అన్నమాచార్యులు
166 పదిలము కోట పగవారు.
for Commentary in English Click here.
సారాంశం: రక్షణకై పరుగిడక, భద్రత అను ద్వీపమును వీడి సత్యమును కనుగొనుము.
కీర్తన సారాంశం:
పల్లవి: నాయనలారా! జాగరూకులై వుండండి. మీకు భద్రత కల్పించుచున్న
దానిని భగ్నము చేయు అవకాశం కోసము మీయందే నిలిచి ఆ ఆఱుగురు (కామము, క్రోధము, మోహము, లోభము, మదము, మత్సరములను వారు) ఎల్లవేళలా ఎదురు చూచుచుందురు. అన్వయార్ధము: నీవు భద్రత
అనుకున్నది ఎంత సృష్టించుకున్నానూ లేదు. నీ శతృవులు నీయందే వున్నారు. భద్రతపై మనసు
విడిచి జీవనయానమును సాగించుటయే నీ పని.
చరణం 1: తలిదండ్రులు ఎంతో కోరుకున్న
బిడ్డ తొమ్మిది నెలల పాటు తల్లిగర్భంలో చీకట్లో బిక్కుబిక్కుమంటూ పాకులాడింది. పంచేంద్రియములను దొమ్మికాండ్రు భద్రత అను కోటను
ఆశ్రయించుకొని చెట్టులో కొమ్మ కలసిపోయిన తీరున
కుదురుకుంటారు.
చరణం 2: అన్యుడు (మనకు తెలియని వాడు)
విడువకుండా తనవెంట తోడు తెచ్చుకొన్న ఇద్దరు మంత్రులు (గత జన్మల పాపము మరియు పుణ్యము)
సలహాలను పాటిస్తుంటాడు. వీరు కాకుండా మొండిగా ఆ కోటలో ఇష్టం వచ్చినట్లు తిరుగు వారు, బలవంతులు అగు పంచేంద్రియములు, మనస్సు, అహంకారము' అను ఏడుగురు బంట్లుందురు.
చరణం 3: ఆ కోటకు తొమ్మిది కనుమ మార్గములున్నాయి.
వాటిని కప్పుతూ అనేక తీగెలున్నాయి. అవే నవరంధ్రాలూ, ధమనులు, సిరలు
అని పిలువబడే నరాలు). వాళ్లు గొప్ప సమర్థులు. నేను అది గ్రహించినప్పుడు కోనేటి వేంకటెశ్వరుడు
హృదయములోకి చొచ్చుకు వచ్చినాడు. ఇప్పుడు నాకు భయము లేదు.
విపులాత్మక వివరణము.
ఉపోద్ఘాతము: అన్నమాచార్యుల అసమాన ప్రతిభకు ఈ బుల్లి కీర్తన అత్యుత్తమ వుదాహరణ. ఇక్కడ కోట అనగా మానవుడు తన ఆత్మ రక్షణకై నిర్మించుకొను అనేకానేక పన్నాగములకు సంకేతము. మనిషి ఆరాటపడు రక్షణ హామీకి ఆధారములేదనిరి.
ఆచార్యులవారు. బిగుతుగా, పకద్బందీగా అల్లిన
ఈ కీర్తన మానవుడు సహజముగా ఆశించు భద్రత దేనికొరకో
ఆలోచించమంటుంది. మనిషి అంతర్భాగముగా వుంటూనే అల్లుకుపోయి, లేని రక్షణను చేపట్టు చర్యలకు ఉసికొల్పు దానిని 'కోట' అనిరి. దైవము కన్ననూ రక్షణ వేరెవరు కల్పించగలరు?
కీర్తన: రాగిరేకు: 10-1 సంపుటము: 1-61 |
పదిలము కోట పగవారు
అదనఁ గాచుకొందు రాఱుగురు ॥పదిలము॥ ఇమ్మైఁ జెప్ప యిందరిచేత
తొమ్మిదినెల్లఁ దోఁగినది
కొమ్మతీరునఁ గుదురైన కోట
దొమ్మికాండ్లైదుగురుందురు ॥పదిలము॥ వొంటికాఁడు రాజు వుడుగక తమలోన
వొంటనీని మంత్రులొక యిద్దరు
దంటతనంబునఁ దమ యిచ్చఁ దిరిగాడు
బంటు లేడుగురు బలవంతులు ॥పదిలము॥ కలవు తొమ్మిది కనుమల తంత్రము
నిలుపఁగలిగినట్టి నెరవాదులు
తెలిసి కోనేటి తిమ్మినాయఁడు చొచ్చె
బలిసె యీ కోట భయమేల ॥పదిలము॥
|
Details and Explanations:
ముఖ్య
పదములకు అర్ధములు: కోట = ఇక్కడ కోట అనగా భద్రత కల్పించునది అన్న
అర్ధములో వాడారు; అదనఁ గాచుకొందురు = అవకాశం కోసము చూచుచుందురు; ఆఱుగురు
= కామము, క్రోధము,
మోహము, లోభము, మదము, మత్సరములే
ఆ ఆఱుగురు.
భావము: నాయనలారా!
జాగరూకులై వుండండి. మీకు భద్రత కల్పించుచున్న దానిని భగ్నము చేయు అవకాశం కోసము మీయందే
నిలిచి ఆ ఆఱుగురు (కామము, క్రోధము, మోహము, లోభము, మదము, మత్సరములను
వారు) ఎల్లవేళలా ఎదురు చూచుచుందురు.
వివరణము: మనిషి రక్షణకోసము అనేక మార్గములు వెతికాడు, వెతుకుతున్నాడు, వెతుకుతాడు కూడా. ఇవన్నియు, పైపై భద్రత అను
ఊహలు కల్పించి మానవుని వూరించుచున్నవే కానీ, వూహించుకున్న భద్రతను
ఇవ్వలేకపోయాయి. మొదట చేతులు, తరువాత రాళ్ళు, కాగడాలు, కత్తులు, ఫిరంగులు, తుపాకీలు, మర తుపాకీలు, బాంబులు, అణుబాంబులు, ఖండాంతర క్షీపణులు - ఇవేవీ వాటిని కనిపెట్టినవారిని
కూడా రక్షింపలేక పోయాయి. ఇవి ప్రాపునుగానీ ఆశ్రయమును గానీ కల్పించలేవన్నది నిర్వివాదాంశము.
ఇప్పుడు మాగ్రిట్ గారు వేసిన La place au soleil (’The place in the sun’) అను పేరుగల ఒక చిన్న కొలాజ్ చూద్దాము.
దానిని పరిశీలిస్తూ ఈ పల్లవి అర్ధమును క్షుణ్ణంగా తెలుసుకొందాము.
ఉన్న భద్రతను విశ్వసించలేని
మనస్తత్వము ఆధారముగా 'సూర్యునిలో స్థానం' అనే కొలాజ్ ధారావాహిక మాగ్రిట్ గారు వేసిరి. పై బొమ్మలో ఒక సీతాకోక చిలుక రెక్కలపై సింహం బొమ్మవేసి ఎన్నో
విషయాలను టూకీగా చేప్పేశాడు చిత్రకారుడు. అతి సున్నితమైన సీతాకోక చిలుక
రెక్కలపై అత్యంత బలముగల సింహమును నిలబెట్టుటకూడా వూహించలేనిదే. అలాగే సింహము బొమ్మను
పెట్టుకున్నంత మాత్రమున అదనపు రక్షణ కూడా కలగదు.
పై బొమ్మలోని సీతాకోక చిలుక
మాదిరిగానే మానవుడు ఎన్ని ప్రయత్నములను చేపట్టినా, దైవమిచ్చిన రక్షణకు మించి అదనముగా ఇసుమంతైనా లబ్ధి పొందడు. చరిత్ర చెబుతున్న పచ్చి నిజాలను విస్మరించి
అడుగు ముందుకేస్తాడు మానవుడు. ఆ యత్నములలో తన జీవితమును వ్యర్ధము చేసుకుంటాడు.
ఇకపోతే అన్నమాచార్యులు
'పదిలము కోట పగవారు
/ అదనఁ గాచుకొందు రాఱుగురు' అని ఆ భద్రత అను కోటను నిర్మించుటను వూహయే పగవారికి అదను కల్పించునని చెప్పిరనుకోవచ్చును.
అన్వయార్ధము: నీవు భద్రత అనుకున్నది ఎంత సృష్టించుకున్నానూ లేదు. నీ శతృవులు
నీయందే వున్నారు. భద్రతపై మనసు విడిచి జీవనయానమును సాగించుటయే నీ పని.
ముఖ్య
పదములకు అర్ధములు: ఇమ్మైఁ = ఇమ్ము + అయి = ఇంపైనదియై,
అనుకూలమైనదియై; దోఁగినది = ప్రాకులాడనది;
దొమ్మికాండ్లు = అందఱు కలయఁబడిచేయు యుద్ధము; ఐదుగురు
= పంచేద్రియములు
భావము: తలిదండ్రులు
ఎంతో కోరుకున్న బిడ్డ తొమ్మిది నెలల పాటు తల్లిగర్భంలో చీకట్లో బిక్కుబిక్కుమంటూ పాకులాడింది. పంచేంద్రియములను దొమ్మికాండ్రు
భద్రత అను కోటను ఆశ్రయించుకొని చెట్టులో కొమ్మ కలసిపోయిన తీరున కుదురుకుంటారు.
వివరణము: 'ఇమ్మైఁ జెప్ప యిందరిచేత' అను పదములు ప్రపంచమున పుట్టు ప్రాణులన్నీ
వాటి వాటి తలిదండ్రుల కలలను, ఇష్టాలను సాకారము
చేయుచూ పుడుతున్నవని అర్ధము. ఈ సందర్భంగా "దిబ్బలు వెట్టుచు దేలిన దిదివో"
అను కీర్తనలో అనేక కష్టములను అధిగమిస్తూ ప్రాణి తల్లి గర్బమునుండి బయటకు వచ్చుటను వర్ణించిన
విషయమును మననము చేసుకుందాము. 'మోపుల చిగురుల చిమ్ముల వేదము' అను కీర్తనలోనూ ఇటువంటి విషయమునే చెప్పిరి. అన్నమాచార్యులు అనేకమార్లు ఈ విషయము
ప్రస్తావించుట గమనార్హము. విజ్ఞులు దానిపై దృష్టి సారించవలె.
గర్భంలోని శిశువు (పిండం)
ఒక పరాయి కణజాలం; ఒక ట్రాంస్ప్లాంటు (transplant) వలె ఇది తల్లి రోగనిరోధక వ్యవస్థకు విరుద్ధంగా ఉంటుంది. ఇది తల్లి శరీరాన్ని
పంచుకున్నప్పటికీ, పిండం ప్రత్యేకమైన
జన్యు నిర్మాణం మరియు శరీర కణాలతో భిన్నమైన వ్యక్తి. ఈ రకముగా చూచిన అన్నమాచార్యులు
చెప్పిన బిక్కుబిక్కుమంటూ చీకట్లో తల్లిగర్భంలో పాకులాడింది అనడం ఎంత సముచితమో!
ప్రతి ఇంద్రియము మెదడుకు సంకేతాలను పంపుతుంది. ఈ సంకేతాలను అర్థం చేసుకోవడం మరియు ప్రతిస్పందనలను యిచ్చుట మెదడు పని. ఇలా చేయడంలో, మెదడు తరచుగా బహుళ ఇంద్రియ వ్యవస్థల నుండి సమాచారాన్ని మిళితం చేస్తుంది-ఇంద్రియ సమాకలనము వంటి ప్రక్రియ. ఇలా తలచనప్పటికీ, కోరనప్పటికీ ఇంద్రియాల మధ్య అవాంఛిత సంకేతాల మార్పిడి crosstalk ద్వారా జరిగిపోతూనే వుంటుంది.
సినెస్థీషియా (synaesthesia) అనేది శరీరంలోని ఒక జ్ఞాపకము లేదా భాగానికి సంబంధించిన ఇంద్రియ ముద్రను (లేదా చిహ్నమును, గురుతును)
మరొక ఇంద్రియ లేదా శరీరంలోని భాగాన్ని ప్రేరేపించడం ద్వారా ఉత్పత్తి చేస్తుంది. ఇంద్రియాలు మానవునిపై దొమ్మియుద్ధము చేస్తున్నాయనడం ఎంత సునిశితమైన పరిశీలనయో!
అన్నమాచార్యులు అసమాన ప్రతిభావంతులు.
ముఖ్య
పదములకు అర్ధములు: వొంటికాఁడు = అన్యుడు (మనకు తెలియని వాడు); ఉడుగక = విడువక; వొంటనీని మంత్రులొక యిద్దరు = తోడు తనవెంట తెచ్చుకొన్న ఇద్దరు మంత్రులు (గత
జన్మల పాపము మరియు పుణ్యము); దంటతనంబు = మొండితనము, యిచ్చఁ దిరిగాడు = ఇష్టం వచ్చినట్లు తిరుగు వారు; బంటు
లేడుగురు = ‘పంచేంద్రియములు, మనస్సు,
అహంకారము'
భావము: అన్యుడు
(మనకు తెలియని వాడు) విడువకుండా తనవెంట తోడు తెచ్చుకొన్న ఇద్దరు మంత్రులు (గత జన్మల
పాపము మరియు పుణ్యము) సలహాలను పాటిస్తుంటాడు. వీరు కాకుండా మొండిగా ఆ కోటలో ఇష్టం వచ్చినట్లు
తిరుగు వారు, బలవంతులు అగు పంచేంద్రియములు, మనస్సు, అహంకారము' అను
ఏడుగురు బంట్లుందురు.
వివరణము: వొంటికాఁడు = అన్యుడు (మనకు తెలియని వాడు) అంటూ మనిషి ఇప్పటి
తన మానసిక స్థితిలో ఒంటరివాడని, చరాచర ప్రపంచమును
నడుపు జీవ శక్తిలో భాగమైనప్పుడు ఒంటరితనము అను అనుభవముండదని సూచించిరి. మానవుడు తనమీద
మూకుమ్మడిగా దండెత్తు బలవంతులైన పంచేంద్రియములకు, మనస్సునకు, అహంకారమునకు భయమంది చేయు వుపాయములనే అజ్ఞానము
అనిరి. మానవుని ప్రకృతి (సహజము) నుండి వేరు పరచు ప్రయత్నములన్నీ అజ్ఞానములోనివే. జిడ్డు
కృష్ణమూర్తిగారు మనము చేయు అన్ని చర్యలను రియాక్షన్ గా అభివర్ణించడము మననము చేసుకొన
వలెను.
భగవద్గీతలోని ఈ శ్లోకము కూడా అదియే సూచించుచున్నది. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః / యః పశ్యతి తథాత్మానమ్ అకర్తారం స పశ్యతి ।। 13-30 ।। {సర్వకర్మలు ప్రకృతి మూలముగా జరుగుతున్నాయని
తనలోతాను ప్రత్యక్షముగా గ్రహించి,
వూరకయున్నవాడు నిజముగా చూచుచున్నవాడని (ద్రష్ట అని) తెలియుము.}
ముఖ్య
పదములకు అర్ధములు: కలవు తొమ్మిది కనుమల = నవ రంధ్రముల; తంత్రము నిలుపఁగలిగినట్టి
= కుట్ర, మోసము బయట పడకుండా వుంచగలుగు;
నెరవాదులు = సమర్థులు, నేర్పరులు; తెలిసి
= తెలుసుకొని; కోనేటి తిమ్మినాయఁడు = కోనేటి వేంకటెశ్వరుడు; చొచ్చె = హృదయములోకి చొచ్చుకువచ్చిన; బలిసె = బలపడినది; యీ కోట
= జీవుడు; భయమేల = భయము తగ్గినది, లేదు.
భావము: ఆ కోటకు
తొమ్మిది కనుమ మార్గములున్నాయి. వాటిని కప్పుతూ అనేక తీగెలున్నాయి. అవే నవరంధ్రాలూ, ధమనులు, సిరలు
అని పిలువబడే నరాలు). వాళ్లు గొప్ప సమర్థులు. నేను అది గ్రహించినప్పుడు కోనేటి వేంకటెశ్వరుడు
హృదయములోకి చొచ్చుకు వచ్చినాడు. ఇప్పుడు నాకు భయము లేదు.
వివరణము: ముందటి చరణములలోని తర్కమునే పొడిగించుచూ నవ రంధ్రములు ఆ కోటను
బలపరచుచున్నవనిరి. ఈ రకముగా ప్రకృతి మానవుని
కన్నులు కప్పుతూ తన వ్యవహారము తాను చేసుకుంటూ పోతుంది. ఆచార్యులు ఇక్కడ 'తెలిసి'తో తనలో జరుగుతున్న ఈ తంత్రము ప్రత్యక్షముగా తెలుసుకోని, ఉపేక్షా భావముతో వూరకయున్న వాని హృదయమును కోనేటి తిమ్మినాయఁడు ప్రవేశించునని తెలిపిరి.
జాగ్రత్తగా పరిశీలించిన
మానవుడు తల్లి గర్భములో వున్నప్పుడే ఆ భద్రత అను యావను బిడ్దమనసులో ప్రకృతి నిలుపునని
మొదటి చరణములోనూ, ఒంటరితనము ఆ భద్రతావలయమును
చేజిక్కించుకొనుటకు సహకరించునని రెండవ చరణములోనూ, ఇక్కడ నవ రంధ్రములు అట్టి చర్యలకు చేయూతనిచ్చుననీ తెలియవచ్చు. చివరిగా
కోట అను దాని యందు మానవుడు తన
ఆత్మ రక్షణ కొరకై నిర్మించు 'నేను' అను దుర్భేద్యమైన వలయమునూ సమ్మిళితము చేసిరని
నా అభిప్రాయము.
-x-x-x-