Saturday, 7 June 2025

T-228. ప్రియురాలతోనేల బీరాలు

 తాళ్లపాక అన్నమాచార్యులు

228. ప్రియురాలతోనేల బీరాలు 

For English versionpress here

 

ఉపోద్ఘాతము

ఇది అన్నమాచార్యుల శృంగార కీర్తన.
ఇందులో ఆచార్యుల వారు
శ్రీవేంకటేశుని తమ ప్రియుడిగా వూహించుకొని వ్రాసినది.
 
ఐతే కీర్తన పల్లవిలో శ్రీవేంకటేశుల వారిని
అన్నమాచార్యుల వారు ప్రియురాలు అని సంబోధించి
మానవులందరికీ తాను ప్రియమైనవారేనని తెలుపుతారు.
కీర్తన అంతా శృంగారం వెదజల్లినా
ఆ అభిమానము వెనుక
ఆధ్యాత్మిక సందేశమును దాచి వుంచారు.
 
బీరాలు పోవద్దు
దైవముతో పెనగులాటలోద్దు
పనికిరాని దేహములపై
సాములు చేసిచేసి శ్రమపడవద్దు
తెలియగలిగినదీ లేదు
చెప్పవలసినదీలేదు
తడవగలిగినదీలేదు
జీవితములో
జయము పొందాలంటే —
ఎదుర్కోవలసిందేమి?

 

 

శృంగార కీర్తన

రేకు: 1099-4 సంపుటము: 20-592

ప్రియురాలతోనేల బీరాలు
జయమంది రాకాసుల సాదించరాదా        ॥పల్లవి॥
 
చిగురుమోవిదాన చిగురుమేనిదాన
చిగురుచిత్తముదాన చెప్పేదేమి
నగుతానే సరసాన నాతోనేల పెనఁగేవు
పగవారిమీఁద నీబలువు చూపరాదా ॥ప్రియు॥ 

తామెరకన్నులదాన తామెరచేతులదాన
తామెరమోముదాన తడవేదేమి
సాముసేసిసేసి మాచన్నులేల పిసికేవు
దోమటిబూతకిమీఁద తొడుకఁగరాదా ॥ప్రియు॥ 

తీగెబుజములదాన తీగెకోరికలదాన
తీగెమెఱుఁగులదాన తెలిసేదేమి
యీగతి శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁ గూడితి నీ-
జాగులు చుప్పనాతికే చల్లి చూపరాదా      ॥ప్రియు॥

 

Details and Explanations:

ప్రియురాలతోనేల బీరాలు
జయమంది రాకాసుల సాదించరాదా    ॥పల్లవి॥

భావము:

శ్రీవేంకటేశులవారు అన్నమాచార్యుల వారితో

ప్రియమైన జీవుడా!
ఊరకే ప్రియురాళ్ల వెంట తిరుగుతూ
బీరాలు పలుకుతూ
కాలక్షేపం చేస్తే
ప్రయోజనమేమి?
జయమంది కదా
నీ లోని రాక్షస గుణాలను
సాధించవలసినది!


వ్యాఖ్యానం:

ఈ పల్లవిలో
జయమంది అంటే 
మొదట
ఎవరిని ప్రేమిస్తున్నావో వారిని
పూర్తిగా తెలుసుకొని కదా
ప్రయత్నం చేయవలసినది అని అర్ధము.
 
అన్నమయ్య తేటతెల్లంగా మనల్ని ప్రశ్నిస్తున్నారు —
మనిషి సాధించదగిన అసలైన గెలుపు —
బాహ్య శరీరంపై కాదు. అంతర్గత స్వభావంపై.
అయితే మనం బాహ్య ఆకర్షణలతో —
ప్రేమ, కోరిక, రుచులు, ఆటలు, విలాసాలతో కాలం వెళ్లదీస్తూ
వాస్తవంగా తలపడవలసిన లోపాలను చూసీచూడనట్లు వదిలేస్తున్నాం
అన్నమయ్య యొక్క పల్లవి ఒక సవాలు వంటిది.

మొదటి చరణం:

చిగురుమోవిదాన చిగురుమేనిదాన
చిగురుచిత్తముదాన చెప్పేదేమి
నగుతానే సరసాన నాతోనేల పెనఁగేవు
పగవారిమీఁద నీబలువు చూపరాదా      ॥ప్రియు॥

భావము:

శ్రీవేంకటేశులవారు అన్నమాచార్యుల వారితో

చిగురుమోవిదాన,
చిగురుమేనిదాన,
చిగురుచిత్తముదాన
సున్నితమైనదానా
నేను చెప్పగలదేమి?
(ఏమీ లేదు. నువ్వే తెలుసుకోవాలి)
నాపై ప్రేమతో సరసముగా నవ్వుతూనే
నీలోనేవున్న నన్ను తెలియుటకు ఏల పెనఁగులాడుతావ్
నేను నీ మిత్రుణ్ణి

ఆచార్యులవారు శ్రీవేంకటేశుల వారితో

నీ శక్తిని నా నిజమైన శత్రువులపై చూపించవచ్చుగా?


వ్యాఖ్యానం:

ఈ చరణంలో
భక్తి మరియు మానవ స్వభావంపై నిర్దేశము దాగి ఉంది.
ఓ ప్రియురాలిని ఉద్దేశించినట్టుగా వ్రాసి
ఒక లోతైన అంతరంగ చర్చకు ఆహ్వానం
పలుకుతున్నారు అన్నమాచార్యులు
మనిషి స్వభావాన్ని ప్రశ్నిస్తున్నారు.
వనితా రూపంలో ఉన్న ప్రాణి —
మృదుత్వముతో, కొత్త కొత్త భావోద్వేగాలతో,
భగవంతుని ప్రేమకలతతో తపిస్తున్నప్పటికీ —
భగవంతుని ప్రేమను అర్థం చేసుకోలేకపోతుంది.
అలా మానవుల మనసు
పక్కదారి పడుతున్నట్లు అన్నమయ్య చూపిస్తారు.

 పగవారిమీఁద నీబలువు చూపరాదా

మనిషి కనిష్ఠ ప్రతిఘటనా మార్గాన్ని ఎంచుకుంటాడు
ఇక్కడ మనిషి తాను నిర్వర్తించ వలసిన
కర్తవ్యమును భగవంతునిపైకి నెడుతున్నాడు

ఇప్పుడు

భగవద్గీతలోని ఈ శ్లోకాన్ని చూడండి
ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్
ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ।। 6-5 ।।

నీ స్వశక్తిచే నిన్ను నీవు ఉద్దరించుకోనుము.
అంతేకాని పతనమైపోవద్దు.
ఉపయోగించుటను బట్టి
మనస్సే నీ మిత్రుడు
లేదా
నీ శత్రువు
కాగలదు

2చరణం:

తామెరకన్నులదాన తామెరచేతులదాన
తామెరమోముదాన తడవేదేమి
సాముసేసిసేసి మాచన్నులేల పిసికేవు
దోమటిబూతకిమీఁద తొడుకఁగరాదా      ॥ప్రియు॥ 

తడవేదేమి = నువ్వు దేనిని తడవ దలచుకున్నావు? (నన్నా? నేను భావ స్వరుపుణ్ణి కాబట్టి తడవ లేవు.)
సాముసేసిసేసి = ఎంతో ప్రయత్నము చేసి
మాచన్నులేల పిసికేవు = నన్ను పిండి ఏమీ రాబట్టలేవు.
దోమటి = మాయ, కపటము
దోమటిబూతకిమీఁద = మాయా రాక్షసి మీద
తొడుకఁగరాదా = ఒడిసిపట్టుకోరాదా
దోమటిబూతకిమీఁద తొడుకఁగరాదా = మాయా రాక్షసిని ఒడిసిపట్టుకోరాదా

భావము:

శ్రీవేంకటేశులవారు అన్నమాచార్యుల వారితో

తామెరకన్నులదాన
తామెరచేతులదాన
తామెరమోముదాన
నువ్వు దేనిని తడవ దలచుకున్నావు?
ఎంత ప్రయత్నము చేసినా
నన్ను పిండి ఏమీ రాబట్టలేవు.
ఆచార్యులవారు శ్రీవేంకటేశుల వారితో
ఈ మాయా రాక్షసిని నీవే ఒడిసిపట్టుకోరాదా

వ్యాఖ్యానం:

తడవేదేమి
మనిషి
ప్రయత్నాలు కదలికలు,
సన్నాహాలు, ప్రయోగములు,
ప్రయాసములు, పూనికలు
మానడు
వృధాయత్నాలు వద్దన్నా వదలడు.

సాముసేసిసేసి మాచన్నులేల పిసికేవు

వ్యర్థమైన వాటిని (చన్నులు) పిండి ఏమీ రాబట్టలేవు.

ఇంతకు ముందు కీర్తనలో నేర్చిన
పదార్థము, శూన్యము కూడా ఈశ్వరుడే.
పదార్థము, శూన్యములకు విడిగా అస్తిత్వము లేదు.
ఆ రెండు కలిపి చూచిన కానీ పరిపూర్ణత్వము లేదు
పరిపూర్ణము కాని విషయములలో ఎంత గాలించి యేమి ప్రయోజనము?
దీనిని యిన్ మరియు యాంగ్'ల చిత్రముతో  
వివరించుకుంటూ మరింత లోతుగా తెలుసుకుందాం


 

యిన్ మరియు యాంగ్'లు విరుద్ధములైనా కూడా
అవి శాశ్వతమైన సామరస్యాన్ని ప్రతిబింబిస్తాయి.
ఇవి విరుద్ధమైనవే కానీ
పరస్పరము అధారపడిన శక్తులను సూచిస్తాయి.
ఒకటి లేకుండా మరొకటి ఉండదు.
 
బ్రహ్మాండమంతా అన్నిటికీ
ఈ రెండు శక్తుల సమతుల్యత అవసరం.
 
తైజిటు అనే పైన చూపిన చిహ్నంలో
ఒక వైపు నలుపు (యిన్),
మరొకవైపు తెలుపు (యాంగ్) ఉంటాయి.
రెండింటిలోనూ స్థూలముగా వున్నదానికి
వ్యతిరేక రంగు బిందువు ఉంటుంది.
దీని ద్వారా, ప్రతి శక్తిలో మరొకటి కూడా
అంతర్లీనంగా ఉందని తెలిపే సందేశం వస్తుంది.

మూడవ చరణం: 

తీగెబుజములదాన తీగెకోరికలదాన
తీగెమెఱుఁగులదాన తెలిసేదేమి
యీగతి శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁ గూడితి నీ-
జాగులు చుప్పనాతికే చల్లి చూపరాదా ॥ప్రియు॥ 

జాగులు = ఆలస్యములు, delays; చుప్పనాతి = ఓర్వలేనిది, a cruel selfish wretch, శూర్పణఖా: చల్లి = shower;


భావము:

శ్రీవేంకటేశులవారు అన్నమాచార్యుల వారితో
తీగెబుజములదాన
తీగెకోరికలదాన
తీగెమెఱుఁగులదాన
నీవు తెలిసేదేమి?
తెలియగలిగినదేమి? (ఏమీలేదు) 

ఆచార్యులవారు శ్రీవేంకటేశుల వారితో

ఈ రకముగా శ్రీవేంకటేశ
అంతలోనే నా ఎఱిక లేకనే నాలో కలిసిపోతివి.
ఈ జాగులు, ఎదురుచూపులు
ఓర్వలేనివారికే కదా?

వ్యాఖ్యానం:

మనలోనే శ్రీవేంకటేశుడున్న
ఎఱిక వాస్తవముగా మనలాంటి వారికుండదు.
పరమ యోగులకు అతడు
అరచేతిలోని వాడు.
మన కోరికలు తీగలుగా సాగుతూ మన కంటికి తెరలను కల్పిస్తాయి.

No comments:

Post a Comment

T-253 తానేడో మనసేడో తత్తరము లవి యేడో

  తాళ్ళపాక అన్నమాచార్యులు 253 తానేడో మనసేడో తత్తరము లవి యేడో For English version press here   ఉపోద్ఘాతము   ఈ అటవీక ప్రపంచములోని అరుద...