తాళ్లపాక అన్నమాచార్యులు
321 ఏల రట్టు సేసే వేమీ నేఁడు
ఉపోద్ఘాతము
ఈ కీర్తనలో చూపబడిన మనోస్థితి సులభంగా అనిపించినా, దాన్ని మాటలలో పూర్తిగా చెప్పడం కష్టం; అనుభవించగలిగితే మాత్రమే స్పష్టమవుతుంది. కాబట్టి భావాన్ని పూర్తిగా
చెప్పలేం; దానికి దగ్గరగా మాత్రమే తీసుకెళ్లగలం.
ఇక్కడ శృంగారము అలంకారప్రాయము కాదు; అలౌకిక మేళవింపు. అది భక్తుని అనుభవాన్ని
పట్టివుంచే మాధ్యమం. భావము పదములుగా వ్యక్తమవ్వక ముందే భక్తుని మనసులో రేగే
అలజడిని, తటపాయింపును, సంశయాన్ని,
సందేహాల వెల్లువను ఇది చూపిస్తుంది.
ఇక్కడ భక్తి అంటే చేతులు జోడించడమో, సాష్టాంగ నమస్కారములుగానీ కాదు; తనకు, సత్యమునకు మధ్య వచ్చే ఆటంకములకు భయపడకుండా,
దైవముపై భారము వేసి నిలబడగల స్థితి.
కీర్తనలోని
భావపురోగతి
పల్లవి — ఊహించినదొకటి, అనుభవములో ఎదురయ్యేదొకటి — ఈ విరుద్ధతకు
మనస్సు తడబడుతుంది.
మొదటి చరణం — మొదట
బయటపడటానికి భయం
రెండవ చరణం — లోపల
ద్వంద్వం.
మూడవ చరణం — చివరకు
ప్రయత్నమే అడ్డంకి అని గ్రహించడం
|
శృంగార సంకీర్తన
|
|
రేకు: 292-1
సంపుటము: 9-247
|
|
ఏల రట్టు సేసే వేమీ నేఁడు చాలుఁ జాలు మా యెడను సట సేయవలదు ॥పల్లవి॥ పెదవుల మమ్మింతేసి పేరఁ బిలువకు మని మొదల నిందుకుఁగానె మొక్కనా నీకు అదనఁ గోపమున నీ యంకెకు రాకుండుదుము యెదుట నప్పుడు నీవు యెగ్గు లెంచవలదు ॥ఏల॥ కన్నుల నవ్వకు మని కాఁకలు సేయకు మని నున్నని చెక్కులు చేతనొక్కనా నేను పన్నిన పంతములను పరాకున నుండుదుము వన్నెల నీ వంతేసి వాసు లెంచవలదు ॥ఏల॥ పచ్చిసేసి నీవు మమ్ము బలిమిఁ బట్టకు మని చెచ్చెర నీకుఁ బ్రియము చెప్పనా తొల్లె యిచ్చల శ్రీవెంకటేశ యిటు నిన్నుఁ గూడితిమి తచ్చనలుగావు యిఁకఁ దమకించవలదు ॥ఏల॥
|
Details
and Explanations:
పల్లవి:
ఏల రట్టు
సేసే వేమీ నేఁడు
చాలుఁ జాలు
మా యెడను సట సేయవలదు ॥పల్లవి॥
|
Phrase
|
Meaning in Telugu
|
|
ఏల రట్టు సేసే వేమీ నేఁడు
|
రట్టు = బహిరంగ
పరచుట, రహస్యము నలుగురికి తెలిసేలా చెప్పుట,
divulging a secret, exposure, scandal;
ఈ రకంగా నా గుట్టురట్టు చేస్తావేమి?
|
|
చాలుఁ జాలు మా యెడను సట సేయవలదు
|
సట = కపటము, మోసము
చాలు చాలు, నీ మోసాలింక
చాలు.
|
భావము:
|
శృంగార భావం
|
అంతర్లీన భావం
|
|
ఈ రకంగా నలుగురిలో నా గుట్టురట్టు చేస్తావేమి? ఇక్కడో మాట అక్కడో మాట. చాలు చాలు, నీ మోసాలింక చాలు.
|
స్వామి! నలుగురిలో నా
గుట్టురట్టు చేస్తావేమి? నా పరువుపోదా? నీతో ఉండడానికి ఊహించిన దొకటి. జరుగుతున్నదొకటి. సులభమని చెప్పి మోసం చేస్తావా?
|
వివరణము:
సత్యము
రహస్యము కాదు. అట్లని బహిర్గతమూ కాదు. సత్య దర్శనము పొందిన మహానుభావులు దాచకుండ అంతా
చెబుతారు; కానీ వినేవారికి అది పూర్తిగా అందదు.
ఇక్కడ అన్నమాచార్యులు
భక్తుని రూపంలో మనస్సు యొక్క అంతర మధనాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఊహించినదొకటి, అనుభవములో ఎదురయ్యేదొకటి — ఈ విరుద్ధతకు మనస్సు తడబడుతుంది.
సత్యాన్వేషణ
అనేది మనం ఊహించినట్లుండే ప్రపంచం కాదు. ఊహించలేనిదాని వైపు ప్రయాణం; అక్కడ సమస్యలు ఉండవని కాదు — ఆ సమస్యలే ఆ ప్రయాణం. వాటిని సహించి, స్వీకరించగలిగినప్పుడే మార్గం స్పష్టమవుతుంది.
మొదటి చరణం:
పెదవుల మమ్మింతేసి
పేరఁ బిలువకు మని
మొదల నిందుకుఁగానె
మొక్కనా నీకు
అదనఁ గోపమున
నీ యంకెకు రాకుండుదుము
యెదుట నప్పుడు
నీవు యెగ్గు లెంచవలదు ॥ఏల॥
భావము:
|
శృంగార భావం
|
అంతర్లీన భావం
|
|
ప్రియుడా, (నువ్వెవరో
వారికి తెలియదు కాబట్టి) నలుగురిలో నన్ను పేరుపెట్టి పిలిచి నగుబాటు చేయకు. (నేను
చెప్పినా వారికి అర్ధమవ్వదు). దాన్ని అదనుగా చేసుకుని నీ సమీపమునకు రాము. అప్పుడు
నీవు మా అపరాధములు ఎంచ వలదు.
|
స్వామి! నాలోని ఈ వింత
అనుభవాన్ని బయటపెట్టినపుడు నలుగురు నవ్వుకుంటారు తప్ప అర్ధంచేసుకోరు. ఆ నా గుట్టురట్టు
అయిపోతుందన్న కినుకతో నీ సమీపమునకు రావటానికి మనస్సు వెనుకడుగు వేస్తుంది; అప్పుడు ఆ దూరాన్ని అపరాధముగా ఎంచవలదు.
|
భక్తుని
అసలు తటపాయింపును, అడ్డుకుంటున్న మనో భావనలను అన్నమాచార్యులు
సూటిగా బయట పెడుతున్నారు.
రెండవ చరణం:
కన్నుల నవ్వకు
మని కాఁకలు సేయకు మని
నున్నని
చెక్కులు చేతనొక్కనా నేను
పన్నిన పంతములను
పరాకున నుండుదుము
వన్నెల నీ
వంతేసి వాసు లెంచవలదు ॥ఏల॥
భావము:
|
శృంగార భావం
|
అంతర్లీన భావం
|
|
కాఁకలు సేయకు మని = తాపములు పెంచకుమని (నిఘంటుపు అర్ధము); కాకిలాగ గోలగోల చేయకుమని (సూచ్యార్ధము);
వాసు = నాట్యపరిభాషయందు బాలిక; వాసు లెంచవలదు
= అన్ని నాటకాలు ఆడవద్దు (సూచ్యార్ధము).
ఇదిగో! కన్నులతో కవ్వించొద్దని, కాకిలా గోల చేయకుమని, నా నున్నని చెక్కిళ్లను నీ చెక్కిళ్లతో
రాస్తూ, నీ చేతులు నొక్కుతూ వేడుకుంటున్నాను. మేమేదో నీతో పంతాలు,
పరాచకాలు ఆడుతుంటాము; అప్పుడప్పుడు పరాకుగా ఉంటాము.
నువ్వేమో అప్పుడు నీ వన్నెలు చూపిస్తూ నాటకాలు మొదలెడతావు.
|
స్వామి! నేను నిన్ను తెలిసినట్టు బయట రచ్చ చేయకుమని అంటా; కానీ అంతర్గతంగా మాత్రం నాకు అదే ఎక్కువ మక్కువేమో. మృదువుగా అంగీకరిస్తాను. కానీ చల్లగా దూరం జరిగిపోతాను.
ఒకవైపు నా పంతాలకే ప్రాముఖ్యత ఇస్తూ పరధ్యానంలో పడిపోతాను; ఆ పరధ్యానంలో నిన్ను మరచిపోతాను. కానీ పైపైకి మాత్రం నీవే ముఖ్యమని చూపించ బోతాను. ఇదే ద్వంద్వ స్థితి. మన అంతరంగంలో జరుగుతున్నదాన్ని ఉన్నది ఉన్నట్లే ఇది
చూపిస్తుంది. దైవమును పూర్తిగా అంగీకరించలేని స్థితి.
|
మూడవ చరణం:
పచ్చిసేసి
నీవు మమ్ము బలిమిఁ బట్టకు మని
చెచ్చెర
నీకుఁ బ్రియము చెప్పనా తొల్లె
యిచ్చల శ్రీవెంకటేశ
యిటు నిన్నుఁ గూడితిమి
తచ్చనలుగావు
యిఁకఁ దమకించవలదు ॥ఏల॥
భావము:
|
శృంగార భావం
|
అంతర్లీన భావం
|
|
పచ్చిసేసి= నిష్ప్రయోజనము; చెచ్చెర=శీఘ్రముగా;
తచ్చనలుగావు = వేళాకోళములాడవద్దు
నాయిక: "ముందుగానే నిష్ప్రయోజనముగా బలవంతం చేసి మమ్ము పట్టకుమని
నీకు నయముగా చెప్పాను" ప్రియమైన శ్రీవెంకటేశ ఇటు నిన్ను వెంటనే కూడితిమి. పరిహాసములతో
ఇక తొందర పెట్టకు”.
|
స్వామి! నిన్ను బలవంతముగా చేరుదామని చేసిన ప్రయత్నాలు నీవు వలదంటే
నేను వినలేదు. ముందే నీవు హితవు చెప్పినట్లు నా తరపు ప్రయత్నం ఆపాలి కదా!
ప్రియమైన శ్రీవెంకటేశ ఇటు ఈ భూలోకములో నిన్ను వెంటనే
దర్శించితిమి. వేళాకోళములతో సమయము వృథా చేయవద్దు.
(గూడితిమి - తక్కిన దాసులతో చేరి శ్రీవెంకటేశు కూడితిమి)
నిష్కాపట్యత, గుండె తలుపులు తెఱచియుంచుట ఎంతో
ముఖ్యమైనవి. ఇక్కడ "ఏల రట్టు సేసే వేమీ" యొక్క అర్ధము తెలియని కోణంలో బయట
పడుతుంది.
|
వివరణము:
మొదటి
రెండు చరణాలలో కనిపించిన ద్వంద్వ స్థితి ఇక్కడ సడలుతుంది. బలవంతపు ప్రయత్నం, పంతాలు, ఉపాయాలు — ఇవన్నీ అడ్డంకులే అని
స్పష్టమవుతుంది.
నిష్కాపట్యత, గుండె తలుపులు తెరచి ఉంచుట — ఇవే ఈ చరణంలో వ్యక్తమవుతున్న మార్పు. ఇక్కడే
“ఏల రట్టు సేసే వేమీ” అనే పల్లవి కొత్త కోణంలో అర్థమవుతుంది: బయటపడేది గుట్టు కాదు
— మనసు.
వ్యాఖ్యానంతర సమీక్ష:
అంతరంగ
కల్లోలం సార్వత్రికము.
సమస్య
కల్లోలం కాదు;
దాచుకోవాలనే
ప్రయత్నమే సమస్య.
X-X-The
END-X-X
No comments:
Post a Comment