Sunday, 13 August 2023

T-176 పచ్చిగాఁ దెలియకుంటె బహుముఖమై తోఁచు

 చిన​ తిరుమలాచార్యులు

176 పచ్చిగాఁ దెలియకుంటె బహుముఖమై తోఁచు

for EnglishVersion press here

 

సంక్షిప్తముగా: ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః । యః పశ్యతి తథాత్మానమ్ అకర్తారం స పశ్యతి ।। భగవద్గీత: 13-30 ।। భావము: ఎవడు కర్మలు అన్నివిధాలా ప్రకృతి స్వభావము చేత చేయబడుతున్నట్లు; మరియు ఆత్మను కర్తగానివానిగాను తెలియునో అతడే నిజమైన ద్రష్ట. 

Summary of this Poem: 

పల్లవి: నిజ జీవితములో సంఘటనలు జరుగుతున్నప్పుడు వాటిని ఎప్పటికప్పుడు పచ్చిగా, వున్నవివున్నట్లుగా దెలియకుంటె కాలముతోపాటు అవి అనేక విధములుగా ద్యోతకమగును. ఈ సంక్లిష్టమైన రూపాంతరీకరణ శ్రీహరి సృష్టియే. అన్వయార్ధము: ధ్యాస పెట్టండి! జ్ఞాపకశక్తి యొక్క ప్రతిస్పందనను ప్రత్యక్షముగా గమనించండి, అయినప్పటికీ నియంత్రణ చేతిలో లేదని గుర్తుంచుకోండి.

చరణం 1: తిట్లు, దీవెనలు కలిపి ప్రపంచపు రూపక నమూనాను ఏర్పరుస్తాయి. రేయి పగళ్ళ మార్పులతో కాలము గమనమున వున్నట్లు అనిపింప జేసినట్లు, ప్రపంచమను అనుభూతి శ్రీహరి కళాత్మక సృష్టి. అన్వయార్ధము: ఒకదాని వెంబడి ఒకటి వచ్చు పగలు, రాత్రిళ్ళ మార్పిళ్ళు యాంత్రికముగా కాక, వాని వెనుక  ప్రపంచాన్ని నడిపే కాలాతీతమైన, హద్దులు లేని అస్తిత్వం దాగి ఉందని తెలియుము.

చరణం 2: కొన్నిటిపై కోపము కొన్నిటిపై వేడుక మానవులకు సంక్రమించిన వింత/ చోద్యము. దైవీకమైన ప్రణాళిక ద్వారా పరిపక్వ,   అపరిపక్వ రూపాలు ఒకే దొండపండులో తోచినట్లు, మనలోనే కోపము, ప్రేమము రెండూ ఇమిడి వున్నాయి. ఈ ఘటనలన్నీ అపూర్వము, విస్మయము కలిగించు శ్రీహరి నిర్వహించే దివ్య ప్రదర్శనలోని వివిధ కోణాలుగా తెలియండి. అన్వయార్ధము: మానవుడా, నీ లోపాలను బహిరంగంగా, నిష్కపటంగా ప్రకటించినప్పుడు, ప్రపంచములో అన్నింటిని మించిన సామరస్యాన్ని కనుగొంటావు.

చరణం 3: వేంకటనాథుని దివ్య ఆదేశం ప్రకారం ఏర్పాటైన ఈ క్షేత్రంలో మానవులు, దేవతలు నివసించుదురు. రుచిలేని పీచు మరియు అమృతాన్ని పోలిన తీపి ఒకే చెరకు గడ కలిగి ఉంటుంది. అలాగుననే, ఈ ప్రపంచంలోని అందాన్ని, ఐశ్వర్యమును గ్రహించడానికి అవసరమైన సంక్లిష్టమైన సమతుల్యతను కనుగొనడానికి మీలోని దైవం మిమ్మల్ని పరీక్షిస్తుంది. అన్వయార్ధము: ఓ మానవుడా ఈ అల్లకల్లోల ప్రపంచంలో దాగి ఉన్న సమతౌల్యాన్ని కనుక్కో.  పోలికలకు అతీతమైన ఆ స్థితి, ఆ సామరస్యం, ఆ సొగసు వర్ణనాతీతము.

విపులాత్మక వివరణము

ఉపోద్ఘాతము: అన్నమాచార్య త్రయంలో పిన్నవాడు చిన తిరుమలాచార్యులు.  అయినా అతని అసాధారణ ప్రతిభ అబ్బురపరుస్తుంది. 

ఈ కళాత్మక సృజనలు విని వదిలిపెట్టేయటానికి కాదు; అవి మానవాళిని శాశ్వతత్వము వైపు నడిపించే వేదాల్లాగ చరిత్రలో మైలురాళ్ళుగా నిలుస్తాయి. నిజానికి, వారు విసిరిన సవాళ్లను స్వీకరించే ధైర్యము లేనివారము. 

చిన తిరుమలాచార్యులు గారి పద వ్యూహము కొంత​ ఉద్రేకపరచి రెచ్చగొట్టి ఆలోచనలను రేకెక్తిస్తుంది. సాధారణ పదములు  సాధించగల అసాధారణమైన కార్యమును సూచించుచున్నవి. 

కీర్తన:
రాగిరేకు:  3-1 సంపుటము: 10-13
పచ్చిగాఁ దెలియకుంటె బహుముఖమై తోఁచు
అచ్చమై యిన్నియును శ్రీహరి కల్పితములే ॥పల్లవి॥
 
కొందరు దిట్టుదురూ కొందరు దీవింతురు
చందపుసంసారము జాడలివి
కందువ రేయీఁ బగలుఁ గాలము నడచినట్టె
అందరిలో గలుగు శ్రీహరికల్పితములే ॥పచ్చి॥
 
కొన్నిట్టిపైకోపము కొన్నిటి పైవేడుక
వున్నతి దేహధారుల వోజ లివి
పన్ని కాయ పండు దొండపంటియందె తోఁచినట్టు
అన్నియుఁ బుట్టించిన శ్రీహరికల్పితములే ॥పచ్చి॥
 
కొంతచోట మనుజులు కొంతచోట దేవతలు
అంతా శ్రీవెంకటనాథు నాజ్ఞ యిది
చెంత చప్పనయుఁ దీపు చెఱకందె వుండినట్టు
కాంతుఁడైన శ్రీహరికల్పితములే ॥పచ్చి॥

 Details and Explanations: 

పచ్చిగాఁ దెలియకుంటె బహుముఖమై తోఁచు
అచ్చమై యిన్నియును శ్రీహరి కల్పితములే   ॥పల్లవి॥ 

ముఖ్య పదములకు అర్ధములు: పచ్చిగాఁ = పచ్చిగా, అలంకరణ లేకుండా; బహుముఖమై తోఁచు = అనేక విధములుగా తోచును​; 

భావము: నిజ జీవితములో సంఘటనలు జరుగుతున్నప్పుడు వాటిని ఎప్పటికప్పుడు పచ్చిగా, వున్నవివున్నట్లుగా దెలియకుంటె కాలముతోపాటు అవి అనేక విధములుగా ద్యోతకమగును. ఈ సంక్లిష్టమైన రూపాంతరీకరణ శ్రీహరి సృష్టియే. 

వివరణముఈ పల్లవి సంప్రదాయమును పూర్తిగా ప్రక్కకునెట్టి అమర్చిన అసాధారణమైన కూర్పు. సత్య మార్గము గులాబీల బాట కాదని  నొక్కి చెబుతున్నాను.  ఈ ముళ్ల మార్గంలో పయనించుటకు సంపూర్ణ శ్రద్ధ అత్యవసరం. ఇందులో అలంకారాలకు తావు లేదు. సత్యంతో సహజీవనము చేయగల సామర్థ్యమును దుస్తులు, భాష, పువ్వుల దండలు, వాటి రంగులు నిర్ణయించలేవు. ఇటువంటి నిష్కపట ప్రకటనతో  చిన తిరుమలాచార్యులు ఆత్మసాక్షాత్కార సారాన్ని ఉద్దీపింప చేశారు. శాశ్వతత్వమునకు బాటలు సుగమము చేశారు. 

ఈ సంక్లిష్టమైన పల్లవిని అధివాస్తవిక మాస్టర్ రెనే మాగ్రిట్టే 'టైమ్ ట్రాన్స్ ఫిక్స్డ్' అనే అందమైన పెయింటింగ్ ద్వారా అర్థం చేసుకుందాం. నిశ్శబ్దం ఆవరించిన గదిలో ఫైర్ ప్లేస్ ద్వారా ఆవిరితో నడిచే లోకోమోటివ్ గోడను పగలగొట్టుకుంటూ గదిలోకి చొచ్చుకుని రావడం గమనించవచ్చును. ఫైర్ ప్లేస్ పైన ఒక గడియారం (దాని సమయాన్ని మార్చడంతో) సంకేతముగా చూప బడింది. స్పష్టంగా ఫైర్ ప్లేస్'ను చేధించుకుంటూ లోకోమోటివ్ దూసుకు రావడం  గది లోని ప్రశాంతతను భగ్నం చేస్తోంది.

పై బొమ్మలో, మన ఆలోచనలు మన ఇష్టానుసారం ఏర్పాటు చేసుకొన్న ప్రశాంతమైన గది లాంటివి. అందుకే రెనె మాగ్రిట్టే ఫైర్ ప్లేస్'తో కూడిన లివింగ్ రూమ్ లేదా బెడ్ రూమును ఎంచుకున్నాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ మన ఆకాంక్షల మేరకు శాంతి, భద్రతలు నెలకొనాలని కోరుకుంటాం. మన ఊహలను, అవగాహనలను ఛిన్నాభిన్నం చేస్తూ కాలము (స్టీమ్ ఇంజన్) మనము వూహించని కోణంలో మన జీవితములోకి ప్రవేశించి విపత్కర ప్రభావాన్ని సృష్టిస్తుంది. మనము కట్టుకొన్న కలల సౌధము కూలిపోతుంది. మనము కర్మను నిందించబోతాము.

 ఏమైనా కానివ్వండి కాలగమనంలో  మన ప్రణాళికలు తుడిచిపెట్టుకు పోతాయి. మనమెంత కృషి చేసినా  సన్నాహాలలో లోపము లుంటూనే వుంటాయి. ఏర్పాటుచేసుకున్న భూషణములు, సుగంధములు, లేపనములు కొరగానివైపోతాయి.

ఆ విధ౦గా, మనము "నేర్చిన జ్ఞానము, నైపుణ్యములను" అతలాకుతలము చేస్తూ సమయం గడిచిపోతూనే వుంటుంది. వీటిని జీర్ణించుకొనుటకు సమయం కావాలని అనుకుంటాం? కానీ సమయము గడిచేకొద్దీ బహుళ-పరిమాణములలో భ్రమలను సృష్టిస్తుందని పల్లవి పేర్కొంది. అలా చిన తిరుమలాచార్యులు 'మనసులో ముందస్తుగా సృష్టించిన చిత్రము లేకుండా ప్రపంచాన్ని పచ్చిగా, వున్నది వున్నట్లు చూడగలమా?’ లేదా మన చుట్టూ వున్న యీ ప్రపంచాన్ని మనం కొత్త కళ్ళతో ఎటువంటి అంచనాలూ లేకుండా కనగలమా?’ అని నిలదీస్తున్నారు.

(అలాగే గోనెలె కొత్తలు కోడెలెప్పటివి / నానిన లోహము నయమయ్యీనా?” మరియు చవి నోరి కేడఁ దెత్తు సంపదేడఁ దెత్తు వీని / సవరించుటే నా సంపదిది గాదా?” అను కీర్తనల ఆంతర్యమూనూ ఇదే).   

ఇప్పుడు ఈ వాక్యాన్ని "అచ్చమై యిన్నియును శ్రీహరి కల్పితములే"ని పరిశీలిద్దాం:  భగవంతుడు ఈ అడ్డంకులను సృష్టించాడని అని స్ఫురిస్తుంది. కానీ ఇంతకు ముందు అనేక వివరణలలో ఋజువు చేసిట్లుగా ప్రపంచం యథాతథంగా ఉంది. కాలముతో పాటు ప్రపంచం పట్ల మన దృక్పథం మారుతుంది. అందువలన, ఆయా సమయాల్లో గ్రహించే విషయం అజ్ఞానపు పొరలను సృష్టిస్తుంది. 

ఈ రకంగా "ఆలోచనాత్మక చర్య" అనునది సహేతుకంగా అసంబద్ధమని చెప్పబడింది. మానవుని పాత్ర ప్రేక్షకునిగా ఉండటం తప్ప ఏమీ చేయలేమని మనస్పూర్తిగా ఆకళింపు చేసుకున్నప్పుడు భగవద్గీత మరియు జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన ఉత్తమ సమాధానం "ఏమీ చేయవద్దు" (= “అకర్తారం స పశ్యతి)ల గూఢార్ధము బయల్పడును.  అందువలన, అన్వయార్ధము క్రింది విధంగా ఉంటుంది.

అన్వయార్ధము: ధ్యాస పెట్టండి! జ్ఞాపకశక్తి యొక్క ప్రతిస్పందనను ప్రత్యక్షముగా గమనించండి, అయినప్పటికీ నియంత్రణ చేతిలో లేదని గుర్తుంచుకోండి. 

కొందరు దిట్టుదురూ కొందరు దీవింతురు
చందపుసంసారము జాడలివి
కందువ రేయీఁ బగలుఁ గాలము నడచినట్టె
అందరిలో గలుగు శ్రీహరికల్పితములే ॥పచ్చి॥

ముఖ్య పదములకు అర్ధములు: చందపుసంసారము = ప్రపంచం యొక్క రూపక క్రమం; కందువ = మాయ​, కల్పితము.

భావము: తిట్లు, దీవెనలు కలిపి ప్రపంచపు రూపక నమూనాను ఏర్పరుస్తాయి. రేయి పగళ్ళ మార్పులతో కాలము గమనమున వున్నట్లు అనిపింప జేసినట్లు, ప్రపంచమను అనుభూతి శ్రీహరి కళాత్మక సృష్టి. 

వివరణము: చిన తిరుమలాచార్యులు కనులకు గోచరమైన దానిని మించి చూడమని మనల్ని ప్రోత్సహిస్తుండటాన్ని మీరు గమనించే ఉంటారు. ఏది శాశ్వతం అనే దానిపై ప్రజలు ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉంటారు.  మనసు ఆ ప్రత్యేక స్థితి చేరుకున్నప్పుడు అది అసాధారణ ప్రజ్ఞను అంతరించుకుంటుంది.  ఈ సామర్ధ్యం మనలో ప్రతి ఒక్కరికీ ఇవ్వబడింది. 

"ఇందులో ఏదో తప్పుంది అనిపించు", "సాంప్రదాయకము కానివనే భావనను కల్పించు" పల్లవిలోని పదాలు తీవ్రమైన పరిశీలన కోసం ఉద్దేశించినవి మాత్రమే. భగవద్గీత సూచించిన సత్వ (సాత్వికము), రజో (వ్యామోహం), తమో (అజ్ఞానం) అను మూడు గుణములు మనలను నిరంతరము ఏదో ఒక అహంకారంలోకి నడిపిస్తూనే ఉంటాయి. కాబట్టి, ఈ జీవితమను ప్రయాణంలో నిరంతర అప్రమత్తత తప్పనిసరి. 

"కందువ రేయీఁ బగలుఁ గాలము నడచినట్టె అందరిలో గలుగు"తో కదలునది ఏదియో కనుక్కోమంటున్నారు చిన తిరుమలాచార్యులు. మనము అగపడు కాలపు కదలికలకు ఆకర్షితులవుతాం. 'కదలునది ఏదియో' పట్ల తగినంత సమయము వెచ్చించము. నారదుడు, సనకాది మహర్షులు, అన్నమాచార్యుల వంటి మహానుభావులు అనంతమును స్పృశించి, మనం ఊహించలేని లోకంలో  శాశ్వతులైనారు. 

అన్వయార్ధము: ఒకదాని వెంబడి ఒకటి వచ్చు పగలు, రాత్రిళ్ళ మార్పిళ్ళు యాంత్రికముగా కాక, వాని వెనుక  ప్రపంచాన్ని నడిపే కాలాతీతమైన, హద్దులు లేని అస్తిత్వం దాగి ఉందని తెలియుము. 

కొన్నిట్టిపైకోపము కొన్నిటి పైవేడుక
వున్నతి దేహధారుల వోజ లివి
పన్ని కాయ పండు దొండపంటియందె తోఁచినట్టు
అన్నియుఁ బుట్టించిన శ్రీహరికల్పితములే      ॥పచ్చి॥ 

ముఖ్య పదములకు అర్ధములు: వున్నతి దేహధారులు = మానవులు, Higher Order beings; వోజ లివి = ఇవి వారి తెలివి లేదా బలం లేదా వింత/ చోద్యము; పన్ని = దైవీకమైన ప్రణాళిక ద్వారా. 

భావము: కొన్నిటిపై కోపము కొన్నిటిపై వేడుక మానవులకు సంక్రమించిన వింత/ చోద్యము. దైవీకమైన ప్రణాళిక ద్వారా పరిపక్వ,   అపరిపక్వ రూపాలు ఒకే దొండపండులో తోచినట్లు, మనలోనే కోపము, ప్రేమము రెండూ ఇమిడి వున్నాయి. ఈ ఘటనలన్నీ అపూర్వము, విస్మయము కలిగించు శ్రీహరి నిర్వహించే దివ్య ప్రదర్శనలోని వివిధ కోణాలుగా తెలియండి. 

వివరణము: మన భావాలు జ్ఞాపకాల మీద ఆధారపడి ఉంటాయి. తరచుగా పేర్కొన్నట్లుగా ఇవి నమ్మదగిన వనరులు కావు. అందువల్ల, మనము సత్యము వైపే వొగ్గుతామని భావించుటకు భరోసాలేదు. చిన్ననాటి నుండి వికృతమైన భాగాన్ని దాచిపెట్టడం, సామాజికంగా ఆమోదయోగ్యమైన వాటిని బాహటముగా ప్రదర్శించడం నేర్చుకుంటాం. 

అయితే సత్యవ్రతము జ్ఞాపకశక్తి వల్ల కలిగే పరివర్తన కాదు. కానీ తాను ఏమిటో నిజాయితీగా, నిర్భయంగా ప్రకటించడం. మన లోపాలను వున్నవి వున్నట్లు అంగీకరించ గలమా? ప్రపంచాన్ని ఎదుర్కోగలమా? ఈ సందర్భంగా క్రింది అన్నమాచార్యుల మాటలను స్మరించుకుందాం. 

గతియై రక్షింతువో కాక రక్షించవో యని / మతిలోని సంశయము మఱి విడిచి / యితరులచే ముందర నిఁక నెట్టౌదునో యని / వెతతోడఁ దలఁచేటి వెఱ పెల్లా విడిచి (= ఓ దైవమా! నువ్వు నన్ను రక్షింతువో కాక రక్షించవో అను సంశయములన్నీ వదలి నీ  వెంబడి వస్తాను. భవిష్యత్తులో యితరులు నాపట్ల ఎలా ప్రవర్తించుదురోనన్న ఆందోళనను వదలి నీపై విశ్వాసము  నిలుపుకొంటిని.) 

అందువలన, మనిషి యొక్క సమస్య వెలుపలి శక్తితో పెనవేసుకున్నది కాదు, స్వంత ఆలోచనలే అతనిని పరిమితం చేస్తున్నాయి. తనకేమైపోయినా; దాని కంటే ఇతరులతో తనతో ఎలా ప్రవర్తిస్తారన్నది మనిషికి అత్యంత భయాందోళనలు కలిగించు విషయము. కానీ, పరిశీలనకు పునాదులున్నవా? లేదా భయం యొక్క ఒక రూపం మాత్రమేనా? ఇది కేవలం ఊహాత్మకమా? 

అన్వయార్ధము: మానవుడా, నీ లోపాలను బహిరంగంగా, నిష్కపటంగా ప్రకటించినప్పుడు, ప్రపంచములో అన్నింటిని మించిన సామరస్యాన్ని కనుగొంటావు. 

కొంతచోట మనుజులు కొంతచోట దేవతలు
అంతా శ్రీవెంకటనాథు నాజ్ఞ యిది
చెంత చప్పనయుఁ దీపు చెఱకందె వుండినట్టు
కాంతుఁడైన శ్రీహరికల్పితములే ॥పచ్చి॥ 

ముఖ్య పదములకు అర్ధములు: నాజ్ఞ యిది = దివ్య ఆదేశం ప్రకారం. 

భావము: వేంకటనాథుని దివ్య ఆదేశం ప్రకారం ఏర్పాటైన ఈ క్షేత్రంలో మానవులు, దేవతలు నివసించుదురు. రుచిలేని పీచు మరియు అమృతాన్ని పోలిన తీపి ఒకే చెరకు గడ కలిగి ఉంటుంది. అలాగుననే, ఈ ప్రపంచంలోని అందాన్ని, ఐశ్వర్యమును గ్రహించడానికి అవసరమైన సంక్లిష్టమైన సమతుల్యతను కనుగొనడానికి మీలోని దైవం మిమ్మల్ని పరీక్షిస్తుంది. 

వివరణము: తన తాత లాగే చిన తిరుమలాచార్యులు కూడా రెండు ప్రపంచాలు లేవని ప్రతిపాదిస్తున్నాడు. ఏది ఉన్నా అది మన కళ్ళ​ ముందున్నదే. మనకు తెలిసిన ఈ ప్రపంచం దోపిడీ, ఆకలి, అసమానతలతో నిండి ఉంది. ఈ అడ్డంకులను అడ్డుపెట్టుకుని ఆలోచనల ద్వారా ఏర్పడని, మానవ మనస్సు నిర్మించని, సందేహాలతో కలుషితం కాని ఒక గొప్ప క్రమం దాగి ఉంది. భగవద్గీతలో (7-7) పేర్కొన్న "మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ" (పూసలన్నీ దారము పై గుచ్చి ఉన్నట్టు సమస్తమూ నా యందే ఆధారపడి ఉన్నవి) యొక్క అర్ధము కూడా ఇదే. 

భగవద్గీత 2- సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే = జయాపజయములకు అతీతముగా వున్నటువంటి సమత్వ బుద్ధియే యోగము అని చెప్పినది. మానవులమైన మనం, ఈ శరీరముతో ఉండాగానే  ఆ సమతౌల్య స్థితిని కనుగొనవచ్చని చిన తిరుమలాచార్యులు  ప్రతిపాదిస్తున్నారు. 

"ఏం జరిగినా నాకు సమ్మతమే" అని జిడ్డు కృష్ణమూర్తి చేసిన ప్రకటనతో ఈ స్థితికి సంబంధం ఉంది. కానీ మన ప్రవృత్తి "కొన్నిట్టిపైకోపము కొన్నిటి పైవేడుక" అని పైన చెప్పినట్లుగా వుంటుంది. ఇది జిడ్డు గారు చెప్పిన దానికి పూర్తి విరుద్ధం. అందువలన ఆర్యులారా, చేయవలసిన ప్రాథమిక పని ఏమిటంటే, 'మనం ఏమిటో అర్థం చేసుకోవడమే' కానీ స్వర్గానికో లేదా మరేదానికైనా దేవులాడటం కాదు. 

అన్వయార్ధము: ఓ మానవుడా ఈ అల్లకల్లోల ప్రపంచంలో దాగి ఉన్న సమతౌల్యాన్ని కనుక్కో.  పోలికలకు అతీతమైన ఆ స్థితి, ఆ సామరస్యం, ఆ సొగసు వర్ణనాతీతము. 

-x-x-x-


2 comments:

  1. ఓం శ్రీ సాయి నాథాయనమః
    ఎదురుగ అగుపించే త్రాడు చీకటిలో పాము గా అగుపడుట ఎంత సాధ్యమో సంసారం అంతయు అంతే మిథ్య యని గుర్తించడమే భక్తి భావం, జీవి కర్మణ్యేన ఎదురుగ నున్న భగవంతుని నిజ స్వరూపముననుభవించునని అద్భుతంగ చెపుతోంది ఈ పాట, అట్టి భక్తికి కావలిసింది శ్రద్ధ మరియు సబూరి (కాలాంతర మార్పు కు తోడు నీడ )

    ReplyDelete
  2. పల్లవి:
    మూలం గ్రహించకపోతే,
    బహురూపములలో గోచరిస్తుంది.అంటే
    జీవులలో ఉన్న పరమాత్మ ఒక్కటే యన్న సత్యమును తెలిసికొన లేకపోతే
    కనులకవి అనేక రూపములుగా కనిపిస్తాయి. నిజంగా జీవులన్నీ పరమాత్మ చేత కల్పించబడిన, పరమాత్మ యొక్క అంశలేయని
    అన్నమయ్య అంటున్నారని నా యొక్క భావన.

    రాగద్వేషములనునవి శరీరధారుల అంటే శరీరమును ఉపాధిగా ధరించిన జీవుల మాయాకల్పిత ఓజలు అంటే ప్రకృతిపరమైన స్వభావములు అంటే
    మాయాకల్పితమైన భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణముల అభివ్యక్తీకరణం.
    ఇవన్నియు భగవంతునిచే కల్పితమైన అవ్యక్తములే.
    పొగడ్తలు, తెగడ్తలు అన్నీ కూడా పరమాత్మ యొక్క మాయాకల్పితములే.
    కాలగమనంలో పగలు, రేయి ఒకదాని వెంబడి మరొకటి తిరుగాడునట్లు జీవులలో కూడా యీ అనుభూతు లేర్పడుతూ ఉంటాయి.ఇవన్నీ కూడా భగవంతుని సృష్టి నమూనాలోని భాగములే.
    దేహమనే క్షేత్రంలో ఉత్పన్నమయ్యే భావాలు దైవీ గుణములు, అసురీ గుణముల కలయిక. ఇవి భగవంతుని మాయా(ప్రకృతి) కల్పితములే.చెఱకు గడలో ఒకవైపు చప్పగా పీచును, మరొక వైపు మధురమైన తీపి కలిగి యున్నట్లే జీవులలో త్రిగుణముల పరమాత్మ యొక్క అమోఘమైన సృష్టియే.ఈ మాయకు అతీతమైనది పరమాత్మ యని
    తెలిసికొనుటయే జ్ఞానం.

    ఓం తత్ సత్ 🙏🏻🙏🏻🙏🏻
    కృష్ణ మోహన్

    ReplyDelete

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...