అన్నమాచార్యులు
131 ఏది
మాకు గతి యిఁక నీశ్వరేశ్వరా
Those interested in English Version may press this
ఉపోద్ఘాతము: అన్నమాచార్యులు
మనము నిజముగా జీవితమును పరిగ్రహించి, వహించి, సహించు విధానాన్ని వర్ణించారు. మనం కళ్ళతో చూసినవన్నీ కావాలనుకొంటాము.
ఉచితనుచితాలు విచారించకుండా వినినవన్నీ మన ప్రేమకు అర్హమైనవని నమ్ముతాము. సౌఖ్యాలు
మరియు ఆనందముల కోసం సమయమునకు ఎదురు పరుగు పెడుతూ గడిపేస్తాము. ఏది మాకు గతి యిఁక
నీశ్వరేశ్వరా?
ప్రతి చరణము మానవుని కృషిని, ఉద్యోగములను సన్నాహములను చాటు కళాఖండం. కొన్ని పదములను తిరిగి తిరిగి ఉపయోగించి, ఆయా కార్యములే మనమున్న స్థితికి కారణములని పరోక్షంగా ప్రతిపాదించిరి. ఈ స్థితి నుండి వెడలుదారి ఆయా పదములు అనుమితించు కార్యములే సాధనములనీ చాటుగా చెప్పిరి. ఆయన అసాధ్యమగు విషయములను పదములను పూల మాలలందు కనపడని దారము వలె అల్లికలో అంతర్గతంగా ఇమిడ్చి భగవంతునికి అర్పించిరి.
కీర్తన: రాగిరేకు: 326-6 సంపుటము: 4-153 |
ఏది మాకు గతి యిఁక నీశ్వరేశ్వరా యీ దెస మము గరుణ నీడేర్చవయ్యా ॥పల్లవి॥
పొంచిమున్ను భోగించిన భోగములు దలఁచి అంచెల నాలుబిడ్డల నటు దలఁచి కంచపుటాహరములు కన్నవెల్లాను దలఁచి
యెంచి నిన్నుఁ దలఁచక యిట్లున్నారమయ్యా ॥ఏది॥ కన్నులఁజూచినందెల్లా కడునాసలఁ దగిలి విన్న వినుకులకెల్లా వేడ్కఁదగిలి పన్నిన సుఖములకుఁ బైకొని వెనుతగిలి వున్నతి నిన్నుఁ దగులుకున్నారమయ్యా ॥ఏది॥ చెంది గృహారామ క్షేత్రములు మరిగి పొందగు సంసారమిప్పుడు మరిగి అందపు శ్రీ వేంకటేశ అలమేల్మంగపతివి కందువ మరిగీ మరుగకున్నారమయ్యా ॥ఏది॥ |
Details and Explanations:
ఏది మాకు గతి యిఁక నీశ్వరేశ్వరా
భావము: ఇటు తరువాత ఈశ్వరేశ్వరా ఏది మాకు గతి? ఓ దేవా! ఇక్కడి మమ్ము కరుణతో సంబాళించవయ్యా.
వివరణము: అన్నమాచార్యులు నేర్పునంతటినీ ఉపయోగించు కళాకారుడు. నిజానికి పొంచి
... దలఁచి, అంచెల.. దలఁచి, కంచములు .. దలఁచి, యెంచి నిన్నుఁ దలఁచక.. ఏది మాకు గతి యిఁక నీశ్వరేశ్వరా అని చెప్పకయే అనిపింప చేస్తాడు. అజ్ఞానమునుండి జ్ఞానమునకు మార్గములేదు.
అజ్ఞానము వదిలితేనే జ్ఞానమునకు అవకాశము కలుగును.
అన్వయార్ధము: అవ్వ బువ్వ రెండూ కావాలను కోవడము అవివేకము#1. సన్మార్గము తెలుసుకో.
పొంచిమున్ను భోగించిన
భోగములు దలఁచి
అంచెల నాలుబిడ్డల నటు
దలఁచి
కంచపుటాహరములు కన్నవెల్లాను
దలఁచి
యెంచి నిన్నుఁ దలఁచక
యిట్లున్నారమయ్యా ॥ఏది॥
ముఖ్య పదాలకు
అర్ధాలు: పొంచి = వేటగాని వలె దీక్షతో కాచుకుని ఉండు,
భావము: ఇంద్రియ సుఖాలు ఎప్పుడు దొరుకుతాయా అని వేటగాని వలె దీక్షతో కాచుకుని ఉంటాము. నిరంతరం భార్య మరియు పిల్లల గురించే ఆలోచిస్తాము. పళ్ళెంలో అమర్చిన ఆహారాన్ని మరియు ఈ ప్రపంచంలో చూసే అన్నింటిని ప్రేమగా, శ్రద్ధగా గుర్తుంచుకుంటాము. అయినప్పటికీ, దేవా మా ఆలోచనల్లో నీవుండవే (నీవేదో అప్రయోజకుడివైనట్లుగా). అందుకే, మేము యిట్లున్నారమయ్యా.
వివరణము: అన్నమాచార్యులు, పదే పదే ‘దలచి’ అని వాడడం ద్వారా, ఈ సుఖాలు, బంధుత్వాలు, అనుబంధాలు అనేక మార్లు పునరావృతం కావడం వల్ల ఏర్పడిన స్మృతి చిహ్నాలు అని గుర్తు చేస్తున్నాడు. ‘పొంచి..దలచి’ అని ప్రయోగించి విషయ లోలత్వమును గుఱిగా చేసుకొను మనస్తత్వమును బయల్పరచిరి.
అన్వయార్ధము: మనుష్యుడా!
ప్రేమపూర్వక అనుభవాలను, అనుబంధాలను పదేపదే మననము చేసుకోవడము ఆలోచించడము నీ ప్రస్తుత
విచారకరమైన స్థితికి కారణములు.
కన్నులఁజూచినందెల్లా
కడునాసలఁ దగిలి
విన్న వినుకులకెల్లా
వేడ్కఁదగిలి
పన్నిన సుఖములకుఁ బైకొని
వెనుతగిలి
వున్నతి నిన్నుఁ దగులకున్నారమయ్యా ॥ఏది॥
ముఖ్య పదాలకు అర్ధాలు: పన్నిన = ఆలోచించి అమర్చుకున్నవి; పైకొని = ఎదురు పరుగుపెట్టు,
భావము: మనము
కళ్ళతో చూచినదెల్లా, ఉత్సాహభరితంగా కోరుకుంటాం. విన్న విషయాలు
ఆసక్తిని రేకెత్తించి అభిమానాన్ని గెలుచుకుంటాయి. ఊహించిన సౌకర్యాలు
మరియు ఆనందాలను
సాధించడానికి సమయానికి
వ్యతిరేకంగా పరుగెత్తుతాము. అత్యున్నతుడివైనా మరియు
గొప్పవాడివైనా నీతో జత
కట్టడానికి ప్రయత్నించమే.
వివరణము: ఇప్పటి వరకు అన్నమాచార్యుల కీర్తనలలో కనుగొన్న కత్తికంటే పదునైన పరిశీలన "పన్నిన సుఖములకుఁ బైకొని వెనుతగిలి" = ఊహించిన సౌకర్యాలను మరియు ఆనందాలను సాధించడానికి సమయంతో పోటీపడి మరీ పరుగెత్తుతాము. ఇదే ఆధునిక మానవునికి ప్రాతినిధ్యం వహించే ఏకైక వైఖరి. 15వ శతాబ్దానికి చెందిన ఈ సాధువు మన ప్రస్తుత ఆధునిక జీవిత సారమును ఇంత ఖచ్చితంగా ఎలా వర్ణించగలిగాడో అర్థం కాలేదు.
ఈ చరణములో అన్నమాచార్యులు 'కన్నులఁజూచినందెల్లా'తో ఏమి చెప్పదలచుకున్నారో? మనం నిజంగా చూసేదేమిటి? దిగువన ఉన్న (రెనే మాగ్రిట్టే వేసిన) ఫాల్స్ మిర్రర్ అనే చిత్రాన్ని పరిశీలించండి.
కంటి కనుపాపను ఫాల్స్ మిర్రర్ (బూటకపు దర్పణం) లో నీలం, మేఘాలతో నిండిన ఆకాశంతో భర్తీ చేయడం ద్వారా, చిత్రకారుడు మాగ్రిట్టే మనం ఏమి చూస్తున్నామో మరియు మనకు ఏమి తెలుసనుకుంటున్నామో ప్రశ్నించమని సవాలు చేస్తాడు. కన్ను చూస్తున్నదానికి ఆకాశం ప్రతిబింబమా? నిజానికి కన్ను మరొక వాస్తవంలోకి తెరుచుకుంటోందా? మన౦ లోని ఆ౦తర౦గాన్ని దర్శిస్తున్నామా, లేక వేరొకదానిని చూసి భ్రమిస్తున్నామా? ఏమైనప్పటికీ మాగ్రిట్టే యొక్క ఫాల్స్ మిర్రర్ ప్రపంచాన్ని భిన్నంగా చూడటానికి ఒక ఆహ్వానం. అన్నమాచార్యుల కీర్తనలూ అంతే.
చెంది గృహారామ క్షేత్రములు
మరిగి
పొందగు సంసారమిప్పుడు
మరిగి
అందపు శ్రీ వేంకటేశ అలమేల్మంగపతివి
కందువ మరిగీ మరుగకున్నారమయ్యా ॥ఏది॥
ముఖ్య పదాలకు అర్ధాలు: కందువ = జాడ, సంకేత స్థలము,
భావము: ఓ
ప్రభూ! మేము
ఇళ్ళలోనూ మరియు
ప్రశాంతమైన ప్రదేశాలలోనూ ఉండటానికి మరిగాము.
ఇష్టపూర్వకంగాను ఎంచుకునిమరీ కుటుంబ జీవితంలోకి
ప్రవేశిస్తాము. ఓ
అందమైన శ్రీ వేంకటేశ!
ఓ అలమేలుమంగ
పతి! నీవెక్కడో,
నీజాడలెక్కడో తెలిసీ
తెలియనట్లుంటామయ్యా!
Explanation: మనమంతా క్రింద ఉన్న అద్భుతమైన ప్రదేశాల్లాంటివి సందర్శించాలని, అక్కడే ఉండిపోవాలనీ ఉవ్విళ్ళూరతాం. అయితే, మిత్రులారా!, అన్నమాచార్యుని ఈ పల్లవిని ఒకింత పరికించండి. ఏలోకమందున్నా నేమి లేదు = మీరు ఏ లోకములో నివసిస్తున్నారనేది ముఖ్యమే కాదు!
'మరిగి' అనే పదమఉను పదేపదే ఉపయోగి౦చి, మనకు తెలిసిన విషయాలలోనే తచ్చాడుతూ గడపవలెనని కోరుకు౦టామని పరోక్షముగా తెలిపారు. 'చెంది..మరిగి'లను అనుసంధానము చేసి అన్నమాచార్యులు మనం ప్రత్యేకించి అపరిచిత పరిస్థితులను దాటవేయడం కోసము శక్తినంతా ఒడ్డుదుమని సూచించినట్లైనది. అందువలన, వారు మానవునికి భవిష్యత్తుపై ఊఁతమే లేని భయాన్ని మరియు ఊహాజనితమైన ఆందోళనలను తెర వెనుక నుంచి లేవనెత్తారు.
ఇప్పుడు చార్లెస్ మెరియోన్ చెక్కిన Pont-au-Change అను శీర్షిక గల దిగువ చిత్రాన్ని చూడండి.
ప్యారిస్ నడిబొడ్డున, సీన్ నదిపై ఎడమవైపు పాతబస్తిని కుడి గట్టుపై City Islandను (ద్వీపనగరము) సంధిస్తూ Le Pont-au-Change (the Exchange Bridge, వంతెన) ఉంది. అప్పట్లో ప్యారిస్ నగరాన్ని ఆధునీకరించాలనే ప్రభుత్వ ప్రణాళికల్లో చార్లెస్ మెరియోన్ వర్ణించిన పాత పొరుగు ప్రాంతాలను కూల్చివేసి, వాటి స్థానంలో విశాలమైన బౌలేవార్డ్‌లను (వృక్షశ్రేణీశోభిత వీధులు) నిర్మించదలచింది. నేపథ్యంలో, మధ్యయుగానికి చెందినట్లు కనపడుతున్న దట్టమైన ఇళ్ళ సమూహం, పటిష్టంగా కుక్కబడిన చిట్టడవి లాంటి నగరం కపడతాయి. శతాబ్దాలనాటి పారిస్‌ని మెరియన్ చూపిస్తాడు, కానీ కళాకారుడి పనిలో చారిత్రక వాస్తవం కేవలం ఒక అంశం మాత్రమే.ఇక్కడ అనేక వాస్తవిక స్థాయిలను క్రమంగా కలిపే ఈ ప్రక్రియలో భవిష్యత్తుపై ఆందోళన, బహుశా భయం కూడా స్పురింప చేస్తాడు. ఈ చిత్రము అనేక దశలలో ముద్రించబడింది, ప్రతిసారి కనిపెట్టిన కొత్త అంశాలను చేర్చడు. పాతవి మార్చాడు. మునుపటి సంస్కరణల్లో, ఉదాహరణకు, ఒక బెలూన్ ఆకాశంలో తేలుతుంది. అంచెలంచెలుగా, ఇక్కడ కనిపించే నల్లని పక్షుల గుంపులతో సహా మరిన్ని దుశ్శకునములు సన్నివేశంలోకి ప్రవేశిస్తాయి. నీటిలో మునిగిపోతున్న వ్యక్తి నిస్సహాయ భావనను జోడిస్తాడు. కాబట్టి ఈ Le Pont-au-Change చిత్రపటము పేరుకు తగ్గట్లు వర్తమానం నుండి భవిష్యత్తుకు జరుగు మార్పుమీద మనిషి యొక్క నిరాధారమైన భయాన్ని, అర్ధములేని ఆదుర్దానూ ప్రతిబింబిస్తుంది.
మరోవైపున, మరిగీ మరుగకున్నారమయ్యా అనే పదం మనిషికి ఇతర ప్రపంచం గురించి సూచనప్రాయముగా తెలిసినా అది ఏమిటో మరియు ఎక్కడ ఉందో అతను ఖచ్చితంగా నిర్ణయించలేడు అని స్పురింపచేస్తుంది. మనిషి భవిష్యత్తును తెలిసినదాన్నుంచి నిగిడించుచూ (సాగదీస్తూ) ఊహాగానాలు చేస్తాడు. ఎల్లప్పుడూ రేఖీయ పరివర్తన లేదా సేంద్రీయ పెరుగుదలల కోణంలోనే చూస్తాడు. తెలిసినదాని నుండి తెలియనిదానికి పరివర్తన రేఖీయంగానే ఉండవలెనని నీయమము లేదు. తనకు అవసరము లేకున్నా రాబోవు కాలమును నిర్ణయింపబోవుట మానవుని సార్వజనిక విచిత్ర ప్రవృత్తి#2.
చరిత్రను పరిశీలించితే, మార్పులు ఎల్లప్పుడూ ఉప్పెనల వలె, అనూహ్యమైన పెనుగాలుల వలె వచ్చి పడతాయి. బహుశా భయపడినా మిగిలేది ఆదుర్దాయే కానీ చేయగలిగినది ఏమీలేదు. యుద్ధము నుంచి తప్పించుకొనుటకు భూగృహాలు, సొరంగ మార్గములు ఏర్పాటు చేసుకుంటాడు. ఆరోగ్యభీమాలను, బ్యాంకులను, ధనమును నమ్ముకొని క్షణక్షణము వాటిపై ఉత్ప్రేక్షించుట మనకు వ్యసనము.
Implied
meaning: వెర్రివాడా! నూతిలోని కప్పలాగ
ఉన్నచోటుననే వుండ ప్రయత్నింతువు. ఈ వ్యర్ధపు
ప్రయాసలన్నీ విడిచి, నీలో ఏమూలనో దాగియున్న దైవమును ఎప్పుడైనా తలిచావా?
References
and Recommendations for further reading:
#1 1. అమ్మేదొకటియు ( ammE dokaTiyu)
#2 6. వెనకేదో
ముందరేదో (venakEdO muMdarEdO)
కీర్తన సంగ్రహ సారం:
పల్లవి: ఇటు తరువాత ఈశ్వరేశ్వరా ఏది మాకు గతి? ఓ దేవా! ఇక్కడి మమ్ము కరుణతో సంబాళించవయ్యా. అన్వయార్ధము: అవ్వ బువ్వ రెండూ కావాలను కోవడము అవివేకము#1. సన్మార్గము తెలుసుకో.
చరణం 1: ఇంద్రియ సుఖాలు ఎప్పుడు దొరుకుతాయా అని వేటగాని వలె దీక్షతో కాచుకుని ఉంటాము. నిరంతరం భార్య మరియు పిల్లల గురించే ఆలోచిస్తాము. పళ్ళెంలో అమర్చిన ఆహారాన్ని మరియు ఈ ప్రపంచంలో మేము చూసే అన్నింటిని ప్రేమగా, శ్రద్ధగా గుర్తుంచుకుంటాము. అయినప్పటికీ, మా ఆలోచనల్లో నీవుండవే (నీవేదో అప్రయోజకుడివైనట్లుగా). అందుకే, మేము యిట్లున్నారమయ్యా. అన్వయార్ధము: మనుష్యుడా! ప్రేమపూర్వక
అనుభవాలను, అనుబంధాలను పదేపదే మననము చేసుకోవడము ఆలోచించడము నీ ప్రస్తుత విచారకరమైన
స్థితికి కారణములు.
చరణం 2: మనము కళ్ళతో చూచినదెల్లా, ఉత్సాహభరితంగా కోరుకుంటాం. విన్న విషయాలు ఆసక్తిని రేకెత్తించి అభిమానాన్ని గెలుచుకుంటాయి. ఊహించిన సౌకర్యాలు మరియు ఆనందాలను సాధించడానికి సమయానికి వ్యతిరేకంగా పరుగెత్తుతాము. అత్యున్నతుడివైనా మరియు గొప్పవాడివైనా నీతో జత కట్టడానికి ప్రయత్నించమే.
చరణం 3: ఓ ప్రభూ! మేము ఇళ్ళలోనూ మరియు ప్రశాంతమైన ప్రదేశాలలోనూ ఉండటానికి మరిగాము. ఇష్టపూర్వకంగాను ఎంచుకునిమరీ కుటుంబ జీవితంలోకి ప్రవేశిస్తాము. ఓ అందమైన శ్రీ వేంకటేశ! ఓ అలమేలుమంగ పతి! నీవెక్కడో, నీజాడలెక్కడో తెలిసీ తెలియనట్లుంటామయ్యా! Implied meaning: వెర్రివాడా!
నూతిలోని కప్పలాగ ఉన్నచోటుననే వుండ ప్రయత్నింతువు. ఈ వ్యర్ధపు ప్రయాసలన్నీ విడిచి, నీలో ఏమూలనో దాగియున్న
దైవమును ఎప్పుడైనా తలిచావా?