తాళ్లపాక అన్నమాచార్యులు
232.
అన్నిటి పై నున్నట్లు హరిపై నుండదు మతి
For English version press here
ఉపోద్ఘాతము
ఈ కీర్తనలో అన్నమాచార్యులు
ఒక చాలా సరళమైన కానీ లోతైన ప్రశ్న లేవనెత్తుతారు—
అన్నిటిపైన మేధాశక్తిని వ్యయం చేసే మనస్సు,
హరిపై మాత్రం అదే ఆసక్తిని ఎందుకు చూపదు?
ఈ ప్రశ్న వ్యక్తిగతమైనదే కాదు —
ఇది మానవజాతి సంకుచిత దృష్టిపై విమర్శ.
మనిషి విశ్వంలోని ఎన్నో విషయాలపై
శోధించగలడు, విశ్లేషించగలడు,
అణువు నుండి నక్షత్రం వరకు అన్వేషించగలడు.
కానీ దైవంపై ఆ విచారణ
పురాణాల మీద,
మతగ్రంథాల మీద,
పారంపర్య విశ్వాసాల మీద
ఆధారపడే గుణమునే కలిగివుంది.
ఆ పరాధీనత —
అన్నమయ్య దృష్టిలో ప్రశ్నించదగినది.
ఈ కీర్తన అంతటా
దృష్టి ఎలా మారాలి?
భక్తి ఏమిటి?
సత్యాన్ని చూచే శక్తి ఎక్కడ కలుగుతుంది?
అనే ప్రశ్నలు
భక్తిపరమైన స్వరంతో
శిలీబద్ధమైన తత్త్వబలంతో
నమ్రతతో మానవుడిని ఎదుర్కొంటాయి
అధ్యాత్మ కీర్తన
|
రేకు: 322-1 సంపుటము: 4-124
|
అన్నిటి
పై నున్నట్లు హరిపై నుండదు మతి
కన్నులఁ
బ్రహ్లాదువలె కనుఁగొను టరుదా ॥పల్లవి॥
పులుగు
నర్చించొకఁడు పూఁచెనాగతమెరిగి
వెలసి
ఘనుఁడనంటా విఱ్ఱవీఁగీని
జలజాక్షుపాదములు
సారె నర్చించేటివారు
ఇలలోనఁ
బరమార్థ మెరుఁగుటయరుదా ॥అన్ని॥
మానివోడ
నమ్మెుకఁడు మహాజలధి దాఁటి
నానార్థములు
గూర్చి నటియించీని
శ్రీనాథుపాదములు
చేకోనినమ్మినవాఁడు
పూని
భవవార్థి దాఁటి పుణ్యమందు టరుదా ॥అన్ని॥
దీపమువట్టి
యెుకఁడు తెగనిచీఁకటిఁ బాసి
చూపులనిన్నిటిఁ
గని సుఖమందీని
చేపట్టి
పరంజ్యోతి శ్రీవేంకటేశుభక్తుఁ-
డోపి
ముక్తి కడగని వున్నతుఁడౌ టరుదా ॥అన్ని॥
|
Details
and Explanations:
పల్లవి:
అన్నిటి పై నున్నట్లు హరిపై నుండదు మతి
కన్నులఁ బ్రహ్లాదువలె కనుఁగొను టరుదా ॥పల్లవి॥
పదబంధం
|
అర్థం
|
అన్నిటి
పై నున్నట్లు
|
అన్నిటి పైనా ఉన్న వున్న ఉత్సాహము
|
హరిపై నుండదు మతి
|
మనస్సుకు హరి ఎవరో తెలుసుకోవాలనే ప్రగాఢమైన ఆసక్తి ఎందుకుండదో
|
కన్నులఁ
బ్రహ్లాదువలె కనుఁగొను టరుదా
|
ప్రహ్లాదుల
వంటివారు కన్నులెదుట హరిని గాంచినట్లు సామాన్యులు సైతం చూడగలుగుట అసాధ్యమా
|
భావము: మనస్సుకు ప్రపంచంలోని అనేక విషయముల మీద వున్న ఉత్సాహము, అదేమిటో తెలుసుకొనవలెనను రక్తి , భగవంతుని విషయములో ఎందుకుండదో అని అన్నమాచార్యులవారు ఆశ్చర్యపోతున్నారు. ప్రహ్లాదుల
వంటివారు కన్నులెదుట హరిని గాంచినట్లు సామాన్యులు సైతం చూడగలుగుట అసాధ్యమా
వ్యాఖ్యానం:
తటస్థ పరిశోధనా శక్తి
మానవులకు
గలదు.
నిగూఢమైన విశ్వాన్ని, విజ్ఞానాన్ని
ఆవిష్కరించగల నిశ్చలమైన మేధా శక్తి మానవులకు గలదు.
మనిషి
ఈ లోకంలో అనేక విషయాల పట్ల
అత్యంత
తటస్థంగా, శ్రద్ధగా, సహనంతో
పరిశోధనలు
చేస్తూ ముందుకు సాగాడు.
కనుచూపు
దాటి ఉన్న నక్షత్రాల మర్మాన్ని ఛేదించాడు.
కనబడని
పరమాణువుల గుణధర్మాలను తెలుసుకున్నాడు.
సూక్ష్మజీవుల
స్వభావాన్ని ఆవిష్కరించాడు,
విద్యుదాధారిత
గణక యంత్రములతో
అనేక
విప్లవాత్మక మార్పులను తెచ్చాడు.
దూరుటకు
అసాధ్యమగు రక్తనాళములలో చొరబడి శస్త్ర చికిత్సలను నిర్వహించాడు.
శుద్ధము, అలౌకికమగు పరిశోధనా శక్తి అతని స్వంతం.
ఇవన్నీ
తటస్థ పరిశీలన,
వైదికపూర్వగ్రహం
లేకుండా
నిశ్శబ్దమైన
ప్రశ్నలతో సాగిన
విజ్ఞాన
యాత్ర ఫలితమే.
అయితే, అదే ఎటూ వూగని తటస్థ దృష్టిని —
అదే
స్వేచ్ఛను —
దైవతత్త్వంపై,
పరమసత్యంపై
ఎందుకు
ప్రయోగించలేం?
భగవంతుని గురించి ఆలోచించేటప్పుడు,
మనము
ఇప్పటివరకు విన్న పురాణకథలు,
గ్రంథోక్త
వచనాలు,
సమాజపు
అభిప్రాయాలనే
బలంగా
ఆధారంగా చేసుకుంటాం.
ఈ
ముందుగానే నిర్ణయించిన
అభిప్రాయములు,
తాత్పర్యములు,
బోధలు,
ఎన్నిక
చేసుకున్న తలపులు,
దైవాన్వేషణను
ఒక మూసలో పెట్టేస్తాయి.
మార్గం
మళ్ళిస్తాయి.
అదే
సమయంలో,
మనస్సు
మనిషిని కదిలించే
ఉపచేతన
విషయాల
మీద
మాత్రం అజాగ్రత్తగా ఉంటుంది.
ఇది
అన్నమాచార్యులకు ఆశ్చర్యం కలిగించింది.
అందుకే
ఆయన ఇలా అంటారు.
“కన్నులఁ బ్రహ్లాదువలె కనుఁగొను టరుదా”
బ్రహ్మజ్ఞానానికి ప్రాతినిధ్యం వహించే ప్రహ్లాదుడు,
భగవంతునిని
కన్నులారా చూచాడు.
అలాంటి దర్శనం సాధారణ మనుషులకూ సాధ్యమే.
కానీ
—
ఆ తపస్సు, ఆ దృష్టి,
ఆ
శ్రద్ధ, ఆ నిర్థారణ ఉన్నపుడు —
హరిని కనుఁగొను టరుదా?
అందుకే
చివరగా ఆయన మెల్లగా, కానీ లోతుగా —
“అరుదా?” అని ప్రశ్నిస్తారు
అంటే
— నిజంగా మనం చూడాలంటే చూడలేమా?
శోధించలేమా?
ఇది
ఒక తాత్త్విక విమర్శ కాదు.
ఇది
మన లోపభూయిష్టమైన జీవనపద్ధతిపై
అన్నమయ్య
ఆక్రందన
ఒక
మౌన ఆహ్వానం —
మనిషిగా
మనం ఎలా వెదకాలి?
ఏ
దృష్టితో చూడాలి?
ఏ
కోణం?
మొదటి చరణం:
పులుగు నర్చించొకఁడు పూఁచెనాగతమెరిగి
వెలసి ఘనుఁడనంటా విఱ్ఱవీఁగీని
జలజాక్షుపాదములు సారె నర్చించేటివారు
ఇలలోనఁ బరమార్థ మెరుఁగుటయరుదా ॥అన్ని॥
పదబంధం
|
అర్థం
|
పులుగు
నర్చించొకఁడు
|
పక్షులను సేవించి ఒకడు
|
పూఁచెనాగతమెరిగి
|
భవిష్యత్తు
తెలుసుకొని
|
వెలసి ఘనుఁడనంటా విఱ్ఱవీఁగీని
|
ప్రఖ్యాతిని
వెలిగి తానే ఘనుఁడనని విఱ్ఱవీఁగుతాడు
|
జలజాక్షుపాదములు సారె నర్చించేటివారు
|
ఆ విష్ణువును నిత్యము అర్చించువారు
|
ఇలలోనఁ బరమార్థ మెరుఁగుటయరుదా
|
ఈ భూమిమీదే పరమార్థము తెలియుట అరుదా (కాదే)
|
భావము:
ఒకానొకడు
పక్షులను సేవించి
భవిష్యత్తు
తెలుసుకొని
ఆ ప్రఖ్యాతిని
వెలిగి
తానే ఘనుఁడనని
విఱ్ఱవీఁగుతాడు.
ఆ
విష్ణువును నిత్యము అర్చించువారు
ఈ
భూమిమీదే పరమార్థము తెలియుట అరుదా (కాదే)
వ్యాఖ్యానం:
అన్నమాచార్యులవారు
మానవుల వైఖరిని ఎండగొట్టుచున్నారు.
చిలుకజోస్యములు,
చేతి రేఖలు
మనిషి మార్గాన్ని నిర్దేశించలేవు.
సాధనతో వచ్చునది
విద్యయే కాదు అని వారి అభిప్రాయము.
జలజాక్షుపాదములు
సారె నర్చించేటివారు
అన్నదానిని
విచారించుదుము.
జలజాక్షుని
పాదములు నేరుగా చూడ గలిగిన భక్తులు.
వారు
కారణజన్ములు.
.
"సారె నర్చించేటివారు" అనేక మార్లు అర్చించేటివారు అనగా
వారికి
జలజాక్షుపాదములు ప్రత్యక్షము కాలేదు కానీ,
అటువంటి
వారికి ఆ పరమార్థము తెలియు
అవకాశం
వుంటుందని భావము..
రెండవ చరణం:
మానివోడ నమ్మెుకఁడు మహాజలధి దాఁటి
నానార్థములు గూర్చి నటియించీని
శ్రీనాథుపాదములు చేకోనినమ్మినవాఁడు
పూని భవవార్థి దాఁటి పుణ్యమందు టరుదా ॥అన్ని॥
పదబంధం
|
అర్థం
|
మానివోడ నమ్మెుకఁడు
|
చెక్క
ఓడను ఎక్కి ఒకడు (అన్వయార్థము: అంటే కొంత కాలమే నిలుచు దానిని ఆలంబనముగా చేసుకొని)
|
మహాజలధి దాఁటి
|
మాహా సముద్రములను
దాటి.
|
నానార్థములు గూర్చి నటియించీని
|
ఏమేమో
అర్ధములను వక్కాణించుచు నటనతొ జీవితమును
గడుపును.
|
శ్రీనాథుపాదములు చేకోనినమ్మినవాఁడు
|
శ్రీనాథుపాదములే
నమ్మి పట్టుకొన్నవాడు
|
పూని భవవార్థి
దాఁటి పుణ్యమందు టరుదా
|
పూనుకొని జన్మమును ఈ శరీర తత్వమును అధిగమించి పుణ్యలోకములను చేరుట
అరుదా?
|
భావము:
చెక్క ఓడను
ఎక్కి ఒకడు
మాహా సముద్రములను
దాటి
ఆయా దేశములవారితో
ఏమేమో అర్ధములను
వక్కాణించుచు
జీవితమునే
నటనతో గడుపును.
శ్రీనాథుపాదములే
నమ్మి పట్టుకొన్నవాడు
పూనుకొని
జన్మమును ఈ శరీర తత్వమును
అధిగమించి
పుణ్యలోకములను
చేరుట అరుదా?
అన్వయార్థము:
ఒకానొకడు
చెక్క ఓడ అంటే కొంత కాలమే నిలుచు దానిని ఆలంబనముగా చేసుకొని చావు పుట్టుక అను మాహా సముద్రములను దాటాగలను అనుకొంటు దేశదేశములు
చుట్టి వారితో తనకు తెలిసినదే సత్యముగా చెప్పుచూ నటనతో కాలము గడుపును. శ్రీనాథుపాదములు
తప్పించి వేరేవేవీ భవవార్థి దాటించవని అన్నమాచార్యుల భావము.
వ్యాఖ్యానం:
మానివోడ
నమ్మెుకఁడు మహాజలధి దాఁటి:
ఈ పాదములో
ఉన్న భావన
"ఓడవిడిచి
వదర వూరకేల పట్టేవు"
అనే మరొక
కీర్తనను గుర్తుకు తెస్తుంది.
(అంటే ఒక
స్థిరమైన నౌకను వదిలి,
తాత్కాలికమైన
సొరకాయ బొర్రను పట్టుకొని
సంసార సముద్రాన్ని
దాటాలనుకునే
భ్రమ మనిషిది).
భవసాగరాన్ని
దాటించగలది ఒక్కటే —
శ్రీనాథుని పాదారవిందాల మీద స్థిరమైన నమ్మిక.
ఇక్కడున్న
మౌన సూచన:
హృదయ పరివర్తన
లేకుండా
ఎంత పరిశ్రమ
చేసినా
అది విమోచమునకు
దారి కాజాలదు..
మనం
— పాఠకులం —
అర్థాలను
గ్రంథాలను వారసత్వంగా పొందాం,
తత్త్వములను
మలచుకున్నాం,
“నేను” "మనము" “వాడు” అను వానిని దానిని ముద్రించుకున్నాం.
కానీ
ఒక్క క్షణం ఆలోచించండి —
ఈ
"బ్రతుకు" అనే ప్రహసనానికి వెలుగు ఇస్తున్న దీపం ఏమిటి?
అది
ఆరినప్పుడు,
మనం
దాన్ని "చావు" అని పిలుస్తాం.
అయిప్పటికీ
—
ఎరుగుటకు, నాటకీయ ప్రతిభకే మనం వశమవుతామా?
మనమంతా
ఊపిరాడని తేలియాడే తెప్ప పైన ఉన్నామేమో అని
తెలుసుకోగలమా?
అయితే
—
మనం
వెదకవలసింది ఏమిటి?
మన
దృష్టి ఏ బిందువులోనుంచి మొదలవాలి?
మూడవ చరణం:
దీపమువట్టి యెుకఁడు తెగనిచీఁకటిఁ బాసి
చూపులనిన్నిటిఁ గని సుఖమందీని
చేపట్టి పరంజ్యోతి శ్రీవేంకటేశుభక్తుఁ-
డోపి ముక్తి కడగని వున్నతుఁడౌ టరుదా ॥అన్ని॥
పదబంధం
|
అర్థం
|
దీపమువట్టి యెుకఁడు తెగనిచీఁకటిఁ బాసి
|
సత్యమను
దీపముపట్టి ఒకడు ఎడతెగనిచీఁకటిఁని తెంచుకుంటూ
|
చూపులనిన్నిటిఁ గని సుఖమందీని
|
అనేక కోణములలో
జీవితమును పరిశీలించి, జీవమునకుగల ఒకేవొక చూపును తెలుసుకొని
|
చేపట్టి పరంజ్యోతి శ్రీవేంకటేశు
|
ఆ పరంజ్యోతి
శ్రీవేంకటేశుని చుక్కానిగా చేపట్టి
|
భక్తుఁడోపి ముక్తి కడగని వున్నతుఁడౌ టరుదా
|
ఆ శ్రమనోర్చుకుని
ఆ మార్గము చివర ఏమున్నదో తెలుసుకొనుట అరుదా? వాడు ఉన్నతుడౌటరుదా?
|
భావము:
సత్యమను దీపముపట్టి ఒకడు ఎడతెగనిచీఁకటిఁని
తెంచుకుంటూ, అనేక కోణములలో జీవితమును పరిశీలించి, జీవమునకుగల ఒకేవొక చూపును తెలుసుకొని ఆ పరంజ్యోతి శ్రీవేంకటేశుని చుక్కానిగా
చేపట్టి ఆ శ్రమనోర్చుకుని ఆ మార్గము చివర ఏమున్నదో తెలుసుకొనుట అరుదా? వాడు ఉన్నతుడౌటరుదా?
వ్యాఖ్యానం:
దీపమువట్టి
యెుకఁడు తెగనిచీఁకటిఁ బాసి:
ఆ
దీపమెద్ది? ఆ తెగనిచీఁకటిఁ ఏమి? తెంచుకొనుట
ఏమి?
ఆ
దీపము ఖండించలేని పరమ సత్యము.
పుటిన
మనందరికీ మరణమే పరమ సత్యము.
ఆ
పరంజ్యోతికి ఆ చావు పుట్టుక అను మన రెండు అవస్థలు
ఒకే మాదిరివి.
దీనిని
భగవద్గీత శ్లోకము నుండి ఇలా అర్థము చేసుకొనవలె.
యా
నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ ।
యస్యాం
జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః (2-69)
ఏది
రాత్రియై ప్రాణుల దృష్టికి వచ్చుటలేదో అది జీవనము.
దీని
వ్యతిరేకము అనగా
ప్రాణులకు
గోచరించుచున్నది మరణము.
అనగా
మరణమును చేపట్టక జీవనము తెలియలేము.
మరణము
ప్రస్తావించుటకు భయంకరమైనదైనను,
అది
లేక జీవనము లేదు.
పాతనీరు
పోయిన కదా క్రొత్తనీరు వచ్చుటకు ఆస్కారము.
మరణమును
తెలియని వాడు యోగి కాజాలడు
తాము
యోగులమని చెప్పుకొను వారు యోగ్యులు కారు
తెగనిచీఁకటి
మనలో నెలకొన్న సమస్త ఊహాభావాలు.
తెంచుకొనుట
అనగా
సత్యము
యొక్క వెలుగులో ఆ చీకటి తెరలు తెరచుకొనుట.
భక్తుఁడోపి
ముక్తి కడగని వున్నతుఁడౌ టరుదా
ఓపి
అనగా సహించుట.
అత్యంత
కష్టమైనదానిని సహించుట.
తథా
దేహాంతరప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి (2-13)
ధీరుడు
అనగా
ఎటువంటి
విపత్కరమైన పరివర్తనమునైనా స్వీకరించువాడు,
ప్రాణములను
సైతము ఎటువంటి ప్రతిఘటనలేకయే
ధైర్యముగా
విడుచువాడు అని అర్థం.
ఆ
రకముగా ఆత్మ పరంజ్యోతుల సంయోగముతో
సమస్త
విషయములను మరచి
క్రొంగొత్త
యోగిగా రూపుదిద్దుకుంటాడు
సమస్త
విశ్వమును భ్రమణరహితముగా చూడగల్గును.
అదియే
భోగి యోగిగా పరివర్తన చెందుట.
తక్కినవన్ని
అయోగ్యములే.
విషయములపై మనసుకున్న ఉత్సాహము హరిని తెలిసికొనుటలో ఉండదేల? హరిని ప్రత్యక్షముగా గాంచిన ప్రహ్లాదుడట్లు సామాన్యులు సైతం చూచుట సాధ్యము కాదా? అని అన్నమయ్య పల్లవిలో మానవుల అజ్ఞానమును బహిర్గతము చేయుచున్నారు.
ReplyDeleteపక్షులను సేవించి భవితను చెప్పి ప్రఖ్యాతిని పొంది ఘనుడు తానేయని అహంకరించేవాడున్నాడు. కాని అనునిత్యం హరిని సేవించి పరమార్థమును తెలుసుకోవచ్చు కదా అని అంటున్నారు అన్నమయ్య.
ఆశాశ్వతమైన ఓడనెక్కి కడలిని దాటి ధనము కూడబెట్టి తరించాననే భ్రమలో ఉంటాడొకడు. కాని హరిచరణములే శరణమని సేవించువాడీ సంసారజలధిని తరించి శాశ్వతమైన మోక్షమందగలడని యెరుగడు.
చేత జ్యోతినిబట్టి చీకటిని తరుముతూ సుఖమును పొందేవాడు సాధన చేసి ఆ పరమాత్మను దర్శించే మోక్షమార్గము యొక్క ఆవలనున్న పరంజ్యోతిని కానవచ్చును కదా అంటే ముక్తిని పొందవచ్చును కదా అంటున్నారు అన్నమయ్య.
గొప్ప ఆధ్యాత్మిక కీర్తన!
ఓమ్ తత్ సత్ 🙏🏻
పసుమర్తి కృష్ణమోహన్