Wednesday, 13 August 2025

T-250 అలరులు గురియఁగ నాడెనదే

 తాళ్ళపాక అన్నమాచార్యులు

250 అలరులు గురియఁగ నాడెనదే

For English version press here 

మనసును అద్దంలా చూపించలేనిదీ కవిత్వమేనా?

ఉపోద్ఘాతము

కవిత్వంలో క్రాంతి — మనస్సులో శాంతి—
అన్నమాచార్యులు
 
అన్నమాచార్యుల లోకం పుష్పసుగంధాల గుడి కాదు —
అది చెమట, రక్తం మసలే గట్టి వాస్తవం.
 
మనిషి నటనలు, బుకాయింపులు ఎత్తి చూపబడతాయి.
ఆ కీర్తనలు ఉపదేశం చేయవు —
కుటిలత్వాన్ని బహిర్గతం చేస్తాయి.
 
సంభాషణలు, సాంత్వనలు లేవు —
కేవలం చూడగలిగిన కాంతి మాత్రమే.
ఆయన పాత్రలు అనుకరించదగిన ఆదర్శాలు కావు —
మనల్ని కలవరపెట్టే అద్దాలు.
 
దేవుడు రక్షకుడని వాదించరు;
మనిషి యొక్క లోతైన సమస్య అతడే అని చూపుతారు.
ముచ్చటలు లేవు.
తాను చూచిన దానికి ముసుగు వేయని భక్తుడు ఆయన.
ఒక అపురూపమైన నృత్యం మన ముందు ఆవిష్కృతమవుతుంది.

గుండెను గ్రుచ్చు 11 బాణాలు 

హృదయంలో గుచ్చుకుపోయే బాణాలు
అన్నమాచార్యుల పదాలు,
సత్యమే గురియైన ప్రమాణాలు.
మననం చేసుకోవడానికి,
మనల్ని మనం విచారించుకోవడానికి,
ఆ లోతైన పదాల ప్రభావాన్ని
మనసుతో పూర్తిగా అనుభవించడానికి.

1. కుమ్మరింపుచుఁ దెచ్చుకొన్నదీ వలపు

ప్రేమ మనకు తెలియదు. అర్థం చేసుకోము. ఇప్పటి స్థితిలో అనుభవమునకు వచ్చునది బయటకు కుమ్మరించుచు తెచ్చిపెట్టుకొన్న ఆత్మదయ (జాలి, self-pity) మాత్రమే. దానిని పట్టుకొని కొనసాగించవలెననే ఆందోళనలో పరస్పర సౌలభ్యం కలిగిన సంబంధాలను కట్టుకుంటాము. ప్రేమ అనేది ఆందోళన, ఎదురుచూపుల వాతావరణంలో వికసించదని మనం గ్రహించము.


2. ఊరులేని పొలిమేర

నువ్వు ఎక్కడ నిలబడి ఉన్నావో నీకు తెలియదు —
అది ఊరు కాదు, సరిహద్దు కాదు.
నీ స్థానమే తెలియకపోతే ఏ దిశలో నడవాలో ఎలా నిర్ణయిస్తావు? 


3. యితరులచే ముందర నిఁక నెట్టౌదునో యని
వెతతోడఁ దలఁచేటి వెఱ పెల్లా విడిచి

తనకేమైపోయినా దాని కంటే ఇతరులు తనతో ఎలా ప్రవర్తిస్తారన్నది 
మనిషికి అత్యంత భయాందోళనలు కలిగించు విషయము. 

4. వేదాంతశ్రవణము వెట్టికిఁ జేసేరా

అని అన్నమాచార్యులు యథాలాపంగా వేదాంతము వినుటను విమర్శించిరి. 
మెట్లు ఎక్కినట్లు యాంత్రికంగా వేదాంతశ్రవణము చేసి పరమును చేరలేమనిరి. 


5. ఏ కాలమేది దనకెట్ల సుఖమైయుండు

దేవుడి వైపునడవడానికి “మంచి సమయం” కోసం ఎదురు చూస్తాము.
చరిత్రలో అలాంటి సమయం ఎప్పుడూ రాలేదు.
రాబోదు కూడా. ఈ ఎదురుచూపే నిజమైన బంధనం. 


6. మొల్లలేలె నాకు తన్నె ముడుచుకొమ్మనవె నేఁ

"నా జీవితము ప్రకృతి చందము.
ఆ మల్లెపూల వాసనతో
చేపల కంపుకొడుతున్న నా కొప్పును నింపలేను.
ఏమి చేసినా ఈ కంపు వాస్తవము.
నా ఈ శరీరము మలినము.
ఓ దేవా! నేనున్నట్లుగానే నన్ను అంగీకరించు. 


7. గడ్డపార మింగితే నాఁకలి దీరీనా

గడ్డపార జీవనోపాధికి ఉపయోగపడినాదానంతట అది ఆకలి తీర్చలేదు. 
అలాగే ఈ జన్మము మోక్షమునకు ఉపయోగపడినా
దానంతట అది అక్కడకు చేర్చలేదు. 


8. గట్టిగాఁ దెలుసుకొంటే కన్నదే కంటి కురుమ

మనసులోని తెరలే చూసే దృశ్యానికి అడ్డు.
అది ప్రపంచపు లోపం కాదు.  మన చూపులే వంకర. 
లోతుగా దూకి చూడు — మన చూపులే మనలను బంధించే గాట్లు.
ఘనమైన నిజమైన జ్ఞానం మనలోనే దాగి ఉంది


9. క్రూరత్వమునకు కుదువ యీ బ్రదుకు

ఈ జీవితాన్ని క్రూరత్వానికి పణంగా పెడుతూ జీవిస్తున్నాం.
ఇక, ఏ విషయంలో మేము పెద్దలమయ్యా?
 
కోరికలు మరియు కోపం పరస్పరం అనుసంధానమైనవి.
కోరికలు నెరవేరనప్పుడు, మనస్సులో అసంతృప్తి పెరిగి, అది కోపంగా మారుతుంది.
అసంతృప్తితో ఉన్న మనిషి ఇతరుల పట్ల అశ్రద్ధగా, దురుసుగా ప్రవర్తించటానికి మరింతగా ప్రేరేపించబడతాడు.
 
ఈ రకమైన దురుసు ప్రవర్తనతో క్రూరత్వం ప్రదర్శించి 
బదులుగా శాంతి వస్తుందనే భ్రమలో ఉంటాం. 

ప్రత్యేకించి, మన అభిప్రాయాలు పక్కవారి అభిప్రాయాలకంటే 
మెరుగైనవన్న భావన మానవ సహజ స్వభావంగా మారిపోతుంది.
ఇది ఇతరుల మాటలను విలువ లేకుండా చేసేందుకు దోహదపడుతుంది.

మన జీవితంలో జరిగే ఘటనలను నిష్పాక్షికంగా పరిశీలించినప్పుడు
మన ఈ తీరును సులభంగా గుర్తించగలం. 

అన్నమాచార్యులు ఇక్కడ మనిషి అజ్ఞానం వలన క్రూరత్వానికి అనుకోకుండా సహకరిస్తున్న వాస్తవాన్ని చెబుతున్నారు. స్వార్థం, అసూయ, అధికారం కోసం తహతహలు, క్షుద్రత—ఇవి సమాజంలో నిత్య సత్యాలుగా మారిపోయాయి. మనిషి హింసను సహజమైనదిగా భావిస్తూ, దాన్ని గమనించకపోవడం పాదుకున్న రుగ్మతకు చిహ్నములు.


10. వెలుపల మఱవక లోపల లేదు

బయట నుండి నువ్వు గ్రహించిన —
గమనించి, అనుకరించి, లేదా విద్యాబోధన ద్వారా లోనికి వచ్చిన —
అన్నిటినీ పారవేయాలి.
అప్పుడు మాత్రమే సత్యం అవగతమవ్వచ్చును.

11. కంచూఁ గాదు పెంచూఁ గాదు కడుఁబెలుచు

ఈ మనసుకు కంచులా కావలసిన రూపం ఇచ్చుకోలేము.
లేదా తగినట్టు పెంచుకోలేము.
చాలా కఠినమైనది
అది యేమో కూడా తెలియదు
ఇతరులతో పంచడానికీ వీలులేదు

అలరులు గురియఁగ నాడెనదే

అనే ఈ కీర్తన ఒక అసాధారణమైన రచనా విధానాన్ని సూచిస్తుంది.
పైన ఏర్కొన్న​ లోతైన తాత్విక భావాలను గ్రహించిన తర్వాత,
మనం ఇప్పుడు కీర్తనలోకి అడుగుపెడదాం

ఆచార్యుల వారు ఒక అగోచరమైన లోకంలోకి అడుగుపెడతారు.
దాన్ని ఆయన భూలోక భాషలో వ్యక్తపరిచినా,
ఆ భాష కదలికలలో, నృత్యంలో లీనమైపోతుంది.
చివరకు, మాట, అభినయం రెండూ ఒక్కటై,
ఆ భాష కూడా నృత్యంగా మారిపోతుంది. 

శృంగార సంకీర్తన

రేకు: 242-1 సంపుటము: 8-247

అలరులు గురియఁగ నాడెనదే
అలకలఁ గులుకుల నలమేల్ మంగ         ॥పల్లవి॥
 
అరవిరి సొబగుల నతివలు మెచ్చఁగ
అరతెర మరఁగున నాడెనదే
వరుస పూర్వదువాళపు తిరుపుల
హరిఁగరగింపుచు నలమేల్ మంగ   ॥అలరు॥
 
మట్టపు మలపుల మట్టెల కెలపుల
తట్టెడి నడపుల దాఁటెనదే
పెట్టిన వజ్రపు పెండెపు తళుకులు
అట్టిట్టు చిమ్ముచు నలమేల్ మంగ ॥అలరు॥
 
చిందుల పాటల శిరి పొలయాటల
అందెల మోఁతల నాడెనదే
కందువ తిరువేంకటపతి మెచ్చఁగ
అందపు తిరుపుల నలమేల్ మంగ ॥అలరు॥

Details and Explanations:

పల్లవి:

అలరులు గురియఁగ నాడెనదే
అలకలఁ గులుకుల నలమేల్ మంగ       ॥పల్లవి॥ 

Telugu Phrase

Meaning

అలరులు గురియఁగ నాడెనదే

విరుల వాన (అలరులు = పువ్వులు) కురుస్తున్నది. ఆ పూలవానలో నాట్యము చేస్తున్నది.

అలకలఁ గులుకుల నలమేల్ మంగ

అలమేలుమంగ నృత్యం చేస్తున్నది. నాట్యము చేస్తుంటే ఆమె ముడుచుకున్న పూలు జల్లుగా జారి పడుతున్నాయి. ఆ అభినయములో అలుకలూ (కోపాలు), కులుకులూ (సంతోషాలు) చూపుతున్నది.

ప్రత్యక్ష భావము:

అలమేల్మంగ దివ్య నృత్యపు పాట యిది!
విరుల వాన కురుస్తున్నది.
ఆ పూలవానలో అలమేలుమంగ నాట్యము చేస్తున్నది.
ఆమె నాట్యం చేస్తుంటే
ఆమె ముడుచుకున్న పూలు
జల్లుగా జారి పడుతున్నాయి.
ఆ అభినయములో
అలుకలూ (ప్రణయ కోపాలు), కులుకులూ (సంతోషాలు)
చూపుతున్నది.

వ్యాఖ్యానము:

అన్నమాచార్యుల అంతరంగమే ఈ కీర్తన. దీంట్లో ఆయన ఒక అపురూపమైన స్థితికి చేరుకుని, లౌకిక బంధాలన్నీ తెగిపోయాయని భావిస్తారు. ఆ ఆనందంలో ఆయన మనసు ఉప్పొంగి నాట్యం చేయడం మొదలుపెడుతుంది. ఈ సమయంలో ఆయన తాను ఎవరో కూడా మరచిపోతారు, తనను తాను అలమేలుమంగగా చూసుకుంటారు. 

అలరులు కురుస్తున్న వేళ, అలమేలుమంగ నృత్యం చేస్తుంది. ఈ వర్ణనలో, నృత్యం చేస్తున్నప్పుడు ఆమె జడలోని పూలు రాలి, చల్లబడుతున్నాయని కూడా అర్థం చేసుకోవచ్చు. తన అభినయం ద్వారా, ఆమె ప్రణయ కోపాలను, ఆనందపు భావాలను వ్యక్తం చేస్తుంది.


మొదటి చరణం:

అరవిరి సొబగుల నతివలు మెచ్చఁగ
అరతెర మరఁగున నాడెనదే
వరుస పూర్వదువాళపు తిరుపుల
హరిఁగరగింపుచు నలమేల్ మంగ        ॥అలరు॥ 

పదబంధం

అర్ధము

అరవిరి సొబగుల నతివలు మెచ్చఁగ

 

లయాత్మకమైన అంగవిక్షేపములు మట్టెల (కాళ్ళకు పెట్టుకునే ఆభరణాలు) ఉత్సాహంతో

అరతెర మరఁగున నాడెనదే

అర తెరచాటుగా సశబ్దముగా అడుగులు పెట్టుచు ఆమె దాటేను

వరుస పూర్వదువాళపు తిరుపుల

మొట్టమొదలు నటి, రంగస్థలమునకు వచ్చునపుడు రెండుకాళ్లతో కుప్పళించి ఎగిరి నేలతాకు లోపలనే ఒక చుట్టు తిరిగి దూకుట యని కీ.శే. ప్రభాకరశాస్త్రిగారి ఊహ! ఇదియొక నాట్య విశేషము;

దువాళపు తిరుపుల = అంటే వేగమున అంతమేరయు సమముగాఁ బోయెడి అశ్వగతి అనుకొనిన ఒకే వేగపు ఊపున తిరుగుచు దుముకుచు అని తీసికొనవలెను

హరిఁగరగింపుచు నలమేల్ మంగ

హరి మనసు కరుగునట్లుగా నాట్యం చేయసాగింది

ప్రత్యక్ష భావము:

చుట్టూ చెలికత్తెల నాట్య లయలో ఊగుతుంటే,
వారి చూపులు మృదు మెప్పుతో వెలిగెను.
అర విరిసిన మొగ్గల సౌందర్యంతో
అర తెర వెనుక నుండి ఆమె ముందడుగు వేసెను.

అక్కడే — పూర్వ దువాళపు తిరుపులు:
రెండు పాదాలతో కుదుపుగా ఎగిరి,
తాళానికి నేలను తాకి,
తన పరిధిలోనే ఒక చుట్టు తిరిగి,
ఒకే ఊపులో దూసుకుపోయెను —
ఉత్సాహభరిత అశ్వగతిలా.

అలా ఆమె ఆరంభించిన ప్రతి అడుగు,
గాలిలో తరంగమై వ్యాపించి,
హరి హృదయమును కరిగించెను.
.


వ్యాఖ్యానము:

ఇక్కడ చెప్పబడిన "నతివలు మెచ్చఁగ" సహనర్తకులు సాధారణ వ్యక్తులు కారు. వారు నారదుడు, తుంబూరుల వంటి మహా భక్తులు. వారు అన్నమాచార్యుని నాట్యాన్ని ఆశ్చర్యభరితంగా, ఆమోదించుచు, ఆస్వాదిస్తున్నారు. కాబట్టి, దీన్ని ఒక విశ్వనాట్యమని చెప్పవచ్చు. (ఈ కీర్తన ప్రజల అభిమానం పొందటానికి గాని, అనుకరణకు గాని వ్రాసినది కాదు — విముక్తి పొందిన వ్యక్తి ఆనందాన్ని సూచించటానికే వ్రాసినది.) 

"పూర్వదువాళపు తిరుపుల" అనే పదప్రయోగం అన్నమాచార్యుడు దివ్యరంగస్థలంలోకి ప్రవేశిస్తున్న సందర్భాన్ని సూచిస్తోంది.


రెండవ​ చరణం:

మట్టపు మలపుల మట్టెల కెలపుల
తట్టెడి నడపుల దాఁటెనదే
పెట్టిన వజ్రపు పెండెపు తళుకులు
అట్టిట్టు చిమ్ముచు నలమేల్ మంగ       ॥అలరు॥ 

పదబంధం (Phrase)

అర్థం (Telugu)

మట్టపు మలపుల మట్టెల కెలపుల

Rhythmic movements of her limbs,
alive with the spirited jingling of anklets.

తట్టెడి నడపుల దాఁటెనదే

She stepped with resounding grace, crossing over in her dance.

పెట్టిన వజ్రపు పెండెపు తళుకులు

ఆమెకు బిరుదుగా పాదమున పెట్టిన వజ్రపు అందెల మెరుగులు;

అట్టిట్టు చిమ్ముచు నలమేల్ మంగ

Their glimmers scattering here and there

 

 

ప్రత్యక్ష భావము

మట్టెల మోగెను — రాజస నాదమై, గర్వ గాంభీర్యమై

ప్రతి అడుగు నేలపై తరంగమై విరిసెను;
అటూ ఇటూ తట్టుకొనుచు, నాట్య విన్యాసములోనే దాటెను.
పాదముల వజ్ర పెండెరముల తళుకు మెరుపులు
అటూ ఇటూ చిమ్మగా —
తానే నృత్యమయమై నిలిచె అలమేలుమంగ.


వ్యాఖ్యానం: 

మట్టపు మలపుల మట్టెల కెలపుల
తట్టెడి నడపుల దాఁటెనదే 

ప్రత్యక్షార్థం: లయబద్ధమైన అంగవిక్షేపాలతో, మట్టెల ఉల్లాసమయమైన నాదం నిండుగా, ప్రతీ అడుగును సశబ్దంగా వేస్తూ ఆమె నృత్యంలో దాటింది. 

లక్ష్యార్థం: భగవంతుని దృష్టిలో, ఇదే ఆ క్షణం — అన్నమాచార్యుడు ఇంకా తనకు తెలియకుండానే, దైవ (లేదా సత్య) సాక్షాత్కారపు అంతిమ అంచును దాటిన క్షణం. అది యత్నంతో కాదు, నృత్యరసంలో లీనమై సహజముగా అయత్నకృతముగా, ఐచ్ఛికముగా, స్వాభావికముగా అను భావంలోనే.


మూడవ​ ​ చరణం:

చిందుల పాటల శిరి పొలయాటల
అందెల మోఁతల నాడెనదే
కందువ తిరువేంకటపతి మెచ్చఁగ
అందపు తిరుపుల నలమేల్ మంగ       ॥అలరు॥ 

Telugu Phrase

Meaning

చిందుల పాటలు శిరి పొలయాటల

లయ ప్రధానమైన పాటలు, దానిలో సరిపడు నట్టువాంగపు పాటలు, లక్ష్మీదేవి ప్రణయ క్రీడలు (శిరి పొలయాటల=  లక్ష్మీదేవి కలహకలాపములు);

అందెల మోఁతల నాడెనదే

దానికి సరిపడు గజ్జెల మోతలు, అందమైన నడకల (తిరుపులు)తో

కందువ తిరువేంకటపతి మెచ్చఁగ

నేర్పరియైన (పైగా ప్రక్కనే వున్న​) శ్రీవేంకటేశుడు మెచ్చగా

అందపు తిరుపుల నలమేల్ మంగ

అలమేలుమంగ అందముగా అభినయించుచూ నాట్యము చేసినది


 

ప్రత్యక్ష భావము: 

లయకు ప్రధానమై ప్రవహించే నాట్యగతులతో,
అందుకు సరిపడు నట్టువాంగపు పదములతో,
గజ్జెల మోగుల తాళస్వరాల సుమధుర సమన్వయంతో,
అరుణిమ తాళుకుల తిరుపులలో
లక్ష్మీదేవి ప్రణయక్రీడల సున్నిత హావభావాలు విరజిమ్ముతూ,
అలమేలుమంగ నాట్యరసంలో లీనమైంది.

ఆ శిల్పసౌందర్య నాట్యాన్ని సమీపంలో వీక్షించిన
మేటి​ నిపుణుడు శ్రీ వేంకటేశుడు
తన మనసారా మెచ్చుకున్నాడు.
 


 

వ్యాఖ్యానం:

అందుచేత, ఈ విశ్వనాట్యాన్ని అన్నమాచార్యులు అద్భుతంగా చిత్రించగా,
మనమూ ఆ సన్నివేశంలో ప్రత్యక్షంగా ఉన్నట్లుగా దానిని ఆస్వాదించగలుగుతున్నాం.
 

"ఈ నాట్యవర్ణనలో అన్నమాచార్యుడు అలమేలుమంగగా పరివర్తన చెంది, తానే నాట్యమా, నాట్యమే తానా అనే భేదం కనుమరుగై — భక్తి, సౌందర్యం, విముక్తి ఒకే క్షణంలో మిళితమై వెలిసిన రూపమిది."


నివేదన​

కొన్ని శతాబ్దాల పాటు,
అన్నమాచార్యుల రచనలు మరుగున పడిపోయాయి.
అవి కేవలం కీర్తనలు కాదు,
లోతైన తత్వం, సారంతో కూడిన అపురూప సంపద.
అదృష్టవశాత్తు తిరుమల తిరుపతి దేవస్థానములు
ఎందరో భక్తులు, గాయకులు, సంగీతకారులు
చేసిన అవిశ్రాంత కృషి వల్ల,
ఆ పవిత్ర కీర్తనలు తిరిగి వెలుగులోకి వచ్చాయి.
 
ఎందరో ప్రజలు అన్నమాచార్యుల కవిత్వాన్ని తెలుసుకుని,
అందులోని రహస్యాలను ఛేదించి,
వానిలోని లోతైన సౌందర్యాన్ని ఆస్వాదించి,
అవి హృదయాలలో తృప్తిని, ఆనందమును నింపుతుండగా
కనులు మూసుకొని పరమాత్మ భావమును పొందగలరని ఆశిస్తాను.

X-X-The END-X-X

1 comment:

  1. Very artistic explanation. Giving brief introduction of previous 11 keerthanas was very apt,to understand this keertana"Alarulu kuriyaga"as Annamacharya became Alamelumanga.🙏

    ReplyDelete

T-253 తానేడో మనసేడో తత్తరము లవి యేడో

  తాళ్ళపాక అన్నమాచార్యులు 253 తానేడో మనసేడో తత్తరము లవి యేడో For English version press here   ఉపోద్ఘాతము   ఈ అటవీక ప్రపంచములోని అరుద...