Sunday, 7 September 2025

T-261 ఇందరి బుద్ధులు యీశ్వరేచ్ఛకు సరిరావు

 తాళ్ళపాక అన్నమాచార్యులు

261 ఇందరి బుద్ధులు యీశ్వరేచ్ఛకు సరిరావు 

For English version press here 

ఉపోద్ఘాతము 

మనం సాధారణంగా ఉపయోగించే చిన్న చిన్న మాటలకు, కొత్త లోతులను అన్వయిస్తారు అన్నమాచార్యులు. ఒక క్షణంలో అవి తమ అర్ధాల సంకెళ్లను తెంచుకొని, అందనంత అనంతంలో నిలిచిపోతాయి. వాటిని అనుభవించే ప్రతి సారి, మేలుకొలిపే అనేక భావాలతో మనసు ఉప్పొంగిపోతుంది, పట్టలేనంతగా విస్తరిస్తుంది. నిస్సారమైన పదాలకు ఆయన ప్రాణం పోశారు. ఆ జీవం ఈ రోజుకీ కొట్టుకుంటూనే ఉంది, కోట్లాది హృదయాలను తాకుతోంది. ఆయన కవిత్వం ఖాళీ మనసులను నిద్రపుచ్చటానికి కాదు — మేల్కొల్పటానికి. 

అధ్యాత్మ సంకీర్తన
రేకు: 116-4 సంపుటము: 2-94
ఇందరి బుద్ధులు యీశ్వరేచ్ఛకు సరిరావు
గొందినున్న మానుషము కొలువ దెంతైనా ॥పల్లవి॥
 
తనంతఁ దా నూరకున్న దైవమే తోడౌను
కినిసి తాఁ బదిరితే కిందుమీఁదౌను
తనుఁ దానే చేరె హరి దధివిభాండకునకు
కొనకెక్కఁ బోయి నీవి కొంచపడెఁ దొల్లి        ॥ఇంద॥
 
వొక్కటివాఁడు దానైతే వున్నచోనే మేలు చేరు
పెక్కుబుద్ధులఁ బోతేను పిరివీకౌను
పక్కన నంబరీషుఁడు పట్టిన వ్రతాన గెల్చె
దిక్కులెల్లా దుర్వాసు తిరిగి బడలెను       ॥ఇంద॥
 
శ్రీవేంకటేశ్వరు చేతిలోవీ జగములు
భావించిఁ యాతడు నడపక మానఁడు
వావిరి నిదెఱఁగక వట్టియలమటఁ బడి
జీవులేల బడలేరు చింత లిట్టె పాయరో ॥ఇంద॥

Details and Explanations:

ఇందరి బుద్ధులు యీశ్వరేచ్ఛకు సరిరావు
గొందినున్న మానుషము కొలువ దెంతైనా ॥పల్లవి॥ 
Telugu Phrase
Meaning
ఇందరి బుద్ధులు
ఈ ప్రపంచమున జీవులందరి బుద్ధి కలిపి చూచినా కూడా
ఈశ్వరేచ్ఛకు సరిరావు
ఆ పరమేశ్వరుని ఒక్క తలంపునకు సరిగావు.
గొందినున్న మానుషము
(గొంది = మూల, చోటు, లోకము)
ఈ లోకము పోకడలతో ప్రదూషితమైన మనస్సు,
అన్వయార్థము: ఎంత ప్రయత్నించినా ఆ లోకము పోకడల అలవాట్లు కొద్దోగొప్పో మిగిలి, మనస్సు
కొలువ దెంతైనా
పైపైన వల్లె వేసినా నూరు శాతం హృదయ పూర్వకముగా దైవమును ఒప్పుకోదు.

సూటి భావము:

మానవులందరి జ్ఞానం, బుద్ధి, విద్యల సమాహారమూ కలిసినా,  దైవము సంకల్పానికి సాటి రావు. లోకము పోకడలతో ప్రదూషితమైన మనస్సు ఏ స్థాయికి ఎదిగినా, ఎంత సునిశితమైనా, ఈ లోక బంధములో వేరూరిన మానసిక స్థితితో భగవంతుని వునికిని నిజంగా గ్రహించలేడు, ఆయనను స్తుతించలేడు.  

అన్వయార్థము:

ఇందరి బుద్ధులు ఈశ్వరేచ్ఛకు సరిరావు: మానవుల సమష్టి మేధస్సు సైతం సత్యాన్ని తాకలేదు. ఎందుకంటే అది పరిమితులు అను గోడల మధ్య బందీయై పునరావృత ధోరణులకే కట్టుబడి ఉంటుంది. 

గొందినున్న మానుషము: గొంది అంటే మూలం, చుట్టూ ఉన్న లోకం. మనిషి తన వాస్తవ శక్తులను పూర్తిగా వినియోగించి బయట పడేందుకు ప్రయత్నించినా, అతనిని అడ్డుకునేది అతని ప్రయత్నములే. ఆ రకముగా మిగిలిన శేషము — లోకబంధములతో ప్రభావితమౌతుంది.  చిన్న భాగమే అయినా అతడు స్వతంత్రుడు కాలేడు. 

కొలువ దెంతైనా: ఇక్కడ "కొలువు" అంటే కేవలం స్తోత్రములు కాదు; నిజంగా సాక్షాత్కారం పొందటం. మానవుడు తన ఆలోచనలు, సిద్ధాంతాలు, అంచనాల గోడల వెనుక దాగితే దైవమును నిజంగా చూడలేడు. 

అన్నమాచార్యుల సందేశం ఇక్కడ స్పష్టంగా ఉంది: మానవ మేధస్సు, దైవము పట్ల ఎంత నిష్ట కలిగినా, మానవ మేధస్సు, దైవపట్ల ఎంత నిష్టతో ఉన్నా, స్వభావతః విభజితమే. ఆ విభజన నిర్మాణాలను కలపలేకపోతే సత్యాన్ని దర్శించలేడు. మానసిక అశాంతి, నిరంతర తపన ముగిసినపుడు మాత్రమే — లోపల మౌనంగా, ప్రశాంతంగా నిలిచినపుడు — మనసు శుద్ధమై నిజమైన దృష్టిని పొందగలదు. 

గూఢార్థవివరణము:

అన్నమాచార్యుల పల్లవి మానవుడు స్వతంత్రుడు కాదు అనే సత్యాన్ని నొక్కి చెబుతోంది. అతను ఆలోచించేది, ప్రవర్తించేది, చేసే ప్రయత్నాలు అన్నీ తాను పెరిగిన వాతావరణం — సంస్కృతి, భాష, సమాజం, కుటుంబం, స్వార్థం — వీటన్నిటి వల్ల ప్రభావితమౌతుంది . అందువల్ల అతని బుద్ధి ఎప్పటికీ స్వేచ్ఛ వుండదు. అది బాహ్య ప్రభావాల వల్ల పాదరసంలా కదిలిపోతూనే ఉంటుంది. 

దీనిని René Magritte గారి “The Lost Jockey” (1948) అనే సంకేతాత్మక చిత్ర పటము ద్వారా ఋజువు చేయవచ్చును.

 

జాకీ: ఒక జాకీ అతి వేగంగా ఒక అడవిలో గుర్రంపై దూసుకుపోతున్నట్లు కనబడుతుంది. అతనికి  గమ్యం దూరమేమో; కానీ అతడు అదే పనిగా కదులుతూ ఉన్నాడన్నది స్పష్టం.  

అడవిలో వాతావరణం: పసుపు-పచ్చటి వెలుతురు — అసౌకర్యకరమైన వాతావరణం (నిత్య జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు కూడా అలాంటివే). 

ఆకులేని చెట్లు: అన్నీ ఒకే రకమైన ఆకులేని చెట్లు — బోరు, శూన్యత, యాంత్రికత్వం. అవి సహజమైనవి కావు; కృతిమమైనవి. ఆకులు లేని చెట్లు తగినంత నీడనివ్వలేవని కూడ తెలియవచ్చును. ఆ ఆకులేని చెట్లు మానవుడు సృష్టించుకున్న సిద్ధాంతాలు — దేవుడు, జీవితం, మరణానంతర జీవితం, సంపద, సౌకర్యం, సమాజం, కుటుంబం, స్వార్ధం. ఒక్కొక్క సిద్ధాంతం కొంత ఉపశమనాన్ని ఇస్తుంది. కానీ పూర్తి స్థాయిలో తృప్తిని ఇవ్వదు.  అలా మిగిలిన అసంతృప్తి మనిషిని నడిపే చోదకమౌతుంది.​ 

అలాగ ఆ జాకీ ఎప్పటికీ “తృప్తి అనే గమ్యం” అన్వేషిస్తూ నిరంతర ప్రయాణికుడౌతాడు​, కానీ గమ్యం చేరడు. అదే మానవుని యదార్థ స్థితి. 

అన్నమాచార్యుల వాక్యం ఇక్కడ అక్షరసత్యం: మానవ మేధస్సు ఎంత వేగంగా పరిగెట్టినా, దైవ సంకల్పానికి సాటి కాదు. మానసిక అశాంతిలో పుట్టే ఆలోచనలు విభజితమైనవే; వాటితో సత్యాన్ని తాకలేం.నిజమైన దర్శనం ఆ జాకీలా పరుగులు ఆగినప్పుడు వస్తుంది — మనసు మౌనమై, విభజనల నుండి విముక్తమై, సాంత్వనలో నిలిచినప్పుడు.

 


మొదటి చరణం:

తనంతఁ దా నూరకున్న దైవమే తోడౌను
కినిసి తాఁ బదిరితే కిందుమీఁదౌను
తనుఁ దానే చేరె హరి దధివిభాండకునకు
కొనకెక్కఁ బోయి నీవి కొంచపడెఁ దొల్లి    ॥ఇంద॥ 
Telugu phrase

Meaning

తనంతఁ దా నూరకున్న దైవమే తోడౌను
మీ అంతట మీరు ఊరకనే (ఏమీ చేయకుండా) వుంటే దైవమే నీకు తోడై జీవితము నడిపించును.
కినిసి తాఁ బదిరితే కిందుమీఁదౌను
కినిసి =కోపించు;
 కోపముతో/ సహనము నశించి కానీ అలా చేయలేక పోతే పరిస్థితి తలక్రిందులై పోవును
తనుఁ దానే చేరె హరి దధివిభాండకునకు
ఆ పరమాత్ముడు శ్రీకృష్ణునిగా తనకు తానే అవతరించెను
కొనకెక్కఁ బోయి నీవి కొంచపడెఁ దొల్లి
జీవితం చివరిదాకా ఎదురు చూసి అల్పత్వంలోనే వుండిరి ముందటి వారు.

సూటి భావము:

మీ అంతట మీరు ఊరకనే (ఏమీ చేయకుండా) వుంటే దైవమే నీకు తోడై జీవితము నడిపించును. కోపముతో/ సహనము నశించి కానీ అలా చేయలేక పోతే పరిస్థితి తలక్రిందులై పోవును. ఆ పరమాత్ముడు శ్రీకృష్ణునిగా తనకు తానే అవతరించెను. జీవితం చివరిదాకా ఎదురు చూసి అల్పత్వంలోనే వుండిరి ముందటి వారు. 

గూఢార్థవివరణము:

తనంతఁ దా నూరకున్న దైవమే తోడౌను: ముఖ్యంగా ఊరకనే (ఏమీ చేయకుండా) వుండడం చాలా సులభమనిపిస్తుంది. ఊరకనే (ఏమీ చేయకుండా) వుండడం ప్రయత్నముతో సాధించిన అది పని అయిపోతుంది కదా! అలా ఏమీ చేయకుండా వుండడాన్ని మనకు మనమే వమ్ము చేస్తాం. మానసిక అశాంతి, నిరంతర తపన ముగియుటకు చేయు ప్రయత్నములే మానవుని అడ్డుకునేది. దీనిని ఒక ఉదాహరణ ద్వారా వివరించుకుందాం. ​ 

అలెగ్జాండర్ ప్రయాసముఇవే కాక క్రింది అధివాస్తవికత ఆధారముగా రూపొందించిన అలెగ్జాండర్ ప్రయాసము లేదా the Labors of Alexander (by Rene Magritte) అను పేరుగల చిత్రమును చూడండి. ఇందులో వేర్ల దాకా నరికివేసిన చెట్టు కాండం కనబడుతూవుంటుంది.. ఐతే ఇప్పటిదాకా పనిచేసిన గొడ్డలి చెట్టు వేళ్ళ క్రిండ ఇరుక్కుపోయి వుంటుంది. చెట్టూ వేళ్ళు దాన్ని బాగా అదిమిపెట్టి వుంచాయనిపిస్తుంది.

 

అడ్డుపడేది నువ్వే: ఈ బొమ్మ ద్వారా మాగ్రిట్ గారు ఏమి చెప్పదలిచారో ఆలోచింతము.  మన కోరికలను వృక్షాముతోటి పోల్చుకుంటేఆ కన బడుతున్న గొడ్డలి మన శ్రమకు నిదర్శనము. ఇక్కడ గొడ్డలి అంటే మనము తీసుకొను నిర్ణయములుతీర్మానములు.  ఆ చెట్టుకుదాన్ని నరికే గొడ్డలికి కూడా ఆధారము మన దేహము మరియు మనస్సే. కొంతనరికిన తరువాత నరకబోయేదే నరికేందుకు అడ్డుపడుతుండని ఈ బొమ్మ తాత్పర్యం. 

కొనకెక్కఁ బోయి నీవి కొంచపడెఁ దొల్లి: కాలము గడుస్తున్నకొద్దీ నేను బాగుపడిపోతాను అనే అపోహలో వుండవద్దు అని చెబుతున్నారు.  అన్నమాచార్యులు మనము వయస్సుతో పెద్దలమవ్వము, కేవలం ఏళ్ళ సంఖ్య పెరుగుతుంది.  కానీ జీవించడములో ఎదగము అంటున్నారు.  చిన్నయ సూరి గారు  చెప్పినట్లు “ఎవ్వఁడు బుద్ధిమంతుఁడో వాఁడు వృద్ధుఁడు గాని, ఏండ్లు మీఱినవాఁడా వృద్ధుఁడు?”


రెండవ​ చరణం:

వొక్కటివాఁడు దానైతే వున్నచోనే మేలు చేరు
పెక్కుబుద్ధులఁ బోతేను పిరివీకౌను
పక్కన నంబరీషుఁడు పట్టిన వ్రతాన గెల్చె
దిక్కులెల్లా దుర్వాసు తిరిగి బడలెను     ॥ఇంద॥ 
తెలుగు పదబంధం
అర్థం
వొక్కటివాఁడు దానైతే వున్నచోనే మేలు చేరు
ఈ ప్రపంచమున పరమేశ్వరుడు ఒక్కడే వున్నాడు. వాడున్న చోట మంచి జరుగును (నీలోకి దైవమును ఆహ్వానించుము)
పెక్కుబుద్ధులఁ బోతేను పిరివీకౌను
అంతేకానీ బహుమార్గములను అనుసరించ బోతే నీ అంతరంగము పీకులాడు స్థలమౌను. ​
పక్కన నంబరీషుఁడు పట్టిన వ్రతాన గెల్చె
అదిగో గమనించు. అంబరీషుఁడు విష్ణుని నమ్మి ఆ వ్రతముననే విజయుడయ్యెను
దిక్కులెల్లా దుర్వాసు తిరిగి బడలెను
అది మరచిన మాహర్షి దుర్వాసుడు ప్రపంచమెల్లా తిరిగి అలసిపోయెను. తిరిగి ఆ విష్ణుడున్న స్థలము ఆ అంబరీషుఁని వేడుకొన వలసివచ్చెను.

 సూటి భావము:

ఈ ప్రపంచమున పరమేశ్వరుడు ఒక్కడే వున్నాడు. వాడున్న చోట మంచి జరుగును. (నీలోకి దైవమును ఆహ్వానించుము). అంతేకానీ బహుమార్గములను అనుసరించ బోతే నీ అంతరంగము పీకులాడు స్థలమౌను. అదిగో గమనించు. అంబరీషుఁడు విష్ణుని నమ్మి, ఆ వ్రతముననే విజయుడయ్యెను. అది మరచిన మాహర్షి దుర్వాసుడు ప్రపంచమెల్లా తిరిగి అలసిపోయెను. తిరిగి ఆ విష్ణుడున్న స్థలము ఆ అంబరీషుఁని వేడుకొన వలసివచ్చెను.


గూఢార్థవివరణము: 

అంబరీషుడు: శ్రీరాముని పూర్వీకుడు, నాభాగుని కుమారుడు అంబరీషుడు ఏకాదశి వ్రతమును కఠినంగా ఆచరించెను. ద్వాదశి విరమణ సమయంలో అతిథిగా వచ్చిన దుర్వాసుని గౌరవించెను. కానీ ముని స్నానమాడి తిరిగి రావడంలో ఆలస్యం చేయగా, పెద్దల సలహా మేరకు అంబరీషుడు తీర్థం పానముచేసి ఉపవాసం విరమించెను. 

దీనిని గ్రహించిన దుర్వాసుడు ఆగ్రహంతో కృత్యను సృష్టించి అంబరీషుని శిక్షించబోయెను. వెంటనే సుదర్శన చక్రము ఆ కృత్యను సంహరించి దుర్వాసుని వెంటపడెను. ప్రపంచమంతా పరిగెత్తిన దుర్వాసుడు శివుని, బ్రహ్మను వేడుకున్నా ఫలితం లేక చివరకు విష్ణువును ఆశ్రయించెను. 

అయితే విష్ణువు — నేను అంబరీషుని ఆధీనుడను; అతడినే శరణు పొందుము” అని చెప్పగా, గతి లేక మాహర్షి అంబరీషుని వేడుకొన వలసివచ్చెను.


మూడవ​ ​ చరణం:

శ్రీవేంకటేశ్వరు చేతిలోవీ జగములు
భావించిఁ యాతడు నడపక మానఁడు
వావిరి నిదెఱఁగక వట్టియలమటఁ బడి
జీవులేల బడలేరు చింత లిట్టె పాయరో ॥ఇంద॥ 
Telugu phrase
Meaning
శ్రీవేంకటేశ్వరు చేతిలోవీ జగములు
శ్రీవేంకటేశ్వరుని చేతిలోవి ఈ జగములన్నీ
భావించిఁ యాతడు నడపక మానఁడు
అతడు వీనిని తనకు నచ్చినట్లు నడుపుతాడు
వావిరి నిదెఱఁగక వట్టియలమటఁ బడి
(వావిరి =ఉత్కృష్టము)
అత్యున్నతమైన ఈ సత్యము ఎఱుకలేక అనవసరపు శ్రమలేల పడుదురు?
జీవులేల బడలేరు చింత లిట్టె పాయరో
ఈ జీవులెందుకు అలసటలు చెందుతారో? ఈ చీకు చింతలు వదలరెందుకో

 సూటి భావము:

ఈ జగములన్నియు శ్రీ వేంకటేశ్వరుని కనుసన్నల్లొనే ఉన్నాయి. ఆయన తలంపు ప్రకారమే నడుస్తున్నాయి. ఈ అత్యున్నత సత్యాన్ని గ్రహించని మానవులు అనవసర శ్రమలతో అలసిపోతూ, వదిలేయదగిన చింతలను గట్టిగా పట్టుకుని కృశిస్తారు .


గూఢార్థవివరణము:

భావించిఁ యాతడు నడపక మానఁడుదైవము జగత్తును ధర్మం ద్వారా నడిపిస్తాడు. గత చరణంలో చూచినట్లుగా, విష్ణువే నేరుగా కర్త కాదు; దైవ సంకల్పమే ధర్మాన్ని చలింపజేస్తుంది. అంబరీషుడి కథలో సుదర్శన చక్రము ఆయుధం మాత్రమే కాదు — అది ధర్మమే. ఒకసారి అది కదిలితే లోక సమతుల్యం వచ్చే వరకు ఆగదు. 

ఇదే గీతలో (4.7) స్పష్టమవుతుంది:

యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత,
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్”

ఎప్పుడెప్పుడైతే ధర్మము క్షీణించునో, అధర్మము ప్రబలునో, ఓ అర్జునా, ఆ సమయంలో నన్ను నేను భూలోకంలో సృజించుకుంటాను. అంటే దైవము స్వయంగా జోక్యం చేసుకోవడం కాదు; ధర్మమే ఆయన రూపమై పనిచేస్తుంది. 

అందుచేత ఈ చరణం మానవ ప్రయత్నాల వ్యర్థతను బయటపెడుతోంది. మనిషి ప్రపంచభారం తన భుజాలపై వేసుకున్నట్టు శ్రమిస్తూ ఉంటాడు. కాని ఆ ఆందోళన ఎప్పుడు ముగుస్తుంది? ఎవరో “దైవమే చూసుకుంటాడు” అంటే మనం నూటికి నూరు శాతం నమ్మగలమా? వాస్తవాన్ని ఒప్పుకోండి. నమ్మలేం. అందుకే స్వీయ అవగాహన అవసరం — మానవుని అంతర్గత దైవాధీనతను లోలోపలే గుర్తించడం అత్యవసరం. ఇదే అన్నమాచార్యుల బోధ..


ఈ కీర్తన ముఖ్య సందేశం


అన్నమాచార్యులు మానవ బుద్ధి, శ్రమ, చింతల వ్యర్థతను

దైవ మహత్త్వం ముందర దిగఁదుడుపని సోదాహరణముగా చూపారు.
సర్వ జగములు ఆయన సంకల్పముతో నడుస్తాయి.
మానవ ప్రయత్నములతో కాదు.
కానీ ఒకదానికొకటి ముడిపడిన యత్నములు చీకాకు తెప్పిస్తాయే
తప్పస్వేచ్ఛకు మార్గాలు కావు.
స్వేచ్ఛను అడ్డుకుంటున్నది తానేనని తెలియు స్వీయ అవగాహన కీలకము.
ఆ అవగాహనలో గడుపు సమయమే ధ్యానము (మెడిటేషన్).

X-X-The END-X-X

 

No comments:

Post a Comment

T-263 వెరవకువే యింత వెరగేలా నీకు

  తాళ్ళపాక అన్నమాచార్యులు 263 వెరవకువే యింత వెరగేలా నీకు For English version press here   ఉపోద్ఘాతము   అన్నమాచార్యుల పదాలు హ్యారీ పా...