తాళ్లపాక అన్నమాచార్యులు
281 తక్కిన చదువులొల్ల తప్ప నొల్లా
For English version press here
ఉపోద్ఘాతము
మనిషి మాటలకు, లిఖిత
శాసనాలకు బానిసగా మిగిలిపోయాడు.
జనులను కలుపవలసిన విద్య — వారిని విడదీసింది.
మార్గం చూపవలసిన విద్య — అతడిని దారితప్పించింది.
చరిత్రలో ఎన్నడూ
లేనంతగా
ప్రపంచం, దానిలోని జీవులు — పరస్పరం
విరోధులయ్యారు.
మనుష్యజీవితం
విద్యకే తాకట్టు పెట్టబడింది.
దాని పేరుతో చేసిన అన్ని ప్రయత్నాలు వృథా అయ్యాయి.
విముక్తి ఇవ్వవలసిన సాధనాలే — బంధనాలుగా మారాయి.
అందుకే
అన్నమాచార్యుడు అంటారు —
“శ్రీహరినే తెలుసుకోవడమే అసలు విద్య;
తక్కినవన్నీ వ్యర్థం.”
|
అధ్యాత్మ కీర్తన
|
|
రేకు: 311-5
సంపుటము: 4-65
|
|
తక్కిన చదువులొల్ల తప్ప నొల్లా చక్కఁగ శ్రీహరి నీశరణే చాలు ॥పల్లవి॥ మోపులు మోవఁగనొల్ల ములుగఁగ నేనొల్ల తీపు నంజనొల్ల చేఁదు దినఁగనొల్ల పాపపుణ్యాలవి యొల్ల భవమునఁ బుట్టనొల్ల శ్రీపతినే నిరతము చింతించుటే చాలు ॥తక్కి॥ వడిగాఁ బరువులొల్ల వగిరింపనేనొల్ల వెడఁగుఁజీఁకటి యొల్ల వెలుఁగూనొల్ల యిడుమల వేఁడనొల్ల యెక్కువ భోగములొల్ల తడయక హరి నీదాస్యమే చాలు ॥తక్కి॥ అట్టె పథ్యములొల్ల అవుషధము గొననొల్ల మట్టులేని మణుఁగొల్ల మైల గానొల్ల యిట్టె శ్రీవేంకటేశుఁ నిరవుగ సేవించి చుట్టుకొన్న యానందసుఖమే చాలు ॥తక్కి॥
|
Details
and Explanations:
|
Telugu Phrase
|
Meaning
|
|
తక్కిన
చదువులొల్ల తప్ప నొల్లా
|
ఇతర విద్యలు
నాకొద్దు. రిత్త విషయములు ఎత్తుకోనేలా?
|
|
చక్కఁగ
శ్రీహరి నీశరణే చాలు
|
చక్కగా శ్రీహరికి శరణాగతి చేయడమే చాలు.
|
సూటి భావము:
ఇతర విద్యలు
నాకొద్దు. (హరిపథమును విడిచి) రిత్త విషయములు ఎత్తుకోనేలా? చక్కగా శ్రీహరికి శరణాగతి అంటే చాలదా?
గూఢార్థవివరణము:
ఇక్కడ అన్నమాచార్యులు నరుడు నేను మానవుణ్ణి అని చెప్పుకుని గర్వపడే విద్యనే ప్రశ్నిస్తున్నారు. అనేక శతాబ్దాలుగా మనిషి విద్యలలో ప్రగతి సాధించినా, జీవనమును సమన్వయ పరుచుకోలేకపోయాడు. ప్రపంచాన్ని జయించే విద్యలను నేర్చుకున్నాడు గానీ, తనను తాను అర్థం చేసుకునే విద్యను మాత్రం పొందలేకపోయాడు.
వేదవిద్య కానీయండి, విజ్ఞానశాస్త్ర విద్య కానీయండి — అవి మనుగడకు, సాధనకు అలంకారాలు మాత్రమే, ముక్తికి మార్గాలు కాలేకపోయాయి. విద్య పెరిగిన కొద్దీ మనస్సు సంక్లిష్టమైపోయింది. అన్నమాచార్యుడు ఇక్కడ చెబుతున్నది స్పష్టంగా — “జ్ఞానం కాదు, సమర్పణే విముక్తి.” మనసు అహంకార బంధాలనుండి విడిపోవడమే నిజమైన విద్య.
శ్రీహరికి చక్కగా సమర్పించుకోవడంలోనే — మానవజీవితపు శాంతి, పరిపూర్ణత, మరియు సత్యస్ఫురణ దాగి ఉన్నాయి.
|
Telugu Phrase
|
Meaning
|
|
మోపులు మోవఁగనొల్ల ములుగఁగ నేనొల్ల
|
ప్రయత్నములు
అను మోపులు నా వీపుమీద మోయలేను. ఆ మీదట మూలుగుతూ
వుండలేను.
|
|
తీపు నంజనొల్ల చేఁదు దినఁగనొల్ల
|
తీపి పదార్థములను
తింటూ వుండలేను. అట్లని చేడు కూడా తిని బ్రతకలేను. (తీపి = సుఖము, చేదు = దుఃఖము)
|
|
పాపపుణ్యాలవి యొల్ల భవమునఁ బుట్టనొల్ల
|
పాపపుణ్యాల బేరీజును వదిలి వేస్తాను. మళ్ళీ ఈ శరీరములో పుట్ట దలచుకోలేదు.
|
|
శ్రీపతినే
నిరతము చింతించుటే చాలు
|
శ్రీపతి
చింతయే నిరంతరము చాలు
|
భావము:
ప్రయత్నములు
అను మోపులు నా వీపుమీద మోయలేను. ఆ మీదట మూలుగుతూ
వుండలేను. తీపి పదార్థములను తింటూ వుండలేను. అట్లని చేడు కూడా తిని బ్రతకలేను. (తీపి
= సుఖము, చేదు = దుఃఖము). పాపపుణ్యాల బేరీజును వదిలి వేస్తాను. మళ్ళీ ఈ శరీరములో
పుట్ట దలచుకోలేదు. శ్రీపతి చింతయే నిరంతరము చాలు.
గూఢార్థవివరణము:
ఇక్కడ అన్నమాచార్యులు ఒక గంభీరమైన వ్యత్యాసమును చూపిస్తున్నారు —“ప్రయత్నం బంధనం, సమర్పణే విముక్తి.” బాల్యం నుంచీ మరణం వరకూ మనిషి మోపులు మోసుకుంటూనే ఉన్నాడు —విద్య పేరుతో, సాధన పేరుతో, పురోగతి పేరుతో, భక్తి పేరుతో.ఇవి అన్నీ మనసు మీద మోపులు మాత్రమే. జీవితాన్ని మెరుగుపరుచుకోవాలనే ఆశతో, మరణానంతరం స్వర్గాన్ని అందుకోవాలనే భ్రమతో మనిషి అజ్ఞానక్రమంలోనే జీవిస్తున్నాడు.
ఎన్నో శతాబ్దాలుగా ప్రయత్నాలు చేశాక — విద్యలోనూ, మతంలోనూ, భక్తిలోనూ —మనకు లభించినది ఏమిటి? శాంతి ఎక్కడ? వాస్తవం ఏమిటంటే — ఏమీలేదు. చాలామందికి భక్తి కూడా సత్యమును ఎదుర్కొనలేక మరొక తప్పించుకునే మార్గమే అయిపోయింది — జీవితము అనే యథార్థము ఎదుర్కోకుండా ఉండే సౌకర్యవంతమైన తలదాచుకొను స్థలం.
అన్నమాచార్యుడు మనల్ని అడుగుతున్నారు —మనిషి నిజంగా మారాడా? రామాయణ, మహాభారత కాలంలో ఉన్న పాత్రల కష్టాలే నేటికీ ఉన్నాయి. ప్రేమ, ద్వేషం, సుఖం, దుఃఖం, జననం, మరణం — అదే చక్రం, అదే గానుగ ఎద్దు నడక.
గత వంద సంవత్సరాలుగా సాగుతున్న నేటి శాస్త్రయుగంలోనూ — భౌతికంగా పురోగతి సాధించినా — లోకం ఇక మునుపెన్నడు ఎరుగని అసంబద్ధమైన యుద్ధాలతో, పరాయి వాడిని దోచుకునే దురాశలతో, మనిషిని మనిషి నమ్మలేని భయాలతో అతి అనాగరికమైన వినిమయ సంస్కృతితో ఈ ప్రపంచము నిండిపోయింది. దేవాలయాలు పెరిగాయి, ప్రార్థనా మందిరములు అనేకములు వెలిశాయి — కానీ శాంతి మాత్రం కొరవడింది. కావున మనము అధారపడు సమయము, శాస్త్ర పురోగతి ముక్తి లేదా స్వతంత్రతకు దారులు కావు.
అన్నమాచార్యుని
సమాధానం స్పష్టమైనది, విప్లవాత్మకమైనది — “చక్కఁగ శ్రీహరి నీశరణే చాలు.” ఇది ప్రార్థన కాదు,
తపస్సు కాదు, ప్రయత్నం కాదు —ఇది వదిలివేయడం.
తలలోని బరువులన్నీ దించివేసినపుడు మాత్రమే స్వేచ్ఛ ప్రత్యక్షమవుతుంది. ఎవరూ స్వేచ్ఛను
పొందరు — స్వేచ్ఛను తెలుసుకుంటారు..
|
Telugu Phrase
|
Meaning
|
|
వడిగాఁ
బరువులొల్ల వగిరింపనేనొల్ల
|
వడివడిగా బరువులు ఎత్తలేను. ఆపై చింతించి నిట్టూరుస్తూ
కూర్చోలేను
|
|
వెడఁగుఁజీఁకటి యొల్ల వెలుఁగూనొల్ల
|
అందరూ వెలుగు అని భావించే దానిలోను ఇమడలేను
|
|
యిడుమల
వేఁడనొల్ల యెక్కువ భోగములొల్ల
|
కష్టములను భరించలేను. సుఖములలో తేలియాడలేను.
|
|
తడయక హరి
నీదాస్యమే చాలు
|
మారు లేకుండా శ్రీహరి నీ దాస్యమే చాలు
|
సూటి భావము:
వడివడిగా
బరువులు ఎత్తలేను. ఆపై చింతించి నిట్టూరుస్తూ కూర్చోలేను. అందరూ వెలుగు అని భావించే
దానిలోను ఇమడలేను. ("జ్ఞానము లేదా ఆధ్యాత్మిక
ప్రకాశము” అని పిలవబడేది కూడా అది మనసు యొక్క ప్రయత్నంతో,
ద్వంద్వ భావంతో కూడినదైతే, అంగీకరించను"
అని భావము). కష్టములను భరించలేను. సుఖములలో తేలియాడలేను. మారు
లేకుండా శ్రీహరి నీ దాస్యమే చాలు
గూఢార్థవివరణము:
అన్నమాచార్యులు మన నిజజీవితంలో ఎలా జీవిస్తున్నామో చూపుతున్నారు. ప్రయత్నం అనే బరువు ఎత్తుతాము. నిరీక్షణయే బతుకైపోతుంది. మన ప్రమేయం లేకనే వెలుగును ప్రేమిస్తాం, చీకటిని ద్వేషిస్తాం అని తలచకండి. అది మనము చేయు ఇష్టాయిష్టాల తీర్మానము. అది కూడా ప్రయత్నంతో చేయునదే.
“నరుని దృష్టిలోనే బేధాలు. శివుని దృష్టిలో అంతా సమానమే”
కన్ను కెమెరా వంటిదైతే అది గ్రహించిన దృశ్యం ఇష్టాయిష్టాలు అను రంగు పొరల ద్వారా మనసు వేరు చిత్రపటముగా చేకొనును. ఈ రకంగా చూచునది మిళితమైన కనులతోను, వినినది మిశ్రితమైన చెవులతోను, తినునది కలగూరగంప రుచులతోను, స్పర్శలు పేనబడిన వాసనలతోను అనుభవమునకు వచ్చు దానిని సత్యం అని భావించుట న్యాయమా? అవి కేవలం దృష్టిలోని తారతమ్యాలకు మనసిచ్చు రూపాలు.
గీతలో పదేపదే పేర్కొన్న “యఃపశ్యతి సపశ్యతి” అర్ధం ఇదే. మనము ప్రస్తుత స్థితిలో గ్రహించు విషయములన్నీ అసంబద్ధములే. అనగా అసలు సమస్య - చూసిన వస్తువులలోనూ, చూచు కన్నులలోనూ కాదు మనలోనే మన దృష్టిలోపమే. అటుల కలుషితము కానీ దృష్టియే దైవ కృప.
తక్కినవన్నీ
వర్ణపటములోని రంగుల మిశ్రమం మారినట్టుగా మనకు తగినట్లుగా మార్చుకున్నవి. మనసు
అనుచిత్రకారుడు అనేక వర్ణ చిత్రములను మన కళ్ళ ముందుంచి భ్రమింప చేస్తాడు. అదే
"అనేకచిత్తవిభ్రాంతాః మోహజాలసమావృతాః "
అన్నదానికి అర్థం. అన్నమాచార్యులు ఈ జాలములో
చిక్కుకోక శ్రీహరికి శరణము చేయమని ఆదేశించుచున్నారు.
|
Telugu Phrase
|
Meaning
|
|
అట్టె పథ్యములొల్ల అవుషధము గొననొల్ల
|
అలాగే ఉపవాసములు చేయలేను. నా ఋగ్మతలకు ఔషధములు తీసుకోలేను.
|
|
మట్టులేని మణుఁగొల్ల మైల గానొల్ల
|
అట్లని అనేకములైన మడుగులలో మునగలేను. కాదని మైలగాను వుండలేను.
|
|
యిట్టె శ్రీవేంకటేశుఁ నిరవుగ సేవించి
|
ఇట్టె శ్రీవేంకటేశుని తగినట్లుగా సేవించి
|
|
చుట్టుకొన్న యానందసుఖమే చాలు
|
అందులో పరవశమున మునిగితే చుట్టూ స్వేచ్ఛా సుఖములను కనుగొన్న చాలు.
|
సూటి భావము:
అలాగే ఉపవాసములు
చేయలేను. నా ఋగ్మతలకు ఔషధములు తీసుకోలేను. అట్లని అనేకములైన మడుగులలో మునగలేను. కాదని
మైలగాను వుండలేను. ఇట్టె (చిటికవేసినంత సులభముగా) శ్రీవేంకటేశుని తగినట్లుగా సేవించి
అందులో పరవశమున మునిగితే చుట్టూ స్వేచ్ఛా సుఖములను కనుగొన్న చాలు.
గూఢార్థవివరణము:
ఇక్కడ అన్నమాచార్యులు శాంతమైన స్పష్టతతో మాట్లాడుతున్నారు —ఉపవాసములు, ప్రయత్నములు, ఆర్భాట సేవలు, తీర్థయాత్రలు, తపస్సులు - అవన్నీ శూన్యమని గ్రహించారు. ఆయన సారాంశంగా చెప్పేది —“ఉపవాసాలు వద్దు, ఔషధాలు వద్దు, తీర్థయాత్రలు వద్దు — చేయవలసింది ఒక్కటే, దైవసేవ.”
ఎంతో మృదువుగా ఆయన “ఆధ్యాత్మిక ప్రయత్నం” అనే బరువును దించేస్తారు! ఉపవాసం, యాత్ర, కర్మలు — ఇవన్నీ కూడా మన అశాంత మనస్సు విస్తరణలే. అవి సత్యానికి దారులు కావు, సత్యం నుండి దారి మరల్చే మాయాజాలాలు. ఎందుకంటే ప్రతి ప్రయత్నములోనూ, ఎంత పవిత్రమైనదైనా, "ప్రయత్నించే నేను" అనే విభజన మిగిలే ఉంటుంది.
కవి క్రమశిక్షణను లేదా ఇప్పటి విధానాలను తిరస్కరించడం లేదు. వాటి ఆచరణలో వచ్చే ఆంతర్గత అలసటను చూపిస్తున్నారు —శాంతి అనేది ప్రయత్న ఫలితం కాదు; ప్రయత్నం ముగిసినప్పుడు ప్రత్యక్షమయ్యేది.
“శ్రీవేంకటేశుని యథావిధిగా సేవించుదాం” అని ఆయన అంటారు — దానిలో ఏ సాధనా భావమూ లేదు, అది త్యాగం కాదు, తేటతనంలో పుట్టిన సమర్పణ. మనసు శుద్ధి, పాప పరిహారం, పురోగతి అనే భ్రమలను వెంబడించడం ఆపినప్పుడు మిగిలేది నిశ్చలత — అదే అసలైన ఔషధం. అది బుద్ధి, గర్వం, అన్వేషణలు వదలివెళ్ళిన గాయాలను మానుపుతుంది.
అదే “చుట్టుకొన్న
యానందసుఖమే చాలు” అన్నదాని అర్థం — మనలో స్వార్థం
లేకపోతే, లక్ష్యం లేకపోతే, మన
అస్తిత్వమే సహజంగా దైవంతో కలిసిపోయినప్పుడు ప్రయత్నరహితమైన, ఘర్షణలేని
ఆ ఆవరణంలో మన అస్తిత్వమే స్వేచ్ఛయై విరజిల్లుతుంది
ఈ కీర్తన
ముఖ్య సందేశం
అన్నమాచార్యులు బోధనం విచారణార్హము —
చదువులుకాదు, దైవసేవ తెలుసుకో.
No comments:
Post a Comment