Monday, 6 April 2026

T-317 అచ్చుత మిమ్ముఁ దలఁచే యంతపని వలెనా

 తాళ్లపాక అన్నమాచార్యులు
317 అచ్చుత మిమ్ముఁ దలఁచే యంతపని వలెనా

For English version press here

 

ఉపోద్ఘాతము

ఇక్కడ భక్తి అనేది మాటలలో ప్రకటించు భావము కాదు; జీవనమంతటా ప్రసరించు ఒక స్థితి. అట్టి స్థితిలో ఉన్నవారిని గౌరవించుట, వారిని సేవించుట దైవసేవకే సమానమని కవి భావిస్తున్నారు. ఈ కీర్తనలో కవి తన స్థానమును అత్యంత వినయముతో నిర్ధారించుకొంటారు — "నీ బంటుబంటుకు సందడిబంట నవుటే చాలదా నాకు" అని అన్నమాచార్యులు చెబుతారు.

సరళమైన పదములలో చెప్పబడిన ఈ కీర్తనలో అంతర్లీనమైన భావము ఎంతో లోతైనది. మానవ జీవితము ఒదిగి వుండుటలో ప్రతిఫలిస్తుంది

అధ్యాత్మ​ సంకీర్తన
రేకు: 339-3 సంపుటము: 4-228
అచ్చుత మిమ్ముఁ దలఁచే యంతపని వలెనా
యిచ్చల మీవారే మాకు నిహపరా లియ్యఁగా ॥పల్లవి॥

మిమ్ము నెఱిఁగిన యట్టి మీ దాసుల నెఱిఁగే
సమ్మతివిజ్ఞానమే చాలదా నాకు
వుమ్మడి మీ సేవ సేసుకుండేటి వైష్ణవుల
సమ్ముఖాన సేవించుటే చాలదా నాకు ॥అచ్చు॥

నిరతి నీకు మొ క్కే నీడింగరీలకు
సరవితో మొక్కుటే చాలదా నాకు
పరగ నిన్నుబూజించే ప్రపన్నులఁ బూజించే
సరిలేని భాగ్యము చాలదా నాకు ॥అచ్చు॥

అంది నీకు భక్తులైన యల మహానుభావుల
చందపువారిపై భక్తి చాలదా నాకు
కందువ శ్రీవేంకటేశ కడు నీ బంటుబంటుకు
సందడిబంట నవుటే చాలదా నాకు ॥అచ్చు॥
Details and Explanations:
పల్లవి:
అచ్చుత మిమ్ముఁ దలఁచే యంతపని వలెనా
యిచ్చల మీవారే మాకు నిహపరా లియ్యఁగా ॥పల్లవి॥
పదబంధం
అర్థం
అచ్చుత మిమ్ముఁ దలఁచే యంతపని వలెనా
ఓ అచ్యుతా! నిన్ను తలచేటంత పని ఏముంది
యిచ్చల మీవారే మాకు నిహపరా లియ్యఁగా
ఈ భూతలములో నీ దాసులే మాకు నిహపరములను విడమరిచి చెప్పగా

సూటి భావము:
(అన్నమాచార్యులు దైవముతో) ఓ అచ్యుతా! నిన్ను తలచేటంత పని ఏముంది. (నీ అంతటి వానికి నీవేదించ వలసినంత పెద్దపనికాదు). ఈ భూతలములో నీ దాసులే మాకు నిహపరములను విడమరిచి చెప్పగా. (నీ దాసులే చేయగలిగిన దానికి నీ దాకా తీసుకెళ్ళడమెందుకు?)

గూఢార్థవివరణము:
అచ్చుత మిమ్ముఁ దలఁచే యంతపని వలె: అచ్యుతా నీవు చేయగల కార్యములు అనుపమానములు. అచింత్యములు. ఈ చిన్న పని ఇహపరాలపై స్పష్టమైన అవగాహనకు నీ అంతటి వానిని తలచ నవసరము లేదు.

యిచ్చల మీవారే మాకు నిహపరా లియ్యఁగా” అనే పంక్తిలో “మీవారే” (=నీ దాసులే) అనగా జీవనమరణముల స్వరూపమును సమత్వముతో గ్రహించిన వారు. అట్టి వారు ఇహము–పరము అనే విషయములను తేఁటతెల్లముగా మాటలతో మాత్రమే కాక, తమ జీవనముతోనే స్పష్టపరచువారు.

కానీ వారిని తెలియుటెట్లు? కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునా? అనిర్వచనీయమైన సుదీర్ఘమైన నిష్టలో మనసు లగ్నమైనప్పుడు అట్టి దాసుల జీవితం మనకు మార్గసూచకమగును.

భక్తుడు, భక్తిలపై సూచనాత్మక వ్యాఖ్య:

ఎవరైనా తన భక్తిభావనను తాను గుర్తించగలిగితే, అతడు ఇంకా బాహ్యప్రజ్ఞలోనే ఉన్నట్లే. తాదాత్మ్యమును పొందు స్థితికి ఇంకా ఎదగలేదన్న మాట. ఎందుకంటే బాహ్యప్రజ్ఞలో ఉన్నంతకాలం మానవుడు తాను సాధించుచున్నాననే భావమే ప్రధానమై ఉంటుంది.

కాని భక్తుడు తనను పూర్తిగా భగవంతుని చరణాలకు అర్పించిన తరువాత అట్టి బాహ్యప్రజ్ఞ నిలవదు. అక్కడ “నేను చేస్తున్నాను” అనే స్పృహ క్రమంగా లీనమైపోతుంది. ఆ స్థితిలో కార్యము జరుగుతుందే కాని, దానికి తనను సాధనముగా భావించుట ఉండదు.

మొదటి చరణం:
మిమ్ము నెఱిఁగిన యట్టి మీ దాసుల నెఱిఁగే
సమ్మతివిజ్ఞానమే చాలదా నాకు
వుమ్మడి మీ సేవ సేసుకుండేటి వైష్ణవుల
సమ్ముఖాన సేవించుటే చాలదా నాకు ॥అచ్చు॥
Telugu Phrase
Meaning
మిమ్ము నెఱిఁగిన యట్టి మీ దాసుల నెఱిఁగే
నిన్ను తెలిసిన నీ దాసులను ఎఱుగుట
సమ్మతివిజ్ఞానమే చాలదా నాకు
వున్నదివున్నట్లు స్వీకరించు విజ్ఞానము నాకు చాలదా? (సరిపోతుంది)
వుమ్మడి మీ సేవ సేసుకుండేటి వైష్ణవుల
(వైష్ణవుల=దాసులను) ఉమ్మడిగా నీ సేవ చేయు దాసులను
సమ్ముఖాన సేవించుటే చాలదా నాకు
ప్రత్యక్షంగా సేవించుటే చాలదా నాకు (చాలు)
సూటి భావము:
(అన్నమాచార్యులు దైవముతో) ఓ అచ్యుతా! నిన్ను తెలిసిన నీ దాసులను ఎఱుగుట వారినుండి  వున్నదివున్నట్లు స్వీకరించు విజ్ఞానము నేర్చుట నాకు చాలదా? (సరిపోతుంది). ఉమ్మడిగా నీ సేవ చేయు దాసులను ప్రత్యక్షంగా సేవించుటే చాలదా నాకు (చాలు)

గూఢార్థవివరణము:

సమ్మతివిజ్ఞానమే చాలదా నాకు: ఏమి జరిగినా — కష్టమైనా, ఇష్టమైనా, సుఖమైనా, దుఃఖమైనా — అది అట్లానే స్వీకరించుట. ఇదేమిటండి? ఇరవైయొకటో శతాబ్దములో పాత చింతకాయ పచ్చడి మాట్లాడుతున్నారని అనవచ్చును. ఎందుకంటే మన ఇప్పటి విజ్ఞత అంతా మనకై మనము ఏర్పరచుకున్న తర్కముపైనే ఆధారపడి ఉంది. ఒకవేళ తర్కమే సమస్త సమస్యలకు పరిష్కారమైతే, ఇన్ని యుద్ధాలు, మారణహోమాలు, ఆకలిచావులు సంభవించేవా? కాబట్టి మన తర్కము ఎక్కువ పాళ్ళు స్వప్రయోజనసిద్ధికై కనిపెట్టబడిన సాధనమే.

అయితే “అసలు వాస్తవ విషయములు చెప్పండి” అనవచ్చును. కానీ మనము అనుభవించు వాస్తవము కూడా ఒక కేంద్రబిందువునుండి చూచిన దృక్కోణమే. కవి అయితే కేంద్రమేలేని దృక్కోణమును వెదకమంటున్నారు. ఆ దృక్కోణమును మరొక దృక్కోణము ద్వారా గ్రహించుట సాధ్యం కాదు. అందువలన సమ్మతివిజ్ఞానమును స్వీకరించకపోతే మార్గము మరింత కష్టతరమగును.

ఇంకొక గమనించవలసిన విషయం: వృత్తములో ఎక్కడి నుండైనా చూచినపుడు కేంద్రము ఉన్నట్లు అనిపించవచ్చు. కానీ కేంద్రములోనే నిలిచినప్పుడు ఆ కేంద్రమునకు స్వతంత్ర అస్తిత్వము ఉండదు.

వుమ్మడి మీ సేవ సేసుకుండేటి వైష్ణవుల: ఇక్కడ “ఉమ్మడి” అనే పదము విశ్వవ్యాప్త భావమును సూచిస్తుంది. దీనిని ఒక ప్రత్యేక మతమునకు లేదా సంప్రదాయమునకు పరిమితం చేయరాదు. కవి దైవసేవను సర్వసామాన్యముగా జరుగుచున్న కార్యముగా సూచిస్తున్నారు.

సమ్ముఖాన సేవించుటే చాలదా నాకు” ఇక్కడ “సమ్ముఖాన” అనగా ప్రత్యక్షముగా సేవించుట.ఇందులోని మర్మమును గ్రహించండి. కానీ వారిదాసులని తెలియుటెట్లు? ఒక నిర్ధారించగల విషయమును గ్రహించుటకు తెలిసిన దానివైపు నుండి గమనించి ముందుకు వెళ్ళుట సామాన్య విజ్ఞానము. కానీ తెలియలేని (నిర్ధారించలేని) దానిని  తెలియుటకు మనకున్న ప్రత్యామ్నాయములన్నీ విఫలమగును. అపుడేమి చేయవలె? అట్టి సందర్భములో సమ్మతివిజ్ఞానమే మార్గమగును.​

Top of Form

Bottom of Form


రెండవ​ చరణం:
నిరతి నీకు మొ క్కే నీడింగరీలకు
సరవితో మొక్కుటే చాలదా నాకు
పరగ నిన్నుబూజించే ప్రపన్నులఁ బూజించే
సరిలేని భాగ్యము చాలదా నాకు ॥అచ్చు॥ 
Telugu Phrase
Meaning
నిరతి నీకు మొ క్కే నీడింగరీలకు
(డింగరీలకు= సేవకుఁలకు) ఎల్లవేళలా నీకు మొక్కే సేవకుఁలకు
సరవితో మొక్కుటే చాలదా నాకు
(సరవి= క్రమము) క్రమముగ మొక్కుటే సరిపోవును కదా!
పరగ నిన్నుబూజించే ప్రపన్నులఁ బూజించే
(పరగ=ఒప్పుగా, సరిగా) ఒప్పుగా నిన్నుబూజించే ప్రపన్నులను పూజించు (అవకాశం)
సరిలేని భాగ్యము చాలదా నాకు
భూప్రపంచములో సాటిలేని భాగ్యము. అది సరిపోదా నాకు?

సూటి భావము:
ఓ అచ్యుతా! ఎల్లవేళలా నీకు మొక్కే సేవకుఁలకు క్రమముగ  మొక్కుటే సరిపోవును కదా! ఒప్పుగా  నిన్నుబూజించే ప్రపన్నులను పూజించు అవకాశం భూప్రపంచములో సాటిలేని భాగ్యము. అది సరిపోదా నాకు?

గూఢార్థవివరణము:
 
నిన్ను బూజించే ప్రపన్నులను” — అనగా దైవమును మాటలతో కాదు, తమ జీవనమే అచ్యుతునికి అర్పించినట్లు వుండువారు. వారు ఎవరినుంచీ ఏమీ కోరరు. వారిని పూజించుటకు ఒకే మార్గము — వారి లాగానే హరిని మనస్ఫూర్తిగా కొలుచుట.

అలాగే “నీడింగరీలకు మొక్కుట”ను కూడా హరిని ఆత్మలో మొక్కుట క్రింద జమకట్టవలెను. ఇది కొంత వింతగా, మరీ ఎక్కువగా చెప్పినట్లుగా అనిపించవచ్చును.

ఉదాహరణకు భోజనమును తీసుకోండి. మనము ముప్పొద్దులా తింటాము. కానీ కొంత విరామము తరువాతనే మళ్ళీ ఆకలి మొదలౌతుంది. “రోజంతా తిన్నాము కదా — ఇంకా ఎందుకు?” అని కోపము రావలెను. కానీ రాదు. అది సహజమని తీసుకుంటాం — రోజువారీ ప్రకటనలలో గణనీయమైన భాగము భోజనానికే సంబంధించినది. ఏ నగరములోనైనా వీధులలో తిరిగినా అనేక దుకాణాలు ఆహారమునకే సంబంధించినవే కనిపిస్తాయి.

మామూలు మనుషులకు తిండి రంధి సహజము. అలాగే హరియే లోకముగా బతుకువారికి భక్తి సహజము.

మూడవ​​ చరణం:
అంది నీకు భక్తులైన యల మహానుభావుల
చందపువారిపై భక్తి చాలదా నాకు
కందువ శ్రీవేంకటేశ కడు నీ బంటుబంటుకు
సందడిబంట నవుటే చాలదా నాకు ॥అచ్చు॥
Telugu Phrase
Meaning
అంది నీకు భక్తులైన యల మహానుభావుల
(అల = తరంగం, కెరటం) నీకు భక్తులై కెరటములవలె ఉప్పొంగిన మహానుభావులు
చందపువారిపై భక్తి చాలదా నాకు
అటువంటివారిపై భక్తి ఉంటే సరిపోదా?
కందువ శ్రీవేంకటేశ కడు నీ బంటుబంటుకు
సంకేతము లాంటి శ్రీవేంకటేశ అటువంటి బంటుబంటుకు
సందడిబంట నవుటే చాలదా నాకు
ఉన్న బంటులగుంపులో ఒక బంటునైతే చాలదా?
సూటి భావము:
సంకేతములాంటి శ్రీవేంకటేశా! నీకు భక్తులై కెరటములవలె ఉప్పొంగిన మహానుభావులపై భక్తి కలిగి ఉండుటే నాకు సరిపోదా? నీ బంటులలో ఉన్న బంటుల గుంపులో ఒక బంటునై ఉండుటే నాకు చాలదా?

గూఢార్థవివరణము:
 
అంది నీకు భక్తులైన యల మహానుభావుల = అందిపుచ్చుకుని నీకు భక్తులైన అసంఖ్యాక మహానుభావులు. అల మహానుభావులు పరిశీలించదగ్గది. “అల మహానుభావులు” అనగా కెరటములవలె దైవభక్తితో ఉప్పొంగిన మహానుభావులు. సముద్రములో కెరటములు ఉప్పొంగినట్లే, దైవభక్తి తరంగములుగా ఇటువంటి మహానుభావులు లోకములో కొన్నిసార్లు ప్రత్యక్షమవుతారు.

అయితే ఏ మహానుభావుడూ శ్రీవేంకటేశునికి సమానుడు కాదు. అయినప్పటికీ ఈ లోకములోని ప్రజలకు దైవము మార్గదర్శనము చేయుట చాలా సందర్భాలలో అట్టి మహానుభావుల ద్వారానే జరుగుతుంది. వారు దైవసంకల్పానికి సమీపముగా జీవించువారు. అందుచేత వారిని సేవించుట దైవసేవకే సమానమని భావించవచ్చు. ఎందుకంటే వారు చేయు కార్యములు తమకోసము కావు; అవన్నీ దైవకైంకర్యములుగానే జరుగుతాయి

భగవద్గీతలోని క్రింది శ్లోకము ఈ భావానికి ఉదాహరణగా చెప్పవచ్చు:
నిరాశీర్యతచిత్తాత్మా త్యక్తసర్వపరిగ్రహః   
శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్ ॥ (4.21) 

అనగా ఆశలు లేకుండా, ఏదీ నాది అన్న భావన లేకుండా, మనస్సు మరియు ఇంద్రియములను నియంత్రణలో ఉంచుకున్నవాడు శరీరముతో కర్మలు చేసినా పాపమునకు లోనుకాడు.

కడు నీ బంటుబంటుకు” అనే పదబంధములో కవి తన స్థానమును అత్యంత వినయముతో సూచిస్తున్నారు. లెక్కించలేనంతమంది నీ సేవకులలో ఉన్న బంటులలో నేనూ ఒక బంటునై ఉండుటే నాకు చాలునని అన్నమాచార్యులు చెబుతున్నారు. అట్టి సేవకుల గుంపులో ఒక స్థానము పొందుటనే గొప్ప భాగ్యమని భావిస్తున్నారు. దీని ద్వారా అన్నమాచార్యులు దైవమును పొందుట సులభమని మనందరిని ప్రోత్సహించుచున్నారు.

 దృశ్యాత్మక సమాంతర పరిశీలన​

1915లో Hilma af Klint వేసిన Swan No. 10 చిత్రాన్ని ఇక్కడ ఒక దృశ్య సూచనగా గుర్తు చేసుకోవచ్చు. ఈ చిత్రంలో విశ్వ చైతన్యమును ఒక సముద్రముగా, వ్యక్తిగత చైతన్యమును చిన్న చుక్కలుగా సూచించినట్లు భావించవచ్చు. సముద్రములో అనేక కెరటములు ఉప్పొంగినట్లే, చైతన్య సముద్రములో వ్యక్తులు కెరటములవలె ప్రత్యక్షమవుతారు.

చిత్రములో కనిపించే చిన్న షడ్భుజాకారం మానవుని ప్రస్తుత అస్తిత్వాన్ని సూచిస్తుంది. దాని ఆరు భుజములు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యముల వంటి అంతరంగ వికారాలతో ఏర్పడిన పరిమితులను సూచిస్తున్నట్లు భావించవచ్చు. ఈ పరిమితుల వలన మనము విశ్వ చైతన్య సముద్రముతో సహజముగా కలిసిలేము.

ఈ షడ్భుజి "నేను" అను ఇప్పటి జీవితపు ఊహలచేత మన చేతలతోనే నిర్మించబడింది. "సత్యంతో ఏకత్వము మన స్థితి నుంచి కేంద్రానికి ప్రయాణం కాదుకానీ మనమే సృష్టించిన కృత్రిమ సరిహద్దులను చెరిపివేసి అనంతమగు చైతన్యము నందు మిళితమగుటయే" అనేది చిత్రలేఖనం యొక్క గూఢార్థం.

చిత్రములో కనిపించే సన్నని రేఖ జీవనము మరియు మరణముల మధ్యనున్న సరిహద్దును సూచిస్తుంది. ఆ రేఖపై నిలిచిన వారికి రెండు వైపులా ఒకే నిశ్చలత్వము కనిపిస్తుంది. ఆ స్థితిలో జీవనము–మరణము అనే విభేదం ఉండదు; కానీ ఆ రేఖ నుండి దూరంగా ఉన్న వారికి అవి రెండు వేర్వేరు సంఘటనలుగా అనిపిస్తాయి.

ఈ దృశ్య సూచనను కీర్తనకు ప్రత్యక్ష వివరణగా కాక, “అల మహానుభావులు” అనే అన్నమాచార్యుల పదానికి ఒక రూపకస్మరణగా మాత్రమే చూడవచ్చు — సముద్రములో కెరటములు ఉప్పొంగినట్లే, చైతన్య సముద్రములో మహానుభావులు ప్రత్యక్షమవుతారు.

వ్యాఖ్యానంతర సమీక్ష:
ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోవాలి. అన్నమాచార్యులు అన్న క్రింది మాటలను తీవ్రముగా విచారించవలెను. 
ఎమ్మెలఁ బుణ్యాలు సేసి యిల నేలవచ్చుఁ గాక
కమ్మి హరి దాసుఁడు గావచ్చునా 
"హరి దాసుఁడు" అన్నది పోందగలిగిన పదవికాదు. తీవ్రము అసాధారణము అగు భక్తిలో నిలిచిన స్థితి.

X-X-The END-X-X

1 comment:

  1. భగవద్భక్తులే ఇహపరముల గురించి వివరంగా చెప్తుంటే మాకు నిన్ను తలచే అవసరమేమున్నది? నిన్ను తెలుసుకున్న నీ దాసుల నుండి ఆ సుజ్ఞానము గ్రహించిన చాలదా? నిన్ను సేవించే నీ దాసుల సేవ చాలదా నాకు? నిరతము నీకు మ్రొక్కే నీ దాసులకు మ్రొక్కిన చాలదా? నీభక్తితో అలలవలె ఉప్పొంగే నీ భక్తులపై భక్తి ఉన్న చాలును గదా? నీ సేవకులలో ఒకడినై నిన్ను సేవించి తరించిన చాలు గదా! అని అన్నమయ్య ఈ భక్తికీర్తనలో స్వామివారిని కీర్తిస్తున్నారు.

    ఓం తత్ సత్
    🙏🙏🙏
    కృష్ణమోహన్

    ReplyDelete

T-323 ఒక్కటి తరువాత వేరొకటై కాచుకుండు

  తాళ్లపాక అన్నమాచార్యులు 323 ఒక్కటి తరువాత వేరొకటై కాచుకుండు For English version press here ఉపోద్ఘాతము సంసార లక్షణము మానవుని ముఖ...