తాళ్లపాక అన్నమాచార్యులు
211R
కొమ్మ తన ముత్యాల కొంగు జారఁగఁ బగటు
For
English Version Press Here
ఉపోద్ఘాతము
అన్నమాచార్యులు ప్రేమ గురించి — “కుమ్మరింపుచుఁ దెచ్చుకొన్నదీ వలపు” అంటారు. మనం ప్రేమ అని పిలుచుకుంటున్న
దానిని ఆయన మన ముందే మరొక కోణంలో గోచరింప చేస్తున్నారు. మన ఇప్పటి స్థితిలో మన
అనుభవానికి వచ్చేది ప్రేమకన్నా, బయటకు కుమ్మరించుకుని
తెచ్చుకున్న ఆత్మదయ, జాలి, ఆందోళన,
ఎదురుచూపుల అనుభవం కావచ్చును.
“ఇది నా చేతినుంచి జారిపోతుందేమో” అన్న
ఆందోళనలోనూ, “మేమిక ఆనందంగా ఎప్పటికీ కలిసి ఉంటాము” అన్న
ఎదురుచూపులోనూ ప్రేమ వికసిస్తుందా?
ఇక్కడ అన్నమయ్య ప్రేమకు నిర్వచనం ఇవ్వడం లేదు. మనం ప్రేమ అని
పిలుచుకుంటున్న దాని వెనుక ఉన్న ఇచ్చిపుచ్చుకొను లావాదేవీల వంటి గంభీరమైన
ప్రవృత్తులను మన ముందుంచుతున్నారు.
శృంగార
సంకీర్తన
|
|
రాగి రేకు: 13-1 సంపుటము - సంకీర్తన: 5-74
|
|
కొమ్మ తన ముత్యాల కొంగు జారఁగఁ బగటు కుమ్మరింపుచుఁ దెచ్చుకొన్నదీ వలపు ॥పల్లవి॥ ఒయ్యారమున విభుని వొరపు గనుఁగొని రెప్ప ముయ్యనేరక మహ మురిపెమునను కయ్యంపుఁ గూటమికిఁ గాలుదువ్వుచు నెంతె కొయ్యతనమునఁ దెచ్చుకొన్నదీవలపు ॥కొమ్మ॥ పైపైనె ఆరగింపకుము పన్నీరు గడు- తాపమవునని చెలులు దలఁకగానే తోపు సేయుచుఁ గెంపు దొలఁకుఁ గన్నుల కొనల కోపగింపుచుఁ దెచ్చుకొన్నదీవలపు ॥కొమ్మ॥ ఎప్పుడునుఁ బతితోడ నింతేసి మేలుములు ఒప్పదని చెలి గోర నొత్తఁగానే యెప్పుడో తిరువేంకటేశు కౌఁగిఁట గూడి కొప్పుగులుకుచుఁ దెచ్చుకొన్నదీవలపు ॥కొమ్మ॥
|
Details
and Explanations:
పల్లవి:
కొమ్మ తన
ముత్యాల కొంగు జారఁగఁ బగటు
కుమ్మరింపుచుఁ
దెచ్చుకొన్నదీ వలపు ॥పల్లవి॥
|
కీర్తన
పాదము
|
ప్రత్యక్ష
అర్థము
|
గూఢార్థము
|
|
కొమ్మ తన ముత్యాల కొంగు జారఁగఁ బగటు
|
నాయిక అపురూపముగా, ప్రాణపదముగా భావించు
ముత్యాల కొంగు జారగా, తాను దాచిన మానము బహిర్గతమై, మఱుఁగులేక నిశ్చేష్టయై ఉన్నది
|
మనిషి అత్యంత గోప్యముగా దాచుకొనే భావములు, ఎవరికీ తెలుపలేని విషయములు బయటపడగా, ఇక
దాగుకొనుటకు వీలులేక నిశ్చేష్టుడై ఉన్నప్పుడు
|
|
కుమ్మరింపుచుఁ దెచ్చుకొన్నదీ వలపు
|
తాను అంతవరకు వలపు అని భావించినది — ప్రేమకన్నా బయటకు
కుమ్మరించుకొని తెచ్చుకున్న ఆత్మదయ, జాలి,
ఆందోళన, ఎదురుచూపుల సమ్మిళితము — అని
అవగతమైనది
|
అంతవరకు తాను ప్రేమ, వలపు
అనుకొన్నవి కేవలము పైపైపూతలవంటి భావములని, తాను నిజముగా
చేయుచున్నది వ్యవహారం, లావాదేవీ, బేరము
వంటివని తెలిసినది
|
భావము:
నాయిక
అపురూపముగా, ప్రాణపదముగా భావించు ముత్యాల కొంగు జారగా,
తాను దాచిన మానము బహిర్గతమై, మఱుఁగులేక
నిశ్చేష్టయై ఉన్నది. తాను అంతవరకు వలపు అని భావించినది, బయటకు
కుమ్మరించుకొని తెచ్చుకున్న ఆత్మదయ, జాలి, ఆందోళన, ఎదురుచూపుల సమ్మిళితమని అవగతమైనది. ఏమి
చేయుటకు పాలుపోక, చేష్టలుడిగి నిలుచున్నది.
అన్వయార్ధము:
మనిషి
తనలో అత్యంత గోప్యముగా దాచుకొనే భావములు బయటపడినప్పుడు, దాచుకొన్నది మాత్రమే కాదు, తాను దానిని ఏ పేరుతో
దాచుకొంటున్నాడో కూడా బయటపడుతుంది. అంతవరకు ప్రేమ, వలపు అని
భావించినది నిజముగా తనలో తానే పెంచుకొన్న ఆత్మదయ, జాలి,
ఆందోళన, ఎదురుచూపుల సమ్మేళనమని తెలుస్తుంది.
అప్పుడు ఆ భావము తనను తాను మోసగించుకొంటున్న ఒక వ్యవహారము, లావాదేవీ,
బేరముగా కనిపిస్తుంది.
గూఢార్థవివరణము:
మనిషి
తనలో అత్యంత గోప్యముగా దాచుకొనే భావములు బయటపడినప్పుడు, దాచుకొన్నది మాత్రమే కాదు, తాను దానిని ఏ పేరుతో
దాచుకొన్నాడో కూడా బయటపడుతుంది. నాయిక విషయంలో ముత్యాల
కొంగు జారిపోవడంతో మానము తొలగిపోవుట ఈ బహిర్గతానికి సంకేతము. ఇంతవరకు తనలో ఉన్న
భావాన్ని వలపు, ప్రేమగా భావించినది, సిగ్గు,
మానము మర్యాదల వంటి ఆచ్ఛాదనలు తొలగిన క్షణంలో తనలో తానే పెంచుకొన్న
ఆత్మదయ, జాలి, ఆందోళన, ఎదురుచూపుల సమ్మేళనమని తెలుస్తుంది.
ఇక్కడ “కుమ్మరింపుచుఁ దెచ్చుకొన్నదీ వలపు” అన్న
మాటే ఈ పల్లవికి అసలు మలుపు. ఆ వలపు తానే కుమ్మరించుకొని, తానే తెచ్చుకున్నది. అందువల్ల ఇంతవరకు ప్రేమగా
కనిపించినది, వాస్తవానికి తనలో తానే నిర్మించుకున్న ఒక భావము
అని తెలుస్తుంది. అన్నమాచార్యులు ప్రేమ లేదనుటలేదు. మనము ప్రేమ
అని వ్యవహరిస్తున్నదాని అసలు రూపాన్ని చూపుతున్నారు.
ఆ
భావము బయటపడినప్పుడు దాని వెనుక ఉన్న వ్యవహారము కూడా కనిపిస్తుంది. తాను
కోరుకున్నది జరగాలని ఆశించుట, దాని కోసం ఎదురుచూడుట, తనలో తానే జాలి పడుట, ఆందోళన చెందుట — ఇవన్నీ కలసి
ఒక భావాన్ని నిర్మించాయి. దానికి వలపు అని పేరు పెట్టుకుంది. అది తనను తాను
మోసగించుకొంటున్న ఒక వ్యవహారము, లావాదేవీ, బేరము వంటిదని అప్పుడు తెలుస్తుంది.
ఇక్కడే
నాయికకు ఏమి చేయాలో పాలుపోక, చేష్టలుడిగి నిలుచున్నది. ఎందుకంటే ఇంతవరకు తాను ఆధారపడిన భావానికే ఇప్పుడు ఆధారం లేదని తేలిపోయింది.
ఈ నాయిక స్థానంలో మనిషిని ఉంచితే, ఇదే కదలిక మరింత లోతుగా
కనిపిస్తుంది.
మనిషి
సత్యమును, దైవమును కనుగొనాలని చిరకాలం నుండి
వాంఛిస్తున్నాడు. జపములు, తపములు చేస్తూ, భోజనములు మాని, అగ్ని, వర్షము,
వేడి, చలి మొదలగువానిని తట్టుకుంటూ ఎన్నో
ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తున్నాడు. విభుని కోసం
ఎదురుచూస్తున్న నాయికా, తనలో తాను ఏదో ఒక రకముగా సత్యమును,
దైవమును పొందాలని తీవ్రమైన పూనికతో ఎదురుచూస్తున్న మనిషి ఒకే
పరిస్థితిలో నిలుస్తారు. ఎదురుచూసినది కనబడనప్పుడు, తాను
వెతుకుతున్నది తానే నిర్మించుకున్న నిర్మాణమని తెలుస్తుంది.
అప్పుడు
నాయికకు జారిపోయిన కొంగు కేవలం ఒక వస్త్రము కాదు; మనిషికి
కూడా తాను కప్పుకొన్న తెరలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. చివరకు మిగిలేది తాను
నిజముగా ఎదుర్కొంటున్నది— తాను దానిపై నిర్మించుకొని, దానినే వాస్తవమని భావించినది.
పల్లవి
లోని భావ పురోగతి: ఆచ్ఛాదన →
బహిర్గతం → వలపు యొక్క అసలు స్వరూపం →
స్వనిర్మిత భావం → నాయికకు దిక్కుతోచకపోవడం.
మొదటి చరణం:
ఒయ్యారమున
విభుని వొరపు గనుఁగొని రెప్ప
ముయ్యనేరక
మహ మురిపెమునను
కయ్యంపుఁ
గూటమికిఁ గాలుదువ్వుచు నెంతె
కొయ్యతనమునఁ
దెచ్చుకొన్నదీవలపు ॥కొమ్మ॥
|
కీర్తన
పాదము
|
ప్రత్యక్ష
అర్థము
|
గూఢార్థము
|
|
ఒయ్యారమున విభుని వొరపు గనుఁగొని రెప్ప
|
సొగసు, సౌందర్యగర్వముతో విభుని తనవైపు త్రిప్పుకొనగలనని
(వశపరచుకొనగలనని) ఉపాయములను తెలుసుకొని, కనురెప్పలు కూడా
మూయక ఎదురుచూస్తున్నది.
|
మనిషి తనకు తెలిసిన మార్గములతో దైవమును పొందగలనని భావించి, తన తెలివి, యుక్తి, సాధన,
ప్రయత్నములపై ఆధారపడుచు క్షణము కూడా తటపాయించక
|
|
ముయ్యనేరక మహ మురిపెమునను
|
కనురెప్పలు కూడా మూయలేక, మహ సంతోషముతో ఉప్పొంగి ఉన్నది
|
తన ప్రయత్నమే దైవానుభవానికి దారితీస్తుందని భావించి, మురిసిపోవుచున్న వాడొకడు
|
|
కయ్యంపుఁ గూటమికిఁ గాలుదువ్వుచు నెంతె
|
దైవమును
ఇంకొక జీవునిగా భావించి ప్రేమయుద్ధము వంటి సమాగమమునకు కాలుదువ్వుచూ, ఆ స్త్రీ తనను సమర్పించుకొనుచున్నది. (కానీ విభుడు కనబడడు)
|
తానువేరు, దైవము వేరు అను అంతర్గత విభజనలో ములిగి దైవమును వెతుకుటను ఒక సవాలుగా
స్వీకరించును. (కానీ ప్రభువు కానరాడు)
|
|
కొయ్యతనమునఁ దెచ్చుకొన్నదీవలపు
|
(కొయ్యతనము = మూర్ఖత్వము, కొంటెతనము,
మొండితనము) ఆమెకు మొండితనముతో తాను కనబఱచు వలపు తానే తెచ్చిపెట్టుకున్నదీ
అన్నది స్పురించును
|
అతడికి తాను మొండిగా తప్పొప్పులను నిర్ణయించగలననే నమ్మకముతో, కొయ్యతనమున తానే నిర్మించుకొని తెచ్చుకున్న మోహము తెలియవచ్చును
|
భావము:
సొగసు, సౌందర్యగర్వముతో విభుని తనవైపు త్రిప్పుకొనగలనని ఉపాయములను తెలుసుకొని,
కనురెప్పలు కూడా మూయక మహా సంతోషముతో ఆయన కోసం ఎదురుచూస్తున్నది.
దైవమును ఇంకొక జీవునిగా భావించి, ప్రేమయుద్ధము వంటి
సమాగమమునకు కాలుదువ్వుచూ, ఆ స్త్రీ తనను సమర్పించుకొనుటకు
సిద్ధపడుతున్నది. కాని విభుడు కనబడడు. చివరకు తన మొండితనముతో తాను కనబఱచు వలపు
తానే తెచ్చిపెట్టుకున్నదని ఆమెకు స్పురిస్తుంది.
అన్వయార్ధము:
మనిషి తనకు
తెలిసిన మార్గములతో దైవమును పొందగలనని భావించి, తన తెలివి,
యుక్తి, సాధన, ప్రయత్నములపై
ఆధారపడుచూ, క్షణము కూడా తటపాయించక దైవానుభవానుభవం కోసం ఎదురుచూస్తున్నాడు.
తానువేరు, దైవము వేరు అనే అంతర్గత విభజనలో మునిగి, దైవమును వెతకుటను ఒక సవాలుగా స్వీకరిస్తాడు. కానీ ప్రభువు కానరాడు.
అప్పుడు
తనకు తానే తప్పొప్పులను నిర్ణయించగలననే నమ్మకముతో, తన మొండితనముచే
తానే నిర్మించుకొని తెచ్చుకున్న మోహమునే తాను ప్రేమగా భావిస్తున్నడని తెలుస్తుంది.
గూఢార్థవివరణము:
పల్లవిలో
నాయిక ‘వలపు’ గుట్టు
బయటపడింది. ఈ చరణంలో అన్నమాచార్యులు ఆ వలపు ఎలా ఏర్పడిందో చూపిస్తున్నారు.
“ఒయ్యారమున విభుని వొరపు గనుఁగొని”
— సొగసు, సౌందర్యగర్వముతో విభుని తనవైపు
త్రిప్పుకొనగలనని, అందుకు ఒక ఉపాయము తనకు తెలుసునని ఆమె
భావిస్తున్నది. అందుకే కనురెప్పలు కూడా మూయకుండా ఎదురుచూస్తున్నది. తన ప్రయత్నమే
దైవానుభవానికి మార్గమని నమ్మి, ఆ ప్రయత్నంలోనే
మురిసిపోతున్నది.
తరువాత
“కయ్యంపుఁ గూటమికిఁ” అంటారు. దైవమును ఇంకొక జీవుని లాగ
భావించినప్పుడు తాను వేరు — విభువు వేరు అనే విభజన ఏర్పడుతుంది. అప్పుడు కలయిక
కూడా ఒక ప్రయత్నమవుతుంది; చేరవలసినది ఒకటి, చేరవలసినవాడు మరొకడు. అందుకే సమాగమము ప్రేమయుద్ధముగా మారుతుంది. కానీ ఎంత
పూనుకున్నా విభుడు కనబడడు.
ఇక్కడ
గీతలోని “సమత్వం యోగ ఉచ్యతే” (2.48) గుర్తుకు వస్తుంది.
సమస్థితి అనగా రెండు పరస్పర విరుద్ధములలో ఎటువైపుకు తూలని స్థితి. నాయిక మాత్రం ఆ
సమస్థితిలో లేదు; విభువును పొందడానికి చేసే ప్రయత్నమే తాను–విభుడు
అనే విభజనను బలపరుస్తున్నది.
లోపలి ప్రపంచము — హంసల చిత్రములు
ఈ
భావానికి హిల్మా ఆఫ్ క్లింట్ హంసల చిత్రములు ఒక ఆసక్తికరమైన దృశ్యసమాంతరాన్ని
ఇస్తాయి. నల్ల హంస భౌతిక ప్రపంచము, తర్కము, కారణములతోను, తెల్ల హంస ఆధ్యాత్మికము, దైవికము, అంతర్‌దృష్టితోను అనుసంధానించబడతాయి. Swan
No. 24లో అవి ఒకదానిలోకి మరొకటి చొచ్చుకొని పోయినట్లు, సాధారణ భౌతిక తర్కానికి సాధ్యంకాని రూపాన్ని ఏర్పరుస్తాయి. రెండు విరుద్ధ
శక్తులు ఒకదానిని మరొకటి తొలగించకుండా ఒక అతి సున్నితమైన సమతుల్యతలో కనిపిస్తాయి.
మానవునిలోనూ
ప్రపంచపు అవగాహన, తర్కము, కారణములు ఒకవైపు; ఆధ్యాత్మికము, దైవికము, అంతర్‌దృష్టి మరొకవైపు ఉంటాయి. అవి నిరంతరం
తమతమ వైపులకు లాగుతుంటాయి. Swan No. 24లో కనిపించే ఆ
సమత్వము “కయ్యంపుఁ గూటమి”ని పరిశీలించడానికి ఒక దృశ్యసమాంతరంగా చూడవచ్చు.
అయితే
నాయిక ఆ సమస్థితిని దర్శించలేదు; దానిని సాధించడానికి
కాలుదువ్వుతున్నది. అందువల్ల ఆమె ప్రయత్నమే మళ్లీ అలజడిగా మారుతుంది. బురదనీటిని
కదిలిస్తే బురద పైకి లేచి చూపును కప్పినట్లే, సత్యాన్ని
పొందాలనే పూనిక కూడా దృష్టిని అస్పష్టం చేయగలదు.
“కొయ్యతనమునఁ దెచ్చుకొన్నదీవలపు”
ఇక్కడ
కొయ్యతనము కేవలం మొండితనము కాదు; తాను తప్పొప్పులను
నిర్ణయించగలనని, తనకు తెలిసిన మార్గంలో ముందుకు సాగగలనని
మనిషి నమ్మే పట్టుదల. ఆ పట్టుదలతో తానే నిర్మించుకున్న మోహాన్నే వలపుగా
భావిస్తున్నాడు.
అన్నమాచార్యులు
ప్రేమ లేదనడం లేదు. మనము ప్రేమ అని వ్యవహరిస్తున్నదాని నిర్మాణాన్ని
చూపిస్తున్నారు. నాయికకు విభుడు కనిపించలేదు; అయినా వలపు ఉంది. అప్పుడు
ఆ వలపు ఎక్కడి నుండి వచ్చిందో చూడవలసి వస్తుంది — “దెచ్చుకొన్నది.”
తానే తెచ్చుకున్నది.
ఇదే
మనిషి విషయంలోనూ జరుగుతుంది. సత్యమును, దైవమును పొందాలని తన
తెలివి, యుక్తి, సాధన, ప్రయత్నములతో వెదుకుతాడు. చివరికి తాను వెతుకుతున్నది "దైవమునా?
తానే నిర్మించుకున్న దైవభావననా?" అన్న ప్రశ్న ముందుకు వస్తుంది.
రెండవ చరణం:
పైపైనె ఆరగింపకుము
పన్నీరు గడు-
తాపమవునని
చెలులు దలఁకగానే
తోపు సేయుచుఁ
గెంపు దొలఁకుఁ గన్నుల కొనల
కోపగింపుచుఁ
దెచ్చుకొన్నదీవలపు ॥కొమ్మ॥
|
కీర్తన
పాదము
|
ప్రత్యక్ష
అర్థము |
గూఢార్థము |
|
పైపైనె ఆరగింపకుము పన్నీరు గడు- |
పన్నీరు యొక్క సుగంధము పైపైననే. అయితే దానిని లోపలికి తీసికొన్న
విషము వంటిదని బోధ చేశారు. ఇంపుగా అనిపించేదైనా అతిగా అనుభవిస్తే తాపము
కలుగుతుందని హితులు హెచ్చరించారు.
|
మనిషి జీవితములోని భోగములు పన్నీరు వంటివే. అవన్నీ పైపైన ఉన్నవే.
వానినే జీవితపు పరమార్థముగా స్వీకరిస్తే అవి విషము వంటివని బోధ చేశారు. వానిలోనే
సంచరిస్తే తాపము కలుగుతుందని హితులు హెచ్చరించారు.
|
|
తాపమవునని చెలులు దలఁకగానే
|
||
|
తోపు సేయుచుఁ గెంపు దొలఁకుఁ గన్నుల కొనల
|
చెలుల మాటలను నిర్లక్ష్యంగా తోసివేస్తూ, కళ్ల కొనలలోని ఎర్రదనం కనబడుతుండగా
|
తన కోరికలకు అడ్డుగా నిలిచే సూచనలను పెడచెవినపెట్టి, తనకు నచ్చినట్లు చెలరేగడంతో అనుభవము → తాపము → క్రోధముగా మారి, కళ్ల కొనలలోని ఎర్రదనం కనబడుతుండగా — లోపల పెరుగుతున్న తాపము ఇప్పుడు
బాహ్య ప్రవర్తనలో కనిపించడం చూపించారు.
|
|
కోపగింపుచుఁ దెచ్చుకొన్నదీవలపు
|
వలపును దేనికైతే స్వీకరించబోయినదో, కోపపడుతూ
మొండితనముతో దేని నుండి తప్పించుకొన దలిచినదో, అందులోనే,
ఆ కోపములోనే చిక్కుకొని పోయినది.
|
తానే పెంచుకున్న ఆకర్షణ, దానినుండి
పుట్టిన కోరిక, దానికి వచ్చిన ప్రతిఘటన — చివరికి కోపముగా మారి
తానే తెచ్చుకున్న కలతగా బయటపడటం. కోపములో చిక్కుకొని తన లక్ష్యం నుండి తానే దూరం
జరిగిపోతున్నాడు.
|
భావము:
పన్నీరు
యొక్క సుగంధము పైపైననే ఉంటుంది. అయితే దానిని లోపలికి తీసికొంటే విషము వంటిదై
తాపము కలుగుతుందని చెలులు హెచ్చరించారు. ఆమె వారి మాటలను నిర్లక్ష్యంగా తోసివేస్తూ, తనకు నచ్చినట్లు చెలరేగుతున్నది. ఆ తాపము క్రమంగా కోపముగా మారి, కళ్ల కొనలలోని ఎర్రదనం బయటపడుతున్నది. చివరికి వలపును
స్వీకరించబోయినదానిలోనే, కోపపడుతూ మొండితనముతో దేనినుండి
తప్పించుకొనదలచినదో అందులోనే చిక్కుకొని పోయినది.
అన్వయార్ధము:
మనిషి
జీవితములోని భోగములు పన్నీరు వంటివి — పైకి ఇంపుగా, ఆకర్షణీయంగా
కనిపిస్తాయి; వాటినే జీవితపు పరమార్థముగా స్వీకరించి
వాటిలోనే సంచరిస్తే అవే తాపానికి కారణమవుతాయని హితులు హెచ్చరిస్తారు. కానీ మనిషి
తన కోరికలకు అడ్డుగా నిలిచే సూచనలను పెడచెవిన పెడతాడు. అప్పుడు అనుభవము →
తాపము → క్రోధము అనే కదలిక ఏర్పడుతుంది. తానే పెంచుకున్న ఆకర్షణ, దానినుండి పుట్టిన కోరిక, దానికి వచ్చిన ప్రతిఘటన
చివరికి కోపముగా మారి తానే తెచ్చుకున్న కలతగా బయటపడుతుంది. ఆ కోపములో చిక్కుకొని,
తాను మొదట కోరుకున్న లక్ష్యం నుండి తానే దూరమవుతాడు.
గూఢార్థవివరణము:
మొదటి
చరణంలో “కొయ్యతనమునఁ దెచ్చుకొన్నదీవలపు”
అని తాను తెచ్చుకున్న వలపు స్వరూపము బయటపడింది. ఈ చరణంలో ఆ వలపు ఎలా తాపముగా, చివరికి కోపముగా మారుతుందో అన్నమాచార్యులు చూపిస్తున్నారు.
“పైపైనె ఆరగింపకుము పన్నీరు” —ఇక్కడ
పన్నీరు పైకి ఆకర్షణీయంగా కనిపించే సుఖములు అనుభవములకు ప్రతీక. వాని ఇంపునే జీవితపు లక్ష్యంగా స్వీకరించి, దానిలోనే
సంచరిస్తే అదే తాపానికి కారణమవుతుంది.
అందుకే
“తాపమవునని చెలులు దలఁకగానే”
— చెలులు ఈ పరిణామాన్ని ముందుగానే గుర్తించి హెచ్చరిస్తారు.
వారు హితులుగానే కాక, మనిషిలోని వివేకానికి కూడా ప్రతిరూపంగా
కనిపిస్తారు. కానీ నాయిక ఆ మాటను స్వీకరించదు.
“తోపు సేయుచుఁ” — ఆ అభ్యంతరాన్ని తోసివేస్తుంది.
కోరికను అనుభవించడమే కాదు, దానిని ప్రశ్నించే మాటను కూడా
తిరస్కరిస్తుంది. తరువాత “గెంపు దొలఁకుఁ గన్నుల కొనల /
కోపగింపుచుఁ” — లోపల పెరిగిన తాపము ఇప్పుడు కళ్లలో
కనిపించే కోపముగా మారుతుంది.
ఇది
గీతలోని 2.62లోని కదలికను గుర్తుకు తెస్తుంది: విషయము →
సంగము → కామము → క్రోధము.
అన్నమాచార్యులు దీనిని సిద్ధాంతంగా చెప్పడం లేదు; ఒక చిన్న
దృశ్యములో ఆ కదలికను చూపిస్తున్నారు. అనుభవము →
తాపము → క్రోధము — లోపల జరిగినది చివరికి కళ్ల
కొనలలోని ఎర్రదనంగా బయటపడుతుంది.
అయితే
అసలు మలుపు చివరి పాదంలో ఉంది: “కోపగింపుచుఁ దెచ్చుకొన్నదీవలపు.” తాను
కోరుకున్న వలపే ఇప్పుడు తనను కోపములోకి నడిపించింది. తాను తప్పించుకోవాలనుకున్న
దానిలోనే చిక్కుకుంది. అంటే కలతకు కారణం బయట లేదు; తానే
పెంచుకున్న ఆకర్షణ, దాని నుండి పుట్టిన కోరిక, దానికి వచ్చిన ప్రతిఘటన — ఇవే కలసి ఆ కలతను నిర్మించాయి.
అందువల్ల
మొదటి రెండు చరణాల కదలిక: స్వీయనిర్మిత వలపు →
అనుభవము → తాపము → ప్రతిఘటన
→ క్రోధము → స్వీయనిర్మిత
బంధము.
అన్నమాచార్యులు
కోరికను తప్పుపట్టడం లేదు; కోరిక మనలో ఎలా కదులుతుందో చూపిస్తున్నారు.
మూడవ చరణం:
ఎప్పుడునుఁ
బతితోడ నింతేసి మేలుములు
ఒప్పదని
చెలి గోర నొత్తఁగానే
యెప్పుడో
తిరువేంకటేశు కౌఁగిఁట గూడి
కొప్పుగులుకుచుఁ
దెచ్చుకొన్నదీవలపు ॥కొమ్మ॥
|
కీర్తన
పాదము
|
ప్రత్యక్ష
అర్థము
|
గూఢార్థము
|
|
ఎప్పుడునుఁ బతితోడ నింతేసి మేలుములు |
ఎప్పుడు ప్రభువుతోనే ఉన్నప్పుడు, తనకు
ప్రభువుకు మధ్య ఇన్ని తెరలు, మేలుములు ఎందుకు
ఉంచుతున్నావని |
సత్యము ఎదురుగానే ఉన్నది. మనమే ఆచ్ఛాదనలు, భావనలు, గుర్తింపులతో సత్యానికి మనకు మధ్యలో తెరలు
నిరంతరం ఏర్పరచుకుంటున్నాము. తాను ఉన్న గుణముల ఆవరణ అడ్డుతగులుతున్నదని కవి భావము.
|
|
ఒప్పదని చెలి గోర నొత్తఁగానే |
(చెలి = సాధారణ నేస్తము కాదు. దైవ దాసి)
అవి తగవని ప్రియసఖి చెప్పి, చురకతో
గుర్తు చేయగానే
|
సత్యదర్శనము బయటనుంచి రాదు. సరియైన చిన్నపాటి సూచనతో మనిషి తానే
నిర్మించుకున్న ఆవరణను చూడగలుగుతాడు.
|
|
యెప్పుడో తిరువేంకటేశు కౌఁగిఁట గూడి
|
అలా చేయగానే ఎప్పటి నుండియో తిరువేంకటేశుని కౌగిటిలో ఉన్న సంగతి
అవగతమైనది
|
అలా చూడగానే దైవముతో కలయిక ఇప్పటిది కాదు; తాను వెదుకుతూ నిర్మించుకున్న విభజన తొలగినప్పుడు, ఎప్పటినుంచో ఉన్న ఏకత్వమే స్పష్టమవుతుంది.
|
|
కొప్పుగులుకుచుఁ దెచ్చుకొన్నదీవలపు
|
సంతోషముతో ఒప్పుగా తల ఆడించుచు, వ్యక్తమైన
వలపులో మునిగిఉన్నది
|
అప్పుడు సహజమైన ఆనందం మాత్రమే మిగులుతుంది; వెతికినది బయట దొరికినది కాదు.
|
భావము:
ఎప్పుడు
ప్రభువుతోనే ఉన్నప్పుడు తనకు ప్రభువుకు మధ్య ఇన్ని తెరలు, మేలుములు ఎందుకు ఉంచుతున్నావని ప్రియసఖి చురకతో గుర్తుచేసి, అవి తగవని చెప్పగానే, ఆ తెరలు తనకే అడ్డుగా ఉన్నాయని
ఆమెకు అవగతమవుతుంది. అలా చూడగానే, ఎప్పటి నుండియో తాను
తిరువేంకటేశుని కౌగిటిలోనే ఉన్న సంగతి తెలుస్తుంది. ఆ అవగాహనతో సంతోషముగా తల
ఆడిస్తూ, వ్యక్తమైన వలపులో మునిగిఉంటుంది.
అన్వయార్ధము:
సత్యము
మనకు ఎదురుగానే ఉన్నది. కానీ మనమే ఆచ్ఛాదనలు, భావనలు, గుర్తింపులతో
సత్యానికి మనకు మధ్య తెరలు ఏర్పరచుకుంటున్నాము. సత్యదర్శనము బయటనుంచి రావలసినది
కాదు; తాను ఉన్న గుణముల ఆవరణ అడ్డుతగులుతున్నదని చూడడమే
మొదటి మార్పు. సరియైన చిన్నపాటి సూచనతో మనిషి తానే నిర్మించుకున్న ఆవరణను
చూడగలుగుతాడు.
ఆ ఆవరణ
తొలగినప్పుడు దైవముతో కలయిక ఇప్పుడే జరిగినది కాదని తెలుస్తుంది. తాను వెదుకుతూ
నిర్మించుకున్న విభజన తొలగిపోవడంతో, ఎప్పటినుంచో ఉన్న ఏకత్వమే
స్పష్టమవుతుంది. సహజమైన ఆనందమే మిగులుతుంది.
గూఢార్థవివరణము:
మొదటి
రెండు చరణాలలో తానే తెచ్చుకున్న వలపు ఎలా భోగముగా, తాపముగా, చివరికి క్రోధముగా మారుతుందో చూపించారు.
ఇప్పుడు ఆ కదలికకు మూలమైన ఆచ్ఛాదన కనిపిస్తుంది.
“ఎప్పుడునుఁ బతితోడ నింతేసి మేలుములు” — ప్రభువు ఎప్పుడూ తనతోనే ఉన్నప్పటికీ, మధ్యలో ఇన్ని
తెరలు ఎందుకు? మనిషి సత్యానికి దూరంగా లేడు; తన భావనలు, గుర్తింపులు, గుణములతో
తానే ఒక ఆవరణాన్ని నిర్మించుకుంటున్నాడు.
“ఒప్పదని చెలి గోర నొత్తఁగానే” — చెలి
కొత్తగా ఏదీ ఇవ్వలేదు. ఒక చిన్న సూచనతో “ఇది తగదు” అని గుర్తుచేసింది. ఆ సూచనతో మనిషి తానే నిర్మించుకున్న ఆవరణను
చూడగలిగాడు.
అప్పుడు
“యెప్పుడో తిరువేంకటేశు కౌఁగిఁట గూడి” — తాను వెతుకుతున్నది ఇప్పుడే లభించలేదు. విభజన తొలగినప్పుడు, ఎప్పటినుంచో ఉన్న ఏకత్వమే అవగతమైంది.
అందుకే
చివరికి “కొప్పుగులుకుచుఁ” — కొత్తగా ఏదీ సాధించవలసిన అవసరం లేదు. ఆవరణ తొలగిపోయిన చోట సహజమైన
ఆనందమే మిగిలింది.
మూడు
చరణాల కదలిక ఇక్కడ పూర్తవుతుంది: వలపు →
తాపము → క్రోధము →
ఆవరణము → ఆవరణము కనిపించుట →
ఆవరణము తొలగుట → ఎప్పటినుంచో
ఉన్నదే అవగతమగుట.
X-X-X THE
END X-X-X

No comments:
Post a Comment