తాళ్లపాక పెదతిరుమలాచార్యులు
133 ఎట్టు
మన్నించేవో నన్ను యిటువంటి వాఁడను
Those interested in English Version may press this
ఉపోద్ఘాతము: తాళ్లపాక పెదతిరుమలాచార్యులు అన్నమాచార్యుల కుమారుడు. పెద తిరుమలాచార్యులు తన తండ్రి లాగే అనేక కీర్తనలు రచించాడు. ప్రజలతో మమేకమవ్వడానికి పసివానివలె అమాయకమైన విజ్ఞప్తులతో మెప్పిస్తాడు. ఆకర్షిస్తాడు.
మానవుడు తన అజ్ఞానంతో భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తాడు. అతడు దగ్గర ఉన్న అన్ని ఉపాయాలనే పాచికలు విసురుతాడు. తన సామర్థ్యాలను దేవునికి నిరూపి౦చాల్సిన అవసర౦ లేదని గ్రహించడు. ఆయనతో ఉండటమే 'అక్కడికి' చేరుకోవడం అని తెలియక నానా అవస్థలూ పడతాడు.
దైవమును చేరుటకు ప్రజలు ప్రార్థనలు, పూసలు లెక్కిస్తూ జపములు, పూజలు, సారెలు, సేవలు, ఆచారాలు, నృత్యాలు, కఠినమైన క్రమశిక్షణలు మరియు ధ్యానం వంటి వివిధ పద్ధతులను అవిరామముగా ప్రయత్నిస్తూనే ఉన్నారని ఆయన ప్రజలను విమర్శించాడు. విచిత్రమేమిట౦టే, భక్తిపూర్వక సమర్పణ లేకు౦డా, ఈ విషయాలు అస్సలు లెక్కలోనికే రావు. భక్తి ఉంటే ఈ పద్ధతులేవీ అవసరంలేదు.
ఈ కవిత యొక్క నిజమైన సందేశాన్ని స్పష్టమైన యాంత్రిక, అసంకల్పిత చర్యలను తెరల వెనుక దాచి ఉంచారు. తపస్సు (ధ్యానం) అనునది అయోమయాన్ని విస్మరించే ప్రయాణము. అది కొంటెతనము నుండి దూరంగా జరుగు సన్నాహము.
కీర్తన: శ్రీరంగం రాగిరేకు:
18-17 సంపుటము: 15-449 |
ఎట్టు మన్నించేవో
నన్ను యిటువంటి వాఁడను
దట్టపుటాసల
నిన్నుఁ దడవుచున్నాఁడను ॥పల్లవి॥ పలుమారు మొక్కఁగాను
పరాకు సేసిన ట్టౌనో
మలసి జపించఁగాను
మతి యెంత గరఁగునో
కొలువఁగా
గొలువఁగా కొసరిన ట్టౌనో
తల పెఱుఁగక
నిన్నుఁ దగులుచున్నాఁడను ॥ఎట్టు॥ చేరి పూజించఁగా
నిన్నుఁ జిక్కించు కొన్న ట్టౌనో
సారె నారగింపంచగా
చవి మరపిన ట్టౌనో
వూరకే సేవ
సేయఁగా వొలవేసినట్టౌనో
నోరఁగొలఁదుల
నిన్ను నుతింపుచున్నాఁడను ॥ఎట్టు॥ ఆటలాడి నవ్వించఁగా
నలయించి నట్టౌనో
పాటించి శరణనఁగా
పట్టి పెనఁగిన ట్టౌనో
వాటమై శ్రీవేంకటేశ
వరదుఁడవు నీ వైతే
మేటి నా యాసల
నిన్ను మెప్పించుచున్నాఁడను ॥ఎట్టు॥ |
Details and Explanations:
భావము: ఇటువంటి వాఁడనైన నన్ను ఎట్టు మన్నించెదవో? ఎన్నో ఆశలు పెట్టుకొని నిన్ను (గుడ్డిగా) తడుముతున్నాను.
వివరణము: తిరుమలాచార్యులు తన స్పష్టమైన మరియు నిజాయితీతో కూడిన ప్రకటనతో మనలను ఆకట్టుకుంటాడు. ఎ౦.సి. యెస్చెర్ గారి ఈ క్రి౦ద ఉన్న చిత్ర౦లాంటి గాలిలో ఎగిరే కోట గురి౦చి ఒక పిల్లవానికి వర్ణి౦చామనుకోండి. అది పిల్లవాడి మనస్సుకు ఇట్టే హత్తుకుంటుంది.
ఇది అతని ఊహల్లో ఎప్పటికీ ఉండిపోతుంది. ఇటువంటి ఇతివృత్తంపై మనకు చాలా ఫాంటసీ సినిమాలు ఉన్నాయి. పై చిత్రంలోని పాత్ర వలె, దైవముపై మనకు లెక్కలేనన్ని అధ్రువమైన భావనలు ఉంటాయి.
బొమ్మలోని పాత్రకు మరియు ఊహించిన వస్తువుకు మధ్య చాలా దూరం ఉందని గమనించండి.
మన౦ ఊహల్లో జీవి౦చిన౦తకాల౦, ఖచ్చిత౦గా మన౦ వాస్తవికతకు దూర౦గా ఉ౦టా౦.
ఈ కీర్తనను తిరుమలాచార్యులు ఇలాంటి ఆధారాలతో రచించి వుండొచ్చు.
అన్వయార్ధము: ఎందుకో తెలియదు, కానీ క్షమిస్తావనే నమ్మకంతో
వచ్చాను.
ముఖ్య పదాలకు
అర్ధాలు: పరాకు సేసిన ట్టౌనో = ఆదమఱపు అనుకోవు కదా!, ఏమఱపాటు అనుకోవు కదా; మలసి = విజృంభించి,
అదేపనిగా; తల పెఱుఁగక = అంతరంగమెరుగక;
భావము: పలుమారు మొక్కి పరాకు చేస్తున్నానో? అదేపనిగా జపించితే ఎంతవరకు నీ మనసు కరుగునో? కొలువఁగా గొలువఁగా కొసరినట్లౌనో? నీ అంతరంగమెరుగక తగులుచున్నాఁడనో?
వివరణము: 'తల పెఱుఁగక'తో ఊహించలేని దైవమును మన అల్ప మనస్సులలో ఇరికించబోయి,
ఆతడునూ మన వలెనే అను భావముతో మనిషి వ్యవహరించునని పెదతిరుమలాచార్యులు తెలిపిరి.
అన్వయార్ధము: తల పెఱుఁగక చేయు కార్యములన్నీ దేవుని
తగులుకొనుటకు ఉపయోగపడవని తెలియుము.
ముఖ్య పదాలకు
అర్ధాలు: చవి = రుచి, స్వాదము;
నోరఁగొలఁదుల = నోటితో నేను చేయగలిగినంతా;
భావము: చేరి పూజించఁగా నిన్నుఁ చే జిక్కించు కొన్నట్టా? ప్రసాదాలు నైవేద్యమిచ్చిన చవి మరపినట్టా? నీకు సేవ చేయబోతే వలవేసినట్టా? (నువ్వేదో చేస్తావు అను ఆశతో) శక్తికొలది నిన్ను నుతింపుచున్నాఁడను.
వివరణము: 'నోరఁగొలఁదుల'
తెలివిలేని, వివేకములేని ప్రయత్నాన్ని సూచిస్తుంది.
అన్వయార్ధము: నోరఁగొలఁదుల పూజించినా, చవి మరపినా, దైవమును
చిక్కించు కొన్నట్లు కాదు
ముఖ్య పదాలకు
అర్ధాలు: నలయించి నట్టౌనో = ఆయాసపెట్టు
నట్టౌనో, శ్రమపెట్టు నట్టౌనో; పట్టి
పెనఁగిన ట్టౌనో = బలవంతపు పట్టు పట్టినట్లు కాదా;
వాటమై =
అనుకూలమైనది, త్రోవ, ౘుట్టు వెలుగు వేసిన చోటు;
శ్రీవేంకటేశ వరదుఁడవు = శ్రీవేంకటేశుడా! వరములనిచ్చువాఁడవు;
మేటి = కుప్పలుగా పోసిన;
భావము: ఆటలాడి నర్తించబోతాము. నీకు అలపుకలిగేలా చేస్తామో. నీయమాలు పాటించి శరణని పట్టుబడతామో. హితము, త్రోవ, వెలుగు, చోటు నీవేనని తెలియక శ్రీవేంకటేశుడా నీ ముంగిట కోరికల కుప్పలు పోసి విసిగిస్తామో.
వివరణము: మొదటి రెండు చరణాలలోనూ పలికించిన గమ్యములేని మానవుని వెంపర్లాటమును కొనసాగించిరి. మానవుడు స్వంత ఊహల్లో కొట్టుకొనిపోతుంటాడు. దిగువ చిత్రాన్ని లోతుగా పరీక్షించండి.
ఈ చిత్రం మన మానసిక స్థితి గురించి మనకు చాలా విషయాలు చెబుతుంది. మన మెదడు తర్కము ప్రకారము పని చేస్తుంది. చిత్రంలో చూపిన విధంగా మనస్సు తన స్వంత మార్గాన్ని అనుసరిస్తుంది. మనస్సు వాస్తవికతను తనకు అనుకూలంగా మార్చబోవును. పాపం మెదడు ఏమి చేయుటయో నిర్ణయింపలేక అయోమయంలో పడుతుంది. అందువల్ల, మనిషి ఎప్పటిలాగానే
మూర్ఖముగానే ఉంటాడు.
ఎంత ఉదాత్తమమైనవైనా కొన్ని ఆశలను దృష్టిలో పెట్టుకొని మనం చేసేవన్నీ అవివేకమైన చర్యలే. దేవునికి మన ఉద్దేశాలు వెల్లడియే. మన మనస్సు నిర్మలంగా ఉన్నప్పుడు, ఏ మాటా మాట్లాడవలసిన అవసర౦ లేదు. మన చేతన స్పష్టంగా ఉన్నప్పుడు, ఏ పనీ చేపట్టనవసరం లేదు, ఎందుకంటే మనస్సులోని స్పష్టతయే చర్య. అదే పరమానందము.
అందుకే తిరుమలాచార్యులు భగవంతుని ఆకట్టుకోవడానికి చూడవద్దు. బదులుగా ప్రయత్నములు మాని, ఉన్నవారు ఉన్నట్లే ఉండండి. ఇతరములన్నీ దుఃఖమునకు దారులు అన్నాడు.
అన్వయార్ధము: దైవమును మెప్పించుటను యత్నములే కుర్రచేష్టలు.
వానిని వీడి భగవంతుడి కోసం మీ మనస్సును తెరిచివుంచండి. అతడే మార్గము, కాంతి,
అనుగ్రహము, వరము, మరియు సమస్తమూనూ.
References
and Recommendations for further reading:
#1 24. చంచలము మానితేను సంసారమే సుఖము (chaMchalamu mAnitEnu saMsAramE sukhamu)
#2 85. ఎవ్వరినేర్పులు జెప్ప నిందు నేది (evvarinErpulu jeppa niMdu nEdi)
కీర్తన సంగ్రహ సారం:
పల్లవి: ఇటువంటి వాఁడనైన నన్ను ఎట్టు మన్నించెదవో? ఎన్నో ఆశలు పెట్టుకొని నిన్ను (గుడ్డిగా) తడుముతున్నాను. అన్వయార్ధము: ఎందుకో తెలియదు, కానీ క్షమిస్తావనే నమ్మకంతో వచ్చాను.
చరణం 1: పలుమారు మొక్కి పరాకు చేస్తున్నానో? అదేపనిగా జపించితే ఎంతవరకు
నీ మనసు కరుగునో? కొలువఁగా గొలువఁగా కొసరినట్లౌనో? నీ అంతరంగమెరుగక తగులుచున్నాఁడనో? అన్వయార్ధము: తల పెఱుఁగక చేయు కార్యములన్నీ దేవుని తగులుకొనుటకు
ఉపయోగపడవని తెలియుము.
చరణం 2: చేరి పూజించఁగా నిన్నుఁ
చే జిక్కించు కొన్నట్టా? ప్రసాదాలు నైవేద్యమిచ్చిన
చవి మరపినట్టా? నీకు సేవ చేయబోతే వలవేసినట్టా? (నువ్వేదో చేస్తావు అను ఆశతో) శక్తికొలది
నిన్ను నుతింపుచున్నాఁడను. అన్వయార్ధము: నోరఁగొలఁదుల పూజించినా, చవి మరపినా, దైవమును చిక్కించు
కొన్నట్లు కాదు.
చరణం 3: ఆటలాడి నర్తించబోతాము. నీకు అలపుకలిగేలా చేస్తామో. నీయమాలు పాటించి
శరణని పట్టుబడతామో. హితము, త్రోవ, వెలుగు,
చోటు నీవేనని తెలియక శ్రీవేంకటేశుడా నీ ముంగిట
కోరికల కుప్పలు పోసి విసిగిస్తామో. అన్వయార్ధము: దైవమును మెప్పించుటను యత్నములే కుర్రచేష్టలు. వానిని వీడి
భగవంతుడి కోసం మీ మనస్సును తెరిచివుంచండి. అతడే మార్గము, కాంతి, అనుగ్రహము, వరము,
మరియు సమస్తమూనూ.