Friday, 4 April 2025

T-216. అమ్మెడి దొకటి అసిమలో దొకటి.

 అన్నమాచార్యులు

216. అమ్మెడి దొకటి అసిమలో దొకటి. 

ఉపోద్ఘాతము: 

మాటలను కత్తుల్లాగా వాడొచ్చు అని విని ఉంటాం. అందుకు ఉదాహరణ ఈ కీర్తన. అతి సులభమైన పదములతో మన గుండెను కోసి దాంట్లో కొత్త రక్తం ఎక్కించడానికి ప్రయత్నం చేస్తారు అన్నమాచార్యులవారు. అంగుళాల మందాన ఉన్న మన చర్మంలోకి ఇలాంటి పదాలు ఇంక పనిచెయ్యవండి. అన్నమాచార్యుల తాపత్రయం చూస్తే పాపం ఎదో కష్టపడి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు అని మనము ఒక సెకను సంతాపం వెలిబుచ్చి దాన్ని వదిలి పెట్టేస్తాం, వాట్సాప్లో ఈమోజీలు పెట్టినట్టుగా. 

మందు లోపలికి వెళ్లకపోతే రోగం తగ్గదు. ఈ కీర్తనలను అర్థం చేసుకోకపోతే శాస్త్రములను అర్థం చేసుకోవడం ఇంకా కష్టం. బద్ధకము, అశక్తత తర్వాత చేద్దాంలే అని నెట్టుకొని వచ్చే తత్వము ఆనాడే మూర్తీభవించినవి​. అన్నమాచార్యులు వ్రాసినది ఏదో పాటలు పాడుకొని సంతోషించడానికి కాదు. వాటిని విని అర్ధం చేసుకుని జీవితాన్ని సరిదిద్దుకోమని చెబుతున్నారు. అదృష్టవశాత్తు చాలా మంది సంగీతకారులు కృషిచేసి  ఈ కీర్తనలన్నిటినీ చక్కటి పాటల రూపంలో మనకు అందించారు. ఈ కీర్తనలను నేరుగా విని అర్ధం చేసుకోగలిగే అదృష్టం - తెలుగువారిగా పుట్టడం మనం చేసుకున్న పుణ్యం. ఇకనైనా కొంత కృషిచేసి ఈ కీర్తనలను అర్థం చేసుకోండి. కొంత సమయం దీనికై వినియోగించండి. విలువైన సంపద ఇది. వీటిని పనికిరానివానిగా కొట్టి పారవేయకండి. 

ఈ కీర్తనలు, ఈ సంగీతం మనసు ప్రశాంతత కోసమని; అంతకంటే వాటికి విలువ లేదని భావించకండి. ప్రశాంతత దొరుకుతుందని ఐదు చుక్కలు మూడు చుక్కల హోటళ్ళలో మన ఉండటం లేదాండి​? ప్రశాంతత దొరుకుతుందని హిమాలయాల్లో కొంత సమయం గడిపి కూడా వస్తున్నారు మనుషులు. ఈ కీర్తనలు మనకి సులభంగా అర్థమయ్యే రీతిలో అన్నమాచార్యులు వ్రాసి పెట్టారండి. ఇందులో కొంత సమయం వినియోగించడం మాత్రమే మనం చేయవలసినపని. అంతలోనే మీకు అద్భుతమైన ప్రపంచపు వాకిళ్లు తెరుచుకుంటాయి అని మనవి చేసుకుంటున్నానండి.   

కీర్తన సంగ్రహ భావము:

పల్లవి: దేవా! మేము చేస్తామని చెప్పేదొకటి. నిజంగా మా హృదయంలో మరొకటి తలుస్తాము. సందేహములతో సతమతమవుతూ నియంత్రణ లేని మేమెక్కడి పెద్దలమయ్యా? (వయస్సు పెరిగినదే తప్ప బుద్ధి పెరుగలేదు అని అర్ధము). 

మొదటి చరణం: దేహంలో స్థితుడై ఉన్న జీవుడు దేహముతో సంగమము కలిగి ఉన్నంత కాలం శాశ్వత శాంతి కలుగదు. ఈ సంగమముతో ఏర్పడినదే ఈ లోకము. ఈ రకముగా ఎంగిలి పడిన దేహం అపవిత్రమైన శరీరము - మన ముందు నిలిచి ఉన్న ఈ సంసారమునకు మూలము. దినము ఏదో ఒక కోరికతో తహతహలాడు మేము ఎక్కడి పెద్దలమయ్యా? 

రెండవ చరణం: కోరికలను మానకుండా, విడిచిపెట్టకుండా కోపం తగ్గదు. కోరికలే ఈ రహస్యమయమైన మనసుకు ఆధారం. ఈ జీవితాన్ని క్రూరత్వానికి పణంగా పెడుతూ జీవిస్తున్నాం. ఇక, ఏ విషయంలో మేము పెద్దలమయ్యా? 

మూడవ చరణం: "నీవు అనుకున్నవి జరిగితే, ఫలితాలు వచ్చినప్పుడు ఈ బంధాలు తొలగిపోతాయనుకోడం పొరపాటు. నిజానికి, వాటివల్లే మనం ఈ ప్రపంచంలో మరింతగా తగులుకుంటాం. ఈ బంధాలను వదిలించుకోవాలంటే, శ్రీవేంకటేశుని దాసులమవడమే (ఒకటే) మార్గం. ఒక్కసారి ఆయన దాసులమైనపుడు,  పెద్దలమని చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు." 

 

కీర్తన 

అధ్యాత్మ సంకీర్తన
రేకు: 97-1 సంపుటము: 1-483
 

అమ్మెడి దొకటి అసిమలో దొకటి
బిమ్మిటి నిందేటి పెద్దలమయ్యా    ॥అమ్మెడి॥
 
సంగము మానక శాంతియుఁ గలుగదు
సంగలంపటము సంసారము
యెంగిలిదేహం బింతకు మూలము
బెంగల మిందేటి పెద్దలమయ్యా    ॥అమ్మెడి॥
 
కోరికె లుడుగక కోపం బుడుగదు
కోరకుండ దిక్కువ మనసు
క్రూరత్వమునకు కుదువ యీ బ్రదుకు
పేరడి నేమిటి పెద్దలమయ్యా        ॥అమ్మెడి॥
 
ఫలము లందితే బంధము వీడదు
ఫలముతో తగులు ప్రపంచము
యిలలో శ్రీవేంకటేశు దాసులము
పిలువఁగ నేమిటి పెద్దలమయ్యా    ॥అమ్మెడి॥ 

Details and explanation: 

అమ్మెడి దొకటి అసిమలో దొకటి
బిమ్మిటి నిందేటి పెద్దలమయ్యా ॥అమ్మెడి॥ 

టీక: అమ్మెడి దొకటి = అమ్ముతామని చూపించేదొకటి (దేవా! నీకు హృదయం ఇస్తాను, నా చర్మంతో చెప్పులు కుట్టిస్తాను లాంటివి);  అసిమలో దొకటి = సంచీలోని దొకటి (= శరీరము లోపలిది మరి యొకటి);   బిమ్మిటి = సంకోచము, నియంత్రణ లేని; నిందేటి పెద్దలమయ్యా = ఇక్కడ ఎటువంటి పెద్దలమయ్యా.  

భావము: దేవా! మేము చేస్తామని చెప్పేదొకటి. నిజంగా మా హృదయంలో మరొకటి తలుస్తాము. సందేహములతో సతమతమవుతూ నియంత్రణ లేని మేమెక్కడి పెద్దలమయ్యా? (వయస్సు పెరిగినదే తప్ప బుద్ధి పెరుగలేదు అని అర్ధము) 

వివరణ:

ఈ పల్లవిని చూస్తే అలా ఎవరు చెయ్యరు. అన్నమాచార్యులవారు పొరపాటు పడ్డారేమో?” అనుకుంటాం. కాదండి. పదహారణాల సత్యం అండి. ఎవరైతే చెప్పిందే చేస్తారో వారికి దైవానికి వ్యత్యాసం లేదండి. ఇప్పుడు చెప్పండి ఆచార్యులవారు పొరపాటు పడ్డారో, లేదో. అయితే కొందరూ కొన్ని విషయాల్లో చెప్పిందే చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అన్ని విషయాల్లోనూ చెప్పిందే చేయడం దాదాపు అసాధ్యము. 

బిమ్మిటి నిందేటి పెద్దలమయ్యా: ఇలా పెదవి మీద ఒకటి మనసులో ఇంకొకటి - రెండు రకాల విషయాలు మనలను వెంటాడుతుంటే సందేహాలు కలుగక మానవు. అవి మనిషిని దహించక మానవు. ఈ రకంగా చూస్తే మనలో ఉన్న విరుద్ధ భావనలే మనల్ని సత్యాన్ని గ్రహించకుండా చేస్తున్నాయి అన్న విషయం తెలుస్తోంది. పరస్పర విరుద్ధ భావనలతో మనం ఎన్ని యుగాల కాలం ఈ ప్రపంచంలో గడిపినా బుద్ధిపరంగా పెరగము అన్న విషయాన్ని చెబుతున్నారు. 

ఈ కీర్తనలో పెద్దలు అంటే స్థితప్రజ్ఞులు అన్న ఉద్దేశంలో వాడారు. “పెఱుగఁగఁ బెఱుగఁగఁ బెద్దలమైతిమి నేము అన్న కీర్తనలో కూడా వయస్సు పెరిగితే పెద్దతనము రాదు; పెద్దతనము బుద్ధి పెరిగితేవచ్చును అన్న విషయం చెప్పారు. 

మొదటి చరణం 

సంగము మానక శాంతియుఁ గలుగదు
సంగలంపటము సంసారము
యెంగిలిదేహం బింతకు మూలము
బెంగల మిందేటి పెద్దలమయ్యా ॥అమ్మెడి॥ 

ముఖ్య పదాలకు అర్థాలు: సంగము = కూడిక, చేరిక, మేళవము, కలియడము (= దేహముతో సంగమును సూచించారు); యెంగిలిదేహం = అపవిత్రమైన శరీరము; బెంగలము = విరహవ్యధ, బెంగల మిందేటి = మయో ఏదో ఒక కోరికతో తహతహలాడు; 

భావము: దేహంలో స్థితుడై ఉన్న జీవుడు దేహముతో సంగమము కలిగి ఉన్నంత కాలం శాశ్వత శాంతి కలుగదు. ఈ సంగమముతో ఏర్పడినదే ఈ లోకము. ఈ రకముగా ఎంగిలి పడిన దేహం అపవిత్రమైన శరీరము - మన ముందు నిలిచి ఉన్న ఈ సంసారమునకు మూలము. దినము ఏదో ఒక కోరికతో తహతహలాడు మేము ఎక్కడి పెద్దలమయ్యా?

 

వివరణము: 

ముందుగా అన్నమాచార్యులు వారి క్రింది చరణాన్ని ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించండి. 

కడుపునిండిన మహాకష్టంబు నలుగడల
వెడలుచును బెనుమురుకి వేయఁగాను
యిడుమఁ బొందుచు సుఖంబిందుకే వెదకీని
వొడలు మోవఁగ జీవుఁడోపననలేఁడు ఏఁటి  

ప్రత్యక్షార్థం: పూట పూట పొట్ట నింపుకోవాలనే కోరికతో, మనిషి అన్ని దిశలలో పరుగులు తీస్తాడు. ఈ పరుగులలో ధూళి, చెమట, దుర్భర పరిస్థితుల నడుమ అతడు కష్టపడతాడు. ఆ కష్టాల నుంచి బయటపడేందుకు సౌకర్యాల కోసం సుఖాల కోసం తహతహలాడతాడు. తన శరీరానికి ఓ చిన్న అసౌకర్యం వచ్చినా భరించలేడు. 

సూచ్యార్థం: అలుపెరుగని కోరికలు మానవుని నడిపిస్తాయి. తన కోరికలు తీరేకొద్దీ మళ్ళీ కొత్త కోరికలను సృష్టించుకుంటూ పోతుంటాడు. ఈ అప్రతిహత కోరికల ప్రక్రియలో తన జీవశక్తిని అంతా ఖర్చు చేస్తాడు. 

ఇలా సంసార జీవితంలో కొట్టుమిట్టాడుతున్న మేము ఎక్కడి పెద్దలమయ్య? 

రెండవ చరణం 

కోరికె లుడుగక కోపం బుడుగదు
కోరకుండ దిక్కువ మనసు
క్రూరత్వమునకు కుదువ యీ బ్రదుకు
పేరడి నేమిటి పెద్దలమయ్యా ॥అమ్మెడి॥ 

Word to word meaning: కోరికెలు = desires; ఉడుగక = విడువక, without subsiding; కోపంబు = anger;  ఉడుగదు = తగ్గదు, సమసిపోదు does not subside; కోరకుండదు = without desire;  ఇక్కువ = రహస్యము, secret, existence;   మనసు = mind; క్రూరత్వమునకు = for the cruelty;  కుదువ = తాకట్టు, to pawn, to pledge; యీ బ్రదుకు = this life; పేరడి = excessively, ఎక్కువగా; నేమిటి = what kind of; పెద్దలమయ్యా = gentlemen. 

భావము: కోరికలను మానకుండా, విడిచిపెట్టకుండా కోపం తగ్గదు. కోరికలే ఈ రహస్యమయమైన మనసుకు ఆధారం. ఈ జీవితాన్ని క్రూరత్వానికి పణంగా పెడుతూ జీవిస్తున్నాం. ఇక, ఏ విషయంలో మేము పెద్దలమయ్యా? 

వివరణము:

"కోరకుండ దిక్కువ మనసు" (కోరికలు లేకపోతే మనస్సుకు ఆధారం ఉండదు.) మనస్సు స్వరూపమే రహస్యమైనది. ఇది కోరికల ఆధారంగా ఆవిర్భవిస్తుంది. ఈ కోరికలే మనల్ని జీవనయానంలో నడిపిస్తాయి. మనస్సుకు రూపం ఇచ్చేది కోరికలు, వాటి ద్వారా మన ఆలోచనా విధానం, ప్రవర్తన, అనుభవాలన్నీ మలచబడతాయి. 

"కోరికె లుడుగక కోపం బుడుగదు" (కోరికలను విడిచిపెట్టకుంటే, కోపం తగ్గదు.) ఇది క్రూరత్వం ఎలా ఉత్పన్నమవుతుందో చూపిస్తుంది. కోరికలు మరియు కోపం పరస్పరం అనుసంధానమైనవి. కోరికలు నెరవేరనప్పుడు, మనస్సులో అసంతృప్తి పెరిగి, అది కోపంగా మారుతుంది. అసంతృప్తితో ఉన్న మనిషి ఇతరుల పట్ల అశ్రద్ధగా, దురుసుగా ప్రవర్తించటానికి మరింతగా ప్రేరేపించబడతాడు. 

"క్రూరత్వమునకు కుదువ యీ బ్రదుకు" (మన జీవితం క్రూరత్వానికి తాకట్టు పెట్టబడుతోంది.) ఈ భావన మనం అనేక మార్లు చర్చించిన conditioning (అలవాటైన పద్ధతి లేదా స్థితి వ్యాజము) తత్వాన్ని గుర్తుకు తెస్తుంది. పైన చెప్పినట్లుగా దురుసు ప్రవర్తనతో క్రూరత్వం ప్రదర్శించి బదులుగా శాంతి వస్తుందనే భ్రమలో ఉంటాం. 

ప్రత్యేకించి, మన అభిప్రాయాలు పక్కవారి అభిప్రాయాలకంటే మెరుగైనవన్న భావన మానవ సహజ స్వభావంగా మారిపోతుంది. ఇది ఇతరుల మాటలను విలువ లేకుండా చేసేందుకు దోహదపడుతుంది. మన జీవితంలో జరిగే ఘటనలను నిష్పాక్షికంగా పరిశీలించినప్పుడు, మన ఈ తీరును సులభంగా గుర్తించగలం. 

అన్నమాచార్యులు ఇక్కడ మనిషి అజ్ఞానం వలన క్రూరత్వానికి అనుకోకుండా సహకరిస్తున్న వాస్తవాన్ని చెబుతున్నారు. స్వార్థం, అసూయ, అధికారం కోసం తహతహలు, క్షుద్రత—ఇవి సమాజంలో నిత్య సత్యాలుగా మారిపోయాయి. మనిషి హింసను సహజమైనదిగా భావిస్తూ, దాన్ని గమనించకపోవడం పాదుకున్న రుగ్మతకు చిహ్నములు. 

"పేరడి నేమిటి పెద్దలమయ్యా" (ఈ పరిస్థితిలో, మేము నిజంగా పెద్దలమా?) అన్నమాచార్యులు మానవుని వయస్సు పెరుగుతున్నా, నిజమైన జ్ఞానం పెరుగుతోందా అని ప్రశ్నిస్తున్నారు. ఇది conditioningను (అలవాటుపడి అప్రయత్నముగా చేయు విధానమును) బహిరంగంగా ప్రశ్నించే వాక్యంగా నిలుస్తుంది. ఎప్పటికీ కోరికలతో, కోపంతో, క్రూరత్వంతో మెలిగే మనుషుల సమాజాన్ని చూసి, నిజమైన పురోగతి ఉందా? అని ప్రశ్నించినట్లు కనబడుతుంది 

ఇక పోతే, కోరికలకు లోబడకుండానే మనస్సును సమతుల్యంగా ఉంచగలిగితే, అసలు క్రూరత్వం పుట్టే అవకాశమే ఉండదని అన్నమాచార్యులు సూచిస్తున్నారు. ఈ చరణం మన conditioningను (స్థితి కల్పించు మానసిక భ్రమ = స్థితిచేత పేరుకొన్న అభిప్రాయముల సమాహారమును) ప్రశ్నించి, మనము నిజమైన జ్ఞానాన్ని పొందే దిశలో అడుగులు వేయాలన్న సందేశాన్ని ఇస్తుంది.

 

ఈ చరణాన్ని రెనీ మాగ్రిట్‌ 1967లో రూపొందించిన "The Blank Page" అనే కళాఖండంతో అన్వయించుకోవచ్చు. ఇది ఒక ప్రశాంతమైన రాత్రి దృశ్యాన్ని అందిస్తుంది. ముదురు నీలి ఆకాశం నిశ్శబ్దంగా విస్తరించి, ఒక అంతులేని ప్రశాంతతను సృష్టిస్తోంది. 

పైభాగంలో, ఆధారం లేకుండా చెట్టుల కొమ్మలు, ఆకులు కనిపిస్తున్నాయి. ఇవి చల్లటి రంగులతో చిత్రించబడి, ఆకాశాన్ని కొంతవరకు కప్పివేస్తున్నాయి. ఈ దృశ్యం కలలా, కల్పితమైన అనుభూతిని కలిగిస్తుంది. 

ఆ ఆకుల పైనుండి, సంపూర్ణ చంద్రుడు మృదువైన వెన్నెలను విరజిమ్ముతూ కనిపిస్తున్నాడు. ఇది ఒక తాత్వికమైన, లోతైన మౌనభావనను కలిగిస్తుంది. 

దూరంగా, చీకటిలో మసకబారిన నగరం కనిపిస్తుంది. నగరంలోని కట్టడాలు స్పష్టంగా కనబడకపోయినా, వాటి కిటికీల నుండి వెలువడే కాంతి లోపల జీవనం కొనసాగుతున్నట్టు సూచిస్తుంది. 

నగరాన్ని కప్పిన చీకటి, వాస్తవానికి, మనల్నీ చుట్టుముట్టింది. మనకు తెలిసో తెలియకో, మనం వెలుగులో ఉన్నామని భావిస్తాము. కానీ, మిగతా ప్రపంచమంతా అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నట్టు అనిపిస్తుంది. 

మనిషి తనను తనే వేరుచేసుకుని, తన దృష్టితోనే ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆకాశంలో వేలాడుతున్న ఆకులు మనలో ప్రచ్ఛన్నమైన, నిద్రాణమైన ఆలోచనలకు ప్రతిరూపం. వాస్తవానికి ఆకుల వెనక ఉండవలసిన చంద్రుణ్ణి ఆకుల పైకి తీసుకువచ్చినట్టు చూపి మనం ఆ క్షణంలో చేయు ఆలోచనలను పైకెత్తి చూపినట్లు (ఎలివేట్ చేసినట్లు) తెలుస్తోంది. 

ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఉత్పన్నమవుతుంది—మన ఆలోచనలు నిజంగా సత్యమా? లేక వి మన conditioning (స్థితివ్యాజం) ఫలితమా? 

ఒకసారి మన ఆలోచనలపై ప్రగాఢమైన విశ్వాసం ఏర్పడినపుడు,
👉 ఇతరుల అభిప్రాయాలను నిరాకరిస్తాం.

👉 మనము చెప్పినదే సరి అని భావించి, అవసరమైతే క్రూరత్వాన్ని ప్రదర్శించడానికి వెనుకాడం. 

ఈ చిత్రం ఒక లోతైన నిజాన్ని సూచిస్తుంది—మనిషి తన ఆలోచనల ఊహాజాలంలో చిక్కుకుని, విశాల ప్రపంచాన్ని చూడలేకపోతున్నాడు.

తన స్వంత అభిప్రాయాల్లోనే మునిగిపోతూ, ఏకాకిగా జీవిస్తున్నాడు. 

ఈ సందర్భంగా అన్నమాచార్యులు వారి క్రింది చరణాన్ని కూడా గుర్తు చేసుకుందాం. 

అసపడి వరదానమడిగిన పొలము
బాసలతోఁ గడు నెత్రుపట్టమైనపొలము 

ఈ దేహము లేదా క్షేత్రము మనిషి ఆశపడి ఎంచుకున్నదే. అయితే, ఈ రణక్షేత్రంలో అనేకానేక వాగ్దానాల నేపథ్యంలో  రక్తపాతానికి దార్లు తెరుస్తాడు. అన్నమాచార్యులవారు మానవుని యొక్క ఉనికిని ఆద్యంతములు పరికించి కీర్తనలు వ్రాశారు అన్నది నిర్వివాదాంశము. 

మూడవ చరణం:

ఫలము లందితే బంధము వీడదు
ఫలముతో తగులు ప్రపంచము
యిలలో శ్రీవేంకటేశు దాసులము
పిలువఁగ నేమిటి పెద్దలమయ్యా          ॥అమ్మెడి॥ 

భావము: "నీవు అనుకున్నవి జరిగితే, ఫలితాలు వచ్చినప్పుడు ఈ బంధాలు తొలగిపోతాయనుకోడం పొరపాటు. నిజానికి, వాటివల్లే మనం ఈ ప్రపంచంలో మరింతగా తగులుకుంటాం. ఈ బంధాలను వదిలించుకోవాలంటే, శ్రీవేంకటేశుని దాసులమవడమే (ఒకటే) మార్గం. ఒక్కసారి ఆయన దాసులమైనపుడు,  పెద్దలమని చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు." 

వివరణము: 

ఫలము లందితే బంధము వీడదు: క్రింది అన్నమాచార్యులవారి ఇంకొక కీర్తన లోని చరణము చూడండి. 

దాహమణఁగినవెనుక తత్వమెరిఁగెదనన్న
దాహమేలణఁగు తా తత్వ మే మెరుఁగు
దేహంబుగలయన్ని దినములకుఁ బదార్ఢ-
మోహమేలుడుగు దా ముదమేల కలుగు           కడలు  

భావము: అన్ని కోరికలు అణిగిపోయిన తర్వాత తత్వం తెలుసుకుంటాను అంటే కుదరదు. ఈ దాహం, ఈ కోరికలు అణుగుతాయా? లేదే! అలాంటి వాడు ఏం తత్వం తెలుసుకుంటాడు? లేడు. శరీరమున్నంతకాలం దాని సహజ స్వభావం వల్ల ఈ అభిలాషలు, కోరికలు  తప్పవని స్పష్టమే. అలాంటప్పుడు, నిజమైన ఆనందాన్ని ఎవరు పొందగలరు? పొందలేరు! 

ఫలముతో తగులు ప్రపంచము: మనను ప్రపంచమును కలుపుతున్నవి కోరికలు. ఇది మాటలలో చెప్పడమే సులభం. కానీ ఈ మాటలో దాగిన సత్యాన్ని మేం ఎప్పుడూ గమనించం. ఇక్కడ మాగ్రిట్ వేసిన బొమ్మను (The Blank Page) మరోసారి గుర్తు చేసుకుందాం. 

ఆ చిత్రంలో, ఒక ప్రశాంతమైన నిశీధి దృశ్యం ఉంది. ముదురు నీలి ఆకాశం నిశ్శబ్దంగా విస్తరించి, అంతులేని ప్రశాంతతను సూచిస్తుంది. దూరంగా కనిపించే నగరం — అదే ఈ ప్రపంచం. మనకు ఆ నగరానికి మధ్య ఉన్న ఖాళీ — అదే మనలోని అసంతృప్తి, మనం గమనించని అశాంతి. 

మానవుడు చేయవలసినదల్లా అక్కడ ఆకాశంలో వేలాడుతున్న ఊహాజనిత కోరికలను చూచి, అవి తన మనస్సును ఎలా ఆక్రమిస్తున్నాయో అవగాహనలోకి తీసుకురావాలి. ఈ ప్రక్రియలో, తనను ప్రపంచం నుండి వేరు చేస్తున్న అన్ని తెరలు’ తొలగించాలి. 

అయితే నిజానికి మనం అంత చేయాల్సిన అవసరం కూడా లేదు. కేవలం "తాను నిమిత్తమాత్రుడే" అన్న సత్యాన్ని గ్రహించి, భగవంతుడి పట్ల నమ్మకం ఉంచి, తాను ఉన్న చోట సాక్షిగా నిలబడగలిగితే చాలును. ఇదే మన పని. అదే మనిషి మరియు దైవం మధ్య నిలిచే అడ్డుగోడలను తొలగించే మార్గం. 

ఈ పని కూడా చెయ్యలేని మన అశక్తతను పక్కన పెట్టి, నేను గొప్పవాడిని నేను అది కనిపెట్టాను నేను ప్రపంచానికి ఇంత చేశాను అని గర్వంతో విర్రవీగు మనము ఎలా పెద్దలమవుతాం? పెద్దవాడిననే చెప్పుకునే అర్హత కూడా మనకు లేకపోవచ్చు.

 

x-x-x-x

 

Saturday, 29 March 2025

T-215. మూడేమాటలు మూడుమూండ్లు తొమ్మిది

 అన్నమాచార్యులు

215. మూడేమాటలు మూడుమూండ్లు తొమ్మిది

 ఉపోద్ఘాతము: 

ఈ కీర్తనలో వేదాంత రహస్యము ముఖ్యంగా ప్రస్తావించ బడినది. వేదాంతము అనే పదానికి '(ఇహ సంబంధమైన) ​జ్ఞానమునకు ముగింపు' అని అర్థం. వేదము ప్రాధాన్యంగా భక్తి, జ్ఞానం, మరియు విముక్తిపై దృష్టి పెడుతుంది. వేదాంతం అనేక సంప్రదాయాలుగా అభివృద్ధి చెందింది, వీటిపై వివరణలను ప్రస్థానత్రయీ అని పిలువబడే ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు మరియు భగవద్గీత అను గ్రంథాల నుండి పొందవచ్చును. 

అయితే, ఎన్ని గ్రంధాలు చదవండి, ఎంత మంది చెప్పిన వివరణలను వినండి, వేదాంత రహస్యముపై ఎంతో కొంత అనుమానం మిగిలిపోతూనే ఉంటుంది. ఇదే మానవునికి ప్రాథమికమైన సమస్య వేదాంతమునకు ఇదే చివరిమాట అనినొక్కి చెప్పలేము.   

అందుకనే అన్నమాచార్యులు ఇన్నియుఁ జదువనేల యింతా వెదకనేల / కన్ను దెరచుటొకటి కనుమూయుటొకటే అని ప్రశ్నించారు. ఈ శాస్త్రములు / వేదములు) ఇన్నియుఁ జదువనేల? యింతటా (దైవమును) వెదకనేల? కనులు తెరచుటలోను కనులు మూయుటలోను బేధమున్నదా? (లేదు). జననం, మరణం రెండే రెండు పరమ వాస్తవాలు. అనివార్యమైన ఈ  అవధుల మధ్యకాలమును సిద్ధాంతాలతోను, వెదుకుటలోనూ వృథా చేయవద్దు. మానవులారా! మీ ఇప్పటి అవగాహనలను ప్రక్కన బెట్టి, ఎదురుగా వున్న ఈ ప్రపంచమును (అందులోనే వున్న హరిని​) కనుగొనుడీ! అని ఉద్భోదించారు. 

అన్నమాచార్యులవారు కైవల్యపదమును చేరుకొన్నారను విషయమును అనేక కీర్తనలనుండి తెలియవచ్చును. అట్టి ఉత్కృష్ట స్థితికి చేరిన మహానుభావులు న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః అన్న భగవద్గీత వాక్యమును తమ నిజ జీవితంలో అనుసరించువారై ఉందురు. అనగావారు ఏ సిద్ధాంతములను, జీవులను ఆలంబనగా చేసుకుని జీవించరు. ఇదే విషయమును జిడ్డు కృష్ణమూర్తి జీవిత చరిత్రను పరిశీలించి తెలుసుకొనవచ్చును. 

అందుకని ఈ కీర్తనను కొంత తర్కంతోను కొంత అనుభవంతోను, కొన్ని నిజ జీవితపు సంఘటనలను కలుపుతూ చర్చించుకుందాం.

 

కీర్తన సంగ్రహ భావము:

పల్లవి: మానవులారా మీ మనసు భవిష్యత్తుపై 3 నుంచి 9 (ఆపై 27) లాగా అంచనాలు పెంచుకుంటూ  పరిగెడుతూనే ఉంటుంది. (అది ఆగదు). అయ్యలారా ఆ శ్రీహరిని వేడుకొని ఆ వేదాంత రహస్యము తెలిసి తరించండి. 

మొదటి చరణం: మానవులారా జీవస్వరూపముపై మంథన చేసి మీలో ఉన్న జీవమే అంతటాను వ్యాపించి ఉన్నదని  గ్రహించి, అదియే దేవుని వైభవము అని అంతరంగములో నిలుపండి. పుంఖానుపుంఖంగా సాగుతున్న సృష్టి సర్వవ్యాపియైన భగవంతుని మహిమే - ఈ తరగని ప్రకృతి సంపద.  అదియే వేదాంత రహస్యము. అంతరార్థము: జీవస్వరూపాన్ని నిజంగా తెలుసుకోవాలంటే మనం ఏమి చేయాలి? ప్రపంచాన్ని, మనల్ని విభజిస్తున్న భ్రమలను తొలగించి, జీవమును యథార్థంగా అనుభవించగలిగితే – అప్పుడే జీవితం సమగ్రమవుతుంది. అదే వేదాంత రహస్యము. 

రెండవ చరణం: అప్పుడు మీరు మీలో లోకానుభవమువలనఁగలిగిన తెలివిని తెలుసుకుంటూ, అదే పనిగా అది జీవము కాని విషయమని, జీవమునకు సంబంధించని దని తలపోసి దైవమును నమ్మి అలాగే వుండండి.  వైరాగ్యముగా అంటే అది మనంతటకు మనము ప్రక్కకు త్రోసి వేయగలిగిన విషయం కాదు అన్నదే  వినవలసినటువంటి వేదాంత రహస్యము. 

మూడవ చరణం: ఇదమిత్థముగా నిర్ణయించలేని శరణాగతి యొక్కటే ఉపాయముగా భగవంతునిపై పూర్తి విశ్వాసముతో అనంతమగు సత్యము నందు బేషరతుగా (వేరొక ఉపాయమును అలోచించక) కలసిపోవుటయే బ్రహ్మానంద వేదాంత రహస్యము.  

కీర్తన 

అధ్యాత్మ సంకీర్తన
రేకు: 370-3 సంపుటము: 4-412
 

మూడేమాటలు మూడుమూండ్లు తొమ్మిది
వేడుకొని చదవరో వేదాంత రహస్యము || పల్లవి|| 

చరణం 1

జీవస్వరూపము చింతించి యంతటాను
దేవుని వైభవము తెలిసి
భావించి ప్రకృతి సంపదయిది యెరుగుటే
వేవేలు విధముల వేదాంత రహస్యము ||మూడే || 

చరణం 2

తనలోని విజ్ఞానము తప్పకుండా దలబోసి
పనితోడ నందువల్ల భక్తినిలిపి
మనికిగా వైరాగ్యము మరవకుండుటే
వినవలసిన యట్టి వేదాంత రహస్యము ||మూడే || 

చరణం 3

వేడుకతో నాచార్య విశ్వాసము గలిగి
జాడల శరణాగతి సాధనముతో
కూడి శ్రీవేంకటేశుగొలిచి దాసుడౌటే
వీడని బ్రహ్మానంద వేదాంత రహస్యము ||మూడే ||

Details and explanation: 

మూడేమాటలు మూడుమూండ్లు తొమ్మిది
వేడుకొని చదవరో వేదాంత రహస్యము || పల్లవి|| 

భావము: మానవులారా మీ మనసు భవిష్యత్తుపై 3 నుంచి 9 (ఆపై 27) లాగా అంచనాలు పెంచుకుంటూ  పరిగెడుతూనే ఉంటుంది. (అది ఆగదు). అయ్యలారా ఆ శ్రీహరిని వేడుకొని ఆ వేదాంత రహస్యము తెలిసి తరించండి. 

వివరణ:

మనస్సు అత్యంత సారవంతమైన భూమి. అందులో ఏ బీజాన్ని నాటినా మొలకెత్తుతుంది. మన ఆలోచనలే ఆ బీజాలు. 

మానవుల మనసు ఎప్పుడు భవిష్యత్తుపై ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటుంది. ఈ ఆలోచనలు 3, 9, 27 లాంటి గుణశ్రేఢిలో విస్తరిస్తూ ముందుకు దూసుకెళ్తాయి,

కానీ మన చేతలు 1, 2, 3 లాంటి అంకశ్రేఢిలో నెమ్మదిగా సాగుతాయి. 

దీని ఫలితంగా, మన ఊహలు వాస్తవం కంటే ముందుకు పరుగెడుతూనే ఉంటాయి. ఈ వ్యత్యాసమే అసంతృప్తికి మూలం. 

అలా అసంతృప్తి చెందిన వ్యక్తుల సమూహమే నేటి సమాజం.ఈ సమాజంలో నెలకొన్న అస్తవ్యస్తతకు ప్రతి ఒక్కరి అంతర్గత అశాంతే మూలకారణం. 

ఆచార్యులు ఇక్కడ "వేడుకొని చదవమని" ఎందుకు అన్నారుఎందుకంటే, మనం ఎంత ప్రయత్నించినా మనస్సు వేరే దిశలో లాక్కుంటూ పోతుంది. అట్టి మనస్సును సంభాళించి, శ్రీహరిని వేడుకొని, ఈ రహస్యాన్ని తెలుసుకోవాలని సూచిస్తున్నారు. 

ఇక్కడ వేదాంతరహస్యముతో ఎంత చదివినా ఎంత వినినా అంతుబట్టకపోవడమును సూచించారు 

వేదాంత రహస్యాలు ఎంత చదివినా, ఎంత వినినా పూర్తిగా అంతుబట్టకపోవడం సహజం. కావున, గ్రహించేందుకు భక్తి, సాధన, ఆత్మసాక్షాత్కారం అవసరం. 

మొదటి చరణం 

జీవస్వరూపము చింతించి యంతటాను
దేవుని వైభవము తెలిసి
భావించి ప్రకృతి సంపదయిది యెరుగుటే
వేవేలు విధముల వేదాంత రహస్యము ||మూడే || 

భావము: మానవులారా జీవస్వరూపముపై మంథన చేసి మీలో ఉన్న జీవమే అంతటాను వ్యాపించి ఉన్నదని  గ్రహించి, అదియే దేవుని వైభవము అని అంతరంగములో నిలుపండి. పుంఖానుపుంఖంగా సాగుతున్న సృష్టి సర్వవ్యాపియైన భగవంతుని మహిమే - ఈ తరగని ప్రకృతి సంపద.  అదియే వేదాంత రహస్యము. 

వివరణము: 

జీవస్వరూపము – మానవుని మౌలిక ప్రశ్న 

జీవస్వరూపము అంటే ఏమిటి? మనము నిజంగా జీవిస్తున్నామా? లేక కేవలం శారీరకంగా ఉనికిలో ఉన్నామా? బతికే ఉన్నాం అనడానికి సాక్ష్యం ఏమిటి? జీవస్వరూపమునకు ఇదమిత్థమైన రూపం ఉండదని మీరు గ్రహించే ఉంటారు. భగవానుని అవతారాలు అనేక రూపములలో చూపుటకు ఇదే కారణం. 

అన్నమాచార్యులు ఈ పల్లవిలో మన ముందు ఒక ప్రశ్న పెడుతున్నారు: "చాల నొవ్వి సేయునట్టి జన్మమేమి మరణమేమి?" (ఎంతో శ్రమించి చేసే ప్రస్తుత జీవితానికి, మరణానికి వ్యత్యాసమేమి?). మనం చేసే ప్రయత్నాలన్నీ అసలు నిజమైన జీవనానికి దారితీస్తున్నాయా? లేక అవి ఒక భ్రమలో మిగిలిపోతున్నాయా? 

మహాభారతంలో భీష్ముల వారి ఉద్బోధ అంతా "ఏకాగ్రత" పైనే. అంటే "దైవముతప్ప వేరువిషయములు లేవు అని మనిషి ఉండవలెను" అన్న విషయం గుర్తుకు తెచ్చుకుందాం. 

మనుషులు జీవించలేరా? లేదా జీవించనివారైపోయారా? జిడ్డు కృష్ణమూర్తిగారు ఒక గొప్ప మాట చెప్పారు: "IF YOU ARE NOT IN COMMUNION with anything, you are a dead human being." (నీవు చేస్తున్న దేనితోనైనా నిజమైన అనుబంధం లేకుంటే, నీవు మృతప్రాయుడవు.) మన అనుబంధాలలో ఏకత్వం లేదు. అవి కొంత స్వప్రయోజనాలు కొంత ప్రేమ ఒలకబోస్తూ కలగూరగంపలా ఉంటాయి. 

మన భావాలు మన హృదయంలోనే పరిమితమై ఉంటాయి; అవి నేరుగా ఇతరులకు తాకవు. మన అనుభవాలు కూడా మనమే నిర్మించుకున్న ప్రొజెక్షన్లే. అందుకే, మనం నిజంగా జీవిస్తున్నామా? లేకపోతే మన ఉనికే ఒక భ్రమయా? 

ప్రపంచం మనకు – మనం ప్రపంచానికి ఎంత దూరం? మనకు ప్రపంచానికి మధ్య ఒక మానసిక దూరం ఉంది. ఈ దూరాన్ని తొలగించేందుకు చేసే ప్రయత్నాలన్నీ కృత్రిమమైనవే. మనస్సును బలవంతంగా మార్చడానికి చేసే అన్ని సాధనలూ విఫలమవుతాయి. 

అన్నమాచార్యులు చేరిన స్థితికి చేరుకున్న మహానుభావులందరూ ఈ మానసిక విభజనను తొలగించడానికి ప్రయత్నించారు. వారు తాము మరియు ప్రపంచం మధ్య గల దూరాన్ని చెరిపివేసి, ప్రపంచంతో తాదాత్మ్యాన్ని అనుభవించారు. ప్రపంచంతో అచంచలమైన ఆత్మీయ భావనకు పెద్దపీట వేశారు. 

అన్నమాచార్యుల ఆంతర్యం: అన్నమాచార్యుల స్థితి ఏదైనా సిద్ధాంతంతో ముడిపడలేదు. జిడ్డు కృష్ణమూర్తిగారు కూడా ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించలేదు. వారిద్దరు కూడా కేవలం ప్రపంచాన్ని మనకు అద్దంలో చూపించినట్టు చూపించారు. 

అన్నమాచార్యులు తనను తాను ప్రకృతి సంపదగాను అనుభవించి, భావించి వ్రాశారు. ఇదే భావాన్ని జిడ్డు కృష్ణమూర్తిగారు కూడా వ్యక్తపరచినట్లు స్పష్టమవుతోంది. 

జీవము అనునది నిరంతరమూ సాగు (భగవంతుని) వ్యవసాయం. జీవితము అనునది దేహ సంబంధమైనది. జీవమును పదార్థముతో గూడిన జీవితంతో ముడి పెట్టరాదు అన్నదే వేదాంత రహస్యము. 

ఇక్కడ వేదాంతరహస్యముతో సామాన్యజీవులకు జీవస్వరూపము అంతు బట్టక పోవుటను సూచించారు. 

అంతరార్థము: జీవస్వరూపాన్ని నిజంగా తెలుసుకోవాలంటే మనం ఏమి చేయాలి? ప్రపంచాన్ని, మనల్ని విభజిస్తున్న భ్రమలను తొలగించి, జీవమును యథార్థంగా అనుభవించగలిగితే – అప్పుడే జీవితం సమగ్రమవుతుంది. అదే వేదాంత రహస్యము. 

వివరణము: జీవము అనునది నిరంతరమూ సాగు (భగవంతుని) వ్యవసాయం. జీవితము అనునది దేహ సంబంధమైనది. అది స్వల్పకాలికము. జీవమును పదార్థముతో గూడిన జీవితంతో ముడి పెట్టరాదు అన్నదే వేదాంత రహస్యము. 

రెండవ చరణం 

తనలోని విజ్ఞానము తప్పకుండా దలబోసి
పనితోడ నందువల్ల భక్తినిలిపి
మనికిగా వైరాగ్యము మరవకుండుటే
వినవలసిన యట్టి వేదాంత రహస్యము ||మూడే || 

ముఖ్యపదములకు అర్ధములు: విజ్ఞానము = లోకానుభవమువలన తెలిసినవి;  పనితోడ = అదే పనిగా; మనికిగా =జీవనముగా; 

భావము: అప్పుడు మీరు మీలో లోకానుభవమువలనఁగలిగిన తెలివిని తెలుసుకుంటూ, అదే పనిగా అది జీవము కాని విషయమని, జీవమునకు సంబంధించని దని తలపోసి దైవమును నమ్మి అలాగే వుండండి.  వైరాగ్యముగా అంటే అది మనంతటకు మనము ప్రక్కకు త్రోసి వేయగలిగిన విషయం కాదు అన్నదే  వినవలసినటువంటి వేదాంత రహస్యము. 

వివరణము: 

భక్తినిలిపి: బంధములు అని చెప్పినటువంటి విషయము ఇదే. మనిషి తనలో లోకానుభవం వలన కలిగిన విషయములను తెలుసుకొనగలిగినప్పటికీ, ఆ సమయములో తాను ఏదో ఒకటి చేయవలను అను ఉత్కంఠ, ఉద్రేకం అతనిని పక్కదోవ పట్టించును. 

భగవద్గీతలో చెప్పిన, కామ ఏష క్రోధ ఏష రజోగుణసముధ్భవః । మహాశనో మహాపాప్మా విధ్ధ్యేనమిహ వైరిణమ్ 3-37మహాశనో = మహా అశనో అనగా ఎంతకు తీరని దాహము. మనిషి జీవము కాని విషయములను  తెలుసుకున్నప్పటికీ, రజోగుణం యొక్క ప్రభావముతోను, ఏదో సాధించాలి అన్న కోరికతోనో (కామ ఏష) ఆ క్షణంలో, ఆ సమయంలో భగవంతుని మీద భారం వేసి ఉంచకపోవడంతో తప్పు దారి పడతాడు. భక్తిని నిలపడంలో అసమర్థుడు అవుతాడు. 

మనికిగా వైరాగ్యము మరవకుండుట: ఇప్పుడు అన్నమాచార్యులు ఎంత ప్రాక్టికల్‌గా, ఆచరించదగిన రీతిలో చెబుతున్నారో తెలియండి.  వైరాగ్యము మరవకుండుట అంటే మానవుడు (ఏదైనా) కార్యము చేయుటకు ఉద్యుక్తుడైనప్పుడు తాను చెయ్యరాదు (అనగా తాను నిమిత్తమాత్రుడు) అన్న విషయమును ప్రక్కన పెట్టి జీవమును తెలియుటలో ప్రతిక్షణము విఫలమవుతున్నాడు. అంటే జీవము వైరాగ్యము వేరు వేరు విషయములు కావని, జీవమును గుర్తించు శక్తిని పదార్థ సంబంధ శరీరముతో  తెలియుట అసాధ్యము. ఆ సమయములో దైవముపై భారము వేసి  వుండలేకపోవు మన అశక్తతను ఎత్తి చూపుతున్నారు. 

వినవలసిన యట్టి వేదాంత రహస్యము: విని తెలుసుకోదగిన వేదాంత రహస్యము తనను తాను నిమిత్తమాత్రుడుగా గుర్తించి ఆప్రకారముగా నడచుట​. "విదిత్వా యోగీ పరం స్థా నముపైతి చాద్యమ్ (8-28)" అన్న భగవద్గీత వాక్యము కూడా దీనినే సూచించుచున్నది. 

 

మూడవ చరణం:

వేడుకతో నాచార్య విశ్వాసము గలిగి
జాడల శరణాగతి సాధనముతో
కూడి శ్రీవేంకటేశుగొలిచి దాసుడౌటే
వీడని బ్రహ్మానంద వేదాంత రహస్యము ||మూడే ||

 

ముఖ్యపదములకు అర్ధములు: ఆచార్య విశ్వాసము: భగవంతునిపై విశ్వాసము; జాడల శరణాగతి = ఇదమిత్థముగా నిర్ణయించలేని శరణాగతి; సాధనము = ఒకే ఉపాయముగా; కూడి శ్రీవేంకటేశుగొలిచి దాసుడౌటే = విశ్వాసముతో కూడి ఆ చెప్పలేని అనంతములో కలిసి శ్రీవేంకటేశు దాసుడగుట​. 

భావము: ఇదమిత్థముగా నిర్ణయించలేని శరణాగతి యొక్కటే ఉపాయముగా భగవంతునిపై పూర్తి విశ్వాసముతో అనంతమగు సత్యము నందు బేషరతుగా (వేరొక ఉపాయమును అలోచించక) కలసిపోవుటయే బ్రహ్మానంద వేదాంత రహస్యము. 

వివరణము: 

అన్నమాచార్యులవారు అత్యంత ఆచరణయుక్తముగా వేదాంత రహస్యములను వెల్లడించనున్నారు. 

జాడల శరణాగతి అని చెప్పి అది మానవుడు సులభముగా తన ఇంటిలో విద్యుద్దీపముల మీటలు నొక్కినట్టు (=స్విచ్ వేసినట్టుగా) తెలియలేడు. ఉదాహరణకు క్రింది ఒక కీర్తనలోని చరణమును చూడండి. 

భవబంధునకు విధిపాపపుణ్యపులంకె 
తివిరి యిందునే తెలివి తెలుసుకోవలెగాక |
అవల వెన్నెలలోనే అల్లునేరే ళ్లింతే 
నివిరి నిన్నటివునికి నేటికి గలదా 

ముఖ్యపదములకు అర్ధములు: తివిరి = ఆలోచించి, ప్రయత్నపూర్వకముగా, త్వరపడి; అల్లునేరే ళ్లింతే  = నమస్కారములు కూడా అంతే. 

భావము: వెన్నెలలో మనం చేసే నమస్కారాలు ఇతరులకు ఎంత అస్పష్టంగా కనిపిస్తాయో, అదేవిధంగా మానవుడు తన పాప–పుణ్య సంబంధాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం కూడా అంతే గూఢమైన విషయం. కానీ, అతడు ఈ గందరగోళపు లోకంలోనే  తచ్చాడుతూ, నిజమైన జ్ఞానాన్ని తెలుసుకొనవలెను. రూడి యగు నిన్నటి అనుభవాలు అను భూతకాలము లోని వానితో పోల్చితే నేడు అను సంగ్దిద్ధము నుండి నేర్చుట కష్టమే, కాని అదియే చేయవలసిన కార్యము. 

వీడని బ్రహ్మానంద వేదాంత రహస్యము  అనగా ఇది ఏకపక్ష మార్గము ఒక్కసారి దానిలోకి వెళితే తిరిగి వచ్చుటకు ఆస్కారం లేదు. ఆ బ్రహ్మానందంలో మునిగినవారు తాము అనుభవించినవి ఈ భూలోకంలో వారికి చెప్పుటకు అవకాశం లేదు. వారు బ్రహ్మానందం నిజంగా అనుభవించినది లేనిది రహస్యముగానే ఉండిపోవును.

 

Epilogue (ఉపసంహారము):

ఇప్పుడు రెనే మాగ్రిట్‌ వేసిన దిగువన ఉన్న key to the fields (La clef des champs క్షేత్రమునకు మార్గము)  పేరుతో ఉన్న పెయింటింగ్‌ను శ్రద్ధగా చూడమని పాఠకులకు అభ్యర్థన.


దీంట్లో ప్రేక్షకునికి కనబడుతున్న దృశ్యమునకు మధ్య ఒక విరిగిపోయిన గాజు కిటికి వుంది.   ఆ గాజు కిటికీ విరిగిపోయిన ముక్కలు ప్రేక్షకునివైపు పడి ఉన్నాయి. అనగా ఆ గాజుని ఆవలి వైపు నుండి (బయటనుండి) ఎవరో పగలకొట్టారన్నమాట. 

ఆ విరిగిన ముక్కలను గమనించిన, గాజు పగలక ముందు, మనం క్షేత్రము యొక్క పెయింట్ చేసిన చిత్రాన్ని మాత్రమే ప్రేక్షకుడు చూస్తున్నాడు అని తెలియ వచ్చును. నిజమైన ‘క్షేత్రము'ను కాదు అని యిట్టే తెలియును. గాజు పగిలిన తర్వాత​, అతడు నిజమైన ‘క్షేత్రము'ను చుడగలుగుతున్నాడు. 

అంటే, ఆ గాజు తెర మన అంతఃకరణము అన్నమాట.  అందుకే అన్ని మత గ్రంథములలో అంతఃకరణ శుద్ధికి అంత ప్రాముఖ్యతనిచ్చారు. మనిషి తాను చూచునది సత్యమని భావిస్తాడు. కానీ తన చూపులను ప్రభావితము చేయుచున్న వాటిని గ్రహించుట దుష్కరము. 

ప్రతీ అనుభవము మన మనస్సులో ఏదోవొక జాడను వదులుతుంది. ఇటువంటివి అనేకము కలసి తెలివిలోనికి వచ్చు సమాచారమును ‘వాతావరణములోని ధూళికణములు సూర్యుకాంతిని చెదిరి పోయేటట్లు చేయునట్లు’ సవరించును. కావున మనకు అనుభవములోనికి వచ్చు దర్శనము (picture) సత్యమునకు దూరముగా ఉండును. దీనినే పెయింట్ చేసిన చిత్రాన్ని మాత్రమే చూచుదుమని మాగ్రిట్టె గారు తెలిపిరి. 

జిడ్డు కృష్ణమూర్తి గారి ఈ ప్రకటనను పరిశీలించండి. "మనస్సు నిశ్చలంగా ఉన్నప్పుడు మాత్రమే, ఏ విషయాన్ని ఆశించడమో, గ్రహించడమో లేదా ప్రతిఘటించడమో లేనప్పుడే, ఏది నిజమో చూడడం సాధ్యమవుతుంది. విముక్తి కలిగించేది సత్యమేగాని, స్వేచ్ఛగా ఉండటానికి మీ ప్రయత్నం కాదు." 

ఇహము పరము కలిగించు వాడు శ్రీవేంకటేశుఁడు. 

అనగా తనకున్నవన్నీ విడిచి శరణాగతి చేయుటయే మానవునికి గల ఏకైక వుపాయము. 

శరణాగతులకు సత్యముగా వుండు వాడితడొకడే శ్రీవేంకటేశుఁడు. 

గాజును పగలగొట్టినవాడు చేస్తున్న పనిలో లీనమై గాజు ఎలా పగిలిదీ గమనించలేదని తెలుస్తోంది. అతనికి త్వరిత గతిని గాజును ఛేదించుకు పోవాలన్న తపన ప్రస్ఫుటం. ఈవల నిలబడి వున్న మనిషిని రక్షించడమే అతని ఆసక్తి ​. భగవంతునికి మనపై అంతటి అవ్యాజమైన ప్రేమ. 

సత్యానికి క్రమబద్ధమైన మార్గం లేదు. 

అనియమిత మరియు ప్రమాదయుక్తమైన మార్గం చిందరవందర ప్రపంచంయొక్క నైజమును చూపుతోంది. గాయాలకు భయపడి మనం గాజు గోడను దాటకపోతే అంతకంటే పిరికితనముండదు.

x-x-x-x

T-216. అమ్మెడి దొకటి అసిమలో దొకటి.

  అన్నమాచార్యులు 216. అమ్మెడి దొకటి అసిమలో దొకటి.   ఉపోద్ఘాతము:   మాటలను కత్తుల్లాగా వాడొచ్చు అని విని ఉంటాం . అందుకు ఉదాహరణ ఈ కీర్తన ...