అన్నమాచార్యులు
204.
పంటలభాగ్యులు వీరా బహువ్యవసాయులు
చేయదగు వ్యవసాయమే హరిభక్తి.
కీర్తన సంగ్రహ భావము:
పల్లవి: ఈ కీర్తనలో
అన్నమాచార్యులవారు బహువిధములైన కార్యములు చేపట్టు మన వంటి
వారిని విమర్శిస్తున్నారు ఘనులైనటువంటి వారు తామరాకు మీద నీటి బొట్టులాగా కార్యములందు
అంటీ అంటనట్లుగా ఉందురు.
చరణము 1: రైతులు మొదటగా చిట్టడివితో నిండిన నేలను నరికివేసి, చదునుచేసి, ఆపై పొలము దున్ని
క్రింది మట్టిని పైకి తెచ్చి పొలమును వ్యవసాయము చేయుటకు సిద్ధము చేసికొన్నట్లు,
సాధకులు చిత్తము లేదా మనసు అను
క్షేత్రమును కర్షకుని వలె మూలమూలలా కదిలించి, శుద్ధి చేసి
తపస్సు అను సేద్యము చేయుటకు ఏర్పాట్లు చేసుకోవలెను. రైతులు మంచి వాన పడిన అదను చూసి
విత్తునట్లు, వివేకులు
అదను చూసి హరిభక్తిని నాటి శాంతము అను మహా సాగరములో తమను తాము మరచునట్లు అంకితమై వ్యవసాయము
చేయుదురు.
చరణము 2: వ్యవసాయదారులు తమ పొలంలో పైరుతోపాటు మొలకెత్తే కలుపు గడ్డిని తవ్వి తీసివేస్తారు. పంటని నాశనంచేసే పశువులనుంచి రక్షణగా అనేకసార్లు తమ చేనుచుట్టూ ముండ్లచెట్లు పెడతారు. చేను బాగా పెరగటానికి ఎరువులు వేస్తారు. ఈ రకంగా వ్యవసాయదారులు పంటలను రక్షించుకొంటారు. ఇదే రకముగా ప్రయత్న శీలులు తమ మనస్సను పొలంలోని కామము, క్రోధము అను కలుపును తీసివేస్తారు. లౌకిక వాంఛలనుంచి తమ జ్ఞానానికి రక్షణగా అనేకసార్లు తమ చేనుచుట్టూ వైరాగ్యమను ఆవరణ (వెలుగు) పెడతారు. ఆచారము విధులను మాయలు కపటముల నుండి విముక్తి చెందుటకు భౌతికముగాను, మానసికముగాను పనులను వదలి సన్యాసమను శరణాగతిని ఎరువులుగా వేసి జ్ఞానమను చేనును ఆధ్యాత్మిక వ్యవసాయదారులు రక్షించుకొందురు.
చరణము 3: ఎక్కడ చూసిన శ్రీ వెంకటేశ్వరుడున్నాడు అని గ్రహించిన వివేకులు యజ్ఞము చేయగా మిగిలిన శిష్టాన్నములు మాత్రం అనుభవించి దానితోనే సంతృప్తిని చెందుదురు. తమను తాము ఆ సన్నని ఇరుకు మార్గములో ఇడుకొని వుందురు దైవకృప కలిగిన ఆ పుణ్యాత్ములు.
ఉపోద్ఘాతం: అన్నమాచార్యుల వారు మనిషి జీవనమును వ్యవసాయంతో పోల్చి ఏ రకంగా అయితే కృషీవలుడు తన పంటను కాపాడుకుంటాడో అదే రకముగా హరిభక్తి సాధకులు చిత్తమను క్షేత్రములో పాపమును కలుపు మొక్కలు, బంధములు అను పాతుకుపోయిన వ్రేళ్ళను పెలికివేసి అజ్ఞానమను మట్టిని పైకి క్రిందికి కలిపి మనసు అను క్షేత్రమును సిద్ధం చేయుదురు అన్నారు. సత్యసాధనకు వివేకులు అవలంభించు మార్గమును అతి నేర్పుగా వివరించారు.
అధ్యాత్మ కీర్తన:
అన్నమాచార్యులు
రాగిరేకు 262-5 సంపుటము: 3-359
|
పంటలభాగ్యులు వీరా బహువ్యవసాయులు
అంటిముట్టి యిట్లఁ గాపాడుదురు
ఘనులు ॥పల్లవి॥ పొత్తుల పాపమనేటి పోడు
నఱకివేసి
చిత్తమనియెడు చేను చేనుగా
దున్ని
మత్తిలి శాంతమనే మంచివాన
వదనున
విత్తుదురు హరిభక్తి
వివేకులు ॥పంట॥ కామక్రోధాదులనే కలువు
దవ్వివేసి
వేమరు వైరాగ్యమనే వెలుఁగు
వెట్టి
దోమటి నాచారవిధుల యెరువులువేసి
వోముచున్నారు జ్ఞానపుఁ
బై రుద్యోగజనులు ॥పంట॥ యెందు చూచిన శ్రీవేంకటేశుఁ
డున్నాఁడనియెడి-
అందిన చేని పంట లనుభవించి
సందడించి తమవంటి శరణాగతులుఁ
దాము
గొంది నిముడుకొందురు గురుకృప జనులు ॥పంట॥
|
Details and
explanations:
ముఖ్యపదములకు అర్ధములు: పంటలభాగ్యులు = కర్మఫలములను కోరువారు; వీరా = వీరు కాదు; బహువ్యవసాయులు = అనేకానేక బహువిధములైన కార్యములు చేపట్టువారు.
భావము: ఈ కీర్తనలో అన్నమాచార్యులవారు బహువిధములైన కార్యములు చేపట్టు మన వంటి వారిని విమర్శిస్తున్నారు ఘనులైనటువంటి వారు తామరాకు మీద నీటి బొట్టులాగా కార్యములందు అంటీ అంటనట్లుగా ఉందురు.
వివరణము: ఇది చూస్తే భగవద్గీతలోని క్రింది రెండు వాక్యములపై లోతుగా అన్నమాచార్యులు ఆలోచించమంటున్నారు. వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురునందన!। బహుశాఖా హ్యనంతా బుద్ధయో೭వ్యవసాయినామ్ (2-41) భావము: ఓ అర్జునా! నిశ్చయించి అందిపుచ్చుకొనుటకు మనస్సుకు ఒకే ఒక మార్గము కలదు. చంచలమైన మనస్సు మాత్రమే అసంఖ్యాకమైన ఎంపికలను అంచనా వేస్తూ తడబడిపోతుంది.
ఒక్క క్షణం కింద ఇచ్చిన బ్రూస్ లీగారి మాటలు పరీక్షించండి
పరికించండి. 10,000 క్లిక్కులు
నేర్చుకున్నవాడికి నేను భయపడను కానీ ఒకే క్లిక్కు పదివేల సార్లు సాధన చేసిన వాడికి
జంకుతాను. దైవము విషయంలో కూడా ఇదే నిజము.
ముఖ్యపదములకు అర్ధములు: పొత్తుల = ఉమ్మడిగా; పోడు= తుప్పలు మున్నగునవి పెరిఁగియున్న యడవినేల, పొదలు నిండిన చిట్టడవి; మత్తిలి = మత్తుగొను ( అనగా చేయుచున్న దానిలో మత్తుగొన్నట్లు అంకితమైపోవు); మంచివాన = పుణ్యము; వదనున = నేలయందు తడి చొచ్చునంతటి వర్షము పడినపుడు, అదను చూచి;
భావము: రైతులు మొదటగా చిట్టడివితో నిండిన నేలను నరికివేసి, చదునుచేసి, ఆపై పొలము దున్ని క్రింది మట్టిని పైకి తెచ్చి పొలమును వ్యవసాయము చేయుటకు సిద్ధము చేసికొన్నట్లు, సాధకులు చిత్తము లేదా మనసు అను క్షేత్రమును కర్షకుని వలె మూలమూలలా కదిలించి, శుద్ధి చేసి తపస్సు అను సేద్యము చేయుటకు ఏర్పాట్లు చేసుకోవలెను. రైతులు మంచి వాన పడిన అదను చూసి విత్తునట్లు, వివేకులు అదను చూసి హరిభక్తిని నాటి శాంతము అను మహా సాగరములో తమను తాము మరచునట్లు అంకితమై వ్యవసాయము చేయుదురు.
వివరణము: ఇక్కడ అన్నమాచార్యులవారు రైతులకు సాధకులకు కృషి ఒక్కటే అన్నారు. రైతులు నిజమగు పోలములోను దుక్కి దున్ని వ్యవసాయం చేయదురు. హరిభక్తి సాధకులు చిత్తమను క్షేత్రములో పాపమును కలుపు మొక్కలు, బంధములు అను పాతుకుపోయిన వ్రేళ్ళను పెలికివేసి అజ్ఞానమను మట్టిని పైకి క్రిందికి కలిపి మనసు అను క్షేత్రమును సిద్ధం చేయుదురు. పైన పేర్కొన్న వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురునందన అన్న దానికి వివరణాత్మకముగా ఈ కీర్తనను వ్రాసారు అనిపిస్తుంది.
‘శాంతమనే మంచివాన వదనున విత్తుదురు హరిభక్తి వివేకులు’ = ఇక్కడ శాంతము అనగా ఆలోచనలు అను తరంగములు అను కుదుపులు లేని స్థితి హరిభక్తి అనే మంచి విత్తనాలు నాటుటకు అనుకూలమైన సమయం. మనం ప్రస్తుతము వున్న స్థితిలో క్షణక్షణం ఆలోచనలు అను కెరటములు మన మనసులను నిలకడ లేకుండా చేయుచున్నవి ఆచార్యుల వుద్దేశం.
మత్తిలి = మత్తుగొను అనగా చేయుచున్న దానిలో మత్తుగొన్నట్లు అంకితమైపోవు అన్నది ఆచార్యులవారు మానవుడు తానున్న ఇప్పటి స్థితిలో హరిభక్తిని చేకొనలేడు అన్న ఉద్దేశ్యంతో చెప్పారు. అనగా తాను చేయుచున్న సత్ప్రవర్తన అను యాగములో పూర్తిగా నిమగ్నుడై ఈ భౌతిక లోకంతో సంబంధం తెంచుకుని మనసను క్షేత్రంలో హరిభక్తిని నాటగలడు. ఇక్కడ “ఎమ్మెలఁ బుణ్యాలు సేసి యిల నేలవచ్చుఁ గాక / కమ్మి హరి దాసుఁడు గావచ్చునా” అన్న మాటలు గుర్తు తెచ్చుకొనుట సందర్భోచితముగా ఉండును.
ముఖ్యపదములకు అర్ధములు
: వేమరు = పలుమాఱు; వెలుగు= పశువులు లోనగునవి రాకుండా చేను
చుట్టూ ముండ్లచెట్లు పెట్టి పెంచు ఆవరణము; దోమటి = అన్నము,
ఆహారము, కపటము, మాయ;
ఓము = కాపాడు, పోషించు; బైరుద్యోగజనులు
= (భౌతికముగా/మానసికముగా) పనిలేనివారు =శరణాగతి చేయువారు.
భావము: వ్యవసాయదారులు తమ పొలంలో పైరుతోపాటు మొలకెత్తే కలుపు గడ్డిని తవ్వి తీసివేస్తారు. పంటని నాశనంచేసే పశువులనుంచి రక్షణగా అనేకసార్లు తమ చేనుచుట్టూ ముండ్లచెట్లు పెడతారు. చేను బాగా పెరగటానికి ఎరువులు వేస్తారు. ఈ రకంగా వ్యవసాయదారులు పంటలను రక్షించుకొంటారు. ఇదే రకముగా ప్రయత్న శీలులు తమ మనస్సను పొలంలోని కామము, క్రోధము అను కలుపును తీసివేస్తారు. లౌకిక వాంఛలనుంచి తమ జ్ఞానానికి రక్షణగా అనేకసార్లు తమ చేనుచుట్టూ వైరాగ్యమను ఆవరణ (వెలుగు) పెడతారు. ఆచారము విధులను మాయలు కపటముల నుండి విముక్తి చెందుటకు భౌతికముగాను, మానసికముగాను పనులను వదలి సన్యాసమను శరణాగతిని ఎరువులుగా వేసి జ్ఞానమను చేనును ఆధ్యాత్మిక వ్యవసాయదారులు రక్షించుకొందురు.
ముఖ్యపదములకు అర్ధములు: అందిన చేని
పంటలు= తాము కోరకుండా అందినవి, తమకు ప్రకృతి
అందించిన పంటలు = యజ్ఞము చేయగా మిగిలిన శిష్టాన్నములు (యజ్ఞశిష్టాశినః
సంతో, భగవద్గీత 3-13); అనుభవించి =
తీసుకొని; సందడించి
= అతిశయించి (= దానికే ఎక్కువ సంతోషించి); గొంది = మూల, చిన్న సందు, సన్నటి ఇరుకైన
వీధి; గొంది నిముడుకొందురు
= ఆ సన్నని (ఇరుకు) మార్గములో ప్రవేశించుదురు.
భావము ఎక్కడ చూసిన శ్రీ వెంకటేశ్వరుడున్నాడు అని గ్రహించిన వివేకులు యజ్ఞము చేయగా మిగిలిన శిష్టాన్నములు మాత్రం అనుభవించి దానితోనే సంతృప్తిని చెందుదురు. తమను తాము ఆ సన్నని ఇరుకు మార్గములో ఇడుకొని వుందురు దైవకృప కలిగిన ఆ పుణ్యాత్ములు.
వివరణము: ధర్మము అతి సూక్ష్మమైనది. అతి సున్నితమైనది. ఇది అని చెప్పుటకు అలవికానిది. ధర్మమును వెంబడించు వారు ఆ ధర్మము ఏ ఏ సన్నని ఇరుకు మార్గముల ద్వారా ఏ విషయములలో ప్రవేశించునో సామాన్యులమైన మనకు అవగాహన ఉండదు. ధర్మమునే సత్యమునే నమ్ముకుని జీవించువారు దానిలోనే తదేకముగా ఐక్యమై వేరు దాని ప్రస్తావన లేక వుందురు.
దీనిని రీనె మాగ్రిట్ గారు (Rene Magritte) వేసిన 1926 నాటి పెయింటింగు
La Chambre du Devin (the Seer's chamber, జ్ఞానులుండు గది) అను పేరు గల సంబోధనాత్మక
చిత్రం ద్వారా విశద పరచుకుందాము. ఈచిత్రంలో ఒక తెల్లని తెర లేదా పలుచని ఒక గోడ కనబడుతుంది. దాని వెనుక చీకటితో కూడిన నేపథ్యము మనకు తెలియని
దానిని (పరము) సూచిస్తున్నది.
రెండు చెక్క మేనిక్విన్లు ఒకదానితో ఒకటి కలుపబడి ఉన్నాయి. ఆ మేనిక్విన్లు ఆ గోడ లోంచి బయటకు దూసుకు వచ్చినట్లు చిత్రం చూపుతుంది. ఆ తెల్లనితెర లేదా గోడ ఈ మేనిక్విన్ ఆకారానికి అనుగుణముగా కాకుండా వేరే విధంగా విరిగిపోయి వుంది. ఆ మేనిక్విన్లు తెల్లని తెరను ఛేదించుకుంటూ సూటిగా బయటికి రావడానికి అనేక అడ్డంకులు కనపడుతుంటాయి. ఈ అడ్డంకులన్నీ మానవ నిర్మితములు అని స్పష్టంగా కనబడుతూ ఉంటుంది.
ఒకదానితో ఒకటి కలిసి ఉన్న మేనిక్విన్లు మనిషి చేయి పనులకు ఉదాహరణలు. ఏదైనా కార్యము చేయుటకు ముందు ఒక అవగాహనతో ఒక ప్లాన్ వేసుకుంటాము. తదుపరి అది చేయబోతాము. ఈ మేనిక్విన్లలో ఒకటి ఆలోచనకు ఇంకొకటి దాన్ని అనుసరించు యత్నమునకు సంకేతములు. పైన చూపిన బొమ్మలో మాదిరి మనం ఎంత ప్రయత్నించినప్పటికీ కావలసిన దానికంటే ఎక్కువ మొత్తం గోడను పగులగొట్టుకుంటూ బయటపడతాము.
ఆ తెరను లేదా గోడను చేధించడం అంటే సత్యమునకు భంగము కలిగించుట (లేదా పాటించకుండుట) అని అర్థం. కాబట్టి మనం ముందు ప్రణాళిక ఆ తర్వాత కార్యాచరణ అని సిద్ధమై చేయు పనులన్నీ ధర్మవిరుద్ధములు అని ఈ చిత్రం ద్వారా తెలుసుకోవచ్చును. ఆ తెరను ఏమాత్రము వికారమొందించకుండా దాటుటకు అతి సూక్ష్మాతి సూక్ష్మ రూపము అవసరము. అది మనమున్న స్థితిలో సాధ్యము కాదు.
సత్యము వికారము కాకుండా, ధర్మమును భగ్నం చేయకుండా నడుచుకొనుటకు గల ఒకే ఒక ఉపాయము ఆ ఆలోచనలు అను తెరువులు ప్రణాళికలు లేకుండా కేవలం కార్యాచరణము చేయుట మాత్రమే. ఆ స్థితిలో కార్యాచరణ, ధర్మము సత్యము ఎటువంటి అవరోధం లేకుండా అన్నీ సమ్మిళితమైపోవును. ఆ స్థితిని చేరుటకు “శరణాగతులుఁ దాము / గొంది నిముడుకొందురు గురుకృప జనులు” అన్నారు అన్నమాచార్యులు. అనగా వారు “తాము అను దానిని పూర్తిగా భగ్నము చేసి దానికి అస్తిత్వము” లేకుండా చేయుదురని భావము.
బైబిల్ లో పేర్కొన్న క్రింది వాక్యము, అన్నమయ్య చెప్పినది ఒకటే అవ్వడం కాకతాళీయము కాదు.
(బైబిలు, మత్తయి సువార్త 7: 13) 13ఇరుకు
ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును,
ఆ దారి విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు
అనేకులు. 14జీవమునకు
పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని
కనుగొనువారు కొందరే.
-X-X-The
End-X-X-