, దేవదానవుల చెమట వాసనలు, పోటాపోటీ వాదులాటలు, సముద్రపుఘోష​, పాము బుసబుసలు — అట్టి గందరగోళములోను సమత్వముతో నిలిచిన దొకటి.
కృష్ణుని పాము నీళ్ళలోకి లాగివేసినది. రేపల్లె అంతా ఉత్కంఠతో చూస్తోంది. మరుక్షణం పాము పడగపై నాట్యమాడుచున్న స్వామి ప్రత్యక్షం. రేపల్లె వాడలో ఆనందం. జగమంత ఉల్లాసం.
అసలే నది. దానిలో బుసలు కొడుచు విషము కక్కుచున్న మహాసర్పము. ఇటు చిన్ని బాలుడు. పడగపై విషము ఎగిసిపడుచుండగా, పాము అతనిని పడద్రోయ ప్రయత్నములోను, ఆ అనిశ్చితముగా జారిపడిపోవు స్థితిలోను, సమముగా నిలబడలేని పరిస్థితిలోను సమత్వములో నిలిచి నాట్యమాడిన దొకటి. జగదానందము పొంగిపొర్లెను.

మూడవ​​ చరణం:
అప్పుడు పదారువేలు అంగనల చెమటల-
తెప్పలఁ దేలిన తెప్పతిరుణాళ్ళు
వొప్పుగ శ్రీవేంకటాద్రి నున్నతిఁ గోనేటిలోన
తెప్పిరిల్లె నేఁట నేఁట తెప్పతిరుణాళ్ళు          ॥ఎందు॥

ప్రస్తావన​:
ఇక్కడ అన్నమాచార్యులు శ్రీవేంకటాద్రిపై నున్న కోనేటిలోనే బ్రహ్మమును చూడవచ్చని సెలవిచ్చారు. ఈ సామాన్య జీవులు, జీవితం ఆధారముగా నడుచుచున్న విశ్వచక్రమును దర్శింప మానవులకు అవకాశమున్నదని చెబుతున్నారు.
ఉత్సవ భావం
అంతర్లీన భావం
పదారువేల అంగనలతో స్వామి విహరించిన దివ్యక్రీడలు భక్తులకు మహోత్సవాలుగా కనిపించాయి.
అనేకానేక జీవుల శ్రమతో,  ఆ జీవుల చెమట ధారలతో నడుచుచున్నదీ విశ్వము. అనేక భావాలు, ఆకాంక్షలు, సందోహాలు, ఉద్విగ్నతల నడుమ ఆ విశ్వము తెప్పగా (వేదికగా) సమత్వముగా నిలిచి అన్నిటినీ ఆవరించిన దొకటి.
అందముగా శ్రీవేంకటాద్రిపై నున్న కోనేటిలోన విస్మయము కలిగించు రీతిగా ఏటేటా తెప్పతిరుణాళ్ళు రేయింబవళ్ళు.
తెప్పిరిల్లిన మహాజ్ఞానులకు ఆ మహోత్సమొక ఏడాదికి గురుతు. (అనగా వారికి కాలస్పృహ మసకబారుతుంది). ఈ లోకములోని అకటవికటముల మధ్య సమత్వముగా తేలియాడే స్థితిని గుర్తించినవారికి ప్రతి రోజూ తిరుణాళ్ళే. ​తెప్పిరిల్లని వారికి విస్మయము కలిగించు రీతిగా ఏటేటా తెప్పతిరుణాళ్ళు రేయింబవళ్ళు.

వ్యాఖ్యానంతర సమీక్ష:
కల్లోలంలో ఉండి ఉత్సవం దర్శించుటయో,
ఉత్సవంలో ఉండి కల్లోలం దర్శించుటయో
— మానవుని వివేకానికే వదిలివేయబడినది.

X-X-The END-X-X

Thursday, 9 April 2026

T-319 ఇదిగా దదిగా దిన్నియు నింతే

 తాళ్లపాక అన్నమాచార్యులు
319 ఇదిగా దదిగా దిన్నియు నింతే

 

ఉపోద్ఘాతము

ఈ ప్రపంచం అశాశ్వతమని తరచుగా వింటుంటాము. కానీ ఆ అశాశ్వతత్వాన్ని మనం స్వయంగా గమనించగలమా? చాలా సందర్భాలలో అది మనకు ప్రత్యక్షంగా కనిపించదు. అందువల్ల అన్నమాచార్యులు “ఇదంతా నశ్వరమే” అని చెప్పినప్పుడు దాన్ని ఒక తీర్పుగా స్వీకరించకుండా ఒక​ సవాలుగా తీసుకొని పరిశీలిద్దాం.

అప్పుడు ఒక ప్రశ్న ఎదురవుతుంది: అటువంటి పరిశీలన చేయడానికి మనకు సరైన సాధనాలున్నాయా? మనం కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) యుగంలో ఉన్నామని చెప్పుకుంటున్నాము. అయినప్పటికీ ఈ అసలు ప్రశ్న మాత్రం మారదు — ఆ నిజ స్వరూపాన్ని మనం ఎలా అన్వేషించాలి?

ఈ విషయాన్ని ఆలోచించడానికి ముందు, బెల్జియన్ చిత్రకారుడు రెనే మాగ్రిట్ గారి “అలెగ్జాండర్ ప్రయాసము (the Labors of Alexander)అనే చిత్రాన్ని ఒకసారి పరిశీలిద్దాం. 

ఆ చిత్రంలో వేర్ల దాకా నరికివేయబడిన ఒక చెట్టు కాండం కనిపిస్తుంది. ఆ చెట్టును నరకడానికి ఉపయోగించిన గొడ్డలి, ఇప్పుడు చెట్టు వేర్ల క్రింద ఇరుక్కుపోయి ఉంటుంది. ఆ వేర్లు గొడ్డలిని బలంగా పట్టుకున్నట్లుగా అనిపిస్తుంది.


అడ్డుపడేది మనమే
ఈ చిత్రంలో మాగ్రిట్ గారు ఏమి సూచిస్తున్నారో మనం ఆలోచించాలి. మనలోని కోరికలను ఒక వృక్షంగా భావిస్తే, దాన్ని నరికే తీక్షణమైన గొడ్డలి దాన్ని నరికే తీక్షణమైన గొడ్డలి మనసును సూచిస్తున్నట్లు భావించవచ్చును. ఇక్కడ గొడ్డలి అంటే మనం తీసుకునే నిర్ణయాలు, తీర్మానాలు, ఆలోచనలు. ఈ చెట్టూ, దాన్ని నరికే గొడ్డలీ రెండూ కూడా మన దేహం మరియు మనస్సులోని భాగాలే.
 
కొంతవరకు చెట్టును నరికిన తరువాత, అదే చెట్టు వేర్లు ఆ గొడ్డలిని పట్టుకొని అడ్డుపడుతున్నట్లుగా ఈ చిత్రం చూపిస్తుంది. అంటే మనం నరికదలిచినదే, దానిని నరికేందుకు ఉపయోగించిన సాధనానికే అడ్డంకిగా మారుతుంది.

ఇదే విధంగా, సత్యాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నించినప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి — ఆ అన్వేషణకు ఉపయోగిస్తున్న సాధనం అయిన మన ఆలోచన (thought) తానే కొన్నిసార్లు అడ్డంకిగా మారవచ్చు.

ఈ పరిమితిని గ్రహించిన తరువాత, ఇప్పుడు అన్నమాచార్యుల ఈ కీర్తనలో వ్యక్తమయ్యే భావాన్ని మనం శ్రద్ధగా పరిశీలించవచ్చు.

 కీర్తనలోని భావపురోగతి

పల్లవి మనం చూసేది గాని ఊహించేది గాని అన్నీ నశ్వరమైన క్షేత్రానికి చెందినవే.
మొదటి చరణం ఎంత శక్తివంతులైనా, దేవతలైనా రాజులైనా, వారు శాశ్వత ఆశ్రయం ఇవ్వలేరు.
రెండవ చరణం బ్రహ్మలోకమనే అత్యున్నత స్థితి కూడా అస్థిరమే.
మూడవ చరణంనిజమైన ఆశ్రయం శాశ్వతమైన​ స్థితి అయిన అచ్యుతపదము మాత్రమే.

అధ్యాత్మ​ సంకీర్తన

రేకు: 254-5 సంపుటము: 3-312

ఇదిగా దదిగా దిన్నియు నింతే
పదిఁ బది హరి నీపదమే నిజము        ॥పల్లవి॥

సురలును నసురలు చూపట్టు రాజులు
అరసి కనక గతమగువారె
సిరుల వీరిఁ గొలిచెదమంటే మఱి
కెరలి పరుల రక్షింపఁగఁగలరా           ॥ఇది॥

పదునాలుగవది బ్రహ్మలోకమును
కదిసి నీరుమునుకల పొలము
చెదరక యిఁకఁ దముఁ జేరినవారల
వుదుటున నిముడుక వుండఁగఁగలరా ॥ఇది॥

అచ్చుతుఁడవు నీయచ్యుతపద మది
యిచ్చట శ్రీవేంకటేశుఁడవు
చొచ్చిరి నీశరణు శుకసనకాదులు
మచ్చిక నిదిగని మరిగితిమయ్యా        ॥ఇది॥
Details and Explanations:
పల్లవి:
ఇదిగా దదిగా దిన్నియు నింతే
పదిఁ బది హరి నీపదమే నిజము ॥పల్లవి॥ 
Phrase
Meaning in Telugu
ఇదిగా దదిగా దిన్నియు
ఇది అది ఇవన్నియు / ఇవన్నీ - మనం చూసేవి, చూడగలిగేవి అన్నీ
నింతే
అంతే. దానిలో ఏ విశేషము లేదు. (సామాన్యమైనవే). కొత్త లోకములు, కొత్తగా వచ్చేదీ ఏమీలేదు
పదిఁబది
పదేపదే (ఒకటికి నూరు సార్లు) పరిశీలించిన తరువాత
హరి నీపదమే
హరి యొక్క పాదము
నిజము
నిజమైనది

సూటి భావము:
మనకు కనిపించే ఈ ప్రపంచముగానీ, మనం ఊహించగలిగే లోకాలుగానీ — ఇవన్నీ కూడా అంతే. అశాశ్వతత్వములే. పదేపదే పరిశీలించిన తరువాత నిజంగా నిలిచేది హరి పాదము ఒకటే అని తెలుస్తుంది.  

గూఢార్థవివరణము:
అన్నమాచార్యులు చెప్పిన ఈ ప్రపంచము అశాశ్వతత్వమని ఏల ఒప్పుకోవలెను? ఆలోచింతము. ముందుగా మానవుని అస్తిత్వము కాలగమనము లోనిదని,  పరిశీలన ద్వారా అది క్షణికమని తెలియవచ్చును. అలాగే ఇంకొక ప్రవృత్తి, కనబడిన ప్రతి దానిపై అభిప్రాయము ఏర్పరచుకొనుట​. ఈ రెంటిని కలిపి చూచిన ఒకటి  క్షణికము. అందులోను  అభిప్రాయము ఏర్పరచుకొను అభిలాష సంపూర్ణ శాంతికి తావివ్వక ముందరి దృశ్యమును నిష్పాక్షికముగా పరిశీలుంచుటకు అవకాశమివ్వదు. ఈ రకముగా మనము ఏర్పరచుకొను అభిప్రాయములు లోపభూయిష్టమై ఉండును.

ఇదిగా దదిగా దిన్నియు” అనే పదబంధం ద్వారా మనం ఈ ప్రపంచంలో మనం గుర్తించగలిగే అన్నిటినీ అవి సంపదలు కావచ్చు, పదవులు కావచ్చు, లోకాలుగానీ, ఉన్నతమైన స్థితులుగానీ కావచ్చు — ఇవన్నీ కూడా అదే వర్గానికి చెందుతాయి.
 
అక్కడ నింతే” అనే పదం ఎంతో ముఖ్యమైనది. దాని అర్థం — “అంతే, దానిలో అంత ప్రత్యేకత ఏమీ లేదు” అనే భావం. అంటే మనం ఎంతో గొప్పగా భావించే ఈ సమస్తం కూడా కాలక్రమంలో మారిపోయే, నిలకడలేని వాటికే చెందుతాయి.
 
అన్నమాచార్యులు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని సూచిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వారు అలా అనుకోకుండా చెప్పలేదు. అందుకే పదిఁబది” అనే పదాన్ని ఉపయోగించారు. అంటే పదేపదే, ఒకటికి నూరు సార్లు పరిశీలించిన తరువాత వచ్చిన అనుభవజ్ఞానమే ఇది. అన్ని విషయాలను పరిశీలించిన తరువాత చివరకు నిలిచేది ఏమిటంటే — హరి పాదమే నిజమైన ఆశ్రయం అని వారు సూచిస్తున్నారు.

మొదటి చరణం:
సురలును నసురలు చూపట్టు రాజులు
అరసి కనక గతమగువారె
సిరుల వీరిఁ గొలిచెదమంటే మఱి
కెరలి పరుల రక్షింపఁగఁగలరా    ॥ఇది॥ 
పదబంధం
తెలుగులో అర్థం
సురలును నసురలు చూపట్టు రాజులు
దేవతలు, అసురులు, గొప్ప రాజులు, చక్రవర్తులు
అరసి కనక గతమగువారె
(అరసి = వివరము తెలిసికొని) సమగ్రంగా పరిశీలించినప్పుడు వీరందరూ కాల గర్భములో కలిసిపోయే వారని తెలియవచ్చు
సిరుల వీరిఁ గొలిచెదమంటే మఱి
(సిరులు = దేహముతో కూడిన వారు); అటువంటి దేహధారులను కొలిచితే
కెరలి పరుల రక్షింపఁగఁగలరా
(కెరలి = పైకి లేపుట); వారు మనలను పైకి లేపి రక్షించగలరా? (లేరు)
సూటి భావము:
దేవతలుగానీ, అసురులుగానీ, గొప్ప రాజులు, చక్రవర్తులు గానీ — వీరందరినీ సమగ్రంగా పరిశీలించినప్పుడు వారు కాలగమనంలో  కలిసిపోయేవారేనని తెలుస్తుంది. అటువంటి దేహధారులను ఆశ్రయించితే, వారు మనలను నిజంగా రక్షించగలరా? (అంతర్లీన సమాధానం — లేరు).

గూఢార్థవివరణము:
మనకు ఈ ప్రపంచంలో శక్తివంతులుగా కనిపించేవారు చాలామంది ఉంటారు. దేవతలు, అసురులు, గొప్ప రాజులు — వీరందరూ గొప్ప అధికారమును కలిగినవారిగా కనిపిస్తారు.

కానీ సమగ్రంగా పరిశీలించినప్పుడు, వారు కూడా కాలగమనమునకు లోబడినవారేనని గ్రహించవచ్చు. అటువంటివారు​ మనలను శాశ్వతంగా రక్షించగలరా? లేరు.

ఈ భావాన్ని మరింత స్పష్టంగా చూపించడానికి బలి చక్రవర్తి మరియు రాక్షసుల గురువు శుక్రాచార్యుల మధ్య సంభాషణ ఒక మంచి ఉదాహరణ. వచ్చిన వాడు శ్రీహరియని గ్రహించిన శుక్రాచార్యులు బలిని దానం చేయవద్దని వారిస్తారు. కానీ బలి చక్రవర్తి దానం చేయాడనికే నిర్ణయిస్తూ ఇలా అంటాడు.
 
శా. కారే రాజులు? రాజ్యముల్ గలుగవేర్వోన్నతిం బొందరే?
వారేరీ సిరిమూటఁగట్టుకొని పోవం జాలిరే? భూమిపైఁ
బేరైనం గలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై
యీరే కోర్కులు? వారలన్ మఱచిరే యిక్కాలమున్? భార్గవా! (8-590)

గురువర్యా! పూర్వము కూడ ఎందరో రాజులు పరిపాలించారు. వారంతా తమ బలముతో, శక్తియుక్తులతో ఎంతో ఔన్నత్యాన్ని సాధించినవారే కదా. కాని వారెవ్వరూ ఆ సంపదలను మూటగట్టుకొని పోలేదు కదా. కనీసం ప్రపంచంలో వారి పేరైనా మిగిలి లేదు కదా! కానీ శిబి చక్రవర్తివంటి వారు ధర్మము కోసం చిన్ని పక్షికై తమ శరీరాన్నే సమర్పించి కీర్తి గడించారు.  వారిని ఈ నాటికీ లోకం మరువలేదు కదా.

Top of Form

Bottom of Form

రెండవ​ చరణం:
పదునాలుగవది బ్రహ్మలోకమును
కదిసి నీరుమునుకల పొలము
చెదరక యిఁకఁ దముఁ జేరినవారల
వుదుటున నిముడుక వుండఁగఁగలరా          ॥ఇది॥
పదబంధం
తెలుగులో అర్థం
పదునాలుగవది బ్రహ్మలోకమును
పదునాలుగు లోకాలలో ఉన్నతమైనదిగా భావించబడే బ్రహ్మలోకము
కదిసి నీరుమునుకల పొలము
(కాలము) సమీపించు నపుడు నీటిలో మునిగిపోయే పొలము వంటిది
చెదరక యిఁకఁ దముఁ జేరినవారల
అటువంటి లోకాన్ని చేరిన వారికి కూడా
వుదుటున నిముడుక వుండఁగఁగలరా
(వుదుటున = ఉద్ధతిని) అక్కడ ఆ ఉన్నతమైన చోట శాశ్వతంగా స్థిరంగా ఉండగలరా? (లేరు)

సూటి భావము:
పదునాలుగు లోకాలలో అత్యున్నతమైనదిగా భావించబడే బ్రహ్మలోకము కూడా సమయం ఆసన్నమైనపుడు నీటిలో మునిగిపోయే పొలమువలెనే అస్థిరమైనదే. అటువంటి బ్రహ్మలోకమును చేరిన వారికి అక్కడ శాశ్వతంగా నిలిచిపోవడం సాధ్యమా? (అంతర్లీన సమాధానం — కాదు)

గూఢార్థవివరణము: 
మొదటి చరణంలో అన్నమాచార్యులు దేవతలు, అసురులు, రాజులు వంటి శక్తివంతమైన వ్యక్తుల గురించి మాట్లాడారు. ఈ రెండవ చరణంలో ఆయన ఆ భావాన్ని మరింత విస్తరించి లోకాల స్థాయికి తీసుకువెళ్తారు.

పురాణాలలో అత్యున్నతమైనదిగా బ్రహ్మలోకము చెప్పబడుతుంది. అయితే అన్నమాచార్యులు ఇక్కడ ఒక ఆసక్తికరమైన ఉపమానాన్ని ఉపయోగిస్తున్నారు — “నీరుమునుకల పొలము”. ఇక్కడ “పొలము” అనే పదాన్ని భగవద్గీత పదమూడవ అధ్యాయములో పేర్కొన్న ‘క్షేత్రము’ అనే భావానికి దగ్గరగా అర్థం చేసుకోవచ్చు. అప్పుడు "నీరుమునుకల పొలము" అన్నది ప్రళయ కాలములో ఉపసంహరించబడే దానిగా  భావించవచ్చును.

ఇక్కడ ముఖ్యంగా గమనించవలసినది ఆ క్షేత్రము (లేదా పొలము) బాహ్యలోకములు గావు. అవి మానవులు మనో సంకల్పముద్వారా చేర గలుగు అత్యున్నత స్థితులు. ఇవి అన్నియు యత్నము ద్వారా సాధించ గలిగినవి. కావున కాల పరిమితులు వర్తిస్తాయి.

గౌతము బుద్ధుల వారు కూడా అటువంటి చైతన్యావస్థల గురించి పేర్కొన్నారు. ఆ ఉన్నత చైతన్యావస్థలలో కాల పరిమితి మానవ లోకాని కంటే ఎక్కువ ఉండవచ్చును. కానీ, అవి ఎంత ఉన్నతమైనవైనా కానీయండి, చివరికి కాల గమనములోనివే. బుద్ధుల వారు చెప్పినట్లుగా ఆ ఉన్నత చైతన్యావస్థలకు ఎగబ్రాకడంలో దుఃఖనివారణ లేదు. అది సంపూర్ణ స్వేచ్ఛను పొందడంలోనే ఉంది. దానికి తగినది మానవ జీవితమే.

ఇదే విషయం భగవద్గీత 3-10లో కూడా సూచించ బడినది. కావున మానవులుగా జన్మము పొందుట మన అదృష్టము. ఇక చేయవలసినది దానిని పరిపూర్ణము చేసుకొనుటయే.

ఈ భావాన్ని మరో కోణంలో తెలుపుతూ మహాకవి బమ్మెర పోతన గారు గజేంద్ర మోక్షము సందర్భంలో ఇలా చెప్పారు:
. లోకంబులు లోకేశులు
లోకస్థులుఁ దెగినఁ దుది నలోకం బగు పెం
జీకటి కవ్వల నెవ్వం
డేకాకృతి వెలుఁగు నతని నే సేవింతున్. (8-75)
భావము: లోకములు, లోకాలను పాలించేవారు, లోకాలలో ఉండేవారు అందరు నశించిన అనంతరం క్రమ్ముకొనే కారు చీకట్లకు ఆవల కారు చీకట్లకు ఆవతల అఖండమైనది, ప్రకాశించేది ఏదైతే ఉందో  ఆ దేవుణ్ణి నేను సేవిస్తాను.

మూడవ​​ చరణం:
అచ్చుతుఁడవు నీయచ్యుతపద మది
యిచ్చట శ్రీవేంకటేశుఁడవు
చొచ్చిరి నీశరణు శుకసనకాదులు
మచ్చిక నిదిగని మరిగితిమయ్యా          ॥ఇది॥
పదబంధం
తెలుగులో అర్థం
అచ్చుతుఁడవు నీయచ్యుతపద మది
అచ్యుతుడు — ఎప్పటికీ పడిపోని వాడు; అచ్యుతపదము — పడిపోని స్థితి
యిచ్చట శ్రీవేంకటేశుఁడవు
ఇక్కడ ఆ అచ్యుత స్వరూపమే శ్రీ వేంకటేశ్వరుడిగా ప్రత్యక్షమై ఉన్నాడు
చొచ్చిరి నీశరణు శుకసనకాదులు
శుకుడు, సనకాదులు వంటి మహాపురుషులు నీ శరణు చేరారు
మచ్చిక నిదిగని మరిగితిమయ్యా
ఆ ఆశ్రయం నిజమని గ్రహించి స్వామి అనుగ్రహంతో మేము కూడా వారితో కలిసిపోయాము

సూటి భావము:
అచ్యుతుడవు నీవు — నీ అచ్యుతపదమే వాస్తవముగా నిలిచి ఉండే శాశ్వత స్థితి. అదే ఇక్కడ శ్రీ వేంకటేశ్వరుడిగా వ్యక్తమై ఉంది. శుకుడు, సనకాదులు వంటి మహర్షులు ఆ స్థితిలోకి చొచ్చుకుని పోయారు. అది నిజమని గ్రహించి స్వామి అనుగ్రహంతో మేము కూడా వారితో కలిసిపోయాము.

గూఢార్థవివరణము:
మొదటి రెండు చరణాలలో అన్నమాచార్యులు ఈ ప్రపంచంలోని భౌతిక శక్తులు, అలాగే అనేక చైతన్యావస్థలు (మానసిక స్థితులు) అన్నీ కూడా కాలగమనానికి లోబడినవేనని చూపించారు. ఒకటి పైకి కనబడే ప్రపంచం; ఇంకొకటి మానసిక ప్రపంచం. అనగా మానవుడు తన ప్రజ్ఞ ద్వారా సాధించగల లోకములన్నీ అశాశ్వతమని అర్థం.

ఇవి కాక మానవులు తమలోనే ఉన్న చైతన్యమునకు అతీతమైన దానిని వేంకటేశ్వరుని దాసులై చేరగలరని అన్నమాచార్యులు సూచిస్తున్నారు. అది భౌతికముగా కానరాదు; మానసికముగా చేరలేనిది. మార్గము లేనిది. అయినప్పటికీ శాశ్వతమైనది అదే.

ఇక్కడ 'చొచ్చుకుని పోయారు', 'వారితో కలిసిపోయాము' అన్నవి యథాలాపముగా వాడిన పదములు కావు. ఆ స్థితిలో వారు తమ తమ ప్రత్యేక అస్తిత్వము కోల్పోయి ఆ భగవంతుని కల్పనలో మమేకమైనట్లుగా భావించ  వలెను.
 
ఇక్కడ ముఖ్యమైన పదం అచ్యుత”.అచ్యుత అంటే ఎప్పటికీ పడిపోని, మార్పులకు లోబడని, నాశములేని అనే భావం. అందువల్ల అచ్యుతపదము అనేది ఒక లోకము గాని, ఒక స్థానము గాని కాదు. అది శాశ్వతంగా నిలిచిపోయే స్థితి.
 
ఆ అచ్యుత స్వరూపమే ఇక్కడ శ్రీ వేంకటేశ్వరుడిగా అనుభవమవుతుందని అన్నమాచార్యులు చెబుతున్నారు. ఈ విధంగా ఒక తాత్విక సత్యాన్ని ఆయన భక్తి రూపంలో వ్యక్తపరుస్తున్నారు.

అన్నమాచార్యులు చేరిన ఆ స్థితి భగవద్గీతలో చెప్పిన ఈ శ్లోకమునకు దగ్గరగా అనిపించును.

యదా భూతపృథగ్భావమేకస్థమనుపశ్యతి
తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా ।। 13-31 ।। 

ఎప్పుడు వేర్వేఱుగనున్న ఈ భూతప్రపంచమంతను ఒక్కదానియందు (పరమాత్మయందు) ఉన్నదానిగను, మరియు దానినుండియే విస్తరించుచున్న దానినిగను వీక్షించునో, అప్పుడు (మనుజుడు) బ్రహ్మమును పొందుచున్నాడు.

ఈ మార్గాన్ని ముందుగా అనుసరించిన మహర్షులు ఉన్నారని సూచించడానికి శుకుడు, సనకాదులు అనే పేర్లను ప్రస్తావిస్తున్నారు. వారు ఆ ఆశ్రయాన్ని చేరినవారిగా సంప్రదాయంలో చెప్పబడుతారు. అయితే కాలము తాకని ఆ స్థితిలో శుకుడు, సనకాదులు అనే పేర్లు కేవలము సూచనప్రాయమే. వాస్తవానికి ఆ స్థితిలో వారంతా అనామకులే.
 
చివరి పాదంలో అన్నమాచార్యులు ఒక వ్యక్తిగత భావాన్ని వ్యక్తపరుస్తారు: మచ్చిక నిదిగని మరిగితిమయ్యా” అంటే — ఈ ఆశ్రయం నిజమని గ్రహించి మేము కూడా ఆ మార్గాన్ని అనుసరించాము. ఇక్కడ “మేము” అన్నది అన్నమాచార్యులు తాము ఆ సత్యముతో మమేకమై విడదీయలేని ఏకత్వాన్ని సూచించుచున్నది.

వ్యాఖ్యానంతర సమీక్ష:
అన్నమాచార్యులు ఈ కీర్తన ద్వారా శాశ్వతమైన దానిని చేరుకున్నారని తెలుస్తుంది. మానవులుగా గమనించ వలసినదేమంటే:
 
మనములోని విభుఁడు మఱవఁడే కాలంబు
నినుఁ గలయనున్నాఁడు నీకేలె వెఱవ పల్లవి 

భావము: ఒక తెలియని స్వరం: “చెలీ! మనసులోని విభుడు ఏ కాలంలోను మఱవఁడు. నిన్ను కలియుటకు ఉన్నాడు. నీకేమే సందేహముతటపాయింపు?”
 
కాబట్టి జాప్యము మన వైపునుంచే.

X-X-The END-X-X

T-322 ఎంత చదివి చూచిన నీతఁడే ఘనము గాక

  తాళ్లపాక అన్నమాచార్యులు 322 ఎంత చదివి చూచిన నీతఁడే ఘనము గాక For English version press here ఉపోద్ఘాతము మనకు కనబడుతున్న ప్రపంచం , కనపడ...