Friday, 5 September 2025

T-260 వేదవట్టి యిఁక నేమి వెదకేరు చదివేరు

 తాళ్ళపాక అన్నమాచార్యులు

260 వేదవట్టి యిఁక నేమి వెదకేరు చదివేరు 

For English version press here 

ఉపోద్ఘాతము 

అన్నమాచార్యులు కీర్తనలు కేవలం స్తోత్రాలుగా రాయలేదు. ఆయన సత్యాన్వేషణలో ఒక అగ్రగామిగా, ధర్మయోధునిగా అవతరించారు. ఆయన మాటలు అలంకారప్రాయములు కావు — అవి నేరుగా, రాజీ లేకుండా హృదయాన్ని తాకుతాయి. చిక్కు ప్రశ్నలతో ఆయన నిలదీయగలరు. విష్ణుని నెఱఁగరా?” అయితే “అవును” లేదా “కాదు”  అన్న జవాబులు రెండూ తెలుసుకోగలిగిన (నేర్వగల) జ్ఞాన పరిధిలోకే వస్తాయి. వాటి ఆకర్షణకు లొంగకుండా మౌనంగా నిలిచిపోవడం — అదే నిజమైన సాధన. అదే ధ్యానం (మెడిటేషన్). ఆ నిశ్శబ్దంలో సమాధానం స్వయంగా దైవమే తెలుపును — అసలంటూ వింటే. 

అధ్యాత్మ సంకీర్తన
రేకు: 292-6 సంపుటము: 3-535
వేదవట్టి యిఁక నేమి వెదకేరు చదివేరు
వేదాంతవేద్యుఁడైన విష్ణుని నెఱఁగరా       ॥పల్లవి॥
 
తోలె నదె గరుడనిఁ దొడఁగి బాణునిమీఁద
వాలెను కంసునిమీఁద వడి నెగసి
కేలుచాఁచి చక్రమునఁ గెడపె శిశుపాలుని
వేలుపులరాయఁడైన విష్ణుని నెఱఁగరా      ॥వేద॥
 
తొక్కెను బలీంద్రునిఁ దొల్లి పాతాళానఁ గుంగ
మొక్కలాన జలధమ్ముమొనకుఁ దెచ్చె
పక్కన బ్రహ్మాండము పగులించెఁ బెనువేల
వెక్కసపుదైవమైన విష్ణుని నెఱఁగరా ॥వేద॥
 
భేదించె రావణాది భీకరదైత్యుల నెల్ల
నాదించె శంఖమున నున్నతజయము
సేదదేర నిపుడును శ్రీవేంకటాద్రిమీఁద
వీదివీది మెరసేటి విష్ణుని నెఱఁగరా ॥వేద॥

Details and Explanations:

వేదవట్టి యిఁక నేమి వెదకేరు చదివేరు
వేదాంతవేద్యుఁడైన విష్ణుని నెఱఁగరా  ॥పల్లవి॥ 
Telugu Phrase
Meaning
వేదవట్టి యిఁక నేమి వెదకేరు చదివేరు
ఈ వేద ప్రవచనములు చేయుచూ, చదువుచూ దేనిని వెదకెదరయ్యా?
వేదాంతవేద్యుఁడైన విష్ణుని నెఱఁగరా
(వేదాంతము అనే పదానికి 'ఇహ సంబంధమైన జ్ఞానమునకు ముగింపు' అని అర్థం)
ఇహ సంబంధమైన జ్ఞానమునకు ఆవలి విషయములకు అధిపతియైన విష్ణువుని ఎఱగరా? ​

సూటి భావము:

ఈ వేద ప్రవచనములు చేయుచూ, చదువుచూ దేనిని వెదకెదరయ్యా? ఇహ సంబంధమైన జ్ఞానమునకు ఆవలి విషయములకు అధిపతియైన విష్ణువుని ఎఱగరా? ​ 

అన్వయార్థము:

దైవముగూర్చి చదువుచూ దేనిని వెదకుచుందురయ్యా! ఇన్ని పనులు చేయ నవసరములేదే? ప్రత్యక్షంగా కనబడుతున్న ఆ దైవమును వెదుకుట దేనికని? 


గూఢార్థవివరణము: 

వేదవట్టి యిఁక నేమి వెదకేరు చదివేరు 

నేరుగా మందలింపు: ఇది అన్నమాచార్యుల మేల్కొల్పు గర్జన. ఆయన ఇక్కడ మనిషిని పట్టి కుదిపేస్తారు — “నిద్రలేచి చూడు!” అని. వేదాలు, శాస్త్రాలు, వాదవివాదాలు — ఇవన్నీ మైలురాళ్లు మాత్రమే. కానీ గమ్యం మాత్రం విష్ణువు. మైలురాళ్ల దగ్గర ఆగిపోతే ప్రయాణం వృధా. 

వేదాంతవేద్యుఁడైన విష్ణుని నెఱఁగరా 

సమస్యాత్మక ప్రశ్న: “విష్ణుని నెఱఁగరా?” — ఇదే అన్నమాచార్యుల సూటి ప్రశ్న. జవాబు “లేదు” అయితే — చదువులు, వేదాలు, సిద్ధాంతాలు అన్నీ వ్యర్థమే. మనం అలవాటుగా జవాబు వున్న (తెలిసిన​) వాటినే పట్టుకుంటాం. జవాబు లేనివాటిని చల్లగా పక్కన పెడతాం. అయితే అవును లేదా కాదు  అన్నవి రెండూ తెలుసుకోగలిగిన (నేర్వగల) జ్ఞాన పరిధిలోకే వస్తాయి. వాటి ఆకర్షణకు లొంగకుండా మౌనంగా నిలిచిపోవడం — అదే నిజమైన సాధన. అదే ధ్యానం (మెడిటేషన్). 

పడవ ఉదాహరణ: ఒక బ్రాహ్మణుడు పడవలో ప్రయాణిస్తూ పడవవాడిని అడిగాడు — “వేదాలు తెలుసా?” అని. “లేదు” అన్నాడు. బ్రాహ్మణుడు — “నీ జీవితం వృధా” అన్నాడు. కొద్దిసేపటికి పడవకు చిల్లు పడి నీరు నిండింది. పడవవాడు అడిగాడు — “ఈత వచ్చా?” అని. “లేదు” అన్నాడు బ్రాహ్మణుడు. పడవవాడు నీటిలోకి దూకి తనను తాను రక్షించుకున్నాడు. బ్రాహ్మణుడు మాత్రం మునిగిపోయాడు. 

మన జీవితం ఆ చిల్లు పడిన పడవ. మన గర్వపుజ్ఞానం ఆ బ్రాహ్మణుడిలా. ఆ పడవ చుట్టూ నీటి గుణము విష్ణువు లాంటిది. రక్షించేది, ముంచేది కూడా అదే. 

రిత్త రక్షణలు: తర్వాతి చరణాలలో అన్నమయ్య అసురులను — కంసుడు, శిశుపాలుడు, రావణులను — గుర్తు చేస్తారు. వారు తమ బలాన్ని రక్షణ కవచమని నమ్మారు. కానీ అది వారిని కాపాడలేకపోయింది. అలాగే మనం కూడా పుస్తకాలు, ఆచారాలు, పాండిత్యం మీద కట్టుకున్న కోటలు భద్రతను ఇవ్వలేవు. 

భవిష్యత్తు భ్రమ: మనమంతా తరువాతి క్షణం, రోజు, సంవత్సరం, జన్మ కోసం ఏర్పాట్లలో మునిగి ఉంటాం. బాంధవ్యాలు, ఆస్తి, పుణ్యం — ఇవన్నీ భవిష్యత్తు కోసం వేసుకున్న కల్పనలు. కానీ జీవితం ఎప్పుడూ ప్రమాదపు అంచుపైనే నడుస్తుంది. ఎన్ని ఏర్పాట్లు చేసినా, కొంత మిగిలిపోతుంది. 

వెలగని దీపం: వేదాలు, వేదాంతాలు దీపస్తంభాల్లాంటివి. కానీ అవి స్వయంప్రకాశములు కావు (అవి  తమంతట తాము వెలుగు ఇవ్వవు). వెలుగునిచ్చేది ఒక్కటే — ఆత్మలో వెలిగే విష్ణువు. ఆయనను పొందకపోతే, వేదాలు వచ్చీ లాభంలేదు. 


వేదాంతవేద్యుఁడైన విష్ణుని నెఱఁగరా?

అయ్యలారా!  విష్ణు తత్వమును తెలియండి. వున్నది లేనిది నిర్ధారణ చేయలేనంత సూక్మమైనది. సర్వమును వ్యాపించి యున్నది. అది లేక మనము లేము. కానీ మనము లేక అది యుండగలదు. వ్యక్తావ్యక్తములకు అతీతమైనది. దాని నెరుగుటకు ప్రయత్నముచేత కాదు. నిశ్చల బుద్ధిచే మాత్రమే సాధ్య పడును. ఇది తెలిస్తే మీరిప్పుడు చేయుచున్న పనులు చేయుదురా?

 


మొదటి చరణం:

తోలె నదె గరుడనిఁ దొడఁగి బాణునిమీఁద
వాలెను కంసునిమీఁద వడి నెగసి
కేలుచాఁచి చక్రమునఁ గెడపె శిశుపాలుని
వేలుపులరాయఁడైన విష్ణుని నెఱఁగరా
॥వేద

Telugu phrase
Meaning in English
తోలె నదె గరుడనిఁ దొడఁగి
ముందటి కాలములో గరుడుని ఎక్కి
బాణునిమీఁద వాలెను
బాణాసురుడువెయ్యి భుజములతోనే గర్వించాడు. కానీ విష్ణువు (కృష్ణుడు) క్షణాల్లో తగ్గించాడు
కంసునిమీఁద వడి నెగసి
కంసుడుసింహాసన బలంతో మత్తెక్కి, విధిని ఆపగలమని అనుకున్నాడు. కానీ కృష్ణుడు అతన్ని క్షణంలోనే ముగించాడు.
కేలుచాఁచి చక్రమునఁ గెడపె శిశుపాలుని
శిశుపాలుడు సభల మధ్యలో విష్ణువుని తిట్టుతూ గర్వించాడు. కానీ సుదర్శన చక్రం ఒకే క్షణంలో అతన్ని నిశ్శబ్దం చేసింది.
వేలుపులరాయఁడైన విష్ణుని నెఱఁగరా
దేవదేవుడైన​ విష్ణుని నెఱఁగరా

సూటి భావము:

ముందటి కాలములో బాణాసురుడువెయ్యి భుజములతోనే గర్వించాడు. కానీ విష్ణువు (కృష్ణుడు) క్షణాల్లో తగ్గించాడు. కంసుడుసింహాసన బలంతో మత్తెక్కి, విధిని ఆపగలమని అనుకున్నాడు. కానీ కృష్ణుడు అతన్ని క్షణంలోనే ముగించాడు. శిశుపాలుడు సభల మధ్యలో విష్ణువుని తిట్టుతూ గర్వించాడు. కానీ సుదర్శన చక్రం ఒకే క్షణంలో అతన్ని నిశ్శబ్దం చేసింది. అయినా దేవదేవుడైన​ విష్ణుని నెఱఁగరా? 

గూఢార్థవివరణము:

మహా బలశాలులైన బాణాసురుడు, కంసుడు, శిశుపాలుడుఒకప్పుడు అజేయులమని భావించినవారు — ఒక్క క్షణంలోనే కూలిపోయారు. వారి బలం వారిని మత్తెక్కించి, అంధుల్ని చేసి, సత్యాన్నే సవాలు చేయించేలా చేసింది. అన్నమాచార్యులు ఇక్కడ వారి కథల నేపథ్యములో ఆ మహాబలవంతులే కూలిపోయినపుడు, మీరు ఏ రక్షణను నమ్ముతున్నారు? శరీరబలం, ధనం, స్థాయి, పాండిత్యం — ఇవన్నీలక్కద్వారాలు మాత్రమే. 

ఇప్పుడు (ఇంకో కీర్తనలోని) ఈ పల్లవి చూడండి:
విజాతులన్నియు వృథా వృథా / అజామిళా దుల కది యేజాతి”
ఇది సత్యానికి వ్యతిరేకంగా నిలబడడం వృథా ప్రయత్నమని చెబుతోంది.
 

ఇంతకు మునుపు చెప్పినట్లే, అవును” లేదా “కాదు” అనే జవాబులు రెండూ పరిమితమైన జ్ఞానం పరిధిలోనే ఉంటాయి. పైన పేర్కొన్న రాక్షసులు ఎంచుకున్న మార్గం సత్యాన్ని ప్రతిఘటించడమే. అదే చివరికి వారి పతనానికి కారణమైంది.


రెండవ​ చరణం:

తొక్కెను బలీంద్రునిఁ దొల్లి పాతాళానఁ గుంగ
మొక్కలాన జలధమ్ముమొనకుఁ దెచ్చె
పక్కన బ్రహ్మాండము పగులించెఁ బెనువేల
వెక్కసపుదైవమైన విష్ణుని నెఱఁగరా
॥వేద॥ 

తెలుగు పదబంధం
అర్థం
తొక్కెను బలీంద్రునిఁ దొల్లి పాతాళానఁ గుంగ

వామనావతారంలో, విష్ణువు బలిచక్రవర్తిని తన పాదముతో పాతాళానికి తోక్కాడు.

మొక్కలాన జలధమ్ముమొనకుఁ దెచ్చె
వరాహావతారంలో, హిరణ్యాక్షుడితో సముద్రంలో యుద్ధం చేసి, తన కొమ్ములతో భూమిని పైకి లేపి స్థిరపరిచాడు
పక్కన బ్రహ్మాండము పగులించెఁ బెనువేల
అదే సమయంలో ఆయన వేవేల బ్రహ్మాండములు పగుల గొట్టెను.
వెక్కసపుదైవమైన విష్ణుని నెఱఁగరా
కోట్లాది విధములుగా అన్నింట్లో మిన్నగా భాసితున్న విష్ణుని నెఱఁగరా

సూటి భావము:

వామనరూపముతో బలిచక్రవర్తిని పాతాళానికి నెట్టెను. వరాహరూపముతో హిరణ్యాక్షుని సంహరించి భూమిని నిలిపెను. అనేక బ్రహ్మాండములను విచ్ఛిన్నముచేసెను. అనేక రూపములలో ప్రత్యక్షమయ్యే ఆ విష్ణువును ఎరుగరా?


గూఢార్థవివరణము:

బలిచక్రవర్తి ఉదాత్త గుణములు, చక్రవర్తులకు తగిన శౌర్యము, దార్తృత్వము కలవాడు. అయినప్పటికీ ఆయన నేను శ్రీమహావిష్ణువుకు కూడా దానం ఇవ్వగలిగిన వాడను అని గర్వించాడు. దానితోనే అతడు పాతాళానికి తొక్కబడ్డాడు. అప్పుడు బలి చక్రవర్తి భార్య వింద్యావళి అక్కడకు చేరుకుని, భర్త వరుణపాశములతో బంధింపబడి వుండుట చూసి, వామనునికి ప్రణమిల్లి ఇటుల పలికెను. 

క. నీకుం గ్రీడార్థము లగు
లోకంబులఁ జూచి పరులు లోకులు కుమతుల్
లోకాధీశుల మందురు
లోకములకు రాజవీవ లోకస్తుత్యా! (8-654) 

ప్రభూ! నీవు నీలీలలను కొనసాగించుట కొరకు ఈ ముల్లోకాలను సృష్టించితివి. కానీ, మందబుధ్ధులు ఈ జగమ్మునకు తామే అధిపతులైనట్లు భావింతురు (బలిచక్రవర్తిని కూడా కలిపి విమర్శించింది) . ఈ లోకమునకు కర్తయు, భర్తయు, సంహర్తయు నీవే ఐనప్పుడు,  నీ మాయకు మోహితులై, సిగ్గు విడిచిన వారు తామే కర్తలమైనటుల భావింతురు . అట్టివారు నీకేమి సమర్పింపగలరు?


ఇక్కడ అన్నమాచార్యులు వింధ్యావళి ఒకే సత్యం చెబుతున్నారు. మనకు ఏమి చేయాలో పాలు పోనప్పుడు మౌనంగా నిశ్శబ్దంగా ప్రక్కగా నిలబడవలెను.  మానవుడు తన స్థానము తెలుసుకోకుండా సాధించిన విజయముల గర్వము కనులను కప్పివేయగా తప్పుటడుగులు వేస్తాడు.


ఈ చరణంలోని రెండవ, మూడవ వరుసలు స్పష్టంగా చెబుతున్నవిదే:
సృష్టి – స్థితి – లయ, ఇవన్నీ దైవకృత్యాలే.
జీవులను, జగములను, బ్రహ్మాండములను పుట్టించడం, రక్షించడం, నాశనం చేయడం – ఇవన్నీ విష్ణువే చేయువాడు.
అందువల్ల దైవకార్యాలకు కారణాలు ఊహించడం కూడా అవివేకమే.

ఆధ్యాత్మిక సందేశం:

“విష్ణుని ఎరుగరా?” అన్నది ఇక్కడ సాదాసీదా ప్రశ్న కాదు.

కోట్లాది రూపములలో కనబడు విష్ణువును చూడాలంటే,
— అధికార దాహం,
— చేయవలెనను తహతహ,
— తానున్న స్థితి కల్పించే భ్రమలు
ఇవన్నీ పక్కకు నెట్టి చూడాలి.
ఆ మాయా వలయాన్ని ఛేదించినప్పుడే విష్ణువు సాక్షాత్కారమవుతాడు.

మూడవ​ ​ చరణం:

భేదించె రావణాది భీకరదైత్యుల నెల్ల
నాదించె శంఖమున నున్నతజయము
సేదదేర నిపుడును శ్రీవేంకటాద్రిమీఁద
వీదివీది మెరసేటి విష్ణుని నెఱఁగరా ॥వేద

Telugu phrase

Meaning
భేదించె రావణాది భీకర దైత్యుల నెల్ల
He destroyed (split, annihilated) the entire clan of terrifying demons such as Ravana.
నాదించె శంఖమున నున్నత జయము
He sounded his conch, a sign of supreme victory.
సేదదేర నిపుడును శ్రీవేంకటాద్రిమీఁద
Now he is resting peacefully on the sacred Tirumala hill.
వీది వీది మెరసేటి విష్ణుని నెఱఁగరా
Can you truly know (recognize) this Vishnu, who shines magnificently in every street?

 సూటి భావము:

విష్ణువు రావణాది భీకర దైత్యులను సంహరించాడు. తన శంఖమును ఊదగా నిత్యవిజయం ప్రతిధ్వనించింది. మన కోసం, ఇప్పుడు ఆయన శ్రీవేంకటాద్రిమీద సేదదీరుచున్నాడు. మానవుడా! వీధి వీధిలో మెరుస్తున్న ఆ విష్ణువును నీవు గుర్తిస్తున్నావా?


గూఢార్థవివరణము:

శంఖ నాదం — సత్యధ్వని: ఇక్కడ శంఖనాదం  యుద్ధసూచిక కాదు. అన్నమాచార్యులు విష్ణువు గెలుపు తాత్కాలికం కాదని చెబుతున్నారు. అది సత్యము, ధర్మముల  నిత్యత్వమును ప్రతిధ్వనించే  గర్జన. 

వేంకటగిరిపై విశ్రాంతి: సంహారయజ్ఞాల తరువాత, రక్షణకార్యాల తరువాత, ఆ మహావిష్ణువు ఇప్పుడు తిరుమలలో ప్రజలకు చేరువగా నిలిచాడు. అందరికి అందుబాటులో వున్నాడు. యాత్రికులకు దగ్గరగా, భక్తుల హృదయాలకు ఆత్మీయంగా. 

వీధి వీధిలో మెరుస్తూ: ““వీది వీది మెరసేటి” అన్నది ఒక ఆహ్వానం. విష్ణువు కేవలం తిరుమలలోనే కాదు, ప్రతి వీధిలోనూ, ప్రతి ఇంటిలోనూ, ప్రతి మనసులోనూ వెలుగుతూనే ఉన్నాడు. మీ దైనందిన జీవితంలో మీమీ ఇళ్ళలోనే, మీ అంతరంగములోనే సాక్షాత్కరింపజేసుకోండి. 

పునరుక్తమైన ప్రశ్న — “విష్ణుని నెఱఁగరా?” ఇంతకుముందు చరణాలలోలాగానే, ఇక్కడ కూడా అన్నమాచార్యులు నీవు విష్ణువును నీ చుట్టూ వున్నట్లు గమనిస్తున్నావా?  అని ప్రశ్నిస్తున్నారు. అది కేవలం స్తోత్రములు, శాస్త్రాములు, జపము, తపముల ద్వారా రాదు— మాయా సౌధాలను ఛేదించి చూడగల కంటితోనే సాధ్యం. అది ప్రతీ ఒక్కరికి అందుబాటులో ఉంది, కాని సాధారణ జీవన ప్రవాహంలో వుంటూనే లోతుగా చూడవలసిన విషయం.


ఈ కీర్తన ముఖ్య సందేశం


భగవంతుని తెలుసుకోవడం మానవ ప్రయత్నానికి అతీతమని  గ్రహించిన​, మనిషికి మిగిలిన ఒకే కార్యం — శరణు పొందడం. వీధులలోనూ, అనేక జీవులలోనూ, లోకాల్లోనూ, బ్రహ్మాండములలోనూ విరాజిల్లే ఆయన వైభవాన్ని ఊహలతో కాదు, ప్రత్యక్షంగా జీవించి అనుభవించాలి. ఆ అనుభవంలో మునిగిపోవడమే మానవుని విధి.


X-X-The END-X-X

No comments:

Post a Comment

T-263 వెరవకువే యింత వెరగేలా నీకు

  తాళ్ళపాక అన్నమాచార్యులు 263 వెరవకువే యింత వెరగేలా నీకు For English version press here   ఉపోద్ఘాతము   అన్నమాచార్యుల పదాలు హ్యారీ పా...