Thursday, 7 August 2025

T-248 ఆతని యిచ్చలోదాన నన్నిటా నేను

 తాళ్ళపాక అన్నమాచార్యులు

248 ఆతని యిచ్చలోదాన నన్నిటా నేను 

For English version press here 

ప్రేమ తెలియలేని లోతు, కొలవలేని విస్తృతి 

ఉపోద్ఘాతము

ఈ కీర్తనను తొలిచూపులో చూసినవారికి ఇది ఓ యువతి తన స్నేహితులకిచ్చే సలహాలా అనిపించవచ్చు — ప్రేమ విషయాల్లో మృదువుగా చెప్పే సూచనల సమాహారంలా.
కానీ గమనించి చూస్తే — ఇది అన్నమాచార్యుల శైలిలో దాగివున్న ఒక సార్వత్రిక వృత్తాంతం.
 

ఇది ప్రణయాన్ని స్పృశించినా, దాని అంతర్భావం —
మనం దైవాన్ని ఎలా ఆహ్వానించాలో
తెలియజేసే చక్కటి సందేశం.
ఆహ్వానం అనేది ఘోషగా కాదు —
గౌరవంతో, మౌనతతో, వినయంతో జరగవలసింది.

ఇక్కడ "ప్రియుడు" — పరమాత్మ.
ఆయనను చేరాలంటే, ప్రేమలో ఒదిగిపోవాలి.

ఓపికతో ఎదురు చూడాలి.
ఈ కీర్తనలో అన్నమయ్య స్వరం ఒక అభిసారికలా పలుకుతుంది —
తన ప్రియుని కోసం తపించు, కానీ గౌరవాన్ని విడవని నాయిక స్వరంగా.
ఆమె మాటల్లో మృదుత్వం ఉంది.
ఆత్మవిశ్వాసంతో మేళవించిన అనుభవపూరితమైన నిశ్చలత ఉంది.
 

ఆమె చెబుతోంది:
"ప్రేమ అనేది సాధించాల్సిన గమ్యం కాదు —

పరవశంగా వొదిగిపోవాల్సిన అనుభూతి."
"ఆయన వస్తాడు — మరల మరల పిలవకుండానే,
మీ ప్రశాంతతను, లోపలి నిర్మలతను చూసి — ఆయన."
 

ఈ కీర్తన చివరికి మనల్ని ఒక ఆత్మనిగ్రహపు,
నిరీక్షణపూరితమైన దివ్య స్థితిలోకి తీసుకెళ్తుంది.
ఇది ఏదో కోరుకుని కలగాలనుకునే ప్రేమ కాదు —
ఒక అంతరంగ సముద్రంలోకి ఏకాంత ప్రయాణం.
 

దైవమనే ప్రేమ — అది ప్రపంచమంతటా వ్యాపించి ఉంది.
అందరికీ అందుబాటులో ఉంది.
దైవమును పొందటం కాదు —
ఆ ప్రేమలో కరిగిపోవాలి.
నీ’ ‘నా’ సరిహద్దులు అధిగమించుతూ
దానిలోకి దిగడం…
కొలవలేని మౌనంలో నిగూఢంగా అగపడే శాంతి.


 

కృతిరస విశ్లేషణ​: ఈ కీర్తనను ముఖ్యంగా ఒక వాచ్యకావ్యంగా పరిగణించవచ్చు — అయినప్పటికీ కృతిలోని మూల భావము సులభముగా బోధపడదు. 

ఈ కీర్తనలో ప్రబలంగా కనిపించే స్థాయి భావం వైరాగ్యమేనని తీసుకుంటే, దాని ద్వారా ఆవిష్కృతమయ్యే రసము — శాంతరసం. 

ఇందులో " శృంగారము" (అంగిరసంగా) ఆనందమును, అనుభూతిని కల్పించుచు మనసును శాంత పరచును. ఆలోచింపచేయును. 

సాహిత్యమును అర్ధము చేసుకొనుట సులభ సాధ్యము కనుక ఈ కీర్తనను ‘ద్రాక్షా పాకము’గా భావించ వలెను. 

శృంగార సంకీర్తన

రేకు: 1802-6 సంపుటము: 28-11

ఆతని యిచ్చలోదాన నన్నిటా నేను
కాతరించవద్దు నన్నుఁ గరుణించీఁ దానే ॥పల్లవి॥
 
చేరి యాతనికుణాలే చెలులాల పొగడరే
దూరకురే సారె సారె తొయ్యలులాల
కోరి కోరి వినయాన గుట్టుతోడ వేఁడుకొనరే
బీరానఁ కొంగువట్టి పెనఁగకురే ॥ఆత॥
 
ఆసలఁ గాచుకుండరే యవసరమైనదాఁకా
వేసటలు చూపకురే వేలఁదూలాల
రాసికెక్కి వినయాన రమ్మని పిలువరే
గాసిఁబెట్టి గొబ్బునఁ గక్కసించకురే ॥ఆత॥
 
కలపుకో లెఱిఁగించి కాలుకలే యాయరే
చలపట్టకురే మీరు సతులాల
చెలఁగి తానే వచ్చి శ్రీవేంకేశుఁడే కూడె
బలిమి నింకా నతని పై పైఁ గొసరకురే ॥ఆత॥

Details and Explanations:

పల్లవి:

ఆతని యిచ్చలోదాన నన్నిటా నేను
కాతరించవద్దు నన్నుఁ గరుణించీఁ దానే ॥పల్లవి॥ 

Telugu Phrase

Meaning

ఆతని యిచ్చలోదాన నన్నిటా నేను

"ఆయన చిత్తమే నాది.  పూర్తిగా ఆయనకే చెందిపోయాను."

కాతరించవద్దు నన్నుఁ గరుణించీఁ దానే

నన్ను కలవరపెట్టవద్దు, భయపెట్టవద్దు —
ఆయన తప్పకుండా తన కరుణను చూపిస్తాడు."


 

ప్రత్యక్ష భావము:

"అన్నివిధములుగా ఆయన చిత్తానికి లోబడినదానిని నేను —
ఆయనకే అప్పగించుకున్నాను.
అందుచేత నన్ను ఉద్విగ్నతతో తొందర పెట్టవద్దు.
ఆయన దయచూపుతాడనే నమ్మకం నాకు ఉంది."

వ్యాఖ్యానం:

పెద్దమనసుతో ఓ యువతి చెలులకి చెబుతోంది —
ఒక చిలిపితనమూ లేదు.
ఆత్మవిశ్వాసం కలిగిన మృదుత్వమే ఉంది.
 

స్నేహితులు కావచ్చు —
ఆమెను చర్చతో తొందర పెట్టవచ్చు.

ఇంకా కాలేదు కదా?
ఇంకొంచెం వేచిచూస్తావా?
ఇలానే వృథా కాలం పోనివ్వడమా?” —
ఇలాగే అడుగుతున్నట్లు వినిపిస్తుంది.

కానీ ఆమె తనలో ఏకాగ్రతతో శాంతంగా చెబుతోంది:

"ఇప్పుడు నేను ఇంకేమీ చేయను.
చేయనక్కర లేదు కూడా.
నేను పూర్తిగా ఆయన్నే ఎంచుకున్నాను.
లోపల, నిశ్చలంగా, పూర్తిగా."
 

ఈ నిరీక్షణ వేరే విధంగా ఉంటుంది —
ఇది దౌర్బల్యంతో కూడిన నిరీక్షణ కాదు,
ఇది ప్రగాఢమైన ప్రేమతో కూడిన స్థితి.
 

ఇప్పటికే తన హృదయం అంతా ఆయనతో నిండి ఉంది.
ఇక దానికి కాల పరిమితి లేదు.

ఆయన రాక పట్ల ఆమెకున్న నమ్మకమే ఆమె స్థైర్యం.
ఇది చర్య కాదు, కానీ నిజంగా దైవముతో ఒక్కటై ఉండు ధైర్యము.

ఇది కదలికల లోటు కాదు,
అది ఆత్మనిశ్చయం.

ఈ స్థితిలో మాట్లాడే ఆమె మాటలు —
వినిపించేది మృదువుగా ఉన్నా,
వాటిలో ఆశయ స్పష్టత ఉంది.

అది జగత్ప్రేమలో మునిగిపోయిన మౌన సత్యం.


మొదటి చరణం:

చేరి యాతనికుణాలే చెలులాల పొగడరే
దూరకురే సారె సారె తొయ్యలులాల
కోరి కోరి వినయాన గుట్టుతోడ వేఁడుకొనరే
బీరానఁ కొంగువట్టి పెనఁగకురే ॥ఆత॥ 

పదబంధం

అర్ధము

చేరి యాతనికుణాలే చెలులాల పొగడరే

చెలులాల! అతనిని చేరి ఆతని మంచి గుణములను పొగడండి

దూరకురే సారె సారె తొయ్యలులాల

(తొయ్యలి = friend)

నెయ్యములారా! మాటిమాటికి నిందించకండి

కోరి కోరి వినయాన గుట్టుతోడ వేఁడుకొనరే

ఇచ్చాపూర్వకంగా, వినయంతో, ఏకాంతంగా ఆయనను ఆశ్రయించండి

బీరానఁ కొంగువట్టి పెనఁగకురే

గర్వంతో ఆయన కొంగుపట్టి లాగకండి (ఆ రోజుల్లో పైన వేసుకునే అంగ వస్త్రమును లాగవద్దు అంటున్నారు)



 

ప్రత్యక్ష భావము:

ఓ చెలియలారా,
ఆయన వద్దకు మృదువుగా చేరి,
ఆయన మధుర గుణాలను పొగడండి.
ఆత్మవిశ్వాసం కోల్పోయి,
వేచిచూసే విసుగుతో ఆయనను ఎద్దెవా చేయవద్దు.

నిజంగా ఆయనను కోరితే, వినయంతో, మౌనంగా, లోతుగా –
ఏకాంతంగా (గుట్టుగా) ఆయనను చేరండి.

అహంభావంతో, తొందరతో, ఆయన కొంగు పట్టి లాగకండి –
అలా చేస్తే ఆయన మరింత దూరమవుతాడు.

వ్యాఖ్యానం: 

ఈ చరణంలో ఓ చిత్తశుద్ధి గల అభిసారిక​, తన అనుభవాన్ని మృదువుగా పంచుకుంటుంది.
తన స్నేహితులు ప్రేమలో ఉలిక్కిపడి, కొన్నిసార్లు నిరాశతో, లేదా ఆటపాటగా మాట్లాడతారు.
అయితే ఆమె మాత్రం… ప్రేమంటే ఆలా కాదు అంటోంది.
 
ఆమె శాంతగా చెబుతోంది: 

మీ కోరిక నిజమైనదైతే,
ఘోషగా కాకుండా, లోపల మౌనంగా మాట్లాడండి.

ఆయనను గర్వంతో పిలిచినా, వేధించినా – ఆయన స్పందించరు.
ఆయనకు సమీపంగా ఉండాలంటే, దయ, వినయం, గంభీరత అవసరం.”
 
"గుట్టుతోడ వేఁడుకొనరే" అనే పదంలో ఎంత లోతు ఉందో!
ఇది మనసుతో మాట్లాడే భాష — బాహ్య ప్రదర్శన కాదు.
అతనితో ఉండాలంటే, అతనికే సమానమైన మౌనము, మాధుర్యం అవసరం. 

చివరిలో ఆమె హెచ్చరిక స్పష్టం: 

బీరానఁ కొంగువట్టి పెనఁగకురే"
మీరు లాగితే – ఆయన వెనక్కి పోతాడు.
ఆయన ప్రేమ  హక్కుతో కోరి కాదు – గౌరవంగా ఎదురుచూస్తూ పొందాలి.”

రెండవ​ చరణం: 

ఆసలఁ గాచుకుండరే యవసరమైనదాఁకా
వేసటలు చూపకురే వేలఁదూలాల
రాసికెక్కి వినయాన రమ్మని పిలువరే
గాసిఁబెట్టి గొబ్బునఁ గక్కసించకురే ॥ఆత॥

Telugu Phrase

Meaning

ఆసలఁ గాచుకుండరే యవసరమైనదాఁకా

ఆయవ వస్తాడని నమ్మండి. ఎంత కాలమైనా.

వేసటలు చూపకురే వేలఁదూలాల

మీ తపనను, అలసటను చూపవద్దు

రాసికెక్కి వినయాన రమ్మని పిలువరే

ఎంతీ వినయముగా రమ్మని పిలువరే

గాసిఁబెట్టి గొబ్బునఁ గక్కసించకురే

అతనిని వేధించకండి. రాచిరంపాన పెట్టకండి.


 

ప్రత్యక్ష భావము

ఎన్నియుగాలైనా సరే, ఆతురతచూపక సహించండి —
మీ తపనను, అలసటను ముఖంపై చూపించకండి, ఓ చెలియలారా.
నిగూఢంగా, వినయంతో, అదరముతో ఆయనను ఆహ్వానించండి.
వెంటపడుతూ, వేధిస్తూ — రెట్టించకండి.
అలాంటి వాటి వల్ల ఆయన మరింత దూరమవుతాడు. 

వ్యాఖ్యానం: 

ఇక్కడ అభిసారిక​ మరింత లోతుగా,
తన గుండెల్లో పుట్టిన జ్ఞానాన్ని మృదువుగా పంచుకుంటోంది.
ప్రేమ అర్థం చేసుకోవటానికి —
అది పొందేందుకు తొందరపడ్డ వాళ్లకు
ఇది నిశ్శబ్దమైన అనుభవపు మాట.
 
ఆమె చెబుతోంది: 
"నిజంగా ఆయనను ప్రేమిస్తే — వేచి ఉండండి.
ఎంతకాలమైనా, ఎన్ని జన్మలైనా కావచ్చు.
ఆత్మవిశ్వాసంతో, ఓపికగా."
 
ఇక్కడ "ఆసలఁ గాచుకుండరే" అన్న మాట నిశ్శబ్దంగా చెబుతోంది:
ప్రేమలో నిరీక్షణ పరాకాష్ట.
అది అసహనమూ కాదు, అలసత్వమూ కాదు —
విశ్వాసముతో కూడిన ఓర్పు.
 
ఆమె మెల్లగా హెచ్చరిస్తోంది: 
"వేసటలు చూపకురే వేలఁదూలాల"
ముఖంలో అలసట, మాటల్లో అసహనం — ఇవి ప్రేమను తేలిక చేస్తాయి."
 
ఆయన తనను పిలిచే స్వరం చూసి కాదు —
ఆ స్వరం వెనుకనున్న మౌనం చూసి వస్తాడు.
 
అందుకే ఆమె చెబుతుంది:
"వినయంతో పిలవండి.
గర్వంతో కాదు. ఉరుకులతో కాదు."
 
"రాసికెక్కి వినయాన రమ్మని పిలువరే" —
ఇది ఒక అంతరంగ పిలుపు.
ఇది హంగులు లేని హృదయ ధ్వని.
 
చివరిగా, ఆమె మౌనంగా హెచ్చరిస్తుంది: 
"గాసిఁబెట్టి గొబ్బునఁ గక్కసించకురే" —
వెంటపడకండి. వేధించకండి.
ప్రేమ పేరిట పట్టుపట్టకండి.
 
దైవమంటే ప్రేమ —
నిర్హేతుక ప్రేమ
"లాగితే జారిపోతుంది, అడిగితే దాగిపోతుంది —
వూరక వుంటే కౌగిలించుకుంటుంది."

మూడవ​ ​ చరణం: 

కలపుకో లెఱిఁగించి కాలుకలే యాయరే
చలపట్టకురే మీరు సతులాల
చెలఁగి తానే వచ్చి శ్రీవేంకేశుఁడే కూడె
బలిమి నింకా నతని పై పైఁ గొసరకురే ॥ఆత॥ 

Telugu Phrase

Meaning

కలపుకో లెఱిఁగించి కాలుకలే యాయరే

తనతో కలసెదమను కోరికను మృదువుగా విన్నవించండి. కానుకలు సమర్పించండి

చలపట్టకురే మీరు సతులాల

సతులారా చలమున పట్టుబట్టకండి

చెలఁగి తానే వచ్చి శ్రీవేంకేశుఁడే కూడె

శ్రీవేంకేశుఁడు తానే వచ్చును. మీతో కలియును.

బలిమి నింకా నతని పై పైఁ గొసరకురే

వానిని కొసరి కొసరి బలవంతం చేయకండే


 

ప్రత్యక్ష భావము 

కలసెదమని కోరికను మృదువుగా విన్నవించండి. వెలిబుచ్చండి —
హృదయమే నైవేద్యంగా ఆయన చెంతకు చేరండి.

కానీ, ఓ సతులారా —
అహంకారమూ, అసూయలు అనువు గావని తెలియండి.
నిజమైన ప్రణయములో ఆయన తానే వచ్చును,
తనంతట తానే చేరును,

శ్రీవేంకటేశుడు — ఓపికను కాదు స్వచ్ఛతను చూసే స్వామి!
ఆయన వచ్చాక కూడా —
తప్పించుకోకుండా ఆ సేవ, ఈ సేవ అంటూ వెంటపడకండి,
ఆయన స్వీకరించేది —
నెయ్యమును, తక్కినవన్నీ అతనికి భారములే.

వివరణాత్మక వ్యాఖ్యానం:

ఈ చివరి చరణంలో అభిసారిక​ స్వరం

మరింత ఆప్యాయంగా, ధైర్యాన్నిచ్చేలా మారుతుంది.
ఆమె తన స్నేహితుల తపనను అర్థం చేసుకుంది —

కానీ ప్రేమను బలవంతంగా పొందాలన్న ప్రయత్నంలో
 దాగిన ప్రమాదం కూడా బాగా తెలుసు. 

ఆమె వారితో చెబుతూనే ఉంటుంది:

ఆయనను నిజంగా కోరుకుంటే —
ఆ కోరికను ఘోషగా కాక, గౌరవంగా, గారబంగా వ్యక్తం చేయండి.
ఇచ్చే దానిలో శృంగారమూ ఉండాలి, సొగసూ ఉండాలి.

ప్రేమ నిజమైనదైతే —
మీరు  ఆయనలా మారిపోతారు. అంతే.” 

"కలపుకో లెఱిఁగించి కాలుకలే యాయరే"

అనే వాక్యంలో రెండు సుతారమైన స్థాయిలు ఉన్నాయి:

ప్రత్యక్ష అర్థం:
ఆయనను చేరేందుకు ప్రేమతో కూడిన బహుమతులతో అడుగుపెట్టండి.”

అంతర్గత అర్థం:

మన హృదయంలో ఉన్న ప్రేమే మన మార్గం కావాలి.
అది కోరిక కాదు —
అది జీవితమును ఉన్నపాటిగా ఆలింగనం చేసుకునే విశాలత,
ఆత్మనిగూఢమైన స్వచ్ఛతతో కూడిన దివ్య అనుభూతి.”

 

ఆమె ఓ ముఖ్యమైన హెచ్చరికను కూడా జతచేస్తుంది:

ఆయనను స్వంతం చేసుకోవాలన్న తపనే
విడిపోవటానికి మొదటి అడుగు అవుతుంది.
ప్రేమలో పట్టుబట్టడం అనేది —

దాన్ని నిలుపుకునే తహతహ​.

తానై పోయి ఒదిగిపోవటమే ప్రేమ స్వభావం.”

"చలపట్టకురే మీరు సతులాల" అనే సూచన,
ఆసూయ, గర్వం, నియంత్రణ వంటి భావాలను చూపిస్తూ —
ప్రేమను పోలినవే అయినా,
వాటివల్ల ప్రేమ జారిపోతుంది.
అవి ప్రేమకు అడ్డుగోడలుగా మారుతాయి.

 

ఆమె తేలికగా, కానీ నమ్మకంగా చెబుతుంది:

మీ ప్రేమ స్వార్థ రహితమైనదైతే — ఆయన వస్తాడు.
వేగంగా వస్తాడు. కానీ మీరు పిలిచినందుకే కాదు —
మీ లోని మౌనం, ప్రశాంతత, స్వచ్ఛత… వాటిని ఆయన గుర్తిస్తాడు.”

 

చివరగా, ఆమె తియ్యటి మృదుత్వంతో సూచిస్తుంది:

ఆయన వచ్చాక కూడా —
మరింత ప్రేమ చూపించాలన్న, ఇంకా ఏదో చేయాలన్న తొందర వద్దు.
ఆయన సమక్షంలో మౌనంగా ఉండండి.
ప్రేమను హృత్యక్షముగా స్వీకరించండి.”

 

"బలిమి నింకా నతని పై పైఁ గొసరకురే"
ఈ వాక్యంలో ఎంతో లోతు ఉంది.

దైవ అనుగ్రహం లభించిన తర్వాత కూడా —

మనము ఇంకా ఏదో తక్కువైంది అని మరింతగా ప్రేమను నిరూపించాలనే అస్తవ్యస్తమునకు లోనవుతాం.


చివరి మాట​

ఓ చెలులారా,

ఈ కీర్తనలో “నిరీక్షణ” అనే భావన పదే పదే చెప్పబడింది.

 

అంటే, ప్రేమ కోసం తపించడమే, ఎదురు చూడడమే —

“ఇంకా రాలేదు…” అనే ఆలోచనలోనే

కాలం అనే భావన పుడుతుంది.

అదే నిజమైన కాలం.

 

నిజమైన సమస్య ఏమిటంటే —

మనిషి ఆ నిరీక్షణలోనే దారి తప్పుతాడు.

ఆ తపన, ఆ లోపలి తహతహ — అదే మాయ అవుతుంది.

 

కానీ ఒక క్షణం వస్తుంది —

ఆ ప్రేమ కోసం వెదకని క్షణం.

మన అంతరంగంలో ఎలాంటి ఆటంకము, సందేహాలు లేని స్థితి.

అప్పుడు తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి.

ఆ ప్రశాంత స్థితిలో —

ప్రశ్నలు ఉన్నా,

సమాధానాల కోసం తపన ఉండదు.

కాలంతో పుట్టిన ఆలోచనలు తొలగిపోతాయి.

 

ప్రేమ మాత్రమే ఉంటుంది.

 

“అన్నమయ్య చెప్పిన ‘ఆతని యిచ్చలోదాన నన్నిటా నేను’ అన్న మాటలో ఇదే మర్మం దాగుంది.”


X-X-The END-X-X

No comments:

Post a Comment

T-253 తానేడో మనసేడో తత్తరము లవి యేడో

  తాళ్ళపాక అన్నమాచార్యులు 253 తానేడో మనసేడో తత్తరము లవి యేడో For English version press here   ఉపోద్ఘాతము   ఈ అటవీక ప్రపంచములోని అరుద...