Friday, 19 September 2025

T-264 ఇద్దరము నున్నారము యిదివో నేము

 తాళ్ళపాక అన్నమాచార్యులు

264  ఇద్దరము నున్నారము యిదివో నేము

For English version press here 

ఉపోద్ఘాతము 

దీనిని శృంగార కీర్తన క్రింద వర్గీకరించారు తప్పితే ఇందులో ఆధ్యాత్మిక పాళ్ళే ఎక్కువ​. కొంత వ్యంగ్యంగా చెప్పారని అనుకోవచ్చును. మానవునికి దైవమునకు గల అంతరములు బుద్దులు చెప్పితే తరిగేవి కావని, ముఖ్యంగా ఈ భౌతిక దేహమును చిచ్చులా మండించు ఆలోచనలకు ఆ దైవమే కారణమని గ్రహించక వాటికి వ్యతిరేక దిశలో కానీ,  వాటిని నియంత్రించు దిశలో  కానీ అడుగులు వేయబోతాము.  కీలకముగా గమనించవలసినది అదే. 

శృంగార కీర్తన

రేకు: 1717-1 సంపుటము: 27-97

ఇద్దరము నున్నారము యిదివో నేము
బుద్దులు మీరు చెప్పితే పొసఁగేము నేము ॥పల్లవి॥
 
పగటులదాన నేను పంతములవాఁడు తాను
తగవులు దేర్చరే తరుణులాల
చిగురులవేటు నాది సేవంతివాటు తనది
జగడాలు దిద్దరే సతులాల వొరసేటిదాన నేను     ॥ఇద్ద॥
 
వుద్దండపువాఁడు తాను సర
సరవులు చెప్పరే సకియలాల
గొరబైనమాట నాది కొసరుమాట తనది
వరుసఁ గూరచరే వనితలాల          ॥ఇద్ద॥
 
చెలఁగి శ్రీ సతి నేను శ్రీ వేంకటేశుఁడు తాను
అలుకలు మానుపరే యంగనలాల
తలపోఁత యిది నాది తమకమెల్లాఁదనది
కలసితిమి మెచ్చరే కామినులాల    ॥ఇద్ద॥

Details and Explanations:

పల్లవి

ఇద్దరము నున్నారము యిదివో నేము
బుద్దులు మీరు చెప్పితే పొసఁగేము నేము ॥పల్లవి॥ 
Telugu Phrase
Meaning
ఇద్దరము నున్నారము యిదివో నేము
ఇక్కడ ఇద్దరముగా కనబడుతున్నాం, ఉన్నాం  కూడా.
బుద్దులు మీరు చెప్పితే పొసఁగేము నేము
మీరు బోధించినా నిజంగా ఏకమవగలమా?

 

సూటి భావము:

ఇదిగో ఇక్కడ (నేనొక చోట​, దైవమొక చోట​) ఇద్దరముగా ఉన్నాం. మీరు బుద్ధులు చెప్పినా మేము ఒకరై నిలువగలమా అన్నది సందేహమే. 

గూఢార్థవివరణము: 

అన్నమాచార్యులు ఒక సరళమైన కానీ లోతైన సత్యాన్ని చెబుతున్నారు.  మనము దైవాన్ని వేరుగా భావిస్తాం. కానీ నిజానికి మనము ఆ దేవుడు లేదా జీవనం లేదా అవ్యక్తములోని భాగములమే. 

మనకు శ్వాస ఇచ్చేది గాలి, ఆహారం ఇచ్చేది భూమి, జీవితం ఇచ్చేది ఈ లోకం. కానీ ఈ లోకాన్ని మన నుండి విడిగా భావిస్తాము. అలాగే మనం “నేను ఇక్కడ, దేవుడు అక్కడ” అని అనుకుంటాం. ఆ భావమే మనలో బాధను కలిగిస్తుంది. 

“బుద్ధులు మీరు చెప్పితే” అని ఆయన చెబుతున్నది ఒక చురక. వింటాం కానీ ఆచరించం. ఎప్పుడో ఎవరో వచ్చి మారుస్తారని ఎదురుచూస్తాం. 

ఇది ఇక్కడ చూపిన M C యెశ్చరు వేసిన Drawing Hands (1948)  బొమ్మ — ఒక చెయ్యి ఇంకో చెయ్యిని గీస్తుంది. అవి రెండూ వేరుగా కనిపించినా, ఒకదానికి మరొకటి అవసరం. అలా మనమూ, దేవుడూ వేరుగా కనిపించినా వాస్తవానికి వేరు కాదు. 

అందుకే ఈ పల్లవి కేవలం శృంగార కీర్తన కాదు. ఇది ఒక అద్దం. మనం ఆలోచించ వలసినది “మనమే దేవుని భాగమైతే, వేరుగా ఎందుకు అనిపిస్తోంది? బయట సహాయం ఎందుకు ఎదురుచూస్తున్నాం? అసలు మార్పు మన లోపలే మొదలవ్వాలి కదా?”

 


మొదటి చరణం:

పగటులదాన నేను పంతములవాఁడు తాను
తగవులు దేర్చరే తరుణులాల
చిగురులవేటు నాది సేవంతివాటు తనది
జగడాలు దిద్దరే సతులాల వొరసేటిదాన నేను               ॥ఇద్ద॥              
Telugu Phrase
Meaning
పగటులదాన నేను పంతములవాఁడు తాను
నేను పగటివేషాలు వేసి అతనిని మురిపించ బోతాను. అతడు తన పంతము విడువడు.
తగవులు దేర్చరే తరుణులాల
ఎడ పెడ మొగముల మా తగవులు తీర్చరే తరుణులారా
చిగురులవేటు నాది సేవంతివాటు తనది
అప్పుడే పొడుచుకొస్తున్న లేత మొక్కలాంటిదానిని. అదీ ఇదీ తెలియవలెనను ఆశాజీవిని. అతడు విరబూసిన చామంతి వలె పరిపూర్ణుడు.
జగడాలు దిద్దరే సతులాల వొరసేటిదాన నేను
మా మధ్య జగడాలలో నేను ఒరుసుకొనిపోతున్నా. మాకు సయోధ్య కుదర్చరే.

సరస భావము: అతని పంతాలకు తగినట్లు నేను (పగటి) వేషాలు వేస్తుంటాను. మా తగవులు తీర్చరే తరుణులాల. చేమంతిలా పూచినవాడు తాను. ఇప్పుడిప్పుడె చిగురిస్తున్న దానను నేను. నా లేత దనము చూడకుండా నన్ను రాపాడిస్తున్నాడు. మా ఈ జగడాలు ఎలాదిద్దుకోవాలో చెప్పండి. 

తాత్విక​ భావము: నేనేమో ఆడంబరాలకు, దర్పాలకు పోబోతాను. తాను మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు అలాగే ఉంటాడు. ఉత్తదధృవం & దక్షిణధృవం లాంటి మమ్మల్ని కలిపేదెలా? అప్పుడే పొడుచుకొస్తున్న లేత మొక్కలాంటిదానిని. అతడేమో పరిపూర్ణముగా పూచిన పూవు వంటి వాడు. నాదో దారి. అతనిదో దారి. ఆ కాపురము సరిదిద్దుట ఎలా? మధ్యలో నాకే చెక్కుకుపోయి గాయాలౌతున్నది.

గూఢార్థవివరణము: 

చిగురులవేటు నాది సేవంతివాటు తనది
జగడాలు దిద్దరే సతులాల వొరసేటిదాన నేను

నాదేమో పొడుచుకు వస్తున్న ఆత్రుత. అతనిదేమో సంపూర్ణత్వం నిండిన నెమ్మదితనం. నాదో వేగము, అతనిదో సమగతి. ఇలా పొంతనలేని కాఁపురము చేయుటెట్లు. మధ్యలో నాకే చెక్కుకుపోయి గాయమౌతున్నది. ఇదే మాగ్రిట్ గారి Anger of Gods చిత్రంలోని గుర్రం–కారు సంఘర్షణ. గుర్రము సహజ నైజమున ఉరకలు వేయదలచుతుంది; కాని కారు యంత్ర/పదార్థ​స్వభావమునకు లోబడి ఉంటుంది. లేని పోని ఆర్భాటాలకు ('షో'లకు) పోతే అది “నేల విడిచి సాము” వలె అవుతుంది. దానికి స్థిరత్వమూ ఉండదు, ఫలితమూ ఊహించలేనిది. 



రెండవ​ చరణం:

వుద్దండపువాఁడు తాను సర
సరవులు చెప్పరే సకియలాల
గొరబైనమాట నాది కొసరుమాట తనది
వరుసఁ గూరచరే వనితలాల       ॥ఇద్ద॥
Telugu Phrase
Meaning
వుద్దండపువాఁడు తాను సర సరవులు చెప్పరే సకియలాల
ఆ వుద్దండుడైన అతనిని చేరే మార్గాలు చెప్పరే సఖులాలా
గొరబైనమాట నాది కొసరుమాట తనది
గొరబైనమాట = మోటు, కఠోర మైన మాట; కొసరుమాట= ప్రేమతో కూడిన ఇంకొక మారు వినాలి అనిపించు మాట;. 
వరుసఁ గూరచరే వనితలాల
మాకు బంధుత్వము కూర్చరే  వనితలాల
సూటి భావము:
సఖియలారా! వుద్దండపువాఁడు తాను. అతని వద్దకు చేరే విధము చెప్పరే. మోటు, కఠోరమైన మాట నాది. ప్రేమతో కూడిన ఇంకొక మారు వినాలి అనిపించు మాట అతనిది. చెలియలారా! మా ఇద్దరికి బంధుత్వము గూర్చండి.

గూఢార్థవివరణము: 

గొరబైనమాట నాది కొసరుమాట తనది: ఇక్కడ అన్నమాచార్యులవారు తన మాటలు మోటుగాను కఠోరముగానున్నవని అనగా తనకు వాచిక తపస్సు లేదని విన్నవించుకున్నారు. ఇదే విషయం భగవద్గీతలో కూడా క్రింది శ్లోకంలో చెప్పారు. 

అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్ఞ్మయం తప ఉచ్యతే ।।17-15।।.  ఉద్వేగమును కలిగించనివి, సత్యములు, కోపము పుట్టించనివి, ప్రయోజనకరమైనవి అగు మాటలు మరియు నిత్య వేద శాస్త్రముల పఠనము - ఇవి వాచిక తపస్సు అని చెప్పబడుతున్నది.


మూడవ​ ​ చరణం:

చెలఁగి శ్రీ సతి నేను శ్రీ వేంకటేశుఁడు తాను
అలుకలు మానుపరే యంగనలాల
తలపోఁత యిది నాది తమకమెల్లాఁదనది
కలసితిమి మెచ్చరే కామినులాల          ॥ఇద్ద॥              
Telugu Phrase
Meaning
చెలఁగి శ్రీ సతి నేను శ్రీ వేంకటేశుఁడు తాను
(ఎలా జరిగిందో తెలియదు) ఒక్కసారిగా, శ్రీ సతిలా ప్రకాశించ సాగాను. నన్ను  శ్రీ వేంకటేశుఁడు తానే కలిసె.
అలుకలు మానుపరే యంగనలాల

మా యీ ఉత్తుత్తి అలుకలు మానపరే యంగనలాల

తలపోఁత యిది నాది తమకమెల్లాఁదనది
చింత, ఆలోచన ఊహింపగల, భౌతిక రూపమునగల నా  భాగం నుండి వచ్చెను. అయితే త్వరగా చేయవలెను అను తహ తహ కలిగించినది కూడా వెంకటేశ్వరుడే.
కలసితిమి మెచ్చరే కామినులాల
కోరికలతో తబ్బిబ్బు అవుతున్న జనులారా!  మా యీ కలయికను మెచ్చి మీరూ తరించండి

సూటి భావము:

((ఎలా జరిగిందో తెలియదు) ఒక్కసారిగా, శ్రీ సతిలా ప్రకాశించ సాగాను. నన్ను  శ్రీ వేంకటేశుఁడు తానే కలిసె. మా యీ ఉత్తుత్తి అలుకలు మానపరే యంగనలాల. చింత, ఆలోచన ఊహింపగల, భౌతిక రూపమునగల నా  భాగం నుండి వచ్చెను. అయితే త్వరగా చేయవలెను అను తహ తహ కలిగించినది కూడా వెంకటేశ్వరుడే. కోరికలతో తబ్బిబ్బు అవుతున్న జనులారా!  మా కలయికను మెచ్చి మీరూ తరించండి


గూఢార్థవివరణము: 

తలపోఁత యిది నాది తమకమెల్లాఁదనది: నా భౌతికదేహం నుండి ఆలోచనలు ఉద్భవిస్తున్నాయి పుట్టుకొస్తున్నాయి వాటికి తమకమును కల్పిస్తున్నాడు శ్రీ వెంకటేశ్వరుడు. 

ఈ మాగ్రిట్ గారి The Battle of the Argonne చిత్రంలో ఒక తేలికైన మేఘము ఒక బరువైన శిల రెండు గాలిలో తేలుతున్నట్లు చూపారు. వాట్ల మధ్య ఒక చంద్రవంకను పెట్టారు. ఆ మేఘము బరువైన రాయి ఒకే పరస్పరము విరుద్ధములైనను ఒకే మనసులోని భాగములు అన్ని చిత్రకారుడు తెలుపుతున్నారు. చంద్రవంక వేగముగా తరిగిపోతున్న సమయాన్ని సూచిస్తోంది. అన్నమాచార్యుల ఈ పదములు, ఆ బొమ్మ, ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి - దైవము అనునది మన మూహింప గల తలములో లేదు. 

అందువలన మన మనసులో తలెత్తే తలపులు గానీ, అలుకలు గానీ అణచివేయడం ద్వారా పరిష్కారించ లేము.  ఆ చిత్త చాంచల్యము, వికారములు కూడా దేవుని నాటకరంగంలోని భాగమేనని గ్రహించడం ద్వారానే నిజమైన సఖ్యత కలుగుతుంది. ఈ “కలయిక” బాహ్య శృంగారం కాదు — అది మనస్సు సృష్టించుకున్న విభజనలను దాటుకుని ఆత్మదేవాలయము దర్శించినప్పుడే కలుగును.


ఈ కీర్తన ముఖ్య సందేశం


అన్నమాచార్యులు విభజనల నేపథ్యం కల మనస్సునకు

మోక్షము అసాధ్యమని చెబుతున్నారు. 


X-X-The END-X-X

No comments:

Post a Comment

T-286 సంగరహితుఁడైనఁ కాక శాంత మాత్మ కేల కలుగు

  తాళ్లపాక పెదతిరుమలాచార్యులు 286 సంగరహితుఁడైనఁ కాక శాంత మాత్మ కేల కలుగు For English version press here   ఉపోద్ఘాతము   పెదతిరుమలాచార...