అన్నమాచార్యులు
218.
పుట్టెడి దింతా బూటకంబులే
మనదీ ఒక బతుకేనా సందులలో
పందులవలె -శ్రీశ్రీ
ఉపోద్ఘాతము:
"ఇలాంటి మెట్టవేదాంతపు కీర్తనలను చదివి మీ సమయాన్ని వృథా చేసుకోకండి". నలభయ్యవ దశకంలో జిడ్డు కృష్ణమూర్తి గారికి ఇలాంటి సందర్భమే ఎదురైంది. అప్పుడు కృష్ణమూర్తి గారు సభకి వచ్చిన వారితో బయట జరుగుతున్న ప్రపంచ యుద్ధం కంటే మీలో జరుగుతున్న అంతర్యుద్ధం ఎక్కువ ముఖ్యం అన్నారు. కొంత కాలం పాటు వారి సభలకు ప్రజలు రావడం మానేశారు. నిజం నిలకడ మీద తెలుస్తుంది.
నిలకడలేని మనకు నిజం ఎలా తెలుస్తుంది చెప్పండి? కొంతైనా నిజం లేకుండా తాడు పేడు లేని "పుట్టెడి దింతా బూటకంబులే" వంటి మాటలకు వ్యాఖ్యానం చేయగలమా? కాబట్టి నిదానంగా సమయాన్ని వెచ్చిస్తూ ఈ కామెంటరీ చదువుతారని అశిస్తా!
కీర్తన సంగ్రహ భావము:
పల్లవి:
ఈ
జీవుల పుట్టుకలన్నీ బూటకమే. జనులారా! శ్రీహరి కల్పించిన బలమైన మాయా శక్తి వలన ఈ నాటకాన్ని తెలియలేకున్నాము.
అంతరార్థము: ఈ జీవితం తాత్కాలికం. పుట్టుక, మరణం, శరీరం — ఇవన్నీ ఒక నాటకంలోని పాత్రలు మాత్రమే.
ఈ మాయా ప్రపంచం మనస్సును మరిపించి దారి చూపలేని స్థితిలో బంధించి ఉంచుతుంది. అలా చిక్కుకుపోయిన
మనిషి ఈ అసత్యపు బంధనాలనుండి బయటపడాలంటే, శ్రీహరిని ఆశ్రయించడమే
మార్గం. ఆయన చూపే దిశలోనే సత్యం, స్వేచ్ఛ, ముక్తి ఉన్నాయి.
మొదటి చరణం: మన ప్రాణం ఊపిరిపై
ఆధారపడి ఉన్నది. ఎంత సంకటమైన ఆధారమిది! అటువంటి ప్రాణంతో నిలిచియున్న శరీరాన్ని ఎలా
నమ్మగలం? మన జీవితము ఇలాంటి సంకేతములతోనే ఏర్పడింది. ఈ ప్రపంచంలో
మనం చూస్తున్న దానినే మనస్సు గ్రహిస్తుంది. అవే లోతుగా వ్యాపిస్తాయి. మన మనస్సు ఇలాంటి అనేకానేక సూచనలతో, అనుభవాలతో
భ్రమించి నిలకడ తప్పుతోంది.
రెండవ చరణం: నాలుక అనేక రుచులను కోరుకుంటుంది. మనసు ఆ రుచులను గుర్తుంచుకున్న అంతవరకు సమయమూ సందర్భమూ లేకుండా అవి తిరిగి రావాలని కోరుకుంటాము. ఈ తోలు తిత్తిని పోషించుటలోనే జీవితమంతా గడిపేస్తాం. మానవులారా మీకు ఇవ్వబడిన ఈ సమయాన్ని ఎలా వృథా పరుచుచున్నారో తెలియుడీ.
మూడవ చరణం: ఐతే జ్ఞానమంతా నాలోనే నిగూఢమై ఉంది. కానీ పరస్పర దూషణలు అరోపణలు, నిందలు హింసలతో నడిచే ఈ జీవిత నాటకంలో ఆ జ్ఞానాన్ని కనుగొనగలనా? (లేను). కానీ, ఆ శ్రీతరుణీపతిని, శ్రీ వేంకటపతిని మనసారా ధ్యానించినపుడు - ఆ అడ్డంకులన్నీ చిత్తయి తొలగిపోతాయి.
అధ్యాత్మ కీర్తన |
రేకు: 323-2 సంపుటము: 4-131 |
పుట్టెడి
దింతా బూటకంబులే
గట్టిమాయ
హరిఁ గానఁగ నీదు ॥పల్లవి॥ ముక్కున
నున్నది ముందటఁ బ్రాణము
యెక్కడ
నమ్మేదిఁకఁ దనువు
చుక్కలు
మోఁచీఁ జూపులెదుటనే
నెక్కొను
మతికిని నిలుకడ యేది ॥పుట్టెడి॥ నాలుక
నున్నవి నానారుచులును
వేళావేళకు
వెరవేది
తోలున
నున్నది దొరకొని బ్రతుకిది
కాలంబెటువలెఁ
గడపేది ॥పుట్టెడి॥ ఆతుమనున్నది
యఖిలజ్ఞానము
ఘూతల
నెటువలెఁ గనియేది
శ్రీతరుణీపతి
శ్రీవేంకటపతి
యాతనిఁగొలిచితి
మడ్డంబేది ॥పుట్టెడి॥
|
Details
and explanation:
భావము: ఈ జీవుల పుట్టుకలన్నీ బూటకమే.
జనులారా శ్రీహరి కల్పించిన బలమైన మాయా శక్తి వలన ఈ నాటకాన్ని తెలియలేకున్నాము.
అంతరార్థము: ఈ జీవితం తాత్కాలికం.
పుట్టుక, మరణం, శరీరం — ఇవన్నీ ఒక నాటకంలోని
పాత్రలు మాత్రమే. ఈ మాయా ప్రపంచం మనస్సును మరిపించి దారి చూపలేని స్థితిలో బంధించి
ఉంచుతుంది. అలా చిక్కుకుపోయిన మనిషి ఈ అసత్యపు బంధనాలనుండి బయటపడాలంటే, శ్రీహరిని ఆశ్రయించడమే మార్గం. ఆయన చూపే దిశలోనే సత్యం, స్వేచ్ఛ, ముక్తి ఉన్నాయి.
వివరణ:
మొదటి భాగము:
తాత్త్విక పునాదులు (Philosophical foundations):
భగవద్గీతలోని ఈ శ్లోకము చూడండి. “న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః । న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరమ్” ॥ 2-11 ॥ భావము: నీవుగాని, నేనుకాని, ఈ రాజులు కానీ లేని కాలమే లేదు. ఇక ముందూ కూడా ఉందుము. ఈ శ్లోకము నుంచి శాశ్వతమైనది అలాగే ఉంటూనే పైపై పూతల వంటి శరీరాలు రాలిపోతూంటాయి అని భావించవచ్చును. ఏదైతే దారములా అనేకానేక జీవితములను దండ వలె నిలిపి యుంచుచున్నదో అదియే సత్యము.
ఈ పల్లవిలో
అన్నమాచార్యులు ఓ తీవ్రమైన వాస్తవాన్ని మనముందుంచుతున్నారు —మరణము మృత్యువు కాదు. అది విరామము
మాత్రమే. అసత్యాన్ని సత్యంగా భావించడమే అసలైన మృత్యువు. అది అజ్ఞానమును
కొనసాగించును. ఎట్టిపరిస్థితులలోను అది జ్ఞానమునకు దారి తెరవదు. దీనిని ఇంకొంచెం విశద
పరచుకునేందుకు హిల్మా క్లింట్ గారి ఎనిమిదవ హంస బొమ్మను పరిశీలనాత్మకముగా చూచెదము.
రెండవ భాగము:
Hilma af Klint యొక్క Swan No. 8 — ఒకే జీవన రూపానికి చెందిన రెండు దశలు: ఒకటి ప్రత్యక్షం, మరొకటి దాని ప్రతిబింబం.
ఆ స్పటికాలలో ఒకటి ఇప్పటి జీవితాన్ని, దాని ప్రతిబింబం మరణము తర్వాత జీవితాన్ని సూచిస్తున్నాయి. స్పటికముల రంగు దాని నేపథ్యం విరుద్ధముగా వుండి ఏది జీవితమో ఏది మరణమో తెలియలేము. ( దీన్ని శ్లో॥ యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ । యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః ॥(2-69)॥ "ప్రపంచం పగలు అని భావించునది పండితునికి అజ్ఞానపు అంధకారం; ప్రాణులు రాత్రి అని భావించునది జ్ఞానుల కోసం జ్ఞానదీప్తితో నిండిన వెలుగు."తో పోల్చవచ్చును. ఈ రకముగా జీవితము మరణములను ఇదమిత్థంగా మానవుడు నిర్ణయింపలేడు.
ఈ క్రిస్టల్స్‌లో ఒకటి మన సామాన్య మానవుడిని సూచిస్తుంది. అతని అంతరంగ సత్యం — అంటే అతడి లోపలి నిజమైన భావన — అతని పరిసర ప్రపంచానికి వ్యతిరేకంగా ఉంటుంది. అలాగే, ఈ స్పటికముల సముదాయం విశ్వాన్ని సూచిస్తే, అది కూడా తన ప్రతిబింబంతో వ్యతిరేక సంబంధంలో ఉంటుంది. ఈ విరుద్ధతను మానవుడు తనకై తానే తొలగించలేడు.
ఈ విరుద్ధతను అంగీకరించడం, దానితో విలీనం కావడం తప్ప దాని గురించి బాధపడడం పరిష్కారం కాదు — అనేదే అసలు పాఠం. మనం ప్రస్తుతం సత్యాన్ని షరతులతో అంగీకరిస్తాము. అది మనకు అనుగుణంగా ఉంటే గానీ దాన్ని ఒప్పుకోం. అయితే అసలైన మార్గం, సత్యాన్ని నిఖార్సైన స్వరూపంలో, నిబద్ధతలులేని అంగీకారంతో స్వీకరించడం మనకు కష్టామే. అదే మనిషికి దేవుడు పెట్టిన పరీక్ష.
కిరణముల వంటి గీతలు మధ్యలో
వున్న పెద్ద స్పటికము గుండా పోవుచూ సమస్త స్పటికములను సూచించు తలములో ఉన్నట్లు కనబడుతవి.
మానవుడు తన స్పటిక ఆకృతిని (crystalised ideas) వదలి ఆ స్పటిక సమూహాల ప్లేన్లో (తలములో) ప్రవేశించ గలిగితే, ఆ రెండు సమూహాల తలములు ఒక దానితో మరొకటి అనుసంధానిచ బడినట్లు తెలియును.
అనగా మానవుడు తన జన్మ రహస్యమును తెలియుట. అట్టి వారికి జీవితము మరణము రెండును ఒకేలా
కాన్పట్టును. అందుచేతనే జిడ్డు కృష్ణమూర్తిగారు అనేక పర్యాయములు మరణము గురించి ప్రస్తావించిరి.
మూడవ భాగం:
ఈ పల్లవి అనేక స్థాయిలలో
మనల్ని పరీక్షించేట్టు ఉంటుంది. ఇది సాధారణ భక్తికీర్తన కాదు. ఇది మానవుడి జీవనముపై
లోతైన ప్రశ్న.ఈ ప్రశ్నకు సమాధానం అనుభవంలోనే దొరుకుతుంది. దానివల్ల మనిషి
జీవితం సత్యంతో విలీనమవుతుంది.
మానవుడు
అందుబాటులో వున్నఈ భౌతిక ప్రాపంచిక చలనాలను నిజమైన జీవితంగా భ్రమించి, తన చుట్టూ
ఉన్నవాని నిజ స్వరూపాన్ని అర్థం చేసుకోలేకపోతాడు. Hilma af Klint స్వాన్ నెం.8 చూపినట్టే, మన జీవితము
అందలి అనుభవములు తాత్కాలిక డేటా వంటివి. అది ఒక పరిమిత అధ్యాయము. ఒక్క మరణముతో ఇవి
తుడిచిపెట్టుకుపోతాయి. అందుకే “కన్ను దెరచుటొకటి కనుమూయుటొకటే: అన్నారు అన్నమాచార్యులు.
మొదటి
చరణం:
నెక్కొను = వ్యాపించు, అతిశయించు.
భావము: మన ప్రాణం ఊపిరిపై ఆధారపడి ఉన్నది. ఎంత సంకటమైన ఆధారమిది! అటువంటి ప్రాణంతో నిలిచియున్న శరీరాన్ని ఎలా నమ్మగలం? మన జీవితము ఇలాంటి సంకేతములతోనే ఏర్పడింది. ఈ ప్రపంచంలో మనం చూస్తున్న దానినే మనస్సు గ్రహిస్తుంది. అవే లోతుగా వ్యాపిస్తాయి. మన మనస్సు ఇలాంటి అనేకానేక సూచనలతో, అనుభవాలతో భ్రమించి నిలకడ తప్పుతోంది.
వివరణ:
ఈ చరణం మనకు జీవిత స్థిరత్వం మీద కొత్త దృష్టికోణం ఇస్తుంది.
ముక్కున
నున్నది ముందటఁ బ్రాణము: కనులకు కనబడని ఊపిరిపై మన ప్రాణం ఆధారపడి ఉంది. ఒక్క నిమిషం ఆ ఊపిరి
నిలిచిపోతే జీవితం అర్థం కోల్పోతుంది. ఇంత అనిశ్చితమైన ఆధారముతో ‘నేను’ అనే భావన నిలబడడం
ఆశ్చర్యమే.”
యెక్కడ నమ్మేదిఁకఁ దనువు:
ఈ శరీరాన్నిపెంచి పోషిస్తాం.
జాగ్రత్తగా కాపాడుకుంటాం. అలసిపోకుండా చూసుకుంటాం. గౌరవం సంపాదించుకునేందుకు మంచి దుస్తులు ధరిస్తాం. ఐతే, ఈ ప్రాణం గాలిలో మాయమై పోతే, ఈ శరీరమూ రాలిపోతుంది. జీవితం శూన్యమవుతుంది. అలాంటి దాన్ని ఎలా నమ్మగలము? ఇది అవగాహనను పెంపొందిస్తున్న తాత్త్విక దృష్టి
చుక్కలు మోఁచీఁ జూపులెదుటనే
ఇక్కడ “చుక్కలు” అన్న పదం చాలా రమ్యంగా ఉంది. అనేక సంకేతాలు, ఆకృతులు, చూపులకు, వైవిధ్యాలకు అది ఊతమిస్తుంది. కనిపించే ప్రతి వస్తువూ — ఒక సంకేతం మాత్రమే అనగా మనస్సులో వున్న సంకేతంతో సరిపోల్చుకున్నప్పుడే రూపు దిద్దుకుంటుంది. ఇంద్రియ గ్రహణతో చూపుల ముందు అనేకా అర్ధాలు నాటకీయంగా ప్రత్యక్షమవుతాయి, కానీ వాటి వెనుక వాస్తవం మనకు గోచరము కాదు. ఇక్కడ "చుక్కలు" నాటకం లాంటి అపరిమిత వ్యాప్తిని సృష్టిస్తాయి. మనం వాటిలో అర్ధం కోసం చూస్తాం కానీ, అవి ఎండమావులని గ్రహించం. అంటే “చుక్కలు” అనేది ఇక్కడ స్వీయ-భావాలకు, ఎదుటి సత్యానికి మధ్య పొరాట స్థలంగా నిలుస్తోంది.
నెక్కొను మతికిని నిలుకడ యేది
ఇది ఆఖరి గుణపాఠం. మనస్సు అనేక సూచనల వర్షంలో తడుస్తూ, ఏ ఒక్క స్థిరతను పొందలేదు. చూచిన ప్రతీ దృశ్యం మనస్సులోకి ఎక్కిపోతుంది. తనదైన మత్తును కలిగిస్తుంది. ఆ మత్తులో మనస్సు నిలకడ కోల్పోతుంది. ఈ వ్యాప్తి ఓ స్వేచ్ఛ కాదు — అది వ్యభిచారము.
వీటిని చూస్తే మనసు
అంటే మన శరీరంలోని ప్రతి భాగాన్ని, ప్రతి నాడిని, ప్రతి
రక్తబిందువును, ప్రతి రోమమును కలుపుతున్న వ్యక్తపరచలేని భావన
అని తెలుస్తోంది.
సారాంశం:
ఈ చరణం ద్వారా
అన్నమాచార్యులు మనం అనుభూతి మీద ఆధారపడుతున్న
ప్రపంచాన్ని ప్రశ్నిస్తున్నారు. మన శరీరం కానివ్వండి. చుట్టూతా ఉన్న సంకేతాలైనా కానివ్వండి.
ఎంత ప్రయత్నించినా అవి మనలను మరిపించి సత్యాన్నుంచి దూరం చేయగలవు అన్న హెచ్చరిక. ఈ
అనిశ్చితి మధ్య, మనస్సు నిలకడ కోల్పోతుంది. దీనినే అనేక
తత్వవేత్తలు “అవిద్యా” అనే పదంతో నిర్వచించారు.
రెండవ చరణం:
భావం: నాలుక అనేక రుచులను కోరుకుంటుంది. మనసు ఆ రుచులను గుర్తుంచుకున్న అంతవరకు సమయమూ సందర్భమూ లేకుండా అవి తిరిగి రావాలని కోరుకుంటాము. ఈ తోలు తిత్తిని పోషించుటలోనే జీవితమంతా గడిపేస్తాం. మానవులారా మీకు ఇవ్వబడిన ఈ సమయాన్ని ఎలా వృథా పరుచుచున్నారో తెలియుడీ.
వివరణ:
నాలుక నున్నవి
నానారుచులును.
మనస్సు నాలుక ద్వారా కనుగొన్న రుచుల అనుభూతిని మళ్లీ మళ్లీ కోరుతుంది. ఇది కేవలం ఆహార విషయమే కాదు -ఇంద్రియాలకు వశమైన ప్రతి అనుభూతికి వర్తిస్తుంది. అదే ఆరాటం. అవి -కొత్తబిచ్చగాడు పొద్దెరగనట్లు - సమయం, సందర్భం చూడకుండా తలెత్తుతుంటాయి అని చెబుతున్నారు. ఇది మనస్సు అస్థిరతపై అన్నమయ్య వేసిన మరో వాత.
తోలున నున్నది దొరకొని బ్రతుకిది
మనదీ ఒక బతుకేనా సందులలో పందులవలె -శ్రీశ్రీ
ఇది బ్రతుకా? ఒక
తోలులో కూర్చున్నదే! అనగా శరీరం అనేది చర్మంతో కప్పబడిన నిస్సార నిర్మాణం. కానీ
అదే శరీరాన్ని దొరికించుకుని మనం బ్రతుకుతున్నాం. అన్నమయ్య తాత్పర్యం ఇదే: మన
జీవితం అంతా ఈ దేహాశ్రయంగా తయారైపోయింది. ఇది పరిమితి; బాహ్య
స్వరూపాన్ని అండగా తీసుకుని మానవుడు బ్రతుకు సాగిస్తున్నాడు.
ఇక్కడ "దొరకొని" అనే పదం వ్యంగ్యంగా ఉంది — ఓ తక్కువ
స్థాయిలో దొరికిన ఆధారాన్ని బ్రతుకు గమ్యంగా తీసుకుంటున్నామన్న చింతన దీని వెనుక
ఉంది. (ఓడవిడిచి వదర వూరకేల పట్టేవు అను పల్లవిని కూడా
గుర్తు తెచ్చుకుందాం. = ఓ మానవుడా స్థిరముగా
నిలుచు ఓడను విడిచి (సులభముగా దొరుకుతోందని) సొరకాయ బుర్రను పట్టుకొని
సముద్రము లాంటి సంసారమును దాట ప్రయత్నించు వెర్రివి)
కాలంబెటువలెఁ గడపేది
ఒక లోతైన అసహనాన్ని, మనం మన జీవితాన్ని ఎలా గడుపుతున్నామన్న ప్రశ్నను ఇది వ్యక్తం చేస్తోంది.
"కాలంబెటువలెఁ గడపేది" అన్నది ఒక్కరూపంలో నిరాశ, ఇంకొక రూపంలో ఆలోచన — “ఇది బ్రతుకా? ఏమి చేస్తున్నాను
నేను? ఈ సమయాన్ని ఎలా వృథా చేస్తున్నాను!” ఈ వాక్యం ఆత్మ పరిశీలనకు
దారి తీస్తుంది. చేతివేళ్ళమధ్య సందుల లోంచి నీరు జారుకున్నట్లు కాలం అనే విలువైన అవకాశం
ఎలా తప్పించుకు పోతుందో. అన్నమయ్య ప్రశ్నించకుండానే మనల్ని ప్రశ్నలలోకి లాక్కెళ్తారు.
సారాంశం:
ఈ చరణం మనం ఎలా అనుభూతులకు బానిసలమై బ్రతుకుతున్నామో చూపిస్తుంది. నాలుకగా మొదలైన ఈ అనుభూతి + ఆసక్తి చక్రము శరీరంలో తిష్ట వేసుకొని, చివరికి జీవితాన్ని గడపడం అనే విషయాన్ని కూడా అర్థరహితంగా మార్చేస్తుంది. మనస్సు సమయాన్ని సృజనాత్మకంగా గడపలేదు. బాహ్య ప్రపంచపు ప్రలోభాల్లో పడిపోతూ, కాలాన్ని గడిపేస్తాం. అన్నమయ్య ఈ చరణం ద్వారా మనమేమిటో అద్దంలో చూపిస్తున్నారు.
మూడవ చరణం:భావం: ఐతే జ్ఞానమంతా నాలోనే నిగూఢమై ఉంది. కానీ పరస్పర దూషణలు అరోపణలు, నిందలు హింసలతో నడిచే ఈ జీవిత నాటకంలో ఆ జ్ఞానాన్ని కనుగొనగలనా? (లేను). కానీ, ఆ శ్రీతరుణీపతిని, శ్రీ వేంకటపతిని మనసారా ధ్యానించినపుడు - ఆ అడ్డంకులన్నీ చిత్తయి తొలగిపోతాయి.
వివరణ:
ఆతుమనున్నది యఖిలజ్ఞానము
ఘూతల నెటువలెఁ గనియేది
అన్నమయ్య ఇక్కడ
మానవునిలో అంతర్లీనంగా ఉన్న జ్ఞానాన్ని గుర్తు చేస్తున్నారు — అది మనసుకు, శరీరానికి,
భావాలకు అతీతంగా మనలో తలదాచుకున్నది. కానీ అదే జ్ఞానం, మన అనుభవ జీవితంలో కనిపించదు. ఎందుకంటే మనం “ఘూతలు” అనే విమర్శల, అపవాదాల, అపార్థాల మేఘాలలో జీవిస్తున్నాం. ఇతరుల
అపహాస్యం, మనల్ని పీడించే అర్థాల గందరగోళం — ఇవన్నీ
జ్ఞానాన్ని నిగూఢంగా మారుస్తాయి. అక్కడే అన్నమయ్య ప్రశ్న: ఈ ప్రకృతిని బలపరిచే మాయలోవుంటూనే నేను
అంతర్లీనంగా వున్న జ్ఞానాన్ని ఎలా కనుగొనగలను? (లేను).
“ఘూతలు”
అనే పదం గాఢంగా ఉంది — అది బాహ్య ప్రపంచపు చీకటి మబ్బులా, మనలోని
జ్ఞానాన్ని అడ్డుకుంటుంది. ఒక అస్తిత్వ సంక్షోభం ఇది — మనల్ని మనముగా కనుగొనలేని
స్థితి. తిరిగి Hilma af Klint యొక్క Swan No. 8ని చూడండి.
శ్రీతరుణీపతి శ్రీవేంకటపతి
యాతనిఁగొలిచితి మడ్డంబేది
ఈ రెండు పేర్లు ఒకే దివ్య సత్యానికి ప్రతీకలు. ఇవి రూపాలైనప్పటికీ, రూపములు సూచించలేని, వానిని దాటి వున్న శక్తికి సూచన. ఇక్కడ అన్నమయ్య రెండు రూపాల నెందుకు ఎంచుకున్నదీ Swan No. 8లో తెలియబరచ పడింది. అదే అన్నమయ్య అంటున్నాడు — నేను ఈ నిరాశమయ, ఈ ఘూతల పంచకం నుంచి బయటపడగలిగాను, ఎందుకంటే నేను అతనిని స్మరించాను. ఆ స్మరణలోనే అసత్యం కరిగిపోయింది. ఆ స్మరణలోనే అంతర్లీనమైన జ్ఞానాన్ని నేను తిరిగి పొందాను.
"అడ్డంబేది" — ఇది
ఒక్క మాటలో ఓ గంభీర మార్పును సూచిస్తుంది. "తెర తొలగిపోవడమే" అన్న అర్థమే
కాదు ఇది. అది ఆలోచనల మబ్బులో నుంచి వెలుగులోకి రావడం. సత్యముతో మేలుకోడం.
ఈ
చరణం అన్నమయ్య కవిత్వపు ముగింపు ఘట్టం కాదు — అది నిజానికి ఒక ఆంతరంగిక ప్రయాణానికి
ఆరంభం. నాలుక,
శరీరం, మనస్సు — ఈ మూడు దశల్ని దాటి, చివరకు జ్ఞానమయమైన ఆత్మతత్వానికి వస్తాడు. కానీ దానిని గ్రహించడానికి మనం చేయాల్సింది
ఒక్కటే: “ఘూతాల” ప్రపంచం నుండి మన మనసును వెనక్కి మరల్చాలి. శ్రీవేంకటపతి అనే
రూపములో సత్యాన్ని చూడగలిగినప్పుడు, everything false melts. అన్నమయ్య నిశ్శబ్దంగా చెబుతున్నాడు: జ్ఞానం మనలోనే ఉంది. దాన్ని వెలికి
తీసేది మన ఆంతరంగిక స్థితి, మన దృష్టి.
-X-X- సమాప్తం -X-X-