Monday, 4 August 2025

T-247 బయ లీఁదించీ నదివో ప్రాణులను హరిమాయ

 తాళ్ళపాక అన్నమాచార్యులు

247 బయ లీఁదించీ నదివో ప్రాణులను హరిమాయ 

For English version press here 

"మన ఆలోచనలు, కదలికలు, ఆశలు —
ఇవన్నీ మనకే తెలియని షరతుల నేపధ్యంలో పుడతాయి."

 

ఉపోద్ఘాతము

ధర్మోపదేశాలకు, బోధనలకు
అన్నమాచార్యులు ఆమడ దూరం.
అయితే…
ఆయన చూస్తారు —మనల్ని చూడగలిగేలా చేస్తారు.
అదే వారి వ్యూహం.

ఆయన కవిత్వం ఇతరులను మార్చాలనే తపనతో  పుట్టిందికాదు —
అయనలో ఉబుకుతున్న స్పష్టమైన అంతర్దృష్టి
భ్రమల్ని ఎలాంటి నిబంధనలు నిందలూ లేకుండా
విప్పి చూపుతుంది.
కాలాలు మారినా గుణం నిలిచే కవిత్వం.


కృతిరస విశ్లేషణ​: ఈ కీర్తనను ముఖ్యంగా ఒక ధ్వని కావ్యంగా (సూచక కవిత్వంగా) పరిగణించవచ్చు — ఎందుకంటే ఇందులోని భావాలను ఎక్కడా నేరుగా ప్రకటించలేదు; ఎదో తెలుపలేని విషయము లక్ష్యముగా అన్నీ సూచనల రూపంలోనే వున్నాయి. ఈ రచన యొక్క నేపథ్యపు భావం స్పష్టంగా అధివాస్తవికము మరియు అలౌకికము అనవచ్చును.

 

ఈ కీర్తనలో ప్రబలంగా కనిపించే స్థాయి భావం వైరాగ్యమేనని తీసుకుంటే, దాని ద్వారా ఆవిష్కృతమయ్యే రసము — శాంతరసం. అదొక లోతైన జలముల లోనికి ప్రయాణం.

 

ఇందులో "హాస్యము" మోదమును పుట్టించక పోగా, కొంత ఎబ్బెట్టుగా వుండి, అది ఒక పరాయి రసంగా (అంగిరసంగా) వాలిన కనుబొమ్మలను కదిలించేలా, మూసుకుపోయిన ఆలోచనలకు అది వింతగా, ఊహించని రీతిలో మనల్ని తట్టి ఆలోచింపజేస్తుంది. 

 

సాహిత్యమును అర్ధము చేసుకొనుట కష్ట సాధ్యము కనుక ఈ కీర్తనను ‘నారికేళ పాకము’గా భావించ వలెను. లోపలి మాధుర్యాన్ని ఆస్వాదించాలంటే, ముందు దాని బాహ్యమైన ఒక పట్టాన విడని పొరలను తొలగించాలి. అలా తెరిచాక – ఆ మాధుర్యం ఎంతోకాలం మనసులో నిలిచిపోతుంది.

 

అధ్యాత్మ సంకీర్తన

రేకు: 251-4 సంపుటము: 3-293

బయ లీఁదించీ నదివో ప్రాణులను హరిమాయ
క్రియ దెలుసుకొనేటి కీలింతే కాని   ॥పల్లవి॥
 
పెక్కుపరుషులలోన బెరశొకసతి యుంటే
యిక్కువై యందే నాఁటు నిందరిచూపు
దక్కి యందరి కాఁగిళ్ల తరుణి యుండుట లేదు
గక్కన వట్టియాసలఁ గరఁగుటే కాని  ॥బయ॥ 

చింతకాయ కజ్జాయము చేరి యిసుమంతవుంటే
అంతటనే నోరూరు నందరికిని
పొంతనే నాలుకలకు పులుసై యుండుటే లేదు
కొంత భావించి మింగేటి గుటుకలే కాని       ॥బయ॥
 
శ్రీవేంకటేశుతేరు దీసేటి మనుజులెల్లాను
సేవగా నేమే తీసితిమందురు
ఆవల నాతఁడే తమ‌ అంతరాత్మయైయుండి
కావించుట యెరఁగరు గర్వములే కాని       ॥బయ॥

Details and Explanations:

పల్లవి:

బయ లీఁదించీ నదివో ప్రాణులను హరిమాయ
క్రియ దెలుసుకొనేటి కీలింతే కాని ॥పల్లవి॥ 

Telugu Phrase

Meaning

బయ లీఁదించీ నదివో ప్రాణులను హరిమాయ

దిగో కనబడటంలేదా! హరిమాయ మనలను బయట బయటే ఈదించును.

క్రియ దెలుసుకొనేటి కీలింతే కాని

మానవుడు చేపట్టదగు కార్యము తెలియుదాకా, ఇది ఇంతే. కొనసాగుతుంది.


 

ప్రత్యక్ష భావము:

హరిమాయ” మనుషులను బయట బయటనే ఈదిస్తూ —
కాలాన్ని గడిపేస్తుంది.
అసలు చర్య ఏదో, దాని మూల తత్త్వాన్ని గ్రహించనిదే
ఈ మాయ నుంచి విముక్తి లేదు —
ఇదే కీలకం.

వ్యాఖ్యానం:

తన చూపు స్పష్టమై —
మన కదలికల అంతర్లీన అశాంతిని గమనిస్తాడు కవి.
భాష, బోధ, సంస్కృతి, సమాజం,
మనకు తెలియని షరతులు —
అవే మన ఆలోచనలకి ఆజ్ఞాపకులు.
 
అయితే కవి బోధించడు, మారమని అనడు.
కేవలం చూపిస్తాడు —
మనము ఎక్కడ తడబడుతున్నామో,
శాంతముగా, నిశబ్దంగా చూపిస్తాడు.

పల్లవి ప్రధాన ఉద్దేశం —

మనిషి “అసలు చర్య” తెలియక తడబడతాడని.
కాని ఈ కవి — అది ఏమిటో చెప్పరు.
కేవలం… సూచిస్తారు.

ఇలాంటి కవిత్వం ఎందుకు?
ఇంత సున్నితమైన భావాన్ని పొదిగే ప్రత్యామ్నాయం ఏది?
 

ప్రధానమైన విషయం?
అది చెప్పకపోవడంలోనే ఉంది.
చెప్పినది ఒక జాలమైతే,
చెప్పనిదది ఆ జాలపు ఖాళి.

అసలు సారాంశం —
చెప్పిన దానిలో కాక,
చెప్పనిదానిలో దాగి ఉంటుంది.
 

ఈ రూపంలో —
కవి తన స్పష్టతను మౌనంగా పంచుతాడు.
ఉపదేశం లేదు, ఆకర్షణ లేదు —
కేవలం ఒక లోతైన దర్శనం.


నిగూఢ భావము:

మన చర్యలన్నీ స్వతంత్రమయినవి కావు —
అవి బాహ్య సంజ్ఞలకే మనసిచ్చే అనియంత్రిత ప్రతిస్పందనలు.
ఈ సత్యం ఒక్కసారి తేటతెల్లమైతే —
చేయవలసినదైనదేమీ మిగలదు.
అక్కడే "ఏదో చేయవలెను" అనే తపన అంతమవుతుంది.

నిగూఢ భావముపై వివరణ​: 

అందుచేత మనం గ్రహించవలసినది:
మన ప్రస్తుత క్రియాశీలత (కార్య క్షేత్రము) అన్నది
నిజంగా మన స్వంత నిర్ణయం కాదు —
అది మనలో నెలకొన్న "కండిషనింగ్" వల్ల
జరిగే స్వయంచాలక చర్య మాత్రమే.
 
ఈ విషయం మనిషికి పూర్తిగా స్పష్టమైతే —
అక్కడినుండే 'నిజమైన క్రియ' ప్రారంభమవుతుంది.
ఆ క్రియాశీల క్షేత్ర ప్రభావానికి లోనుకాకుండా నిలబడటమే నిజమైన చర్య.
దానికి మినహాయించి చేయునవన్నీ —
ప్రస్తుత స్థితిని కొనసాగించడమే.

మొదటి చరణం:

పెక్కుపరుషులలోన బెరశొకసతి యుంటే
యిక్కువై యందే నాఁటు నిందరిచూపు
దక్కి యందరి కాఁగిళ్ల తరుణి యుండుట లేదు
గక్కన వట్టియాసలఁ గరఁగుటే కాని        ॥బయ॥ 

పదబంధం

అర్ధము

పెక్కుపరుషులలోన బెరశొకసతి యుంటే

(బెరశొకసతి = వెరసి ఒక సతి = లెక్కకి ఒక స్త్రీ)

అనేక మంది పురుషుల మధ్య ఒక స్త్రీ మాత్రమే ఉన్న

యిక్కువై యందే నాఁటు నిందరిచూపు

అందరి చూపూ ఆమెపై ఉంటుంది

దక్కి యందరి కాఁగిళ్ల తరుణి యుండుట లేదు

అయితే ఆమె అందరికీ దక్కుటలేదు

గక్కన వట్టియాసలఁ గరఁగుటే కాని

కానీ అందరూ తమకే ఆ అవకాశం దొరుకుతుందన్న వట్టి ఆశలలో కరిగిపోతూ వుంటారు

 

 

ప్రత్యక్ష భావము:

పెక్కు పురుషుల మధ్య ఒక ఒంటరి సతి —
వారి చూపులన్నీ ఆమెపైనే.
ఆమె అందరికీ దక్కదని ప్రతీవానికి తెలిసినా,
ఆశల దహనంలో తానే పొందతానని కలగంటాడు.
అందరినీ మరిగించే ఆతృత —
ఊహలే ఇస్తున్న మత్తు.

వ్యాఖ్యానం: 

"దృష్టాంతంలోని మోటుతనమును, అశ్లీలతను పట్టించుకోకండి —
ఇది ఉద్దేశపూర్వకంగా,
బలంగా మనసును మెదిలించేందుకు
ఎంచుకున్న ఉదాహరణ​.

అంతేకాని, ఉద్రేకం కలిగించడానికో,
ద్వంద్వార్థాల కోసమో కాదు.
ఇది మనసు ఊహాజనిత ఆనందాల మత్తులో
ఎలా చిక్కుకుంటుందో వివరించేందుకు
వాడిన ఉపమానం మాత్రమే."



రెనె మాగ్రిట్ గారు వేసిన (The Prepared Banquet) పై బొమ్మ ను చూడండి
ఒక పురుషుడు — బోలర్ హ్యాట్ పెట్టుకొని,
అడవి వైపు తిరిగి చూస్తున్నాడు.
ఆయన కోటు మీద,  వీపు భాగంలో —
బొట్టిచెల్లి వేసిన “ప్రిమావెరా” చిత్రంలోని
ఫ్లోరా బొమ్మ ముద్రితమై ఉంది.

ఆమె అక్కడ ఉంది —
కానీ అతనికి ఆమె తన వీపు మీద వుందని తెలియదు.
ఆయన ముందు 'అడవి అనే ప్రపంచం' ఉంది —
కానీ ఆయన మనసుకు ఆకృతి ఇస్తున్నది వెనుక ఉన్న రూపమే.
 
ఆమెను నిజంగా ఎవ్వరు చూడలేరు.
అలాగని పొందలేరు కూడా.
కానీ అందరూ కౌతుకము ఆమె మీద మోపేస్తారు.
ఆమె స్వరూపం కన్నా —
ఆమెపై తాము గీసుకున్న కలలే ఎక్కువ.
 
మాగ్రిట్ చెప్పేది ఇదే 
ప్రభావితం చేసేది మనకు ఎదురుగా ఉన్నది కాదు —
మన వెనక ముద్రితమైవున్న అనుభవాల చిహ్నాలు.
మన ఊహలే — మోహాల రూపాల్లో మమ్మల్ని ఊగిస్తాయి.
 
మనసు స్వచ్ఛంగా చూసేది కాదు —
రూపాల కొలిమిలో తలకెక్కించుకున్న కలల బీజాలుగా—
ఒకానొక రూపంలేని  చెట్టులా, గజిబిజిగా. 

అన్నమయ్యకు ఇది తెలుసు —
మనల్ని కదిలించునది కేవలం కనబడుతున్న రూపాలు కావు
అంతస్థంగా నిర్మించుకున్న అనుభవాల కోటలు.
ఆయన కవితలో భ్రమలు బయటపడతాయి.
(ఇదే "గక్కన వట్టియాసలఁ గరఁగుటే కాని" అని అన్నమయ్య అన్నది)

రెండవ​ చరణం:

చింతకాయ కజ్జాయము చేరి యిసుమంతవుంటే
అంతటనే నోరూరు నందరికిని
పొంతనే నాలుకలకు పులుసై యుండుటే లేదు
కొంత భావించి మింగేటి గుటుకలే కాని  ॥బయ॥ 

పదబంధం (Phrase)

అర్థం (Telugu)

చింతకాయ కజ్జాయము చేరి యిసుమంతవుంటే

(కజ్జాయము = కజ్జికాయ​) చింతకాయ కజ్జాయము అన్నమయ్య కాలములోప్రసిద్ది చెంది వుండ వచ్చును

చింతకాయతో చేసిన కజ్జాయమును కొంచెం ఉంచితే

అంతటనే నోరూరు నందరికిని

అందరి నోరులో నీరూరుతుంది

పొంతనే నాలుకలకు పులుసై యుండుటే లేదు

కొంచెమే వుంది కాబట్టి అందరికి పంచడానికి రాదు. అందరి నాలుకలకు ఆ పులుపు తగులుటలేదు

కొంత భావించి మింగేటి గుటుకలే కాని

తినబోతున్నమనే ఊహ వల్లనే మన నాలుక స్పందిస్తుంది

 

 

ప్రత్యక్ష భావము

"ఒక పసందైన చింతకాయ కజ్జాయము పక్కన వుంటే —
వెంటనే అందరి నోళ్లూరతాయి.
కానీ దాన్ని రుచి చూడగలిగేది ఒక్కరే.
ఒక ముద్ద అందరి నాలుకలకు తాకదు.
అయినా… చూపులు, ఊహలు, ఆశలు— ఇవే గుటకలై గుండెల్లో దిగుతాయి."

వ్యాఖ్యానం: 

చింతకాయ కజ్జాయము —
ఒక బాహ్య అయస్కాంతం.
మన ఆశలు, ఊహలు —
మనలో దాగి ఉన్న ఇనుప సూదులు.
వాటిని తిప్పే శక్తి — అయస్కాంతానిదే.
మనకు తెలియకుండానే — మనసుపై ప్రభావం చూపుతుంది.


ఇది కేవలం ఊహ కాదు — శాస్త్రీయంగా నిరూపితమైన విషయం.
రష్యన్ శాస్త్రవేత్త పావ్లోవ్ చేసిన ప్రసిద్ధ ప్రయోగాన్ని గుర్తు చేసుకోండి
ప్రతి సారి కుక్కలకు ఆహారం ఇచ్చే ముందు —
ఒక గంట మోగించేవాడు.
కొన్ని రోజులకు —
గంట మాత్రమే మోగితే చాలు,
ఆహారం లేకున్నా — కుక్కలకు నోరూరేది.
ఇది క్లాసికల్ కన్డిషనింగ్.
 

మన మనసూ అచ్చంగా అలాగే పనిచేస్తుంది.
చింతకాయ కజ్జాయము చూపించగా —
అది నోట్లోకి రాలేదు.
కానీ నోరూరుతుంది.
ఎందుకంటే మన ఊహలు, ఆశలు —
మునుపటి అనుభవాల జాడలు వదలిన సంజ్ఞలకు స్పందిస్తాయి.
అవి లోపల ఓ వాతావరణాన్ని నిర్మిస్తాయి.
ఇప్పటి దృశ్యం ఆ సంకేతాన్ని మేల్కొలుపుతుంది.
.

ఇలా —
బయటి దృశ్యం ఒక సంకేతం
లాగ —
లోపల మేల్కొనేవి అనేక స్పందనలు.

మన ప్రతిస్పందనలు అనేవి —
మనవి కాదేమోనన్న అనుమానం తలెత్తుతుంది.
అవి కన్డిషనింగ్ ద్వారా తర్ఫీదు పొందిన అనియంత్రిత క్రియలు..

ఈ కోణంలో చూస్తే —
కొంత భావించి మింగేటి గుటుకలే కాని

అన్న మృదుమైన పంక్తి వాస్తవం కాదని తెలిసినా
ఊహలో పుట్టిన ఆనందం ఎంత
నిజమైన అనుభూతిగా అనిపించగలదో

తెలిపే ఆత్మవేదన అవుతుంది. 


మూడవ​ ​ చరణం: 

శ్రీవేంకటేశుతేరు దీసేటి మనుజులెల్లాను
సేవగా నేమే తీసితిమందురు
ఆవల నాతఁడే తమ‌ అంతరాత్మయైయుండి
కావించుట యెరఁగరు గర్వములే కాని   ॥బయ॥ 

Telugu Phrase

Meaning

శ్రీవేంకటేశుతేరు దీసేటి మనుజులెల్లాను

శ్రీవేంకటేశుని రథాన్ని లాగే ప్రజలంతా

సేవగా నేమే తీసితిమందురు

"ఈ కృషి మాదే" అని హర్షంతో చెప్పుకుంటారు

ఆవల నాతఁడే తమ‌ అంతరాత్మయైయుండి

కానీ శ్రీవేంకటేశుడే వారిలో అంతరాత్మగా ఉండి

కావించుట యెరఁగరు గర్వములే కాని

తామే చేసితిమన్న గర్వము కారణం కాగా వారు గుర్తించలేకపోతారు


 

ప్రత్యక్ష భావము 

శ్రీ వెంకటేశ్వరుని రథాన్ని లాగుతారు —
‘మేమే కదలిస్తున్నాం!’ అని గర్వంగా ప్రకటిస్తారు.
కదిలేది ఏదో, కదిలించేది ఏదో అన్న సత్యం గమనించరు.
లోపల బయటా తానే — ఆత్మస్వరూపుడు.
తాము కర్తలమని తలచుకుంటారు —
కానీ ఎవరూ కారణం కారు; కేవలం సాధనాలే."

 వివరణాత్మక వ్యాఖ్యానం:


రథాన్ని తానే లాగినట్టు
రథం కదలింది తన పట్టు
మనిషి తలుస్తాడు ప్రతి పట్టు
కృష్ణకృష్ణా! ఎంత ఘనమైన చేష్ట
 
ఆయన కదిలించడా లోకాలు
ఏడ మనిషి బింకపు కుందేలు!
అనరయ్యా అసలు భక్తులు 
లేని పాత్ర కోసమై దాహములు
గర్వపు కలలు. 

వాస్తవంగా —ఆయన తానే నడిచే దారి,
మనం లాగుతున్నట్టు అనిపింపచేయు గడసరి
కానీ ఆయనే మనల్ని నడిపించు రహదారి.
 
ఇంతలో మన గర్వమే ప్రార్థనగా మారు
సేవే మన ప్రతిబింబమై  పక్కన చేరు 
అన్నమయ్య చెబుతారు సజావుగా —
ఈ గోప్యమైన గర్వాన్ని పట్టించి చూపుగా,
అహము నాటకాన్ని ప్రేమతో సున్నితంగా.

ఉపసంహారము & కీర్తన సారాంశం:

మనిషి బహిరంగంగానే కర్మ అనే ఊబిలోకి దిగుతాడు

ఇది "కండిషనింగ్" అనే ఆంతరంగిక ప్రక్రియపై

అన్నమాచార్యులు పలికిన సున్నితమైన, గొప్ప వాస్తవము.

మొదటి చరణం —

మన చర్యల వెనుక ఉన్న ఊహాజనిత తపనను ఎత్తి చూపిస్తారు.

రెండవ చరణం —

ఆ తపన ఎలా అలవాట్లుగా, అనుభవాలుగా మనల్ని ఆక్రమిస్తుందో తెలుపుతుంది.

చివరగా —

అసలు మర్మాన్ని మన ముందుంచుతుంది:

మనమే కారణమని మదించ రాదు.

మనం కర్తలము కాదని,

ఆయన చేతిలోని సాధనాలమని స్పష్టతనిచ్చే అద్భుత ముగింపు.


అంత్యమే కాని అల్పము కాదు

నేను ఎంత పైకెక్కినా —

అక్కడకి నా కన్నా ముందే

ఒక కవి చేరుకొని ఉంటాడు.”

సిగ్మండ్ ఫ్రాయిడ్


X-X-The END-X-X

No comments:

Post a Comment

T-253 తానేడో మనసేడో తత్తరము లవి యేడో

  తాళ్ళపాక అన్నమాచార్యులు 253 తానేడో మనసేడో తత్తరము లవి యేడో For English version press here   ఉపోద్ఘాతము   ఈ అటవీక ప్రపంచములోని అరుద...