Thursday, 11 September 2025

T-263 వెరవకువే యింత వెరగేలా నీకు

 తాళ్ళపాక అన్నమాచార్యులు

263 వెరవకువే యింత వెరగేలా నీకు

For English version press here 

ఉపోద్ఘాతము 

అన్నమాచార్యుల పదాలు హ్యారీ పాటర్ కథలోని టామ్ రిడిల్ డైరీలా ఉంటాయి. హ్యారీ వ్రాయడం మొదలుపెడితే, టామ్ రిడిల్ తానే ఆ పుస్తకంలో ప్రత్యక్షమై వ్రాసి సమాధానమిస్తాడు. అలాగే, మనం అన్నమాచార్యుల కీర్తనలు చదవడం ప్రారంభిస్తే, క్రమంగా మన ముందర ఆయన హృదయం తెరచుకుంటుంది. 

ఇందులో పెద్ద విశేషమేముంది? గొప్ప రచయితలందరిలోనూ ఇదే లక్షణం కనబడదా?” అని అనవచ్చు. కానీ రచయితలందరు ఒక తెలిసిన దాని నుంచి మనము ఊహించగల లేదా పొడిగించగల విషయములలోకి దారి తీస్తారు. కానీ అన్నమాచార్యులు ఊహాతీతమైన​ దానిని మనకు ప్రత్యక్షం చేస్తారు. 

ఎన్నిసార్లు చెప్పుకున్నట్టే, అన్నమాచార్యులు మాటల విషయంలో అత్యంత పిసినారి — ఒక్క అక్షరం కూడా వ్యర్థంగా వెయ్యరు. అయితే, ఈ కీర్తనలో ఒకే పదం యొక్క భావానికి మొత్తం మూడు చరణాలు వినియోగించారు. కావున​ ఆ పదానికి ఉన్న ప్రాముఖ్యత అర్ధంచేసుకోగలరు. 

శృంగార కీర్తన
రేకు: 66-4 సంపుటము: 5-208
వెరవకువే యింత వెరగేలా నీకు
నెఱిఁ గురిసీఁ గొప్పున నీలాలు        ॥పల్లవి॥
 
పగడాలు వాతెరఁ బాయక కురియఁగ
మొగిఁ గురిసీఁ గన్నుల ముత్యాలు
మగువ నీవిభుని ప్రేమపుఁగూటమి గన్నుల
మగుడఁ గురిసీ నింక మాణికాలు     ॥వెర॥
 
పడఁతి నీపుట్టానఁ బచ్చలు గురియఁగా
వడిసీని నీమేన వజ్రాలు
కడఁగి నీరమణుని కాఁకలఁ గూడఁగ
తొడరీ నీగోళ్ళతుదఁ గెంపులు         ॥వెర॥
 
హితవైన తిరువేంకటేశుకౌఁగిట మోహ-
రతులఁ బొడమె నవరత్నాలు
ప్రతలేని లప్పలైన పచ్చి కస్తూరి శయ్య
మితిలేక రాలెనే గోమేధికాలు         ॥వెర॥

Details and Explanations:

పల్లవి:
వెరవకువే యింత వెరగేలా నీకు
నెఱిఁ గురిసీఁ గొప్పున నీలాలు    ॥పల్లవి॥ 
Telugu Phrase
Meaning
వెరవకువే యింత వెరగేలా నీకు
భయపడకే యింత తటపాయింపు నీకు
నెఱిఁ
వక్రతలో (ఆ మార్పులో, ఆ రూపాంతరములో)
గురిసీఁ గొప్పున నీలాలు
నీ కొప్పులో నీలాలు కురియును

సూటి భావము:

భగవంతుడు తనతో అన్నట్లుగా అన్నమచార్యులు ఇలా అంటున్నారు. “భయపడకే యింత తటపాయింపు నీకు ఆ వక్రతలో (ఆ మార్పులో, ఆ రూపాంతరములో) నీ కొప్పులో నీలాలు కురియును 

గూఢార్థవివరణము: 

నెఱిఁ: అంటే వక్రత నొందు — వంగిపోవడం, విరిగిపోవడం, మలుపు తిరగడం. ఇది శరీర వికృతి కాదు, మనస్సు వక్రతను సరిచేయడం. గట్టిగా, అహంకారంగా నిటారుగా నిలిచిన మనస్సు రూపాంతరము చెందుటకు అనుకూలము కాదు.  ఆ భగవదనుగ్రహము అను ఇరుకు మార్గంలో తనను తాను క్షీణింప చేసుకొని ప్రయాణించలేదు. వంగినప్పుడే అనగా మార్పును మనస్పూర్తిగా అంగీకరించినప్పుడే దాటగలదు. అన్నమాచార్యుల మాటలో. ఇటు వైపు అహంకారానికి ముక్కుతాడు లాగా అనిపించినా, దేవుని ముందట అందముగా మారిన ​ నీలమణుల కిరీటమవుతుందా పరివర్తనము. 

ఇరుకు మార్గం: “సన్నని మార్గం” అనే భావం కఠోపనిషత్ (1.3.14) లోను, యోగవశిష్టలోను ప్రస్తావించబడింది. అన్నమాచార్యులు అనేక మార్లు పేర్కొన్నారు. బైబిల్‌లోని ఇరుకు ద్వారము కూడా ఇదియే సూచించుచున్నది. జిడ్డు కృష్ణమూర్తి కూడా Aloneness, Choiceless Awareness గురించి చెప్పాడు — అదే తలపు వేరే పదములలో.   జీవులకు జననం నుండి మరణం వరకు సాధారణ జీవన చక్రము. కానీ మహాపురుషులు 'ఇరుకు మార్గం' గుండా ప్రయాణించి అసాధారణ స్థితిని చేరుకుంటారు — అక్కడ పాత మనసును, భావనలను విడిచిపెడతారు. చివరికి తాను అన్న జ్ఞాపకము కూడా కరిగిపోతుంది. అంటే జ్ఞాపకములు, దాని రూపాలు, దాని బంధాలు అన్నీ తెగిపోతాయి. ఆ తెగుటే బాధాకరం, అందుకే భయం. ఆత్మఅలా ఆ మార్గమున సాధకుని మనస్సు రూపాంతరము చెందుతుంది.  

నియంత్రణ - అడ్డంకి: అందుకే జిడ్డు కృష్ణమూర్తి ఇలా అన్నారు: “ఏం జరిగినా నేను విచారించను.” ఫలితంపై నియంత్రణే మానవునికి నిజమైన అడ్డంకి; దానిని వదిలివేయడమే అసలు దారి. అంటే ఆ సమర్పణ బేషరతు.  “ఇది నాకు అనుకూలమైతే నేను అంగీకరిస్తాను” లాంటివి పనిజేయవు. నిజమైన శరణాగతి అంటే ఏం జరిగినా అంగీకరించడమే. ఈ శరణాగతి ఇలా చూస్తే భయానకముగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇది స్వీయ సంకల్పాన్ని రద్దు చేస్తుంది. కానీ ఇక్కడే తనపై తనకు అపారమైన నమ్మకం వుండవలెను. 

కీలకము: అందుచేత పల్లవిని కీలకముగా భావించ వలెను. ఇక్కడ చెప్పబడిన నీలాలు  మిగతా కీర్తనలోపేర్కొన్న ఆభరణాలు, మాణిక్యాలు, ముత్యాలు బాహ్యమైనవి కావు — అవన్నీ అంతరంగము యొక్క ఉత్కృష్ట స్థితిని చూపుతున్నాయి. ఇది కృషితో సాధించబడదు. శరణాగతిలో మౌనంగా నిలిచి వుండటమే మానవుని విధి. ఆ మార్పు దైవ ప్రసాదము. 

దీనిని భగవద్గీతలోని 18-37తో పోల్చుకోవచ్చును. యత్తదగ్రే విషమివ పరిణామేఽమృతోపమమ్ తత్సుఖం సాత్త్వికం ప్రోక్తమ్ ఆత్మబుద్ధిప్రసాదజమ్ ।। 18-37 ।। (మొదట్లో విషంలా అనిపించినా, చివరికి అమృతంలా ఉండే సుఖమే సత్త్వ గుణ సుఖము. అది ఆత్మ-జ్ఞానం యందే స్థితమై ఉన్న స్వచ్ఛమైన బుద్ధిచే జనిస్తుంది).


ORDER and CHAOS: ఈ పల్లవిని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి ముందుగా ఎం.సి. ఎస్చెర్ గారి ఆర్డర్ అండ్ కయాస్ (1950) అనే చిత్రాన్ని చూద్దాం. ఆ చిత్రంలో ఆయన మధ్యలో పారదర్శకంగా మెరుస్తున్న ఒక స్టెల్లెటెడ్ డోడెకాహెడ్రాన్ (ఒక క్రిస్టల్‌)ను గాజు గోళంలో ఉంచారు. దాని చుట్టూ విరిగిపోయిన, అస్తవ్యస్తంగా చెల్లాచెదురుగా పడివున్న వస్తువులు కనిపిస్తాయి. ఆ క్రిస్టల్‌ సృష్టిలోని రహస్య క్రమశిక్షణను, అంతర్లీన సౌష్టవాన్ని సూచిస్తే, చెల్లాచెదురైన వాటి గందరగోళాన్ని సూచిస్తున్నాయి. 

ఎస్చెర్ ఇక్కడ మన కంటికి అస్తవ్యస్తంగా కనిపించే మన  ఈ లోకములోనూ ఒక రహస్య క్రమం, లోతైన సూత్రము అనుశాసిస్తూ ఉంటుందని సూచిస్తాడు. జిడ్డు కృష్ణమూర్తి తరచూ “అంతర్లీన క్రమం” గురించి చెప్పినదీ ఇదే. అటువంటి క్రమమే అన్నమాచార్యుల “నీలాలు” అనే పదములో సూచించారు. కాబట్టి “వెరవకువే యింత వెరగేలా నీకు” అనే మాటలో భయంతో, గందరగోళంలో మునిగిపోయిన మనిషి మనసును - అంటే ఆ సౌష్టవాకారం చుట్టూవున్న పనికిరాని వస్తువులను చూపుతాయి. “గురిసీఁ గొప్పున నీలాలు” ఆ గందరగోళం తొలగినప్పుడు వెలిసే అరుదైన స్ఫటిక క్రమం అనుకోవచ్చును. 


THE FLAUTIST: కానీ ఆ మార్పు ఎలా సంభవిస్తుంది? దీనికి కొంతవరకు సమాధానం ఇవ్వడానికి రెమెడియోస్ వారో గారి ది ఫ్లూటిస్ట్ (1955) అనే చిత్రాన్ని చూడవచ్చు. ఆ చిత్రంలో ఒక ఏకాంత వాద్యకారుడు, దాదాపు తపస్విలా, ఒక విరిగి, అవకతవకగా వున్న గోపురం ముందు నిలబడి ఉంటాడు. అతని శరీరం పొడవుగా, సున్నితంగా, ఆ గోపురం యొక్క నల్లని రాళ్లలో కలిసిపోయింది. అతడు ఊదుతున్న వేణువు — కంటికి కనిపించని కంపనాలను సృష్టిస్తోంది. అవే అంతర్గత మార్పుకు సంకేతములు. 

సగం రాతి కట్టడం, సగం రహస్యం: అతడికి కొంచెం దూరంలో ఉన్న కట్టడంలో మూడు మెట్ల వాకిళ్లు కనిపిస్తాయి. అవి పోనుపోను సన్నవగుతూ పైకి పోతున్నాయి. ఇంకా జాగ్రత్తగా చూస్తే ఆ మెట్లు రాళ్ళతోనో, ఇటుకలతోనో నిర్మితం కాలేదని తెలుస్తొంది.  — అది “న్యారో ప్యాసేజ్” అనే సంకేతం. ఈ గోపురం కేవలం ఇటుకలతో కట్టబడినది కాదు; అది సగం శిల్పకళ, సగం మనకు తెలియని రహస్య పదార్థంతో తయారైనది. ఫ్లూటిస్ట్ వైపు ఉన్న భాగం కాంతితో ప్రకాశిస్తోంది — అది తెలిసిన లోకం. మరొక వైపు చీకటిలో మునిగిపోయి ఉంది — అది తెలియని లోకం. గోపురం అడుగున రాళ్లు చెల్లాచెదురుగా ఉన్నాయి, అవి సంగీతం శక్తితో పైకి ఎగసి గోపురంలో జతచేయాలన్నట్టుగా కనిపిస్తుంది. 

పునాదిలేని గోపురం: ఆ పునాదిలేని గోపురం అష్టభుజాకార రూపాన్ని కలిగి ఉంది. అది సంగీతంలోని “ఆక్టేవ్స్‌”ను గుర్తుచేస్తుంది. కాబట్టి వేణువాదకుని గానమే ఆ రాళ్లను చేర్చి కొత్త క్రమాన్ని నిర్మిస్తోంది. ఒకప్పుడు విరిగినవి మళ్ళీ కూర్చబడుతున్నాయి. ఒకప్పుడు చెదిరిపోయినవి మళ్ళీ సమగ్రత పొందుతున్నాయి. ఈ మొత్తం అసాధ్యమైన కర్తవ్యములో వేణువాదకుడు సంపూర్ణ ఏకాగ్రతతో మునిగిపోయాడు. చుట్టూ ఏమి జరుగుతున్నదో అతనికి తెలియదు. అతడు పూర్తిగా తన వాద్యానికి అర్పణ అయిపోయాడు. 

ఇది అన్నమాచార్యుల మాట  'నెఱి'తో మేళవిస్తుంది. మనసును దానితో కూడిన ఆ శరీరమునును ఎవరో బలవంతంగా అణచుతున్నట్టుగా అనిపించినా, మార్పు ఎలా జరుగుతోందో మనిషికి తెలియదు. అతని ఆ తెలుసుకోవాలనే ఉత్సాహం అప్పటికే వదిలివేయబడింది. ఆ గోపురాన్ని కడుతున్నది మానవ సంకల్పం కాదు — అది దైవసంకల్పమే. కొంతమేర తెలిసినదానిపై (శరీరం), మిగతా భాగం తెలియనిదానిపై ఆ నిర్మాణం జరుగుతోంది. 

అందుకే ఈ పల్లవి ధైర్యం ఇస్తోంది: ఆ వికృత మార్పు చివరికి మరణమును కాక నీ తలపై నీలమణులను అలంకరిస్తుంది.” నిజానికి ఇది గందరగోళంగా వున్నా ఒక రహస్య నిర్మాణానికి గుర్తు. అనిశ్చితి, భయంతో వణికే మనస్సు ఆ చర్యను వమ్ము చేయును. మార్పు జరుగుతోంది — కానీ అది కనిపించదు. అదే ఫ్లూటిస్ట్‌ వేణువు నాదంతో రాళ్ళు పైకి లేస్తున్నట్టుగా - చెబితే నమ్మరుకూడా.

 


మొదటి చరణం:

పగడాలు వాతెరఁ బాయక కురియఁగ
మొగిఁ గురిసీఁ గన్నుల ముత్యాలు
మగువ నీవిభుని ప్రేమపుఁగూటమి గన్నుల
మగుడఁ గురిసీ నింక మాణికాలు ॥వెర॥ 
సూటి భావము:

అన్నమాచార్యులు ఇక్కడ ఒక స్త్రీని (ఆ స్త్రీ అన్నమాచార్యులే)  భగవంతుని ప్రేమలో రూపాంతరం చెంది వెలిగిపోతున్నట్టుగా చిత్రిస్తున్నారు. పగడాలు, ముత్యాలు, మాణిక్యాలు — ఇవి బాహ్య ఆభరణాలు కావు, అంతరంగ కాంతి యొక్క ప్రతీకలు. ఆమె కళ్లపై భగవంతుని ప్రేమస్పర్శ పడినపుడు అవి ముత్యాలుగా మారుతున్నాయి — శుద్ధి, నిర్మలత్వానికి సూచకాలు. ఆ ప్రేమలోనే అవి మాణిక్యాలుగా మెరవడం ఆవేశభరితమైన భక్తిరసానికి సూచన.

గూఢార్థవివరణము: 

తిరిగి ఆ THE FLAUTIST చిత్రమును చూడండి. ఆ పునాదిలేని అష్టభుజాకార గోపురం బయట చూపుటకు మాత్రమే వేయబడింది. అది నేల మీదా లేదు. గాలి లోను లేదు. ఆ వేణువు వూదు వాని మనస్సులోనే వుంది. అతనిలోను, అతని చుట్టూ వున్న దేదీప్యమానమైన వెలుతురు అతడి అంతరంగ స్థితికి చిహ్నములు. అన్నమాచార్యులు అదే చెబుతున్నారు ఈ చరణములో. ​


రెండవ​ చరణం:

పడఁతి నీపుట్టానఁ బచ్చలు గురియఁగా
వడిసీని నీమేన వజ్రాలు
కడఁగి నీరమణుని కాఁకలఁ గూడఁగ
తొడరీ నీగోళ్ళతుదఁ గెంపులు     ॥వెర॥ 

సూటి భావము:

నీ పుట్టుకలోనుండి వచ్చిన మృదువైన మొగ్గలు వికసించినవి. అవి వజ్రాలుగా మారి చిరుసందడి చేస్తున్నవి. ఆ తరువాత నీవు లక్ష్మీపతియైన శ్రీనివాసునితో కలిసినప్పుడు, నీ పాదాల గోళ్ళ చివరలు కూడా పచ్చని గోమేధికాల వలె ప్రకాశించాయి.


గూఢార్థవివరణము: 

ఇక్కడ పుట్టుక అన్నది ఆ సంపూర్ణ పరివర్తనమును వుద్దేశించి చేసిన ప్రకటన​. అన్నమాచార్యులు చెబుతున్నది ఏమిటంటే — అలాంటి మహనీయులు, పరమాత్మలో లీనమై, తల  వెంట్రుకల చివరి నుండి పాదాల గోళ్ళ వరకూ తమ శరీరమంతటా జీవాన్ని అనుభవిస్తారు. కానీ మన సాధారణ జీవనంలో మనం ఆ జీవాన్ని ప్రత్యక్షంగా కాక, పరోక్షంగా మాత్రమే స్పృశిస్తాం.


మూడవ​ ​ చరణం:

మెత్తినగందమువలె మెడకంటసరివలె
ముత్తెమువలెనే వురమున నుందాకె
హత్తి శ్రీవేంకటేశుఁడ అట్టె నన్నుఁగూడితివి
బత్తి సేసితివాపెతోఁ బంతమాడఁగలవా
॥ఇప్పు 

 సూటి భావము:

ఆమె (మాయ) మెత్తని గంధంలాగా, మెడలో ధరించే హారం వలె శరీరానికి అంటుకొని ఉంది. స్వచ్ఛమైన ముత్యమువలె గుండెను తాకుతుంది. కానీ శ్రీవేంకటేశుడు నన్ను ఈ అంధకారం నుంచి ఎత్తి  నాతో కూడివున్నాడు. కానీ, ఆ స్త్రీ (మాయ) ఆమె బాణసంచా వత్తి లాంటిది. అంటిన తక్షణమే పేలుతుంది. ఆమెతో పంతములాడగలవా? (అంటే, నిజంగా ఆ ఆటను అంటే నిప్పుతో చెలగాటాన్ని తట్టుకోగలవా?)


గూఢార్థవివరణము:

అలాంటి ఉదాత్తమమైన జీవన తీవ్రత — ఆ అనూహ్యమైన సంపూర్ణత్వం, కణకణములో ఉప్పొంగే జీవశక్తి — మన ప్రస్తుత మనోస్థితికి అందని దూరంలో, అంచనా వేయలేనంత ఎత్తులోను ఉందని అన్నమాచార్యులూ, జిడ్డు కృష్ణమూర్తీ గాఢంగా సూచించారు. 


ఈ కీర్తన ముఖ్య సందేశం

అన్నమాచార్యులు శరణాగతి యొక్క ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పారు.


X-X-The END-X-X

 

No comments:

Post a Comment

T-263 వెరవకువే యింత వెరగేలా నీకు

  తాళ్ళపాక అన్నమాచార్యులు 263 వెరవకువే యింత వెరగేలా నీకు For English version press here   ఉపోద్ఘాతము   అన్నమాచార్యుల పదాలు హ్యారీ పా...