తాళ్లపాక అన్నమాచార్యులు
15 కంచూఁ గాదు పెంచూఁ గాదు కడుఁబెలుచు మనసు
ఉపోద్ఘాతము
మనస్సు
ఆలోచిస్తుంది, ఊహిస్తుంది, గుర్తుంచుకుంటుంది,
కోరుకుంటుంది, నిర్ణయిస్తుంది, అనుభవిస్తుంది. ఇంద్రియాల ద్వారా విషయాలను గ్రహిస్తుంది. సుఖదుఃఖాలను
అనుభవిస్తుంది. నమ్ముతుంది, ఆశిస్తుంది, భయపడుతుంది, స్పందిస్తుంది. అయితే ఇవన్నీ
చేస్తున్నది ఏమిటి? దాని స్వభావం ఏమిటి? అనే ప్రశ్నలకు మాత్రం ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు.
మనస్సును
అర్థం చేసుకోవడానికి తత్వశాస్త్రం, మతం, మనోవిజ్ఞానశాస్త్రం, జ్ఞానశాస్త్రం
వంటి అనేక రంగాలు ప్రయత్నిస్తున్నాయి. కొందరు దానిని ఒక పదార్థంగా చూశారు.
మరికొందరు దానిని ఆలోచన, జ్ఞాపకం, ఊహ,
సంకల్పం వంటి సామర్థ్యాల సమాహారంగా వివరించారు. అయినప్పటికీ మనస్సు
పూర్తిగా మనకు గోచరమైనది కాలేదు. మనం దాని కదలికలను అనుభవిస్తున్నాము; కానీ అది ఎలా పనిచేస్తుందో సంపూర్ణంగా పట్టుకోలేకపోతున్నాము.
మానవులు
తమ మనస్సులో ఉన్నదాన్ని ఉన్నట్లుగా వ్యక్తం చేయలేకపోవడంతో, దానికి సమీపమైన ప్రతినిధులుగా భాష, బొమ్మ, చిహ్నం, ఆనవాలు వంటి
వాటికి ప్రాముఖ్యత ఏర్పడింది. పోనుపోను ఆ చిహ్నాలు, సంకేతాలు,
ప్రతీకలు, లాంఛనాలే ముఖ్యమైపోయాయి. వాస్తవం
కంటే దాని ప్రాతినిధ్యాన్నే మనిషి ఎక్కువగా ఇష్టపడటం ప్రారంభించాడు. ఫలితంగా,
వాస్తవాన్ని చూడటానికి ఉపయోగపడవలసిన ప్రతినిధులే కొన్నిసార్లు
వాస్తవానికి బదులుగా నిలిచిపోయాయి.
ఈ
విషయాన్ని అర్థం చేసుకోవడానికి చిత్రకారుడు రెనే మాగ్రిట్ వేసిన ప్రసిద్ధ అధివాస్తవిక
చిత్రం “ఇది పైపు కాదు” (This Is
Not a Pipe) ఒక మంచి ఉదాహరణ.
చిత్రంలో
కనిపించేది ఒక పైపు. దానిని చూస్తే అది పైపే అనిపిస్తుంది. కానీ ఆ చిత్రంలో పొగాకు
నింపలేము. దానిని వెలిగించలేము. దాని నుండి పొగ రావడం సాధ్యం కాదు. ఎందుకంటే అది
పైపు కాదు — పైపు యొక్క చిత్రం మాత్రమే.
అయినా
మనం దానిని పైపుగా గుర్తిస్తాము. వాస్తవ వస్తువుకూ, దాని చిత్రానికీ మధ్య ఉన్న తేడాను తెలిసినప్పటికీ, మనస్సు
ఆ ప్రతినిధిని వాస్తవ వస్తువుతో కలిపివేస్తుంది.
మాగ్రిట్
భాషకు, దృశ్యప్రతినిధిత్వానికి సంబంధించిన
మన అలవాట్లను ప్రశ్నించాడు. ఒక వస్తువు పేరు ఆ వస్తువు కాదు. ఒక చిత్రం ఆ వస్తువు
కాదు. అయినప్పటికీ పేరు, చిత్రం, చిహ్నం
— ఇవన్నీ మన అనుభవంలో అసలు వస్తువుల స్థానాన్ని ఆక్రమించగలవు.
ఈ
సందర్భంలో ఆ చిత్రాన్ని ప్రస్తావించడానికి కారణం ఇదే: మనస్సు కూడా వాస్తవాన్ని
నేరుగా స్వీకరించకుండా, దానికి సంబంధించిన మనోచిత్రాల
ద్వారా ఊహలను నిర్మించుకుంటుంది. ఆ ఊహాలోకాలలోనే మనము జీవిస్తున్నాము.
ఊహలు
లేకుండా ప్రపంచం నడవదు. కానీ ఊహలే ప్రపంచం అని అనుకోరాదు.
ఈ
కీర్తనలో అన్నమాచార్యులు మనస్సు గురించి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించరు. మనస్సు
ఎలా ఏర్పడుతుంది, ఎలా ఆకర్షితమవుతుంది, ఎలా తనకు తానే రూపాలను నిర్మించుకుంటుంది అనే కదలికను మన ముందుంచుతారు.
మనం దానిని చదవడం మాత్రమే కాదు — మనలో అదే కదలిక జరుగుతున్నదేమో గమనించాలి.
|
అధ్యాత్మ
సంకీర్తన
|
|
రాగి రేకు: 104-3 సంపుటము - సంకీర్తన: 2-21
|
|
కంచూఁ గాదు పెంచూఁ గాదు కడుఁబెలుచు మనసు యెంచరాదు పంచరాదు యెట్టిదో యీమనసు ॥పల్లవి॥ పట్టఁ బసలేదు చూడ బయలుగాదీమనసు నెట్టనఁ బారుచునుండు నీరూఁ గాదీమనసు చుట్టిచుట్టి పాయకుండుఁ జుట్టమూఁ గాదీమనసు యెట్టనెదుటనే వుండు నేఁటిదో యీమనసు ॥కంచూఁ॥ రుచు లెల్లాఁ గానుపించు రూపు లేదు మనసు పచరించు నాసలెల్లాఁ బసిఁడి గాదీమనసు యెచటాఁ గరఁగదు రాయీఁ గాదు మనసు యిచటా నచటాఁ దానే యేఁటిదో యీమనసు ॥కంచూఁ॥ తప్పక నాలోనుండు దైవముఁ గాదు మనసు కప్పిమూఁటగరాట్టదు గాలీఁ గాదు మనసు చెప్పరానిమహిమలశ్రీవేంకటేశుఁ దలఁచి యిప్పుడిన్నిటా గెలిచె నేఁటిదో యీమనసు ॥కంచూఁ॥
|
Details
and Explanations:
పల్లవి:
కంచూఁ గాదు
పెంచూఁ గాదు కడుఁబెలుచు మనసు
యెంచరాదు
పంచరాదు యెట్టిదో యీమనసు ॥పల్లవి॥
|
పదము
|
అర్థము
|
|
కంచూఁ
గాదు
|
కంచు కాదు; కంచు
వంటి లోహపదార్థం కాదు
|
|
పెంచూఁ
గాదు
|
పెంచగలిగేది కాదు; పెంపుడు జంతువులా మనకు నచ్చినట్లు తీర్చిదిద్దలేము
|
|
కడుఁబెలుచు
|
అత్యంత కఠినమైనది; కఠిన స్వభావము కలది
|
|
మనసు
|
మనస్సు; ఆలోచన, ఊహ,
జ్ఞాపకం, కోరిక, అభిప్రాయం,
భావోద్వేగం, అంతర్గత కదలిక
|
|
యెంచరాదు
|
లెక్కించలేము; కొలవలేము;
అంచనా వేయలేము; పూర్తిగా ఊహించలేము; నిర్ణయించలేము
|
|
పంచరాదు
|
పంచలేము; ఉన్నదున్నట్లుగా
మరొకరికి తెలియజేయలేము; విభజించలేము
|
|
యెట్టిదో
|
ఎటువంటిదో; ఏ
స్వభావమో; అసలు ఏమిటో
|
|
యీమనసు
|
ఈ మనస్సు
|
భావము:
మనస్సు
కంచు వంటి లోహము కాదు. మనకు నచ్చినట్లు పెంచి, తీర్చిదిద్దగలిగే
పెంపుడు జంతువూ కాదు. అది అత్యంత కఠినమైనది. దాని స్వభావాన్ని పూర్తిగా అంచనా
వేయలేము. దాన్ని ఉన్నది ఉన్నట్లుగా మరొకరితో పంచుకోలేము. అసలు ఈ మనస్సు ఎటువంటిదో
తెలియదు.
గూఢార్థవివరణము:
“మనస్సును
తన భౌతిక ప్రకృతిలోని ఒక అంశంగా భగవానుడు భగవద్గీత 7-4లో
పేర్కొనడం గమనార్హం. అయిదు మూలకములతో పాటు మనస్సు, బుద్ధి,
అహంకారములను కూడా తన అష్టవిధ ప్రకృతిలో భాగాలుగా ఆయన పేర్కొంటాడు.
అంటే మనస్సు మనిషి వ్యక్తిగత సృష్టి కాదు; అది
విశ్వప్రకృతిలోని ఒక అంశం. అయితే జీవించే శరీరంతో సంబంధం ఏర్పడినప్పుడు అది
వ్యక్తిగత అనుభవంగా, ఆలోచనగా, కోరికగా,
జ్ఞాపకంగా, అభిప్రాయంగా పనిచేస్తుంది.
అందువల్ల మనం దానిని “నా మనస్సుగా” అనుభవిస్తాము (భగవద్గీత 5-14).
“మనస్సు కంచు వంటి పదార్థం కాదు. మనకు నచ్చినట్లు పెంచి, తీర్చిదిద్దగలిగే పెంపుడు జంతువూ కాదు. అది అత్యంత కఠినమైనది. దాని
స్వభావాన్ని పూర్తిగా అంచనా వేయలేము. దానిలో ఉన్నదాన్ని ఉన్నట్లుగా మరొకరితో
పంచుకోలేము. అసలు ఈ మనస్సు ఎటువంటిదో తెలియదు“ అంటారు
అన్నమాచార్యులు.
అయితే
మనస్సు మనలో పనిచేస్తున్నందువల్ల అది మనకు పూర్తిగా స్వంతమైనదైపోదు. అది
ప్రకృతిలోని ఒక అంశమే. దాని చలనములు అంతులేనివిగా అనిపించినా, “దైవముఁ గాదు మనసు” అని అన్నమాచార్యులు అంటారు.
ఇంకా
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, దైవము గురించి మాట్లాడగలిగిన
అన్నమాచార్యులు, మనస్సును మాత్రం తెలియదని చెప్పడం. శ్రీ
వేంకటేశుని మహిమలను వర్ణించిన కవి, మనస్సు విషయానికి
వచ్చేసరికి — “యెట్టిదో యీమనసు” అని ప్రశ్నను మిగిల్చారు.
ఇది ఆయనకు మనస్సు గురించి ఏమీ తెలియదని కాదు; మనస్సును ఒక
నిర్వచనంలో, ఒక రూపంలో, ఒక నిర్ధారణలో
బంధించలేమని అర్ధం.
అందుకే
పల్లవిలోని ప్రశ్న సాధారణమైనది కాదు. దానిని అర్థం చేసుకోవడానికి మనం చేసే ప్రతి
ప్రయత్నము దానిని తాకలేక జారిపోతున్నట్లు చూపిస్తారు. అందుకే చివరికి మిగిలేది ఒకే
ప్రశ్న “యెట్టిదో యీమనసు”
మొదటి చరణం:
పట్టఁ బసలేదు
చూడ బయలుగాదీమనసు
నెట్టనఁ
బారుచునుండు నీరూఁ గాదీమనసు
చుట్టిచుట్టి
పాయకుండుఁ జుట్టమూఁ గాదీమనసు
యెట్టనెదుటనే
వుండు నేఁటిదో యీమనసు ॥కంచూఁ॥
|
పదము
|
అర్థము
|
|
పట్టఁ
బసలేదు
|
పట్టుకోడానికి ఆధారం లేదు; ఒకచోట నిలిచేది కాదు
|
|
చూడ
|
పరిశీలించి చూడగా
|
|
బయలుగాదు
|
బయటపడదు;
తనను తెలియనివ్వదు; బహిరంగంగా కనిపించదు
|
|
ఈ మనసు
|
ఈ మనస్సు
|
|
నెట్టనఁ
బారుచునుండు
|
అనివార్యముగా, అవశ్యముగా,
తప్పక, పాడిదప్పక, నిరంతరం
ప్రవహిస్తూ ఉంటుంది; ఒక దిశ అంటూ లేక సాగుతుంది
|
|
నీరూఁ
గాదు
|
అయితే అది నీరు కాదు; ప్రవహించే ద్రవపదార్థం కాదు
|
|
చుట్టిచుట్టి
|
చుట్టూ చుట్టూ తిరుగుతూ
|
|
పాయకుండుఁ
|
విడిచిపెట్టకుండా; ఎడతెగకుండా
|
|
జుట్టమూఁ
గాదు
|
బంధువు కాదు; చుట్టరికంతో
సంబంధం కలిగినది కాదు; హితుడు అని చెప్పలేము
|
|
యెట్టనెదుటనే
|
ఎక్కడ చూసినా ఎదుటనే; ఎల్లప్పుడూ సమీపంలోనే
|
|
వుండు
|
ఉంటుంది; నిలిచి
ఉంటుంది
|
|
నేఁటిదో
|
ఎటువంటిదో; అసలు
ఏమిటో
|
|
యీమనసు
|
ఈ మనస్సు
|
భావము:
ఈ
మనస్సును పట్టుకోవడానికి ఒక స్థిరమైన ఆధారం లేదు. ఎక్కడ ఉంటుందో చెప్పలేము.
పరిశీలనకు స్పష్టంగా బయటపడదు. నిరంతరం, అవశ్యముగా ప్రవహించే నీటిలా కదులుతూనే ఉంటుంది; అయితే
అది నీరు కాదు. మన చుట్టూ తిరుగుతూ, మనలను విడిచిపెట్టకుండా
ఉంటుంది; అయినా అది మన బంధువు కాదు. హితుడు అని చెప్పలేము.
ఎప్పుడైనా ఎక్కడైనా ఎదుటనే ఉన్నప్పటికీ, అసలు ఈ మనస్సు
ఎటువంటిదో తెలియదు.
గూఢార్థవివరణము:
మనస్సును
పూర్తిగా ఒడిసిపట్టుకోవడానికి మనిషి చేసే ప్రయత్నాల పరిమితులను అన్నమాచార్యులు ఈ
చరణంలో చూపిస్తున్నారు. అది ఎక్కడ ఉంటుందో నిర్దిష్టంగా చెప్పలేము;
పరిశీలనకు పూర్తిగా బయటపడదు; అవశ్యముగా,
నిరంతరంగా ప్రవహించే దాని కదలికను ఆపలేము. అది మనలను చుట్టుముట్టి,
విడిచిపెట్టకుండా పనిచేస్తున్నప్పటికీ, మనకు
తెలిసిన బంధువులా దానిని హితకారిగా స్వీకరించలేము. అత్యంత సమీపంలోనే ఉన్నా,
పూర్తిగా పరిచితమైనది కాదు. ఈ విధంగా మనస్సును నిర్వచించడానికి,
పట్టుకోవడానికి, పూర్తిగా గ్రహించడానికి మనం
చేసే ప్రతి ప్రయత్నమూ ఒక పరిమితిని ఎదుర్కొంటుంది. చివరికి మిగిలేది — “యెట్టిదో యీమనసు” అనే ప్రశ్నే.
రెండవ చరణం:
రుచు లెల్లాఁ
గానుపించు రూపు లేదు మనసు
పచరించు
నాసలెల్లాఁ బసిఁడి గాదీమనసు
యెచటాఁ గరఁగదు
రాయీఁ గాదు మనసు
యిచటా నచటాఁ
దానే యేఁటిదో యీమనసు ॥కంచూఁ॥
|
పదము
|
అర్థము
|
|
రుచు లెల్లాఁ
|
అన్ని రుచులు; అన్ని
ఇష్టాలు, అనుభూతులు
|
|
గానుపించు
|
అనుభవంలోనికి తెప్పించును
|
|
రూపు లేదు
|
ఒక నిర్దిష్టమైన రూపం లేదు
|
|
మనసు
|
మనస్సు
|
|
పచరించు
|
సంచరించు; తిరుగు;
విస్తరించు
|
|
నాసలెల్లాఁ
|
కోరికలన్నింటిలో; ఆశలన్నింటిలో
|
|
బసిఁడి గాదు
|
బంగారం కాదు; విలువైన
పదార్థంగా పట్టుకోలేము
|
|
యెచటాఁ
|
ఎక్కడ
|
|
గరఁగదు
|
కరగదు; మారదు; లొంగదు
|
|
రాయీఁ గాదు
|
రాయి కాదు
|
|
యిచటా నచటాఁ
|
ఇక్కడా అక్కడా; అన్ని చోట్లా
|
|
దానే
|
అదే; తానే
|
|
యేఁటిదో
|
ఎటువంటిదో; అసలు
ఏమిటో
|
|
యీమనసు
|
ఈ మనస్సు
|
మనస్సు
అన్ని రుచులనూ, అనుభూతులనూ అనుభవంలోకి తెస్తుంది;
అయినప్పటికీ దానికి ఒక నిర్దిష్టమైన రూపం లేదు. రూపం లేకున్నా
అనుభవాలకు రూపమిస్తుంది. ఆశలను పండిస్తుంది; కానీ బంగారంలా
దానికి విలువను ఆపాదించలేము. మన కష్టాలకు, కన్నీళ్లకు కరగదు;
కానీ రాయి కాదు. ఇటువైపు, అటువైపు—అంతటా తానే
పనిచేస్తూ ఉంటుంది. అయినా ఈ మనస్సు అసలు ఎటువంటిదో తెలియదు.
గూఢార్థవివరణము:
ఈ
చరణంలో ఆ పరిశీలన మరింత లోతుకు వెళుతుంది. మనస్సు అన్ని రుచులను అనుభవింపజేస్తుంది; కోరికలన్నింటిలోనూ సంచరిస్తుంది. అయినప్పటికీ ఆ అనుభవాల వెనుక ఉన్న
మనస్సుకు ఒకే ఒక రూపాన్ని చూపించలేము. రూపం లేని మనస్సే అనుభవాలకు రూపాలను
ఇస్తుంది; కోరికలకు ఆకారమిస్తుంది; వాటికి
విలువను ఆపాదిస్తుంది.
అందువల్ల
మనస్సును ఒక పదార్థంగా, ఒక రూపంగా, ఒక
స్థిరమైన స్వభావంగా నిర్ణయించాలనే ప్రయత్నం మళ్లీ విఫలమవుతుంది. అది అన్ని
అనుభవాలలో పనిచేస్తున్నప్పటికీ, స్వయంగా మాత్రం పట్టుబడదు.
అందుకే అన్నమాచార్యులు మళ్లీ అదే ప్రశ్నకు వస్తారు: “యేఁటిదో
యీమనసు.”
మూడవ చరణం:
తప్పక నాలోనుండు
దైవముఁ గాదు మనసు
కప్పిమూఁటగట్టరాదు
గాలీఁ గాదు మనసు
చెప్పరానిమహిమలశ్రీవేంకటేశుఁ
దలఁచి
యిప్పుడిన్నిటా
గెలిచె నేఁటిదో యీమనసు ॥కంచూఁ॥
|
పదము
|
అర్థము
|
|
తప్పక
|
నిశ్చయంగా;తప్పకుండా.
|
|
నాలోనుండు
|
నాలో ఉండేది; నా
అంతరంగంలో పనిచేసేది
|
|
దైవముఁ
గాదు
|
దైవం కాదు
|
|
మనసు
|
మనస్సు
|
|
కప్పిమూఁటగట్టరాదు
|
కప్పిమూఁటగట్టలేము
|
|
గాలీఁ
గాదు
|
అయితే అది గాలి కాదు
|
|
చెప్పరాని
మహిమల
|
వర్ణించలేని మహిమలు కలిగిన
|
|
శ్రీవేంకటేశుఁ
|
శ్రీ వేంకటేశుని
|
|
దలఁచి
|
తలచి; స్మరించి; ధ్యానించి
|
|
యిప్పుడిన్నిటా
|
ఇప్పుడు వీటన్నింటిలో; ఈ సమస్తంలో
|
|
గెలిచె
|
ఇక్కడ “జయించె” అనే అర్థంలో కాదు; పోయె, తొలగిపోయె,
దూరమాయె అనే భావంలో.
|
|
నేఁటిదో
|
ఎటువంటిదో; అసలు
ఏమిటో
|
|
యీమనసు
|
ఈ మనస్సు
|
భావము:
మనస్సు
తప్పకుండా నాలోనే ఉంటుంది; అయినప్పటికీ అది దైవం కాదు. దానిని
కప్పి మూయలేము; అయితే అది గాలి కాదు. వర్ణించలేని మహిమలు
కలిగిన శ్రీ వేంకటేశుని తలచి, ఇప్పుడు ఈ దృశ్యప్రపంచ
సంబంధాలన్నీ తొలగిపోయినవి. అయినప్పటికీ అసలు ఈ మనస్సు ఎటువంటిదో తెలియదు.
ఇక్కడ “గెలిచె” అనే పదాన్ని జయించె అనే అర్థంలో తీసుకోరాదు. అలా తీసుకుంటే
చివరలోని “యేఁటిదో యీమనసు” అనే ప్రశ్నకు స్థానం ఉండదు. ఇక్కడ
దృశ్యప్రపంచంతో ఉన్న సంబంధాలు తొలగిపోయినట్లు మాత్రమే అన్నమాచార్యులు చెబుతున్నారు;
మనస్సును జయించినట్లు కాదు.
గూఢార్థవివరణము:
మొదటి
రెండు చరణాలలో మనస్సును పట్టుకోవడం, దాని రూపాన్ని నిర్ణయించడం ఎంత
కష్టమో అన్నమాచార్యులు చూపించారు. ఈ చివరి చరణంలో, మనస్సు
మనలో పనిచేస్తున్నప్పటికీ అది మన వ్యక్తిగత సృష్టి కాదని, ప్రకృతిలోని
ఒక అంశమని సూచిస్తున్నారు. అందువల్ల అది మనకు అత్యంత సమీపమైనదైనా, దానిని “నేనే” అని గానీ, “దైవమే”
అని గానీ నిర్ధారించలేము.
“తప్పక నాలోనుండు దైవముఁ గాదు మనసు” అనే మాట ఈ చరణంలోని కీలకమైన మలుపు.
మనస్సు అంతర్గతమైనది, నిరంతరం పనిచేసేది, మన అనుభవాలన్నింటినీ ప్రభావితం చేసేది. అయినప్పటికీ దాని చలనములు ఎంత
విస్తారమైనవైనా, దానిని దైవంతో సమానంగా భావించలేము.
తిరిగి
ఇక్కడ భగవద్గీతలోని 3-27వ శ్లోకం గుర్తుకు
తెచ్చుకోవాలి: “ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః । అహంకారవిమూఢాత్మా కర్తాఽహమితి మన్యతే ॥“ ప్రకృతిలోని గుణాలచే సమస్త కర్మలు జరుగుతున్నప్పటికీ, అహంకారముచే మోహితుడైనవాడు “నేనే కర్తను” అని భావిస్తాడు. అన్నమాచార్యులు
ఇక్కడ అలా భావించడం లేదు. అందువల్ల “గెలుచు” అనే పదానికి పోవు,
పోగొట్టు అనే అర్థమే ఇక్కడ సరిపోతుంది.
అంటే, శ్రీ వేంకటేశుని తలచిన తరువాత దృశ్యప్రపంచంతో ఉన్న సంబంధాలు
తొలగిపోయినట్లు ఆయన చెబుతున్నారు. ఇది మనస్సును జయించిన ప్రకటన కాదు. మనస్సును
జయించినట్లయితే, చివరలోని “యేఁటిదో
యీమనసు” అనే ప్రశ్నకు స్థానం ఉండదు. తెలిసినది బంధాల తొలగింపు మాత్రమే; మనస్సు యొక్క తుది స్వరూపం మాత్రం ఇంకా తెలియనిదే.
అందువల్ల
స్వేచ్ఛ అనేది సాధించగలిగిన ఒక స్థిరమైన స్థితి అని అన్నమాచార్యులు ప్రకటించడం
లేదు. భౌతిక ప్రపంచంతో మనకు ఉన్న సంబంధాలు వీగిపోయిన విషయం మాత్రమే సాధకుని ఎరుకకు
తట్టవచ్చు. ఆ తరువాత ఏమి జరుగుతుంది, మనస్సు ఏ రూపంలో ఉంటుంది, ఆ స్థితిని ఎలా వివరించాలి అనే విషయాలు మాత్రం స్పష్టమైన మాటలకు అందవు.
అందుకే
ఈ చరణం విజయప్రకటనతో ముగియదు. బంధాలు తొలగిపోయినప్పటికీ, మనస్సు మాత్రం ప్రశ్నార్ధకంగానే మిగులుతుంది: “యేఁటిదో
యీమనసు.”
X-X-X THE
END X-X-X

