అన్నమాచార్యులు
179 అలర నుతించరో హరిని
for English Version press here
క్లుప్తముగా: "ఇది నా జీవితంలో జరగకూడదని నేను
కోరుకుంటాను," ఆవేదనతో ఫ్రోడో అన్నాడు.
"ఔను నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అలాగే జీవించే వారందరూ అలాగుననే కోరుకుంటారు. కానీ అది వారు నిర్ణయించునది కాదు. మనకు (దైవము) ఇచ్చిన సమయంతో ఏమి చేయాలో మనమే నిర్ణయించుకోవాలి." అన్నాడు గండాల్ఫ్
- జె.ఆర్.ఆర్. టోల్కీన్, ది ఫెలోషిప్ ఆఫ్ ది రింగ్
Summary of this Poem:
పల్లవి: మానవులారా! కాలము మిమ్ము తన వశము
గావించుకొని భ్రమయించును. కావున ఇప్పుడే హరిని సమ్మతించి నుతించరో.
చరణం 1: మనుషులారా హరి చింత ఇకనైనా చేయుడీ.
విడువుడీ మీరు భుజించు రుచులమీఁద మనస్సు. ఈ
దేహము అస్థిరము. ఈ కలిమి కూడా అధ్రువము. మనము
అనుభూతి చెందు కాలము తనంతట తాను పోవును కానీ అది గడచినకొద్దీ ఏమాత్రము మర్పు లేక అలానే
వుండును. (దానిమీద
ఎక్కి సవారి చేసి ముందుకు పోలేము. దాని మూలమున ఎటువంటి లాభము వుండదు).
చరణం 2: మనుజులారా! హరికథలు మెచ్చరో! మదిలోన రివ్వున తిరుగాడు పొరపొచ్చెములను తొలగించరో. వదులుకోరో కోరికలను. ఈ పనులిచ్చు శుభములు యెల్లకాలముండును.
చరణం 3: మానవులారా! కనులకు తృప్తిగా వేంకటపతిఁ చూడరో! ఆతని స్తుతిని వినరో చెవులతో! శ్రీహరిచేతి మన్ననలు పొందరో! అయ్యలారా! ఇంద్రియముల ద్వారా తెలియు మీద దేనినైననూ బుద్ధిని నిలిపితే అసలు బుద్ధిని కాలము దాచి మాయజేయును. అన్వయార్ధము: మానవా! నీ ముందే యున్న సత్యమును కన్నులు తెలిచి చూచితివా. సత్యమునే కొలుచువారి మాటలు నీకు వినబడుచున్నవా? దివ్యము అపరూపమునగు కరుణచేత నీవు చుట్టబడితివా? లేక కాలమను మిధ్యలో తగిలి కొట్టుమిట్టాడు చుంటివా?
విపులాత్మక వివరణము.
ఉపోద్ఘాతము: కాలము ఆధ్యాత్మిక వేత్తలకు, తత్వవేత్తలకు తాము గాంచిన సత్యమును వెళ్ళడించుటకు ముఖ్యమైన ఆశ్రయములలో నొకటి. సత్యాన్వేషణలో సమయమొక కృత్రిమ మూలకము. "తనమీఁది మది బుద్ధి దాఁచీనిఁ గాలము" అని అన్నమాచార్యులు కాలము సూక్ష్మముగా వూహల లోనికి ప్రవేశించి దృష్టి మరల్చునని అన్నారు.
కీర్తన: రాగిరేకు: 65-5 సంపుటము:
1-338 |
అలర నుతించరో హరిని సేయరో మనుజులార చింత హరి నిఁకనైన మెచ్చరో మనుజులార మీరే హరికథలు కనరో వేంకటపతిఁ గన్నులు దనియఁగా |
అలర
నుతించరో హరిని
యెలయించి మిము భ్రమయించీనిఁ గాలము॥అలర॥
భావము: మానవులారా! కాలము మిమ్ము తన వశము గావించుకొని భ్రమయించును. కావున ఇప్పుడే హరిని సమ్మతించి నుతించరో.
వివరణము: యెలయించి మిము భ్రమయించీనిఁ గాలము: దీనిని 1933లో వచ్చిన లా రెస్పోన్సే ఇంప్రెవ్యూ (ఊహించని సమాధానం) అనే ఒక తమాషా అయిన పెయింటింగ్ మాధ్యమముగా అర్ధము చేసుకుందాము. మనకు చక్కగా నగిషి చేయ బడ్డ నిగనిగలాడే ద్వారము కనబడును. అంతగా ప్రచారములో లేని ఈ చిత్రము మాగ్రిట్ గారి కళానైపుణ్యమునకు ఇది పరాకాష్ట.
అంత పెద్ద కన్నము వేసినా మొత్తనికి ద్వారము చెక్కుచెదరకుండా ఏ మాత్రమూ పట్టువదలక మునుపు తానున్నట్టే వుంది. పరీక్షించి చూడగా, ఆ ద్వారము తెరచిన కానీ అటువైపు వున్నవి తెలియ లేమని తెలుస్తుంది. దొంగలా కన్నమువేసి అటువైపు వానిని తెలియ ప్రయత్నము సఫలము కావని; కొద్ది మేర మాత్రమే ఆవలికి విస్తరించిన కాంతిని బట్టి తెలియవచ్చు.
ఇంకొంచెం ముందు కెళ్ళి, అగపడుదానిని పరికించి చూస్తే, ద్వారము ఆవల, ఈవల వున్నది ఒకటేనని కూడా గ్రహించవచ్చు.
కేవలము అక్కడ ద్వారము వుంచడం వల్ల వచ్చిన కుతూహలము అటువైపు ఏమీ లేదని తెలిస్తే వుండదు.
అనగా అక్కడి ద్వారము నామమాత్రమే. కానీ మనలో చెలరేగు భావనలెన్నెన్నో. మూసిన గుప్పిటిలో
ఎముందో ఎవరికి తెలుస్తుంది.
పై బొమ్మలో చూపిన ద్వారము మాదిరిగానే సత్యము, మరణము, సమయములు తామున్న స్థితిని నిర్దారింపక కాలమును వెళ్ళబుచ్చును. మానవుడు తాను వీటిని ఎప్పటికైనా గ్రహించగలననే భ్రాంతిలో మునిగి వుంటాడని అన్నమాచార్యుల భావము.
కానీ అక్కడ ఆవలివైపు, పర్వతాలకు అవతల, మరణము తర్వాత ఏదో వున్నదని భావించటమే భ్రాంతి. స్పేస్ (మానసిక దూరము), కాలము మనసు సృష్టించిన భ్రమలే. ఉదాహరణకు ఒక మంచి అనుభవము (చక్కటి కాఫీ అనికోండి) అయిపోయిన వెంటనే తిరిగి అది పొందుటకు మనసు ఉవ్విళ్ళూరుతూ, ఎదురుచూస్తూ, ఆరాటపడుతూ కల్పించు భావనయే కాలము. ఈ రకంగా పై చిత్రము (ఊహించని సమాధానము), "యెలయించి మిము భ్రమయించీనిఁ గాలము"ల యొక్క భావము ఒకటే.
“పుట్టెడిదొకటే పోయెడిదొకటే“ “పరమనేదొకటే ప్రపంచమొకటే“ “మున్నిటి జగమే మున్నిటి లోకమే“ “చిత్తము నాఁటిదే చింతలు నాఁటివే“ అని అన్నమాచార్యులు పదేపదే చెప్పిన దిదియే.
సేయరో
మనుజులార చింత హరి నిఁకనైన
రోయరో మీభుజియించు రుచులమీఁద
కాయ మస్థిరము యీ కలి మధ్రువము చాలఁ
బోయఁబో యెందుకుఁ గాకపోయఁ గాలము ॥అలర॥
ముఖ్య పదములకు అర్ధములు: రోయరో = రోఁతపడరో, విడువరో;
భావము: మనుషులారా! హరి చింత ఇకనైనా చేయుడీ.
విడువుడీ మీరు భుజించు రుచులమీఁద మనస్సు. ఈ
దేహము అస్థిరము. ఈ కలిమి కూడా అధ్రువము. మనము
అనుభూతి చెందు కాలము తనంతట తాను పోవును కానీ అది గడచినకొద్దీ ఏమాత్రము మర్పు లేక అలానే
వుండును. (దానిమీద
ఎక్కి సవారి చేసి ముందుకు పోలేము. దాని మూలమున ఎటువంటి లాభము వుండదు.)
వివరణము: సమయము మనకు కనబడుతూ వూరించు ఒక కృత్రిమ ధాతువని ఆచార్యుల భావన. హరి చింతనను భోజనానంతరమునకు; దేహము నశించిపోవుచున్నదని తెలిసి దానిని అడ్దగించుటకు; ధనము సంపాదించిన పిదప హరిని భజించుటకు నిరంతరము ప్రోత్సహించు కాలమునకు తెలియకయే వశమౌదుము.
మెచ్చరో
మనుజులార మీరే హరికథలు
పుచ్చరో మీమదిలోని పొరలెల్లాను
కొచ్చరో మనుజులార కోరికలెల్లను మీకు-
నిచ్చీని శుభములు యివి యెల్లకాలము॥అలర॥
ముఖ్య పదములకు అర్ధములు: పుచ్చరో = తొలగించరో; పొరలు = దొర్లు, ప్రవర్తిల్లు; కొచ్చరో = వదలుకొరో.
భావము: మనుజులారా! హరికథలు మెచ్చరో! మదిలోన
రివ్వున తిరుగాడు పొరపొచ్చెములను తొలగించరో. వదులుకోరో కోరికలను. ఈ పనులిచ్చు శుభములు
యెల్లకాలముండును.
కనరో
వేంకటపతిఁ గన్నులు దనియఁగా
వినరో యీతని స్తుతి వీనులు నిండ
మనరో శ్రీహరిచేతి మన్ననలు మీరు
తనమీఁది మది బుద్ధి దాఁచీనిఁ గాలము॥అలర॥
ముఖ్య పదములకు అర్ధములు: తనమీఁది మది = మనసు తనమీదే నిలిపితే.
భావము: మానవులారా! కనులకు తృప్తిగా వేంకటపతిఁ చూడరో! ఆతని స్తుతిని వినరో చెవులతో! శ్రీహరిచేతి
మన్ననలు పొందరో! అయ్యలారా! ఇంద్రియముల ద్వారా తెలియు మీద దేనినైననూ బుద్ధిని నిలిపితే
అసలు బుద్ధిని కాలము దాచి మాయజేయును.
వివరణము: కనరో వేంకటపతిఁ గన్నులు దనియఁగా: అని చెప్పుట ఏదో కీర్తనలు/యజ్ఞములు/తపస్సులు చేసి పుణ్య లోకములకు మార్కులు కొట్టేయమని కాదు, కన్నుల ముందున్న లోకమును తెలియమని. "వినరో
యీతని స్తుతి వీనులు నిండ" "మనరో శ్రీహరిచేతి మన్ననలు మీరు" అనునవియూ
ఈ కోవకు చెందినవే. అవి ప్రత్యక్షముగా ఎఱుకలోనికి వచ్చుననియే ఆచార్యుల భావము.
అన్నమాచార్యులు తత్వవేత్త కానీ, వేదాంతుల ఇండ్లలోనో పుట్టిన జ్ఞానియో కాదు.
తనకు స్వయముగా ప్రజ్ఞలోనికి వచ్చిన అనుభవములను
వారు తెలిపిరి. అనగా "పరమనేదొకటే ప్రపంచమొకటే" అనునది పరమ సత్యము. రెండు
లోకములు లేవని వారు పదేపదే చెప్పిరి. ఈ లోకముననే మానవుడు తన బుద్ధిని వుపయోగించి అజ్ఞానమును
విడువవలెనని వారి వాదము.
కావున దైవము అనునది నెమ్మది
నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చేరుకోగల తీరము కాదు. జాగ్రత్తగా గమనించిన సృష్టిలో
కూడా ఎంత దగ్గరి పోలికలు కనబడినా కూడా అనంత చైతన్యము నుండి ఉద్భవించినదియే కానీ పరిణామము
చెంది ఏర్పడినది కాదు. కాలముతో బాటు మనసు పరిపక్వత వైపుగా పరిణామము చెందునని భావించుటయే
అవిద్య.
నాకు చేతనైనంత వరకు ఈ విషయమును విశద పరచ యత్నింతును. హిల్మా యాఫ్ క్లింట్ వేసిన క్రింది ఐదవ హంసను చూడండి. అన్ని హంసలలో మాదిరిగానే దృశ్యాదృశ్యములను వేరుపరచుచూ అడ్దముగా ఒక గీత వున్నది. దానికి ఇరువైపులావున్న తలములు బాహ్యమును, అంతరంగమును చూపును. క్రింది ఎడమవైపు వున్న నల్లను హంస మనమున్న స్థితిని తెలుపును.
ఆ ధ్యాన స్థితినుండి వుత్పన్నమగు
ప్రకంపనములే గాలిలో స్వేచ్ఛగా ఎగురుతున్న తెల్లని హంసగా రూపాంతరము చెందిన వికసిత రూపము.
బుద్ధుని జీవిత చరిత్ర గమనించినా కూడా, ఆరేళ్ళ కఠోర తపస్సు వలన తనకు లబించినది కొంచెమేనని తెలిసి ధ్యానమును చేపట్టిన కొలది వారములలోనే
సిద్ధార్దునకు జ్ఞానోదయమయ్యింది.
తెల్లని హంసగా ఎగురుటను నల్ల హంస అంతర్ముఖము చేసుకొనుటను ఒకే బొమ్మలో చూపి వాటి మధ్య వ్యత్యాసము లేదని చూపిరి. ఈ రకముగా ఈ రూపాంతరము నందు సమయము అనునది పెద్ద విషయము కాదని తేల్చిరి. ఈ విధముగా క్రమక్రమముగా పరిపూర్ణత చెందుననుట కేవలము ఊహాజనితము. అందుమూలమున "తనమీఁది మది బుద్ధి దాఁచీనిఁ గాలము" అనునది ఎంతయునూ విచారించ తగ్గ విషయము.
అన్వయార్ధము: మానవా! నీ ముందే యున్న సత్యమును కన్నులు తెలిచి చూచితివా. సత్యమునే
కొలుచువారి మాటలు నీకు వినబడుచున్నవా? దివ్యము అపరూపమునగు
కరుణచేత నీవు చుట్టబడితివా? లేక కాలమను మిధ్యలో తగిలి కొట్టుమిట్టాడు
చుంటివా?
-x-x-x-
దేహం ఆశాశ్వతము.ప్రాపంచిక సుఖాల అనుభవం క్షణికమే.జీవితంలో అనుభవించే సుఖాలకు కాల పరిమితి ఉంటుంది.కలిమి కూడా కలకాల ముండదు.భౌతికమైన వస్తువులన్నీ కూడా కాలానికి లోబడి ఉంటాయి. కాలమే మనిషిని వశపరచుకొని భ్రమింపజేస్తుంది. దానియందు తగులుకొని కొట్టుమిట్టాడుతున్నాడు మనిషి. కాని కాలం నిత్యమై, మార్పు లేనిదై ఉంటుంది.కాలంతో మనిషి పోటీపడి, పరుగిడలేడు.
ReplyDeleteమనసును కల్మషం చేసే రాగద్వేషాలను
దూరం చేయండి.కోరికలే దుఃఖానికి మూలం. వాటిని త్యజించండి విషయవస్తువు లిచ్చు సుఖములు క్షణభంగురం. పైకి సుఖముల నిచ్చునవిగా కనిపించేవన్నీ కూడా కడకు దుఃఖములను మిగుల్చునవియే.
కోరికలు, రాగద్వేషాలు స్వతస్సిద్ధంగా నిర్మలమైన మనస్సును మలినపరుస్తున్నాయి. ఆశాశ్వతమైన ప్రాపంచిక భోగములకై మనస్సును కల్మషభరితం చేసికొని తన కళ్ల ముందే ఉన్న సత్యాన్ని కనుగొనలేక, దర్శించ లేక పోతున్నాడు మానవుడు.వివేకం, బుద్ధితో ఈ అజ్ఞానమును పారద్రోలి, సత్యమును దర్శించుము. కాలానికి వశమై, భ్రమలలో చిక్కుకొనకురో, కనులారా శ్రీహరిని కాంచరో, నోరారా హరికీర్తన చేయరో,వీనులకు విందైన హరిస్తుతిని వినరో, శ్రీవారి కరుణను పొందరో అంటున్నారు అన్నమయ్య.
"యెలయించి మిము భ్రమయించీని గాలము" అన్న పల్లవిలోని పాదమును మాగ్రిట్టే గీచిన పెయింటింగ్ తో వ్యాఖ్యాత చక్కగా వివరించారు.
ఓమ్ తత్ సత్ 🙏🏻🙏🏻🙏🏻
కృష్ణ మోహన్