తాళ్లపాక అన్నమాచార్యులు
42R చూడరెవ్వరు దీని సోద్యంబు పరికించి
For
English Version Press Here
ఉపోద్ఘాతము
అన్నమాచార్యుల
వారు మనము జీవితాన్ని తగినంతగా పరిశీలించి చూడమని చెబుతున్నారు. అంటే మనం జీవితాన్ని
నిర్లక్ష్యంగా గడుపుతున్నామని కాదు. మన జీవితాన్ని నడిపించేది జీవితం గురించి మనమే
ఏర్పరచుకున్న అభిప్రాయాలు, నైతిక మరియు భౌతిక నిర్మాణాలు
మొదలైనవి. అవి మనకు మార్గదర్శకంగా పనిచేస్తుండగా, మమతలు,
కోరికలు, భవిష్యత్తుపై ఆశలు ఆ మార్గదర్శకాలను
క్రమంగా వక్రీకరిస్తాయి.
మనిషి
తనలోని ఆశలను, చింతను ఆలోచనగా; అహంకారాన్ని ప్రేమగా; ఆవేశాన్ని ఆనందంగా భావిస్తాడు.
తనను తాను సమర్థించుకోవడంలోనే మునిగిపోయి, తన అసలు స్థితిని
గమనించలేడు. తాను చక్కగా చూస్తున్నానని అనుకుంటూనే, వాస్తవానికి
తన భ్రమలనే చూస్తూ ఉంటాడు.
అందుకే
అన్నమాచార్యులు, “చూడరెవ్వరు దీని సోద్యంబు
పరికించి” అన్నారు. 'సోద్యంబు' (చోద్యము) అనగా ఆశ్చర్యకరమైన విచిత్రం లేదా వింత. మనిషి తన కళ్ళ ముందే అద్భుతమైన
జీవన ప్రక్రియ జరుగుతున్నా, దానిని ఒక చోద్యంగా పరికించి
చూడకపోవడమే ఇక్కడ అన్నమయ్య ఎత్తిచూపిన ముఖ్యాంశం.
మానవుడు
తన భ్రమలను గుర్తించగలిగినప్పుడే, తన చూపు
ఎక్కడ వక్రీభవిస్తున్నదో గమనించగలుగుతాడు. అందువల్ల సమస్య కేవలం తగినంత శ్రద్ధ
లేకపోవడం కాదు; తన చూపును ప్రభావితం చేస్తున్న మమతలు,
కోరికలు, అభిప్రాయాలు, అహంకారాలను
గుర్తించకపోవడమే.
|
అధ్యాత్మ
సంకీర్తన
|
|
రాగి రేకు: 16-2 సంపుటము - సంకీర్తన: 1-96
|
|
చూడరెవ్వరు దీని సోద్యంబు పరికించి చూడఁజూడఁగఁ గాని సుఖమెఱఁగరాదు ॥చూడ॥
ఎడతెగని మమత వేయఁగరాని పెనుమోపు కడలేని యాస చీఁకటి దవ్వుకొనుట నిడివైన కనుచూపు నీడనుండిన యెండ వడిచెడని తమకంబు వట్టి తాపంబు ॥చూడ॥
బుద్ధిమానిన చింత పోని యూరికిఁ దెరువు పొద్దువోవని వలపు పొట్ట పొంకంబు యెద్దుఁ బట్టిన సివం బెఱుకమాలిన ప్రియము లొద్దిక విహారంబు లుబ్బుఁ గవణంబు ॥చూడ॥
తీపులోపలి తీపు తిరువేంకటేశ్వరుని చూపు, దనుఁ బొడగనని చూపు లోచూపు, ఆపదలు వాయు నెయ్యపుఁ దలఁపు లీతలఁపు రూపైన రుచిలోని రుచి వివేకంబు ॥చూడ॥
|
Details
and Explanations:
పల్లవి:
చూడరెవ్వరు
దీని సోద్యంబు పరికించి
చూడఁజూడఁగఁ
గాని సుఖమెఱఁగరాదు ॥పల్లవి॥
|
పదము
|
అర్థము
|
|
చూడరెవ్వరు
|
ఎవరూ పరిశీలించి చూడరు
|
|
దీని
|
ఈ జీవితం యొక్క / జీవితం కొనసాగుతున్న ఈ ప్రక్రియ యొక్క
|
|
సోద్యంబు
|
పరిశీలించదగిన అద్భుతమైన, అంతుచిక్కని విషయం
|
|
పరికించి
|
జాగ్రత్తగా పరిశీలించి, లోతుగా విచారించి
|
|
చూడఁజూడఁగఁ
|
చూసి చూసి; పదేపదే,
నిరంతరంగా గమనిస్తూ
|
|
గాని
|
అలా చేయకపోతే
|
|
సుఖమెఱఁగరాదు
|
నిజమైన సుఖం ఏమిటో తెలుసుకోలేడు
|
భావము:
ఎవరూ
జీవితం అనే ఈ అద్భుతమైన, అంతుచిక్కని ప్రక్రియను జాగ్రత్తగా
పరిశీలించరు. దానిని లోతుగా చూసి గమనించకపోతే, నిజమైన సుఖం
ఏమిటో తెలుసుకోలేరు.
అన్వయార్ధము:
జీవితం
ఎంతటి అస్థిరమైనది, అనిశ్చితమైనదైనా, అనేక ప్రమాదాల అంచున, అసంభవమనిపించే విపత్కర
పరిస్థితుల మధ్య ఎటులనో కొనసాగుతూ ఉంటుంది. కానీ మనిషి ఆ అద్భుతాన్ని పరికించి
చూడడు. జీవితం యొక్క తాత్కాలిక స్వభావాన్ని నిరంతరం గమనించకుండా, ఈ స్వల్పమైన తాత్కాలిక వ్యవధిలోనే శాశ్వతత్వాన్ని వెదుకుతాడు. అందువల్ల
నిజమైన సుఖాన్ని గుర్తించడు.
గూఢార్థవివరణము:
అన్నమాచార్యులవారు
మనందరికీ అత్యంత చోద్యమైనదీ, ఆశ్చర్యకరమైనదీ, అతి చేరువలోనే ఉన్నదీ అయిన ఒక విషయాన్ని గమనించకుండానే జీవితాన్ని
వెళ్ళబుచ్చుతున్నామని చెబుతున్నారు.
చూడరెవ్వరు
దీని సోద్యంబు పరికించి: శాస్త్రాలు, గ్రంథాలు, హితోక్తులు, విజ్ఞానశాస్త్రాలు—ఇవన్నీ
జీవితాన్ని అనేక కోణాల్లో, అనేక విధాలుగా మనకు పరిచయం
చేయగలవు. అవి జీవితం గురించి విలువైన సమాచారాన్ని, వివరణలను,
మార్గదర్శకాలను అందిస్తాయి. అయినప్పటికీ, అసలు
జీవించుట అంటే ఏమిటి? జీవించడం అనే ప్రక్రియలో ఏమేమి మిళితమై
ఉన్నాయి? అవి పరస్పరం ఎలా పనిచేస్తున్నాయి? అనే విషయంపై మానవునిలో అంతర్గతమైన, ప్రత్యక్షమైన
అవగాహన అంతగా ఏర్పడలేదు.
మనకు
తెలిసిన విషయాలన్నీ సాధారణంగా ఇతరుల పరిశీలనలు, బోధనలు,
సిద్ధాంతాలు, అనుభవాల ద్వారా ఏర్పడినవే. వాటి
ఆధారంగా ప్రతి ఒక్కరూ తమతమ అభిప్రాయాలను, ప్రమాణాలను,
జీవన విధానాలను ఏర్పరచుకుని జీవితం కొనసాగిస్తున్నారు. కానీ తాను
జీవిస్తున్న ప్రతి క్షణంలో తనలోనే జరుగుతున్న జీవప్రక్రియను స్వయంగా పరికించి
చూడటం మాత్రం అరుదుగా జరుగుతుంది.
భగవద్గీత
13-16లో “సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం” అని పేర్కొన్నట్లు,
ఇది అత్యంత సూక్ష్మమైనదగుట వలన, ఈ జీవప్రక్రియ
అంత సులభంగా పట్టుబడదు.
చూడఁజూడఁగఁ
గాని సుఖమెఱఁగరాదు: పైన చెప్పినది ఒకసారి చూసినా, ఒక్కసారి ప్రయత్నించినా సిద్ధించే విషయం కాదు. జీవితం తనలో ప్రతి క్షణం ఎలా
జరుగుతున్నదో, దానిలో ఆలోచనలు, కోరికలు,
అనుబంధాలు, భయాలు, ఆశలు,
సుఖదుఃఖాలు ఎలా మిళితమై ఉన్నాయో నిరంతరం గమనించాలి. ఈ పరిశీలనలో తొందరపాటు
గానీ, పైపై అవగాహన గానీ సరిపోవు.
మనం సాధారణంగా
అనుభవించే సుఖానికి ఒక మొదలు, ఒక చివర ఉంటాయి. అది పరిస్థితులపై ఆధారపడి
ఉంటుంది; అందువల్ల దాని వెంట దుఃఖం, కోల్పోతామనే
భయం, బంధం కూడా చేరి ఉంటాయి. అన్నమాచార్యులు పేర్కొన్న ‘సుఖము’
దుఃఖములకు, బంధములకు అంటనిది. అది మరొక తాత్కాలిక అనుభవాన్ని
సంపాదించుకోవడం కాదు. జీవితం యొక్క స్వభావాన్ని లోతుగా పరికించి చూసినప్పుడు,
తాత్కాలికమైన అనుభవాలను నిజమైన సుఖంగా భావించే మన భ్రమ తొలగి,
నిజమైన సుఖం ఏమిటో గుర్తించగలుగుతాము.
Bottom of Form
మొదటి చరణం:
ఎడతెగని
మమత వేయఁగరాని పెనుమోపు
కడలేని యాస
చీఁకటి దవ్వుకొనుట
నిడివైన
కనుచూపు నీడనుండిన యెండ
వడిచెడని
తమకంబు వట్టి తాపంబు ॥చూడ॥
|
కీర్తన పాదము
|
సంక్షిప్త భావం
|
|
ఎడతెగని మమత వేయఁగరాని పెనుమోపు
|
తెంచుకోలేని మమత ఒక పారవేయలేని పెనుమోపు
|
|
కడలేని యాస చీఁకటి దవ్వుకొనుట
|
అంతులేని కోరికలను తీర్చుకోవాలనే ప్రయత్నం చీకటిలో (తమో
గుణములో) తవ్వుకొనుట (ఏమి చేస్తున్నామో తెలియక చేయుట)
|
|
నిడివైన కనుచూపు నీడనుండిన యెండ
|
దీర్ఘమైన చూపు (భవిష్యత్తుపై నీ చూపు) నీడనుండిన యెండ (నీడలో ఎండ ఉండదు కావున అసత్యము. చేయరాని పని)
|
|
వడిచెడని తమకంబు వట్టి తాపంబు
|
తగ్గని చల్లారని తనదే అనే పట్టుదలలు; పొందగలనను భావములు; తన
స్వాధీనమను భావములు కేవలం బాధలు, మనోవేదనలు మాత్రమే
|
భావము:
మనిషి
మమతలు, కోరికలు, భవిష్యత్తుపై
ఆశలు, ‘నాది’ అనే పట్టుదలలతో తన జీవితాన్ని తానే సంక్లిష్టం
చేసుకుంటున్నాడు. వాటి భారాన్ని మోయలేకపోయినా, వాటిని
వదులుకోలేక మరింతగా వాటిలోనే చిక్కుకుంటున్నాడు. భవిష్యత్తును సురక్షితంగా,
సుగమంగా చేసుకోవాలనే ఆరాటంలో తన ప్రస్తుత జీవితాన్ని
గమనించలేకపోతున్నాడు.
ఈ
మానసిక ఒత్తిళ్లు అతని ఆలోచనలను, నిర్ణయాలను, కార్యాలను
ప్రభావితం చేస్తున్నాయి. ఫలితంగా, జీవితం వక్రీభవించకపోయినా,
దానిని చూసే అతని దృష్టి అనేక కోణాల్లో వక్రీభవిస్తోంది. అందువల్ల
జీవితం అనే ఈ అద్భుతమైన ప్రక్రియను పరికించి చూడలేక, నిజమైన
సుఖాన్ని గుర్తించలేకపోతున్నాడు.
గూఢార్థవివరణము:
క్రింది
Salavador Dali గారు చేసిన Nobility of Time అను కంచు (bronze) కళాఖండమును పరీక్షగా చూడండి.
ఈ చిత్రంలో ఒక గోడ గడియారం చపాతీలా
సాగుతూ వేళ్ళాడుతూ, ఆకారం నిలబెట్టుకోలేక ఆకృతి చెడి, ఆ కనబడుతున్న చెట్టు
కొమ్మలపై చతికిలబడింది. డాలీ గారు ఆ గడియారం ద్వారా మనిషి జీవితాన్ని మనకు
గుర్తుచేస్తున్నట్లుగా, అసలు సమస్యను మన ముందుంచారు.
మనిషి
మమతల భారాన్ని మోయలేకపోయినా, దానిని
వదులుకోలేకపోతున్నాడు. ఆశ చావక, మరింతగా వాటిలోనే
ఇరుక్కుపోతున్నాడు. భవిష్యత్తును సుగమం చేసుకోవాలనే ఆరాటంతో, తన సామర్థ్యంపై ఉన్న నమ్మకంతో, ఎన్నో సాధించగలననే
ఆత్మవిశ్వాసంతో, అనేక బాధలను మరియు మనోవేదనలను
అనుభవిస్తున్నాడు.
పై
ప్రయత్నాలన్నీ అక్కడ కనిపించే గోడ గడియారం వలె, మన
జీవితాన్ని అనేక కోణాల్లో, అనేక సందర్భాల్లో
వక్రీకరిస్తున్నాయి. మమతలు, కోరికలు, భవిష్యత్తుపై
ఆశలు, ‘నాది’ అనే పట్టుదల—ఇవన్నీ మనం జీవితాన్ని చూసే
విధానాన్ని మార్చేస్తున్నాయి. ఆయా పరిస్థితులు మనలను ఉసిగొల్పుతుంటే, వాటి ప్రభావంతోనే మనం ఆలోచించి, నిర్ణయాలు తీసుకుని,
పనులను చేపడుతున్నాము. అందువల్ల, మన ప్రస్తుత
కార్యాలు జీవితాన్ని యథార్థంగా చూసిన దృష్టి నుంచి కాకుండా, ఇప్పటికే
వక్రీభవించిన దృష్టి నుంచి ఉద్భవిస్తున్నాయి.
జీవితం
వక్రీభవించలేదు; జీవితాన్ని చూసే మన దృష్టి
వక్రీభవించింది. మరొకసారి పల్లవిని మననం చేసుకోండి: “చూడరెవ్వరు
దీని సోద్యంబు పరికించి” జీవితం మన ముందే జరుగుతున్నది.
కానీ దానిని పరికించి చూసే దృష్టిని మనమే మమతలు, కోరికలు,
ఆశలు, పట్టుదలలతో వక్రీకరించుకుంటున్నాము.
రెండవ చరణం:
బుద్ధిమానిన
చింత పోని యూరికిఁ దెరువు
పొద్దువోవని
వలపు పొట్ట పొంకంబు
యెద్దుఁ
బట్టిన సివం బెఱుకమాలిన ప్రియము
లొద్దిక
విహారంబు లుబ్బుఁ గవణంబు ॥చూడ॥
|
కీర్తన పాదము
|
సంక్షిప్త భావము
|
|
బుద్ధిమానిన చింత పోనియూరికిఁ దెరువు
|
బుద్ధిమాలిన మనోవ్యథలు, ఆలోచనలు పోనియూరికి దారులు. (ఎక్కడికి చేరుకోవాలని
ఆ చింతలు చేస్తున్నామో, అక్కడికి చేరనీయవు.)
|
|
పొద్దువోవని వలపు పొట్టపొంకంబు
|
(పొద్దువోవని = ఉబుసుపోవు, కాలక్షేపం చేయు; పొట్టపొంకంబు = తన టెక్కు,
తన అతిశయం, తన ఠీవి, inflated
conceit) ఉబుసుపోక చేయు టెక్కులీ వలపులు.
|
|
యెద్దుఁ బట్టిన సివం బెఱుకమాలిన ప్రియము
|
(యెద్దుఁ బట్టిన సివం = మృగములాంటి ఆవేశము.)
మృగములాంటి ఆవేశము వంటిది, మానవునికి ఎఱుకలేని — తెలివిలేని — ప్రియమైన అనుబంధము. మృగములాంటి ఆవేశము
పూనడం మానవునికి అర్థంలేని సంతోషము.
|
|
లొద్దిక విహారంబు లుబ్బుఁగవణంబు
|
(ఒద్దిక విహారంబులు = వేడుకగా తిరుగుటలు; ఉబ్బుఁగవణంబు = స్థూలమైన మృగభక్ష్యము.
అన్వయార్థము: స్థూలమైన ఇంద్రియానుభవము.) వేడుకగా విహారంబులు చేయుట స్థూలమైన
ఇంద్రియానుభవములే కాని ఇంకేమీ కాదు.
|
భావము:
మనిషి
తనను తాను తెలివైనవాడిగా భావించినా, అతని చింతలు మాత్రం అతను
చేరాలనుకున్న చోటికి చేరనీయని దారులవంటివి. ఆలోచిస్తున్నాననుకుంటూ, వాస్తవానికి తనను తానే మరింత గందరగోళంలోకి నెట్టుకుంటూ వేరే చోటికి
వెళుతున్నాడు.
కాలక్షేపం
కోసం చేసే వలపులు, తన టెక్కును, తన అతిశయాన్ని, తన ఠీవిని ప్రదర్శించే అనుబంధాలు,
తన గొప్పతనాన్ని నిలబెట్టుకోవాలనే ఆరాటాలు—ఇవన్నీ పైకి ప్రేమగా,
ఆనందంగా కనిపించినా, వాటి లోలోపల కూడా
అహంకారమే పనిచేస్తున్నది.
మృగస్వభావమైన
ఆవేశం, ఎరుకలేని పట్టుదల, అర్థంలేని
ఉత్సాహాలతో కూడిన ప్రియమైన అనుబంధం కూడా మానవునికి తెలియని, తెలివిలేని
ఒక మోహమే. మృగములాంటి ఆవేశాన్ని పూనడం మానవునికి అర్థంలేని సంతోషం. చివరకు వేడుకగా
చేసే విహారాలు, ఇంద్రియాలకు అందించే అనుభవాలు కూడా స్థూలమైన
భోగాలకే పరిమితమవుతాయి.
ఈ
విధంగా మనిషి చింతలను ఆలోచనలుగా, అహంకారాన్ని ప్రేమగా, ఆవేశాన్ని ఆనందంగా, ఇంద్రియభోగాలను విహారంగా
భావిస్తూ జీవిస్తాడు. అందువల్ల తనలో జరుగుతున్నదాన్ని యథార్థంగా పరికించి
చూడలేకపోతున్నాడు.
గూఢార్థవివరణము:
ఇక్కడ
ఆచార్యులవారు మానవుని అసలైన బలహీనతను బయటపెడుతున్నారు. మనిషి తన చింతలను ఆలోచనలుగా, అహంకారాన్ని ప్రేమగా, ఆవేశాన్ని ఆనందంగా, ఇంద్రియభోగాలను విహారంగా భావిస్తాడు. తనకు అనుకూలమైనదే సత్యమని నమ్మి,
దానికి భిన్నమైన దేనికీ చోటివ్వడు. అసంబద్ధమైన ఆలోచనలకు తర్కంతో
సంజాయిషీలు చెప్పుకుంటూ, తన మొండితనాన్నే మేకపోతు
గాంభీర్యంతో కాపాడుకుంటాడు.
అలాంటి
వారి అంతరంగం క్రింద చూపిన
మాగ్రిట్ గారి అధివాస్తవిక చిత్రము “ది లిజనింగ్ రూమ్” లాంటిదే.
మాగ్రిట్
గారి చిత్రంలో ఒక సాధారణ గదిలోని ఒక ఆపిల్ ఉంది. అది అసాధారణంగా విస్తరించి, గది మొత్తాన్ని ఆక్రమించింది; దాని కారణంగా గదిలోని
మిగిలిన వస్తువులకు, ఆఖరకు వెలుతురుకు కూడా ఖాళీ లేకుండా
పోయింది.
అలాగే
ఒక నమ్మకం, ఒక చింత, ఒక అనుబంధం లేదా
ఒక ఆవేశం అంతరంగమంతటినీ ఆక్రమిస్తుంది. అప్పుడు సత్యాన్ని వినటానికి, వేరే విధంగా చూడటానికి స్థలం మిగలదు. అసంబద్ధమైన ఆలోచనలకే సంజాయిషీలు
చెప్పుకుంటూ, అందులోనే తృప్తిపడి, అందులోనే
తడబడే మానవుని అసలు పరిస్థితి ఇదే. అందుకే
అన్నమాచార్యుల వారు "చూడరెవ్వరు దీని సోద్యంబు పరికించి"
అన్నారు.
Bottom of Form
మూడవ చరణం:
తీపులోపలి
తీపు తిరువేంకటేశ్వరుని
చూపు, దనుఁ బొడగనని చూపు లోచూపు,
ఆపదలు వాయు
నెయ్యపుఁ దలఁపు లీతలఁపు
రూపైన రుచిలోని
రుచి వివేకంబు ॥చూడ॥
|
కీర్తన పాదము
|
సంక్షిప్త భావము
|
|
తీపులోపలి తీపు తిరువేంకటేశ్వరుని
|
మధురమైన వాటిలోకెల్లా మధురమైనది తిరువేంకటేశ్వరుని దయాదృష్టి.
|
|
చూపు దనుఁ బొడగనని చూపు లోచూపు
|
(దనుఁ బొడగనని చూపు = తనువుతో కూడని దృష్టి) తన
శరీరంతో, వ్యక్తిగత కేంద్రంతో ఐక్యపడకుండా చూడగలిగే
అంతర్వీక్షణము.
|
|
ఆపదలువాయు నెయ్యపుఁ దలఁపులీతలఁపు
|
(ఆపదలువాయు= ఇహలోక బంధములు) ఆపదలను తొలగించే
హితకరమైన, స్నేహపూర్వకమైన స్మరణ.
|
|
రూపైన రుచిలోని రుచి వివేకంబు
|
అనుభవాలన్నింటిలోని అసలైన మాధుర్యం, వాటిని వక్రీకరణ లేకుండా చూడగలిగే చూపు
వివేకము.
|
భావము:
మధురమైన
అనుభవాలన్నింటిలోకెల్లా మధురమైనది తిరువేంకటేశ్వరుని దయాదృష్టి. ఆ దయాదృష్టి వలన, తనువున (‘నేను’కు) కలుగు దృష్టిని
తుది ప్రమాణంగా స్వీకరించకుండా చూడగలిగే లోచూపు కలుగుతుంది.
ఇహలోక
బంధాలే ఆపదలకు మూలమని గ్రహించి, వాటి నుండి విముక్తి కలిగించే
హితకరమైన, స్నేహపూర్వకమైన స్మరణ అది. అనుభవాలన్నింటిలోని
అసలైన మాధుర్యం, వాటిని ఎటువంటి వక్రీకరణ లేకుండా చూడగలిగే చూపే
వివేకము.
సత్యాన్ని
స్పష్టంగా చూడటానికి ‘నేను’ అనే వ్యక్తిగత కేంద్రం అడ్డురానప్పుడు, ఆ చూపులోనే జ్ఞానం, రక్షణ, మాధుర్యం
అంతర్లీనంగా ఉంటాయి.
గూఢార్థవివరణము:
మొదటి
రెండు చరణాలలో ఆచార్యులవారు మనిషి జీవితం పట్ల నేరుగా చూడలేకపోవడానికి కారణాలను
చూపించారు. మమతలు, కోరికలు, భవిష్యత్తుపై
ఆశలు, ‘నాది’ అనే పట్టుదలలు అతని చూపును వక్రీకరిస్తాయి.
అంతేకాదు, చింతను బుద్ధిగా, అహంకారాన్ని
ప్రేమగా, ఆవేశాన్ని ఆనందంగా, ఇంద్రియభోగాలను
విహారంగా భావిస్తూ, తన వక్రీకరణలకే సమర్థనలు చెప్పుకుంటాడు.
అందువల్ల
సమస్య కేవలం గందరగోళంలో ఉండటమే కాదు; తాను గందరగోళంలో ఉన్నాననే
విషయాన్ని కూడా చూడలేకపోవడం. (తిరిగి పల్లవిని గుర్తు
చేసుకోండి: "చూడరెవ్వరు దీని సోద్యంబు
పరికించి") ఈ
స్థితికి విరుద్ధమైన చూపును మూడవ చరణం సూచిస్తుంది.
“దనుఁ బొడగనని చూపు లోచూపు” అంటే తనువును తనకు నిర్ధారణగా, రుజువుగా స్వీకరించకుండా చూడటం. శరీరాన్ని నిరాకరించడం కాదు; “ఇదే నేను” అనే వ్యక్తిగత కేంద్రాన్ని తుది ప్రమాణంగా తీసుకోకుండా చూడటం.
అప్పుడు
చూపు తన స్వార్థం, భయం, కోరిక,
జ్ఞాపకం, అభిప్రాయం వంటి రంగులను విషయాలపై
పూయదు. ఇహలోక బంధాలే ఆపదలకు మూలమని స్పష్టమవుతుంది. వాటిని బలవంతంగా తొలగించవలసిన
అవసరం లేదు; అవి మనలను ఎలా బంధిస్తున్నాయో స్పష్టంగా
కనిపించినప్పుడు, వాటి పట్టు సడలుతుంది.
జిడ్డు
కృష్ణమూర్తి చెప్పినట్లుగా, మనలోని గందరగోళాన్ని ఎటువంటి
వక్రీకరణ లేకుండా చూసినప్పుడు, ఆ చూడటంలోనే ఒక సహజమైన క్రమం
ఏర్పడుతుంది. దానికి బయట నుంచి నియమాన్ని, నియంత్రణను లేదా
సిద్ధాంతాన్ని జోడించవలసిన అవసరం లేదు. అందుకే చివరి పాదం అత్యంత ముఖ్యమైనది:
“రుచిలోని రుచి వివేకంబు” అనుభవాలన్నింటిలోని
అసలైన మాధుర్యం ఏదో ప్రత్యేకమైన అనుభవంలో లేదు. అనుభవాన్ని వక్రీకరణ లేకుండా
చూడగలిగే చూపే వివేకము. ("యః పశ్యతి స పశ్యతి" ఆ రకముగా చూచువాడు ద్రష్ట - భగవద్గీత 13-28)
మొదటి
పల్లవిలో అన్నమాచార్యులు జీవితం అనే అద్భుతాన్ని పరికించి చూడమన్నారు. మొదటి రెండు
చరణాలు ఆ చూపును ఎలా కోల్పోతున్నామో చూపించాయి. ఈ మూడవ చరణం, ఆ వక్రీకరణలేని చూపు ఎలా ఉండాలో సూచిస్తున్నది. అదే తిరువేంకటేశ్వరుని
దయాదృష్టి— చూపులోని మాధుర్యం, మాధుర్యంలోని వివేకం.
X-X-X THE
END X-X-X
No comments:
Post a Comment