Saturday, 16 March 2024

T-199. తందనాన ఆహి తందనాన పురె

 అన్నమాచార్యులు 

199. తందనాన ఆహి తందనాన పురె 

అకర్తారం స పశ్యతి (నిశ్చలమైన బుద్ధియే ద్రష్ట)

వ్యాఖ్యానము: చామర్తి శంకర నాగ శ్రీనివాస్

For commentary in English  please press here

 

ఉపోద్ఘాతము: అన్నమాచార్యుల అత్యంత ప్రజాదరణ పొందిన కీర్తనలోని సమానత్వం అనే ఉపరితల సందేశానికి మించిన అంతరార్థాలను లోతుగా పరిశీలించుట ఈ సమర్పణ లక్ష్యం. అత్యంత లయబద్ధమైన ఈ కీర్తనలో మాటలకు అందని ఎన్నో భావములను పొందుపరచిన అన్నమాచార్యుని దార్శనికతను అభినందిద్దాం. 

మనలను ప్రపంచంతో అనుసంధానించే వాహకాలుగా మన శరీరము ఇంద్రియములు పనిచేస్తాయి. మన చర్మం యొక్క ప్రతి చదరపు అంగుళం చుట్టుపక్కల పర్యావరణంతో నిరంతర సహవాసములో వుంటుంది.  ప్రతి నరం, ప్రతి అంగుళం ఈ లోతైన పరస్పర చర్యలలో మునిగిపోయినప్పుడు, అటువంటి అనుభూతిని వ్యక్తీకరించడానికి పదాలు సరిపోవు. అందువలన అన్నమాచార్యులు "తందనాన ఆహి" అనే పదాన్ని ఉపయోగించి ఈ అనుభవాన్ని మరింత విశ్వవ్యాప్తం చేసారు. పర్యావరణంతోను, విశ్వముతోను మనకున్న సంబంధం భావాత్మకమైనది మాత్రమే కాదని గ్రహించే పారవశ్యం భాష పరిమితులను అధిగమిస్తుంది. ఇదే ఈ కీర్తన అంతిమ సందేశం. ​ 

అన్నమాచార్యులు తన మేధస్సు నంతా ఉపయోగించి మానవులు, ప్రపంచము, దాని పరిసరాలు, దేవతలు, జంతువులు మరియు కీటకాల యొక్క సంక్లిష్టమైన వ్యవస్థలో పరస్పర అవలంబనమును తెలియజేసారు. వీటన్నింటిని విశ్వమను ఒక గొప్ప నాటకశాలలో ఓలలాడు ఒండొకరుల అన్యోన్య ఆశ్రయముల (లేదా ప్రాపుల) సంబంధములను, ప్రేరితమైన అసంకల్పిత చర్యల సమతుల్యతలోని ఏకత్వమును సూచిస్తుంది. ఇందులో భౌతిక, భౌతికేతర అంశాలు పెనవేసుకుని, జీవన్మరణాల మధ్య హద్దులను మసకపరిచి, శూన్యం, అస్తిత్వం ఏక అస్తిత్వంగా కలిసిపోయే విశ్వాన్ని ఆయన కవిత్వం చిత్రిస్తుంది. 

నిజానికి, అన్నమాచార్యుని భావన​ విశ్వజనీనమైన రూపాంతరాన్ని ప్రేరేపిస్తుంది- పాతవాటికి భిన్నంగా, కొత్త అస్తిత్వ రూపాల్లోకి నిరంతర ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది. ఈ నిరంతర పరివర్తనలో పాల్గొనాలంటే విశ్వ శక్తులను బేషరతుగా అంగీకరించాలి. మానవులు తమ భవితవ్యాన్ని తామే నిర్ణయించగలరనే నమ్మకం చీమ ప్రపంచాన్ని మార్చగలదని నమ్మడం వంటిది. సర్వసమానత్వమును  స్వీకరించడానికి, ఈ విశ్వ ప్రవాహంలో చేరడానికి వినయాన్ని అంగీకరించి మరియు అహంకారాన్ని వదులుకోవడం అత్యావశ్యకము. 

తనదైన​​ ప్రత్యేకతను కోల్పోతాననే భయంతో ప్రతి వ్యక్తి తనకు తెలిసిన దానికి (జ్ఞానానికి) అతుక్కుపోయి ప్రతిఘటిస్తాడు. "ఆత్మ" (="నేను") అని పిలువబడే రక్షణ అవరోధం ద్వారా మన అవగాహనలు వడగొట్టబడతాయి. పర్యవసానంగా, మానవుడు వాస్తవికతకు దూరంగా "నేను" అను ఒక ఒంటరి ద్వీపంలో నివసిస్తాడు. 

ఈ విధంగా ఈ కీర్తన  రాజు, సేవకుడు; బ్రాహ్మణుడు, చండాలుడు; శిష్టాన్నములు మరియు దుష్టాన్నములు; దేవతలను మరిపించు కామము, కీటకాలు, ఘనకీటపశువులను ప్రేరేపించు కామము; ధనికులు, పేదలు; పగలు, రాత్రి అనే వ్యత్యాసములను రద్దు చేసే ప్రధాన ఇతివృత్తంతో కూడినది. పరములోనికి ప్రవేశించడానికి నిర్దిష్టమైన షరతులు లేవని వివరిస్తుంది. అన్నమాచార్యుని కీర్తన ఒక లోతైన సత్యాన్ని నిక్షిప్తం చేస్తుంది. ఆ దైవ క్షేత్రంలో, అన్ని భేదాలు కరిగిపోయి ఐక్యత నిలుస్తుంది. గెలుస్తుంది. ​ 

సృష్టి యొక్క ఏకత్వం కేవలం ఊహ, సిద్ధాంతం లేదా తప్పుదారి పట్టించే స్థితివ్యాజమునకు (conditioning) అతీతంగా ఉంటుంది-ఇది అంతర్లీన వాస్తవం. ఈ ఐక్యత ప్రతి ఒక్కరిలో ఆవిష్కృతం కావడానికి ఎదురుచూస్తూనే ఉంది. ఈ ఐక్యతను సాధించడానికి హృదయపూర్వక నిబద్ధత మరియు అచంచలమైన అంకితభావం, ఆ కార్యమందే లీనమై వుండుట​ అవసరం, ఇది కేవలం పార్ట్ టైమ్ ప్రయత్నం లేదా అప్పుడప్పుడు కాలక్షేపమునకు చేయు అన్వేషణ కాదు. 

దీనిలో, స్వీయ అధ్యయనానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. భగవంతుడు కావచ్చు, సమాజం కావచ్చు, దానము కావచ్చు, మరేదైనా దానిపై దృష్టి పెట్టడం ఆత్మ అధ్యయనములోనికి రాదు. ఈ విధంగా అన్నమాచార్యుల సందేశం కాలాతీత జ్ఞానాన్ని అందిస్తుంది. ఈ ఒక్క కీర్తన ద్వారా ఆయన సాహిత్యాన్ని చిరస్మరణీయం చేస్తూ, తెలియని గగన సదృశమగు సత్యమునకు వారధులు నిర్మించారు. ఆయన రచనలు బంగారంతో చెక్కబడతాయి. ఆయన మార్గదర్శకత్వం పొందడం మానవాళి అదృష్టం. 

భగవద్గీతలో శ్లోకంలో చెప్పబడినట్లు, న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః ।। 3-5।। భావము: ఈ ప్రపంచములో ఎవ్వరూ కూడా ఒక్క క్షణం కూడా కర్మను ఆచరించకుండా ఉండలేరు. నిజానికి, అన్ని ప్రాణులు తమతమ ప్రకృతి జనితమైన స్వభావాలచే (త్రి-గుణములు) ప్రేరితమై కర్మలు చేయవలసియే ఉండును. కర్మము చేయుట తప్పదు కాబట్టి, బ్రహ్మమొక్కటే అని తెలియుటకు దారితీయు చర్యను మాత్రమే చేపట్టవలెను. 

అధ్యాత్మ కీర్తన:

రాగిరేకు 177-5  సంపుటము: 2-385

తందనాన ఆహి తందనాన పురె
తందనాన భళా తందనాన          ॥పల్లవి॥
 
బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటె పర
పరబ్రహ్మమొకటే పరబ్రహ్మమొక్కటే        ॥తంద॥
 
కందువగు హీనాధికములిందు లేవు
అందరికి శ్రీహరే అంతరాత్మ
ఇందులో జంతుకుల మింతా నొకటే
అందరికి శ్రీహరే అంతరాత్మ        ॥తంద॥
 
నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటే
అండనే బంటునిద్రదియు నొకటే
మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి యొకటే
ఛండాలుడుండేటి సరిభూమి యొకటే      ॥తంద॥
 
అనుగుదేవతలకును అలకామసుఖ మొకటే
ఘనకీటపశువులకు కామసుఖ మొకటే
దిన మహోరాత్రములు తెగి ధనాఢ్యున కొకటే
వొనర నిరుఁబేదకును వొక్కటే అవియు ॥తంద॥
 
కొరలి శిష్టాన్నములు గొను నాఁకలొకటే
తిరుగు దుష్టాన్నములు దిను నాఁకలొకటే
పరగ దుర్గంధములపై వయువు నొకటే
వరుసఁ బరిమళముపై వాయువు నొకటే     ॥తంద॥
 
కడగి యేనుఁగుమీఁదఁ గాయు యెండొకటే
పుడమి శునకముమీఁదఁ బొలయు నెండొకతే
కడుఁబుణ్యులను పాపకర్ములను సరిఁ గావ
జడియు శ్రీవేంకటేశ్వరు నామ మొకటే      ॥తంద॥

వివరణములు:​

తందనాన ఆహి తందనాన పురె
తందనాన భళా తందనాన          ॥పల్లవి॥

ముఖ్యపదములకు అర్ధములు: తందాన వంత పాడే శబ్దము.ఆహి (= తాకట్టు, కుదువ), పురె (= ప్రశంసార్థకము), భళా (=బలే, సెబాసు): ఇప్పటి కాలంలో "ఆహా", ఒరే, భలే గా చెప్పుకోవచ్చు. 

భావము: అన్నమాచార్యులు తనలో కలిగిన  ఆనందాన్ని, పారవశ్యాన్ని, ఉత్సాహాన్ని ఆపుకోలేక, మాటలకు అతీతంగా తందనాన ఆహి తందనాన పురె తందనాన భళా తందనాన అని వ్యక్తపరిచారు.

వివరణము: మనం తరచుగా, ఆస్తులను సంపాదించుటలోని, పుణ్యం కూడబెట్టుటలోని, తమవారను వారిని ఆదరించుటలోని ఆనందాన్ని మాత్రమే అనుభవిస్తాము. గ్రహించ గలుగుతాం, కానీ విడిచిపెట్టడంలో ఉన్న సంతృప్తిని గ్రహించడంలో విఫలులవుతాము. మనం దానంగా డబ్బు లేదా సామగ్రిని ఇచ్చినప్పుడు, మనం  పుణ్యం పొందాలని ఆశిస్తాం. మనం ఏదైనా త్యజించ తలచితే అది కేవలం ప్రతిచర్య మాత్రమే! ఈలాగున పొందినా లేదా విస్మరించ బోయినా, రెండు అనుభవాలు నమోదు చేయబడతాయి మరియు వాటిలో కొన్నిటి పునరావృతం కోసం ఆరాట పడతాం, మరి కొన్నిటిని తిరిగి రాకూడదని ఆశిస్తాం.

మనము ఏదైనను వదలివేసిన తరువాత కూడా అది ఇంకా మన మనస్సులో వుందంటే నిజముగా త్యజించినట్లేనా? అటువంటి త్యాగము వలన ప్రయోజనమేమి? కావున, ఏ చర్య ద్వారా  అటువంటి తీగలలాగ సాగు బంధములు వుండవో ఆ నిర్ణయాత్మక చర్యను అన్నమాచార్యులు సూచించారు. తద్వారా, మనిషి దాని నుండి విముక్తి పొందుతాడు. ఈ పల్లవి అంతర్దృష్టులు అన్నమాచార్యులు  మనకు అందించిన లోతైన అవగాహనను ప్రతిబింబిస్తాయి.

బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటె పర
పరబ్రహ్మమొకటే పరబ్రహ్మమొక్కటే    ॥తంద॥ 

భావము: సమయము మరియు స్పేస్ యొక్క పరిమితులకు అతీతంగా; హెచ్చుతగ్గులు లేకుండా స్థిరముగాను; ఒడిదుడుకులు లేనిది సత్యము. 

ముఖ్యపదములకు అర్ధములుముఖ్యపదములకు అర్ధములు: ఆత్మసాక్షాత్కారం పొందిన తర్వాత అన్నమాచార్యులు సత్యం ఒక్కటే శాశ్వతమని ప్రకటించారు. తక్కినవన్నీ వలయ మార్గమున పయనించుచూ గమ్యములేక వుండును.  సత్యాన్ని ప్రత్యక్షంగా అనుభవించిన ఆయన పారవశ్యాన్ని ఆపుకోలేక ఈ అత్యద్భుతమైన కీర్తనను పాడారు అనుకొంటాను.

వారు "ఆకాశ పాకాశ మరుదైన కూటంబు" (=  అల్లకల్లోలముగాను, అస్తవ్యస్తముగాను కనబడు ఈ ప్రపంచం ఒక అసాధారణ సమూహం) అన్నారు. ఈ  లోక౦ అస్తవ్యస్త౦గా, వికృత౦గా కనబడుతుప్పటికీ, దోపిడీ, అసమానతలు, నిరంకుశత్వం, దౌర్జన్యము వంటి అనేక సమస్యలను మనం ఎదుర్కొంటున్నప్పటికీ, ఈ అడ్డంకుల వెనుక దాగి అంతర్లీనంగా ఒక సహజ క్రమం ఉంది, అది సాధారణ మానవ అవగాహనను మించినది.

మనం ఇంతకు ముందు చర్చించుకునట్లుగా, మానవ సమస్యలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి అంతర్గత ప్రతిఘటనను పూర్తిగా అంతమొందించడం చాలా అవసరం. ఏదేమైనా, మన సహజమైన కుతూహలం ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చినందుకు చాక్లేట్ అనే ప్రతిఫలం కోసం ఎదురుచూసే పాఠశాల విద్యార్థి వంటిది. అది నిరంతరం సమాధానాలను వెతకడానికి మనల్ని బలవంతం చేస్తుంది. అయినప్పటికీ, ఖచ్చితమైన సమాధానాలు అంటూ వుండవు; అర్థం చేసుకోవాలనే మన తపన మరింత ఉత్సుకతకు దారితీస్తుంది. "సమాధానాలకై వెతకకుండా ఒక సమస్యను పరీక్షించ​గలరా?" అన్న జిడ్డు కృష్ణమూర్తి ప్రశ్నలో మానవుల ప్రవృత్తి ప్రతిధ్వనిస్తుంది.



పైబొమ్మ​ ఎం.సి. ఎస్చెర్ గారు సృష్టించిన అద్భుత కళాకృతి సర్కిల్ లిమిట్. దీనిలోని చేపల మాదిరి ఈ నిరంతర ఉత్సుకత, తెలియవలెనన్న ఆతృత వలయము  ప్రపంచంలోని సంక్లిష్టతలలో మనల్ని లాగివేసి చుట్టుముడుతుంది. పురోగమించకుండా ఒక వర్తుల మార్గంలో లక్ష్యరహితంగా కదిలించుతూ పోతుంది. (సర్కిల్ లిమిట్ వివరణ కొరకు లింక్ నొక్కండి) అన్నమాచార్యుడు చెప్పిన "వొదుగుచు జలములనుండు మత్స్యములు / పదపడి యేగతి బాసీనయ్యా" వాగులోని చేపలు, నీటిలో ప్రయాణిస్తునే, బయట పడే మార్గాన్ని ఎలా కనుగొనగలవు? అన్నమాచార్యులు ప్రపంచంలోని కష్టాలను, గందరగోళాలను యథాతథంగా, ఎటువంటి ఆక్షేపణలు లేకుండా స్వీకరించటకు ప్రోత్సహిస్తారు. ఇది ఒక్కటియే ముందు త్రోవ. ఇతరములన్నీ సత్యమునుండి దూరముగా కొనిపోవు ప్రక్రియలే.  జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా ఇదియే సెలవిచ్చిరి.

కందువగు హీనాధికములిందు లేవు
అందరికి శ్రీహరే అంతరాత్మ
ఇందులో జంతుకుల మింతా నొకటే
అందరికి శ్రీహరే అంతరాత్మ      ॥తంద॥ 

ముఖ్యపదములకు అర్ధములు: కందువగు = మోసపూరితమైన, మాయ, కృత్రిమము;

భావము: ఈ ప్రపంచంలో, ఎక్కువ మరియు తక్కువ అను కృత్రిమ భేదాలు లేవు.  అందరికీ శ్రీహరియే అంతరాత్మ. ఆయన దృష్టిలో అన్ని జంతువులంతా (మానవులు, సమస్త జీవరాశులు కలిపి) సమానమే. అందరికీ శ్రీహరియే అంతరాత్మ అన్నది మాత్రమే సత్యము.

వివరణము: కందువగు = కుతంత్రం, అబద్ధం, కల్పితం - అన్నమాచార్యులు తన వాదనను కొనసాగిస్తూ, అధికులు, అధములు అన్నవి కుల, మతసామాజిక వ్యవస్థలు ఏర్పరచుకున్న మనస్సుకు సంబంధించినవని, వాస్తవముగా  ప్రాణులన్నీ సమానమే అని నొక్కి చెప్పారు.  ఇవి అయోమయమున పడిన మనస్సు సృష్టించు నిర్మాణాలు. కొందరికి ఇది కష్టంగా అనిపించినా, భాగవతం  క్షుణ్ణంగా అర్ధము చేసుకుంటే, ఆ శ్రీహరియే విశ్వాన్ని పరిరక్షించడానికి వివిధ జీవ రూపాలను ధరించినట్లు తెలుస్తుంది. 

అందరికి శ్రీహరే అంతరాత్మ: చరాచర ప్రపంచమును కలిపే ఒక అంతర్లీనమైన విశ్వజనీన సూత్రము ఒకటి ఉందని అన్నమాచార్యులు చెబుతున్నారు.   ఆ నియమము సృష్టిని, సృష్టికర్తను  కలుపుతూ, మనుగడ యొక్క అన్ని అంశాలకు ఆధారమై నిలిచి ఉంటుందన్నారు.  జీవము, నిర్జీవము; చరము, అచరము; క్రింద, పైన; హెచ్చుతక్కువలకు ఆశ్రయము నివ్వక ఈ భౌతిక ప్రపంచము పరములను అనుసంధనించుతూ వున్నది.  ఇది బాహ్యంగా స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, దాని అపరిమితమైన విస్తృతిని గ్రహించడానికి లోతైన ఏకాగ్రత అవసరం. అపుడు ఈ శరీరం ఆ అద్భుతమైన సింఫనీలో (symphony) చేరడానికి వాహకంగా పనిచేస్తుంది. 

ఆ విశ్వసారముతో అనుసంధానం కావడానికి లోతుగా పాతుకుపోయిన చీలికలను అధిగమించాల్సిన అవసరాన్ని అన్నమాచార్యుల కీర్తన నొక్కిచెబుతుంది. ఇది క్షణికానందం కోసము  విభేదాలను తాత్కాలికంగా పక్కన పెట్టడం కానేకాదు. మనలను ఈ ధరణి నుండి వేరు చేయు విభజనలన్నీ వాస్తవముగా సమసిపోయినపుడే ఆ విశ్వవ్యూహముతో సామరస్యంగా ఏకమగుటకు ఆస్కారము కలుగుతుంది. 



కందువగు హీనాధికములిందు లేవు:నేను అందరినీ సమానంగా చూస్తాను" అని చెప్పుకోవడంలో కాదు, నిజమైన ప్రేమ నరనరములలో ప్రాకుతుండగా మన ప్రతి జీవిని కరుణతో చూచుతూ, ప్రతి అడుగును బాధ్యతతోనూ జాగ్రత్తగాను వేయుచూ జీవించడం అనుకోవచ్చును. ఇది కేవలం భావనాత్మక లేదా మేధోపరమైన భావాలకు అతీతమైనది. మనిషిలోని అహము అతణ్ణి ఈ ప్రపంచము నుండి విడదీసి "నేను వేరు; ప్రపంచము వేరు" అను సృష్టించుకున్న అసమానతలు అనే ద్వీపంలో నివసింపజేస్తుంది. నియంత్రిస్తుంది. దీని పై వివరణ కొరకు హిల్మా అఫ్ క్లింట్ వేసిన "హంస (swan) నెం.10" అనే అందమైన పెయింటింగ్'ను చూడమని  పాఠకులను కోరుతున్నాను. (వివరణ కొరకు లింక్ నొక్కండి).

నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటే
అండనే బంటునిద్రదియు నొకటే
మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి యొకటే
ఛండాలుడుండేటి సరిభూమి యొకటే  ॥తంద॥ 

ముఖ్యపదములకు అర్ధములు: మెట్టు భూమి = సంచరించు భూమి; సరిభూమి = యుక్తమైన భూమి, తగిన భూమి. అనుగు = ముఖ్యుఁడు

భావము: (జీవితము అందించు) సౌఖ్యములతో సంతృప్తిని చెంది నిద్రించు రాజు, అతని పక్కన నిండీనిండని కడుపుతో అసంతృప్తిగా నిద్రించు బంటునిద్ర ఒక్కటే. దొడ్డ బ్రాహ్మణుడు, ఛండాలుడు ఒకే భూమిని  మెట్టుతూ నడుస్తారు.

అనుగుదేవతలకును అలకామసుఖ మొకటే
ఘనకీటపశువులకు కామసుఖ మొకటే
దిన మహోరాత్రములు తెగి ధనాఢ్యున కొకటే
వొనర నిరుఁబేదకును వొక్కటే అవియు         ॥తంద॥

ముఖ్యపదములకు అర్ధములు: అనుగు = ముఖ్యుఁడు, ఇష్టమైన​.

భావము: ఆ దాహము, కోరికలు తీర్చుకొని సుఖము అనుభవించ వలెనను వాంఛలు  (మన) ఇష్టదేవతలకు ఘనకీటపశువులకు సరిచూచిన ఒకటే కాదా?  ధనికునికి నిరుపేదకు పగలు మరియు రాత్రుళ్ళ నిడివి ఒకటే కాదా?

వివరణము: పై రెండు చరణములలో జీవమొక్కటైనప్పటికి, జీవరాశులలోని హెచ్చుతగ్గులను బేధభావములు  మన అంతరంగముపై తాత్కాలికముగా ప్రభావము చూపి మన దృక్కోణమును మరల్చి వైచును అని అన్నమాచార్యులు సెలవిచ్చారు. పర్యవసానముగా మార్పు అవిచ్ఛిన్నంగా నిరంతరముగా జరుగుతున్నప్పటికీ, మనము తరచుగా సూక్ష్మ పరివర్తనలను విస్మరిస్తాము. గణనీయమైన (స్థూలమైన) మార్పులను మాత్రమే గమనించి అంగీకరిస్తాము. ఈ రకముగా చిన్న చిన్న కట్టలుగా మూటలుగా (ప్యాకెట్లుగా) సమాచారము, భోగట్టాలు మనలో ప్రవేశిస్తాయి. ఫలితముగా, ఒకే సత్యమును ఒకే సమాచారమును వేర్వేరుగా చూడబోతాము.  దీనితో మన అవగాహన ముక్కలు ముక్కలుగా విడిపోయి కొరగానిదౌతుంది.

అన్నమాచార్యులు ఒక అనూహ్యమైన సమూలమైన నిరంతర రూపాంతరాన్ని ప్రతిపాదించుచునున్నారు. దీనిలో మనమందరం మనమన పాత్రలను పోషిస్తున్నాము. ప్రతి క్షణం దాని ప్రస్తుత రూపం, స్వభావం మరియు కూర్పుల నుండి విడదీయబడిన (completely detached) పరివర్తనకు లోనవుతుంది. ఇక్కడ  అన్నమాచార్యులు ఒక లోతైన రూపాంతరాన్ని వర్ణిస్తున్నారు. దీనిలో మనమందరం ఒక పాత్ర పోషిస్తాము.

మానవులమైన మనకు క్షణికమైన జీవితం గురించి అవగాహన ఉన్నప్పటికీ,  మనము ప్రస్తుతం నమోదు చేయబడిన జ్ఞానము మరియు ఆలోచనలకు అతుక్కుపోయి, (మన ప్రమేయము లేకనే) అనుకోకుండా విశ్వ శక్తులకు వ్యతిరేకంగా అడ్డంకులను ఏర్పాటు చేస్తున్నాము.

పర్యవసానంగా, జీవితం ఒక నిరంతర పోరాటంగా మారుతుంది. ఈ పెనగులాటలో అలసిపోయి మానవుడు నిర్వీర్యుడైపోతాడు. మరణమువైపు అడుగులేస్తాడు. ఇది నిష్ప్రయోజనమైన మనుగడ అని; దీనికి మించి దేదీప్యమానమగు జీవనమొకటున్నదని అన్నమాచార్యులు పదేపదే చెప్పారు.

ఛిన్నాభిన్నమైన అంతరంగము

దీనిని ఇంకా కూలంకషంగా సాల్వడార్ డాలీ వేసిన "జ్ఞాపకశక్తి యొక్క స్థిరత్వం యొక్క విచ్ఛిన్నం" అనే అత్యద్భుత కళాఖండం పరిశీలించుతూ తెలుసుకుందాం. ఈ ప్రసిద్ధి చెందిన పెయింటింగ్ లో కళాకారుడు తన మునుపటి "ది పెర్సిస్టెన్స్ ఆఫ్ మెమరీ" అను పెయింటింగ్  పునఃపరిశీలించాడు.  "ఎక్కడ నుంచి మన అవగాహన మొదలౌతుందో అదియే స్థిరత్వంలేనిది" అని ఈ చిత్రలేఖనం యొక్క సారాంశం.



సాల్వడార్ డాలీ కాలము మరియు జ్ఞాపకాలతో మానవాళి యొక్క అవిరామ పోరాటాన్ని స్థిరంగా చిత్రీకరించాడు. ఆయన చిత్రాల్లోని వక్రీకరించిన, పొడవైన గడియారాలు మారుతున్న కాలమునకు అనుగుణంగా ఆడలేని (అమరలేని) మన అసమర్థతకు ప్రతీక.

పాత ఆలోచనలు, పాత అనుభూతులకు అంటుకుపోయి, కొత్త దృక్పథాలతో ప్రపంచాన్ని గ్రహించకుండా అడ్డకట్టుచూ మనుగడ సాగిస్తాం.  మరుపురాని బాధ కన్నా మధురమే లేదు / గతము తలచి వగచే కన్నా సౌఖ్యమే లేదు అన్న దేవదాస్ మాటలు ఏ మాత్రము అతిశయోక్తి కాదు.  తరచూ మనం గతంలో జారిపోతుంటాం. మనము ప్రపంచమును యథాతథంగా చూడటానికి బదులుగా, మన కోరికలు మరియు ఆకాంక్షల కోణములో చూస్తాము.

పెయింటింగ్  ప్రధాన లక్ష్యం నీటి అడుగున అస్పష్టంగా చిత్రీకరించిన జీవి. అది జీవించి వుందో లేదో కూడా చెప్పలేము. మన గురించి మనకు చాలా తక్కువ తెలుసునని మసకబారిన బొమ్మ ద్వారా తెలిపారు. ఒక చేప లాంటి ప్రాణి ఆ జీవిని పట్టించుకోకుండా ముందుకు సాగడం మన జీవితాల్లో కరుణ లేమికి సంకేతం.

పెయింటింగ్ పైభాగంలో ఉన్న కాటలోనియా ల్యాండ్ స్కేప్ (సాల్వడార్ డాలీ గారి స్వస్థలం) తెలిసిన పరిసరాలతో పెనవేసుకున్న అనుబంధానికి దర్పణము. వాటిని వదిలించుకోలేం.

పెయింటింగ్ లో చాలా భాగము నీటిలో ముంచి చూపి మన దృక్పథం స్థితివ్యాజం (స్థితి కల్పించు మిష, కపటము, మోసము) నకు లోబడి ఉంటుందని స్పష్టం చేస్తోంది.  తూటాల వంటివి, ముఖ్యంగా చేప వైపు దూసుకెళుతున్నట్లు చూపి తక్కిన ప్రాణుల పట్ల మన వైఖరి చెబుతాయి. ఈ   తూటాలు మనము ఎంచుకున్న ఆలోచనలను లేదా ఆదర్శాలను హింసాత్మకంగా సమర్థించడానికి సిద్ధంగా ఉంటామని చూపుతున్నవి. మన మృగప్రవృత్తులను దీనితో ముడిపెట్టవచ్చు.

ఈ విధముగా మన పరిమిత గ్రహింపు సామర్థ్యం కారణంగా సత్యం యొక్క సంపూర్ణతను మన హృదయములలో ఆవిష్కరించుకోలేక  మనం ప్రపంచాన్ని ముక్కలు ముక్కలుగా (విడివిడిగా) చూస్తాము. పర్యవసానంగా, సంపూర్ణత అనేది వాస్తవ స్థితి ఐనప్పటికీ కేవలం భావనాత్మకమైనది అని భావించుటకు ఆస్కారము గలదు. సామాజిక నియమాలు, భాష, మత విశ్వాసాలు, విద్య మరియు జాతీయతలు ప్రేరిపించు  స్థితివ్యాజం (స్థితి కల్పించు మిష, కపటము, మోసము, కండిషనింగ్) ద్వారా మన అవగాహనలు ప్రభావితమవుతాయి మరియు వక్రీకరించబడతాయి.

జీవమే రూపాంతరం

ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్, అమెరికాలో శాస్త్రవేత్తల ద్వారా ట్రోఫిక్ కాస్కేడ్ (అశక్తతా సోపాన క్రమము) అను దృగ్విషయం ఆవిష్కరించబడింది. (దీనిపై పూర్తి వివరణమునకు లింకును తెరిచి చూడండి). దీనితో పోలికలను చూపుతూ, ఇంతకు ముందు పేర్కొన్న గణనీయమైన రూపాంతరీకరణను పునఃసమీక్షిద్దాం. జతచేయబడిన వీడియోను జాగ్రత్తగా చూడమని పాఠకులను అభ్యర్థన​.



కాస్కేడ్ ప్రభావాన్ని క్షీణత ప్రక్రియగా పరిగణించడం ద్వారా, విశ్వంలోని అన్ని మూలకాలను (ప్రకృతి అనగా జీవులు, వృక్షములు, చరాచరములు, నదులు, సముద్రములు, కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, భూమి, ఇక్కడి వాతావరణము, సుర్యమండలము మొదలుగా గలవి) కలిపే విస్తృతమైన రూపాంతరీకరణను పాఠకులు ఊహించవచ్చును. ఈ పరివర్తన కేవలం సైద్ధాంతికమైనది కాదు, అన్నమాచార్యులు, జిడ్డు కృష్ణమూర్తి వంటి దార్శనికులు అనుభవించిన సుస్పష్టమైన వాస్తవం. 

మనకు ప్రపంచంతో గల  సంబంధము కేవలము తలపు కాదు. ఇది వాస్తవమైన  సంబంధం. దీనిని నుండి మనము దూరము జరిగి కపట అభినయము అలవరచుకున్నాము. ఈ సంబంధము ఇంతకు  ముందు చర్చించుకున్నట్లు పూర్తి స్థాయిలో నిజముగా మనలో ప్రకాశించవలెను. ఆ సంబంధంలో వేరు వేరు భావనలు కాక, ఏక భావన అగుటను కూడా వివరించుకున్నాము. (refer T-157 ఏ తపములు నేల యేదానములు నేల అను కీర్తన వివరణము  చదవండి.)

ఆ ఐక్యతను వ్యక్తి తనకు ఉన్నదంతా పణముగా పెట్టి గుండెలకు హత్తుకొన్నప్పడు, ఆ ఏక మార్గ చర్యకు (non-returnable action) ఒడబడి పూనుకున్నప్పుడు ఆ ఐక్యత సాధించవచ్చును. ఇది పార్ట్-టైమ్ అన్వేషణకో, మనోల్లాసమునకో చేబట్టు చర్యయో కాదు.

ఆ రూపాంతరీకరణలో భాగమగుటకు సర్వము విడిచి మానవుడూ సిద్ధమవ్వవలెను. "అవ్వా కావాలి, బువ్వా కావాలి" అంటే సాధ్యము కాదు. కార్యతే హ్యవశః కర్మ (3-5) =  కార్యతే హి అవశః కర్మ = బలవంతముగా ఆ ప్రవాహములో కొట్టుకొని పోవుదము. ఇక్కడ పేర్కొన్న "బలవంతము కొట్టుకొని పోవుట" ముఖ్యముగా మన మానసిక స్థితి - నాకు తెలుసు అను భావమునుండి వచ్చుచున్నది. ఈ విశ్వములో తన అల్ప స్థానము గ్రహించి, విశ్వ వివేకమును  మనస్పూర్తిగా  స్వీకరించి ఐక్యమగువారు ధన్యులు.

ఇందులో స్వీయ అధ్యయనమునకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. స్వీయ అధ్యయనము నందు స్వీయము  కాక మరేదైనా - అది దైవము కావచ్చు; సమాజం కావచ్చు; దానములు కావచ్చు; మరోదానిపై దృష్టి మరలడం అత్యంత కఠిన స్వీయ అధ్యయనము కాజాలదు.  దీనినే జ్ఞానము (సెల్ఫ్ నాలెడ్జ్, Self-knowledge) అనిరి.

స్వీయ అధ్యయనమునందు ఏకాగ్రతతో వున్న మనసు నిశ్శబ్దపు అంచుల్ని తాకుతుంది. ఆ నిశ్శబ్దములో నుండి శాంతి వుద్భవిస్తుంది. నిశ్శబ్దము శాంతి ప్రవర్తించు ఆ సమయములో తలపులను కలుషములు మటుమాయమై చూపులలో స్పష్టత వచ్చును.   ఆ స్థితిలో సర్వము ఏకమై బేధభావములు సమసిపోవును. ఐక్యత​, ఏకతలు రాజ్యమేలుతున్నప్పుడు సందేహాలుంటాయా? అదియే "బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటె".

అకర్తారం స పశ్యతి (నిశ్చలమైన బుద్ధియే ద్రష్ట): భగవద్గీతలో పదే పదే పునరుద్ఘాటనము చేసిన "స పశ్యతి" అర్ధము కూడా ఇదియే. ఈ విధంగా అన్నమాచార్యుల సందేశం కాలము విధించు పరిమితులను చీల్చుకుంటూ మానవులకు ఏకత్వమును సాధించు ఆస్కారము కల్పించినది. ఈ కీర్తన ద్వారా ఆయన సాహిత్యాన్ని చిరస్మరణీయం చేస్తూ, తెలియని ఆ పరమునకు వారధులు నిర్మించారు. ఆయన రచనలు బంగారంలో చెక్కబడతాయి అని భావిస్తాను. ఆయన మార్గదర్శకత్వం పొందడం మానవాళి అదృష్టం.

కొరలి శిష్టాన్నములు గొను నాఁకలొకటే
తిరుగు దుష్టాన్నములు దిను నాఁకలొకటే
పరగ దుర్గంధములపై వయువు నొకటే
వరుసఁ బరిమళముపై వాయువు నొకటే         ॥తంద॥ 

ముఖ్యపదములకు అర్ధములు: కొరలి = సముచితమైన; పరగ = ఒప్పుగా; వరుసఁ = శ్రేణి.

భావము: సముచితమైన దేవుళ్ళకు సమర్పించుటకు తగిన శిష్టాన్నములు మరియు దుష్టాన్నములు రుచి చూచు నాలుక ఒకటే. ఒప్పుగా దుర్గంధములపై వీచు వాయువు, ఉత్తమ శ్రేణి పరిమళముపై పరుగిడు వాయువు ఒకటే.

వివరణము: ఏది ఆమోదయోగ్యమైనదిగా పరిగణించబడుతుందో, ఏది అసహ్యించుకునేందుకు అర్హమో నిర్ణయించునదెవరు? వీనిని మనమెలా గుర్తించగలం? ఈ భేదాలు మన ప్రస్తుత మనసిక స్థితి నుండి ఉద్భవిస్తాయి, ఇది ఏది వుత్తమము” “ఏది కాదు అను అవగాహనలను నిర్దేశిస్తుంది. మనం దేనినైనా ఉత్తమముగా ముద్ర వేసినప్పుడు, ఉత్తమము కాని దాని నుండి మనల్ని మనం దూరం చేసుకునే ప్రక్రియను ప్రారంభిస్తాము. ఇది కీర్తన యొక్క సారాంశానికి విరుద్ధంగా ఉంటుంది. ఇదియే ప్రాథమిక విభజన ప్రక్రియ.

ఆసక్తికరమైన విషయమేమంటే, ‘కపట అభినయములో పేర్కొన్న కపటము కావాలని చేయునది కాదు.  కపటమును గుర్తించుటయే జ్ఞానము.

కడగి యేనుఁగుమీఁదఁ గాయు యెండొకటే
పుడమి శునకముమీఁదఁ బొలయు నెండొకతే
కడుఁబుణ్యులను పాపకర్ములను సరిఁ గావ
జడియు శ్రీవేంకటేశ్వరు నామ మొకటే ॥తంద॥ 

ముఖ్యపదములకు అర్ధములు: కడగి = చివరికి; సరిఁ గావ = సరిసమానముగా  చూచి కాచు వాడు జడియు = నిరంతరము {జడివాన = ఆగకుండా కురియు వాన  నుండి వచ్చింది};

భావము: చివరిగా, ఏనుగు మరియు నీచమైన శునకముల మీద కాయు ఎండ ఒకటే. నిరంతరము ఎంతో పుణ్యులను, పాపులను సరిసమానముగా చూచి కాచు శ్రీవేంకటేశ్వరు నామ మొకటే. 

వివరణము: మన చుట్టూ ఉన్న ప్రపంచం నుండి సమాధానాల కోసం అన్వేషణలో, మనము తరచుగా భిన్నమైన ఎంపికలను చేయబోతాము. అన్నమాచార్యుని కీర్తన ఈ లోకంలో ఏకీకృత సారాన్ని అన్వేషించమని ప్రేరేపిస్తుంది. ఈ ఐక్యతను వెలికితీయడంపైనే మన జీవిత లక్ష్యం కేంద్రీకృతమైనప్పుడు, మన ప్రస్తుత అవగాహన ఆధారంగా పుణ్యం మరియు పాపంల మధ్య వ్యత్యాసంతో సహా మిగిలినవన్నీ అసంబద్ధంగా మారతాయి.

ఇక్కడ చెప్పబడిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మానవులందరూ  భగవంతుని అనుగ్రహమునకు అర్హులే. 'అధికులు అధములు నరుని దృష్టిలోనే బేధాలు. ఇవి మన ఇప్పటి స్థితివ్యాజం నుంచి ఏర్పడిన అనుభూతులే. దైవము దృష్టిలో అంతా సమానులే.

-x-x- సమాప్తం -x-x-

No comments:

Post a Comment

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...