Saturday, 5 July 2025

T-237 భావించి నేరనైతి పశుబుద్ధినైతిని

 తాళ్లపాక అన్నమాచార్యులు

237 భావించి నేరనైతి పశుబుద్ధినైతిని

For English version press here

ఉపోద్ఘాతము

అన్నమయ్య వాక్యాలు ముగింపులు కావు.
అవి తలుపులు కావు —తెరుచుకుని సత్యాన్ని తాకెందుకు
మనసులను తాకే గాలి అల వంటివి.
తెరచిన కిటికిలో నుండి లోపలికి వచ్చు గాలి.
 
అతని కవిత్వం
అర్థం దిశగా కదిలే చలనములే
సంగతిని తెలిపే ప్రయత్నములే
కానీ సంగతికి తెలియు తీర్పు నీదే. 

గాడి తప్పిన మనసులకు
ఇంకొక గాడి చూపడు.
ఆ గాడి నుంచి తప్పిస్తాడు.
 
అతడు “సత్యం ఇదే” అని చెప్పడు —
“ఏమౌతుందో చూడు” అని మాత్రమే సూచిస్తాడు. 
 
ఇది “ఉత్తరం” ఇచ్చే కవిత్వం కాదు —
“ప్రశ్నల పక్కన కూర్చునే” ఇబ్బంది లేని భక్తి.

 

అధ్యాత్మ  కీర్తన

రేకు: 204-2 సంపుటము: 3-20

భావించి నేరనైతి పశుబుద్ధినైతిని
యీవల నా యపచార మిది గావవయ్యా ॥పల్లవి॥
 
హరి నీవు ప్రపంచమందుఁ బుట్టించితి మమ్ము
పరము నే సాధించేది బలుద్రోహమవుఁ గాదో
సిరుల నేలేటివాఁడు చెప్పినట్టు సేయక
విరసాలు బంట్లకు వేరే సేయఁ దగునా ॥భావిం॥
 
పంచేంద్రియములు నాపైఁ బంపువెట్టితివి నీవు
యెంచి వాని నే దండించేదిది నేరమౌఁ గాదో
పెంచేటి తల్లిదండ్రులు ప్రియమై వడ్డించఁగాను
కంచము కాలఁ దన్న సంగతి యాబిడ్డలకు ॥భావిం॥
 
మిక్కిలి సంసారము మెడఁగట్టితివి నాకు
అక్కర నే వేసారేది అపరాధమవుఁ గాదో
దిక్కుల శ్రీవేంకటాద్రి దేవుఁడ నీవియ్యఁగాను
యెక్కడో జీవుఁడ నేను యెదురాడఁ దగునా ॥భావిం॥

 

Details and Explanations:

పల్లవి:

భావించి నేరనైతి పశుబుద్ధినైతిని
యీవల నా యపచార మిది గావవయ్యా ॥పల్లవి॥ 

పదబంధం

అర్థం

భావించి నేరనైతి

ఆలోచించి, ఊహించి చేసినా — నేర్చుకోలేకపోతున్నాను

పశుబుద్ధినైతిని

నా బుద్ధి జంతువుల మాదిరిగా పని చేస్తోంది

యీవల నా యపచార మిది

ఈ లోకపు వైపు నేను చేసిన పనిలో తప్పు జరిగిందనుకుంటే నా అపచారమే అది.

గావవయ్యా

నన్ను రక్షించగలవాడు నీవే ప్రభూ


 

ప్రత్యక్ష భావము

 

నేను ఎంత ఆలోచించి, ఊహించి చేసినా, పనులు సక్రమముగా నేర్చుకోలేకపోతున్నాను. నిజానికి నాది పశుబుద్ధియే. ఈ లోకంలో చేద్దామనుకున్న పనులలో తప్పుంటే నా అపచారమే అది. ఇక నన్ను రక్షించగలవాడవు నీవే ప్రభూ. 


వ్యాఖ్యానం:

ఈ పల్లవిలో
అన్నమయ్య తన తప్పులను
తనను పెడద్రోవ పెట్టు శక్తులను
తేటతెల్లంగా  చూసెను.
తత్వదృష్టితో తెలుసుకొనెను.
 
ఆలోచించాడు —చేశాడు
కానీ ఆ చర్యలు వక్రములైతే చూశాడు
ఆలోచనల పరిమితిని అంచనా వేశాడు.
ఆ తెలియని శక్తులను గమనించాడు.
అతడు గ్రహించాడు.
 
ఇది పశ్చాత్తాపం కాదు —
వెనక్కినెట్టే లజ్జ కాదు —
ఒక ప్రశాంతమైన జ్ఞప్తి.
ఒక తలవంచని స్పష్టత.
 
ఈ పల్లవి  బాహాటముగా తడబాటు,
సత్యమును పట్టుకుందామన్న​ పొరపాటు
స్పష్టతలేకుంటే అగబాటు
దైవమే అసలైన ఎడబాటు

రెనె మాగ్రిట్ గారు చిత్రించిన శూన్యంలో గంటలు’ (The Voice of Space) అనే అధివాస్తవిక చిత్రమును పరిశీలించుతూ పల్లవిలోని అంశాలను మరింత తెలుసుకుందాం.



ఎక్కడో గగనతలంలో —
శూన్యంలో తేలియాడుతున్న మూడు గంటలు.
 
గంట అంటే సాధారణంగా
ఒక ఆహ్వానం,
ఒక చర్య ప్రారంభం,
ఒక సమ్మతి సంకేతం.
 
చూస్తాం —చూచి విందామనుకుంటాం కానీ స్వరం లేదు.
గరిమ ఉంది — ప్రయోజనం కానరాదు.
 
అన్నమయ్య పల్లవి కూడా అచ్చం అలానే ఉంటుంది.
అర్థమున్న వాక్యాలు — కానీ అర్థం తేటతెల్లమవదు.
మన ప్రయత్నములూ అంతే.  ఎదో చేస్తుంటాం.
ఎందుకో తెలియదు.
చెయ్యాలని వ్రాసి వుందా? ఆలోచించం.
 
బొమ్మలో గంటలుండీ శబ్దం వినలేము
ఈ భూమిలో ఏ కార్యములు చేసినా దైవమును చేరలేం.

మొదటి చరణం:

హరి నీవు ప్రపంచమందుఁ బుట్టించితి మమ్ము
పరము నే సాధించేది బలుద్రోహమవుఁ గాదో
సిరుల నేలేటివాఁడు చెప్పినట్టు సేయక
విరసాలు బంట్లకు వేరే సేయఁ దగునా ॥భావిం॥ 

పదబంధం

అర్థం

హరి నీవు ప్రపంచమందుఁ బుట్టించితి మమ్ము

శ్రీహరి నీవు ప్రపంచమందు మమ్మందరిని బుట్టించినావు

 

పరము నే సాధించేది బలుద్రోహమవుఁ గాదో

ఆ పరము అను దానిని సాధించుటకు నా యత్నములు దైవ ద్రోహమౌతాయో కావో నాకు తెలియదు

సిరుల నేలేటివాఁడు చెప్పినట్టు సేయక

దేహమను ఆస్తిని పదవిని ఏలుకొనువాడు (మన్మథుడు) చెప్పినట్లు చేయక​

విరసాలు బంట్లకు వేరే సేయఁదగునా

విరుద్ధముగా నాబోటి బంట్లు వేరేమి చేయదగును? (నాకు బుద్ధిలేక ఈ రకముగా చేయుచున్నాను. నాకు పరము సాధించుటకు ఇంకేమి చేయవలెనో పాలుబడుటలేదు.)


 

ప్రత్యక్ష భావము: 

హరి, నీవే —
ఈ ప్రపంచపు పొడవున మమ్మల్ని బుట్టించినవాడవు.
ఇప్పుడు నేను పరమార్థాన్ని కోరుకుంటే —
అది నిన్ను ధిక్కరించడమా?
 
సంపదలు, పదవులు, ప్రలోభాల ఊసులు —
విని నడిచే మార్గంలో నన్ను నడిపించలేను.
అవి మన్మథుని మాటలు.
ఆ మాటలకూ, ఆ బాటలకూ నేను దూరంగా ఉండదలచుకున్నాను.
 
కానీ ఇంకా, నాబోటి బంట్లు —
బుద్ధిలేని మనస్సులు,
మాయలో మురిసే మాంసపు దారులు —
వేరేలా చేయగలరా?
 
ఇది తప్పా?
నా తప్పేనా?
లేక ఇది నీ దారిలో పడని
నా చీకటి అడుగేనా?

వ్యాఖ్యానం:

హరీ —
ఈ లోకంలో నన్ను నీవే పెట్టావంటే,
ఏదో చేయమనేకా?
నే పరమును సాధించబోతే అది నీకు విరోధమా?
 
ఈ జీవితం గొప్పదే,
కాని సిరులను యేలమంటావు,
కోరికల కలవద్దంటావు —
నీ ఆజ్ఞ ఏది? స్వరం ఏది?
అటునిటుగాని ఆదేశం ఎందు?
అంటారు —
ఆ స్వరం నీది కాదు… అది మన్మథునిదని.
 
ఆ బాటకు మొగ్గలేదే —
దిక్కు లేక చెదిరే మనసే.
క్షమించకు ప్రభూ —
ఇది అశక్తి కాదు,
మార్గమెరుగని మా అసలైన గతి.
ఇక​
నీవే చూపు, నీవే మార్గం. 

రెండవ​ చరణం: 

పంచేంద్రియములు నాపైఁ బంపువెట్టితివి నీవు
యెంచి వాని నే దండించేదిది నేరమౌఁ గాదో
పెంచేటి తల్లిదండ్రులు ప్రియమై వడ్డించఁగాను
కంచము కాలఁ దన్న సంగతి యాబిడ్డలకు ॥భావిం॥ 

పాఠ్యం (Line)

పదార్థం (Literal Meaning)

పంచేంద్రియములు నాపైఁ బంపువెట్టితివి నీవు

నీవే ఈ ఐదు ఇంద్రియాలను నాపై బలవంతంగా అమర్చినవాడివి (పంపువెట్టు = ఆజ్ఞాపింౘు)

యెంచి వాని నే దండించేదిది నేరమౌఁ గాదో

వాటిని ఎంచి నేను శిక్షిస్తే అది తప్పో కాదో తెలియదు

పెంచేటి తల్లిదండ్రులు ప్రియమై వడ్డించఁగాను

నా తల్లిదండ్రులు (నువే దైవమవు) ప్రేమతో నా కోసం ఏమిచ్చారో అందుకున్నాను

కంచము కాలఁ దన్న సంగతి యాబిడ్డలకు

అందుకుని మరి ఆ కంచమును కాలితోతన్నిన ఆ బిడ్డల సంగతి ఏమి?

(నువ్వు ప్రేమతో ఇచ్చిన ఈ జీవితం నాకునచ్చినట్లుండాలనే నా మొండిపట్టుదలతో నేను విసిగిపోయాను)


 

ప్రత్యక్ష భావము

 

ఓ హరిశ్వరా,
ఈ ఐదు ఇంద్రియాలను నాపై నీవే బలంగా అమర్చావు.
ఇప్పుడు వాటి ఆడదీసే స్వభావాన్ని తెలుసుకున్నపుడు,
వాటిని శిక్షించాలని చూస్తే — అది తప్పేనా?

 

నన్ను పెంచిన తల్లిదండ్రులు — నీవే కావచ్చు —
నిజమైన ప్రేమతో జీవితం అనే భోజనాన్ని వడ్డించావు.
కానీ అది నాకు నచ్చినట్టుండలేదు.
అసహనంతో, అహంభావంతో,
ఆ భోజనాన్ని నేనే కాళ్లతో తన్నాను.

 

ఇప్పుడు నా మొండితనానికి మందెక్కడ?
ఇలాంటప్పుడు నా గతి ఏమిటి?
నీలాంటి తల్లి మాత్రమే ఆదరించగలదు.
కానీ నీ ఆదరణ అంటే తప్పును నీవు మాఫీచేసినట్టు కాదుగా!
ఇలాగే తప్పి, తన్నే తరం మారకపోతే —
నాకు నిజమైన జ్ఞానోదయం ఎప్పుడొస్తుందో?

 


వ్యాఖ్యానం:

సిరుల నేలేటివాఁడు చెప్పినట్టు సేయక
విరసాలు బంట్లకు వేరే సేయఁ దగునా
 
నాలో రెండు గుణములను చూస్తున్నా —
ఒకవైపు పరమును తాకాలనే తాపము,
మరోవైపు ఈ దేహంతో కోరిక సుఖము.
 
ఒకటి నన్ను పైకి లాగు,
ఇంకొకటి ఈ లోకపు దారుల వాగు.
రెండు దిక్కుల మధ్య సాగు
నిత్య రణంతో మనస్సు పోగు
ఎన్నాళ్ళీ గొంగళి కాగు?
 
విచారపరులాలా —
రెండు గుణాలా
దేవుడా నీ పంతములా
సుజ్ఞానము, మరోది అజ్ఞానములా
ఇది ఇష్టం ఒకటి కష్టములా
వీటిలో సముడై చేయుటెటులా
సమత్వములింత​ దుష్కరములా 

మూడవ​ ​ చరణం:

మిక్కిలి సంసారము మెడఁగట్టితివి నాకు
అక్కర నే వేసారేది అపరాధమవుఁ గాదో
దిక్కుల శ్రీవేంకటాద్రి దేవుఁడ నీవియ్యఁగాను
యెక్కడో జీవుఁడ నేను యెదురాడఁ దగునా ॥భావిం॥

పాఠ్యం (Line)

పదార్థం (Literal Meaning)

మిక్కిలి సంసారము మెడఁగట్టితివి నాకు

నీవే ఈ భారమైన ప్రపంచాన్ని నా మెడలో మాలగా వేసినవాడివి

అక్కర నే వేసారేది అపరాధమవుఁ గాదో

ఇప్పుడు నేను శ్రమపడి, నేను బాధపడి విముక్తిని కోరితే అది అపరాధం అవుతుందా?

దిక్కుల శ్రీవేంకటాద్రి దేవుఁడ నీవియ్యఁగాను

నీవే నాకి శ్రీవేంకటాద్రి దేవుని అనే దిక్కునిచ్చావు

ఎక్కడో జీవుఁడ నేను యెదురాడఁ దగునా

ఎక్కడో దూరంగా ఉన్న నాలాంటి ఓ సామాన్య జీవిగా నీకు ఎదురు చెప్పగలడా?

 


 

ప్రత్యక్ష భావము: 

హరీశ్వరా,
ఈ విస్తారమైన సంసారాన్ని
నేను అడక్కుండానే
నా మెడలో మాలలా వేశావే — 
ఇప్పుడు నేను ఆ భారాన్ని దించాలనుకుంటే,
అది పాపమా?
 
దిక్కులన్నిటా
శ్రీవేంకటాద్రి పతిని
నువ్వున్నావు.
 
కానీ నేనింకా ఇక్కడే —
దూరంగా, దిక్కుతెలియని లోకంలో
తికమకగా తిరుగుతున్న వాడిని.

 


వ్యాఖ్యానం:

 

మిక్కిలి సంసారము మెడఁగట్టితివి నాకు 

లోకాన్నితగిలించెను  మెడనే —
భారమా కాదే, శిక్ష అవుగాదే,
నేను” అన్న మృదువైన ముడిగా.
 
ఇది కుటుంబమా కాదే, దేహమా! విధియా కావే —
నిజంగా నన్నెక్కువ బిగించినది — "నేనే".
 
పరమును తాకాలంటే
ఈ “నేను” తప్పక కరగాలి అంతే.
 
బంధించేది లోకం కాదే —
ఇది నా లోకం” అనే స్వరమే.
అది చూచిన వెంటనే — శరణాగతి మొదలౌనే.

నాకు వేయని మాల,
ఇతడు మెడలో తగిలించె లోకాలే.
ఇప్పుడు దాన్ని తీయాలా?
ఇంకో పాపం చెయ్యాలా?
తిరిగిన ప్రతీ మూలమూల​
 అతని ముఖమే — అనంత దర్పణంలా.

బరువు జీవితం కాదే,
"బరువు విడిపోవాలనే తలపు" — నిజంగా బరువే.

No comments:

Post a Comment

T-238 అలమేలుమంగ నీవన్నిటా నొరపరివి

  తాళ్లపాక అన్నమాచార్యులు 238 అలమేలుమంగ నీవన్నిటా నొరపరివి For English version press here ఉపోద్ఘాతము భగవద్గీతని జీవించారు అన్నమాచార్...