Thursday, 26 June 2025

T-233 చావుతో సరియైన సౌఖ్యంబులోఁ దగిలి

 తాళ్లపాక అన్నమాచార్యులు

233. చావుతో సరియైన సౌఖ్యంబులోఁ దగిలి

For English version press here

ఉపోద్ఘాతము

"చావుతో సరియైన సౌఖ్యంబులోఁ దగిలి"
అనే కీర్తన, అన్నమాచార్యుల
స్వతంత్ర తత్వచింతనకు ప్రత్యక్ష సాక్ష్యం.
 
ఆనాటి సమాజపు తాత్కాలిక నైతిక మూసలకు,
అమోదించిన భక్తి రూపాలకు,
కవిత్వ ప్రమాణాలకు భిన్నంగా —
ఇక్కడ ఆయన "చావు" అనే విషయాన్ని
నిర్భయంగా, స్పష్టంగా చర్చిస్తారు.
 
ఈ కీర్తన అంతటా "ఒండె?" అనే పదం
 పునరావృతమవుతూ,
ఒక మౌన గంభీరతతో,
గుండె గుబులుతో —
మరణాన్ని ప్రశ్నగా నిలుపుతుంది.
ఈ జీవితం నిజంగా మరణంకంటే మెరుగైనదేనా?
అని నిష్ఠురంగా నిలదీయగల ధైర్యం ఈ పదంలో దాగుంది.
 
అన్నమాచార్యులు జీవనంలో
మనము చేకొంటున్న అనేక అనుభూతులను,
అనేక కార్యాల్ని ఒక్కొక్కటిగా పరిశీలిస్తూ,
వాటిలో దాగిన స్వార్థమూ, అసత్యమూ వెలికి తీయుతారు.
 
ఈ ప్రస్తుత జీవన యాత్ర — సాధారణంగా మనం భావించేది లాగా —
ఏదైనా ఉన్నతమైన లక్ష్యం వైపు కాదని,
క్రమంగా మరణ వైపుకే తీసుకెళ్తుందని
ఆయన సూక్ష్మంగా, కానీ గంభీరంగా వెల్లడిస్తారు.

 

 

అధ్యాత్మ కీర్తన

రేకు: 26-2 సంపుటము: 1-157

చావుతో సరియైన సౌఖ్యంబులోఁ దగిలి
వేవేలు దురితముల వేగించు టొండె        ॥చావుతో॥
 
కనుఁగొనల నిరుమేను గాఁడి పారుట లొండె
చనుఁగొండలను మహాచరులఁ బడు టొండె
తనివోని సురతములఁ దగిలి మునుఁగుట యొండె
ఘనమోహబంధములఁ గట్టువడు టొండె   ॥చావుతో॥
 
మొనసి యాశాపాశముల యురులఁ బడు టొండె
కనలి పొలయలుకచేఁ గాఁగు టది యొండె
మనసు కాఁతాళమున మల్లువెనఁగుట లొండె
పనిలేని మదనాగ్నిఁ బడి పొరలు టొండె   ॥చావుతో॥
 
తడసి మమతల నిరంతర దైన్యమది యొండె
నడుమనే కన్నుగానక తిరుగు టొండె
యెడప కీతిరువేంకటేశుఁ దలఁపఁగలేక
పడని పాట్లనెల్లఁ బడి వేఁగు టొండె ॥చావుతో॥

 

Details and Explanations:

పల్లవి:

చావుతో సరియైన సౌఖ్యంబులోఁ దగిలి
వేవేలు దురితముల వేగించు టొండె ॥పల్లవి॥
 

పదబంధం

అర్థం

చావుతో సరియైన సౌఖ్యంబులోఁ దగిలి

చావుతో సరిసమానమైన ఇహ సౌఖ్యముబులోఁ దగులుకొని

వేవేలు దురితముల వేగించు టొండె

వేలాది  పాపములలో వేగించ బడతావేకానీ వేరే యేమైనా వుందా? (లేదే)

ఒండె

అట్లు కానియెడల; ఇది కాక పోతే వేరే యేమైనా వుందా? అన్న అర్థములో వాడారు.


భావము:

మానవుడా! “ఇహ సౌఖ్యముబులోఁ దగులుకొని  వేలాది  పాపములలో వేగించ బడతావే” ఇది చావు కాక మరేమి?


వ్యాఖ్యానం:

అన్నమాచార్యులు తిరిగి తిరిగి పొందాలి
అని మనము కోరే సుఖముల రహస్యం విప్పుతున్నారు.
సుఖాలను కోరడం తప్పు కాదు.
కానీ — దేనిచేత ప్రేరేపించబడి మనం వాటిని కోరుతున్నామో ఒకసారి ఆలోచిద్దాం.


తిరిగి పొందాలి అన్న తపన  మనవెంట బడినప్పుడు
సిగరెట్టుని నువ్వు పీలుస్తున్నావా?
లేక సిగరెట్టు నిన్ను పీల్చేస్తోందా
అన్న సమస్య లాంటిది
ఆశ, ఆనందం, అలవాటు, అస్తిత్వం అన్నీ కలిసిపోయే ప్రశ్న.

మనిషి ముఖ్యంగా సమస్యలులేని జీవితం కోరుకుంటాడు.
ఇది కూడ ఒక రకమైన కోరిక అని గ్రహించడు
కోరికలన్నీ ఎండమావులలోని నీరువంటివి.
దాని వాలకం ఊరిస్తుందే కాని చేరుకోలేము.
ఎంత ప్రయత్నించినా సమస్యలులేని జీవితం
ఊరిస్తుందే తప్ప సాధ్యపడదు.
నెమ్మది నెమ్మదిగా  ఆ వైపు ప్రయాణం
నెట్టుకెళ్ళ వచ్చనిపిస్తుందే తప్ప
అది బాటలేని దారి

మనిషికి రెండు మార్గాలే:
ముళ్ళతో కూడిన జీవితంతో సహజీవనం
లేదా ముళ్ళు విప్పిన జీవితం

ఈ “సమస్యలులేని జీవితం” అనే లక్ష్యమే
మన జీవన ఒత్తిడికి మూలం.
ఆ లక్ష్యం మనల్ని నిరంతరం తృష్ణ, తపన, ఆశలలోకి నెట్టుతుంది.
ఒత్తిడిలేని జీవితమే సుఖజీవితం.


ప్రశ్న:  మీరు చెబుతున్న కోరికలు  లేని జీవితం చైతన్యము లేనిదికాదా?”

జవాబు:  కోరికలు  లేని జీవితం అటువంటిదని
పరిశీలన చేయకయే ఎట్లు చెప్పవచ్చును?
చాలా సులభమండి
కోరికలు లేక పోతే మనని
నిత్యము అలమటించుచున్న ఒత్తిడి వుండదు.
అదే సుఖమయ జీవితం.
నిశ్చలమైన బుద్ధియే ద్రష్టఅని భగవద్గీత చెప్పినది కదా

ఇక్కడ అన్నమాచార్యులు
"వేవేలు దురితముల వేగించు టొండె" అని చెప్పి
అయ్యలారా అమ్మలారా మీరు
  సౌఖ్యం అను కౌగిలిలో ఇప్పటీకే చిక్కుకొన్నారు కదా!
ఆ సౌఖ్యం వెంటబడి మిమ్మల్ని వేగించుచున్న సంగతి గ్రహించలేరా?
అంతకు మించిన మరణమొకటున్నదా
అని ప్రశ్నించుచున్నారు.

మొదటి చరణం:

కనుఁగొనల నిరుమేను గాఁడి పారుట లొండె
చనుఁగొండలను మహాచరులఁ బడు టొండె
తనివోని సురతములఁ దగిలి మునుఁగుట యొండె
ఘనమోహబంధములఁ గట్టువడు టొండె        ॥చావుతో॥ 

పదబంధం

అర్థం

కనుఁగొనల నిరుమేను గాఁడి పారుట లొండె

రెండు కనుల మధ్య గీసిన గీతల మధ్య గాఁడిలో పరుగెత్తుత కాక మరేమి

చనుఁగొండలను మహాచరులఁ బడు టొండె

మనసులో తిష్టవేసుకున్న  చనుఁగొండలను పర్వతములవెంట  బడుట కాకేమి

తనివోని సురతములఁ దగిలి మునుఁగుట యొండె

ఎంతకీ తనివితీరని కామ భోగములలో తగిలి మునిగివుండట కాకేమి

ఘనమోహబంధములఁ గట్టువడు టొండె

మనసులో బాగుగా ఏర్పరచుకున్న మోహబంధములకు కట్టుబడి వుండుట కాకేమి


భావము: 

మానవుడా —
నీ జీవితం,
రెండు కన్నుల మధ్య గీసిన గీతల మధ్య
ఒక గాడిలో పరుగెత్తడమే కాని ఇంకేమి?
 

నీ మనసులో తిష్ట వేసిన చనుగొండలను
పర్వతాల్లా భావించి, వాటివెంటే పడిపోవడమే గాని —
ఇంకేమైనా అనిపిస్తున్నదా?
 

తీరని కామభోగాల్లో
దగిలి, మునిగిపోవడమే తప్ప —
వేరే దారి ఏదైనా కనిపిస్తుందా?
 

నీ మనసే కట్టుకున్న మోహబంధాలకు
నీవు కట్టుబడి ఉండడమే —
అది తప్ప ఇంకేమిటి నీ జీవితం?


వ్యాఖ్యానం:

కనుఁగొనల నిరుమేను గాఁడి పారుట లొండె

(True seeing is absent — we are running in the furrow between our own eyes.)
రెండు కనుల మధ్య గీసిన గీతల మధ్య
నాగేటిచాళీ లాంటి గాఁడిలో
నడయాడే చూపు కూడా చూపేనా.

"చూచేచూపు లేక" జీవితం గానుగ ఎద్దు నడకలా మారిపోతుంది.
ఇది మనలో లోతుగా పాతుకున్న మోహం:
"నన్ను నేను బాగా తెలుసుకుంటున్నాను" అన్న భావన.
నిజంలా అనిపిస్తుంది — కానీ
ఆ "తెలుసుకోవడం" అనేది
జ్ఞాపకాల పొరల్లోనూ, అభిప్రాయాల గుడిలోనూ
నిర్మితమైనది.
 
ఆ జ్ఞాపకములే మనకు "కేంద్రబిందువులు".
వానినుంచే మనం చూస్తాము, స్పందిస్తాము, ఆశించుతాము.
కానీ ఆ కేంద్రం వాస్తవమైనది కాదు —
ఇది మనమే తయారు చేసుకున్న బంధనం మాత్రమే.

మన జీవనాన్ని మనం కొత్తగా చూడం,
వాస్తవానికి మన చూపే ముసుగు బేరము.
గానుగ ఎద్దులా ఒక చట్రంలో నడుపుదామనుకొంటాం.
 
ఎక్కడికీ పోదు, చక్రంలో తిరుగుతుంది.
మన అభివృద్ధి పధకాలు కానీ —
ప్రార్థనలు కానీండి, నియమాలు కానీండి, సాధనలు, ప్రణాళికలు —
ఒకే నిర్మాణ విన్యాసం.
 
జీవనానికి మంచి రహదారులున్నా
నడిచే దారిని బంగారు చెరులున్నా —
నూతిలోని కప్పవంటి బతుకు

ఇక్కడే అసలు సందేశం మెరుస్తుంది:
"స్వేచ్ఛవైపుకు ప్రయాణం"
"స్వేచ్ఛగా ఉండటం"
ప్రయాణం కొనసాగుతూనే ఉంటే
మనం ఇంకా అదే గాడిలో ఉన్నట్టే.

బయటపడాలి —
క్రమంగా కాదు, ఒక్కసారిగా.
చట్రం విడిచిపెట్టాలి.
గాడి దాటి చూడగలగాలి.

లేకపోతే —
మన బ్రతుకు మట్టిలో గీసిన గీతలోనే తిరుగుతుంది.
దానిని "జీవితం" అని మురిసిపోవచ్చు —
కానీ అది గాడెద్దు నడక మాత్రమే.


రెండవ చరణం:

మొనసి యాశాపాశముల యురులఁ బడు టొండె
కనలి పొలయలుకచేఁ గాఁగు టది యొండె
మనసు కాఁతాళమున మల్లువెనఁగుట లొండె
పనిలేని మదనాగ్నిఁ బడి పొరలు టొండె        ॥చావుతో॥ 

Telugu Phrase

Meaning in English

మొనసి యాశాపాశముల యురులఁ బడు టొండె

ఈ జీవితము యాశాపాశముల వాడికొనలపై దొర్లించబడ్డట్టే కానీ వేరేమి గలదు.

కనలి పొలయలుకచేఁ గాఁగు టది యొండె

ప్రణయ కలహములలో కాగికాగి వాడిపోయినట్లుండు గాక​, మఱేమిటిగానుండు

మనసు కాఁతాళమున మల్లువెనఁగుట లొండె

కోపమను ముళ్ళతో పెనగులాట కాక ఇది మఱేమి?

పనిలేని మదనాగ్నిఁ బడి పొరలు టొండె

మదనాగ్నిలో పనిలేక పడి పొరలుట కాక వేరేమి?

 


భావము:

ఈ జీవితము
ఆశాపాశముల వాడికొనలపై దొర్లించబడుతూ సాగుచుండును.

ప్రణయ కలహములలో కాగికాగి వాడిపోవును. 

కోపమను ముళ్ళతో పెనగులాడి గాయపడుతుందే
కానీ సాధించేదేమి?

మదనాగ్నిలో పనిలేక పడి ఉక్కిరిబిక్కిరగుట కాక వేరేమి?

మానవుడా నీవు జీవించేదేమి? పొందేదేమి? 


వ్యాఖ్యానం: 

"మనసు కాఁతాళమున మల్లువెనఁగుట లొండె"

మనస్సు ఒకసారి కోపంలో భగ్గుమంటే, అది ఆర్పడానికి కాదు — సమరానికి దూకుతుంది.
ఆ సమరం ఓ స్పష్టమైన శత్రువుతో కాదే — అది ముళ్ళపొదలో చిక్కిన బట్టను లాగినట్లే.
విడిపించుకోవాలన్న ప్రతి కదలిక, చిక్కును ఇంకా పెంచుతుంది.

ఈ విధంగా, మన జీవితం మనమే లోలోపలే రేపుకున్న గాయాల దొంతరగా మారిపోతుంది — కష్టాన్ని అభివృద్ధిగా, కల్లోలాన్ని విముక్తిగా అన్వయించుకుంటూ.


మూడవ చరణం:

తడసి మమతల నిరంతర దైన్యమది యొండె
నడుమనే కన్నుగానక తిరుగు టొండె
యెడప కీతిరువేంకటేశుఁ దలఁపఁగలేక
పడని పాట్లనెల్లఁ బడి వేఁగు టొండె       ॥చావుతో॥

 

Telugu Phrase

Meaning in English

తడసి మమతల నిరంతర దైన్యమది యొండె

నిరంతరము మమతలలో తడసి వుండాలను కొంటావు. అంతకన్నా దురవస్థ, దీనత్వమఉంటాయా?

నడుమనే కన్నుగానక తిరుగు టొండె

రెండు మరణముల మధ్య కాలములో ( నీకిచ్చిన అవకాశాన్ని కాలదన్నుతూ), కనులుగానక తిరుగుతావే? (అంతకంటే మరణమే మేలు కదా?)

యెడప కీతిరువేంకటేశుఁ దలఁపఁగలేక

వదలకుండా తిరువేంకటేశుని తలచనుకూడా లేవు. (చిన్నపనికూడా సరిగా నెరవేర్చలేవు)

పడని పాట్లనెల్లఁ బడి వేఁగు టొండె

పడరాని పాట్లను పడి వేగుతున్నావెందుకో? (ఇంతేనా నీజీవితం?).


భావము:

నిరంతరం —
అందమైన మమతలు, మమకారాల
వెచ్చదనంలో నిత్యం తడిసి ఉండాలనే తపన నీది.
కానీ అదే తపన —
నీ జీవితాన్ని అలసటకు,
అసహ్యమైన దైన్యతకు దారి తీస్తుంది. 

ఒక్క క్షణం ఆగలేక,
లోపలికి చూపు తిప్పలేక,
కన్నుగానక నీవు సాగుతూనే ఉంటావు —
ఒక క్షణం నుండి మరొక క్షణానికి,
ఒక జన్మ నుండి మరొక జన్మకి,
ఎడతెరిపిలేని ప్రవాహంలా.
 

ఒకసారైనా తిరువేంకటేశుని తలచలేకపోతావు. 

అర్థంలేని పనుల మధ్య ఇరుక్కుని,
నీవే ఎప్పుడో ఎంచుకున్న భారాలే
ఇప్పుడు నిన్ను చుట్టేస్తున్నాయి.

ఇది మరణముకాక మరేమిటి?


వ్యాఖ్యానం:

కన్నుగానక తిరుగు టొండె

ఇందులో ఓ అసాధారణ గూఢార్థం వెలుగుతుంది.
చూడవలసినది చూడక పోవడం
సత్యమును తప్పించి తక్కినవానిని చూచుట​
"అన్నిటి పై నున్నట్లు హరిపై నుండదు మతి"

కానీ ఆ చూపులను ఎంత కాదన్నా,
దానిని వెనుక నుండి నిర్దేశించు
ఒక నిర్దిష్ట దిశ, లక్ష్యం, కోరిక ఉంటాయి.
ఒక శాస్తవేత్త పరిశీలన తాను
చూచుచున్నదానిని ప్రశ్నించడమైనప్పటికీ
దానికో సంకల్పము వుంటుంది.
పల్లవిలో చెప్పినట్లు ఎంత చిన్న లక్ష్యమైనా
అది మనసుపై కొంత రాపిడి కలిగించి
చూపును ప్రభావితము చేయును.
ఇక్కడ ఆచార్యులు సంకల్పముతో సహా
ఏలక్ష్యం లేని చూపులను ప్రస్తావిస్తున్నారు.

పల్లవిలో చెప్పినట్లు ఎంత చిన్న లక్ష్యమైనా
అది మనసుపై కొంత రాపిడి కలిగించి
చూపును ప్రభావితము చేయును.

అలాగే —
మనము “సత్యాన్ని తెలుసుకోవాలి” అని అనుకోవడమే
సత్యాన్ని చూడటానికి అడ్డంకి అవుతుంది.


భగవద్గీత కూడా ఇలా చెప్పింది
ఇచ్ఛా ద్వేషః సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః ।
ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతమ్ ॥ (13-7)

వాంఛ మరియు ద్వేషము, సంతోషము మరియు
దుఃఖము, శరీరము, చైతన్యము, మనోబలము —
ఇవన్నీ కలిపివున్నది క్షేత్రమని చెప్పబడుచున్నది
ఆయా భాగములు కలిగించు వికారములు
(మారురూపులు) గూడా అందులోని భాగములే.

దీనర్థం ఏమిటంటే —
బాహ్య చైతన్యంలో లేని చూపును,
నిశ్చలమైన మౌనము
కానీ కనులకు కనబడనిది
లోపలికి మళ్ళిన చూపు
గురించి చెబుతున్నారు.
అటువంటి దృష్టిలేక జీవితము పరిపూర్ణము కాదని తాత్పర్యము.

ఇది సాధ్యమే కానీ బహు అరుదైన మార్గం.

అన్నమాచార్యుల ప్రశ్నల పరంపరతో
సరియైన చూపులు తప్ప మనస్సుకు ​
పైన పేర్కొన్న అప మార్గములే కాని వేరేమున్నవి అంటున్నారు.
తక్కినవి నెమ్మది నెమ్మదిగా మరణవైపు లాగుకెళ్ళును. 

ఈ బ్రతుకు అంటే మరణము దిక్కు ప్రయాణమేనా మరియేమైనానా?

అదే “ఒండె?” అనే అన్నమయ్య మూల ప్రశ్న.


 

 

1 comment:

  1. Very detailed explanation about human life.Our desires,And our eagerness get all the worldly things,with out realising our ultimate destination,the death.And our life drama in-between. Very nice.

    ReplyDelete

235 mollalEle nAku tanne muDuchukommanave (మొల్లలేలె నాకు తన్నె ముడుచుకొమ్మనవె)

  ANNAMACHARYULU 235 మొల్లలేలె నాకు తన్నె ముడుచుకొమ్మనవె mollalEle nAku tanne muDuchukommanave తెలుగులో చదవడానికి ఇక్కడ నొక్కండి. I...