తాళ్లపాక అన్నమాచార్యులు
280 ఎంత చదివి చూచిన నీతఁడే ఘనము గాక
For English version press here
ఉపోద్ఘాతము
|
అధ్యాత్మ కీర్తన
|
|
రేకు: 117-2
సంపుటము: 2-98
|
|
ఎంత చదివి చూచిన నీతఁడే ఘనము గాక యింతయు నేలేటి దైవ మిఁక వేరే కలరా ॥పల్లవి॥ మొదల జగములకు మూలమైనవాఁడు తుదఁ బ్రళయమునాఁడు తోఁచేవాఁడు కదిసి నడుమ నిండి కలిగివుండెడివాఁడు మదనగురుఁడే కాక మఱి వేరే కలరా ॥ఎంత॥ పరమాణువైనవాఁడు బ్రహ్మాండమైనవాఁడు సురలకు నరులకుఁ జోటయినవాఁడు పరమైనవాఁడు ప్రపంచమైనవాఁడు హరి యొక్కఁడే కాక అవ్వలనుఁ గలరా ॥ఎంత॥ పుట్టుగులయినవాఁడు భోగమోక్షాలైనవాఁడు యెట్టనెదుర లోనను యిన్నిటివాఁడు గట్టిగా శ్రీవేంకటాద్రి కమలాదేవితోడి- పట్టపుదేవుఁడే కాక పరు లిఁకఁ గలరా ॥ఎంత॥
|
Details
and Explanations:
|
Telugu Phrase
|
Meaning
|
|
ఎంత చదివి
చూచిన నీతఁడే ఘనము గాక
|
ఎంతగా
చదివినా, చూసినా, అనుభవించినా
— ఈ ఒక్కడే పరమోన్నతుడు.
|
|
యింతయు
నేలేటి దైవ మిఁక వేరే కలరా
|
ఈ జగత్తునంతటిని ఏలేటి దైవం వేరెవరు?
|
సూటి భావము:
ఎంత లోతుగా
అధ్యయనం చేసినా, అన్వేషించినా — ఈ ఒక్కడే సత్యము. ఈ
విశ్వాన్ని పాలించేవాడు, నిలిపేవాడు, వ్యాపించేవాడు
ఇతనికన్నా వేరెవరు?
గూఢార్థవివరణము:
ఎంత
చదివి చూచిన నీతఁడే ఘనము గాక
“ఎంత చదివి చూచిన నీతఁడే ఘనము గాక, యింతయు నేలేటి దైవమిఁక వేరే కలరా” — ఇది పోలిక కాదు, దర్శనం నుండి ఉద్భవించిన ప్రకటన. కాలం, అవగాహన, వ్యక్తిత్వ పరిమితులను అధిగమించిన స్థితిలో అన్నమాచార్యుడు చూచిన సత్యం ఈ వాక్యముగా రూపుదిద్దుకుంది. ఇక్కడ “ఘనము” అన్నది పోలిక కాదు; దర్శన వచనం — తన మనస్సు భగవంతుని మనస్సుతో ఏకీకృతమై ఉన్న స్థితిలో అన్నమాచార్యుడు పలికినది.
ఇక్కడ చదువుతో “చదివి తెలుసుకొనుట”, “పరిశోధించుట”, “పరిశీలించుట” అన్నవి సూచించారు. ‘ఎంత చదివి చూచిన’ అనే వాక్యం ఆ చదువు, అన్వేషణ, తెలుసుకోవడమనే ప్రయత్నాల మితులను తెలియజేస్తుంది. మనము ఆ మితికి ఇటు పక్క ఉంటాం. అన్నమాచార్యులవారు ఆ మితులన్నీ దాటుకొని ఆవలి వైపు నిలిచి మాట్లాడుతున్నారు మన జ్ఞానము స్పృహ స్థితిలో విస్తరించినది. ఎంత వ్యాపించినా, ఇంకా విస్తృత మగుటకు ఆస్కారమును సూచించుచున్నది. అలా చూస్తే దానికి పరిమితి కనబడదు. ఆ పరిమితిని దాటినదాన్ని ఈ “చూచిన” అన్న మాటలో నిక్షిప్తం చేశారు. ఆ దృష్టిలో “నేను” అనే భావం లేనప్పుడు “తెలుసుట” అన్నది సాక్షాత్కారముగా మారుతుంది.
అన్నమాచార్యుని దృష్టిలో పరమాత్మ విశ్వము నుండి వేరైన వాడు కాదు — అదే విశ్వముగా, దానిలో వ్యాపించి ఉన్న సూత్రముగా ఆయన ఉన్నాడు. కాబట్టి “యింతయు నేలేటి దైవమిఁక వేరే కలరా?” అన్నది ప్రశ్న కాదు— ఈ జగత్తును నడిపించేది, నిలిపేది, లయమొందించేది ఇతడే. వేరొకరు లేరనే తీర్మానము.
ఈ పల్లవి భక్తికి, తత్త్వానికి, జ్ఞానానికి, మౌనానికి ఒకేసారి దారి చూపుతుంది. ఎవరు ఏ స్థితిలో నుండి విన్నా, ఆ వాక్యమే వారివారికి వేరువేరు గమనములు స్పురింపజేస్తుంది. పండితునికి బోధ; భక్తునికి ధ్యానం; యోగికి మౌనం. అన్నమాచార్యుల ఈ పల్లవి అంత విస్తారమైనది.
|
Telugu Phrase
|
Meaning
|
|
మొదల జగములకు మూలమైనవాఁడు
|
అనాదిగా
జగములకు మూలమైనవాఁడు.
|
|
తుదఁ బ్రళయమునాఁడు తోఁచేవాఁడు
|
చివరికి
ప్రళయము ముంచుకొస్తుంటే తలచదగినవాడు.
|
|
కదిసి నడుమ నిండి కలిగివుండెడివాఁడు
|
దగ్గర వుండి మధ్య దశ అంతా తానై నడుపువాడు అతడే.
|
|
మదనగురుఁడే
కాక మఱి వేరే కలరా
|
మదనగురుఁడే
కాక మఱి వేరే కలరా
|
భావము:
"ఆయనే
సృష్టికి మూలం. చివరికి ప్రళయము ముంచుకొస్తుంటే తలచదగినవాడు కూడా. ఆ రెండింటి మధ్య, ఆయనే అంతటా నిండి విస్తరించి ఉన్నాడు. ఈ నిరంతర పునరుద్ధరణ (పునరావృత్త) చక్రాలన్నింటికీ
మదనగురువు (కోరికలకు ప్రభువు) కారణమై ఉంటాడు. కాక మరెవరు? (ఎవరూ
లేరు)."
గూఢార్థవివరణము:
ఇక్కడ అన్నమాచార్యులు మార్పులేని, స్థిరమైన సత్యాన్ని చిత్రిస్తున్నారు — అదే ఆది, అదే అంతం, అదే మధ్యలో వ్యాప్తి చెందిన సత్త్వం. సృష్టి, స్థితి, లయం — ఇవి వేర్వేరు సంఘటనలు కావు; ఒకటే తత్వం అనూహ్యంగా వివిధ తరంగములలో వ్యక్తమవుతున్నదంతే.
“మదనగురుడు” అనేది ఇక్కడ కామరూపమైన కోరికను సూచించదు — సృష్టిని కదిలించే ఆ మూలప్రేరణను సూచిస్తుంది, జీవం తనను తాను వ్యక్తపరచుకోవాలనే ఆదిమోక్షాన్ని. జీవనచక్రములో పుట్టుక, మరణములు వేర్వేరు కావు; అవి ఒకే సత్యసముద్రంలో ఉద్భవించి లయమయ్యే తరంగములు మాత్రమే.
సమస్త
విశ్వవ్యాప్త కదలికల మధ్య ఆ స్థితప్రజ్ఞ స్తబ్ధత నిత్యము — కనబడకపోయినా, అన్నిటినీ నిలిపే మూలబలం అదే. అదే సృష్టికి హృదయస్పందన, ఆది అంతములకు సాక్షిగా నిలిచిన చైతన్యం. అందుకే అన్నమాచార్యుడు నిశ్చయంగా
అంటారు — ఇతడే ఆ పరమసత్యము, ఇతడు తప్ప మరొకడు లేడు.
రెండవ చరణం:
|
Telugu Phrase
|
Meaning
|
|
పరమాణువైనవాఁడు
బ్రహ్మాండమైనవాఁడు
|
అణువు అంత సూక్ష్మములోను, బ్రహ్మాండము అంత విస్తారములోను ఒకే తత్వము వ్యాపించి ఉంది.
|
|
సురలకు నరులకుఁ జోటయినవాఁడు
|
అంటే సురలకు నరులకుఁ నివసించు స్థలము ఒకటియే
|
|
పరమైనవాఁడు
ప్రపంచమైనవాఁడు
|
మహాత్ములకు పరము గాను, మనకు ప్రపంచముగాను కనబడుతున్నది ఒకటియే.
|
|
హరి యొక్కఁడే
కాక అవ్వలనుఁ గలరా
|
కావున హరి యొక్కఁడే కాక అవ్వలనుఁ వేరొకరు గలరా? (లేరు)
|
సూటి భావము:
పరము, ప్రపంచము అతడే. మహాత్ములకు పరము గాను, మనకు
ప్రపంచముగాను కనబడుతున్నది ఒకటియే. అంటే సురలకు నరులకుఁ నివసించు స్థలము ఒకటియే. అదే
పరమాణువు నుండి బ్రహ్మాండమంతా వ్యాపించి ఉంది. వీనిని దాటి ఆవల వుండుటకు మరి ఏ
జీవికి తావు లేదు. కావున హరి యొక్కఁడే కాక అవ్వలనుఁ వేరొకరు గలరా? (లేరు)
గూఢార్థవివరణము:
ఈ చరణములో అన్నమాచార్యుడు సత్యస్వరూపుని అద్భుతమైన ఏకత్వముగా చూపించారు. అణువు అంత సూక్ష్మములోను, బ్రహ్మాండము అంత విస్తారములోను ఒకే తత్వము వ్యాపించి ఉంది. పరము, ప్రపంచము — ఇవి భిన్నమైన లోకాలు కావు. సురులకు, నరులకు వేరువేరు లోకములు లేవు. ఆ తత్వము అన్ని రూపాలనూ, స్థితులనూ తన యందే ధరించింది.
మన దృష్టిని భ్రమలు కమ్మినప్పుడు మాత్రమే తారతమ్యములు కనబడతాయి — పవిత్రము, అపవిత్రము; దేవలోకం, భూమిలోకం; నేను, నీవు. ఈ భేదములన్ని ఆలోచన, భయము, ఆశల మొదళ్ల నుండే పుట్టినవి.
ఆ మాయా
తెర తొలిగినపుడు అంతా ఒకటిగా కనిపిస్తుంది — అణువుగా ఉన్నదీ, విశ్వముగా విస్తరించినదీ అదే హరియే. ఆ తత్వమునకు ప్రత్యామ్నాయమైనదేమీ లేదని
అన్నమాచార్యుని ద్వారా ప్రకటించబడినది.
|
Telugu Phrase
|
Meaning
|
|
పుట్టుగులయినవాఁడు భోగమోక్షాలైనవాఁడు
|
ఆయనే సమస్త జన్మలకు, జీవులకు మూలము, లౌకిక భోగాలను అనుభవించేవాడు,
మరియు మోక్షాన్ని అనుగ్రహించేవాడు కూడా.
|
|
యెట్టనెదుర లోనను యిన్నిటివాఁడు
|
మన కళ్లముందు ఉన్నది, మన హృదయంలో ఉన్నది, ప్రతి అణువులో నిండి ఉన్నది ఆయనే.
|
|
గట్టిగా శ్రీవేంకటాద్రి కమలాదేవితోడి-
|
శ్రీవేంకటేశ్వరుడే లక్ష్మీదేవితో సహా ఈ వేంకటగిరి పర్వతంపై స్థిరంగా
వెలిసిన
|
|
పట్టపుదేవుఁడే కాక పరు లిఁకఁ గలరా
|
ఏకైక అధిపతి. నిశ్చయంగా, ఆయనను మించినది మరొకటి లేదు.
|
సూటి భావము:
ఆయనే సమస్త
జన్మలకు, జీవులకు మూలము, లౌకిక భోగాలను
అనుభవించేవాడు, మరియు మోక్షాన్ని అనుగ్రహించేవాడు కూడా. మన కళ్లముందు
ఉన్నది, మన హృదయంలో ఉన్నది, ప్రతి అణువులో
నిండి ఉన్నది ఆయనే. శ్రీవేంకటేశ్వరుడే లక్ష్మీదేవితో
సహా ఈ వేంకటగిరి పర్వతంపై స్థిరంగా వెలిసిన ఏకైక అధిపతి. నిశ్చయంగా, ఆయనను మించినది మరొకటి లేదు.
గూఢార్థవివరణము:
ఆ క్షణమున అన్నమాచార్యుడు తాను ఎవరో మరచిపోయాడు. తన హృదయం దైవహృదయముతో ఏకమైంది. తన చుట్టూ కనబడిన సమస్త ప్రాణుల మూలమూ అదే అని తెలిసింది — భోగానికీ మూలం ఆయనే, మోక్షానికీ మూలం ఆయనే. భోగి, యోగి రెండూ ఒకటే సత్యం లోనివే.
తన ముందు కనిపించేది, తనలో ఉండు స్ఫురణ — రెండూ భిన్నముకావు. దైవం, జగత్తు, తాను అన్న విభజన అంతరించిపోయింది. చూచుట అనుభవమయింది; అనుభవం సాక్షాత్కారమైంది.ఆ దృష్టిలో ఒక్కరే ఉన్నారు — చూచువాడు, చూచునది, చూచినది ఏకమై పోయాయి— ఇవన్నీ ఒకే అవగాహనలో లీనమయ్యాయి.
ఆ మౌనప్రకాశంలో సమస్తం
చైతన్యమయమై మెరుస్తోంది. అంతా ఆయనే, ఆయనే అంతా. ఆ స్థితిలో “ఇతరులు”
అన్న భావనే లేదు. ఇదే మనుష్యునికి లభించగల అత్యున్నత సాక్షాత్కారం. అదే పరమార్థం.
X-X-The
END-X-X
చాలా సరళంగా ఉన్నా కీర్తనలో లోతైన భావము ఉన్నది. దాన్ని మరింత తేటతెల్లము చేస్తూ చక్కగా వివరించారు. మదనగురుడు..అర్థాన్ని బాగా వివరించారు మీరు. అభినందనలండీ.
ReplyDelete