Friday, 15 August 2025

T-251 ఏఁటికి విచ్చేసితివో యెట్టుదెలుసు

 తాళ్ళపాక అన్నమాచార్యులు

251 ఏఁటికి విచ్చేసితివో యెట్టుదెలుసు

For English version press here 

ఉపోద్ఘాతము

ఒక అబ్బాయి ఓ అమ్మాయికి వల వేయబోతాడు
ఆ అమ్మాయి కాదనదు గాని
ఆమెకు అతడికి ముందే మనువైందని తెలుసు.
వారి మధ్య సాగే ప్రణయ సంభాషణ​.
 
ఆకర్షణీయమైన సరసముల వెనుక ​
గాంభీర్యమైన సందేశమును చొప్పించారు
అన్నమాచార్యులు

కృతిరస విశ్లేషణ​: ఈ కీర్తనని ప్రధానముగా ధ్వని కావ్యంగా భావించవచ్చును. ఎందుకంటే ఇందులో ఏ విషయము కూడా సూటిగా చెప్పకుండా ధ్వనించ బడినది. 

కృతి విషయమంతా లక్ష్యార్థము అనిపిస్తుంది. దీనిలోని ముఖ్య​ స్థాయీ భావమును శృంగారముగా భావిస్తే కృతిలోని ముఖ్య రసము శృంగార రసము అని మనకు తెలుస్తుంది. ఇందులోని వైరాగ్యంఅంగిరసమై చెప్పకయే కాన్పట్టుచూ ఆలోచింపజేయును. ఇందులో వ్యంగ్యం కూడా హాస్య రసమై భాసిల్లుతుంది. ఇది మరియొక ​‘అంగిరసము' అని తీసికొన్న​, మొత్తానికి ఈ కీర్తన చక్కని రసమిళితమై చదువరుల​, వినువారి హృదయములో మోదమును, ఆసక్తిని పుట్టించును. 

సాహిత్యమును అర్ధము చేసుకొనుట ఇంచుకంత​ కష్టము కాన​ ఈ కీర్తనను కదళీపాకముగా భావించ వలెను. 

శృంగార సంకీర్తన

రేకు: 2-2 సంపుటము: 5-7

ఏఁటికి విచ్చేసితివో యెట్టుదెలుసు మాతో
మాటలాడఁగా నీకు మాటవచ్చీఁ జుమ్మీ ॥పల్లవి॥
 
అప్పన గొంటివో లేదొ ఆకెచేత నేఁడైనా
ఇప్పుడే మాయింటిదాఁక నేఁగేనంటా
యిప్పటి యీతమకాన యింతలోని పనికిఁగా
చెప్పక వచ్చిననాకె చేరనీదు సుమ్మీ ॥ఏటి॥
 
అనుచరించితో లేదో ఆకెనో ముందరనైనా
వెనక నాతోడ నవ్వేవు గాని
ఘనుఁడు వూరకే నన్నుఁ గదిసేవు కడుఁబై-
కొనఁగ నాకె విన్న కోపగించుఁ జుమ్మీ ॥ఏటి॥
 
ఆరగించితో లేదో ఆకెపొత్తుననే యింత
గారవము లేక మోము కళదేరదు
చేరి కూడితివి నన్ను శ్రీ వేంకటేశుఁడ యింత-
యీరసాన నాకె విన్న యేమనునో సుమ్మీ  ॥ఏటి॥

Details and Explanations:

పల్లవి:

ఏఁటికి విచ్చేసితివో యెట్టుదెలుసు మాతో
మాటలాడఁగా నీకు మాటవచ్చీఁ జుమ్మీ ॥పల్లవి॥ 

Telugu Phrase

Meaning

ఏఁటికి విచ్చేసితివో యెట్టుదెలుసు

ఎందుకొచ్చావో మాకెలా తెలుస్తుంది?

మాతో మాటలాడఁగా నీకు మాటవచ్చీఁ జుమ్మీ

నాతో మాటడడానికే కదా పరుగు పరుగున మాటలొస్తున్నాయ్

భావము: అన్నమాచార్యులు తరచూ తేలికపాటి కవ్వింపును ఓ ముసుగుగా వాడుతారు — దాని వెనుక, జీవన లక్ష్యాన్ని గుండెల్లో తాకే ప్రశ్న ఒక్కసారిగా మెదిలేలా చేస్తుంది.

Layer 1: సూటి భావం:

ఎందుకు వచ్చావో నీకే తెలియదా? నన్ను చూసే మాటలు దొర్లుకుంటూ వచ్చాయే!

(ఆటపాటు, అల్లరి, చమత్కారపు కవ్వింపు.)

ప్రియుడు వచ్చినది నిజం. మాట్లాడటానికి సాకులు వెతుకుతున్నాడు. తేలికైన తుంటరితనంలోనూ ఒక నాజూకు స్నేహపు తాకిడి ఉంది. 

Layer 2: ఆత్మాన్వేషణ– భావం:

నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఎలా తెలుసుకుంటావు?” —

దేవుడు మాటాడడు కదా! ఆయనది నిశ్శబ్దపు పలుకు. నీవు కూడా మౌనం పాటిస్తేనే ఆ దివ్యవాణి వినిపిస్తుంది. అప్పుడే మనిషికి అసలు మాట—సత్యపు పలుకు—వస్తుంది.


వ్యాఖ్యానము:

ఎందుకు ఈ లోకానికి వచ్చామో ఎవరూ చెప్పలేరు — తల్లిదండ్రులు, గురువులు, పూజారులు, వేదాంతులు కూడా కాదు. మనకూ తెలియదు.
జీవితం సక్రమంగా సాగాలంటే, ఈ ప్రశ్నకు సమాధానం తప్పనిసరిగా కావాలి.
భగవద్గీత ఒక సంకేతం ఇస్తుంది — "శ్రేయాన్స్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్"అంటే, నువ్వు స్వధర్మాన్ని మాత్రమే ఆచరించాలి.
ఆ స్వధర్మం నేరుగా దైవం నుండి తెలుసుకోవాలి.
తెలియకపోతే, ఎరుకలోనో ఎరుకలేకనో, ఇతరులను అనుకరించే వారమే అవుతాము — అది మన ధర్మం కాదు.


మొదటి చరణం:

అప్పన గొంటివో లేదొ ఆకెచేత నేఁడైనా
ఇప్పుడే మాయింటిదాఁక నేఁగేనంటా
యిప్పటి యీతమకాన యింతలోని పనికిఁగా
చెప్పక వచ్చిననాకె చేరనీదు సుమ్మీ       ॥ఏటి॥ 

పదబంధం

అర్ధము

అప్పన గొంటివో లేదొ ఆకెచేత నేఁడైనా

అప్పన = అనుమతి; ఆకె = ఆమె

కనీసం ఈ రోజుకైనా ఆమె అనుమతి తీసుకున్నావా?

ఇప్పుడే మాయింటిదాఁక నేఁగేనంటా

నువ్వు నేరుగా నా ఇంటికి పరుగెత్తుకుంటూ వస్తున్నట్టున్నావు.

యిప్పటి యీతమకాన యింతలోని పనికిఁగా

ఈ తపనతో, ఇది పూర్తి చేయాల్సిన పని అన్నట్టుగా.

చెప్పక వచ్చిననాకె చేరనీదు సుమ్మీ

కానీ, ఆమెకు చెప్పకుండా వస్తే, నన్ను లోపలికి రానీయదు కదా!

భావము: 

Layer 1: సూటి భావం:

కనీసంఈ రోజైనా ఆమె (అలమేలుమంగ) అనుమతి తీసుకున్నావా? నువ్వు నేరుగా నా ఇంటికి పరుగెత్తుకుంటూ వస్తున్నట్టున్నావు. తపనతో, ఇదేదో పని పూర్తి చేయాల్సిన అన్నట్టుగా. కానీ, ఆమెకు చెప్పకుండా వస్తే, నన్ను లోపలికి రానీయదు కదా! 

Layer 2: ఆత్మాన్వేషణ– భావం: 

అప్పన గొంటివో లేదొ ఆకెచేత నేఁడైనా
ఓ మనసా! బయట ప్రపంచానికి భౌతికప్రకృతికి నీ మనసుపై పట్టు ఉందా?
అది ఉంటే నువ్వు అంతరంగంలో అడుగుపెట్టలేవు.
(భౌతిక బంధాలపై పట్టు = ఆధ్యాత్మికంగా మనసు ప్రశాంతం కావడానికి అనుమతి.)
 
ఇప్పుడే మాయింటిదాఁక నేఁగేనంటా
నువ్వు దైవానికి నిలయమైన ఆ అంతరంగపు గృహం వైపు పరుగెడుతున్నావు.
ఆ ఆకర్షణ అంత బలంగా ఉందా?
 
యిప్పటి యీతమకాన యింతలోని పనికిఁగా
అదేదో ఈ క్షణం జరిగిపోవలసిన పని అన్న భావన, ఆవేశం నిన్ను వెంటాడుతోంది. (అవి పనులు కావు, నీ మనోస్థితి మాత్రమే.)
 
చెప్పక వచ్చిననాకె చేరనీదు సుమ్మీ
కానీ, ఆ అంతరంగ గృహానికి చేరాలంటే,
బయట ప్రవేశానికి అనుమతి అవసరమైనట్టే,
లోపల ప్రవేశానికి అంగీకారము, మౌనం, శాంతి అనివార్యం.

వివరణము:

అప్పన (= అనుమతి, సమ్మతి) — నీ అంతరంగ–బాహ్య బంధాల స్వరూపాన్ని పూర్తిగా గ్రహించు.

నేఁడైనా— కనీసం ఈ జన్మలోనైనా

మాయింటి (= నా ఇల్లు = ఈ శరీరం) — దైవము లేదా సత్యం బయట ఎక్కడా లేదు. అది నీలోనే ఉంది. ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. బయటి ప్రభావాల వల్ల కలిగే కదలికలు ఆపి, నిశ్చలంగా ఉంటే చాలు.

పనికిఁగా (= పని చేయవలసినట్టుగా) — ఎవరూ కూడా దైవము లేదా సత్యాన్ని పొందలేరు. కేవలం దర్శించ గలరు. ఎక్కడికో వెళ్ళి పూర్తి చేసే పని కాదు.  అచ్చముగా కళ్ళు విప్పి చూస్తే చాలు.

తమకము (= త్వరగా ఫలితం కావాలనే ఆత్రం) — మనకు ఫలితం వెంటనే రావాలని ఉంటుంది. కానీ ఫలితము సత్యం ఒకటికావు. మనమేమి చేసినా దానికి Complimentary Part పుడుతుంది. అకర్తారం స పశ్యతి (గీత13-30) అనగా ఏమీ చేయక ఉన్న చోట నువ్వుగా నిలబడిపోవడమే నిజమైన కార్యం. అతి స్వల్పమైన మార్పు లేదా కదలిక కూడా ఈ నిశ్చలతను భంగం చేస్తుంది. 


రెండవ​ చరణం:

అనుచరించితో లేదో ఆకెనో ముందరనైనా
వెనక నాతోడ నవ్వేవు గాని
ఘనుఁడు వూరకే నన్నుఁ గదిసేవు కడుఁబై-
కొనఁగ నాకె విన్న కోపగించుఁ జుమ్మీ ॥ఏటి॥ 

పదబంధం (Phrase)

అర్థం (Telugu)

అనుచరించితో లేదో ఆకెనో ముందరనైనా

నువ్వు ఆమెను ముందు అనుసరించావేమో కానీ ఇప్పుడూ నా వెనుకే తిరుగుతున్నావు.

వెనక నాతోడ నవ్వేవు గాని

 

ఆమె లేనప్పుడు నాతోనూ నవ్వులు పువ్వులు పంచుకోవాలనుకుంటున్నావు.

ఘనుఁడు వూరకే నన్నుఁ గదిసేవు

ఓ ఘటికుడా! నాతో కేవలం కాలక్షేపానికి దగ్గరవుతున్నట్టుంది.

కడుఁబై-కొనఁగ నాకె విన్న కోపగించుఁ జుమ్మీ

నీ మాటలు వినిపించుకుంటూ ఉంటే, ఆమె (అలమేలుమంగ) నాపై రోషము కోపము తెచ్చుకుంటుంది!”


 

భావము: 

Layer 1: సూటి భావం:

నువ్వు ఆమెను ముందు అనుసరించావేమో కానీ ఇప్పుడూ నా వెనుకే తిరుగుతున్నావు. ఆమె లేనప్పుడు నాతోనూ నవ్వులు పువ్వులు పంచుకోవాలనుకుంటున్నావు. ఓ ఘటికుడా! నాతో కేవలం కాలక్షేపానికి దగ్గరవుతున్నట్టుంది. నీ మాటలు వినిపించుకుంటూ ఉంటే, ఆమె (అలమేలుమంగ) నాపై రోషము కోపము తెచ్చుకుంటుంది!” 

Layer 2: ఆత్మాన్వేషణ– భావం: 

అనుచరించితో లేదో ఆకెనో ముందరనైనాఓ మనసా! నువ్వు ఎప్పుడూ రెండు దారులు పట్టాలనుకుంటావు — ఒకటి ఈ లోకం, మరొకటి ఆధ్యాత్మిక లోకం. 

వెనక నాతోడ నవ్వేవు గాని“ఆధ్యాత్మిక లోకం అంటే మరణం తర్వాతది కాదు. జీవించి వుండాగానే అంది పుచ్చుకోవాలి.

ఘనుఁడు వూరకే నన్నుఁ గదిసేవువూరకే అక్కడికి ఇక్కడికి వెళుతుంటావు. దేవుణ్ని చేరడానికి ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు.

కడుఁబై కొనఁగ నాకె విన్న కోపగించుఁ జుమ్మీనీ ప్రస్తుత పనులకే అతుక్కుపోతే, అవే నిన్ను తప్పుదారిపట్టిస్తాయి. 


వివరణము:

వెనక (= మరణం).

వూరకే నన్నుఁ గదిసేవు — మాటిమాటికి వచ్చి తలుపు తట్టుతుంటావు,

కడుఁబై-కొనఁగ —ఈ భూలోకములో మితిమిక్కిలిగా మనము తగులుకొన్న పనులు


మూడవ​ ​ చరణం:

ఆరగించితో లేదో ఆకెపొత్తుననే యింత
గారవము లేక మోము కళదేరదు
చేరి కూడితివి నన్ను శ్రీ వేంకటేశుఁడ యింత-
యీరసాన నాకె విన్న యేమనునో సుమ్మీ       ॥ఏటి॥ 

Telugu Phrase

Meaning

ఆరగించితో లేదో ఆకెపొత్తుననే యింత 

నువ్వు ఏదైనా  తిన్నావో లేదో, లేక ఆమె సాంగత్యంలో మైమరచి పోయావా?

గారవము లేక మోము కళదేరదు

గౌరవంగా చూడక పోతే నీ ముఖంలో కళ కనబడదు.

చేరి కూడితివి నన్ను శ్రీ వేంకటేశుఁడ

ఓ శ్రీ వేంకటేశా! నన్ను ఎంచుకొని, నాతో కలిసావు.

యింత-యీరసాన నాకె విన్న యేమనునో సుమ్మీ

మన ఇంత సాన్నిహిత్యం ఆమెకు (అలమేలుమంగకు) తెలిస్తే, ఏమంటుందోనని భయం వేస్తోంది.

భావము: 

Layer 1: సూటి భావం: 

నువ్వు ఏదైనా  తిన్నావో లేదో, లేక ఆమె సాంగత్యంలో మైమరచి పోయావా? (అలమేలుమంగ). గౌరవంలేని పనులు చేస్తే ముఖములో కళ తగ్గిపోతుంది. ఓ శ్రీ వేంకటేశా! నన్ను ఎంచుకొని, నాతో కలిసావు. మన ఇంత సాన్నిహిత్యం ఆమెకు (అలమేలుమంగకు) తెలిస్తే, ఏమంటుందోనని భయం వేస్తోంది. (ఆమెలోని ఈర్ష్య కోణమును కూడా బయటపెడుతున్నారు) 

Layer 2: ఆత్మాన్వేషణ– భావం:

ఆరగించితో లేదో ఆకెపొత్తుననే యింత
ఓ మనసా! నువ్వు సత్యానుభూతిని  ఆస్వాదించావా? లేక మాయాసంగమంలోనే చిక్కుకుపోయావా?

గారవము లేక మోము కళదేరదు
గౌరవం అంటే —  వినమ్రత, సౌమ్యత​, సౌశీల్యత, ఉద్వేగము లేకుండుట​. ఇవి లేకపోతే ఆత్మ భాసించదు.

చేరి కూడితివి నన్ను శ్రీ వేంకటేశుఁడ
దైవసాన్నిధ్యం అంటే, అంతరంగములో  దైవ భావములో తాను అను భావమునకు తావు లేకుండా దైవంతో ఏకమవ్వడం. 

యింత–యీరసాన నాకె విన్న యేమనునో సుమ్మీ
ఈ లోతైన, చెప్పలేని అంతర్గత అనుభవంలో — ఒంటరిగా, రహస్యంగా, మౌనంగా నిలవాలి. 

ఈ రకంగా అన్నమాచార్యుల వారు ఒక అద్భుతమైన శృంగార కీర్తనని మనకు అందించారు. ఒక ప్రక్క శృంగారం, మరోప్రక్క వైరాగ్యం ఒకే పాటలో రెంటికీ సమ పాళ్ళలో న్యాయం చేస్తూ సమతుల్యం సాధించడం కష్టము.


X-X-The END-X-X

No comments:

Post a Comment

T-253 తానేడో మనసేడో తత్తరము లవి యేడో

  తాళ్ళపాక అన్నమాచార్యులు 253 తానేడో మనసేడో తత్తరము లవి యేడో For English version press here   ఉపోద్ఘాతము   ఈ అటవీక ప్రపంచములోని అరుద...