Friday, 2 February 2024

T-192 హరి నీవే సర్వాత్మకుఁడవు

                                                                     అన్నమాచార్యులు

192. హరి నీవే సర్వాత్మకుఁడవు

వ్యాఖ్యానము: చామర్తి శంకర నాగ శ్రీనివాస్ 

ఉపోద్ఘాతము: అన్నమాచార్యుల వారు ఈ కీర్తనలను సత్యమునకు దారి చూపు దివిటీలుగా మార్చి  వ్రాసిరి. వారు ఆ వ్యక్తం చేయలేని భావనా స్థితి నుండి ప్రపంచమునకు సెలవిచ్చిన ఈ కీర్తనలను, ముఖ్యంగా అన్నమాచార్యుల అంతరంగమును పరిశీలించక; కేవలము పదముల అర్థములను విశదీకరించుట వలన ప్రయోజనం చేకూరదు. 

వారు తమ కాల పరిస్థితులకు దృష్టిలో ఉంచుకొని తమ విప్లవాత్మక ఉద్దేశములను సంప్రదాయము అను తెరల వెనుక దాచి ఉంచిరి. అతి జాగ్రత్తగా గమనించిన వారు చేరుకున్న  స్థితి నుండి తనకు దైవముతోను లేదా సత్యముతోను ప్రత్యక్ష అనుభవంగా కలిగిన (లేదా తెలుసుకున్న దానిని వివరించుటకు) వేలాది విధములుగా ప్రయత్నం చేసారు. 

అన్నమాచార్యులవారు అత్యంత గహనమైన విషయములను మనకు సూటిగా సులభముగా చెప్పుటకు తేట తెలుగులో వ్రాసినారు. కానీ కాలగమనముతో భాషలోని మార్పులతో అవి అర్థం చేసుకొనుట కొంత కష్టమగుచున్నది. కావున ఈ కీర్తనలను మనము ఊహించుకొని మన అనుభవమునకు వచ్చిన పాక్షిక సత్యములతో రంగులు  అద్ది  భాష్యమును చెప్పుట పరిపాటి అయినది.

 

అధ్యాత్మ కీర్తన: 

రాగిరేకు:  375-5 సంపుటము: 4-441 

హరి నీవే సర్వాత్మకుఁడవు
యిరవగు భావన యియ్యఁగదే          ॥పల్లవి॥
 
చూడక మానవు చూచేటి కన్నులు
యేడనేవైనా యితరములు
నీడల నింతా నీ రూపములని
యీడువడని తెలి వియ్యఁగదే          ॥హరి॥
 
పారక మానదు పాపపు మన సిది
యీరసములతో నెందైనా
నీరజాక్ష యిది నీమయమేయని
యీరీతుల తలఁ పియ్యఁ గదే          ॥హరి॥
 
కలుగక మానవు కాయపు సుఖములు
యిల లోపలఁ గల వెన్నైనా
అలరిన శ్రీ వేంకటాధిప నీకే
యిలనర్పితమను యిహ మియ్యఁగదే          ॥హరి॥

Details and explanations:

హరి నీవే సర్వాత్మకుఁడవు
యిరవగు భావన యియ్యఁగదే పల్లవి॥ 

ముఖ్య పదములకు అర్ధములు: ఇరవు = అనుకూలము, తగిన 

భావము:  హరి నీవే క్షేత్రజ్ఞుడవు. మాలో సానుకూల భావములను కలిగించ రాదా! 

వివరణము: భగవానుడు సర్వాంతర్యామియై వుండగా, మనము దైవమును తెలియుటకు ఏల యత్నము చేపట్ట వలెను అని సందేహము కలుగక మానదు.  మానవుడు ఏ రకమైన కార్యములను చేపట్టిన జన్మ సాఫల్యము పొందును అను ప్రశ్న ఉదయించును. 

వీనికి నేరుగా సమాధానము సులభం కాదు. ఎన్నో మతములున్నను, ఎందరో మహానుభావులు అనేక విధములైన వివరణలు యిచ్చినప్పటికి, ఇది తిరిగి తిరిగి మనలను వేధించుచునే యున్నది. 

అన్నమాచార్యుల ప్రతిభ వారు  మూల విషయములతో సహా మానవులను పరీక్షించు వానిని నేరుగా ప్రస్తావించుటలో వున్నది. మన ఇప్పటి భావనలు సరి అయినవి కావని సూటిగా చెప్పారు. 

చూడక మానవు చూచేటి కన్నులు
యేడనేవైనా యితరములు
నీడల నింతా నీ రూపములని
యీడువడని తెలి వియ్యఁగదే హరి ॥ 

ముఖ్య పదములకు అర్ధములు: యీడువడని = కాలముతో పాటు క్షయమునొందని;

భావముమా కళ్ళు వద్దన్నా కూడా నిన్ను (సత్యము) తప్పించి ఇతరములనే చూచును.  వాటిని దాటి (వానికి నీడలుగా లేదా పరిపూరకములుగా) వున్నది నీవే నని గ్రహించు కాలముతో మార్పు చెందని జ్ఞానమ ఒసగ రాదా! 

వివరణము: మనచుట్టూ వున్న ప్రపంచము అనూహ్యమైనది. దీనిని మనము తరగతులుగాను ఇది లోపలిది. అది బయటది అని విభజించి చూచుటను అన్నమాచార్యులు ఎత్తి చూపు చున్నారు. 

భగవద్గీత పదమూడవ అధ్యాయంలో బహిరంతశ్చ భూతానామ్ అచరం చరమేవ చ (13-16) అనగా జీవులన్నింటికి  బయట లోపలా ఉన్నది, కదులువానియందు  కదలనివానియందునూ ఉన్నది దైవమేఅని చెప్పిరి.  ఎవరైతే అంతరంగములోని వాడు, గుణముల తెరయు, దానికి ఆవల వున్నది ఒకటేనని యథార్థముగా తెలియునో వానినే దృష్ట అనిరి. 

ఇదే విషయమును తెలుపుతూ విశ్వవిఖ్యాత సర్రియలిస్ట్,(అధివాస్తవిక కళాకారులు) రీనె మాగ్రిట్ గారు La Savoir (జ్ఞానం) అను పేరు గల చిత్రమును గీసారు. ఈ చిత్రం వారి ప్రతిభకు అద్దము పట్టును. మనకు పట్టపగలు అనిపించు దృశ్యం అగుపిస్తుంది. అక్కడ ఒక ద్వారము వుంది. ఆ ద్వారము తలుపు తెరచి చూస్తే రాత్రి వేళ, అందులో చంద్రుడు కనబడుతుంటాడు. (ద్వారము తలుపు తెరచి చూచుటను పరీక్షగా చూచుటతో సమముగా చేసికొనవలెను.)


ఈ బొమ్మ ద్వారా వెలుగు చీకట్లు పరికించి చూచిన ఒకే నాణెమునకు ఇరువైపులని చూపారు. సుఖదుఃఖములు అట్లే. పగటిని చైతన్యము గాను, రాత్రిని అనుభవ మునకు అందని దానిని తీసికొన్న చైతన్యాచైతన్యములు అటులనే. ఒక దానిని చూచుట నేర్చిన మరొక దానిని గ్రహించినట్లే. 

కావున, ఈ చరణములో మనము చూచు చూపులను సరి దిద్దు కొనవలెనని ఆచార్యులు చెప్పినారు. దానికి మార్గములు లేవు. "నేను సరిచేసుకోగలను"  అను కొనుట అహంభావము. "చేయలేననుకొనుట" నైరాశ్యము. విష్ణుని ఆశ్రయించిన సంభవము. ఆ మార్గము తెలియుటకై చేయు ప్రయత్నము తపస్సు. అదియే అన్నమాచార్యులు పేర్కొన్న కాలముతో  చెడిపోని యీడువడని తెలివి.

                                పారక మానదు పాపపు మన సిది
                                యీరసములతో నెందైనా
                                నీరజాక్ష యిది నీమయమేయని
                                యీరీతుల తలఁ పియ్యఁ గదే హరి ॥ 

ముఖ్య పదములకు అర్ధములు: యీరసములు = ఈ స్థాయీభావములు (= 1. శృంగారము, 2. హాస్యము, 3. కరుణము, 4. రౌద్రము, 5. వీరము, 6. భయానకము, 7. భీబత్సము, 8. అద్భుతము 9. శాంతము అను రసములు )

భావమునా యీ పాపపు మనస్సు యీరసములలో పారుతూ అక్కడే వుండి పోవ చూచును. నీరజాక్ష కనబడునదంతా నీ మయమే యని  నాకు బోధ పరచవే.

వివరణము: మన ప్రపంచమంతా అనేక అనేక రసములతో స్థాయీభావములతో  ప్రజ్వరీల్లుచున్నది  వీనిలో ఏదో ఒకదానికి మనం తగులుకుంటాం. దానితో ఆ నీరజాక్షుని చూడలేకపోతున్నాం.

అనగా మనము ఏ విధమైన మార్గము ఎంచుకున్నను దానికి ఒడబడు ఏదో ఒక సిద్ధాంతము, భావనము, దర్శనము కలుగ వచ్చును. కావున ఎటువంటి రసములకు ఉద్వేగములకు ఆర్భాటములకు తగలనీ మనసును ప్రసాదించమని అన్నమాచార్యులు కోరుకుంటున్నారు. 

సత్యము ఆశల గాలములకు, జిజ్ఞాసుల కనుల కళ్లెములకు, మరియు భక్తిహీనుల హారతి పళ్ళెములకు లోను కాదు, ఒడబడదు.

                                కలుగక మానవు కాయపు సుఖములు
                                యిల లోపలఁ గల వెన్నైనా
                                అలరిన శ్రీ వేంకటాధిప నీకే
                                యిలనర్పితమను యిహ మియ్యఁగదే హరి ॥ 

ముఖ్య పదములకు అర్ధములు: అలరు = ఒప్పు, ప్రకాశించు

భావముకాయపు సుఖములు ఈ లోకములో ఎన్నో కలవు. శ్రీ వేంకటాధిప నీకే అర్పితమైన లోకము నా కీయ గదే.

వివరణము: “అలరిన శ్రీ వేంకటాధిప నీకే / యిలనర్పితమను యిహ మియ్యఁగదేఎంత శోధించినా మనవాళికి అటువంటి లోకము కాన రాలేదు. కాబట్టి అటువంటి లోకము యత్నమున​ సాధించదగినది కాదని, వేరేమి యుక్తులతోనూ సాధించలేనిది అన్న భావంతో ఓ వెంకటేశ్వర అది నీవు ఇచ్చిన కానీ నేను చేర​ గలిగినది కాదు అని చెప్పారు   

ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ లోకమున మానవునికి ఈ లోకమున అనుభవించు సుఖదుఃఖములకు అతీతముగా ఉండును ఆ భావనలు ఉండవు అని కూడా స్పష్టం చేశారు.

ఈనాటి మానవులు అనేక మత గ్రంథములలో పేర్కొన్న పవిత్రత, నిర్మలత్వము అను వానిని మెచ్చుకొందురు గాని ఆ దిశలో అడుగులు వేయరు. అది తెచ్చి పెట్టుకుంటే వచ్చినది కాదు; కఠోర పరిశ్రమ ద్వారా సాధించ వలసినది.

 

కీర్తన సారాంశం:

పల్లవి: హరి నీవే క్షేత్రజ్ఞుడవు. మాలో సానుకూల భావములను కలిగించ రాదా! 

చరణం 1: మా కళ్ళు వద్దన్నా కూడా నిన్ను (సత్యము) తప్పించి ఇతరములనే చూచును.  వాటిని దాటి (వానికి నీడలుగా లేదా పరిపూరకములుగా) వున్నది నీవే నని గ్రహించు కాలముతో మార్పు చెందని జ్ఞానమ ఒసగ రాదా! 

చరణం 2: నా యీ పాపపు మనస్సు యీరసములలో పారుతూ అక్కడే వుండి పోవ చూచును. నీరజాక్ష కనబడునదంతా నీ మయమే యని  నాకు బోధ పరచవే.

చరణం 3: కాయపు సుఖములు ఈ లోకములో ఎన్నో కలవు. శ్రీ వేంకటాధిప నీకే అర్పితమైన లోకము నా కీయ గదే.

-x-సమాప్తము-x-

T-191 వెదకవో చిత్తమా వివేకించి నీవు

                                                     అన్నమాచార్యులు

191 వెదకవో చిత్తమా వివేకించి నీవు

వ్యాఖ్యానము: చామర్తి శంకర నాగ శ్రీనివాస్

 

ఉపోద్ఘాతము: అన్నమాచార్యుల కీర్తనలు లోతైనవని విని యుందురు. ఈ అత్యంత రమణీయమైన​ కీర్తన అటువంటి వానిలో అగ్రగణ్యమని భావించవచ్చును. కొంచెము పరికించిననూ, ఆచార్యులు మనందరి కోసము తెలిసిన ఈ ప్రపంచము నుండి  తెలియని, ఊహింపలేని, అసాధ్యమగు లోకమునకు బాటలు వేయుచున్నారని బోధపడును. కావున వీటిని వినియోజకుని  వైఖరిలో (like a consumer) బాగున్నదనియో, బాగులేదనియో తీర్పు నిచ్చి, తృప్తిని పొంది, ఆ మీదట ఆవల పారవైచుటకు కాదని తెలియవలెను. 

అధ్యాత్మ కీర్తన:

రాగిరేకు:  272-4 సంపుటము: 3-415

వెదకవో చిత్తమా వివేకించి నీవు
అదనఁ దదియ్యసేవ అంతకంటే మేలు ॥పల్లవి॥

 

చూపులెన్నైనాఁ గలవు సూర్యమండలముదాఁకా
చూపులు శ్రీహరిరూపు చూడ దొరకదు గాని
తీపులెన్నైనాఁ గలవు తినఁ దిన నాలికెకు
తీపు శ్రీహరిప్రసాదతీర్థమని కోరదు ॥వెద॥
 
మాటలెన్నైనాఁ గలవు మరిగితే లోకమందు
మాటలు శ్రీహరినామము మరపఁగ వలె
తేటలెన్నైనాఁ గలవు తీరని చదువులందు
తేటగా రామానుజులు తేరిచె వేదములలో  ॥వెద॥
 
చేఁతలెన్నైనాఁ గలవు సేసేమంటే భూమి
చేఁతల శ్రీవేంకటేశు సేవ సేయవలెను
వ్రాఁతలెన్నైనాఁ గలవు వనజభవుని ముద్ర-
వ్రాఁతలు చక్రాంకితాలె వహికెక్కే ముద్రలు ॥వెద॥

Details and explanations:

వెదకవో చిత్తమా వివేకించి నీవు

అదనఁ దదియ్యసేవ అంతకంటే మేలు ॥పల్లవి॥

ముఖ్య పదములకు అర్ధములు: అదన = అవకాశం; తదీయ = తత్సంబంధమైనది

భావము:  ఓ చిత్తమా వివేకించి వెతుకుము. సరిగా ఎంచి చూచిన దైవ సేవ అంత కంటే మేలైనది కాదా?

వివరణము: ఇక్కడ అన్నమాచార్యులు దైవమును అసలు వెతుకుట అనవసరము అనుచున్నారు. ఈ సందర్భముగావెదకినఁ దెలియదు వెనక ముందరలు / పదమున నిలుపవె పరమాత్మా ॥పల్లవి॥అను కీర్తనను కూడా మననము చేసుకుందాము. ఈ రెండూ కీర్తనలలోనూ కేవలం వెతకడం, శోధించడం, పరిశోధన, విశ్లేషణ, ఆలోచించడం వల్ల సత్యాన్ని గ్రహించడం సాధ్యం కాదు అన్నారు. అయన తరచూ ఈ విషయాన్ని పునరావృతం చేశారు.

ఈ విషయమును రీని మాగ్రిట్ గారు (René Magritte) వేసిన La femme du maçon (= తాపీ మేస్త్రీ భార్య) అను పేరుగల అధివాస్తవిక చిత్రము ద్వారా విశదీకరించు కొందము.

క్రింది బొమ్మలో ఒక మహిళ ఒక ఆకును చూస్తున్నట్లు చూపించారు. మహిళ కన్నులు సౌష్టవముగా కాక తుల్యము తప్పినట్లు చూపారు. మొత్తానికి ఈ బొమ్మ మనలో జిజ్ఞాసకుతూహలములను రేపుతోంది.


ఈ బొమ్మ ద్వారా మాగ్రిట్ గారి సందేశమేమిటో పరిశీలించుదాం.  ఆకు పచ్చని ఆకు ఆ మహిళ మనసులోని  కోరికలకు చిహ్నం. అసహజమైన పెద్ద పెద్ద కన్నులుండి కూడా అమెకు ఆకు తప్పించి వేరేమీ కనబడుటలేదన్నది స్పష్టము. ఆ రకముగా మానవులందరూ తాము కోరువానినే చూచు చున్నారు కానీ ఈ విశాల ప్రపంచమును వున్నది వున్నట్లుగా చూచుటలేదని తెలుస్తోంది. 

సత్యమునకు ఇదమిద్ధమైన ఆకారము, నైజము, ఆస్తిత్వము లేవు కావున దానిని వాంఛించుట​, దానికై వెతుకుట అవివేకము. ఇక​ "తదీయసేవ" తో అన్నమాచార్యులు ఏమి చెప్పదలిచారో? మానవుడు దైవమునకు చేయగల సేవ ఏమి? సర్వ పరిపూర్ణుడగు భగవంతుడు నరునిపై ఆధారపడడు. "తదీయసేవ" అనునది మనము నిర్ణయింప గలిగినది కాదని మాత్రము చెప్పగలము. దీనిని భగవద్గీతలోని క్రింది శ్లోకముతో అన్వయించి చూద్దాం. 

శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ।। 3-35 ।। చక్కగా పాటింపబడిన పరధర్మము కన్ననూ గుణము లేనిదైననూ స్వధర్మాచరణమే శ్రేయస్కరము. స్వధర్మాచరణమందు  మరణము సంభవించిననూ మేలే, ఏలయనగా పరధర్మము భయంకరమైనది. 

అనగా మన ఇప్పటి నైజముతో, ధర్మముతో సంతృప్తి చెంది (సరిపుచ్చుకొని) మనుటయే అత్యుత్తమ ధర్మము. అన్నమాచార్యులు అనేక మార్లు పునరావృత్తము చేసిన "తహతహలిన్నిటికి తానే మూలము గాన సహజాన నూరకున్న సంతతము సుఖము" అనునది గ్రహించుట అత్యావశ్యకము. కావున తదీయసేవతో వారు చెప్పదలచుకున్నది మనము సాధారణముగా ఊహించు సేవ వంటిది కాదు.  

అన్నమాచార్యుల ఆంతర్యము: కాబట్టి తదీయసేవపై విచారించుటకు మనిషి తన సమయమును వెచ్చించవలెను. ఏదో జ్ఞానమును సంపాదించేద్దాం అన్న విచారణలో వుంటామే కానీ వున్న​ 'జ్ఞానము'ను వదిలేద్దాం అని అనుకోము. ఉన్న​ 'జ్ఞానము'ను వదిలించుకొనుట ఎట్లు? దానికి దారులు లేవే? ఇది తెలిసిన వారు అటువంటి లేని దారిని కనుగొందురు; పేర్కొన్న "తదీయసేవ" అనునది ఆ తెరువును కనుగొనుటలో నిమ్మగ్నమౌటను సూచించుచున్నది. 

చూపులెన్నైనాఁ గలవు సూర్యమండలముదాఁకా
చూపులు శ్రీహరిరూపు చూడ దొరకదు గాని
తీపులెన్నైనాఁ గలవు తినఁ దిన నాలికెకు
తీపు శ్రీహరిప్రసాదతీర్థమని కోరదు ॥వెద॥ 

భావముచూచుటకు సూర్యమండలము దాకా విస్తరించి యున్న ఈ ప్రపంచమున అనేకములు కలవు. కానీ దుర్లభమగు శ్రీహరిరూపును చూపు చూపు అసలైన చూపు. (మిగిలినవి వ్యర్థములని భావించవలెను).  కానీ ఈ భూమిలోని రుచులను అస్వాదించుటకు మరిగిన నాలికకు అసలు  తీపియైన శ్రీహరిప్రసాదతీర్థమును కోరదు. 

వివరణము:  ఈ చరణములో అన్నమాచార్యులు చూచిన వెలి చూపులను, మనస్సు మరిగిన తీపులను మరచినకానీ అసాధ్యమగు శ్రీహరి తత్వమును కనుగొనలేమని చెప్పుచున్నారు.  

జ్ఞానము అనగా వినుట​, చూచుట​, తాకుట ద్వారా, వాసన పీల్చుటతోను, రుచులను గ్రహించుట ద్వారాను  తెలుసుకున్న వానినిఅట్టి వానిలో మనసుకు హత్తుకున్న వానిని, బహు జాగ్రత్తగా భద్ర పరచుకున్న వానిని బహిర్గతము చేయుటయే. ఆ రకముగా లోని దానికి బయటి ప్రపంచానికి వ్యత్యాసం లేదని తెలియు వాడు జ్ఞాని.  తనలోని దానిని బయట దానిని విడివిడిగా చూచుటను అజ్ఞానము అనుకోవచ్చును. 

అందుకే, ఈనాడు మునుపెన్నడులేని విధముగా అనేకులు తమ స్వంత అభిప్రాయములను వెలిబుచ్చుచున్నారు. కానీ ఒకరి అభిప్రాయములను వేరొకరిపై రుద్దుట తాము తమకై కోరుకునే స్వేచ్ఛకు వ్యతిరేకమని తెలియలేరు. 

ఈ రకముగా ఆలోచించిన తమలో ఏర్పరచుకున్న ఇంగితములుతలపులను మనచుట్టూ ఆవరించుకొని వున్న  జీవ వాహిని (మనము శ్రీహరి  అని పేరిడిన వాని​) యందు కలిపివేయుటను సత్యమార్గము అనుకోవచ్చును. అంతేకానీ తమ మనోనిశ్చయములను పరులపై బలవంతముగా మోదుట వివేకము అనిపించుకోదు.  

మాటలెన్నైనాఁ గలవు మరిగితే లోకమందు
మాటలు శ్రీహరినామము మరపఁగ వలె
తేటలెన్నైనాఁ గలవు తీరని చదువులందు
తేటగా రామానుజులు తేరిచె వేదములలో       ॥వెద॥ 

ముఖ్య పదములకు అర్ధములు: తేటలు = విధములు, మార్గములు

భావముచక్కని, జ్ఞానమును ప్రకాశింప చేయు  వాక్యములెన్నియో కలవు ఈ లోకమున. వానిలో శ్రీహరి  నామమును కూడా తనలో యిముడ్చుకున్న నిశ్శబ్ద మును తెలియుము. మార్గములు ఎన్నో కలవు గాని, రామానుజులు చూపిన వేద మార్గమును కనుగొనుము,

వివరణము: అన్నమాచార్యులు పేజీలను నింపుటకు కవిత్వం వ్రాయట లేదు. అతి క్లుప్తంగా నిశ్శబ్దము నకు మార్గము కనుగొనుము అంటున్నారు. మన మనస్సు అను ఈ అకటవికట ప్రపంచము నుండి ఆశలు రేపు మాటల అలలు తాకని దానిని తెలియ మంటున్నారు .

మౌనము నందు దాగి యున్న మార్గము చేతన స్థితి నుండి చేరగలిగినది కాదు. మన ఇప్పటి క్రియ ప్రతిక్రియల యందు ఊగిసలాడు ప్రవృత్తితో సాధ్యము కాదు

చేఁతలెన్నైనాఁ గలవు సేసేమంటే భూమి
చేఁతల శ్రీవేంకటేశు సేవ సేయవలెను
వ్రాఁతలెన్నైనాఁ గలవు వనజభవుని ముద్ర-
వ్రాఁతలు చక్రాంకితాలె వహికెక్కే ముద్రలు ॥వెద॥


ముఖ్య పదములకు అర్ధములు: యెక్కువ సంకీర్తనము = సంకీర్తనము తప్ప వేరేమీ ఎరుగని;

భావముఈ లోకమున ఎన్నో పనులు వున్నప్పటికి శ్రీవేంకటేశుని సేవను మించిన పనులు లేవు.  శ్రీవేంకటేశుని సేవ చేసి అప్పుడు గదా ఆ విష్ణుని ముద్రలు మోయుటకు అర్హత కలుగునది? అదికాక కదా మానవులకు గణింప తగినదేమి?

 

వివరణము: ఇక్కడ తదీయసేవ’ శ్రీవేంకటేశు సేవ ఒకే అర్థములో తీసికొనవలె. ఈ రకముగా అన్నమాచార్యుల వారు, దైవమును సేవించు మని, ఆ సేవ ఏమియో తెలిసితదేక దీక్షతో నెరవేర్చి తరించమని బోధించారు.

 

కీర్తన సారాంశం:

పల్లవి: ఓ చిత్తమా వివేకించి వెతుకుము. సరిగా ఎంచి చూచిన దైవ సేవ అంత కంటే మేలైనది కాదా?

చరణం 1: చూచుటకు సూర్యమండలము దాకా విస్తరించి యున్న ఈ ప్రపంచమున అనేకములు కలవు. కానీ దుర్లభమగు శ్రీహరిరూపును చూపు చూపు అసలైన చూపు. (మిగిలినవి వ్యర్థములని భావించవలెను).  కానీ ఈ భూమిలోని రుచులను అస్వాదించుటకు మరిగిన నాలికకు అసలు  తీపియైన శ్రీహరిప్రసాదతీర్థమును కోరదు. 

 

చరణం 2: చక్కని, జ్ఞానమును ప్రకాశింప చేయు  వాక్యములెన్నియో కలవు ఈ లోకమున. వానిలో శ్రీహరి  నామమును కూడా తనలో యిముడ్చుకున్న నిశ్శబ్ద మును తెలియుము. మార్గములు ఎన్నో కలవు గాని, రామానుజులు చూపిన వేద మార్గమును కనుగొనుము,

 

చరణం 3: ఈ లోకమున ఎన్నో పనులు వున్నప్పటికి శ్రీవేంకటేశుని సేవ ను మించిన పనులు లేవుశ్రీవేంకటేశుని సేవ చేసి అప్పుడు గదా ఆ విష్ణుని ముద్రలు మోయుటకు అర్హత కలుగునది? అదికాక కదా మానవులకు గణింప తగినదేమి?

-x-సమాప్తము-x-

 


235 mollalEle nAku tanne muDuchukommanave (మొల్లలేలె నాకు తన్నె ముడుచుకొమ్మనవె)

  ANNAMACHARYULU 235 మొల్లలేలె నాకు తన్నె ముడుచుకొమ్మనవె mollalEle nAku tanne muDuchukommanave తెలుగులో చదవడానికి ఇక్కడ నొక్కండి. I...