Sunday, 6 July 2025

T-238 అలమేలుమంగ నీవన్నిటా నొరపరివి

 తాళ్లపాక అన్నమాచార్యులు

238 అలమేలుమంగ నీవన్నిటా నొరపరివి

For English version press here

ఉపోద్ఘాతము

భగవద్గీతని జీవించారు అన్నమాచార్యులవారు: 

ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః ।

మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే13-19

క్షేత్రమును,

జ్ఞానజ్ఞేయాదులను

(చూచే చూపు, దానిలో దాగి ఉన్న పరమసత్యమును)

తెలియువాడు,

భగవంతుని స్వరూపాన్ని చేరతాడు.

 

అన్నమయ్య ఆ స్థితిని చేరాడు.

ఇక్కడ మాటల్లేవు—

దేవుని భావమే —స్పష్టం

అన్నమయ్య అంతరంగంలో.

 

ఈ స్థితిలో,

చూపే శబ్దం.

సౌందర్యమే వాక్యం.

ప్రత్యక్షతే శాస్త్రం.

 

అది దివ్య తత్వం మాట్లాడిన మౌనం.

ఇది గీతా తత్వం ఘనీభవించిన క్షణం.


శృంగార  కీర్తన

రేకు: 1848-4 సంపుటము: 28-279

అలమేలుమంగ నీవన్నిటా నొరపరివి
కలికి నీ వొళ్ల నివి కంటిమే చెలియా ॥పల్లవి॥
 
బలిమిగలవారికిని పంతంబు లీడేరు
కలిమిగలవారికిని గర్వమమరు
చలముగలవారికిని సరసంబు లనువుపడు
కలదెల్ల నీ వొళ్ల గంటిమే చెలియా   ॥అల॥
 
ననుపుగలవారికిని నవ్వినంతయుఁ జెల్లు
చనవుగలవారికిని జరగుఁ బొందు
మనసుగలవారికిని మలసి నెనఁగఁవచ్చు
ఘనతలివి నీవొళ్ల గంటిమే చెలియా ॥అల॥
 
వెరవుగలవారికిని వేడుకలు నెలవుకొను
సిరులుగలవారికినిఁ జేరు కీర్తి
యిరవుకొని శ్రీవేంకటేశ్వరుఁడు నిను నేలె
గరిమి లివి నీవొళ్ల గొంటిమే చెలియా ॥అల॥

 

Details and Explanations:

పల్లవి:

అలమేలుమంగ నీవన్నిటా నొరపరివి
కలికి నీ వొళ్ల నివి కంటిమే చెలియా
॥పల్లవి॥

పదబంధం

అర్థం

అలమేలుమంగ

ఓ అలమేలుమంగా! (దైవము అన్నమాచార్యుల రూపములోని అలమేలుమంగతో)

నీవన్నిటా నొరపరివి

నీవన్ని విషయములలో నేర్పరివయ్యావు.

కలికి

ఓ అందమా! తరుణీ

నీ వొళ్ల నివి కంటిమే చెలియా

నీ వొంటిలో ఇవన్నీ చూచితినే చెలియా


 

ప్రత్యక్ష భావము: 

(దైవము)

ఓ అలమేలుమంగా!

నీవన్ని విషయములలో నేర్పరివయ్యావు.

నీలోని లక్షణాలను ఎప్పుడూ నోట చెప్పలేదే.

ఓ తరుణీ!

అవన్నీ నీ రూపంలో అందంగా వొదిగి ఉన్నాయి.

నీ రూపం చాలు — అన్నీ ప్రత్యక్షమయ్యాయి. 


వ్యాఖ్యానం:

పల్లవిలో మాటల్లేవు.
కేవలం దృష్టి ఉంది. అభినివేశం ఉంది.
ఇది అంతః దృష్టి.​
గొప్పతనం చెప్పుకోలేదు —
కానీ నిన్ను చూసి తెలుసుకొంటున్నాను,
అన్నీ నీ రూపంలోనే ఉన్నాయి.
 
ఇక్కడ అన్నమయ్య  లేడు.
ఈ భావము తెరచిన హృదయం
దేవ​దేవుని అంతరంగం చెబుతుంది.
అలమేలుమంగా రూపంలో పరిపూర్ణత కనిపిస్తోంది.
పురుషుని కన్నుల్లో వాక్యం ఇది. 

ఈ భావన — శృంగారం, తత్త్వం, శరణం
అన్నింటినీ కలిపిన విశిష్ట దృష్టి.

మొదటి చరణం:

బలిమిగలవారికిని పంతంబు లీడేరు
కలిమిగలవారికిని గర్వమమరు
చలముగలవారికిని సరసంబు లనువుపడు
కలదెల్ల నీ వొళ్ల గంటిమే చెలియా         ॥అల॥

పదబంధం

అర్థం

బలిమిగలవారికిని పంతంబు లీడేరు

బలముగలవారికిని  పంతములు చెల్లవచ్చును.

కలిమిగలవారికిని గర్వమమరు

సంపదలతో విఱ్ఱవీగువారికి గర్వము అమర వచ్చును

చలముగలవారికిని సరసంబు లనువుపడు

సౌందర్యము గలవారికి సరసములు అనువుగావచ్చును.

కలదెల్ల నీ వొళ్ల గంటిమే చెలియా

ఈ జగమున కల అన్ని లక్షణాలూ నీ వొంటిలోనే ఉన్నాయి చెలియా (అలమేలుమంగ రూపంలోనే పరిపూర్ణంగా వెలిసినావే)


 

ప్రత్యక్ష భావము

ఓ అలమేలుమంగా!

బలముగలవారికిని  పంతములు చెల్లవచ్చును.

సంపదలతో విఱ్ఱవీగువారికి గర్వము అమర వచ్చును.

సౌందర్యము గలవారికి సరసములు అనువుగావచ్చును.

ఈ జగమున కల అన్ని లక్షణాలూ నీ వొంటిలోనే ఉన్నాయి చెలియా

(అలమేలుమంగ రూపంలోనే పరిపూర్ణంగా వెలిసినావే)


వ్యాఖ్యానం:

అన్నమాచార్యుల ఆత్మీయ​ ఆహ్వానం

మానవులారా —
మీరు ఒక్కొకరిగా,
ఒక్కొక రంగంలో
అప్రతిభులై అలరిస్తున్నారు.

 

ఒక్కొక తేజం...
ఒక్కొక దిశ...
ఒక్కొక దారిలో
పరాకాష్ఠలను అంటుతున్నారు.

 

కానీ ఆ తేజాలన్నీ
పాయలు మాత్రమే —
ఒకే కేంద్రంలో కలిసే పతాకాలు.


అక్కడే పరిపూర్ణత మెరుస్తుంది.

ఆ పరిపూర్ణతలోని తీపి —
అవిభాజ్యం.
అనిర్వచనీయం.
అపూర్వమైన సాక్షాత్కారం.

 

అక్కడ —
మన ప్రతిభలు
సూర్యుని ముందున్న
దివిటీల వెలుగై మిగిలిపోతాయి.


రెండవ​ చరణం: 

ననుపుగలవారికిని నవ్వినంతయుఁ జెల్లు
చనవుగలవారికిని జరగుఁ బొందు
మనసుగలవారికిని మలసి నెనఁగఁవచ్చు
ఘనతలివి నీవొళ్ల గంటిమే చెలియా ॥అల॥ 

పాఠ్యం (Line)

పదార్థం (Literal Meaning)

ననుపుగలవారికిని నవ్వినంతయుఁ జెల్లు

అనురాగము, ఇంపు గలవారికి నవ్వినా సరిపోవును

చనవుగలవారికిని జరగుఁ బొందు

అనురక్తి, అభిమానము గలవారికి పొందు లభించును

మనసుగలవారికిని మలసి నెనఁగఁవచ్చు

మనసుగలవారు  చెలరేగినా  అమోదమే

ఘనతలివి నీవొళ్ల గంటిమే చెలియా

ఈ ఘనతలన్నీ నీవొళ్ల కంటినే చెలియా


 

ప్రత్యక్ష భావము: 

ఓ అలమేలుమంగా!

అనురాగము, ఇంపు గలవారికి నవ్వినా సరిపోవును

అనురక్తి, అభిమానము గలవారికి పొందు లభించును

మనసుగలవారు  చెలరేగినా  అమోదమే
ఈ ఘనతలన్నీ నీవొళ్ల కంటినే చెలియా


మూడవ​ ​ చరణం:

వెరవుగలవారికిని వేడుకలు నెలవుకొను
సిరులుగలవారికినిఁ జేరు కీర్తి
యిరవుకొని శ్రీవేంకటేశ్వరుఁడు నిను నేలె
గరిమి లివి నీవొళ్ల గొంటిమే చెలియా ॥అల॥ 

పాఠ్యం (Line)

పదార్థం (Literal Meaning)

వెరవుగలవారికిని వేడుకలు నెలవుకొను

ఉపాయములు గలవారికి వేడుకలే నివాసములు

సిరులుగలవారికినిఁ జేరు కీర్తి

ధనము, మంచి మనసు గలవారికి కీర్తి చేకూరును

యిరవుకొని శ్రీవేంకటేశ్వరుఁడు నిను నేలె

నిన్నే నివాసముగా చేసుకొని శ్రీవేంకటేశ్వరుఁడు ఏలుచున్నాడు

గరిమి లివి నీవొళ్ల గొంటిమే చెలియా

ఈ గరిమలన్ని నీవొళ్ల కంటిమే చెలియా


 

ప్రత్యక్ష భావము: 

వెరవు తెలిసిన వారికి
జీవితమే ఉత్సవం.
సిరిసంపదలతో, సహనంతో నిండిన వారు
కీర్తిని పొందుట సహజం​.
 
ఓ అలమేలుమంగా!
నిన్నే నివాసముగా చేసుకొని శ్రీవేంకటేశ్వరుఁడు ఏలుచున్నాడు
ఈ గరిమలన్ని నీవొళ్ల కంటిమే చెలియా

వ్యాఖ్యానం:

 

యిరవుకొని శ్రీవేంకటేశ్వరుఁడు నిను నేలె”

ఇది వర్ణన కాదు —
అన్నమయ్య చేసిన ఋజువు.
తాను కాలరహిత స్థితిలోకి
చేరిన అక్షయ గాథ.

 

అక్కడ —
హద్దులు లేవు,
ఆధారంగా నిలిచే గోడలూ లేవు.
చూసేవాడు, చూసిన దృశ్యం, చూసే చూపు —
అన్నీ ఒక్కటై మిగిలేది 'నిర్మలమైన ఉనికి' మాత్రమే.
చలనం — ఊపిరిలా స్వేచ్ఛగా,
కాలమనే బురుజులుండవు.
 
కానీ మనం మాత్రం —
ప్రతి ఆలోచనను గడియారంతో కొలుస్తాం,
ప్రతి చర్యను భయంతో తీర్చిదిద్దుతాం,
హామీ, పూచీ, భద్రతల జాలములలో చిక్కుతాం.
దీనికితోడు “నేను” అనే న్యాయమూర్తి —
ఈ నాటకానికి తీర్పు చెబుతుంటాడు.
తనకు లేని న్యాయాన్ని, ఇతరులకే ఖరారు చేస్తాడు.
తనది రక్తం, ఇతరులది నీరు అంటాడు.
 
అంతః స్థితిలో మాత్రం —
నేను” లేదు, “మేము” లేదు,
నడిపించే ప్రతి అనే అపశ్రుతి లేదు.
ఉన్నది ఒక్కరే —
పరిపూర్ణతగా మెరుస్తున్న వేంకటేశ్వరుడు.

No comments:

Post a Comment

T-238 అలమేలుమంగ నీవన్నిటా నొరపరివి

  తాళ్లపాక అన్నమాచార్యులు 238 అలమేలుమంగ నీవన్నిటా నొరపరివి For English version press here ఉపోద్ఘాతము భగవద్గీతని జీవించారు అన్నమాచార్...