తాళ్లపాక అన్నమాచార్యులు
136 నటనల
భ్రమయకు నామనసా
జీవితమే నాటకము
Those interested in English Version may press this
ఉపోద్ఘాతము: ఈ అత్యద్భుతమైన కూర్పులో, ప్రతి పదం తూటా లాగా ఉపయోగించబడింది. బహుశా అన్నమాచార్యులు ఆ క్లిష్టమైన భావనలను దుర్భేద్యమైన మన చేతనను చీల్చి నేరుగా మన గుండెల్లో నాటాలని కోరుకున్నారేమో! ఇటువంటి రచన చేయడ మెవ్వరి తరము?
అందువల్ల, దీనిని పదాలలో వివరించడం ఇబ్బందే కాదు అసంభవమూనూ. అనేక వన్నెలున్న ఈ కీర్తన భావనలను తెలుపుటకు ప్రసిద్ధ కళాకారుల చిత్రములను ఆశ్రయించాను. అందువల్ల, దీనిని దృశ్యమాధ్యమముగా వివరింప సాహసము చేసితిని. మాస్టర్స్ రెనే మాగ్రిట్టే (1898-1967), ఎమ్.సి ఎస్చెర్ ( 1898-1972) మరియు జియార్జియో డి చిరికో(1888-1978)లు మానవుని మనఃస్థితిని ఉన్నదున్నట్లు తమ కళలో జీవము ఉట్టిపడునట్లు, నేరుగా బొధపడునట్లు చేసితిరి కనుక నా పని సులభమైనది.
కీర్తన: రాగిరేకు: 354-3 సంపుటము: 4-317 |
నటనల భ్రమయకు నామనసా ఘటియించు హరియే కలవాఁడు ॥పల్లవి॥ ముంచిన జగమిది మోహినీగజము పొంచినయాస పుట్టించే దిది వంచనల నిజమువలెనే వుండును మంచులు మాయలే మారునాఁడు ॥నట॥ సరిసంసారము సంతలకూటమి సొరిదిఁ బచారము చూపే దిది గరిమ నెప్పుడుఁ గలకలమనుచుండును మరులగువిధమే మాపటికి ॥నట॥ కందువదేహము గాని ముదియదిది అందినబహురూప మాడేదిది యెందును శ్రీవేంకటేశ్వరుఁడుండును డిందుపడఁగనిదె తెరమరఁగు ॥నట॥
|
Details and Explanations:
భావము: మనసా నన్ను కపటప్రవర్తనములలో భ్రమయించకు. ఈ భ్రమలను ఘటిల్లజేయు హరి మాత్రమే ఉనికి గలవాడు.
వివరణము: మనసును మనను ఎందుకు తప్పుదోవ పట్టిస్తుంది? మొదట, మనము చూసేవాటి ద్వారా మనం ప్రభావితమవుతాము. చూసిన వస్తువు మనస్సులో ఒక నిర్దిష్ట ప్రతిచర్యను (మంచి లేదా చెడు) సృష్టిస్తుంది. ఈ చర్య మరియు ప్రతిచర్య మన జ్ఞాపకశక్తి మరియు మనస్సులో వాటి అనుబంధ స్మృతి యొక్క నిర్మాణాల వల్ల వస్తుంది. ఇది ప్రసిద్ధిచెందిన ఇవాన్ పావ్లోవ్ యొక్క కుక్కల ప్రతిస్పందన$1 వంటిది (చివర్లో
ఇచ్చిన అదనపు వివరణ చూడండి). చురుకైన మనస్సు భాగస్వామ్యం లేకుండా, ఈ ప్రతిస్పందనలు అనివార్యం. మన మనస్సు చురుకైన స్థితిని శక్తి ఖర్చుచేసి పొందును. ఉదాహరణకు, దిగువ చిత్రంలోని ఒంటెలను చూడండి. ఒంటె ద్వారా ఏర్పడిన నీడ నిజమైన ఒంటెలుగా మరియు వాస్తవ ఒంటెలు కేవలం చుక్కలుగా కనిపిస్తాయి. కొంత ప్రయాసము మీదట ఒంటెలను కనుగొంటాము.
సామాన్యులము, మనము గ్రాండ్ మాస్టర్ల చదరంగం బోర్డులో పావుల స్థానాలను, వాటిలోని ఎత్తుగడలను
అర్థం చేసుకోలేము. ఎవరు గెలుస్తారో అంచనా వేయడం మనకు అసాధ్యము. అదే విధంగా దైవము అను గొప్ప నిష్ణాతుని ఎత్తులు మరింత సంక్లిష్టంగా ఉంటాయి. చరిత్ర మానవులు ఊహించని సమావేశాలతో నిండి ఉంది. ఇవేవీ విడివిడి స౦ఘటనలు కావని, అవి దేవుని ప్రణాళికలో భాగమని మన౦ గ్రహి౦చిన సరిపోతు౦ది. దీనినే ‘ఘటియించు’ అని అన్నమాచార్యులు సూచించిరి.
ఈ విశ్వం 14 బిలియన్ సంవత్సరాలుగాను భూమి 4 బిలియన్లు, ప్రాణికోటి 3.5 బిలియన్లు, మనిషి గత 2 లక్షల సంవత్సరాలుగా పాటు ఉనికిలో ఉన్నట్లు తెలుస్తోంది. మనిషికి సహజ జీవితకాలం కేవలం 80 సంవత్సరాలు మాత్రమే. ఇట్టి విస్తారమైన కాలము యొక్క ఆవిర్భావమునకు ముందు నుండి ఉనికిలో ఉన్నది నిరాకారమై ఉండాలి. మన వేదాలు కూడా అదే సూచిస్తున్నాయి అని విన్నాను. అందువల్ల, ‘కలవాఁడు’ ఈ ఆపద్ధర్మ నిర్మాణములన్నీ తమతమ నిర్ణీత కాలవ్యవధు లనంతరము విచ్ఛిన్నము
చెంది కాలగర్భములో కలసిపోయినప్పటికీ అటులకాక నిలిచియుండు దానికి ప్రతీక. కాబట్టి అన్నమాచార్యులు కాలాతీత సత్యాన్ని ప్రస్తావిస్తున్నారు అని
తీసుకోవలె.
అన్వయార్ధము: ఓ మనసా, భ్రాంతిని వీడి, ఉనికి కలిగిన ఏకైక
సత్యాన్ని కనుగొనుము.
ముఖ్య పదాలకు
అర్ధాలు: మోహినీగజము = దొడ్డదైన, పెద్దదైన మోహముతొ అను అర్ధములో ఇక్కడ వాడారు.
భావము: మోహమను ఉప్పెన ముంచెత్తిన జగమిది. ఆశలు
మానవ సంకల్పమును పొంచియుండి ముట్టడించును. వంచనలు నిజమును పోలి వుండును. మారునాఁటికి
విచారపు మంచు తెరలును మరియు అనుతాపములును మిగులును.
వివరణము: క్రింద ఇచ్చిన ఎస్చెర్ గారు వేసిన "సాపేక్షత" చిత్రమును జాగ్రత్తగా పరిశీలించండి. అనేక బొమ్మలు ఈ చిత్రములో ఉనప్పటికీ, ఈ పాత్రలు సాధారణంగా వేర్వేరు దిశలలో వారి స్వంత వ్యక్తిగత ప్రపంచంలో మునిగిపోయి, వారి చేతిలోని పని పైనే వాటి దృష్టి పెడతాయి. ఇతరుల ఉనికి గురించి వారికి తెలియనట్లుగా లేదా ఆసక్తి లేనట్లుగా ఉంటాయి. ఆయా పాత్రల మధ్య కనీస పరస్పర చర్యలు కనపడవు. అసాధ్యమైన నిర్మాణ నేపథ్యం విభిన్న దృక్కోణాలు మరియు గురుత్వాకర్షణ నియమాలతో విభిన్న వాస్తవాలలో ఉనికిలో ఉన్న వ్యక్తుల మధ్య అటువంటి మానసిక విభజనను నొక్కి చెబుతుంది. దీనినే అన్నమచార్యులవారు 'ముంచిన జగమిది మోహినీగజము'తో సూచించారు. మనమంతా కూడా ఆ పాత్రల మాదిరిగానే మనదైన ప్రపంచంలో మునిగి ఉంటామని అర్ధము.
ఇవి అసాధ్యమైన నిర్మాణాలను ఉదహరించడానికి సృష్టించబడినప్పటికీ, ప్రజలు ఒకే సమయంలో ఒకరినొకరు చేరుకోవడానికి మరియు అర్థం చేసుకోవడానికి ఉన్న ఇబ్బందుల గురించి ఎస్చెర్ తెలియజేసార నిపిస్తుంది. ఐతే ప్రతీ పాత్ర ఏదో ఒక పనిలో నిమగ్నమై దానిని పూర్తిచేయవలెనని తలపుతో నున్నట్లు తెలిసిపోతుంది. దీనినే అన్నమయ్య "పొంచినయాస పుట్టించే దిది" అని క్లుప్తంగా చెప్పారు.
ముఖ్య పదాలకు
అర్ధాలు: సంతలకూటమి = సంతలో కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు కలుసుకోవడం,
పలకరించుకోవడం వంటిది. (పనిముగిసిన పిదప ఎవరిదారిని వారు వెళ్ళిపోతారు). సొరిదిఁ
= వరుస, క్రమము; బచారము = అంగిడి, దుకాణము;
గరిమ నెప్పుడుఁ = ఎప్పుడూ తన ప్రభావము, మహత్వము ఎత్తి చూపును, గలకలమనుచుండును = 'బాధపడు'
అనే అర్థంలో వాడబడే అనుకరణపదం; మరులగువిధమే = ఎడారియగు విధమే;
భావము: సమదృష్టితో చూస్తే,
ఈ సంసార జీవిత౦ సంతలలో కలుసుకోవడ౦లాంటిది. వారు మొదట్లో అప్యాయముగా మీఁదిమీఁది పలకరింపుల
తర్వాత ఒకరితో ఒకరు స్పష్టంగాను మరియు స్వార్థపూరితంగాను వ్యవహరిస్తారు. ప్రపంచం ఎల్లప్పుడూ
ఆకర్షించడానికి బాగా అలంకరించబడిన బజారు లాగా కనిపిస్తుంది. అయినప్పటికీ రాత్రికి,
ఈ ప్రదేశం బంజరు భూమిగా రూపాంతరం చెందుతుంది.
వివరణము: ‘సరిసంసారము సంతలకూటమి’తో సంతలో కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు కలుసుకోవడం, పలకరించుకోవడం వంటిది. స్వార్ధముతో పనిముగిసిన పిదప ఎవరిదారిని వారు వెళ్ళిపోతారు అని చెప్పారు. యుక్తవయస్సులో ప్రేమ మనిషి మనస్సులో స్థిరముగా వేళ్ళూనుకుని తాను, తన సంసారము హృదయములలో పెనవేసుకుని పోయామనుకుంటాడు. అది వాస్తవము కాదని అన్నమాచార్యులు ఒక్కరేకాదు, అనేకమంది తత్వవేత్తలతో సహా చిత్రకారులూ వ్యక్తపరచిరి.
రీనీ మాగ్రిట్ వేసిన ప్రేమికులు అన్న పై
చిత్రమును చూడండి. అందులో గాఢముగా ముద్దిచ్చుకుంటున్న యువ జంటను చూడవచ్చు. చూచుటకు వారెంత దగ్గరగా ఉన్నప్పటికీ, వారి తలలపైన ముసుగులను కప్పి, ఒకరినొకరు తెలియరని చిత్రకారుడు స్పష్టంచేసారు. ఇక సరిసంసారము సంతలకూటమియే కాదా!!
ముఖ్య పదాలకు
అర్ధాలు: కందువదేహము = జాడ మాత్రము తెలుపు దేహము, వింత గొలుపు దేహము, (ఇక్కడ అన్నమాచార్యుడు ఆత్మను లేదా 'నేను' అనే భావనను
సూచించుటలేదు.), ముదియదిది = ముసలితనము పొందనిది, (ఎన్ని దినములు/సంవత్సరములు గడచిననూ ధోరణిలో రాని మార్పును సూచించడమైంది) అందినబహురూపము
= అందుకున్న (లేదా దొరికిన) బహుపాత్రాభినయం, ఆడేదిది = (ఆయా పాత్రలను)
అభినయించునది, ఆడునది, డిందుపడఁగనిదె = ఆట్టడుగున / తగ్గియున్న
/ ఉపశమించిన ఉన్నదిదియే.
భావము: ఇది విచిత్రమైన
కుటిలమైన శరీరం తప్ప మరేమీ కాదు. దానికి వయసు
మీద పడినను ధోరణిలో మార్పురాదు. బహుళ పాత్రల్లో నటిస్తూనే ఉంటుంది. వేంకటేశ్వరుడు ఆ
ముసుగుల వెనుక ఉన్నాడు. వీటన్నిటిలో అట్టడుగున (మనస్సు కదలికలు చేయనప్పుడు,
అహంకారం అంతముతో) ఆయన కనిపిస్తాడు.
వివరణము: ‘కందువదేహము’ ద్వారా మనస్సు, భౌతిక దేహము, ఆత్మ మూడునూ విడదీయరానివని, మనకు పైకి కనపడు భౌతిక దేహము ఒక సూచిక మత్రమేననే అర్ధములో వాడిరి.
ఇక్కడపేర్కొన్న 'బహురూపము'ను
పోలినట్లే మనిషి యందే అనేకరూపములున్నవని పాశ్చాత్యులలోను భావించు వారున్నారు. సుప్రసిద్ధ
అధివాస్తవికతావాది జార్జియో డి చిరికో పారలౌకిక చిత్రలేఖనము (Metaphysical Painting) అనునది ముఖ్య భూమికగా అధ్యయనము
చేసిరి. ఇందులో రెండు ప్రాథమిక భావనలు అవసరం: మొదటిది "ఎనిగ్మా" అనగా రహస్యమును
పరిచ్ఛేదించుట ("నిగూఢము" అని పిలిచే దానిని ఆవిష్కరించి స్వీకరించుట) రెండవది
పరితాపము లేదా నిర్వేదములు కలిపి స్ఫురింపజేయుట ఈ చిత్రలేఖన విధానానికి ప్రధానమైనవి.
చిరికో తాను వేసిన ‘రెండు ముసుగులు’ గురించి మాట్లాడుతూ “వింత విషయాల మ్యూజియంలో వలె, వింతలతో నిండిన ప్రపంచంలో నివసించడానికి రంగురంగుల బొమ్మలు అలరించుతాయి. కొన్నిసార్లు, పిల్లల మాదిరిగానే, అవి దేనితో తయారు చేయబడ్డాయో చూడబోతాము. అవి ఖాళీవని తెలిసి నిరాశ చెందుతాము." అన్నారు.
రెండు ముసుగులు అను చిత్రములో ‘మానవుడు తనను తాను పరిశీలించుకొను నపుడు తనలోని అనేక అందము, అంతస్తు, అహంకారముల తొడుగులను గుర్తించి తీసివేయునప్పుడు విపరీతమైన ఉద్రిక్తతతకు లోనౌతాడు. ఒక తీవ్రమైన పరిమితికి, అనామక ముసుగులో మరేదీ గుర్తించలేని స్థితిని ఒక అండాకారపు ఖాళీ తల, దీనిలో ఒక త్రిభుజం యొక్క నిగూఢమైన తెల్లని చిత్రం శూన్యం యొక్క లోతులపై ఊగిసలాడుతున్నట్లు చూపారు.
ఇది కేవలం తాను ముసుగులు విడిచిపెట్టే ప్రశ్న కాదని, తనను తాను దాటి పోవడం అనే అధిగమించరాని మెట్టు అని అని ఇప్పుడు స్పష్టంమౌతుంది. మానవ ఛాయాచిత్రంలో గేర్ల ముక్కలు చతురస్రాలు, జ్యామితి మరియు 'చిరోకొ' కాలపు యంత్రములతో నింపారు. అవి సమకాలీన మానవాళి యొక్క అంతర్భాగంగా మారాయి, మరియు ‘నేను’ అను భావనను విడుచుటకు మానవుడు పొందే బాధ యొక్క విషాదము నిర్వేదము సువ్యక్తము.
ఇక్కడ తెలిపినట్లుగా మానవుడు
తనలోని ద్వంద్వత్వమును గుర్తించి కూడా దానిని వీడలేక మధనపడతాడు అని అన్నమాచార్యులు
అనిరి. వీటన్నిటినీ దాటుకొని హృదయాంతరాళములలో మనస్సు కదలికలు చేయనప్పుడు, అహంకారము
అడగినప్పుడు దైవము అగపడునని ఆయన నుడివిరి.
అదనపు వివరణము: ఇవాన్
పావ్లోవ్ ప్రయోగము: క్లాసికల్ కండిషనింగ్ (=స్థితివ్యాజము = స్థితి కలిగించు భ్రమ) ప్రమాదవశాత్తు నమోదు చేయబడింది. ఇవాన్ పావ్లోవ్ కుక్కల జీర్ణక్రియపై పరిశోధన చేస్తున్నప్పుడు, ఆహారం పట్ల కుక్కల శారీరక ప్రతిచర్యలు కాలక్రమేణా కొద్దికొద్దిగా మారుతున్నాయని గమనించాడు. మొదట్లో, కుక్కలు వాటి ముందు ఆహారాన్ని ఉంచినప్పుడు మాత్రమే లాలాజలాన్ని
స్రవించేవి. అయితే, తరువాత వాటికి ఆహారం రాకముందే అవి కొద్దిగా లాలాజలము కార్చడం మొదలుపెట్టాయి.
ఆహారం రాకముందే ఒక క్రమ పద్ధతిలో వస్తున్న
శబ్దాలకు అవి లాలాజలాన్ని స్రవిస్తున్నాయని పావ్లోవ్ గ్రహించారు; ఉదాహరణకు, వాటికి ఆహారం తెచ్చే తోపుడు బండి శబ్దాలు కావచ్చు.
అతని సిద్ధాంతాన్ని పరీక్షించడానికి, పావ్లోవ్ ఒక ప్రయోగాన్ని ఏర్పాటు చేశాడు, అందులో అతను కుక్కలకు ఆహారం అందించే ముందు గంటను మోగించాడు. మొదట్లో, కుక్కలు గంటలకి ఎటువంటి ప్రతిస్పందనను చూపలేదు. అయితే, క్రమేణ, కుక్కలు ఒంటరిగా (ఆహారం చూడకుండానే) గంటల శబ్దానికి లాలాజలము స్రవించడం ప్రారంభించాయి.
కీర్తన సంగ్రహ సారం:
పల్లవి: మనసా నన్ను కపటప్రవర్తనములలో
భ్రమయించకు. ఈ భ్రమలను ఘటిల్లజేయు హరి మాత్రమే
ఉనికి గలవాడు. అన్వయార్ధము: ఓ మనసా, భ్రాంతిని వీడి, ఉనికి కలిగిన ఏకైక సత్యాన్ని
కనుగొనుము.
చరణం 1: మోహమను ఉప్పెన ముంచెత్తిన జగమిది. ఆశలు మానవ సంకల్పమును
పొంచియుండి ముట్టడించును. వంచనలు నిజమును పోలి వుండును. మారునాఁటికి విచారపు మంచు
తెరలును మరియు అనుతాపములును మిగులును.
చరణం 2: సమదృష్టితో చూస్తే, ఈ సంసార
జీవిత౦ సంతలలో కలుసుకోవడ౦లాంటిది. వారు మొదట్లో అప్యాయముగా మీఁదిమీఁది పలకరింపుల తర్వాత
ఒకరితో ఒకరు స్పష్టంగాను మరియు స్వార్థపూరితంగాను వ్యవహరిస్తారు. ప్రపంచం ఎల్లప్పుడూ
ఆకర్షించడానికి బాగా అలంకరించబడిన బజారు లాగా కనిపిస్తుంది. అయినప్పటికీ రాత్రికి,
ఈ ప్రదేశం బంజరు భూమిగా రూపాంతరం చెందుతుంది.
చరణం 3: ఇది విచిత్రమైన కుటిలమైన శరీరం తప్ప మరేమీ కాదు. దానికి వయసు మీద పడినను ధోరణిలో మార్పురాదు.
బహుళ పాత్రల్లో నటిస్తూనే ఉంటుంది. వేంకటేశ్వరుడు ఆ ముసుగుల వెనుక ఉన్నాడు.
వీటన్నిటిలో అట్టడుగున (మనస్సు కదలికలు చేయనప్పుడు, అహంకారం అంతముతో) ఆయన
కనిపిస్తాడు.