Monday, 1 September 2025

T-258 ఏకతాన వున్నవాఁడు యిదివో వీఁడె

                                             తాళ్ళపాక అన్నమాచార్యులు

258 ఏకతాన వున్నవాఁడు యిదివో వీఁడె 

For English version press here 

ఉపోద్ఘాతము 

అన్నమాచార్యులు తాదాత్మ్య స్థితిలో ఉండగా, అకస్మాత్తుగా అంతరంగ వీక్షణలో ప్రత్యక్షమైన సందేశానికి సాక్ష్యం ఈ కీర్తన. 

జిడ్డు కృష్ణమూర్తి తరచుగా ఆకస్మికముగా తాను లాక్కెళ్లబడిన లోతైన అనుభవాలను ఇతరత్వం (పరస్థితి),” “విశాలత్వం — హద్దులులేని తనము,” లేదా తీవ్రత” అని పేర్కొన్నారు. ఇవి నిరంతర ధ్యాన స్థితులు కావు — క్షణికమైనవి, కానీ అపారమైన ప్రాణంతో నిండినవి, అద్భుతమైన నిశ్చలతతో ఉప్పొంగినవి. 

అటువంటి “ఇతరత్వం”లోకి అన్నమాచార్యులు ప్రవేశించినప్పుడు వెలిసిన సాక్ష్యం ఈ కీర్తన. ఇది ఒక సంకల్పితమైన సాధారణ వాక్యం కాదు, కవిత్వమూ కాదు. ఒక ఆకస్మిక కుదుపుతో వేరే (లోక) స్థితిలోకి ప్రవేశించినట్లు— అందులో అన్నమాచార్యులు లీనమై, తాము చూచిన దాన్ని ఆ క్షణంలో స్వయంగా వెలికితీసిన సాక్ష్యం మాత్రమే. 

అధ్యాత్మ సంకీర్తన
శ్రీరంగం రేకు: 98-6 సంపుటము: 20-392
ఏకతాన వున్నవాఁడు యిదివో వీఁడె
చేకొని మొక్కరో మీరు చేతులెత్తి యిపుడు ॥ఏకతాన॥
 
మంచిమంచి పన్నీట మజ్జన మవధరించి
పంచమహావాద్యాలతో పరమాత్ముఁడు
అంచలఁ గప్పురకాపు అంగముల మెత్తికొని
కొంచక నిలుచున్నాఁడు గోణాముతోడను ॥ఏకతాన॥
 
తట్టుపుణుఁ గామీఁద దట్టముగ నించుకొని
తెట్టెలై వేదనాదాల దేవదేవుఁడు
గుట్టుతోడ సొమ్ములెల్లా(ఁ?) గుచ్చికుచ్చి కట్టుకొని
వెట్టదీర సురట్ల విసరించుకొంటాను          ॥ఏకతాన॥
 
తనిసి యలమేల్మంగఁ దాళిఁగా గట్టుకొనె
వెనుకొని యిదివో శ్రీవేంకటేశుఁడు
మునుకొని యారగించి మూఁడులోకములు మెచ్చ
చనవరి సతులలో సరసమాడుతాను ॥ఏకతాన॥

Details and Explanations:

ఏకతాన వున్నవాఁడు యిదివో వీఁడె
చేకొని మొక్కరో మీరు చేతులెత్తి యిపుడు ॥ఏకతాన॥ 
Telugu Phrase
Meaning
ఏకతాన వున్నవాఁడు యిదివో వీఁడె
తనంతట తానే వున్నవాడు ఇదిగో ఆయనే
చేకొని మొక్కరో మీరు చేతులెత్తి యిపుడు
ఆయనను మీవానిగా స్వీకరించి చేతులెత్తి నమస్కరించండి.

సూటి భావము:

ఇదిగో ఆయనే — తనంతట తానుగా నిలబడు ఏకాత్ముడైన పరమాత్ముడు.
ఇప్పుడే మీరు చేతులెత్తి ఆయనను నమస్కరించండి.

గూఢార్థవివరణము:

ఏకతాన అనగా ఏకాగ్ర చిత్తము కలవాడు. అనన్యచిత్తుడు. ఏకతాన వున్నవాడొక్కడే. భగవంతుడు. 

క్రితము వివరించిన కీర్తనలలోని క్రింది చరణమును చూడండి.

ఏకాంతసౌఖ్యంబు లెక్కడివి ప్రాణులకు
పైకొన్నదుఃఖముల పాలుపడెఁ గాక

మానవులు తమ పాటున తాముండలేరని, వారు ఏకాకిగా వున్నా గతస్మృతుల జ్ఞాపకాలు తమను వేగిరపరుస్తూ దుఃఖమును కలిగించును. మనలాంటి సామాన్యులు మనకు మనముగా వుండలేము. మానవులకు దాదాపు అసాధ్యమైన స్థితిన వున్న భగవంతునికి చేతులెత్తి నమస్కరించండి.

 


మొదటి చరణం:

మంచిమంచి పన్నీట మజ్జన మవధరించి
పంచమహావాద్యాలతో పరమాత్ముఁడు
అంచలఁ గప్పురకాపు అంగముల మెత్తికొని
కొంచక నిలుచున్నాఁడు గోణాముతోడను ॥ఏకతాన॥ 
Telugu Phrase
Meaning in Telugu
మంచిమంచి పన్నీట మజ్జన మవధరించి
స్వచ్ఛమైన పన్నీటిలో స్నానము చేసినాడు
పంచమహావాద్యాలతో పరమాత్ముఁడు
1. భేరి, 2. కాహళము (బాకా ఊదెడు కొమ్ము) 3. పటహము (తప్పెట), 4. శంఖము, 5. జయఘంట (జేగంట).
పంచమహావాద్యాలతో పరమాత్ముఁడు
అంచలఁ గప్పురకాపు అంగముల మెత్తికొని
అంచలంచెలుగా కర్పూరంలా కరగి మాయమయ్యే అంగములతో
కొంచక నిలుచున్నాఁడు గోణాముతోడను
సందేహము లేకుండా నిలబడివున్నాడు గోచీ కట్టుకొని

Literal Meaning:

పరమాత్ముని స్వరూపాన్ని తానుచూసినది చూసినట్లుగా వర్ణిస్తున్నారు ఆచార్యులు: స్వచ్ఛమైన పన్నీటిలో స్నానము చేసిపంచమహావాద్యాలు తోడురాగా పరమాత్ముఁడు; అంచలంచెలుగా కర్పూరంలా కరిగి మాయమయ్యే అంగములతో; సందేహము లేకుండా (మన కళ్ళెదురుగా) నిలబడివున్నాడు గోచీ కట్టుకొని - ఎటువంటి వస్త్రములు ఆభరణములు ధరించకుండా.


రెండవ​ చరణం:

తట్టుపుణుఁ గామీఁద దట్టముగ నించుకొని
తెట్టెలై వేదనాదాల దేవదేవుఁడు
గుట్టుతోడ సొమ్ములెల్లా గుచ్చికుచ్చి కట్టుకొని
వెట్టదీర సురట్ల విసరించుకొంటాను        ॥ఏకతాన॥ 
Telugu Phrase
Meaning in Telugu
తట్టుపుణుఁ గామీఁద దట్టముగ నించుకొని
తట్టుపుణుఁ = ఉత్తమ గంధద్రవ్య విశేషము
ఉత్తమ గంధద్రవ్య విశేషములను మేనంతా దట్టముగ పులుముకొని
తెట్టెలై వేదనాదాల దేవదేవుఁడు
తెట్టెలై  = మీగడలవంటి
వేదనాదాలు ఆయనను మీగడలాగా తేనెలాగా చుట్టుకోగా
గుట్టుతోడ సొమ్ములెల్లా గుచ్చికుచ్చి కట్టుకొని
తన అసలు స్వరూపము తెలియకుండా రకరకముల ఆభరణములు శరీరమంతా ధరించి
వెట్టదీర సురట్ల విసరించుకొంటాను
తనవితీరా సురలచేత చల్లని గాలి  విసరించుకొంటాను

సూటి భావము:

ఆ దేవదేవుడు ఉత్తమ గంధద్రవ్య విశేషములను మేనంతా దట్టముగ పులుముకొని; వేదనాదాలు ఆయనను మీగడలాగా తేనెలాగా చుట్టుకోగా; తన అసలు స్వరూపము తెలియకుండా రకరకముల ఆభరణములు శరీరమంతా ధరించి; తనవితీరా సురలచేత చల్లని గాలి  విసరించుకొంటా  నిల్చొనె


మూడవ​ ​ చరణం:

తనిసి యలమేల్మంగఁ దాళిఁగా గట్టుకొనె
వెనుకొని యిదివో శ్రీవేంకటేశుఁడు
మునుకొని యారగించి మూఁడులోకములు మెచ్చ
చనవరి సతులలో సరసమాడుతాను ॥ఏకతాన॥ 
Telugu Phrase
Meaning in English
తనిసి యలమేల్మంగఁ దాళిఁగా గట్టుకొనె
అలమేలు మంగను తాళిగా (ఒక గుర్తుగా) కట్టుకొనె
వెనుకొని యిదివో శ్రీవేంకటేశుఁడు
ఆమెను వెంబడించి  (ఆమెకు వెనుక వెనుకగా) వున్నాడు ఇదిగో శ్రీవేంకటేశుఁడు
మునుకొని యారగించి మూఁడులోకములు మెచ్చ
ముందునకు పోవు (భవిష్యత్తునకు గాను) భోజనమారగించి మూఁడులోకములు మెచ్చునట్లు
చనవరి సతులలో సరసమాడుతాను
సకల హితుడు సతులతో (దివ్యత్వము సాధించిన మునులతో) సరసములాడెను

సూటి భావము:

అలమేలు మంగను తాళిగా (ఒక గుర్తుగా) కట్టుకొనె అనగా ఒకానొక భక్తునిని భార్యగా చేపట్టి అనగా ఆమె రూపము వెనుక తానుండె ఇదిగో శ్రీవేంకటేశుఁడు. ముందునకు పోవు (భవిష్యత్తునకు గాను) భోజనమారగించి మూఁడులోకములు మెచ్చునట్లు సకల హితుడు సతులతో (దివ్యత్వము సాధించిన మునులతో) సరసములాడెను..

గూఢార్థవివరణము:

దైవమునకు రూపముండదని, భక్తునికే ఆ అలమేలుమంగ స్థానము కల్పించి ఆమె వెనుక తానుండును  శ్రీవేంకటేశుఁడు. భగవద్గీతలో చెప్పినట్లుగా ఆ భక్తుడు భగవంతుని చేతిలో పనిముట్టై (నిమిత్తమాత్రడై) పావనుడగును.


భగవద్గీతతో అనుసంధానము

తస్మాత్ త్వముత్తిష్ఠ యశో లభస్వ
జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధమ్
మయైవైతే నిహతాః పూర్వమేవ
నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ ॥ 11-33

కాబట్టి, ఓ సవ్యసాచీ! (రెండు చేతులతో కూడా సమ రీతిలో బాణములను సంధించగలవాడవైనా నిన్ను నీవు) కేవలం భగవంతుని పనిలో ఒక పనిముట్టుగా తలచి, (నీ) శతృవులు ఇంతకు పూర్వమే నాచే సంహరింపబడి ఉన్నారని భావించి, లెమ్ము (యుద్ధం చేయుటకు విల్లును పట్టుకో), కీర్తిని పొందుము! శత్రువులను జయించుము మరియు సర్వసంపదలతో ఉన్న సామ్రాజ్యమును అనుభవించుము.


ఈ కీర్తన ముఖ్య సందేశం

రూపము, లక్షణము లేక గుర్తించుటకు అసాధ్యమగు పరమాత్మను
మనసులో తలచి అంతరంగములో ఆవిష్కరించుము.

X-X-The END-X-X


No comments:

Post a Comment

T-263 వెరవకువే యింత వెరగేలా నీకు

  తాళ్ళపాక అన్నమాచార్యులు 263 వెరవకువే యింత వెరగేలా నీకు For English version press here   ఉపోద్ఘాతము   అన్నమాచార్యుల పదాలు హ్యారీ పా...