229. గడ్డపార మింగితే నాఁకలి
దీరీనా
For English version press here
ఉపోద్ఘాతము
"చిలుకలకు తాళ్ళుకట్టి
ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుదాం అనుకుంటారా?"
ఒకవేళ ఎగిరినా అవి వశములో వుంటాయా?
మంటని మూటగట్టి ఇంట్లో దాచిపెడతారా?
ఇలాంటి మోటు ఉదాహరణల వెనుక
ఎంతో తత్వాన్ని దాస్తారు ఆచార్యులు.
అన్నమాచార్యుల మాటల్లో వినూత్న
ఊహాశక్తి ఉంటుంది —
కానీ ఆ ఊహలన్నీ భూమ్మీదే
నిలిచి ఉంటాయి
ఏ తత్వవేత్తా ఇంత నిశితముగా ప్రశ్నించడు. ప్రశ్నించలేడు.
మన జీవితానికి అడుగుమట్టులైన నమ్మకాలనే
తిరిగి పరిశీలించమంటాడు.
మన ఆలోచనలలో విద్యుద్వేగాన్ని
పోస్తాడు.
శబ్దంలేని గర్జన, సంజ్ఞలలో విప్లవం,
లోతులో శాశ్వతం.
స్వర్గం గురించీ, పరమపదాల గురించీ చెప్పి మోక్షాన్ని
చాటడు —
కాని గడ్డపారను జీవితానికి అద్దంగా
మార్చి,
మన జీవన శ్రమల అర్థహీనతే
సత్యానికి ద్వారమని చూపిస్తాడు.
అతనికి తత్వశాస్త్రాల అవసరం లేదు.
భారీ సిద్ధాంతాలెక్కడ? అతనికి ఇవన్నీ వ్యర్థం.
గడ్డపార, చిలుక, రాళ్లు, బూడిద, పాము — ఇవే అతడి
సాధనాలు.
మనలో ఆత్మవిచారణను రేపడానికి ఇవే
చాలు.
అధ్యాత్మ
కీర్తన |
రేకు: 29-2 సంపుటము:
1-177 |
గడ్డపార మింగితే నాఁకలి దీరీనా యీ
వొడ్డిన భవము దన్ను వొడ కమ్ముఁ గాక ॥పల్లవి॥ చించుక మిన్నులఁ బారేచిలకలను బండిఁ గట్టి
వంచుకొనేమన్న నవి వసమయ్యీనా
యెంచరాని యింద్రియము లెవ్వరికి నేల చిక్కు
పొంచి పొంచి వలపులు బొండఁబెట్టుఁ గాక ॥గడ్డపార॥ మంటమండే యగ్గి దెచ్చి మసిపాఁత మూఁట గట్టి
యింటిలోన దాఁచుకొన్న నితవయ్యీనా
దంటమమకార మిట్టే తన్నునేల సాగనిచ్చు
బంటుఁ జేసి ఆసలనే పారఁదోసుఁ గాక ॥గడ్డపార॥ పట్టరాని విషముల పాముఁ దెచ్చి తలకిందఁ
బెట్టుకొన్నా నది మందపిలి వుండీనా
వెట్టసంసార మిది వేంకటేశుఁ గొలువని
వట్టిమనుజుల పెడవాడఁ బెట్టుఁ గాక ॥గడ్డపార॥
|
Details and Explanations:
పల్లవి:
గడ్డపార = పలుగు, గునపము; మింగితే = మింగితే, తింటే; నాఁకలి దీరీనా = ఆకలి తీరుతుందా?; యీ వొడ్డిన = ఈ మొదలుపెట్టిన; భవము = పుట్టుక; దన్ను = ఆసరా, బలము, నిలుపుచోటు, తీగెలుపైకి పాకుటకు అండగా పెట్టిన పుల్లలు; వొడ కమ్ముఁ గాక = ఒడకి అమ్ము గాక = ఇటుక తుంపుల బాణము గాక (= చిన్న చిన్న విడి విడి రాళ్ళు చెదురు మదురుగా పేర్చి సంధించిన బాణం గాక ).
భావము, వ్యుత్పత్తి:
భావము: గడ్డపార మింగితే ఆకలి తీరుతుందా? ఈ మొదలైన పుట్టుక చిన్న
చిన్న విడి విడి రాళ్ళు చెదురు మదురుగా పేర్చినటు వంటిదే!
(1) భావము నుంచి
గడ్డపార మింగితే ఆకలి ఎలాగైతే తీరదో, అలాగే ఈ పుట్టుకను దన్నుగా తీసుకొని జీవితమును తగినట్లుగా అమర్చుకుందామంటే ప్రయోజనములేదు.
(2) పైదాని నుంచి
గడ్డపార జీవనోపాధికి
ఉపయోగపడినా, దానంతట అది ఆకలి తీర్చలేదు. అలాగే
ఈ జన్మము మోక్షమునకు ఉపయోగపడినా, దానంతట అది అక్కడకు చేర్చలేదు.
(3) పైదాని నుంచి
అన్వయార్ధము: చేయరాని పనులుజేయకు. జీవితమును అది
వెళ్లినట్లు వెళ్ళనీయి. అన్నీ నీవనుకున్నట్లుగా ఉండాలనుకోకు.
(4) పైదాని నుంచి
వ్యాఖ్యానము:
ఈ పల్లవిలోని భావాన్ని ఆకళింపు చేసుకొని చేశారా అనిపించే
ఈ కళాకృతిని చూడండి.
ఈ వొడ్డిన భవము దన్ను వొడ కమ్ముఁ గాక
అంటే, ఈ పుట్టుక అనే జీవితం ఒక సంపూర్ణమైన, శాశ్వతమైన ఆసరా కాదు. ఇది ఒడ కమ్ముఁ గాక – loosely arranged arrow of broken bricks — అంటే ఇటుక తుంపులనో, చెదురుమదురుగా పేర్చిన పదార్థాలనో కలిపి చేసిన బాణంలా ఉంది.
ఇది సంధించిన బాణం లాంటిది. అది ముందుకు సాగుతూనే వుంటుంది. బాహ్య వీక్షకుడికి అది కదులుతుంటే సమయము అన్న స్పృహ కలుగుతుంది. బాణంతో పయనించు వానికి ఆ సమయము అన్న స్పృహ వుండదు.
ఆ బాణానికి స్థిరత లేదు, దిశ స్పష్టత లేదు, బలమూ లేదు. మనం దీన్ని ఆశ్రయించదలిస్తే — అది మనకి వక్రీకృత దారిని చూపిస్తుంది. మనం పట్టుకున్నది జీవితం కాదు, దాని వక్రీకృత రూపమే.
అసలు మెలిక
జీవితానికి జీవించడానికి ఉన్న వ్యత్యాసం
జీవితం (Life) అనేది ఒక గమ్యరహిత, కాలానుగతంగా
కదులుతున్న శరీరానికి నిచ్చిన ప్రయాణం.
జీవించడమంటే (Living) — ఆ కదలికలో మమేకమై దాని నుంచి వేరుపడకుండా ఉండటం.
ఇది బాణంపై, బాణంతో పాటు స్వారీ అనుకోవడం కాదు ఎందుకంటే మనం ఎక్కబోయిన తక్షణం బాణం ఆకృతిని వికృతి చేయడమో, దిశ మార్చడమో జరుగుతుంది. మన ప్రయత్నము భగ్నమౌతుంది. అంటే మనం దానిలో కలిసి పోవాలి — దాని దిశలో పరివర్తన లేకుండా.
ఇక్కడ ఇచ్చిన ఉదాహరణలోని మలుపు క్లిష్టమైనదే కాదు, దాదాపు అసంభవము కూడా. అపూర్వమైన జయమందుటకు
అలౌకికమైన శ్రమ తప్పదు కదా!
గడ్డపార మింగితే ఆకలి తీరుతుందా?
మొదటి చరణం:
చించుక= గాలిని చించుకుంటూ, రివ్వున ఎగురు; మిన్నులఁ = ఆకాశంలో; బారేచిలకలను = వెళ్ళు చిలకలను; బండిఁ గట్టి బండి లాగా కట్టి; వంచుకొనేమన్న = దారికి తెచ్చుకొందామంటే; నవి వసమయ్యీనా = అవి వశమౌతాయా; యెంచరాని = ఊహించలేని; యింద్రియము లెవ్వరికి నేల చిక్కు =ఇంద్రియాలు ఎవరికైనా ఎలా చిక్కుతాయి? (చిక్కవు).; పొంచి పొంచి = చూసి చూసి; వలపులు = కోరికల్లో; బొండఁ =తప్పుచేసిన వారి కాలు సేతులకు తగిలించు కొయ్య. ద్రుపదము. (బొండ కొయ్య) బొండఁబెట్టుఁ గాక = కాళ్ళు చేతులు ఆడకుండా చేయు.
భావము:
గాలిని
చించుకుంటూ, రివ్వున ఎగురు ఆకాశంలో వెళ్ళు చిలకలను బండి లాగా
కట్టి బండి లాగా కట్టి దారికి తెచ్చుకొందామంటే
అవి వశమౌతాయా? (కావు). ఊహించలేని ఇంద్రియాలు
ఎవరికైనా ఎలా చిక్కుతాయి? (చిక్కవు). చూసి
చూసి కోరికల్లో ముంచి కాళ్ళు చేతులు ఆడకుండా చేయు గాక.
వ్యాఖ్యానము:
రిత్త
ప్రతిమ:
ఇంద్రియ
తృష్ణ
మూల
సందేశం:
రెండవ చరణం:
మంటమండే
= మంటలుమండే; యగ్గి =అగ్ని; దెచ్చి = తీసుకొచ్చి;
మసిపాఁత మూఁట గట్టి = పాత గుడ్డలలో మూటగట్టి; యింటిలోన
దాఁచుకొన్న = ఇంటిలోపల దాచుకొన్న; నితవయ్యీనా = హితవయ్యీనా =
మంచిదౌతుందా?; దంట = యుక్తి,తో చాతుర్యంతో;
మమకార మిట్టే = మమకారము ఇట్టే; తన్నునేల సాగనిచ్చు
= అనుకున్నట్లు సాగనిస్తుందా? (సాగనివ్వదు). బంటుఁ జేసి= దాని
బంటుగా చేసుకొని; ఆసలనే = ఆశలనే; పారఁదోసుఁ గాక = మనమీదకు తోస్తుంది గాని.
భావము:
మంటలుమండే అగ్ని తీసుకొచ్చి పాత గుడ్డలలో మూటగట్టి పాత గుడ్డలలో మూటగట్టి ఇంటిలోపల దాచుకొన్న మంచిదౌతుందా? (కాదే!). యుక్తి,తో చాతుర్యంతో మమకారము ఇట్టే వశములో వుంచుకుంటానంటే అనుకున్నట్లు సాగనిస్తుందా? (సాగనివ్వదు). అది దాని బంటుగా చేసుకొని ఆశలనే మనమీదకు తోస్తుంది గాని.
వ్యాఖ్యానం:వ్యాఖ్యానం:
హితవయ్యీనా
తన్నునేల
సాగనిచ్చు
సారాంశం:
పల్లవితో ప్రబలమైన అనుబంధం
మూడవ చరణం:
పట్టరాని విషముల = అదుపులోపెట్టలేని విషములుగల; పాముఁ దెచ్చి = పామును తెచ్చి; తలకిందఁ = తలకింద (దిండులా); బెట్టుకొన్నా = పెట్టుకొన్నా అది; మందపిలి వుండీనా = ముద్దలా పడి వుంటుందా? (ఉండదు); వెట్ట =వెచ్చని; వెట్ట సంసార మిది = నులివెచ్చని అనుభూతి కలిగించే సంసార మిది; వేంకటేశుఁ గొలువని = శ్రీవేంకటేశుని కొలువని; వట్టిమనుజుల = అప్రయోజకులు, నిరర్థకులు, నిస్సారులు అగు మనుషుల; పెడవాడఁ బెట్టుఁ = బహిష్కరించు;
భావము:
అదుపులోపెట్టలేని
విషములుగల పామును తెచ్చి తలకింద (దిండులా) పెట్టుకొన్నా అది ముద్దలా పడి వుంటుందా? (ఉండదు). శ్రీవేంకటేశుని కొలువని అప్రయోజకులు, నిరర్థకులు,
నిస్సారులు అగు మనుషులను బహిష్కరించునే కానీ ఆదరించడు.
వ్యాఖ్యానము:
X-X-The
End-X-X
Supplementary
పల్లవిపై మరిన్ని విశేషాలు
పల్లవిలో దాగిన లోతైన పరామర్శ
సత్యం ఏకం
జిడ్డు కృష్ణమూర్తి టిప్పని:
భగవద్గీత వాక్య విశ్లేషణ:
గడ్డపార మింగితే ఆకలి దీరేనా... అంటున్నారు
ReplyDeleteఅన్నమయ్య. కార్య కారణ శృంఖల ఇది. ఆకలి
తీరాలంటే అన్నం, దానికి ధాన్యం, దానికి వరి మడి,
దానికి నాగలీ గడ్డపార! మూలకారణాన్ని గుర్తించిన
మాత్రాన ఈ దేహి ఆకలి తీరునా?
చంచలాత్మకమైన మనసును ఆడించే ఇంద్రియాలను
వశపరచుకోవటం సులభమా? చిలుకలు ఆకసంలో
స్వేచ్ఛగా ఎగురుతాయని వాటికి కళ్లెం తగిలించి
మనోరధానికి తాళ్లు బిగించి ఈ కర్మలంపటాన్ని వదలించుకొని
ఎగుర గలమా?
తీరని కోరికలు వలె అగ్ని కలుస్తుంది. కర్మఫల శేషమనే అగ్నిని ని
సడలిన నమ్మకాలతో, తెగిన బంధాలతో బిగించిన ఈ
ఎముకల పోగును కప్పిన పాతగుడ్డలమమూటలో
దాచి ఉంచగలమా?
కాలమూ కర్మా, దిండు కింద నాగుపాము వంటివి.
సమయానికి కాటెయ్యక మానవు. మరి కర్తవ్యం?
ఆ వెంకటేశుడొక్కడే శరణ్యం!
డా. పుచ్చా వెంకట రమణ
Reminds me of Heisenberg's indeterminacy principle,
ReplyDeleteచాలా బావుంది!
ReplyDeleteగడ్డపారను మ్రింగితే ఆకలి తీరదు.అది ఒక ఉపకరణం మాత్రమే. ఆకలి తీరాలంటే అన్నం అవసరం. దానికి క్షేత్రం, బీజం, నీరు, మనిషి ప్రయత్నం అత్యంత ఆవశ్యకములు. జీవిత పరమావధి యైన మోక్షప్రాప్తి మానుషజన్మతోనే సాధ్యం. కాని మనిషిగా పుట్టినంత మాత్రాన మోక్షం రాదు. మోక్షసాధనకు మానవప్రయత్నం అంటే భక్తిజ్ఞానవైరాగ్యములు, ముముక్షత్వం మూల సాధనాలు. సాధన చతుష్టయము తోనే పరమపదము సాధ్యమని అన్నమయ్య పల్లవిలో భావించియుంటారు.
ReplyDeleteమోక్షసాధనలో ముఖ్యం - ఇంద్రియనిగ్రహం. కర్మజ్ఞానేంద్రియములను అదుపులో ఉంచుకొని, మమకారమోహములను అధిగమించి, చిత్తస్థైర్యమును ప్రయత్నపూర్వకముగా సాధనచతుష్టయముతో సాధించాలి.
విషయములనే మండే అగ్నిని, విషపునాగును శరీరంలోనికి అనుమతిస్తే అవి ఊరుకొంటాయా?
ఇంద్రియములు కలిగించే అనిత్యమైన సుఖభోగములను ఆస్వాదిస్తూ ఉంటే నిత్యమైన జ్ఞానమార్గము, మోక్షపథము మూసికొని యుండక తెరచియుంటాయా?
అన్నమయ్య రచించిన అద్భుతమైన
ఆధ్యాత్మికకీర్తనల్లో ఒక ఆణిముత్యమీ
కీర్తన.
ఓమ్ తత్ సత్ 🙏🏻
కృష్ణమోహన్ పసుమర్తి