Sunday 20 August 2023

T-178 కలగన్నచోటికిని గంప యెత్తినయట్లు

 అన్నమాచార్యులు

178 కలగన్నచోటికిని గంప యెత్తినయట్లు

for English Version press here

Summary of this Poem:

పల్లవి: లేనిదానిని వూహించుకొని యత్నముతో సాధింపబోవుటకు చాలా పరిశ్రమ చేయుట ఎలాంటిదమ్మా? అన్వయార్ధము: నీవున్న స్థితినిగానీ ప్రదేశమునుగాని నిర్ధారించలేని అశక్తుడా! దైవమును శరణనక​ నీకీ శ్రమ దేనికొరకు? 

చరణం 1: ఎన్నడో వొకనాఁడు స్వామి కటాక్షదృష్టితో ఓరచూపు చూడగా ఈ అందమైన స్త్రీ అది మొదలుగా మదనవేదనలు చెందుతూ అలసిపోవుచున్నది? ఇదేమిటమ్మా?

చరణం 2: జ్ఞాపకములలో మరచిపోయేటంతటి వెనుకకు ఒకనాడు పొరబాటున ఆమెను నొచ్చుకొనునట్లు పలికినాడట స్వామి. అదిమొదలు తనలోతాను మంథనము పడుతూ తలచి తలచి పైకి తెచ్చుకున్న పరితాపము ఆమెను కాల్చివేస్తూనే వున్నది. ఇట్లైన ఎట్లనమ్మా? అన్వయార్ధము: బాధలు​, ప్రేమల జ్ఞాపకములు అంతరంగమున తేలియాడుచూ మానవుని స్పష్టముగా చూడనివ్వకున్నవి. 

చరణం 3: అన్యోన్యముగా కలసి వున్నా, తెలియకుండానే స్వామి ఎక్కడ, ఎప్పుడు తనలో కుదురుకొనునది తెలియకుండె నామెకు.  తీయని మాయకాఁడు తిరువేంకటేశ్వరుఁడు. ఇటువంటి వానితో నెట్లున్నవమ్మా? అన్వయార్ధము: మానవుడు యదార్థముగా ప్రకృతికి తన అంతరంగముపై సంపూర్ణ స్వేచ్ఛ నిచ్చిన తన ప్రమేయములేకనే అతడికి స్వామి కటాక్షము లభించును.  

 

విపులాత్మక వివరణము 

ఉపోద్ఘాతము: అన్నమాచార్యులు తనను మరో మాహిళగా వూహించుకొని, ఆ స్త్రీ మనస్సులో చెల రేగుతున్న వివిధ భావములను చెబుతున్న కీర్తన ఇది​. సృజనాత్మకతకు ఇది మరో మెట్టు. సామాన్యముగా స్త్రీలు ఒలకబోయు రాగతాపములను అతి సమర్ధవంతముగా చెబుతూనే అనేక అధ్యాత్మిక విషయములను కూడా మేళవించి ఒక రసాత్మక ఔషధమును తయారుజేసిరి ఆచార్యుల వారు. వారి కల్పనా సృష్టిలో ఇది వొక పుష్పరాజము. అలతి పదములలో ఆనందమును నిర్వేదమును ఒకే పరి పలికించుట అన్నమాచార్యులకే చెల్లినది.  

కీర్తన:
రాగిరేకు:  11-3 సంపుటము: 5-64
కలగన్నచోటికిని గంప యెత్తినయట్లు
అలవు మీఱిన దెట్లనమ్మా ॥పల్లవి॥
 
ఎలయింపుఁ గడకంట నెన్నఁడో వొకనాఁడు
చెలఁగి తను నతఁడు చూచినవాఁడట
పొలిఁతి యదిదలఁచి యిప్పుడు మదనవేదనల-
నలసీ నిఁకనెట్లనమ్మా ॥కలగన్న॥
 
ఎఱుకయును మఱపుగా నేఁటికో వొకనాఁడు
కెఱలి తను నొవ్వఁ బలికినవాఁడట
తఱినదియె చెలి యిపుడు దలఁచి పరితాపాగ్ని-
నఱగీ నిఁకనెట్లనమ్మా ॥కలగన్న॥
 
ఇయ్యకోలుగఁ గలసి యెప్పుడో యిదెనేఁడు
నెయ్యమున చెలిలోన నెలకొనెనట
తియ్యముల సటకాఁడు తిరువేంకటేశ్వరుఁడు
అయ్యో యిఁకనెట్లనమ్మా ॥కలగన్న॥ 

 

Details and Explanations:

కలగన్నచోటికిని గంప యెత్తినయట్లు
అలవు మీఱిన దెట్లనమ్మా ॥పల్లవి॥ 

ముఖ్య పదములకు అర్ధములు: కలగన్నచోటికిని గంప యెత్తినయట్లు = లేనిదానిని వూహించుకొని యత్నముతో సాధింపబోవుట​ (కలగన్నచోటు:  కల యనునది భ్రమ; కలగన్నచోటు = భ్రమతో ఏదో వూహించుకుని; గంప యెత్తు = స్వీకరించు, పొందుటకు యత్నము చేయు); అలవు మీఱిన = చాలా పరిశ్రమ చేయుట; దెట్లనమ్మా = ఎలాంటిదమ్మా? 

భావము: లేనిదానిని వూహించుకొని యత్నముతో సాధింపబోవుటకు చాలా పరిశ్రమ చేయుట ఎలాంటిదమ్మా? 

వివరణము: కలగన్నచోటికిని గంప యెత్తినయట్లు: అను పదములను ది డిఫికల్ట్ క్రాస్సింగ్ (సందేహాల త్రోవ) అనే పేరుగల రెనె మాగ్రిట్ వేసిన చిత్రము సహాయముతో వివరింప ప్రయత్నిస్తాను. ఈ చిత్రము కూడా ఒక కలవంటిదే. ఇక్కడ బిల్బోక్వీట్ ముఖ్య పాత్ర​. చదరంగములోని సేనాపతిని తలపించు బొమ్మకు కన్నుపెట్టి మనుష్యు డనిపింప చేసారు. అది తన చుట్టు ఏమి వున్నాయా అని చూస్తున్నట్లుంటుంది.


ముందుగా బల్ల మీద  విరిగిన సున్నపు బొమ్మ చేయి దానిలో చిక్కుకున్న పావురము కనబడతాయి. పావురము బిల్బోక్వీట్ వైపు దీనంగా చూస్తున్నట్లుంది. బల్ల కాలు ఒకటి మానవుని కాలును పోలి వుంటుంది. ఇంకా అటూ ఇటూ చెక్క బల్లలు గోడలకు ఆన్చి వుంటాయి. ఈ బల్లలలో చతురస్రాకారపు ఖాళీలు కనపడుతుంటాయి. కుడిచేతివైపు బల్ల స్పష్టముగా చూచుటకు తెరను ప్రక్కకు తొలగించి అదిమి పట్టి వుంచినదని పిస్తుంది. 

ఇంకా ముదుకుపోతే అక్కడ అల్లకల్లొల సముద్రములో తలక్రిందులవబోతున్న నావలు కబడుతాయి. అది అక్కడ వేసిన నిడువైన చిత్రమో లేదా గది చివరి నుంచి కనబడు దృశ్యమో కాని చెప్పలేము. ఇక బిల్బోక్వీట్'కు ఏమి చేయాలో పాలుపోనట్లు దాని చూపులు సందిగ్ధముగా వుంటాయి. 

బల్లను మోయుచున్న మనిషి కాలుతో నీవు చూచునది చాలా వరకు నీ వూహలలో నిర్మించుకున్నదియే కాని వాస్తవము కాదని చెప్పిరి. అనగా సున్నపు బొమ్మ చేయి దానిలో చిక్కుకున్న పావురమును రక్షించుట ఔదార్యమే కానీ అవశ్యము కాదని చెప్పిరి. 

బిల్బోక్వీట్ మనిషి లాంటిదే. ఎదురుగా వున్న పక్షిని రక్షించాలో, జీవితములో ముందుకు అడుగువేసి భయము గొలుపు అతలాకుతలముగానున్న సముద్రమును (ఒడిదుడుకుల జీవితము ) చేరాలో నిర్ణయించలేకపోతుంది. 

(గతించినవారి చరిత్రలతో మానవునికి) తెరలు ప్రక్కకు తీయబడి దృశ్యము స్పష్టముగానున్నా కూడా రెండు ప్రక్కలా వున్న చెక్క బల్లల లోని ఖాళీలు సందేహాలను రేకెక్తించక మానవు. కాబట్టి మానవుడు తనవద్ద వున్న పాక్షిక సమాచారముతోనే నిర్ణయములు తీసుకొనవలనని చెబుతోంది. ఇంకనూ తీక్షణముగా చూసిన ఆ గది మానవ నిర్మితమే. ఆ గదిలోని వన్నీ నీచేతనే ఆకృతి ధరించినవని తెలియవచ్చు. కలగన్నచోటికిని గంప యెత్తినయట్లుఅనుదాని అర్ధము కూడా ఇదే. 

ఈ రకముగా మనకు కొంతకొంత అగపడుచు ఊరించుచున్న సత్యము క్రింది ఫోటోలో చూచాయగా కనబడు మానవ రూపము వంటిదే. 

అన్వయార్ధము: నీవున్న స్థితినిగానీ ప్రదేశమునుగాని నిర్ధారించలేని అశక్తుడా! దైవమును శరణనక​ నీకీ శ్రమ దేనికొరకు? 

ఎలయింపుఁ గడకంట నెన్నఁడో వొకనాఁడు
చెలఁగి తను నతఁడు చూచినవాఁడట
పొలిఁతి యదిదలఁచి యిప్పుడు మదనవేదనల-
నలసీ నిఁకనెట్లనమ్మా ॥కలగన్న॥ 

ముఖ్య పదములకు అర్ధములు: ఎలయింపుఁ = లోనగునట్లు చేయుట, వశము గావించుట; గడకంట = ఓరచూపు, కటాక్షదృష్టి; 

భావము: ఎన్నడో వొకనాఁడు స్వామి కటాక్షదృష్టితో ఓరచూపు చూడగా ఈ అందమైన స్త్రీ అది మొదలుగా మదనవేదనలు చెందుతూ అలసిపోవుచున్నది? ఇదేమిటమ్మా? 

వివరణము:  మనము అప్పుడెప్పుడో నలభై ఏభై ఏళ్ల క్రితము చూసిన సినిమాలోని అందమైన హీరోయిన్లను, వారి గుణగణములను గుర్తు పెట్టుకుంటామే కానీ ఎదురుగా వున్న జీవితములోని భయముగొల్పు వానిని పరికించి వాస్తవములో, కృత్రిమములో స్థిరపరచుకోము. భయముతో ఆనందమును ఉతముగా గొను వెఱ్ఱివారము.  మన మనో స్థితిని కళ్ళకు కట్టినట్లు చూపడం ఆచార్యుల ప్రత్యేకత​. 

ఎఱుకయును మఱపుగా నేఁటికో వొకనాఁడు
కెఱలి తను నొవ్వఁ బలికినవాఁడట
తఱినదియె చెలి యిపుడు దలఁచి పరితాపాగ్ని-
నఱగీ నిఁకనెట్లనమ్మా ॥కలగన్న॥ 

ముఖ్య పదములకు అర్ధములు: ఎఱుకయును మఱపుగా నేఁటికో వొకనాఁడు =జ్ఞాప్తికి రానంత ఎప్పుడో మునుపు జరిగిన ఘటన; కెఱలి = త్వరపడి; తఱినదియె = అదిమొదలు మంథనము పడుతూ; 

భావము: జ్ఞాపకములలో మరచిపోయేటంతటి వెనుకకు ఒకనాడు పొరబాటున ఆమెను నొచ్చుకొనునట్లు పలికినాడట స్వామి. అదిమొదలు తనలోతాను మంథనము పడుతూ తలచి తలచి పైకి తెచ్చుకున్న పరితాపము ఆమెను కాల్చివేస్తూనే వున్నది. ఇట్లైన ఎట్లనమ్మా?

వివరణము: మనస్సులో నాటుకున్న అనేకానేక విషయములు బాధను నొప్పిని కలిగించుతూ మానవుని చిత్తమును తమ వైపు లాక్కొంటూ వెళిపోతాయి. అవి తలచుకున్న కొలది మరింత దుఃఖమును, గాయమును మరింత లోతునకు కొనిపోయి మాటిమాటికిని మనిషికి తామున్న సంగతి ఎఱుకపరచుచునే యుండును. రెనె మాగ్రిట్ వేసిన మెమొరి అను పేరుగల​క్రింది చిత్రము అదియే తెలుపుచున్నది.

అన్వయార్ధము: బాధలు​, ప్రేమల జ్ఞాపకములు అంతరంగమున తేలియాడుచూ మానవుని స్పష్టముగా చూడనివ్వకున్నవి. 

ఇయ్యకోలుగఁ గలసి యెప్పుడో యిదెనేఁడు
నెయ్యమున చెలిలోన నెలకొనెనట
తియ్యముల సటకాఁడు తిరువేంకటేశ్వరుఁడు
అయ్యో యిఁకనెట్లనమ్మా ॥కలగన్న॥ 

ముఖ్య పదములకు అర్ధములు: ఇయ్యకోలుగఁ = ఒప్పుదల, అంగీకారము; సటకాఁడు = మాయకాఁడు, వంచకుఁడు. 

భావము: అన్యోన్యముగా కలసి వున్నా, తెలియకుండానే స్వామి ఎక్కడ, ఎప్పుడు తనలో కుదురుకొనునది తెలియకుండె నామెకు.  తీయని మాయకాఁడు తిరువేంకటేశ్వరుఁడు. ఇటువంటి వానితో నెట్లున్నవమ్మా?

వివరణము: ఈ సందర్భముగా అన్నమాచార్యుల కీర్తన సన్నపు నవ్వుఁజూపుల చల్లులాఁడి యిప్పు-డిన్నివిధముల మించె నిదివో తపము (భావము: సంజ్ఞలతో సున్నితమైన కదలికలతో ప్రారంభమై, నవ్వుల జూపులు చల్లి నన్ను తనలోనికి లాగుకొని నా అంచనాల ఆవలికి కొనిపోయినదీ తపము) గుర్తుకు తెచ్చుకుందాము. ఇక్కడ చెప్పిన భావమునే అక్కడా ఆచార్యులు చెప్పిరి.

చనువుకొద్దీ స్వామిపై కోపగించుకొనుట అందముగా నున్నది. మాయకాఁడు, వంచకుఁడు అని తిట్టిరి. వీటిని పక్కన పెడితే, ఇంద్రియముల చేత ప్రేరేపించబడని,   పాపపుణ్యాలకు  అతీతముగా తేజోమయమైన జీవనమొకటుందని అన్నమాచార్యులు రూఢీపరిచారు. 

అన్వయార్ధము: మానవుడు యదార్థముగా ప్రకృతికి తన అంతరంగముపై సంపూర్ణ స్వేచ్ఛ నిచ్చిన తన ప్రమేయములేకనే అతడికి స్వామి కటాక్షము లభించును. 

-x-x-x-

1 comment:

  1. కంటికి కనిపించే దృశ్యప్రపంచమంతా భ్రమ, మాయయే.కలగన్న చోట గంప యెత్తినట్లు ఈ మయాప్రపంచంలో భ్రమతో ఎక్కడెక్కడో, ఎంతో ప్రయత్నించి సత్యం కోసం వెదుకుతున్నావు. నీవున్న స్థితిని తెలిసికొనలేని అసహాయస్థితిలో ఉన్న నీకు గోచరించేది అసత్యమే, భ్రమయే.ఎందులకీ శ్రమ,అగచాట్లు?సత్యస్వరూపమైన దైవాన్ని
    శరణు కోరుకుంటే సత్యాన్ని దర్శించగలవు మానవుడా అంటున్నారు అన్నమయ్య.

    రినే మాగ్రిట్టే గీచిన చిత్రం కీర్తన యొక్క "పల్లవిలోని - కలగన్న చోటికిని గంప యెత్తినట్లు" అనే చరణము చక్కగా విశదీకరిస్తున్నది.

    రాగద్వేషములు,విషయవాసనలు అంతరంగంలో తిష్ఠ వేసి అజ్ఞానపు తెరగా (ఆవరణ) యేర్పడి ఆవలివైపు జ్ఞానమును కప్పివేస్తున్నాయి.
    సత్యము,ఆనందస్వరూపము, స్వయంప్రకాశకము అయిన తన నిజస్వరూపాన్ని చూడలేకున్నాడు జీవుడు.జీవుని యొక్క ఆత్మ అంటే జీవాత్మ - పరమాత్మ రెండూ బింబప్రతిబింబముల వలె అన్యోన్యంగా కలిసే ఉన్నా అజ్ఞానమనే అంధకారం పరమాత్మను గ్రహించలేక పోతోంది.అంతర,బహిరింద్రియములను స్వాధీనంలోనికి తెచ్చుకొనే ప్రయత్నం చేయకుండా భ్రమలో ఎక్కడెక్కడో దేవునికై వెంపర్లాడటం అజ్ఞానమే.శమదమాదుల వలన ఇంద్రియములను వశపరచుకొన్నచో
    స్వస్వరూపమును దర్శించవచ్చునని ఆచ్చార్యులవారు అంటున్నారు.
    ఓమ్ తత్ సత్ 🙏🏻🙏🏻🙏🏻
    కృష్ణ మోహన్

    ReplyDelete

T-202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ

  అన్నమాచార్యులు T 202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : నేను ఇంత కాలము ఆ సొమ్ములు , ఈ బాంధవ్యాలు ...