Sunday, 16 November 2025

T-284 విచార మెన్నఁడు లేదు వీరిడి జీవులకును

 తాళ్లపాక అన్నమాచార్యులు

284 విచార మెన్నఁడు లేదు వీరిడి జీవులకును

For English version press here 

ఉపోద్ఘాతము 

అన్నమాచార్యులు అద్భుతం కాదు —
ఆశ్చర్యం యొక్క అంచులను దాటిపోతారు.
ఐదువందల క్రితమే
కాలముపై ఆయన చేసిన పరిశీలనలు
మన పాతకాలపు ఆలోచనలపై పిడుగుల వంటివి
ఎవరికైనా ఇది అతిశయోక్తిగా అనిపించ వచ్చుగాక​.

కానీ విషయం ఏమిటంటే:
మనకు మాటల్లో చెప్పడానికే కష్టమైన
మన  ఊహల్లోలేని
పట్టరాని పొదగలేని భావాలను
ఇంద్రజాలికునిలా యథార్థంగా మన ముందే విప్పుతారు.

ఆయన కంటి ముందు ఒక ఘట్టం ఆవిష్కృతమౌతుంది;
అది నిలబెట్టి ఉంచలేని సత్యంలా ​
ఆయనను అంతర్లీనంగా కదిలిస్తుంది.
ఆ కదలికే
కీర్తనలుగా మనకు లభ్యమయ్యాయి.

పదునైదవ శతాబ్దంలో చెప్పిన ఈ అంతఃదర్శనం —
ఈరోజు మనం నమ్ముకున్న నేలనే తొలిచేస్తుంది.
మన ఆధునిక ఆలోచనా వ్యవస్థలన్నీ ఒక్కసారిగా కూలిపోతాయి.
 
వారు శస్త్రంతోను శాస్త్రంతోను కాదు,
సున్నితమైన నిజంతో నిరాయుధుల్ని చేస్తారు —
అందంగా అలంకరించిన సిద్ధాంతాలన్నింటినీ
నేలమట్టం చేస్తారు
ఒకే  తీక్షణమైన సత్యంతో.

 

అధ్యాత్మ​ కీర్తన
రేకు: 157-3 సంపుటము: 2-271
విచార మెన్నఁడు లేదు వీరిడి జీవులకును
పచారించేరు బ్రదుకు బ్రహ్మనాటనుండియు ॥పల్లవి॥

పొద్దువొడచుటయును పొరిఁ గూఁగుటయె కాని
అద్దుకొని మిగులఁగ నందేమి లేదు
వొద్దికఁ బుట్టుటయును వుడుగఁ జూచుటె కాని
కొద్దితోడఁ గాలమేమి గురియై నిలువదు ॥విచా॥

అన్నము భుజించేదియు నాఁకలి గొనేదెకాని
యెన్నికకుఁ జెప్పిచూప నేదియు లేదు
ఇన్నిటఁ దిరిగాడేది ఇంటికి వచ్చేదే కాని
పన్ని తననిలుకడ భావించ లేదు      ॥విచా॥

జవ్వనము మోఁచేదియు సరి ముదుసేదే కాని
తవ్వి కట్టుకొనే దేది దాఁచే దేది
నవ్వుతా నలమేల్మంగనాయక శ్రీవేంకటేశ
రవ్వల నీ వేలికవు రక్షించు మిఁకను  ॥విచా॥ 

Details and Explanations:

పల్లవి
విచార మెన్నఁడు లేదు వీరిడి జీవులకును
పచారించేరు బ్రదుకు బ్రహ్మనాటనుండియు      ॥పల్లవి॥ 
              Telugu Phrase
Meaning
విచార మెన్నఁడు లేదు వీరిడి జీవులకును
(వీరిడి=మూర్ఖుఁడు;) ఈ మూర్ఖజీవులు సరియైన విచారణ లేక
పచారించేరు బ్రదుకు బ్రహ్మనాటనుండియు
(పచారించు= తిరస్కరించు; బ్రహ్మనాటనుండి = పెద్ద (చాలా) కాలము నుండి) సృష్టి మొదలుకొని, అసలైన జీవనసారాన్ని తిరస్కరించి బ్రతుకుతున్నారు.

భావము:

సృష్టి మొదలు నుండి ఇప్పటివరకు — ఈ మూర్ఖజీవులు సరియైన విచారణ లేకుండా, జీవనంలోని అసలు తత్త్వాన్ని (భగవంతుని) తిరస్కరించి కాలాన్ని వెళ్లబుచ్చుతున్నారు.


గూఢార్థవివరణము: 

విచార మెన్నఁడు లేదు వీరిడి జీవులకును
అన్నమాచార్యుల మొదటి వాక్యం ఒక తీవ్రమైన హెచ్చరిక.
వీరిడి జీవులు” అనగా —
ఎన్ని సంవత్సరాలు బ్రతికినా,
జీవితం ఎలా నడుస్తోందో, తాము ఎందుకు బ్రతుకుతున్నామో
ఒక్క క్షణం కూడా ఆగి ఆలోచించని వారు.
వారికి వివేకమనే తలుపే తట్టబడలేదు.
 


పచారించేరు బ్రదుకు బ్రహ్మనాటనుండియు
ఇలాంటి విచారణలేమితో,
తమ కళ్ల ముందే ఉన్న నిజస్వరూప జీవనాన్ని తిరస్కరిస్తూ,
రోజు రోజుకూ స్వయంగా తమ జీవితాన్ని
తమ కళ్ల ముందే ఉన్న నిజస్వరూప జీవనాన్ని తిరస్కరిస్తూ,
రోజు రోజుకూ స్వయంగా తమ జీవితాన్ని
సత్య మార్గము నుండి ప్రక్కకు ఈడ్చుకొంటూ గడుపుతున్నారు.
అది కొత్త పాపం కాదు —
ఆదిమ కాలం నుండి వచ్చిన మానవ బలహీనత.

మనిషి జీవితంలోని మొదటి సమస్య అనుకరణ
ఇతరులపై మానసికంగా ఆధారపడటం.

బాల్యంలో తల్లిదండ్రులు సత్యాన్ని “తెలిసినవారు” అనుకుంటాం.
తరువాత గురువులు, పెద్దలు, సమాజం —
వరుసగా వారినే అనుసరిస్తాం.
ఈ అనుకరణ సహజంగానే మొదలవుతుంది,

కానీ క్రమేణ అది మానసిక ఆధారపడటంగా మారుతుంది.
తర్వాత మనం ప్రపంచాన్ని చూసి నేర్చుకుంటాం.
ఏది “మంచి జీవనం”, ఏది “సంతోషం” అని
ఇతరులు, ముఖ్యంగా సంపన్నులు,
పలుకుబడి కలిగిన వారు,
ఎదో ఒక విద్యలో నిష్ణాతులైన వారి
జీవితాలను ప్రమాణాలుగా, పాఠాలుగా
పరిగణించి అనుకరిస్తాం

ఆ పరోక్ష తృప్తితో జీవితం గడుపుతాము.
ప్రశంసలు పొందిన​ వారి జీవనాన్ని నకలు చేసేందుకు ప్రయత్నిస్తూ,
పరులకు నచ్చే విజయ నిర్వచనాల్ని
మనం మన ఇష్టాయిష్టాలను ప్రక్కకుపెట్టి
మందులాగ — ఎదురు మాట లేకుండా మింగేస్తాం.
అనేక సార్లు మనం పొందేది నిజమైన సంతోషం కాదు —
పరోక్షమైన, అప్పు లాంటి తృప్తి.
ఇందుకే “బిగ్ బాస్” వంటి కార్యక్రమాలు ప్రజలను
మరోవారి జీవితంలో ముంచి ఎల్లప్పుడూ “వక్రానందం” అందిస్తాయి. 


ఈ సందర్భంలో Oscar Wilde చెప్పిన మాట
అన్నమాచార్యుల భావాన్ని అద్భుతంగా ప్రతిధ్వనిస్తుంది:

“Most people are other people.
Their thoughts are someone else’s opinions.”
(“వారంతా ఇతరులే. వారి ఆలోచనలన్నీ పరుల అభిప్రాయాల ప్రతిధ్వనులే.
కొద్ది మందియే స్వంత భావాలను కలిగి వుంటారు.”)

అంటే —
మనిషి స్వతంత్రంగా ఆలోచించటానికి భయపడతాడు.
అప్పుడు తనకుతానే బాధ్యత వహించాల్సి వుంటుంది.
అనుకరణలో ఆ జవాబుదారీతనముండదు. 
అందుకే అనుకరణలోని భద్రతను శ్వాసగా తీసుకొంటాడు. 


భగవద్గీత 3-21 ఈ స్థితిని వివరించి చెప్పింది:

యద్యదాచరతి శ్రేష్ఠస్తత్త దేవేతరో జనః
లోకం శ్రేష్ఠులు ఏం చేస్తారో దానినే అనుసరిస్తుంది.”
కానీ మనం శ్రేష్ఠులు అనుకున్నవారి
వాస్తవంగా శ్రేష్ఠులేనా — అది మనం విచారించము.
వారి పేరు, ధనము, సామాజిక స్థితిని చూసి
లోకప్రతిష్టనే ప్రమాణంగా తీసుకొని అంధానుకరణ చేస్తాం. 

ఈ బంధం నుండి బయటపడిన స్థితిని
గీత 3-17 చెప్తుంది —
ఆత్మన్యేవాత్మనా తుష్టః”

తనలోనే తృప్తి, తనలోనే వెలుగు.
ఇతరుల అనుకరణ అవసరం లేని స్థితి.
అక్కడే నిజమైన దర్శనం మొదలు.
అన్నమాచార్యులు ఆలపిస్తున్నది ఇదే.

బ్రహ్మనాటనుండియు పచారించేరు” అనేది
వ్యక్తిగత విమర్శ కాదు —
మనుష్యుల మానసిక చరిత్రపై ఒక దయతో కూడిన గమనిక.

అంతిమంగా ఈ పల్లవి చెబుతున్న సందేశం:
ఇతరుల అభిప్రాయాలతో బ్రతకడం ఆపిన రోజే
మనదైన జీవితం మొదలవుతుంది.
 


మొదటి చరణం:
పొద్దువొడచుటయును పొరిఁ గూఁగుటయె కాని
అద్దుకొని మిగులఁగ నందేమి లేదు
వొద్దికఁ బుట్టుటయును వుడుగఁ జూచుటె కాని
కొద్దితోడఁ గాలమేమి గురియై నిలువదు ॥విచా॥ 
Telugu Phrase
Meaning
పొద్దువొడచుటయును పొరిఁ గూఁగుటయె కాని
పొద్దువొడచుటయును,పొద్దుగూకుటయు చూచుటయే కానీ
అద్దుకొని మిగులఁగ నందేమి లేదు
దానిని ముట్టి (అంటిపెట్టుకొని) ఏమీ మిగులకుండా పోతూనే వుంటుంది.
వొద్దికఁ బుట్టుటయును వుడుగఁ జూచుటె కాని
(వుడుగఁ జూచుటె = విడువక చూచుట) చక్కగా నిరంతరము జీవులు పుట్టుట చూచుటయే కానీ
కొద్దితోడఁ గాలమేమి గురియై నిలువదు
ఈ కొద్దిపాటి జీవిత కాలములో ఏ విధమైన నిర్ణీత సంగతిని తెలుసుకోలేవు.

భావము:

పొద్దువొడచుటయును పొద్దుగూకుటలను చూచుటయే కానీ వానిని ముట్టి (అంటిపెట్టుకొని), విశ్లేషించినను చేతిలో ఏ సారమూ మిగలదు. చక్కగా నిరంతరము జీవులు పుట్టుట చూచుటయే కానీ ఈ కొద్దిపాటి జీవిత కాలములో ఏ విధమైన నిర్ణీత సంగతిని ఇదమిత్థంగా తెలుసుకోలేవు.


గూఢార్థవివరణము: 
అద్దుకొని మిగులఁగ నందేమి లేదు
సూర్యోదయాస్తమయములు కాలంలో జరిగే పునరావృతాలు మాత్రమే.
అవి వాస్తవముగా జరుగుతున్నప్పటికీ
అవి కాలము కలిగించు భ్రమలోని చలనములు మాత్రమే.
కాలంపై ఆధారపడి కాలములోనే వర్తించు మనము
ఏ విషయమును నిర్ధారించలేము.
 
కొద్దితోడఁ గాలమేమి గురియై నిలువదు
అలాగే జీవన్మరణములను ఎంత కాలము గమనించినను,
మానవ జీవిత పరిమాణము
ఏ విధమైన నిష్కర్ష ప్రతిపాదనకు అనువైనది కాదు.
 
సారాంశం
ఈ చరణంలో అన్నమాచార్యులు—
కాలము అనే పరిమితితోనే కాలమును గమనిస్తున్నందున
అది సూచించే “నిజం” మన చేతిలోకి రాదు.
కాలం కల్పించే చలనాలపై ఆధారపడి
నిజాన్ని తెలుసుకోవాలనే భ్రమను విడువాలి.

ఉదయం–అస్తమయం,
జననం–మరణం—
ఇవి అన్నీ
కాలం రచించిన దృశ్యాలు మాత్రమే,
అసలు సత్యాన్ని దాచే తెరలు మాత్రమే.

నిజాన్ని తెలుసుకోవాలంటే
కాల మహిమ నుండి బయటకు రావాలి​.


రెండవ​ చరణం: 
అన్నము భుజించేదియు నాఁకలి గొనేదెకాని
యెన్నికకుఁ జెప్పిచూప నేదియు లేదు
ఇన్నిటఁ దిరిగాడేది ఇంటికి వచ్చేదే కాని
పన్ని తననిలుకడ భావించ లేదు          ॥విచా॥ 
Telugu Phrase
Meaning
అన్నము భుజించేదియు నాఁకలి గొనేదెకాని
ఏదైతే ఆకలి గొన్నదో అదియే అన్నము భుజించును
యెన్నికకుఁ జెప్పిచూప నేదియు లేదు
అయితే (పరి)గణించి చెప్పుటకు అందులో ఏమీ కానరాదు.
ఇన్నిటఁ దిరిగాడేది ఇంటికి వచ్చేదే కాని
అన్ని విషయములలో తిరుగాడునది ఏదైతే ఉన్నదో; తిరిగి దేనినైతే ఇల్లుగా గుర్తించునో అందులోనికి తిరిగి ప్రవేశించును
పన్ని తననిలుకడ భావించ లేదు
అయితే ఆ పరంపరను, ఆ పరిక్రమమును, ఆ వరుసను, ఆ నిలుకడగల (శాశ్వతమైన) స్వభావాన్ని  తానే గమనించలేదు.

సూటి భావము:

ఏదైతే ఆకలి గొన్నదో అదియే అన్నము భుజించును. అయితే (పరి)గణించి చెప్పుటకు అందులో ఏమీ కానరాదు.  అన్ని విషయములలో తిరుగాడునది ఏదైతే ఉన్నదో; తిరిగి దేనినైతే ఇల్లుగా గుర్తించునో అందులోనికి తిరిగి ప్రవేశించును. అయితే ఆ పరంపరను, ఆ పరిక్రమమును, ఆ వరుసను, ఆ నిలుకడగల (శాశ్వతమైన) స్వభావాన్ని  తానే గమనించలేదు. 

నిర్ణీతార్థము:

ఈ చరణంలో అన్నమాచార్యులు మనిషి అనుభవానికి వెనుక ఉన్న అనుభవకర్తను చూపిస్తున్నారు. ఆ కర్త చూపు ఆకలిని, భోజనమును, భుజించుటను చూసినను వానిని ఎరుగము. ఈ జీవితం మొత్తాన్ని అనుభవిస్తున్నది ఏదో ఒకటి ఉంది.  అది ప్రతి అనుభవం తర్వాత తిరిగి తన ఇంటికి చేరుతుంది. ఆ అనుభవమును గుర్తుంచుకొన్నా అనుభవించు దానిని ఎఱుగము. ఆ అనుభవాల శ్రేణిని,  శ్రేఢిని నిరంతరము అనగా ఎడతెరిపి లేకుండా పొందు దానిని తెలియలేకున్నాము.


గూఢార్థవివరణము: 
​“పన్ని తననిలుకడ భావించ లేదు”

ఇక్కడ అన్నమాచార్యులు 
ఏదైతే శాశ్వతమును గ్రహించగలదో దాని భావమును తెలుపుతున్నారు. 
కాబట్టి కేవలం మాటలలో వ్యక్తపరిచినది కాదు. 
అది నిజమైన వస్తువు. 
దానికి సమయంతో సంబంధం లేదు. 
తక్కినవన్ని సమయంతో సమయించును.
 
సూక్ష్మమైన, అసలు జ్ఞానానికి దారితీసే స్థానాన్ని చూపుతున్నారు.
అది, ఆ ఇల్లు మనలోనే ఉంది.
మన దృష్టి దాని మీద పడదు.
ఎందుకంటే మన దృష్టి మొత్తం
చలనాల మీద ఉంటుంది —
ఆహారం, రుచి, భావం, ప్రయాణం, అనుభవం.
చలనానికే ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు
నిలకడను కనబడనీయదు.

బల్ల మీది కళ్ళుతో అను సంధానము

 

ఇది ఎలా వుంటుందంటే, క్రింది బొమ్మలా!
రెమెడియోస్ వారో అను చిత్రకారిణి
"బల్ల మీది కళ్ళు" (‘eyes on the table’ 1938 by Remedios Varo)
బొమ్మను పరీక్షగా చూడండి.

గాలిలో తేలియాడుతున్న ఒక చదును బల్ల​.
దానిపై ఒక పాత కాలపు కళ్లజోడు.
విచిత్రంగా దానికి కనురెప్పలు.
కళ్ళేమో దూరంగా ఆ కళ్లజోడు వైపు చూస్తున్నట్లున్నాయి.
తేలియాడుతున్న బల్ల  మన మనస్సు వంటిది.
తేలియాడడం అంటే స్థిరం లేదన్నమాట​.
  స్థిరం లేని మనసుతో అది ఎంత కష్టమైనా కూడా
దృష్టి వెలుపలకు కాదు, లోపలికి చూడమని అర్ధం.
తదేక దీక్షతో తనలోకి తాను నిష్పక్షంగా చూడడం అత్యంత కఠినము.

 సమయము మోసపుచ్చు ఆవరణ 

పైన పేర్కొన్న అంతఃచలనమంతా
కాలగతిలో జరుగుతున్నది.
అనుభవములన్నీ సమయము ఆవరణలోనివి.
కానీ
సమయానికి అతీతమైనది —
మనసు చూసే మూలస్థితి
అది మనిషికి కనిపించదు.
 
టిక్–విరామము–టిక్, రెండు టిక్'ల మధ్య నున్న ఖాళీ
(అది గోడ గడియారమో, అటామిక్  గడియారమో ఏదైనా కానివ్వండి)
సావధానత – అనవధానత (in-attention) - సావధానత
సావధానతల మధ్య నున్న అనవధానత (in-attention) వంటిది.
(మనము ఏదైనా విషయముపై శద్ధ పెట్టదలచుకున్నప్పుడు 
అనవధానత నుండి సావధానతకు వస్తాము. 
అంతేకాని నిరంతరముగా సావధానతలో వుండము) 
ఆ రెండు టిక్'ల మధ్య నున్న ఖాళీని,
 అనవధానతను మనము గుర్తించలేము.
మధ్యనున్న ఆ అసలు నిశ్శబ్దపు రేఖ,
అదే నిజంగా “మన ఇల్లు”.

క్రియాశీలత - నిశ్శబ్దపు రేఖ 

ఇప్పుడు ఆ అసలు నిశ్శబ్దపు రేఖను తెలుసుకునే  ప్రయత్నం చేద్దాం.
అది గమనించగల పరిధిలో లేదు కాబట్టి చేయగలది  ప్రయత్నమే.
అన్నమాచార్యులు చెప్పిన దాని బట్టి
తెలుసును అన్నది తెలియదని మనకు విశదము

అయితే, ఇది ఇప్పటి వరకు చెప్పినంత సులభం కాదు.
తెలుసును అన్నది క్రియాశీలతలో వున్నంత వరకు
రెండవది గ్రహింపునకు రాదు.

క్రియాశీల ఆవరణను చడిచప్పుడు లేకుండా
చేయు యత్నములన్నీ అసహజములు.
అది గ్రహించి  'ప్రయత్నము' 'అప్రయత్నము'లు
ఎంత బలముగా తమ తమ వైపు ఈడ్చుచున్నను
మిన్నకుండుటయే నిశ్చల బుద్ధి.

అదియే
అకర్తారం స పశ్యతి
= నిశ్చల బుద్ధియే ద్రష్ట
(భగవద్గీత 13-30)

మూడవ​ ​ చరణం:
జవ్వనము మోఁచేదియు సరి ముదుసేదే కాని
తవ్వి కట్టుకొనే దేది దాఁచే దేది
నవ్వుతా నలమేల్మంగనాయక శ్రీవేంకటేశ
రవ్వల నీ వేలికవు రక్షించు మిఁకను          ॥విచా॥ 
Telugu Phrase
Meaning
జవ్వనము మోఁచేదియు సరి ముదుసేదే కాని
యవ్వనమును, ముసలితనమును మ్రోయునదొకటే కానీ
తవ్వి కట్టుకొనే దేది దాఁచే దేది
వానిని త్రవ్వి నీవు చేయగలిగినదేమి? పైగా ఆ "దాచేది"ఏమి?
నవ్వుతా నలమేల్మంగనాయక శ్రీవేంకటేశ
నవ్వుతావేమయ్యా! అలమేల్మంగనాయక శ్రీవేంకటేశ!
రవ్వల నీ వేలికవు రక్షించు మిఁకను
ఈ చీలికల పేలికల వంటి మాకు నీవే ఇకపై రక్ష​.

 సూటి భావము:

మానవులారా! యవ్వనమును, ముసలితనమును మ్రోయునదొకటే కానీ వానిని త్రవ్వి నీవు చేయగలిగిన దేమి? పైగా ఆ "దాచేది"ఏమి? నవ్వుతావేమయ్యా! అలమేల్మంగనాయక శ్రీవేంకటేశ! ఈ చీలికల పేలికల వంటి మాకు నీవే ఇకపై రక్ష​.  


గూఢార్థవివరణము: 
జవ్వనము మోఁచేదియు సరి ముదుసేదే కాని”
మనం బయట చూస్తున్న
యవ్వనమో, ముసలితనమో అసలు శరీరాన్ని తెలియజేయవు.
వయస్సు అనేది ఒక ఉపరితల సూచన మాత్రమే;
అది శరీరపు సత్యాన్ని తెలుపదు.
 
ఈ భావం వెంటనే లోతైన ప్రశ్నగా మారుతుంది:
తవ్వి కట్టుకొనే దేది?”
ఈ శరీరాన్ని పరిశీలించినా మనకు ఎటువంటి శాశ్వత సత్యం కనబడదు.
ఎందుకంటే శాశ్వతం అనేది పదార్థరూపంలో ఉండేది కాదు.
గీత 13-13 లో చెప్పినట్టు —
భూతప్రకృతి పర్యంతాన్ని దాటి,
సత్త్వాసత్త్వాలకు అతీతంగా ఉన్నది”.

అంతకంటే తీవ్రమైన ప్రశ్నను అన్నమయ్య సంధిస్తాడు:
దాఁచే దేది?”
ఆ శాశ్వత సత్యాన్ని దాచేది ఏమిటి?
అది సత్యం కాదు, మన అజ్ఞానం.
గీత 5-15 లో చెప్పినట్లుగా:
అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః 
జ్ఞానం అజ్ఞానంతో కప్పబడినందున జీవులు మోహించిపోతారు.

 

రవ్వల నీ వేలికవు”.
అప్పుడు వస్తుంది అసలు విషయం:
అన్నమయ్య  తునకలైన మానవుని సంగ్రహణ శక్తిని సూచిస్తున్నట్టుంది.
మన అంతరంగము —
కొంత మంచి, కొంత చెడు, కొంత చతురత, కొంత భక్తి, కొంత తిరుగుబాటు —
ఇలా, అనేక రకాలుగా విభజించబడిపోయి ఉంటుంది.
ఈ తునకలే శాశ్వతమైన దానికి దృశ్యమునకు మధ్యలో అడ్డు తగులును. 
వాతావరణంలోని మాలిన్యములు సూర్యకాంతిని పరావర్తనము చెందించినట్లు 
పాక్షికమైన దానినే మనము గ్రహించుదుము.

 

పచారించేరు బ్రదుకు బ్రహ్మనాటనుండియు
అదికాక, మనం “తెలిసిన దానిలోని నిశ్చితత్వం పైన మక్కువ ఎక్కువ​. 
దానిని విడవలేకపోవడం వల్ల, నిజమైన అవగాహన లోటుగా మారుతుంది.
తెలిసినది సురక్షితం, తెలియనిది భయం —
ఈ మానసిక ప్రవాహం ‘దాఁచే దేది’కి మూలం.

 

విచార మెన్నఁడు లేదు వీరిడి జీవులకును
మానవ శరీరమూ, మనోవ్యవస్థా అద్భుతమైనవే కాక అత్యంత సంక్లిష్టమైనవి.
ఇప్పటి స్థితిలో అవి అనేక విభిన్న అస్తిత్వాల కూటమి అనిపించును.
దేహము ఒకే సత్యమునకు నిచ్చెన వంటిది.
ఆ కూటమిని ఏక త్రాటిపై తెచ్చునదే ధ్యానము.
మన పరిశీలనలు అన్నీ — స్మృతి స్పందనల ఆధారంగా జరుగుతాయి.
కానీ, మనసు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, ఆ స్పందనల వ్యర్థత తెలుస్తుంది;
అప్పుడది స్పందించదు, ప్రతిస్పందించదు.
అప్పుడు మాత్రమే —
ప్రపంచం ఒకే చైతన్యరూపంలో ఉన్నదనే ఏకత్వం
మన గ్రహణలోకి వస్తుంది.
మనసు మౌనమయ్యే వరకు అది కానరాదు.

ఈ కీర్తన ముఖ్య సందేశం 

విచారణ లేక జీవనసారాన్ని గ్రహించలేము


X-X-The END-X-X

1 comment:

  1. యద్యదాచరతి శ్రేష్ఠ..అనగా విత్తమార్జించేవారిని గురించి కాదు కదా! వారు శ్రెష్ఠులెలా అవుతారు!! కృష్ణుడు అలా ఎలా చెబుతాడు. ఈ ఒక్క విషయం నేను మీతో ఏకీభవించలేను.

    ReplyDelete

285 ēlokō karmamā yiṃdukuṃ̐ bālaitini (ఏలొకో కర్మమా యిందుకుఁ బాలైతిని)

                      TALLAPAKA ANNAMACHARYULU 285 ఏలొకో కర్మమా యిందుకుఁ బాలైతిని ( ē lok ō karmam ā yi ṃ duku ṃ̐ b ā laitin)   I...