Wednesday, 3 December 2025

T-287 ధర నీవే తల్లియును దండ్రియువై యుండఁగాను

 తాళ్లపాక అన్నమాచార్యులు

287 ధర నీవే తల్లియును దండ్రియువై యుండఁగాను

For English version press here 

నేను అను శిల్ప నిర్మాణ పునాదులు

 

ఉపోద్ఘాతము

అన్నమాచార్యుల వారు అపూర్వమైన స్థితిలో
 తమలోని అణువు అణువుల స్పందన
ఆయా భాగములు తాకు ప్రకృతితో ఐక్యమై నిలవగా
 వ్యక్తం చేయుటకు అసాధ్యమైన విషయములను,
లోక కల్యాణార్థము వెలిబుచ్చారు. 

ఇది భక్తి గీతం కాదు,
జాగృతి గీతం కానే కాదు,
ఉద్వేగ  గీతం మరీ కాదు.
జీవమునకు సత్యమునకు మధ్యనున్న
అదృశ్య సంబంధాన్ని ప్రత్యక్షం చేస్తున్న అలౌకిక వ్యక్తీకరణ.

 

అన్నమాచార్యుల ప్రతి కీర్తన
మనలో మొలకెత్తుటకు ఉంచిన జ్ఞానబీజం.
అన్నమాచార్యులు నిక్షిప్తం చేసిన భావాన్ని
విప్పగానే సృష్టిలోని అసాధారణ సమన్వయం
మన కళ్ల ముందే వెలుగులోకి వస్తుంది.


ధర నీవే తల్లియును దండ్రియువై యుండఁగాను”
అను ఈ కీర్తనలో,
మనిషి–ప్రకృతి–దైవం మధ్యనున్న
అవినాభావ సంబంధాన్ని ఆయన శాస్త్రీయ స్పష్టతతో చూపిస్తున్నారు.
ఈ గీతంలోని వ్యక్తిగత–సామాజిక విజ్ఞానం
ఇప్పటి ప్రపంచ సమస్యలన్నింటికీ అద్దంలా నిలుస్తుంది.

దేవుడే తల్లి, తండ్రి, సంరక్షకుడు అయినప్పుడు
ఆ సత్యమును అంతరాంతరములలో యదార్థముగా అంగీకరింపలేక
మానవుడు దైవము  స్థానంలోకి దూరి,
తానే ప్రపంచాన్ని మార్చాలి అనుకుంటూ
సమాజం, దేశం, ప్రపంచం సంస్కరణలో తలదూరుస్తాడు.

మానవుడు తన వారి చరిత్ర తెలుసుకొని,
వ్రాసుకొని పదేపదే చదివి
అనుసరణీయమైన మార్గం ఎర్పరచుకోజూస్తాడు.
ధనవంతులు, ఉన్నత వర్గాల విజయగాథలను
జీవిత పాఠాలుగా తనకు బోధించుకుంటాడు.
 
అలాగే, ఒకదానితో ఒకటి ఆలోచనతో కలుపుకునే
మనుష్యుల సామర్థ్యం వలన
మానవుడు వస్తు, ఆరోగ్య, ఆర్థిక, సుఖ​ పరమైన
వృద్ధిని సాధించ గలడు అన్నారు.
కానీ ఇవన్నీ పగటిపూట కొవ్వొత్తి వెలిగించడం లాంటివి

 

మన అతి ఉత్సాహం, అతి జోక్యం—
ప్రకృతి సమతౌల్యాన్ని విచ్ఛిన్నం చేసి—
ఎన్నో సమస్యలను సృష్టిస్తుందని చెబుతారు.
ఈ సృష్టితో మన మౌలిక సంబంధం తెగిపోవడం వల్లే
మనిషి పేలవమైన జీవితం గడుపుతున్నాడు అన్నారు.
కావున, తన సమయాన్ని ఈ వ్యర్థ కార్యక్రమాలలో వెచ్చించకుండా,
ధైర్యంగా శ్రీ వేంకటేశ్వరుని దయకు పాత్రుడై
శాశ్వత సంతోషాన్ని పొందాలని అన్నమాచార్యులు సూచిస్తారు.

కీర్తన సంక్షిప్త చిత్రం 

పల్లవి:
దైవీక భద్రత నిలిచియే ఉంది; పనిలేని మానవ జోక్యం ఏలయో?

చరణం 1:
అసురక్షిత భావంతో మనిషి తన గతాన్ని తిరిగి రాస్తాడు.

చరణం 2:
శక్తివంతులు, ధనవంతుల అనుకరణలో సత్యం మరుగున పడుతుంది.

చరణం 3:
బుద్ధిచాతుర్యపు కలయికలు శక్తిని ఇవ్వొచ్చు—

కానీ అంతరంగపు వెలుగు ముందు మసకబారిపోతాయి. 

అధ్యాత్మ​ కీర్తన
రేకు: 240-1 సంపుటము: 3-227
ధర నీవే తల్లియును దండ్రియువై యుండఁగాను
యిరవుగ నెవ్వరూ వహించుకోనేమిటికి ॥పల్లవి॥

పుట్టిన జీవులు తొల్లి భువిపై ననేకులు
అట్టె వారి చరితలు ననేకములు
వట్టిజాలిఁ దమతమవారలంటాఁ దలఁచుక
బట్టబయలే నానాభావాలఁ బొందుదురు           ॥ధర॥

సరవి నందరుఁ జేసే సంసారములు పెక్కు
సిరులవారి గుణాలు చేష్టలు పెక్కు
అరసి తమవారితో నవి యెల్లాఁ జెప్పుకొంటా
దరినుండే వగరించి తమకింపుచుందురు         ॥ధర॥

వడినెన్నైవాఁ గలవు వావు లెంచి చూచుకొంటే
గడియించే పదార్థాలు కలవెన్నైనా
యెడయక శ్రీవేంకటేశ నీదయ గలిగితే
జడియక నీదాసులు సంతసమందుదురు        ॥ధర॥
Details and Explanations:
పల్లవి
ధర నీవే తల్లియును దండ్రియువై యుండఁగాను
యిరవుగ నెవ్వరూ వహించుకోనేమిటికి ॥పల్లవి॥ 
              Telugu Phrase
Meaning
ధర నీవే తల్లియును దండ్రియువై యుండఁగాను

దైవమా నీవు ఈ విశ్వానికే తల్లియును దండ్రియువై యుండఁగాను

యిరవుగ నెవ్వరూ వహించుకోనేమిటికి
మరి మేము ఆ స్థానాన్ని ఎందుకు వహించుకోవాలి? అవసరమేమి?

భావము: అనంతకాలంగా నడిచిన దైవ క్రమముండగా — మనుజుల జోక్యమేలా?" 

అన్వయార్థము: మానవుడు తన కల్పిత అవసరాల కోసం సృష్టిలోని సమత్వాన్ని అంచులకు నెట్టేస్తున్నాడు.


గూఢార్థవివరణము: 
ఈ కీర్తనలో అన్నమాచార్యులు అత్యంత మౌలికమైన సత్యాన్ని స్మరింపజేస్తారు—
ఈ పరస్పర అనుసంధానిత ప్రపంచాన్ని
ఒక సున్నితమైన సమతుల్యత కాపాడుతూవుంది.
జీవజాతులన్నీ, చిన్నవి పెద్దవి, కనపడేవి కానివి—
అవి అన్నీ ఆ (దైవ) సంరక్షణలోనే నిరంతరం పోషింపబడి జీవిస్తున్నాయి. 

అన్నమాచార్యుల దృష్టిలో,
ఈ సృష్టిలో ఏ జీవి పార్థివమైనదీ, నిర్లక్ష్యమైనదీ, తల్లిదండ్రుల్లేనిదీ కాదు.
ప్రతి జీవి ఆ సమతుల్యతలో నిలిచి మనుగడ సాగిస్తుంది.
మానవుడు ఈ సహజ సమత్వమును అర్థం చేసుకోకముందే చొరవ చూపుతాడు.
మునుపెరుగని సమస్యలు తెచ్చిపెట్టుకుంటాడు.
వానికి తన ప్రయోజనాలే, ప్రాధాన్యాలే, ఆశలే ప్రమాణం.
తక్కినవి అడ్డుతెరలు.


ఆ చర్యల రూపాలు ఎంత విస్తరించాయో ఆలోచించండి—
బాక్టీరియా స్థాయిలో జోక్యం,
పంటల జన్యు స్థాయిలో మార్పులు,
రసాయనాలు, రేడియో ధార్మికతతో అసహజ ఆకాంక్షలతో 
ప్రకృతిపై మన సంపూర్ణ ఆధిపత్యానికి ప్రయత్నాలు,
ప్రకృతికి అవసరమైన దానికంటే
మనకు కావలసినదాన్ని ముందుంచడం—
తన అసమాన ప్రజ్ఞతో, తాను ఇతరజీవులకంటే ఎక్కువ అని బలముగా నమ్మి
తక్కిన జీవులను ఎక్కడాలేని ఉదారతతో బ్రతుకనిస్తాడు.
ఇవన్నీ ఒకే మూలభ్రాంతి నుంచి పుట్టినవి. 

సృష్టి ఇప్పటికే స్వయం చాలితమై అవ్యక్త సూత్రముపై నడుచుచున్నది.
మనుష్యుడి అజ్ఞానపూరిత ఆకాంక్షలు చర్యలు సమస్యలను జటిలం చేస్తున్నాయి.
అందుకే అన్నమాచార్యులు చెప్పే మాట అసలైన హెచ్చరిక:
“దేవుడు తల్లి–తండ్రి అనే నమ్మకముంటే,
మనిషి ఎందుకు ఆ స్థానంలోకి దూరి కల్పించుకుంటాడు?
తన అర్థంపర్థం లేని సంస్కరణలతో
ప్రపంచాన్ని మార్చాలని తాపత్రయపడుతున్నాడు?” 

ఈ పల్లవే మొత్తం కీర్తనకు ప్రాతిపదిక:
దైవసంరక్షణలో ఉన్న ప్రపంచాన్ని
మనిషి తన చేతులతో 'సరిచేయడం' అనేది
అహంకారంతో కలసిన అజ్ఞానం.

మొదటి చరణం:

 

పుట్టిన జీవులు తొల్లి భువిపై ననేకులు
అట్టె వారి చరితలు ననేకములు
వట్టిజాలిఁ దమతమవారలంటాఁ దలఁచుక
బట్టబయలే నానాభావాలఁ బొందుదురు          ॥ధర॥ 
Telugu Phrase
Meaning
పుట్టిన జీవులు తొల్లి భువిపై ననేకులు
చిరకాలముగా జీవులు భూమిపై పుంఖానుపుంఖముగా పుడుతూనే  వున్నారు.
అట్టె వారి చరితలు ననేకములు
అలాగే వారి చరితలు అనేకములు
వట్టిజాలిఁ దమతమవారలంటాఁ దలఁచుక
(వట్టి = శూన్యము; వట్టిజాలిఁ = లేని జాలిని పొందు) వారందరూ తమ తమ వారలనుకొని  లేని జాలిని
బట్టబయలే నానాభావాలఁ బొందుదురు
మిక్కిలిగా బాహటముగా అనేకానేక భావములను మానవులు పొందుదురు.

భావము:

(అన్నమాచార్యులు ఇక్కడ అయా అనుచిత స్వేచ్ఛలతో కలుగు మనో వికారములను తెలుపుతున్నారు). చిరకాలముగా జీవులు భూమిపై పుంఖానుపుంఖముగా పుడుతూనే  వున్నారు. అలాగే వారి చరితలు అనేకములు. అయా జాతులవారు, అయా ప్రాంతముల వారు, అయా దేశములవారు తమ తోటి వారిని తగిన అధారము లేకున్నను తమ వారలనుకొని  లేని జాలిని మిక్కిలిగా బాహటముగా ప్రదర్శించి అనేకానేక భావములను మానవులు పొందుదురు.


గూఢార్థవివరణము:

 

పుట్టిన జీవులు తొల్లి భువిపై ననేకులు
ఈ భూమిపై పుట్టే జీవులు అనేకం.
మనిషి మాత్రమే కాక, ప్రతి పురుగు, చెట్టు, పక్షి, జంతువు—
అన్నీ ఒకే సహజ న్యాయానికి లోబడిన జీవరూపాలు.
అన్నమాచార్యులు ఇక్కడ మనల్ని ఒక విస్తృత దృష్టిలోకి తీసుకెళ్తారు.
సృష్టి ఒకటే గర్భం; జీవులన్నీ దాని విభిన్న ప్రతిఫలాలు.

అందుకే అన్నమాచార్యులు క్రింది విధంగా ఊరకనే అనలేదు.
కందువగు హీనాధికములిందు లేవు
అందరికి శ్రీహరే అంతరాత్మ
ఇందులో జంతుకుల మింతా నొకటే
అందరికి శ్రీహరే అంతరాత్మ      తంద

అట్టె వారి చరితలు ననేకములు
మానవునికి ఈ ప్రపంచంలో గల ఒకేవొక్క సంబంధము దైవము.
దానిని గ్రహించుటకు బదులు వేరేమి చేపట్టినా
ఆయా విషయములతో తార్కికముగా సంబంధము ఏర్పరచుకోగలడు.
ఎదుట కనబడుతున్న తలిదండ్రులను, వారి వారి వారిని కాదనలేని దుఃఖస్థితిలో ​
తనకు గల ఒకేవొక్క దైవ సంబంధము తెంపుకొని
తనవారనుకొన్న వారి చరిత్రము చదువబోతాడు.

వట్టిజాలిఁ ద మతమవారలంటాఁ దలఁచుక
(వట్టి = శూన్యము; వట్టిజాలిఁ = లేని జాలిని పొందు)
"వట్టిజాలిఁ" ఇది కేంద్ర బిందువు.
ఆ జాలి సృష్టించు తాను ఏకాకిఅను వేదనలో
“ఇదే నిజం, ఇదే మార్గం, ఇదే ధర్మం” అని
సిద్ధాంతాలు, మతాలు, అభిప్రాయాలు నిర్మించుకుంటాడు.
ఈ “జాలి”—జాలం—మనస్సు వేసుకున్న మానసిక బంధనం.
కాలం, సంస్కృతి, గుంపుల ఆలోచన—
మనిషి తన అభిప్రాయాలను సత్యంగా భావించి
భావాల వెనుక ఉన్న విశాల జీవవాస్తవాన్ని చూడలేకపోతాడు.

బట్టబయలే నానాభావాలఁ బొందుదురు
ఒక్కసారి దారి తప్పాక ఇక చెప్పేదేముంది?
ఈ రోజున చూచుచున్న విధ్వంసం, మారణ కాండలు, రుధిర యజ్ఞములు
—అవి మన అజ్ఞాన నిర్మాణాలు.
అన్నమాచార్యులు చెప్పేది:
జీవితం ఒక విస్తారమైన ప్రవాహం
మన భావాలు మాత్రం ఆ ప్రవాహానికి అడ్డుగోడలు మాత్రమే.
కాలం రాగానే అవి ధ్వంసమై, నిజ స్వరూపం మళ్లీ దర్శనమిస్తుంది.

అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత ।
అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా2-28 ॥.

భావసారము

మానవుని అధోగతికి దైవము కాదు కారణం.
తానే నిర్మించుకొన్న ఊహల కోటల ప్రాంగణం.
కోటలు బద్దలు కాకుండా ప్రజాస్వామ్యం రాలేదు
ఊహల కోటలు పగలక స్వతంత్రము లేదు.


అన్నమాచార్యుల భావము
బుద్ధుని ప్రతీత్య సముత్పాదనం
తులనాత్మక పట్టిక
అన్నమాచార్యులు దైవ క్రమాన్ని కేంద్రంగా ఉంచారు
బుద్ధుడు కారణ క్రమాన్ని కేంద్రంగా ఉంచాడు
కానీ ఇద్దరూ చేరుకున్న బోధ మాత్రం ఒకటే:
మనిషి అహంకారమే / అవిజ్జయే ప్రపంచాన్ని గజిబిజి చేస్తోంది
అంశం
అన్నమాచార్యుల భావము
బుద్ధుని ప్రతీత్య సముత్పాదనం
సాధారణ నిర్ధారణ
మూల క్రమము
ధర నీవే తల్లియును దండ్రియువై యుండఁగాను
దైవ క్రమము నిశ్శబ్దముగా సృష్టిని నడిపిస్తుంది; ఒక్క జీవి కూడా ఒంటరి కాదు.
ధమ్మ నియమము / సహజ కారణ క్రమము అన్నిటిని నడిపిస్తుంది; ఏదీ స్వతంత్రంగా ఉత్పన్నం కాదు.
ప్రపంచం పరస్పర ఆధారితమై స్వయంగా నడుస్తుంది.
తప్పిదాలకు మూలం
యిరవుగ నెవ్వరూ వహించుకోనేమిటికి
అహంకారం వల్ల మనిషి దైవ స్థానంలో తాను నిలబడి జోక్యం చేస్తాడు.
అవిజ్జ
(అజ్ఞానం) వల్ల “నిజం” తప్పుగా గ్రహించి తప్పుడు నిర్మాణాలు చేస్తాడు.
అజ్ఞానం / అహంకారమే కల్లోలానికి మూలం.
మోసం స్వభావం
వట్టిజాలిఁ దమతమవారలంటాఁ దలఁచుక”—తాను ఒంటరివాడిననే వేదననుంచి కుటుంబ, వర్గ, గోత్ర, ప్రాంత​, దేశముల వంటి గుర్తింపులను సృష్టించి వాటిలో తలదాచుకుంటాడు.
నేనే, నాదే, మా వారు” అనే బంధాలు తణ్హా (తపన), ఉపాదాన (పట్టుదల) వల్ల ఏర్పడతాయి.
గుర్తింపులు మనస్సు కట్టిన కల్పనలు మాత్రమే.
భావాల విస్తరణ
బట్టబయలే నానాభావాలఁ బొందుదురు
ఇవే తరువాత కథలు, గుంపులు, విరోధాలు అవుతాయి.

కారణ-ఫల శ్రేణులు అసంఖ్యాకమైన మానసిక జన్మలను సృష్టిస్తాయి.

దోష గ్రహణం సంక్లిష్ట మానసిక నిర్మాణాలు.

సామాజిక ప్రభావం

ఈ భావాలు చివరకు హింస, విభేదాలు, కల్లోలంగా పెరుగుతాయి.
కారణత వల్లే దుఃఖం (దుక్కం) పెరుగుతుంది; వ్యక్తి–సమాజం రెండూ నష్టపడతాయి.
మానసిక మాయ సామాజిక బాధ.
దైవ స్థానం / సహజ స్థానం
సృష్టిని కాపాడేది దైవమే; మనిషి జోక్యం అవసరమేలేదు.
సృష్టికి కర్త లేడు; ధమ్మ స్వయంగా న్యాయం.
సృష్టిని నడిపించేది మనిషి కాదు — లోతైన క్రమమే.
విముక్తి మార్గం
అహంకారం విడిచి దైవ క్రమాన్ని గుర్తించడం.
అవిజ్జ అంతం చేసి, అనిత్యత–పరిశీలనతో తపన విడువుము.
మొదటి అడుగు: మనశ్శాంతియే శరణము
అంతిమ బోధ
దైవ సంరక్షణలో ఉన్న ప్రపంచాన్ని మనిషి సరిచేయాలనుకోవడం అహంకారం.”
ప్రపంచం కారణతతో నడుస్తుంది; దానిని అర్థంలేని జోక్యంతో మార్చాలనుకోవడం అవిజ్జ”
అహంకారం / అవిజ్జా ఒకటే — కల్లోలానికి మూలం

 


రెండవ​ చరణం: 
సరవి నందరుఁ జేసే సంసారములు పెక్కు
సిరులవారి గుణాలు చేష్టలు పెక్కు
అరసి తమవారితో నవి యెల్లాఁ జెప్పుకొంటా
దరినుండే వగరించి తమకింపుచుందురు          ॥ధర॥ 
Telugu Phrase
Meaning
సరవి నందరుఁ జేసే సంసారములు పెక్కు
వరుసన (చూచితే) అందరు చేయు సంసారములు చాల గలవు.
సిరులవారి గుణాలు చేష్టలు పెక్కు
ధనవంతుల గుణాలు, వ్యవహారములు పెక్కు
అరసి తమవారితో నవి యెల్లాఁ జెప్పుకొంటా
జాగ్రత్తగా వానిని చూచి తమ వారితో అవి చెప్పుకొనుచూ
దరినుండే వగరించి తమకింపుచుందురు
దగ్గర నుండి  పట్టుదలతో తెలిసి మోహములో పడుదురు.

సూటి భావము:

అన్నమాచార్యులు గాడితప్పిన మనసు పోకడలను వివరించుచున్నారు. (క్రమముగా చూచితే) మానవులు అనేక తలములలో ఒకే సమయములో జీవించుదురు. ధనవంతుల గుణాలు, వ్యవహారములు పెక్కులు జాగ్రత్తగా గమనించి, తమ వారితో చెప్పుకొనుచు, మరింత దగ్గరకు జరిగి, పట్టుదలతో తెలిసి మోహములో పడుదురు.


గూఢార్థవివరణము: 

సరవి నందరుఁ జేసే సంసారములు పెక్కు
(సమన్వయమున చూచితే)
మానవులు అనేక తలములలో ఒకే సమయములో జీవించుదురు.
ముందరి చరణములో చెప్పిన రీతిగా
"బట్టబయలే నానాభావాలఁ బొందుదురు" అర్ధమిదే.
మన అంతరంగము అనేక విధములుగా చీలియున్నది.
అందుకే మనకు ఏకాగ్రత నిలువదు.

జిడ్డు కృష్ణమూర్తి తరచూ “విభజన” గురించి మాట్లాడేవారు.
ఆయన దృష్టిలో, ఈ విభజన —
మనస్సు సృష్టించే భావాలు,
సేకరించుకున్న జ్ఞానపు భారాలు,
మరియు అంతర్లీన భయం కలసి
ఉత్పత్తి చేసే అంతర్గత–బాహ్య అసంబద్ధత.


 అరసి తమవారితో నవి యెల్లాఁ జెప్పుకొంటా
దరినుండే వగరించి తమకింపుచుందురు

జాగ్రత్తగా ధనవంతులను చూచి
తమ వారితో అవి చెప్పుకొని పదేపదే మననము చేయుదురు.
వారిని దగ్గర నుండి చూచి అనుకరించి
చెప్పలేని ఆనందము పొందుదురు.
ఇదే కదా మన వ్యాపకము.


మూడవ​ ​ చరణం:
వడినెన్నైవాఁ గలవు వావు లెంచి చూచుకొంటే
గడియించే పదార్థాలు కలవెన్నైనా
యెడయక శ్రీవేంకటేశ నీదయ గలిగితే
జడియక నీదాసులు సంతసమందుదురు॥ధర॥
Telugu Phrase
Meaning
వడినెన్నైవాఁ గలవు వావు లెంచి చూచుకొంటే
ఒకదానికి మరొకదానితో గల సంబంధము జాగ్రత్తగా బేరీజు వెసుకుంటే త్వరగా  సాధించుటకు ఎన్నో గలవు
గడియించే పదార్థాలు కలవెన్నైనా
ఆర్జించుటకు ఎంతో వస్తు సంపద కలదు
యెడయక శ్రీవేంకటేశ నీదయ గలిగితే
(దైవ క్రమమును)  వదలక శ్రీవేంకటేశ  నీదయ గలిగితే
జడియక నీదాసులు సంతసమందుదురు
భయమందని నీ దాసులు ఎంతో సంతోషించుదురు.

 సూటి భావము:

(అన్నమాచార్యులు చివరి చరణంలో మానవులు మనమున్న విధముగా వర్తించుటకు కారణామును తెలిపి, అవి అన్నీ భోగలాలసత లోనివని త్రోసిపుచ్చుచున్నారు.)

ఒకదానికి మరొకదానితో గల సంబంధము జాగ్రత్తగా బేరీజు వేసుకుంటే వస్తుసంపదను అర్జించుకొనుటకు ఎన్నో మార్గాలు కలవు. (దైవ క్రమమును)  వదలక శ్రీవేంకటేశ  నీ దయ గలిగితే  భయమందని నీ దాసులు ఎంతో సంతోషించుదురు.


గూఢార్థవివరణము: 
వడినెన్నైవాఁ గలవు వావు లెంచి చూచుకొంటే
గడియించే పదార్థాలు కలవెన్నైనా

ఆలోచనలతో ఒక దానితో ఒకటికి గల సంబంధమును గమనించి,
సరిచూసుకొనిన వస్తు సంపదలను త్వరగా సంపాదించ వచ్చుననిరి.
 అన్నమాచార్యుల ఈ పరిశీలన అత్యంత నిశితము,
ఈ ద్రవ్య ప్రపంచం పనిచేసే అంతర్గత అమరికను ఆయన చక్కగా తెలియపరిచారు.
(అయితే ఇవన్నీ భోగాసక్తతలోనివని వారి అభిప్రాయము.)

జడియక = భయపడక. దేనికి భయపడతాం?
అన్నమాచార్యులు చెబుతున్నది
"ఈ విషయములను అనుభవిస్తున్న నేను అనుదానిలో
సమూల మార్పులకు భయపడకుండా" అని అర్థం.
నేను అన్నది ఒక వస్తువు కాదు.
పైన పేర్కొన్న విధంగా పుట్టిన నాటి నుండి
లోపలికంటా పాతుకుపోయిన
ఒకదానితో ఒక భావములను పేర్చిజోడించుతూ,
ఇంద్రియ స్పందనలతో అనుసంధానం చేయబడి,
మనకై మనము ఏర్పాటు చేసుకున్న
సమగ్ర పదార్థ, ఇంద్రియ, స్పర్శ, భావ సమ్మేళనం. 

దీన్ని కోల్పోవడం అంటే ‘మనసు’ కుప్పలాగ కూలిపోవడం.
ఆ తనకై ఏర్పాటు చేసుకున్న గుర్తింపు కోల్పోవడం,
ఆ తరువాత ఏమి జరుగునది తెలియకపోవడం
అత్యంత కీలకమైన రూపాంతరం.
దీనికి సిద్ధం కావడమే "జడియక" అర్థం.

 

ఈ చరణంలో అన్నమాచార్యులు వ్యాఖ్యానాన్ని
మరింత తీవ్రమైన లోతుల్లోకి తీసుకు వెళుతున్నారు.
ప్రపంచం అవ్యక్త  కోమలమైన సమత్వముపై నిలిచివుంది.
దానిని ఆటంకపరచుచున్నది మానవుని లోపలి "వట్టిజాలిఁ"
అదియే మన లోపలి దుఃఖమునకు కారణం.
ఈ వట్టిజాలే ‘నేను’ అనే గట్టిపట్టు అయ్యింది.
"నేను" ఏర్పడిన విధము పైచరణములలో చెప్పబడినది.
ఇది తెలిసిన దానిని వదలి తెలియని దాన్ని స్వీకరించు ముళ్ళ దారి.
"నేను" అన్నదానిని వీడుట మరణ సదృశం.
దానికై సిద్ధపడేవారే  శ్రీవేంకటేశు దాసులు ​

ఈ కీర్తన ముఖ్య సందేశం 

నిరాధారమైన "వట్టిజాలి" మానవులను
ప్రపంచములోని మృదువైన తుల్యతనుండి మరల్చుచున్నది.
ఆ ఆధారములేని జాలి యొక్క రూపురేఖలను తెలియుటయే
దుఃఖనివారణకు మార్గము

X-X-The END-X-X

No comments:

Post a Comment

287 dhara nīvē talliyunu daṃḍriyuvai yuṃḍaṃ̐gānu (ధర నీవే తల్లియును దండ్రియువై యుండఁగాను)

  TALLAPAKA ANNAMACHARYULU 287 ధర నీవే తల్లియును దండ్రియువై యుండఁగాను (dhara n ī v ē talliyunu da ṃḍ riyuvai yu ṃḍ a ṃ̐ g ā nu) for Teleg...