తాళ్లపాక అన్నమాచార్యులు
157R
ఏ తపములు నేల యేదానములు నేల
For
English Version Press Here
ఉపోద్ఘాతము
మానవ జన్మకు ఫలము ఏమి? దీనికి మనకు సంతృప్తి కలిగించే సమాధానము
దొరకవచ్చు. కానీ సత్య ప్రమాణమైన సమాధానము మనకు తెలియకపోవచ్చును.
తపస్సు
చేయాలి, దానధర్మాలు చేయాలి, పుణ్యకార్యాలు చేయాలి — ఇలా మానవ జన్మ సార్థకతకు మనకు తెలిసిన సమాధానాలు
ఎన్నో. అయితే అన్నమాచార్యులు మాత్రం “శ్రీతరుణీపతి
నిత్యసేవే జన్మఫలము” అని ఎందుకు అంటున్నారు? అయితే తపములు, దానముల కంటే శ్రీతరుణీపతి నిత్యసేవే
ముఖ్యమని ఎలా తెలియగలము? తపములు, దానములు
ఏ సరిహద్దులను దాటలేకున్నవి?
అతి
సులభంగా కనిపించే ఈ జీవితం దేనికి లోబడి యాంత్రికముగా, ఒక పరిచిన తివాచీలా కనబడుతున్నది?
దైవమునకు, సత్యమునకు మానవునికి మధ్య సీమలేమి? ఈ విషయములను కొంత పరిశీలించుటకు ఈ కీర్తన మనకు
మార్గదర్శకము కావచ్చును. అన్నమయ్య ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడు;
ఒక చలనమును మన కళ్లముందు ఉంచుతాడు. ఆ
కదలికను గమనించినప్పుడు, దానిలోని సత్యం తానే
బయటపడుతుంది.
|
అధ్యాత్మ
సంకీర్తన
|
|
రాగి రేకు: 312-2 సంపుటము - సంకీర్తన: 4-68
|
|
ఏ తపములు నేల యేదానములు నేల శ్రీతరుణీపతి నిత్యసేవే జన్మఫలము ॥పల్లవి॥ దేహపుటింద్రియముల దేహమందే యణఁచుటే దేహముతోనే తాను దేవుఁడౌట సోహలను వెలిఁ జూచేచూపు లోను చూచుటే ఆహా దేవతలఁ దనందే తాఁ గనుట ॥ఏత॥ వెలి నిట్టూరుపుగాలి వెళ్ళకుండా నాఁగుటే కులికి తపోధనము గూడపెట్టుట తలఁపు తనందే తగ లయము సేయుట లలిఁ బాపబంధముల లయము సేయుట ॥ఏత॥ వెనక సంసారమందు విషయ విముక్తుఁడౌటే మునుపనే తా జీవన్ముక్తుఁడౌట పనివి శ్రీవేంకటేశుపదములు శరణంటే అనువైన దివ్యపదమప్పుడే తా నందుట ॥ఏత॥
|
Details
and Explanations:
పల్లవి:
ఏ తపములు
నేల యేదానములు నేల
శ్రీతరుణీపతి
నిత్యసేవే జన్మఫలము ॥పల్లవి॥
|
కీర్తన పాదము
|
సంక్షిప్త భావం
|
|
ఏ తపములు నేల యేదానములు నేల
|
తపస్సులు, దానములు
ఎందుకు చేస్తున్నావు?
|
|
శ్రీతరుణీపతి నిత్యసేవే జన్మఫలము
|
జాగ్రత్తగా చూచిన శ్రీతరుణీపతి నిత్యసేవే జన్మఫలము కాదా?
|
భావము:
మానవుడా! తపస్సులు, దానములు ఎందుకు చేస్తున్నావు? జాగ్రత్తగా చూచిన శ్రీతరుణీపతి నిత్యసేవే జన్మఫలము కాదా?
గూఢార్థవివరణము:
ఏ
తపములు గాని, ఏ దానములు గాని శ్రీతరుణీపతి నిత్యసేవకు
సాటి రావు అని అన్నమాచార్యులు స్పష్టంగా చెబుతున్నారు. తపములు, దానములు మనిషికి తెలిసిన ఉత్కృష్ట కార్యములు. అవి అన్నియు ఒడలు అను
భారము మోయుచూ మానవుడు చేయగల కార్యములు. శరీరముతో
కష్టమును సహించి తపస్సు చేయవచ్చు; తనవద్ద ఉన్నదానిని అంతా
ఇచ్చి దానం చేయవచ్చు. ఎంత గొప్ప కార్యమైనా అది మానవుని శరీరము, శక్తి, కాలము, సహనము అనే
పరిమితులకు లోబడినదే.
కానీ
ఇక్కడ అన్నమాచార్యులు చెబుతున్నది అటువంటి కార్యము కాని సేవ. అది చేతులతోనో శరీరముతోనో కష్టమును సహించుచు చేయగలిగినది కాదు. సహించుటకు
ఒక మితి గలదు. శరీరానికి మితి ఉంది; ప్రయత్నానికి మితి
ఉంది; కాలానికి మితి ఉంది. కవి
చెబుతున్నది ఆ పరిమితులకు ఆవలిది.
ఆ ఆవలి
వైపుకు మానవుడు తన ప్రయత్నముతో చేరగలడని ఆయన చెప్పడం లేదు. ఎందుకంటే
ప్రయత్నించువాడే ఆ పరిమితులలో ఉన్నాడు. సత్యాన్ని తన ప్రయత్నముతో పొందలేడు; అసత్యము యొక్క నిర్మాణం స్పష్టంగా కనిపించినప్పుడే, దాని
పరిమితులను గ్రహించినప్పుడే తనను నిగ్రహించునది అతనికి తనకుతానుగా తెలియును.
అందుకే
“నిత్యసేవ” అనేది
మనిషి చేయవలసిన మరొక కార్యము కాదు. తపస్సు, దానము వంటి మనకు తెలిసిన
కార్యములన్నింటికీ భిన్నమైనది. కవి దానికి మార్గమును కూడా చెప్పడం లేదు. సూటిగా
దానిని మన ముందుంచుతున్నారు. “శ్రీతరుణీపతి నిత్యసేవే
జన్మఫలము.”
మొదటి చరణం:
దేహపుటింద్రియముల
దేహమందే యణఁచుటే
దేహముతోనే
తాను దేవుఁడౌట
సోహలను వెలిఁ
జూచేచూపు లోను చూచుటే
ఆహా దేవతలఁ
దనందే తాఁ గనుట ॥ఏ
త॥
|
కీర్తన పాదము
|
సంక్షిప్త భావం
|
|
దేహపుటింద్రియముల దేహమందే యణఁచుటే
|
దేహపు ఇంద్రియములను దేహములోనే స్వాధీన పరచుకొనుట. ఇంద్రియముల
క్రియలను కదలికలను ప్రత్యక్షముగా గమనించ గలుగుట
|
|
దేహముతోనే తాను దేవుఁడౌట
|
దేహములేక మనిషికి అస్తిత్వము లేదు కావున దేహములోనే ఉండి దైవత్వమును తెలియుట
|
|
సోహలను వెలిఁ జూచేచూపు లోను చూచుటే
|
(సోహం = “సః అహం” — “అతడే నేను”) సోహమును (అతడే నేను) అని తెలిసి వెలుపల చూచే చూపుతోనే లోపల
చూచుట
|
|
ఆహా దేవతలఁ దనందే తాఁ గనుట
|
(ఆ చూచుటలో) ఆహా, అనంతమగు సంసారవృక్షములో అనేక తలములు అందలి దేవతలను స్వయముగా చూడగల్గుట
|
భావము:
ఇంద్రియములను
స్వాధీనపరచుకొని, వాటి క్రియలను, చలనములను అవి కదులుతున్నప్పుడే ప్రత్యక్షముగా గమనించాలి. దేహముతోనే ఉండి
దైవత్వమును తెలియాలి. సోహం అనగా “అతడే నేను” అని తెలిసి, వెలుపల చూచే చూపులు లోచూపులు (అంతర్వీక్షణం) కావలెను. అలా చూచినప్పుడు, అప్పుడు మొత్తము ఈ సంసారవృక్షము అవగతమౌతుంది. సృష్టి మొదలు నుండి అనేక
తలములలోని దేవతలను కూడా తనందే తాను చూడగలడు.
గూఢార్థవివరణము:
పల్లవిలో
అన్నమయ్య ఒక ముఖ్యమైన భేదాన్ని ఉంచుతున్నారు: ఏ తపములు నేల యేదానములు నేల
/ శ్రీతరుణీపతి నిత్యసేవే జన్మఫలము. తపస్సు,
దానము వంటివి మనిషి చేయగలిగిన పనులు. వాటికి ఆరంభము, ముగింపు ఉంటాయి. పల్లవిలో పేర్కొన్న “నిత్యసేవ” మరొక పని కాదు. అది జీవితం నుండి విడిగా చేయగలిగినది కాదు. మొదటి చరణము ఆ
సేవ ఎక్కడ మొదలవుతుందో చూపిస్తుంది.
దేహపుటింద్రియముల దేహమందే యణఁచుటే:
ఇక్కడ అన్నమయ్య ఏదో సిద్ధాంతాన్ని చెప్పడం లేదు. ఇంద్రియముల
కదలికను ప్రత్యక్షంగా గమనించడం అనే విషయాన్ని మన ముందుంచుతున్నారు. మనము
సాధారణంగా గమనించగలిగేది కదలిక జరిగిన తర్వాత. ఇక్కడ అన్నమాచార్యులు
ప్రస్తావించుచున్నది కదులుతున్నప్పుడు చూడడం.
అందుకే
వెంటనే: దేహముతోనే తాను దేవుఁడౌట అన్నారు. దేహము
దైవత్వానికి అడ్డంకి కాదు. దేహముతోనే ఉండి దైవత్వమును తెలియాలి. దేహాన్ని విడిచిన
తరువాత పొందే స్థితిని గురించి అన్నమయ్య చెప్పడం లేదు. తరువాతి రెండు పాదాలలో చరణము మరింత సూక్ష్మము అవుతుంది.
సోహలను వెలిఁ జూచేచూపు లోను చూచుటే:
“సోహం — అతడే నేను” అని చెప్పడం మాత్రమే
సరిపోదు. వెలుపల చూచే చూపుతోనే లోపల చూడాలి. ఇందులోని సూక్ష్మము అర్థం
చేసుకోవడానికి మ్యాగ్రిట్ గారు వేసిన ఒక అధివాస్తవిక చిత్రము ‘ద హ్యూమన్ కండిషన్’ (హృదయ
మీమాంస) అను అత్యద్భుతమైన పెయింటింగ్ సహాయంతో తెలుసుకుందాం.
ఒకానొక వ్యక్తి ఒక గవాక్షము నుండి బయటకు చూస్తున్నట్లు
ఒక చిత్రము కనబడుతూ ఉంటుంది. ఆ గవాక్షములో కొంత భాగము డ్రాయింగ్ బోర్డ్
ఆక్రమించుకొని ఉంటుంది. ఆ డ్రాయింగ్ బోర్డ్'లో కూడా బయట కనిపిస్తున్న
భాగంలో దృశ్యమే పెయింటింగ్ చేసి ఉంచారు. అంటే, కనపడుతున్న
చెట్టు వాస్తవంగా పెయింటింగ్ మాత్రమే.
ప్రేక్షకుడికి, ఈ
చెట్టు పెయింటింగ్ లోపల (అంటే గది లోపల) మరియు వాస్తవ భూభాగంలో గది వెలుపల
వున్నట్లు అనిపిస్తుంది".
మన
ఇప్పటి “వెలిఁ జూచేచూపు” ఆ
చిత్రములో కనబడుతున్న సన్నపాటి సరిహద్దు మనకు ఆ ప్రకృతి దృశ్యానికి మధ్య వచ్చిన
అడ్డు. మనము మన చుట్టూవున్న పరిస్థితులతో హద్దులు లేకుండా మిళితమవ్వని స్థితి. మన
ప్రయత్నములన్నీ ఆ హద్దు దగ్గర ఆగిపోతాయి. ఒక కోయిల, ఒక పులి
తమ చుట్టూ ఉన్న వాతావరణములో మిళితమై ఉన్నట్లుగా కాక మనము మనకు నచ్చినట్లుగా
వాతావరణములో ఉండటానికి యత్నిస్తాము. వెలిఁ జూచేచూపు” ఎంత సున్నితమైనదైనా ఎంత
తీక్షణమైనదైనా హద్దు అలాగే ఉంటుంది. ఇక్కడే "లోను చూచుటే"తో సమూలమైన, వెలిచూపుతో కూడని చూపును అన్నమాచార్యులు
తెలుపుతున్నారు.
అప్పుడు
“సోహం” ఒక సిద్ధాంత వాక్యంగా కాకుండా, చూచుటలో జరిగిన
మార్పుగా అర్థమవుతుంది. చూసేవాడి సరిహద్దు లేకుండా
పోయిందని చెప్పడం కాదు; ఆ సరిహద్దు ఆధారంగా చూసే కేంద్రం ఇక
చూపును నిర్ణయించదు.
అలా
చూచినప్పుడు: ఆహా దేవతలఁ దనందే తాఁ గనుట అని అన్నమయ్య
అంటున్నారు. ఇది ఏదో ఒక దైవిక రూపాన్ని తనలో చూసుకోవడం మాత్రమే కాదు. మొత్తము ఈ
సంసారవృక్షము అవగతమౌతుంది. సృష్టి మొదలు నుండి అనేక తలములలోని దేవతలను కూడా
తనందే తాను చూడగలడు.
ఇక్కడ
“తనందే”
అనేది ముఖ్యమైనది. వెలుపల ఉన్న ప్రపంచాన్ని ఊహగా లోపలికి తెచ్చుకోవడం కాదు. తనను
లోతుగా చూచినప్పుడు, తన అస్తిత్వము మొత్తం
సంసారవృక్షముతో విడదీయరాని సంబంధంలో ఉన్నదని ప్రత్యక్షమవుతుంది.
అయితే
ఇక్కడే ఒక సూక్ష్మమైన ప్రమాదము కూడా ఉంది. “నేను
చూచాను”, “నాకు దర్శనమైంది”
అని చూసినదానిని తన అనుభవంగా స్వాధీనపరచుకుంటే, చూసేవాడి
కేంద్రం మళ్లీ ఏర్పడుతుంది. చూసినదానికంటే “నేను చూచాను” అనే గర్వమే ముఖ్యమవుతుంది.
అందుకే
పల్లవి మళ్లీ ముందుకు వస్తుంది: శ్రీతరుణీపతి నిత్యసేవే జన్మఫలము. ఎంత
చూసినా, చూసినదానిపై స్వామిత్వం
ప్రకటించకపోవడం. ఇదే నిత్యసేవకు ఒక లోతైన అర్థాన్ని ఇస్తుంది.
అన్నమయ్య
ఇక్కడ ఏ వ్యవస్థతోనూ వాదించడం లేదు. దేహము నుండి ఇంద్రియముల కదలిక వరకు,
వెలిచూపు నుండి లోచూపు వరకు, అక్కడి నుండి
మొత్తం సంసారవృక్షము అవగతమయ్యే వరకు ఒక కదలికను మన కళ్లముందు ఉంచుతున్నారు.
అందుకే
ఈ చరణాన్ని మనం ఒక తాత్త్విక ప్రకటనగా కాకుండా, అన్నమయ్యకు ప్రత్యక్షమైన దానిని మాటలలో నమోదు చేసిన ఒక అసాధారణమైన
సాక్ష్యంగా చదవాలి.
రెండవ చరణం:
వెలి నిట్టూరుపుగాలి
వెళ్ళకుండా నాఁగుటే
కులికి తపోధనము
గూడపెట్టుట
తలఁపు తనందే
తగ లయము సేయుట
లలిఁ బాపబంధముల
లయము సేయుట ॥ఏ త॥
|
కీర్తన పాదము
|
సంక్షిప్త భావం
|
|
వెలి నిట్టూరుపుగాలి
వెళ్ళకుండా నాఁగుటే
|
లోపల కలిగే నిట్టూర్పు గాలి (అంటే లోని దుఃఖము) బయటకు
వెళ్లకుండా ఆపగలగుట.
|
|
కులికి తపోధనము గూడపెట్టుట
|
ఆ కార్యములో నిమ్మగ్నుడగుటయే తపోధనము గూడపెట్టుట
|
|
తలఁపు తనందే తగ లయము సేయుట
|
పదేపదే పుట్టు తలపులను, ఆలోచనలను లయింపజేయుట..
|
|
లలిఁ బాపబంధముల లయము సేయుట
|
ఒకటొకటిగా తానే అల్లుకొనుచున్న పాపబంధములను కూడా లయింపజేయుటకు
ప్రతిఘటన లేకుండుట
|
మనలో
కలిగే దుఃఖము నిట్టూర్పుగా బయటకు వెళ్లకుండా, ఆ కదలికను అక్కడికక్కడే
(జరుగుతున్నప్పుడే) గమనించాలి. ఆ విధంగా దానిని గమనిస్తూ ఉండటమే తపస్సును
కూడబెట్టుకోవడం. పదేపదే పుట్టే తలపులను వాటిని మూలములోనే (తనలోనే) తెలియవలెను. ఆ
తెలియుటలో ప్రకృతిలోని క్రమం అవగతమగును. ఆ క్రమములో నిలిచి ఉండుట తానే అల్లుకున్న
పాపబంధములు కూడా క్రమంగా సడలిపోతాయి.
గూఢార్థవివరణము:
వెలి నిట్టూరుపుగాలి
వెళ్ళకుండా నాఁగుటే /కులికి తపోధనము గూడపెట్టు: మొదటి
చరణంలో ఇంద్రియముల కదలికను అవి కదులుతున్నప్పుడే గమనించమని అన్నమయ్య చెప్పారు.
ఇప్పుడు పరిశీలన మరింత లోపలికి వస్తుంది. నిట్టూర్పు కేవలం శ్వాస కాదు; లోపల కలిగిన దుఃఖము బయటకు వ్యక్తమయ్యే కదలిక.
ఆ
దుఃఖము ఎక్కడి నుండి వస్తుంది? మనము ఉన్న స్థితిని ఉన్నట్లుగా
చూడలేక, మనము ఎలా ఉండాలని కోరుకుంటామో అలా మనలను మనమే
ఊహించుకోవడం. వాస్తవానికి, మనము కోరుకున్న రూపానికి మధ్య
ఉండే అంతరం దుఃఖాన్ని కలిగిస్తుంది. ఆ దుఃఖము నిట్టూర్పుగా, మాటగా,
చర్యగా బయటకు వ్యక్తమవుతుంది.
అన్నమయ్య
చెప్పేది ఆ దుఃఖాన్ని అణచివేయడం కాదు; అది బయటకు చర్యగా మారే ముందే,
దాని కదలికను గమనిస్తూ ఆగుట. అందుకే:
కులికి తపోధనము గూడపెట్టుట. ఈ లోపలి కదలికను తప్పించుకొనుటకు
చూడకుండా గమనించడమే తపస్సుగా మారుతుంది. ఇది బయటకు కనబడు తపస్సు కాదు. తన
బలహీనతలను తెలిసికూడా వానిని సవరించని ఏకాగ్రత. ఆ అవధానము దుఃఖము కలిగించు చర్యల
మూల స్థానమును చూచుట. ఆ “నేను” అనే ప్రతిఘటన కేంద్రం లేకపోవుట.
(ఇక్కడ మనము ముందుగా గమనించిన భగవద్గీత 6.23–24 లోని కదలిక గుర్తుకు వస్తుంది. దుఃఖంతో ఏర్పడిన సంబంధం నుండి బయటపడటం అంటే
దుఃఖాన్ని మరొక చర్యతో కప్పిపుచ్చడం కాదు; దానికి కారణమయ్యే తలపు,
సంకల్పము, కోరికల కదలికను దాని మూలంలోనే చూడటం).
అందుకే
మూడవ పాదం: తలఁపు తనందే తగ లయము సేయుట. మనము
కోరుకున్న రూపాన్ని పదేపదే నిర్మించే తలపులే వాస్తవానికీ, మన
కోరికకీ మధ్య అంతరాన్ని కొనసాగిస్తాయి. ఆ తలపులను బయట నుంచి అణచడం కాదు; అవి పుట్టే తనలోనే వాటి లయాన్ని గమనించాలి. తలపు
తన పట్టును కోల్పోయినప్పుడు, దాని ద్వారా కొనసాగుతున్న
దుఃఖపు కదలిక కూడా బలహీనమవుతుంది.
ఇక్కడి
నుండి చివరి పాదం మరింత ముఖ్యమవుతుంది: లలిఁ బాపబంధముల లయము సేయుట. లలిఁ — క్రమము. తానే అల్లుకున్న బంధాలు ఒక్కసారిగా మాయమవ్వవు. అవి
జీవితము అనే కదలికలో ఏర్పడినవి. ఆ అనిర్వచనీయ క్రమమును గుర్తించుటయే అసలైన
అవగాహన. ఆ అవగాహన ప్రకృతి క్రమంలోని విషయము. అది ఆ క్రమము జీవితము వేరు విషయములు కావు. ఆ జీవితము
ఆ క్రమములో నిలిచినప్పుడే వికసించును. అన్నమయ్య చెప్పే లయము ఆ క్రమములో ఎటువంటి
హద్దులు లేకుండాకలిసిపోవుట.
ప్రతిఘటన
లేకుండుట ఇక్కడ కీలకం. మనము సహజంగా మార్పును
ప్రతిఘటిస్తాము. “ఇలా జరగకూడదు”, “ఇది నాకు నచ్చదు”, “ఇది వేరుగా ఉండాలి” అనే కేంద్రం మార్పును అడ్డుకోవాలని ప్రయత్నిస్తుంది. ఆ
కేంద్రం ఉన్నంతకాలం బంధము కొనసాగుతుంది.
ఆ “నేను” అనే ప్రతిఘటనకేంద్రం లేకపోతే, జీవితం తన సహజ క్రమంలో కదులుతుంది. తానే అల్లుకున్న బంధాలు కూడా అదే
క్రమంలో కరిగిపోవడానికి అవకాశం కలుగుతుంది.
అందువల్ల
ఈ రెండు పాదాలు కలిపి: తలఁపు తనందే తగ లయము సేయుట / లలిఁ బాపబంధముల లయము సేయుట అనేవి “నేను బంధాలను కరిగిస్తాను” అనే సాధనను చెప్పడం
కాదు.“బంధాలను నిలబెట్టే ప్రతిఘటన లేకుండుట” అనే మరింత సూక్ష్మమైన కదలికను చూపుతున్నాయి.
ఇక్కడే రెండవ చరణము మొదటి చరణముతో కలుస్తుంది: మొదట చూడటం; తరువాత చూసినదానికి ప్రతిఘటించకుండా ఉండటం. ఇక్కడ రెండవ చరణమంతా ఒకే కదలికగా కనిపిస్తుంది:
దుఃఖము → దాని వ్యక్తీకరణ → తలపు → తలపునుండి బంధము → తలపును తనలో చూడుట → ప్రతిఘటన లేకపోవుట → బంధము కరిగిపోవుట
మూడవ చరణం:
వెనక సంసారమందు
విషయ విముక్తుఁడౌటే
మునుపనే
తా జీవన్ముక్తుఁడౌట
పనివి శ్రీవేంకటేశుపదములు
శరణంటే
అనువైన దివ్యపదమప్పుడే
తా నందుట ॥ఏ త॥
|
కీర్తన పాదము
|
సంక్షిప్త భావము
|
|
వెనక సంసారమందు విషయ
విముక్తుఁడౌటే
|
ముందుగా సంసారములోనే ఉండి విషయబంధములు ఎలా ఏర్పడుతున్నవో
తెలియాలి.
|
|
మునుపనే తా జీవన్ముక్తుఁడౌట
|
అలా జీవించి ఉండగానే జీవన్ముక్తుడగుటకు అవకాశం ఉంటుంది.
|
|
పనివి శ్రీవేంకటేశుపదములు
శరణంటే
|
ఆ క్రమములోనే
శ్రీవేంకటేశుని పాదములను శరణుగా స్వీకరించుటకు అనుమతి కోరుట.
|
|
అనువైన దివ్యపదమప్పుడే తా
నందుట
|
అప్పుడు శ్రీవేంకటేశుడు అనువైన దివ్యపదమును అనుగ్రహించును.
|
భావము:
ముందుగా
సంసారములోనే ఉండి విషయబంధములు ఎలా ఏర్పడుతున్నవో తెలియాలి. అప్పుడే వాని నుండి
విముక్తికి ఆస్కారము ఉండును. ఆ తరువాత అలా జీవించి ఉండగానే జీవన్ముక్తుడగుటకు
అవకాశం ఉంటుంది. ఆ క్రమములోనే శ్రీవేంకటేశుని పాదములను శరణుగా స్వీకరించుటకు
అనుమతి కోరుట సాధ్యపడును. అప్పుడు శ్రీవేంకటేశుడు అనువైన దివ్యపదమును
అనుగ్రహించును.
గూఢార్థవివరణము:
ముందటి
రెండు చరణాలలో అన్నమయ్య చూపించిన పరిశీలనకు ఈ చరణము సహజమైన కొనసాగింపుగా
కనిపిస్తుంది. “వెనక సంసారమందు విషయ విముక్తుఁడౌటే”
అని మొదలుపెడతాడు. ఇక్కడ సంసారమును విడిచిపెట్టమని చెప్పడం లేదు. సంసారములోనే
ఉండి విషయబంధములు ఎలా ఏర్పడుతున్నవో ముందుగా తెలియాలి.
రెండవ
చరణంలో చూచినట్లుగా, మనలో పుట్టే తలపులు, వాటితో ఏర్పడే దుఃఖము, ఆ దుఃఖము నుండి పుట్టే
ప్రతిస్పందనలు, వాటికి మనము చేసే ప్రతిఘటన—ఇవే బంధమును
నిలబెట్టే కదలికలు. బంధము ఎలా ఏర్పడుతున్నదో ప్రత్యక్షముగా తెలిసినప్పుడే, దాని నుండి విముక్తికి ఆస్కారము ఉంటుంది.
అందుకే
వెంటనే: “మునుపనే తా జీవన్ముక్తుఁడౌట”
అంటాడు. జీవించి ఉండగానే జీవన్ముక్తుడు కావడం తరువాతి విషయం. ఇది సంసారాన్ని
నిరాకరించిన తరువాత వచ్చే స్థితి కాదు; సంసారములోనే విషయబంధము ఎలా
పనిచేస్తున్నదో తెలిసి, దాని నుండి విముక్తి కలిగిన తరువాత
వచ్చే స్థితి.
ఇక్కడ
ఒక క్రమము స్పష్టమవుతోంది: సంసారములో ఉండుట →
విషయబంధము ఏర్పడే విధానమును చూడుట → దాని నుండి
విముక్తి → జీవన్ముక్తి.
ఆ
తరువాతే: “పనివి శ్రీవేంకటేశుపదములు శరణంటే”
అనే మాట వస్తుంది. ఇది ముందటి క్రమానికి వెలుపల ఉన్న ఒక భక్తి చర్యగా కనిపించదు. ఆ
అంతర్గత పరిశీలన, విషయవిముక్తి, జీవన్ముక్తి అనే క్రమములోనే శ్రీవేంకటేశుని పాదములను శరణుగా స్వీకరించుటకు
అనుమతి కోరుట సాధ్యపడుతుంది. ఇక్కడ “పనివి” అనగా
అనుమతి తీసుకొనుట. ఇక్కడ కూడా “నేను సాధించాను”
అనే భావానికి చోటు లేదు. శరణు పొందడముకూడా తన స్వాధీనంలో ఉన్న సాధనగా కాక, అనుమతితో జరిగే విషయంగా చెప్పబడుతోంది.
అప్పుడు:
“అనువైన దివ్యపదమప్పుడే తా నందుట.”
ఇక్కడ “దివ్యపదము” ఏమిటో ముందుగానే నిర్ణయించలేము. అన్నమయ్య
చూపించిన క్రమమే ముఖ్యము.
మొదటి
చరణంలో ఇంద్రియముల కదలికను చూడటం మొదలైంది. రెండవ చరణంలో ఆ చూపు లోపలి దుఃఖము, తలపు, బంధము ఏర్పడే స్థలానికి వచ్చింది. ఇప్పుడు
మూడవ చరణంలో అదే పరిశీలన సంసారములోనే విషయవిముక్తికి, అక్కడి నుండి జీవన్ముక్తికి వస్తుంది. అంతిమంగా శరణాగతికూడా ఆ
క్రమంలోనే వస్తుంది. అప్పుడు — అనువైన దివ్యపదము. ఇదే పల్లవిలోని “శ్రీతరుణీపతి నిత్యసేవే జన్మఫలము” అనే మాటకు
తిరిగి చేరుతుంది.
X-X-X THE
END X-X-X

No comments:
Post a Comment