Sunday, 1 June 2025

T-226. దివమట రాతిరట తీరుచున్నదా

 తాళ్లపాక అన్నమాచార్యులు

226. దివమట రాతిరట తీరుచున్నదా 

For English versionpress here

 

ఉపోద్ఘాతము

ఇది నూటికి నూరుపాళ్ళు అన్నమయ్యగారి మార్కు కీర్తన.

అనేకానేక అర్థాలు స్ఫురించే ఈ కీర్తన,

మన మానవులుగా "సత్యం" అని ఊహించే దానిని సమూలంగా తుడిచిపెట్టి,

కొత్త అర్థాలు తట్టునట్లు చేస్తుంది.

వేదాంతం వ్రాయడం ఒక ఎత్తు.

దానిని కీర్తనగా మార్చటం ఇంకొక ఎత్తు.

అదే కీర్తనను ప్రజలకు బోధపడేలా చేయడం మరో ఎత్తు.

ఇది అనన్యసాధ్యం. అమోఘం. అమృతం. 

 

అధ్యాత్మ కీర్తన

రేకు: 322-6 సంపుటము: 4-129

దివమట రాతిరట తీరుచున్నదా
కవగూడఁ బాయఁ గాక కాణాచి వున్నదా      ॥పల్లవి॥
 
మానుష జన్మమట మలమూత్రదేహమట
సోనల హేయమేకాక శుద్ధి వున్నదా
మానని కోరికలట మాయల సంసారమట
దీనవృత్తేకాక యిందుఁ దేజమున్నదా       ॥దిన॥
 
చంచలపుఁ జిత్తమట సకలేంద్రియములట
పొంచిన పాపమేకాక పుణ్యమున్నదా
సంచితపుఁ గర్మమట జనన లయములట
ముంచిన తీదీపేకాక మోదమున్నదా        ॥దిన॥
 
శ్రీవేంకటేశుఁడట జీవుఁడనేనట యిందు
దైవపుదాస్యమే కా కితరమున్నదా
యీవల నావలన ట యిహముఁ బరమునట
కైవశము లాయఁగాక కడమున్నదా ॥దిన॥

Details and Explanations:

Chorus:

దివమట రాతిరట తీరుచున్నదా
కవగూడఁ బాయఁ గాక కాణాచి వున్నదా ॥పల్లవి॥ 

ప్రతిపదార్థము: దివమట = దేన్నో దినమంటారుట;  రాతిరట = ఏదో రాత్రంటారుట; తీరుచున్నదా = అంతటితో ముగిస్తున్నదా?; కవగూడు = పట్టుకొను, సంభోగించు, జతగూడు; బాయఁ గాక = బాప్ప, అత్తమ్మ, బాయ వంటివి సంబంధాలా? కాణాచి =  చిరకాలవాసస్థానము, వంశపారంపర్యముగా వచ్చునది. 


సామాన్య భావము:

పగలంటారు, రాత్రంటారు — కానీ వాటికి అంతముందా?

ఒకటి ముగియగానే ఇంకొకటి వస్తూవుంటుంది.

ఆ చక్రము ఆగుతుందా? (ఆగదే!)

ఈ అంతంలేని వెలుగు నీడల ఆటలో

బంధాలు ఏర్పరచుకుంటాం

నీవు అనుభూతిచెందు చుట్టరికములు శాశ్వతమా?

ఇవేమైనా  దైవమిచ్చిన వంశపారంపర్యమా? (కాదే).


సూచ్యార్థము

పగలును  చైతన్యం గాను.

రాత్రిని అంటే మరణంగాను.

అనుకొంటే

ఈ రెండు — ఒకదానివెంబడి ఒకటి

ఆగకుండా సంభవిస్తాయి —

చైతన్యం నుంచి శూన్యము, శూన్యము నుంచి చైతన్యం —

ఈ బ్రహ్మాండ ధర్మం —
ఇది గిరగిరఁ దిరుగు చట్రము.

 

మానవుడా

ఈ భ్రమణముల మధ్య కాలంలో  
మనసు ఏదో ఒక ఆధారాన్ని పట్టుకోవాలనుకుంటుంది.
అదే కారణంగా మనం బంధాలు ఏర్పరచుకుంటాం,
వస్తువులను సంపాదిస్తాం,
సంతోషాన్ని అన్వేషిస్తాం.

అయితే —
ఈ అనుసంధానాలన్నీ అపార్థాలపై ఆధారపడినవి.
మనకు అవి సొంతం అనిపించవచ్చు,
కానీ అవి శాశ్వతమా?
వాటి పట్ల మనకున్న హక్కు నిజంగా దైవదత్తమా?

ఈ మార్పుల మధ్య,
ఇది నా కాణాచి” అని భావించే మన స్థితి —
అదే బలమైన మాయాజాలం అని అన్నమయ్య మనకు తెలియజేస్తున్నాడు
.


సారాంశం

ఈ సృష్టి అంతా

ఒక విరామం లేని సంగీతప్రవాహం.

రేయింబవళ్ళూ, జీవన్మరణాలు —

ఒకదానితో మరొకటి గడిచిపోతూ

లయతప్పక నాట్యమాడుతుంటే —

మనం మాత్రం అర్థంకాని

బంధాల మధ్య తలమునకలవుతాం.

 

మానవుడా!

నీవు పట్టుకున్న బంధాలు

నీ కాణాచి కావు —

నీ అహంకార భావనల అట్టడుగున

నీవే నిర్మించుకున్న కల్పిత నిబద్ధతలు.


అన్నమాచార్యుల ఆంతర్యము:

భగవద్గీతలోని క్రింది శ్లోకము అధారముగా

యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ ।

యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః ॥ 2-69

దినమనగానేమి?

రాత్రి యన నేమి?

ఈ ప్రపంచానికి నీకు ఉన్న సంబంధమేమి?

ఈ విచారణ లేని జీవితము  విలువ లేని జీవితం.


వివరణము: బహు పొరలలొ విస్తరించి ఉన్న ఈ అలౌకికమైన పల్లవిని రెనే మాగ్రిట్ గారు రచించిన అందమైన సంబంధాలు (The Beautiful Relations, 1967)  అను పేరు గల బొమ్మ సహాయంతో తెలుసుకుందాం.

 


పై బొమ్మలో మనిషి కన్ను ముక్కు పెదవులు  ఒక బెలూన్ లాంటిది గాలిలో తేలుతున్నట్లుగా; వెనకాల మేఘాలు ఉన్నట్టుగా కనబడుతుంది. కళ్లు ముక్కు పెదవుల వంటి ఇంద్రియాల ఆధారముగా మనం ప్రపంచమును తెలుసుకోబోతాం.  బెలూన్ వాస్తవ పరిస్థితులకు తార్కాణం. ముక్కుకు ఒక పక్క కన్ను బదులు బెలూన్ చూపించి  రెండింటి (మనము గ్రహించు దానికి, యథార్థముగా వున్న దానికి)  మధ్య  ఎంతో కొంత వ్యత్యాసం ఉంటుంది అన్నారు మాగ్రిట్.


బొమ్మతో అన్వయం​:

మనసులో అర్థమయ్యేదొక వైపు, బయట నిజంగా ఉన్నదొక వైపు.
ఈ రెండింటి మధ్య జరుగు కోలాహలమే జీవితం.
ఇది మాట్లాడే భాష కాదు — వ్యక్తమయ్యే కార్యాచరణ.
పెదవులు ఏం చెప్పినా, మిగతావారికి అర్థమయ్యేది —

నీ జీవితం ఎలా మాట్లాడుతోందో అది మాత్రమే.
నీ మనసు, నీ మాటా ఒకటైతే నిత్య సంతోషం. లేకపోతే నిత్య నరకం.
 


First Stanza:

మానుష జన్మమట మలమూత్రదేహమట
సోనల హేయమేకాక శుద్ధి వున్నదా
మానని కోరికలట మాయల సంసారమట
దీనవృత్తేకాక యిందుఁ దేజమున్నదా   ॥దిన॥ 

భావార్థము:

ఇది మనుష్యజన్మట — నిజమే?

మలమూత్రాల మలిన దేహమట!

దేంతో తుడుస్తావో — ఎలా శుద్ధమవుతుందో?

ఆగని కోరికలతో మాయల సంసారమట —

దీనివల్ల  మేలు ఏది?

దీనంగా వేడుకునేదేనా జీవితం? —

ఇందులో ఒక్క చిమ్మట తేజస్సుందా?


Second Stanza:

చంచలపుఁ జిత్తమట సకలేంద్రియములట
పొంచిన పాపమేకాక పుణ్యమున్నదా
సంచితపుఁ గర్మమట జనన లయములట
ముంచిన తీదీపేకాక మోదమున్నదా    ॥దిన॥ 

భావార్థము:

మానవుడా!

చంచలమైన నీ మనసు,

ఇంద్రియాల కలకలం నిత్యం.

ఇవి పొంచివుండి పాపాల దారి పట్టిస్తున్నాయి—

నీకు పుణ్యమేమిటో తెలుసా?

 

కర్మల సమాహారం

జననం, మరణం వంటి పునరావృతాల

కారణమంటారు వివేకులు .

కానీ ఈ జీవితమొక అవకాశం.

ఈ ఆగడాలను  అధిగమించి బంధాల నుంచి విముక్తి సాధించే తెఱిపి.

 

ఈ ఆనందం, ఈ బాధలు నీవు నిర్మించుకున్న అనుబంధాల ఫలితమే—

జీవుడా! నిజమైన సంతోషం ఉందా? ఆలోచించు!

 

(మానవుడా! నీవు భూమ్మీద​ ఉన్నావంటే మార్పు సాధ్యమే;

ఇక నీ ప్రయత్నమే లోటు.)

 


3rd Stanza: 

శ్రీవేంకటేశుఁడట జీవుఁడనేనట యిందు
దైవపుదాస్యమే కా కితరమున్నదా
యీవల నావలన ట యిహముఁ బరమునట
కైవశము లాయఁగాక కడమున్నదా        ॥దిన॥ 

భావార్థము:

వారంటారు “అతడు శ్రీవేంకటేశుడని — శాశ్వత సత్యమని.”

కానీ ఆ దైవ స్వరూపం  తెలియని వాడిని. ​

ఈ కనబడుతున్న శరీరం, ఈ జీవితం — తాత్కాలికమే,

(అయితే అన్నమాచార్యులు తన స్వరూపాన్ని కూడా గుర్తించలేరు.)

 

దైవపుదాస్యం తప్పించి

మరేమైనా కార్యముందా మానవులకు?

 

యీవల నావలన ట యిహముఁ బరమునట

కైవశము లాయఁగాక కడమున్నదా

 

ఇటు వైపు, అటువైపు అంటుంటారు.

ఒకటి ఇహముట​, ఇంకోటి పరముట,

కానీ ఇది ఏ లోకమో  తెలియుటలేదు.

(ఇక్కడ ‘ట’ అక్షరం సూచించే అనిశ్చితత ఇదే.)

రెండు లోకాల మధ్య అన్నమాచార్యులకు వ్యత్యాసం కనిపించదు.

 

ఈ రెండూ నా లోపల ఉండగా,

ఆశించాల్సింది మరేమి?

 


వివరణము: పై వ్యాఖ్యానం వ్రాయుటకు ఇన్నియుఁ జదువనేల యింతా వెదకనేల అను కీర్తన నుండి కొంత భాగం తీసుకున్నాను. 

యీవల నావలన ట (కన్ను దెరచుటొకటి కనుమూయుటొకటే)       

యిహముఁ బరమునట (పరమమనేదొక్కటే ప్రపంచమొక్కటే)

X-X- సమాప్తం   -X-X

3 comments:

  1. Putting link to referred other keerthana blog makes it easy to read that as well and appreciate connection.

    Beautiful Relations painting use is very good.

    Very good keerthana; your introduction remark capture well.
    Gita sloka that you feel inspired this keerthana may or may not be accurate; you have not fully established connection.

    Overarching vedanitic reflection can be understood by giving context of keerthana before and after this keerthana in the plates.

    ReplyDelete
  2. Ve ry clear explanation. Annamacharya's sahithyam is very much philosophical

    ReplyDelete
  3. జననమరణముల నడుమ యేర్పడే బంధాలు ఆశాశ్వతములు.జీవితం ఆశాశ్వతం,దేహమనిత్యము. కోరికలకు అంతేలేదు.మనస్సు చంచలమైనది.
    ఇంద్రియక్లేశములకు అంతులేదు.ఇంద్రియార్థములు పాపహేతువులు.కర్మలు జననమరణ హేతువులు. వీటన్నిటినుంచి విముక్తి పొందు
    మార్గం భగవద్దాస్యమే అంటున్నారు ఆచార్యులవారీ కీర్తనలో.
    🙏🏻
    కృష్ణమోహన్

    ReplyDelete

235 mollalEle nAku tanne muDuchukommanave (మొల్లలేలె నాకు తన్నె ముడుచుకొమ్మనవె)

  ANNAMACHARYULU 235 మొల్లలేలె నాకు తన్నె ముడుచుకొమ్మనవె mollalEle nAku tanne muDuchukommanave తెలుగులో చదవడానికి ఇక్కడ నొక్కండి. I...