Monday, 6 April 2026

T-318 హరి హరి జగమెఱుంగ నీ వాతుమలోనే వున్నాఁడవు

 తాళ్లపాక అన్నమాచార్యులు
318 హరి హరి జగమెఱుంగ నీ వాతుమలోనే వున్నాఁడవు
For English version press here

ఉపోద్ఘాతము

“అయ్యా, మాటిమాటికి దైవము, సత్యము — వీటిని ఎందుకు వెదుకవలెను? అవి లేక జీవనము నడవదా?” అనే ప్రశ్న సహజముగా ఉద్భవించవచ్చు. ఈ ప్రశ్నకు మనము జవాబు తెలుసుకొనవలసిందే. 

ప్రపంచమంతా ఏదో ఒక దైవశక్తి నడిపించుచున్నదని చాలా మంది విశ్వసిస్తారు. ఆ దైవము సర్వత్రా వ్యాపించి మనలను సర్వకాలములలో గమనించుచున్నదని కూడా అనేకమందికి నమ్మకం. ఈ విశ్వాసమును బలపరచుటకు అనేక దృష్టాంతములు, కథనములు తరతరాలుగా ప్రచారములో ఉన్నాయి. బాల్యము నుండే దైవభక్తి మనకు ఉగ్గు పెట్టినట్లుగా నేర్పబడింది. ఈ కారణములన్నీ కలసి మానవుడు దైవమును శరణు వేడవలసినదే అన్న భావనకు దారి తీస్తాయి.
 
అయితే మరో ప్రశ్న కూడా అడగవలసిందే — దైవము లేక సత్యము లేక మానవుడు జీవించలేడా? ఈరోజు మనకు జీవించుటకు అవసరమైన అనేక వసతులు, నైపుణ్యములు, అవకాశములు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ ప్రతి మనిషి తనలో ఏదో లోపము, ఏదో వెలితి ఉన్నదనే భావముతో జీవిస్తున్నాడు. ఈ అంతరంగ అసౌకర్యమే జీవనమును నిరంతర శ్రమగా, ప్రయత్నముగా అనిపింపజేస్తుంది.

అన్నమాచార్యులు సూచించేది ఏమనగా — ఈ నిరంతర శ్రమ, ఈ అంతరంగ అసంతృప్తి మానవుని అసహజ జీవనానికి సంకేతములు. ఈ విషయాన్ని లోతుగా పరిశీలించినపుడు జీవనమునకు దైవమునకు మధ్యనున్న అంతరము క్రమంగా కరిగిపోతుంది. అప్పుడు ఈ రెండూ వేరువేరు కావని గ్రహించగలుగుతాము.ఈ భావాన్ని సూచించే కీర్తనయే ఇది.

 

కీర్తనలోని భావపురోగతి

పల్లవి: తమలోను ప్రపంచములోను సర్వమంతా సమముగా వ్యాపించి వర్తించుచున్న ఈ బ్రహ్మము లేదా సత్యమును గుర్తించుడి.
చరణం 1: దైవము లేని చదువు; విజ్ఞతలేని పాండిత్యం; అడవులలో దారితప్పిన బాటసారివలె మనిషి మనోగతి.
చరణం 2: భక్తిలేని పూజ; అన్నము లేని భోజనం; విత్తులేని వ్యవసాయం; చుక్కాని లేని నావ.
చరణం 3: ధర్మమును బోధించని సభ; సమిధలు లేని యజ్ఞము; ఇన్నిటిలో అంతర్లీనమైన దైవమును గుర్తించలేని బతుకు.

అధ్యాత్మ​ సంకీర్తన
రేకు: 166-4 సంపుటము: 2-320
హరి హరి జగమెఱుంగ నీ వాతుమలోనే వున్నాఁడవు
సురలఁ గాచుటయు నసురల నడఁచుట చొప్పడియున్నది నీగురుతు పల్లవి॥

వేదార్థము దప్పందెలిసిన విద్వాంసునివంటిది
పాదుగఁ జదువక తర్కించఁబోవు పాండిత్యమువంటిది
మేదిని నడవులఁ దెరువుదప్పి మరి మెలఁగేటి తెరువరివంటిది
ఆదిమూర్తి నీశరణుచొచ్చి నిను నారాధించనివాని బదుకు హరి॥

వట్టిజోలితో నూరక దేవరలేని పూజవంటిది
వొట్టుక ఫలములులేని పంటలకు వొడిగట్టేయటువంటిది
నెట్టనఁ గర్ణదారుండులేని జలనిధినడిమియోడవంటిది
బట్టబయటనే పరమేశ్వర నీపై భక్తిలేనివాని బదుకు హరి॥

పొందుగ ధర్మముబోధించెడి సత్పురుషులులేని సభవంటిది
చెంది శ్రీవేంకటేశ్వర నీమహిమలు చెప్పని కథవంటిది
సందడి నన్నియుఁ జేసి దక్షిణలు చాలని యజ్ఞము వంటిది
యిందిరారమణ నీవెక్కుడనుచు నిన్నిటఁ దెలియనివాని బదుకు హరి॥
Details and Explanations:
పల్లవి:
హరి హరి జగమెఱుంగ నీ వాతుమలోనే వున్నాఁడవు
సురలఁ గాచుటయు నసురల నడఁచుట చొప్పడియున్నది నీగురుతు ॥పల్లవి॥ 
పదబంధం

అర్థం

హరి హరి జగమెఱుంగ నీ వాతుమలోనే వున్నాఁడవు
(హరి హరి=అయ్యో) అయ్యో శ్రీహరి నీవు అందరికి తెలిసేటట్లుగా మాలోనే ఉన్నాడవు
సురలఁ గాచుటయు నసురల నడఁచుట చొప్పడియున్నది నీగురుతు
దేవతలను రక్షించుట​, రాక్షసులను అణచుట తగునట్లు గావించుటలోనే నీ గురుతులున్నవి.

సూటి భావము:
అయ్యో! శ్రీహరి  నీవు అందరికి తెలిసేటట్లుగా మాలోనే ఉన్నాడవు. దేవతలను రక్షించుట, రాక్షసులను అణచుట తగునట్లు గావించుటలోనే నీ గురుతులున్నవి. (అయ్యో! శ్రీహరి నీవు అందరికి తెలిసేటట్లుగా మాలోనే ఉన్నా నిన్ను గుర్తించుటలో మేము తడబడుతూనే ఉన్నాము.)

గూఢార్థవివరణము:
జగమెఱుంగ నీ వాతుమలోనే వున్నాఁడవు = దైవము ఎక్కడో దూరముగా దాగి లేడు. మొత్తము జగము ఎరుగునట్లు అందరి ఆత్మలలో ఉన్నాడవు. అయినా నిన్ను, నీ జాడ తెలిసినవారు బహుకొద్దిమంది. ఈ భావమును అన్నమాచార్యులు మరొకచోట “బయలు మొరంగగు పరమమాయ (= తెఱచియున్నాను దాగి వుండే పరమ మాయ ఇదే)” అని చెప్పారు.

సురలఁ గాచుటయు నసురల నడఁచుట” అనే వాక్యము సరళము. అయినా, చాలాసార్లు దీనికి విరుద్ధము అనుభవములో కనబడును. సత్పురుషులు బాధపడుచూ, దుష్టులు సుఖపడుచూ కనిపించుట మనము చూస్తూనే ఉన్నాము. మనము క్రిందటి కీర్తనలో చెప్పుకున్న "లోకరంజకము తమలోనిసమ్మతము" అనగా బేషరతుగా జరుగుతున్నదానిని సమ్మతించక మనము ఎంతోకొంత సంతోషమో, బాధయో, కష్టామో పడినను సర్దిచెప్పుకోలేము.
 
ఇంకా గమనిస్తే“సురుడు–అసురుడు” అనే నిర్ణయములు కూడా మన దృష్టికోణమునకు సంబంధించినవి. అసలు ఈ అధారంలేని అభిప్రాయములే పైన చెప్పుకున్న మనస్తాపమునకు కారణము. ఈ అనియంత్రిత సంగముల ప్రభావములతో మన జీవనము లోక రంజకమే కాదు, మనకై మనకు కూడా రంజకము కాకుండా పోవుచున్నది.

పల్లవిని తిరిగి తిరిగి పరిశీలించినపుడు, అన్నమాచార్యులు ఒకవైపు దైవమును కీర్తించినట్లు కనబడినప్పటికీ, మరోవైపు మన గ్రహింపు పరిమితిని గుర్తించమని సూచిస్తున్నారు. ఈ జగత్తులో ఒక గూఢమైన క్రమము పనిచేస్తూనే ఉంది. అదే ధర్మాన్ని నిలుపుతుంది. కానీ మనం మన అభిప్రాయాల ప్రకారం ప్రపంచాన్ని కొలుస్తూ ఉండటంవల్ల, ఆ క్రమంలో పనిచేస్తున్న “నీ గురుతు”లను గుర్తించలేకపోతున్నాము.

ఈ విధముగా చూస్తే, ఈ పల్లవి ఒక సరళమైన భక్తి వాక్యముగా కాక, మన గ్రహింపు పరిమితిని గుర్తు చేసే ఒక లోతైన పరిశీలనగా కూడా అర్థమవుతుంది.

మొదటి చరణం:
వేదార్థము దప్పందెలిసిన విద్వాంసునివంటిది
పాదుగఁ జదువక తర్కించఁబోవు పాండిత్యమువంటిది
మేదిని నడవులఁ దెరువుదప్పి మరి మెలఁగేటి తెరువరివంటిది
ఆదిమూర్తి నీశరణుచొచ్చి నిను నారాధించనివాని బదుకు హరి॥ 
Telugu Phrase
Meaning
వేదార్థము దప్పందెలిసిన విద్వాంసునివంటిది
వేదము, వేదార్థములు జగమెరిగిన సత్యములు. అవి"తప్పు" అని చెప్పు విద్వాంసుడు విద్వాంసుడుకాడు.
పాదుగఁ జదువక తర్కించఁబోవు పాండిత్యమువంటిది
మూలము వరకు చదువక తర్కించఁబోవు పాండిత్యము పామరత్వము వంటిది.
మేదిని నడవులఁ దెరువుదప్పి మరి మెలఁగేటి తెరువరివంటిది
భూమిలోని అడవులలో దారితప్పి ఎటుపోవుటయో నిర్ణయించలేని బాటసారి వంటిది.
ఆదిమూర్తి నీశరణుచొచ్చి నిను నారాధించనివాని బదుకు
ఆదిమూర్తియైన నీశరణుచొచ్చి నిను నారాధించనివాని బదుకు కొరగానిది. పనికిరానిది.  అస్తవ్యస్తము.
సూటి భావము:
వేదము, వేదార్థములు జగమెరిగిన సత్యములు. అవి"తప్పు" అని చెప్పు విద్వాంసుని విద్వత్తు కొరగానిది. మూలము వరకు చదువక తర్కించఁబోవు పాండిత్యము పామరత్వము వంటిది. పనికిరానిది. భూమిలోని అడవులలో దారితప్పి ఎటుపోవుటయో నిర్ణయించలేని బాటసారి వంటిది. అస్తవ్యస్త హృదయము వంటిది. ఆదిమూర్తియైన నీశరణుచొచ్చి నిను నారాధించనివాని బదుకు కొరగానిది. పనికిరానిది.  అస్తవ్యస్తము.

గూఢార్థవివరణము:

వేదార్థము దప్పందెలిసిన విద్వాంసునివంటిది: మానవ జన్మంతా ఫలానాది తప్పు అని నిరూపించడంలో గడిపి ఏమి ప్రయోజనము. అదీ సులభంగా అర్ధంకాని వేదాలు, వేదార్థములలో తప్పులు చూపి ఏమి సాధించుదుము?
 
పాదుగఁ జదువక తర్కించఁబోవు పాండిత్యమువంటిది:  సరియైన సంసిద్ధతలేక తర్కించబోవడం అనుచితము. పైగా వాదవివాదములలో అంతిమము అని ఉండదు. అట్టి వానిలో చిక్కుట ఎందుకు?  
 
మేదిని నడవులఁ దెరువుదప్పి మరి మెలఁగేటి తెరువరివంటిది” దారితప్పిన బాటసారి అడవిలో ఎటు వెళ్లాలో తెలియక తర్జనభర్జన పడినట్లే, నిజమైన ఆధారం లేకుండా జీవించు మనస్సు కూడా అటువంటిదే. ఎటు పోవాలో తెలియక గందరగోళములో పడుతుంది.
 
ఆదిమూర్తి నీ శరణుచొచ్చి నిను నారాధించనివాని బదుకు” అనగా జీవనమునకు ఒక మూలాధారము అవసరము. ఆ మూలాన్ని గ్రహించకపోతే జ్ఞానం, తర్కము, పాండిత్యము అన్నీ వ్యర్థమే. ఆత్మపరీక్షలేని - ఎందుకు జీవిస్తున్నామో తెలియని జీవనము దారితప్పిన ప్రయాణము.

ఇక్కడ కవి పాండిత్యమును, జ్ఞానమును తప్పుబట్టుట లేదు. జీవనమునకు ఆధారమైన సత్యమును గుర్తించనిదే మనిషి జీవితం బాహ్యముగా ఎంత గొప్పగా ఉంచుటకు ప్రయత్నించినప్పటికి లోలోపలి అస్తవ్యస్తము అలాగానే ఉంటుంది.

Top of Form

Bottom of Form

రెండవ​ చరణం:
వట్టిజోలితో నూరక దేవరలేని పూజవంటిది
వొట్టుక ఫలములులేని పంటలకు వొడిగట్టేయటువంటిది
నెట్టనఁ గర్ణదారుండులేని జలనిధినడిమియోడవంటిది
బట్టబయటనే పరమేశ్వర నీపై భక్తిలేనివాని బదుకు హరి॥
Telugu Phrase
Meaning
వట్టిజోలితో నూరక దేవరలేని పూజవంటిది
(వట్టిజోలితో: జోలి= సంచి; వట్టిజోలి = ఏమీ లేని సంచి; వట్టిజోలితో = లోపలి అత్మన్యూనతతో = వట్టి స్వీయ జాలితో, ఊరక​=అవసరములేకయే) పనికిరాని స్వీయ జాలితో దైవమును స్మరింపకయే చేయు పూజవంటిది
వొట్టుక ఫలములులేని పంటలకు వొడిగట్టేయటువంటిది
(ఒడిగట్టు= కూడని పనులకు పాల్పడు) పట్టుపట్టి ఫలములులేని పంటలకు ఒడిగట్టేయటువంటిది
నెట్టనఁ గర్ణదారుండులేని జలనిధినడిమియోడవంటిది
(గర్ణదారుండులేని= నావికుడులేని) సముద్రమునడుమలో నావికుడులేని ఓడ వంటిది
బట్టబయటనే పరమేశ్వర నీపై భక్తిలేనివాని బదుకు
బట్టబయటనే పరమేశ్వర నీపై భక్తిలేనివాని బదుకు

సూటి భావము:
పనికిరాని స్వీయ జాలితో దైవమును స్మరింపకయే వట్టి చేతులుచాచి చేయు పూజవంటిది. ఆ పూజ అనర్హము. పట్టుపట్టి ఫలములులేని పంటలకు ఒడిగట్టేయటువంటిది. అది వృథా ప్రయాస మాత్రమే. సముద్రమునడుమలో నావికుడులేని ఓడ వంటిది. అది అగమ్యము. బట్టబయటనే  (అనగా ఆ భగవంతునికి చెందనిది అని) పరమేశ్వర నీపై భక్తిలేనివాని బదుకు.

గూఢార్థవివరణము:
 
వట్టిజోలితో నూరక దేవరలేని పూజవంటిది” మనిషి అంతరంగములోని వెలితిని నింపుకొనుటకై కొన్నిసార్లు పూజలు, దానములు, సామాజిక సేవలు చేపడతాడు. కానీ దైవస్మరణ లేకుండా, అంతరంగములోని లోటును గ్రహించ కుండా కేవలం చేతులుచాచి చేయు కార్యము వట్టి ఆచారముగా మిగులుతుంది. ఇక్కడ కవి భక్తిని కానీ అయా కార్యములను కానీ విమర్శించుట లేదు; అయా కార్యములను చేపట్టుటకు ప్రోద్బలములను పరిశీలించమని సూచిస్తున్నారు.

వొట్టుక ఫలములులేని పంటలకు వొడిగట్టేయటువంటిది” మనుష్య జీవితం స్వల్పమని అందరికి తెలిసినా మనము దీర్ఘకాలపు ప్రణాళికలు చేస్తూనే ఉంటాము. ఫలములను పూర్తిగా అనుభవించలేమని తెలిసినా మరొక పంటకు ఒడిగడతాము. ఇలా తెలిసి పాల్పడడము నేమనవచ్చు? దుఃఖమా? దురాశా?
 
నెట్టనఁ గర్ణదారుండులేని జలనిధినడిమియోడవంటిది” “సంసార సముద్రము తెలియనంత విస్తారమైనది. ఎంత ప్రయాణించినా ఆ సముద్రము మధ్యలోనే తిరుగుతూనే ఉంటాడు. చుక్కానితో దారిని నియంత్రించు నావికుడు లేని నడిసంద్రపు ఓడ దారికై తర్జనభర్జనపడినట్లు, స్పష్టమైన దిశలేని జీవనపు చిరునామా గందరగోళము.
 
బట్టబయటనే పరమేశ్వర నీపై భక్తిలేనివాని బదుకు” ఈ ఉపమానముల ద్వారా స్థిర దిశలేని జీవనము లోని అస్తవ్యస్తమునకు సంకేతము అని కవి అన్నారు. బహు కార్యములలో తగులుకొనుట​, సూక్ష్మ బుద్ధిలేక ఒడంబడికగా కార్యములు చేపట్టుట​, అంతరంగములోని ​ గజిబిజి యొక్క బాహ్యరూపములు.

మూడవ​​ చరణం: 
పొందుగ ధర్మముబోధించెడి సత్పురుషులులేని సభవంటిది
చెంది శ్రీవేంకటేశ్వర నీమహిమలు చెప్పని కథవంటిది
సందడి నన్నియుఁ జేసి దక్షిణలు చాలని యజ్ఞము వంటిది
యిందిరారమణ నీవెక్కుడనుచు నిన్నిటఁ దెలియనివాని బదుకు హరి॥
Telugu Phrase
Meaning
పొందుగ ధర్మముబోధించెడి సత్పురుషులులేని సభవంటిది
చక్కగా ధర్మముబోధించెడి సత్పురుషులులేని సభవంటిది
చెంది శ్రీవేంకటేశ్వర నీమహిమలు చెప్పని కథవంటిది
శ్రీవేంకటేశ్వర నీమహిమలు చెప్పని కథలవంటిది నీకు చెందని బతుకు
సందడి నన్నియుఁ జేసి దక్షిణలు చాలని యజ్ఞము వంటిది
ఆర్భాటముగా అన్నీ చేసి చివరకు యజ్ఞము చేయించు బ్రహ్మలకు, వేంచేసిన ఆహుతులకు దక్షిణలు తగినంతగా సమర్పించుకోని యజ్ఞము వంటిది
యిందిరారమణ నీవెక్కుడనుచు నిన్నిటఁ దెలియనివాని బదుకు హరి॥
అన్నిటిలోనూ ప్రకాశించు యిందిరారమణా నీవు సర్వాంతర్యామివని దెలియనివాని బదుకు
సూటి భావము:
చక్కగా ధర్మముబోధించెడి సత్పురుషులులేని సభవంటిది - శ్రీవేంకటేశ్వర నీమహిమలు చెప్పని కథలవంటిది నీకు చెందని బతుకు. ఆర్భాటముగా అన్నీ చేసి చివరకు యజ్ఞము చేయించు బ్రహ్మలకు, వేంచేసిన ఆహుతులకు దక్షిణలు తగినంతగా సమర్పించుకోని యజ్ఞము వంటిది - అన్నిటిలోనూ ప్రకాశించు యిందిరారమణా నీవు సర్వాంతర్యామివని దెలియనివాని బదుకు

గూఢార్థవివరణము:
 
చెంది శ్రీవేంకటేశ్వర నీమహిమలు చెప్పని కథవంటిది: ఇది జాగ్రత్తగా గమనించవలసిన విషయం. ఉపోద్ఘాతములో చెప్పినట్లు జీవనమునకు దైవమునకు మధ్య అసలు అంతరము లేదు. అదే సత్యమును గ్రహించిన వాని జీవితం. కానీ శ్రీవేంకటేశ్వరునికి చెందని బతుకు ఆ జీవనమునకు దైవమునకు మధ్య అంతరమును మరింత పెంచుతుంది.

“యిందిరారమణ నీవెక్కుడనుచు నిన్నిటఁ దెలియనివాని బదుకు” ఈ పంక్తికి అర్థం చాలా గహనమైనది. ఇది కేవలం బయట కనబడుతున్న దానిని, అద్దానిని పరికించు దానిని తెలియవలెను. కనబడుతున్నది పరికించునది, రెండు బాహ్య  విషయములే. విద్యుత్త ఏ రకముగా తీగల పైతలముననే ప్రవహించునో, ఇవి కూడా అంతే.

సత్యము అతి నాజూకైన, పారదర్శకమైన​ ద్రవమువంటి అస్తిత్వము. ద్రవము ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారాన్ని ఆపాదించుకున్నట్లు, మనము ఏ విధముగా ఊహించుకుంటామో ఆ విధమైన రూపాలలోనే సత్యము మనకు కనిపించును. అది ప్రపంచమంతా వ్యాపించి ఉన్నా, అణువణువులో దాగి ఉన్నా, మనకు గోచరమగునది బాహ్య  విషయము మాత్రమే.
 
మనసు ఏ విషయముపై లగ్నమైతే, ఆ దాని రూపంలోనే సత్యము మనకు ప్రతిబింబించినట్లుగా అనిపిస్తుంది. కానీ అది తన అసలు స్వరూపాన్ని పూర్తిగా బయటపెట్టదు. తాడు పాములాగా కనబడుట, చీకటిలో కొన్ని వస్తువులు భయంకరంగా అనిపించుట వంటి ఉదాహరణలు దీనిని సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. ఇవి అన్నీ దృశ్య ప్రపంచంలోనివి.

ఈ విధంగా చూసే దృశ్యము గాని, మనోదృశ్యము గాని సత్యమును గుర్తించుట మనకు అసంభవమే. కానీ కవి నీవెక్కుడు (దైవము లేదా తెలియనిది ముఖ్యము) అంటున్నారు. కాబట్టి సమస్య మన దృక్కోణమే. జాగ్రత్తగా గమనిస్తే “నీవెక్కుడనుచు నిన్నిటఁ” అన్నది తెలిసిన దానిలోను తెలియనిదానిలోను రెంటిలోనూ సమముగా ఉన్నది సత్యమని సూచిస్తుంది. దీని నుండి గ్రహించవలసినది ఏమనగా — మానవుడు తెలిసిన పరిధిలో ఉన్నదానినే గ్రహించగలడు; తెలియని పరిధిలో ఉన్నదానిని తెలుసుకొనుట అతని శక్తికి అందదు. ఈ కారణంగానే “నీవెక్కుడనుచు నిన్నిటఁ” అన్న వాక్యము మరింత గహనమైన సూచనగా నిలుస్తుంది.

అందుచేత సత్యమును పూర్తిగా నిర్ధారించుటకు మానవుని వద్ద సరిపడిన సాధనములు లేవు. “సత్యము ఉందని” గాని “లేదని” గాని నిరూపించుటకు మనము చేసే యత్నములు చాలాసార్లు మనల్ని మరొక గందరగోళములోకి నెట్టివేయగలవు. ఈ స్థితిని గుర్తించుటలోనే కవి సూచించిన వినయం దాగి ఉన్నది.

1 comment:

  1. సత్యం అసత్యం...ఇవి పదాలు మాత్రమే కాదు.. వీటిలో దేనికి మనము ప్రాధాన్యత ఇస్తునతన్నోమో దాన్ని బట్టే మన జీవితం ప్రయాణం ఆధారపడి ఉంటుందని కిలోలు అన్నమాచార్యుల వారి ఉద్దేశ్యం.అనవసరమైన వాటి వెనుక పడక భగవంతుని పాద పద్మాలు ఆశ్రయించాలని సూటిగా చెబుతున్నారు ఆచార్యులు వారు...ఈ కీర్తనలకు మరింత శోభ చేకూర్చారు మిత్రులు శ్రీ శ్రీనివాసులు గారు తమ విశ్లేషణలో... ధన్యవాదములు సార్...
    శ్రీనివాస్ రాయవరపు
    07-4-2025
    బెంగళూరు

    ReplyDelete

T-317 అచ్చుత మిమ్ముఁ దలఁచే యంతపని వలెనా

  తాళ్లపాక అన్నమాచార్యులు 317 అచ్చుత మిమ్ముఁ దలఁచే యంతపని వలెనా