తాళ్లపాక అన్నమాచార్యులు
322 ఎంత చదివి చూచిన నీతఁడే ఘనము గాక
ఉపోద్ఘాతము
మనకు కనబడుతున్న ప్రపంచం, కనపడనిది — రెండూ పరస్పరంగా ముడిపడి ఒక సంక్లిష్ట వ్యవస్థలా
నడుస్తున్నట్లనిపిస్తుంది. కానీ, ప్రపంచం అంతర్యాన్ని ఎవరూ
స్పష్టంగా నిర్ధారించలేకపోయారు. ఎంత పరిశీలించినా అది పూర్తిగా చేతికి చిక్కదు. ఈ
రహస్యం గురించి మనకు ఏర్పడిన అభిప్రాయాలే మన మధ్య విభజనలకు కారణమవుతాయి. ప్రపంచం
యాంత్రికమా కాదా అన్నది కూడా ఒక అభిప్రాయం. “నేను తటస్థంగా ఉన్నాను” అనుకోవడం కూడా
మరో అభిప్రాయమే.
ఇక్కడ ఒక విషయం గమనించవలసినది: మనస్సు చెల్లాచెదురైన చిత్రాలను
అనుసంధానము చేయుట ద్వారా పనిచేస్తుంది — అదే దాని బలం; అదే దాని పరిమితి. అందువల్ల మనకు కనిపించే
వ్యవస్థ కూడా విభజితంగానే అనిపిస్తుంది.
ఇక్కడ అన్నమాచార్యుల మాట గుర్తుకొస్తుంది — “గట్టిగాఁ దెలుసుకొంటే కన్నదే కంటి కురుమ” అంటే: చూడటానికి అడ్డం ప్రపంచం కాదు; మనసులోని తెరలే. ప్రపంచం వంకర కాదు — మన చూపే
వంకర.
అప్పుడు ప్రశ్న ఇలా మారుతుంది: ఈ అభిప్రాయాల కూపం నుండి బయటకు
స్పష్టంగా చూసే అవకాశం ఉందా? ఈ కీర్తనలో అదే పరిశీలనకు సూచన ఉంది. కనిపించినదానిని ఆధారంగా
పట్టుకోకుండా గమనించగలిగితే, ఆ గమనిక
స్వతంత్రంగా నిలుస్తుంది. అటువంటి నిష్పాక్షిక పరిశీలనలో తేలేది: "ఎంత చదివి చూచిన నీతఁడే ఘనము
గాక". ఎంతగా పరిశోధించినా, పరిశీలించినా — నిలిచేది అదే
సత్యం.
కీర్తనలోని
భావపురోగతి
పల్లవి
—కనబడినదీ, కనబడనిదీ అన్నిటినీ కలిపి నిలిపేది ఇంకేదైనా ఉందా?
మొదటి
చరణం — నిర్ధారించలేని దానిని తటస్థ వాస్తవిక పరిశీలనతో
ప్రత్యక్షంగా చూడగలమా?
రెండవ
చరణం — లోనను, వెలుపల, సర్వమును
వ్యాపించి ఉన్నవి వేర్వేరు విషయములా?మూడవ
చరణం — సమస్య చూపులోని విభజనేనా, లేక మఱేమైన ఉందా?
|
అధ్యాత్మ సంకీర్తన
|
|
రేకు: 117-2 సంపుటము: 2-98
|
|
ఎంత చదివి చూచిన నీతఁడే ఘనము గాక యింతయు నేలేటి దైవ మిఁక వేరే కలరా ॥పల్లవి॥ మొదల జగములకు మూలమైనవాఁడు తుదఁ బ్రళయమునాఁడు తోఁచేవాఁడు కదిసి నడుమ నిండి కలిగివుండెడివాఁడు మదనగురుఁడే కాక మఱి వేరే కలరా ॥ఎంత॥ పరమాణువైనవాఁడు బ్రహ్మాండమైనవాఁడు సురలకు నరులకుఁ జోటయినవాఁడు పరమైనవాఁడు ప్రపంచమైనవాఁడు హరి యొక్కఁడే కాక అవ్వలనుఁ గలరా ॥ఎంత॥ పుట్టుగులయినవాఁడు భోగమోక్షాలైనవాఁడు యెట్టనెదుర లోనను యిన్నిటివాఁడు గట్టిగా శ్రీవేంకటాద్రి కమలాదేవితోడి పట్టపుదేవుఁడే కాక పరు లిఁకఁ గలరా ॥ఎంత॥
|
Details
and Explanations:
పల్లవి:
ఎంత
చదివి చూచిన నీతఁడే ఘనము గాక
యింతయు నేలేటి దైవ మిఁక వేరే కలరా ॥పల్లవి॥
భావము:
ఎంతగా
పరిశోధించినా, పరిశీలించినా — నిలిచేది ఇతడే. కనబడినదీ,
కనబడనిదీ అన్నిటినీ కలిపి నిలిపే దైవము (లేదా సత్యం) దీనికి వేరుగా ఇంకేదైనా ఉందా? (లేరు)
గూఢార్థవివరణము:
“ఎంత చదివి చూచిన నీతఁడే ఘనము గాక” — ఇక్కడ
‘ఘనము’ అనగా నిజముగా నిలిచియుండేది. ఎంత పరిశోధించినా, నిజముగా
ఉన్నదాన్ని మరొకదాని ద్వారా నిరూపించలేం; అది స్వతంత్రంగా
ఉన్నదే.
మనము
సాధారణంగా పరిశీలించేది లేనిదానిని, లేదా కాలంతో మారేదానిని. వాటిని ఒక
సమీకరణములోనో, ఒక తత్వముగా గానో, ఒక
శ్రేణిగానో, ఒక ఊహగానో ప్రతిపాదించి కొంతవరకు వాటి
స్వభావాన్ని గ్రహించగలము.
కానీ
వీటికి లోబడని దానిని ఈ విధమైన పరిశీలనతో పట్టుకోలేము; ఎందుకంటే అది మరొకదానిపై ఆధారపడినది కాదు.
“యింతయు నేలేటి దైవము ఇంక వేరే కలరా?” — దీనిని
నిరూపించవలసిన ప్రశ్నగా కాక, పరిశీలించవలసిన ప్రశ్నగా
చూడాలి.
మనకు
కావలసినంత సమాచారం లేదని కొట్టి పారేయడం సులభం; కానీ
దానికి వ్యతిరేకమైన అవకాశాన్ని కూడా పరిశీలించము. మన చుట్టూ ఉన్న వాటిని గమనిస్తే,
ఏది కనిపించినా దానికంటూ స్వతంత్ర అస్తిత్వం లేదు; అది మరొకదానిపై ఆధారపడి ఉంటుంది.
ఈ
విధంగా పరిశీలిస్తూపోతే, పరిశీలిస్తున్న మనస్సు కూడా
ఆధారపడి ఉన్నదే అని స్పష్టమవుతుంది. అప్పుడు ‘స్వతంత్రంగా నిలిచేది ఏది?’ అన్న ప్రశ్న మిగులుతుంది. అప్పుడు వేరొకటి ఉందా అన్న ప్రశ్న కంటే, స్వతంత్రంగా నిలిచేది ఏది అన్న ప్రశ్న ముఖ్యమవుతుంది.
అనగా ఈ
పల్లవి ద్వారా సాంద్రమైన విషయాన్ని తేలికగా అర్థమగునట్లు చెబుతున్నారు.
వారు చెప్పిన దాన్ని నమ్మమని కాదు; పరిశీలించమని సూచిస్తున్నారు.
అందువల్ల
జగములు, ప్రళయము, పరమాణువులు,
సురలు, మరణానికి ఆవల, ఈవల
నిలబడువాడని చెప్పినప్పుడు, ఇదేదో సిద్ధాంతమని దూరం
పెట్టనవసరం లేదు. వాటిని వదలకుండా గమనించగలిగితే, అవి
పరిశీలనకు వచ్చే విషయాలే — కానీ అత్యంత శ్రద్ధ అవసరం. ఇదే భావం మాహాత్ముల సందేశములోను
ప్రతిధ్వనిస్తుంది.
మొదటి చరణం:
మొదల
జగములకు మూలమైనవాఁడు
తుదఁ బ్రళయమునాఁడు తోఁచేవాఁడు
కదిసి నడుమ నిండి కలిగివుండెడివాఁడు
మదనగురుఁడే కాక మఱి వేరే కలరా ॥ఎంత॥
భావము:
సృష్టికి
ముందున్నదీ ఇతడే; ప్రళయానంతరం కూడా కనిపించేది ఇతడే.
మధ్యలో వ్యాపించి అన్నిటినీ నింపేది ఇతడే. ఇంద్రియాలను ఆకర్షించే శక్తి కూడా ఇతడే
— మరి వేరెవరున్నారు?
గూఢార్థవివరణము:
పరిశీలించితే
ఈ చరణంలో మనకు కనిపించేది: జగములకు ఆరంభములు, అంతములు, వాని
మధ్య కాలమునకు లోబడిన దానిలోను వ్యాపించి ఉన్నవాని గురించి చెప్పబడినది. వీటిని నిర్ణయించుట
మనషులకు సాధ్యమా? లేక అన్నమాచార్యులు కేవలం ముందే చెప్పబడిన దానిని
తిరిగి వక్కాణిస్తున్నారా? ఆలోచింతము.
ఆరంభములు:
మనం చరిత్రను పరిశీలిస్తే అది వ్రాసిన వారి దృక్పధమును బట్టి మారునని తెలియును. అట్లే
రాజకీయ, సామాజిక వ్యవస్థల ఆటుపోట్లతో అది లోప భూయిష్టమని
తెలియును. ఇంకో ప్రక్క లభిస్తున్న ఆధారములను బట్టి ఏ కట్టడములు, ఆ పర్వతములు, చివరికి నదులు సముద్రములు కూడా కాలగమనములో
మార్పులు చెందుతాయని తెలుస్తుంది. కావున ఆరంభములను గురించి వున్న అవగాహన కేవలము ఉజ్జాయింపు
మాత్రమే.
అంతములు:
జరిగినదాన్నే తెలియనివారము, జరగబోయే దాన్ని తెలియగలమా?
కదిసి నడుమ నిండి కలిగివుండెడివాఁడు: దగ్గరనే
ఉండి, ఈ కాలమంతటిని, సమస్తమును వ్యాపించి వున్నవాడు. అంటే
ఇప్పుడు మనమున్న స్థితిలోను ఉన్నట్లు. కాబట్టి అట్టి వానిని చూచిన సరిపోతుంది కదా!
ఇక్కడే వస్తుంది చిక్కు. చూచినది నిర్ధారించుటకు ప్రమాణాము కావలెను. కాబట్టి ప్రమాణాములన్నీ
అనుభవపూర్వకముగా ముందుగానే నిర్ధారించినవి.
కావున మనము చూచు చూపులతో నిర్ధారించునది భూతకాలముతో
పోల్చి చెప్పినది. అనగ అది వాస్తవము కావచ్చు లేదా కాక పోవచ్చును కూడా. ఈ విధంగా
గతమే కొనసాగుతూ ఉంటుంది.
దీని
ద్వారా తెలియునదేమంటే పైన పేర్కొన్న వేవియు మనము నిర్ధారించలేం. నిర్ధారించలేనిది ఒప్పుకోనవసరము
లేదు. కానీ నిర్ధారించలేని దానిని ప్రత్యక్షముగా చూచి అనగా తటస్థ వాస్తవిక పరిశీలనతో
తెలియవచ్చును. జీవజాలమంతా ప్రకృతి సహజమైన ప్రవృత్తితో మనుగడ సాగిస్తున్నవి. కానీ మానవునికి
ఈ సహజమైన ప్రవృత్తి స్థితివ్యాజముచే కప్పబడి విలోమ భావములకు తావిచ్చుచున్నది. కావున
తటస్థ వాస్తవిక పరిశీలన దుర్లభమే కానీ అసాధ్యము కాదు.
రెండవ చరణం:
పరమాణువైనవాఁడు
బ్రహ్మాండమైనవాఁడు
సురలకు నరులకుఁ జోటయినవాఁడు
పరమైనవాఁడు ప్రపంచమైనవాఁడు
హరి యొక్కఁడే కాక అవ్వలనుఁ గలరా ॥ఎంత॥
భావము:
అతడు
పరమాణువుగాను, బ్రహ్మాండముగాను ఉన్నాడు — అందుకే అతని రూపం
అనూహ్యం. బ్రహ్మాండముగాను ఉన్నాడు — అందుకే అతని రూపం అనూహ్యం. అతడిలోనే సురలు, నరులు ఉన్నారు. తెలిసిన
ప్రపంచముగాను, దానికి అతీతమైన పరముగాను ఉన్నది ఇతడే. హరి
ఒక్కడే కాక, ఆ ఆవలి (తెలియని) దానిని గ్రహించగలవారు
మరెవ్వరున్నారు?
అతడిలోనే సురలు, నరులు ఉన్నారు. తెలిసిన
ప్రపంచముగాను, దానికి అతీతమైన పరముగాను ఉన్నది ఇతడే. హరి
ఒక్కడే కాక, ఆ ఆవలి (తెలియని) దానిని గ్రహించగలవారు
మరెవ్వరున్నారు?
గూఢార్థవివరణము:
మొదటి రెండు
పంక్తులు చూస్తే "మనము కొన్ని కోట్ల పరమాణువుల సముదాయము అనుకుంటే, లోని పరమాణువులు కూడా బ్రహ్మాండంలోని భాగమై, చూచునది
చూచినది ఒకటై సందిగ్ధములో పడవేయును" అని తెలుస్తుంది.
చివరి
రెండు పంక్తులు చూస్తే “’పరము’ అనగా మనలోని
స్పృహ ప్రత్యక్షంగా తాకలేనిది అని. "అవ్వలను"
అనగా ఆవల, తెలిసిన ఈవైపుకు విరుద్ధమైన, సంబంధం లేని ఆవలిది. అనగా "హరి యొక్కఁడే కాక అవ్వలనుఁ గలరా" అన్నది పరస్పర విరుద్ధమైఅన వానిని కలిపి ఉంచినదని
అర్ధము.
ఈ నాలుగు
పంక్తులు కలిపి చూస్తే, సత్యం అనూహ్యంగా, లోనుండి వెలుపలికి, సర్వమును వ్యాపించి ఉంది. అది మనో
విచారణతో స్పృశించ లేనిది. అది వ్యక్తిగత స్పృహలోనిది
కాదు, కానీ లోనే నిక్షింపబడినది. అందులోనే సురలు, నరులు ఉన్నా అది గమనించ లేని అశక్తత మానవునిది.
మూడవ చరణం
పుట్టుగులయినవాఁడు
భోగమోక్షాలైనవాఁడు
యెట్టనెదుర లోనను యిన్నిటివాఁడు
గట్టిగా శ్రీవేంకటాద్రి కమలాదేవితోడి
పట్టపుదేవుఁడే కాక పరు లిఁకఁ గలరా ॥ఎంత॥
భావము:
పుట్టుక
కూడా ఇతడే; భోగమూ, మోక్షమూ ఇతడే. ఎదుట కనిపించేదీ ఇతడే; లోపల అనుభవించేదీ ఇతడే.
“యెట్టనెదుర లోనను యిన్నిటివాఁడు” — ఇది అలంకారం కాదు. చూచునది,
చూచినది వేర్వేరుగా ఉన్నంతకాలం జీవన సంఘర్షణ కొనసాగుతుంది. అవి
ఒకటిగా స్పష్టమయ్యినపుడు అది బాహ్య విషయముగా ఉండదు. ఆ విభేదం పూర్తిగా తొలగినపుడే
అంతరంగములో శ్రీవేంకటాద్రి దేవుని దర్శనం.
గూఢార్థవివరణము:
పుట్టుగులయినవాఁడు
భోగమోక్షాలైనవాఁడు: నిరపేక్ష పరిశీలన కఠినమని
ముందే చెప్పుకున్నాము. శరీరముపై ఎటువంటి ఆపేక్షలేనప్పుడు మానవుని మనస్సు అప్పటికే చుట్టివున్న
భావములను అధిగమించి నిష్పాక్షికంగా చూడ గలుగుతుంది. అప్పుడు తనలోను, చుట్టూతా ఒకే సమయములో జరుగుతున్న జనన మరణాలను భోగములను స్వతంత్రముగా చూచుట
తటస్తిస్తుంది. ముందుగానే అనుకున్నట్లు ఇది విలోమ భావన కావున గ్రహించుటకు అత్యంత నిష్టకావలెను.
లేకున్న అది మిళితమై కొరగానిదౌను.
ఇది సర్కస్'లా ప్రయత్నముతో నిలబెట్టినది
కాదు. ప్రయత్నము లేకయే నిలబడినది. యత్నముతో నిలబెట్టునది పడిపోవును. యత్నము లేకయే నిలబడినది
శాశ్వతము.
మోక్షము అంటే బంధముల
నుండి విముక్తి. అంతే. వారికి ఇంకే విధమైన మినహాయింపు ఉండదు. వారి జీవితము పరిమితమే.
పరిమితము కానిది వారి చూపు.
వేరొకటి ఉందా అన్న ప్రశ్న
క్రమంగా కరుగుతుంది; విభజన నిలబడనప్పుడు, మిగిలేది గమనించుట మాత్రమే.
చివరిగా సమస్య వేరొకటి ఉందా అన్నది కాదు ముఖ్యం ; వేరుగా చూసే మన చూపే సమస్య కాదా?
No comments:
Post a Comment