అన్నమాచార్యులు
177 అందాఁకాఁ దాఁ దానే అంత కెక్కుడు గాఁడు
Summary of this Poem:
పల్లవి: తన ముందు ఏమి గలదో, వెనుక తానేమిటో ఎంచ
గలిగిననాడు అతి ముఖ్యమైన వ్యక్తిగా రూపాంతరం చెందుతాడు మానవుడు. అప్పటివరకు అతడు
సామాన్యుడే. అన్వయార్ధము: సత్యం వైపు అడుగులు వేయకపోతే మనిషి
ఎప్పటిలాగే నీస్సత్తువగా జడుడై వుంటాడు.
చరణం 1: సూక్ష్మాతిసూక్ష్మ బాహ్య ప్రకోపములను కూడా గుర్తించి, తెలిసియు ఊరకయుండు స్థితిలో జీవనము సాగించి
ఆవలి వైపు చేరువాడు యోగియనఁబడును. సత్యాసత్యముల గ్రహింపులో నిమగ్నమై వుండువానిని వుత్తమవివేకియని
వూహింపవచ్చును.
చరణం 2: తాను చేయునది జీవనమునకు దారితీయు మార్గమా? లేదా ఇతరమా" అను విచక్షణ కలిగెనా వాడు కైవల్యనిలయుఁడని
తలచ బడును. దైవముయొక్క భావములను ప్రతిబింబించు
మనసు కలిగెనా అతడే జీవన్ముక్తుఁడని చెప్పఁబడును.
చరణం 3: ఒక వ్యక్తి ప్రాపంచిక విషయముల నుండి వేరు పడుటకు స్థిరముగా
ప్రయత్నిస్తే, వారు
వారి ఇంద్రియాలపై పట్టు సాధించారని చెప్పవచ్చు. వినయముగా వేంకటేశ్వరుని దాసునిగా మారెనా
శీఘ్రముగా దివ్యలోకంలో భాగమవుతారు.
విపులాత్మక వివరణము
ఉపోద్ఘాతము: ప్రతి కీర్తనలోనూ అన్నమాచార్యుని
సృజనాశక్తి మనల్ని అబ్బురపరచక మానదు. సులభమైన
భాషలో అలతి పదములలో అతి భారమైన భావాలను అలవోకగా పలికించి సవాలు విసురుతారు. ఇవి చూస్తుంటే
చీమలచేత కొండలను మోయించినట్లే అనిపిస్తుంది. మామూలుగా తెలుగు పదముల కంటే ఈ కీర్తనలో
సంస్కృత పదాలను విరివిగా వాడారు.
కీర్తన:
రాగిరేకు: 189-3 సంపుటము:
2-452
|
అందాఁకాఁ దాఁ దానే అంత కెక్కుడు గాఁడు ముందువెన కెంచేనా ముఖ్యుఁడే యతఁడు ॥పల్లవి॥ చిత్త మంతర్ముఖము సేసుకొన నేర్చెనా అత్తల నతఁడు యోగియనఁబడును సత్తసత్తనెడి సువిచారంబు గలిగెనా వుత్తమవివేకియని వూహింపఁబడును ॥అందాఁ॥ భావము నభావమును పరికించి తెలిసెనా కైవల్యనిలయుఁడని కానఁబడును దైవంబుఁ దన్ను మతిఁ దలపోయ నేర్చెనా జీవన్ముక్తుఁడని చెప్పఁబడు నతఁడు ॥అందాఁ॥ అడరి వైరాగ్యధన మార్జించనోపెనా దిడువై జితేంద్రియస్థిరుఁడాతఁడు జడియు శ్రీవేంకటేశ్వరుదాసుఁ డాయనా బడిబడిఁ దుదఁ బరబ్రహ్మమే యతఁడు ॥అందాఁ॥
|
Details and Explanations:
భావము: తన ముందు ఏమి గలదో, వెనుక తానేమిటో ఎంచ
గలిగిననాడు అతి ముఖ్యమైన వ్యక్తిగా రూపాంతరం చెందుతాడు మానవుడు. అప్పటివరకు అతడు
సామాన్యుడే.
వివరణము: ముందువెన కెంచేనా ముఖ్యుఁడే యతఁడు: తన ముందున్నది గుర్తించగలిగిననాడు, గతములో తానేమిటో తెలిసిననాడు అగ్రగణ్యుడిగా లెక్కించ బడును అని సూటిగానే వున్నా, ఇది కనబడినంత సులభము కాదు.
వాస్తవానికి, ఈ భూగ్రహంపై నివసిస్తున్న 7.8 బిలియన్ల ప్రజలలో ఎవరికీ "ఈ జన్మకు ముందు తాను ఏమిటి" అని నిర్ణయించగల సామర్థ్యములేదు. కనుల ముందరున్నదానిని కూడా నిర్ధారించడం దాదాపు అసాధ్యమే. కానీ ఈ ప్రపంచంలో కోట్లాది మంది ప్రజలు తమ జాతకములనో, హస్తరేఖలనో, పుట్టిన రోజు సంఖ్యలనో, రాశిని ఆధారముగానో చేసుకుని తమ భూతకాలమును, భవిష్యత్తును తెలుసుకోగోరి సమయాన్ని ధనమును వ్యర్థపుచ్చుతుంటారు.
అలాంటప్పుడు ఏది సాధ్యం? మన కనుల ముందు ఏముందో నిష్కర్షగా, ఎలాంటి సిద్ధాంతాల మీదా ఆధారపడకుండా ఎటువంటి
సందేహలకు తావు లేకుండా తెలుసుకోవడం మాత్రమే సాధ్యము. ఇది సులభంగా అనిపించవచ్చు. "సంభాషణా కళ"
అను శీర్షిక గల ఈ క్రింది చిత్రాన్ని పరీక్షగా చూడమని పాఠకులను మనవి. ఇందులో ఎక్కడో
మేఘాలలో "గొప్ప సంభాషణ"లో నిమగ్నమైన ఇద్దరు పెద్దమనుషులను మనం చూస్తాము.
ఈ విధంగా పై చిత్రలేఖనంలో ఉన్న పెద్దమనుషుల వలె, మనము కూడా వృత్తిరీత్యా కావచ్చు, మీ అభిరుచి వల్లనూ కావచ్చు, మతపరమైన కర్తవ్యమూ కావచ్చు అనేకానేక మానసికమైన ఆలోచనలలో తేలియాడుతూ వుంటాం. తరచుగా మనము అనుభవాలు మిగిల్చిన జ్ఞాపక శక్తిపైన మన వైఖరిని ఆధారం చేసుకుంటాము, ఇది తప్పు అని పదేపదే రుజువైనప్పటికీ దానినే నమ్మబోతాము. అందువలన, మనము వాస్తవిక లక్ష్యాలను నిర్దేశించుకున్నప్పటికీ, గ్రౌండ్ రియాలిటీకి దూరంగా పనిచేస్తాము.
మనం ఏర్పరచుకున్న రోజువారీ కార్యక్రమముల పొరలనుండి, భవిష్యత్ కార్యముల దృక్కోణము నుండి ప్రపంచాన్ని చూడబోతాము. ప్రతీ ఘడియా సేవ అను వ్యర్థ ప్రయత్నములలో నిమగ్నమై సమయాన్ని, శక్తిని కోలొపోతాము. ఇటువంటి మనకు కళ్ల ముందు ఏముందో స్పష్టంగా చూచే ప్రశ్న ఎక్కడుంది?
అయ్యా, ఈ వ్యాఖ్యానాలు పదాలతో మాయాజాలము చేసి కథనం పట్ల మీకు ఆసక్తిని కలిగించడానికి ఉద్దేశించినవి కావు. గోప్యత, కాపట్యము అనే ముసుగులు ఎంత తొలగించినప్పటికీ సత్యము తెలిసే అవకాశం తక్కువే.
"అలాచేస్తే ఏమి జరుగుతుందో" తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతారు. పరోక్ష అవగాహనలపై ఎంత చర్చించినా అప్రస్తుతమే. అన్నమాచార్యులు చెబుతున్నదేమిటంటే "అలాంటి స్థితికి వాస్తవంగా చేరుకుంటే తప్ప ఉపయోగం లేదు". అటువంటి దశకు చేరుకున్న వ్యక్తికి తాను ఏమిటో తెలుసుకోవడానికి జిజ్ఞాసా ఉండదు.
పైన అనుకున్నటు వంటి వన్నీ క్రోడీకరించితే క్రింది అన్వయార్ధము వచ్చును.
అన్వయార్ధము: సత్యం వైపు అడుగులు వేయకపోతే మనిషి ఎప్పటిలాగే నీస్సత్తువగా జడుడై వుంటాడు.
అన్వయార్ధము పై వివరణము: హిల్మా అఫ్ క్లింట్ 1915లో రచించిన " హంస నెం.12"
అనే అందమైన పెయింటింగ్ ద్వారా దీనిని మరింత విశదముగా అర్థం చేసుకుందాం.
ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విభజించారు.
ఈ పెయింటింగ్’లో క్రింది భాగము మనిషిని (వృత్తము
తోను), అతనిని ప్రభావితము
చేయు పర్యావరణమును (ముదురు గోధుమ రంగుతో తమో గుణమును సూచించుతూ)
చూపిరి. పై భాగము కాంతివంతమైన బాహ్య ప్రపంచమును
చూపును. మనిషికి బయటి ప్రపంచమున వెలుతురు అగపడును కానీ దానిని చేరు మార్గము అగపడదు.
"వెలుపల మఱవక లోపల లేదు వెలుపలఁ గలిగిన లోపల మఱచు" అను అన్నమాచార్యుల కీర్తనను
స్మరించుకుందాం.
క్రింది భాగము కొంత ముదురు రంగులో వేసి, బయట ప్రపంచము కపపడినంత స్పష్టముగా, నిన్ను నీవు చూచుకొనుటకు వీలుపడదని చెప్పిరి. మన చుట్టూ ఆవరించి వున్న బాహ్య ప్రపంచం గురించి తెలుసుకోవడానికి, అందుబాటులో ఉన్న అన్ని శక్తులను ఒకే చోట (కేంద్రంలో) సమీకరించండి అని క్రింది భాగము తెలుపుతోంది.
దిగువ ముదురు వృత్తం మరియు ప్రకాశవంతమైన ఎగువ వృత్తం విడివిడిగా వున్నాయని గమనించండి. మన దృక్పథాన్ని బాహ్య ప్రపంచం యొక్క అమరికతో సమము చేయుటకు ఏకైక అవకాశము సర్వ శక్తులతో కూడిన (అంతర) దృష్టి మధ్యము నుండే అని ఈ చిత్రము చెప్పుచున్నది. చిత్రములో చూపబడిన, ఒక దానిపై ఒకటి బోర్లించినట్లున్న శంకువులపై వున్న రంగుల రేఖలు ఈ ప్రక్రియ ఎంత క్లిష్టమైనదో చూపుతున్నవి. పర్యవసానంగా, అందుబాటులో ఉన్న అన్ని శక్తులను (జీవ, మానసిక మరియు శారీరక శక్తులు) సమకాలీకరించడం ద్వారా నిజమైన బాహ్య ప్రపంచంతో సామరస్యము, సంబంధము ఏర్పడుతుంది. అంత వరకు Virtual realityలా కపడునే కానీ అంతరంగ అనుభవమునకు రాదు.
అలా బాహ్య ప్రపంచం తళుకుబెళుకు మంటూ ఒక్కొక్క కోణములో ఒక్కో విధముగా కనిపిస్తూ మనకు తెలిసినదే నిజమని భ్రమింప చేస్తుంది. ఒక చిన్న పొరపాటు కూడా ప్రపంచం పట్ల మన దృక్పథాన్ని మారుస్తుంది. అందుమూలముననే భగవద్గీతలో పదే పదే "యఃపశ్యతి స పశ్యతి" (ఆ రకముగా చూచువాడు దృష్ట) అని పలు మారులు చెప్పబడింది.
మనం ఏమి చేస్తాము? జీవితాన్ని గడపడానికి తగిన వనుకున్న శాస్త్రీయ మరియు భాషా పరిజ్ఞానములను సంపాదించి ‘నేను జీవితాన్ని సమర్ధవంతంగా గడపగలననే’ ఖచ్చితత్వంతో ప్రారంభిస్తాము. అదొక రంగుల దృక్పథం. అందుకే క్రింది భాగము ముదురు గొధుమ వర్ణంలో చూపటనికి మనము నేర్చిన ఏ ప్రక్రియలూ ఆ సత్య మార్గమున వుపయోగపడక పోవడమే కాదు, ప్రతిబంధకాలు కూడా కావచ్చును అని సూచించిరి. ఈ సందర్భముగా అన్నమాచార్యుల కీర్తన "ఎవ్వరినేర్పులు జెప్ప నిందు నేది?" గుర్తుకు తెచ్చుకుందాము.
హిల్మా అఫ్ క్లింట్ ప్రశంసల కోసం చిత్రలేఖనం చేయలేదు. నిజానికి ఆమె 1944లో మరణించిన 40 ఏళ్ల తర్వాత వరకు ఆమె వేసిన చిత్రపటములు బయటి ప్రపంచానికి తెలియరాలేదు.
కాబట్టి అన్నమాచార్యుల అఖండమగు ప్రజ్ఞ తెలియగల పరిమితులను దాటుకుని విస్తరించినదని, దానిని కాలములు, దూరములు దవ్వున నిలచి వీక్షించునే తప్ప, తమ గమనములలో చుట్టి మరుగున పరచలేనిదని తెలియును.
ముఖ్య పదములకు అర్ధములు: చిత్త మంతర్ముఖము సేసుకొన నేర్చెనా = ఉదయించు అనేకానేక సందేహముల సమాధానముల కొరకు
బాహ్యము నుండి కాక తనలోనే తాను చూడ నేర్చుట = అనగా ఆ వుత్పన్నమవుచున్న
ప్రశ్నలు అసంబద్ధమైనవని, అవి కేవలము ప్రతిక్రియలని గుర్తించి
ఏమీ చేయ నూరక వుండుట; అత్తల
= ఆవలి వైపు; సత్తసత్తనెడి సువిచారంబు గలిగెనా
= ఇది సత్యము లేదా అసత్యము అనునది మనసున విచారించి తెలియ నేర్చెనా?
భావము: సూక్ష్మాతిసూక్ష్మ బాహ్య ప్రకోపములను
కూడా గుర్తించి, తెలిసియు ఊరకయుండు
స్థితిలో జీవనము సాగించి ఆవలి వైపు చేరువాడు యోగియనఁబడును. సత్యాసత్యముల గ్రహింపులో
నిమగ్నమై వుండువానిని వుత్తమవివేకియని వూహింపవచ్చును.
వివరణము: క్లింట్ గారి పెయింటింగ్’లో గమనించండి, దిగువ భాగంలో, చాఱలు మరియు గీతలు వృత్తము మధ్యకు ప్రవహిస్తున్నట్లున్నాయి. ఇది కీర్తనలోని 'చిత్త మంతర్ముఖము సేసుకొన నేర్చెనా'ను పోలి ఉంటుంది. అయితే, ఈ అన్వేషణలలో ప్రయత్నము కంటే గ్రహణము (బుద్ధికి తగులుట) ముఖ్యమని గుర్తించాలి. అందువల్ల, ఇది అభ్యాసము మరియు ప్రయత్నముల ద్వారా సాధించిన యోగా లేదా సర్కస్ భంగిమ వంటిది కాదు.
అత్తల నతఁడు యోగియనఁబడును: అన్నమాచార్య కీర్తనలను కేవలం మేధోపరమైన అవగాహనతో కాకుండా ఆచరణాత్మక/వాస్తవిక అవగాహనతో గమనించాలి. యోగిగా రూపాంతరం చెందాడని గుర్తించిన తర్వాతే అలాంటి పేరు కలగవచ్చును.
జ్ఞానము కూడా ఒక మానసిక స్థితి మాత్రమే, దానికి పరిమాణమలు లేవు. మంచి చెడులను (పాపపుణ్యములను) గుర్తించే సామర్థ్యం మన మున్న స్థితి
వ్యాజము (స్థితి కలిగించు భ్రమలు) ప్రకోపించిన
పరిస్థితులలో అంత సులభం కాదు. అందుకు ఎంతో శ్రమ అవసరం. ఆ ప్రయత్నం దిశగా సాగే కదలికలు
వివేకము.
ముఖ్య పదములకు అర్ధములు: భావము నభావమును పరికించి తెలిసెనా
= “జీవితానికి దారితీయు మార్గమా?
లేదా ఇతరమా" అను విచక్షణ కలిగెనా.
భావము: తాను చేయునది జీవనమునకు దారితీయు
మార్గమా? లేదా
ఇతరమా" అను విచక్షణ కలిగెనా వాడు కైవల్యనిలయుఁడని తలచ బడును. దైవముయొక్క భావములను
ప్రతిబింబించు మనసు కలిగెనా అతడే జీవన్ముక్తుఁడని
చెప్పఁబడును.
వివరణము: దైవంబుఁ దలపోయ నేర్చెనా: సంతోస సమయములలో మరచి
దుఃఖములు ముంచుకొచ్చినప్పుడు తలచు సాధనమా? అతడి అమిత శక్తికి
తలయొగ్గెడి భయామా? కోరికలు తీర్చు
పరుసవేది యని కొలుచుటయా? వరదలు వెల్లువలనుండి
కాపాడు స్థిరమైన గట్టువంటి వాడని మనసులో తలచుటయా? దైవముయొక్క భావములను ప్రతిబింబించు మనసు వేరు విషయములను తలచునా?
ముఖ్య పదములకు అర్ధములు: అడరి = కలిగి, నియోగించి; జడియు = (సామాన్య అర్ధము: భయపడు) పుష్పించి, వికసించి.
భావము: ఒక వ్యక్తి ప్రాపంచిక విషయముల
నుండి వేరు పడుటకు స్థిరముగా ప్రయత్నిస్తే, వారు వారి ఇంద్రియాలపై పట్టు సాధించారని చెప్పవచ్చు. వినయముగా
వేంకటేశ్వరుని దాసునిగా మారెనా శీఘ్రముగా దివ్యలోకంలో భాగమవుతారు.
వివరణము: ఈ విషయాలు సరళంగా అనిపిస్తాయి మరియు మంచి అనుభూతిని కలిగిస్తాయి.
కానీ, సత్యమార్గం కఠినమైనది మరియు ప్రతిఫలము లేనిది (ఆర్థికముగాను మానసికముగాను
లాభార్జన లేనిదని, వ్యక్తిగత గుర్తింపు వుండనిది) అని అర్థం చేసుకోండి.
-x-x-x-
పుట్టుటకు ముందు జీవులు అవ్యక్తములు అంటే కనిపించనివి. జీవితకాలంలో స్థూల,సూక్ష్మ, కారణ శరీరములతో కనిపిస్తాయి కనుక వ్యక్తములు.మరల మరణసమయంలో జీవాత్మ స్థూల శరీరాన్ని(నశ్వరమైనది) విడిచిపెట్టి సూక్ష్మ, కారణశరీరములను తీసికొని అవ్యక్తముగా ఉంటుంది.
ReplyDelete*అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత ।*
*అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా||*
(గీత 2-28)
పుట్టుటకు ముందు,గిట్టిన తరువాత కూడా ఉండే ఆత్మ నిత్యము, సత్యము, సనాతనమైనది.
"ముందు వెనకెంచేనా ముఖ్యుడే యతడు" అన్న అన్నమయ్య చెప్పింది
సనాతనమైన, నిత్యసత్యమైన ఈ ఆత్మనే యని నా భావన.ఈ జ్ఞానము సాధించినవాడు ముఖ్యుడే అంటే జ్ఞానియే యని, ఈ విషయం తెలియనంత వరకాతడు అజ్ఞానియే యని, "అందాకా దా దానే అంత కెక్కుడు కాడు" అని పల్లవిలో తెలియజేస్తున్నారు అన్నమయ్య.
అన్వయించుకొన గలిగితే సత్యమును తెలుసుకొనుటకు ప్రయత్నం, సాధన చేయనంత కాలం మనిషి జడుడేనని భావం.
హిల్మా అఫ్ క్లింట్ చిత్రం బాహ్య, అంతర దృష్టి - వీటి మధ్యగల వ్యత్యాసం, సత్యాన్ని కనుగొనుటకు బాహ్యదృష్టి యెట్టి అవరోధమో, అంతర దృష్టితోనే సత్యాన్వేషణ ప్రారంభం అవుతుందని చెప్పకనే చెప్పుతున్నది.
యద్దృశ్యం తన్నశ్యం - బాహ్యంలో కనిపించేది అంతా అసత్యం, మిథ్య.
యోగి యనేవాడు శమదమాది సాధన చతుష్టయముచే అంతర, బహిరింద్రియ నిగ్రహం కలిగి యుండి అంతర్దృష్టితో తితిక్ష, ఉపరతి, శ్రద్ద యనబడే సాధనల ద్వారా అజ్ఞానమునకు ఆవలి వైపున ఉన్నటువంటి జ్ఞానప్రకాశమును దర్శిస్తాడని మొదటి చరణంలో చెప్పుతున్నారు ఆచార్యులవారు.
ఏది జ్ఞానం, ఏది అజ్ఞానం- ఏది సత్యము,ఏదసత్యమనే విచక్షణాజ్ఞానం కలిగిన యోగి కటోరమైన సాధన ద్వారా కైవల్యప్రాప్తిని పొంది, పరమసుఖమును బడయగలుగుతాడని అన్నమయ్య రెండవ చరణంలో ఆధ్యాత్మికమైన బోధను చేస్తున్నారు.సంపూర్ణమైన జీవ-పరమాత్మైక్య స్థితిని పొందినవారు
జీవన్ముక్తులే యగుదురని కూడా తెలుపుచున్నారు ఆచార్యులవారు.
ఇంద్రియనిగ్రహం కలిగి, వివేకవైరాగ్యములతో సత్యమును దర్శింపవచ్చునని, శ్రీవెంకటేశ్వరుని భక్తుడిగా భక్తియోగమార్గం ద్వారా కూడా పరబ్రహ్మ స్థితిని చేరుకోగలడని అన్నమయ్య చెబుతున్నారు ఆఖరి చరణంలో.
అన్నమయ్య కీర్తనలలో ఈ కీర్తన విశేషమైనదని చెప్పవచ్చును.
ఓమ్ తత్ సత్ 🙏🏻🙏🏻🙏🏻
కృష్ణ మోహన్