Thursday, 9 October 2025

T-269 పనిగొన నేర్చువారి భాగ్యముకొలఁది యిది

 తాళ్ళపాక పెదతిరుమలాచార్యులు

269 పనిగొన నేర్చువారి భాగ్యముకొలఁది యిది 

For English version press here 

ఉపోద్ఘాతము 

ఇది పెదతిరుమలాచార్యుల వారి మార్కు కీర్తన.
“తండ్రిని మించిన తనయుడు” అనటానికి తగ్గ​ ఉదాహరణ.
తాత్త్విక గాంభీర్యమును
అంత సులభముగా, అంత సజీవముగా చెప్పగలగడం —
ఇంతకు మించి సాధ్యమే కాదు.
 
ఇందులో వారు మనకు చూపిస్తున్నది ఒక అద్భుతమైన సత్యం:
దైవాన్ని చేరటానికి దూర ప్రయాణాలు అవసరం లేదు.
నోరు, మనసు, దేహం, చెవులు, ముక్కు, కన్నులు —
ఇవే మనకు దైవాన్వేషణకు ద్వారాలు.
కానీ విచిత్రం ఏమిటంటే —
మనిషి దిగజారేది కూడా వీటివల్లనే.
 
భగవంతుడు ఎక్కడో దూరములో లేడు;
అతను ఇక్కడే ఉన్నాడు —
మన శరీరంలో, మన ఊపిరిలో, మన చుట్టూ ఉన్న ప్రపంచంలోనే.
అయితే, ఇంత దగ్గరగా ఉన్న ఈ సత్యాన్ని 
ఎందుకు మనం చూడలేకపోతున్నాం?
అందుకు కారణం —
మనం సృష్టించుకున్న తీర్పులు, మనసు యొక్క కట్టుబాట్లు.

 

పెదతిరుమలాచార్యులు ఈ కీర్తనలో నింపాదిగా,
కాని అతి కఠినమైన సూత్రాన్ని తాకుతున్నారు —
 
పూవుల వాసనలకు పొంచి దుర్గంధములకు
చేవమీఱ నొక్కట నాసికమే గుఱి.”

 

ఓ పూల సువాసనను  ప్రేమిస్తాం, దుర్గంధాన్ని ద్వేషిస్తాం.
వాటిని స్పురింపజేయునది ముక్కు.
ఈ ప్రేమ–అసహ్యం అనే రెండు అంచులు,
ఒకే ప్రమాణానికి రెండు భిన్న దృవాలు మాత్రమే.

 

ఇక్కడ పెదతిరుమలాచార్యులు సూచించినది —
మన తీర్పు చేసే స్వభావమే మన బంధనం.
మనమంతా ‘జడ్జ్‌మెంట్’ అనే పరికరానికి బానిసలమయ్యాము.
మనమంతా న్యాయాధిపతులుగా వ్యవహరించ చూస్తాం.
“నాకు మంచి ఏంటో తెలుసు. చెడును వదిలిపెట్టగలను” అన్న ఆత్మస్థైర్యమే మనల్ని అడ్డుకుంటుంది.
 
అందుకే ఆయన సూచన —
తీర్పులేని దృష్టి కలిగి ఉండాలి.
అదే నిజమైన సేవ, అదే దైవానుభూతి.

 

అధ్యాత్మ​ కీర్తన
రేకు: 49-2 సంపుటము: 15-276
పనిగొన నేర్చువారి భాగ్యముకొలఁది యిది
తనకు నెదిరికి నీ దైవమే గుఱి     ॥పల్లవి॥
 
దిట్టుదిట్టేయందులకు దీవించేయందులకు
నట్టనడుమను వొక్కనాలికే గుఱి
అట్టే సంతోషమునకు నలిగివున్నందులకు
మట్టు మీఱియున్న తన మనసే గుఱి ॥పని॥
 
పాపకర్మమునకు బలుపుణ్యమునకును
దీపంచ రెంటికి నొక్క దేహమే గుఱి
వోపి కొండెము వినఁగ నొగి ధర్మము వినఁగ
యేపునఁ దమ వీనులు యివియే గుఱి ॥పని॥
 
పూవుల వాసనలకు పొంచి దుర్గంధములకు
చేవమీఱ నొక్కట నాసికమే గుఱి
శ్రీవేంకటేశు సేవించ జీవులను దర్శించ
కైవసమైయున్నతమ కన్నులే గుఱి ॥పని॥

Details and Explanations:

పల్లవి
పనిగొన నేర్చువారి భాగ్యముకొలఁది యిది
తనకు నెదిరికి నీ దైవమే గుఱి    ॥పల్లవి॥
పదబంధం
అర్ధం
పనిగొన నేర్చువారి భాగ్యముకొలఁది యిది
కర్మయోగా సారమును గ్రహించి, కర్తృత్వభావమును విడిచిన వారి నిజమైన భాగ్యము ఇది.
తనకు నెదిరికి నీ దైవమే గుఱి
తనకు తన ముందున్నవానికి  భగవంతుడే గుఱి అని తెలుసుకున్నపుడు.


 

సూటి భావము:

ఎలా పని చేయడమో నేర్చినవానికి తాను, ఎదుటివాడు అను బేధ భావము పూర్తిగా నశించును. ప్రపంచమే తన స్వరూపామై అద్దంలా ప్రతిబింబిమై కనబడుతుంది. ఆ ఏకదృష్టిలో స్థిరమైనవాడు స్వయంగా లోకరంజకమవుతాడు.


 వ్యాఖ్యాత్మక విశ్లేషణ: 

తనకు నెదిరికిఅన్న మాటలో ఒక సూక్ష్మమైన సత్యం దాగి ఉంది. ఇది (6.30) గీతా శ్లోకాన్ని గుర్తు చేస్తుంది —

యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి
తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి

భావము: ఎవరైతే నన్ను విశ్వమంతటా దర్శిస్తారో, నా యందే సమస్తమును దర్శిస్తారో, నేను వారికి దూరమవను, వారు నాకు దూరం కారు. 

ఇలాంటి దృష్టి కలవాడికి చేయదగిన పనేమీ మిగలదు. చేయునదంతా సర్వాంతర్యామి అని తెలిసి - ఎదుటివాడు  (= “ఇతరుడు”) అను భావమే వీగిపోతుంది.

అట్టివాడు ఇతరులలో చెడును చూసినా అది తనలోని తెలియని చీకటిగానే గుర్తిస్తాడు. మంచిని చూసినా అదే దైవస్పూర్తి అనుభవమని గ్రహిస్తాడు. అలా, తనలో అన్నీ, అన్నిటిలో తనను చూసిన వాడు, విభిన్నత యొక్క మాయను దాటిపోతాడు. అందరి బంధమూ భగవంతుని ద్వారా మాత్రమే అని తెలుసుకుంటాడు. ఈ రోజు మనము ఆనవాలు పట్టగల  సంబంధాలు మన మనసు అల్లుకున్న జాలము. మాయ​. (మరణానంతరము వాటి విలువ ఏమీ? అప్పుడు మిగిలినది కేవలము భావన మాత్రమే) కాబట్టి విరాజిల్లునది ఒక్కటే —సత్యం — అదే అఖండ చైతన్యం.


పల్లవి సారం — యథార్థ దర్శనము 

పనిగొన నేర్చువాడుఅనగా కర్తృత్వమును విడిచి కర్మయోగములో నిలిచిన వాడు. అతనికి కర్తా–కర్మ భావాలురెండూ కలసిపోతాయి. అదే అతని భాగ్యంసంపాదించేది కాదు, తనలోనే ఉన్న, నిద్రాణమైన దానిని ఆవిష్కరించుట​. సమస్త కార్యములకు వెన్నుదన్నుగా నిలిచేది కర్త కర్మ ఏకమైనా ఆ ప్రశాంతతలోనే.


తదుపరి చరణముల సంకేతం: ఈ కీర్తనలోని మిగిలిన చరణములు మనిషికి లభించిన పరికరములను — మనస్సు, దేహం, ఇంద్రియములు, ధర్మబుద్ధి — వివరించును. వీటిని సత్ప్రజ్ఞతో వాడితే విముక్తికి దారితీస్తాయి; అజ్ఞానముతో వాడితే బంధనమవుతాయి.


మొదటి చరణం:

దిట్టుదిట్టేయందులకు దీవించేయందులకు
నట్టనడుమను వొక్కనాలికే గుఱి
అట్టే సంతోషమునకు నలిగివున్నందులకు
మట్టు మీఱియున్న తన మనసే గుఱి ॥పని॥ 
పదబంధం
భావము
దిట్టుదిట్టేయందులకు దీవించేయందులకు నట్టనడుమను వొక్కనాలికే గుఱి
నిందించటం, దీవించటం — రెండూ ఒకే నోటి ద్వారా జరుగుతాయి. ఆ నోటి వెనుక ఉన్న మనోభావమే మాట యొక్క దిశను నిర్ణయిస్తుంది.
అట్టే సంతోషమునకు నలిగివున్నందులకు మట్టు మీఱియున్న తన మనసే గుఱి
సుఖదుఃఖాలకు లొంగకుండా సమబుద్ధితో నిలిచిన మనసే నిజమైన శ్రేయస్సు దిశ.

భావము:

తిట్లు తిట్టుట దీవించుట ఒకే నోటిద్వారా జరుగుతాయి. సంతోషమునకు కృంగి పోవుటకుఁ తన మనసే కారణం. ఈ మనసు తన హద్దులను మీరి ప్రవర్తించుటతో మానవుడు నిర్వ్యాపారముగా ధర్మమును నిర్ణయించబోతాడు.


గూఢార్థవివరణము:

మట్టు మీఱియున్న:

ఇక్కడ పెదతిరుమలాచార్యులు వారు ఒక అసాధారణ దృగ్విషయాన్ని బహిర్గతం చేస్తున్నారు మట్టు మీఱియున్న అన్న పదములతో మానవుల మనసు సమముగా లేక తన హద్దులను మీరి పొంగుచున్నది అని చెప్పవచ్చును. సమస్థితిలో లేని మనసు సత్యమును గ్రహించుటకు అనుకూలం కాదు. కాబట్టి మనం అనుభవించు సంతోషము మరియు నలిగి అణిగి ఉన్న స్థితి రెండును ఉద్రేకమును పొందిన మనసు నిర్ణయించు స్థితులు అని ఆచార్యుల అభిప్రాయం. 


మనిషికి నోరు ఒకటే — కానీ దానివల్ల వెలువడే మాటలు రెండు విరుద్ధ దిశల్లో ప్రవహిస్తాయి. ఒక మాట ఆశీర్వాదమవుతుంది, మరొకటి శాపమవుతుంది.

కాబట్టి “మాటల​”ను కాదు, వానిని పుట్టించు “మనసు”ను పరిశీలించాలి. తిట్లు దీవెనలను కలుపు అక్షమును (యాక్సిస్) జాగ్రత్తగా పరిశీలించిన మనము కోపమును వదలి మాట్లాడు పలుకులే వాచిక తపస్సు అనబడును. మనసులో ద్వేషం లేకుండా, శాంతితో మాట్లాడటం నిజమైన వాక్తపస్సు. 

భగవద్గీత ఇలా చెబుతుంది: 

అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ ।
స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్ఞ్మయం తప ఉచ్యతే ॥ 17-15 

ఉద్వేగమును కలిగించనివి, సత్యములు, కోపము పుట్టించనివి, ప్రయోజనకరమైనవి అగు మాటలు మరియు నిత్య వేద శాస్త్రముల పఠనము - వాంగ్మయ తపస్సు అని చెప్పబడుతున్నది.


అంటే మనసు, మాట, కర్మ మూడు సమన్వయంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ మాటలు శుద్ధమవుతాయి.

అప్పుడు అదే నోరు దైవస్వరూపం అవుతుంది — దానినుండి దుర్వాక్యాలు వెలువడవు.


రెండవ​ చరణం:
పాపకర్మమునకు బలుపుణ్యమునకును
దీపంచ రెంటికి నొక్క దేహమే గుఱి
వోపి కొండెము వినఁగ నొగి ధర్మము వినఁగ
యేపునఁ దమ వీనులు యివియే గుఱి ॥పని॥ 
పదబంధం
భావము
పాపకర్మమునకు బలుపుణ్యమునకును దీపంచ రెంటికి నొక్క దేహమే గుఱి
పాపమును ఆ దేహమే బాధను అనుభవిస్తుంది; పుణ్యం చేసినప్పుడు అదే దేహము  స్వీకరిస్తుంది. కాబట్టి దేహం పాప–పుణ్యముల సాధనమూ, ఫలగ్రాహకమూ.
వోపి కొండెము వినఁగ నొగి ధర్మము వినఁగ యేపునఁ దమ వీనులు యివియే గుఱి
మనము ఏమి వినదలుచుకున్నామో వాటిపై మనస్సు పెడతాము. కొండెములను అధర్మాలను వింటుంటే మనస్సు వక్రీభవిస్తుంది; ధర్మవచనాలను వింటే శాంతి పొందుతుంది. కాబట్టి ఇంద్రియాలే మన జీవన దిశను నిర్ణయించే సాధనాలు.

సూటి భావము:

పాపముతో కృశించుటకు పుణ్యంతో దీపించుటకు ఈ దేహమే సాధనము. మనము ఏమి వినదలుచుకున్నామో వాటిపై మనస్సు పెడతాము. కొండెములను అధర్మాలను వింటుంటే మనస్సు వక్రీభవిస్తుంది; ధర్మవచనాలను వింటే శాంతి పొందుతుంది. కాబట్టి ఇంద్రియాలే మన జీవన దిశను నిర్ణయించే సాధనాలు.


గూఢార్థవివరణము: 

దేహం మన పాప–పుణ్యములకు ఆధారభూతమైతే, చెవులు మన దిశను నిర్ణయించేవి. అందువల్ల, మన ఇంద్రియాల చర్యలే మన దిశానిర్దేశ్య ములు. ​ వాటిని శ్రీవేంకటేశుని సేవలో నిలుపుటయే యజ్ఞము— అప్పుడు దేహమూ, చెవులూ, ఇంద్రియాలన్నీ ద్వంద్వాలను దాటి ధర్మములో ఏకమవుతాయి.


వోపి కొండెము వినఁగ నొగి ధర్మము వినఁగ
యేపునఁ దమ వీనులు యివియే గుఱి 

ఇక్కడ పెదతిరుమలాచార్యులు చాలా లోతైన సంగతి చెబుతున్నారు. కొండెములను అసత్యములను నిక్కినిక్కి చెవులు కొరుక్కుంటూ వినబోతాము. అంతే ఆకర్షణ ధర్మం వినుటకుఁ మనకుండదు. ఈరోజు ప్రపంచంలో ఎన్నో ధర్మసంస్థలు మంచిని చెప్పబోతూ అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి కానీ వాటికి హాజరయ్యేవారు అతి కొద్దిమంది. అయితే "ఫలానా సినిమా నటుడికి కాలు విరిగింది" అంటే ఆ వార్త కారుచిచ్చులా వ్యాపిస్తోంది (వైరల్ అవుతుంది) ఇది ఈ ప్రపంచపు పోకడ. 


పాపకర్మమునకు బలుపుణ్యమునకును
దీపంచ రెంటికి నొక్క దేహమే గుఱి 

మనం ఇంతకు ముందు ఎన్నోసార్లు చెప్పుకున్నట్టు మానవునకు పుణ్యమును నిర్ణయించు సామర్థ్యం లేదు. అయితే పాపము గుర్తించి విడుచుటకు సామర్థ్యం కలిగి ఉన్నవాడు. ఆ పాపం విడుచు ప్రయత్నమే యజ్ఞము. ఆ ప్రయత్నము యజ్ఞములా చేయకుంటే తిరిగి పాత పద్ధతుల వైపు మళ్ళు అవకాశం ఉండును. 

అందువల్ల —

పాపాన్ని విడిచిపెట్టే చైతన్యం కలిగి ఉన్నవాడు సాధనలో ఉన్నవాడు.

కానీ పుణ్యాన్ని సాధించాలనే ఆశ ఇంకా ద్వంద్వాన్ని కొనసాగిస్తుంది.


మూడవ​ ​ చరణం:
పూవుల వాసనలకు పొంచి దుర్గంధములకు
చేవమీఱ నొక్కట నాసికమే గుఱి
శ్రీవేంకటేశు సేవించ జీవులను దర్శించ
కైవసమైయున్నతమ కన్నులే గుఱి ॥పని॥          
తెలుగు పదబంధం
భావము
పూవుల వాసనలకు పొంచి దుర్గంధములకు
చేవమీఱ నొక్కట నాసికమే గుఱి
పూల సువాసనను ఆస్వాదించాలనే ఆకాంక్ష, దుర్వాసనను దూరం చేయాలనే ద్వంద్వ భావము — ఇవన్నీ ముక్కు అనే ఒకే ఇంద్రియం ద్వారా మనసులో పుడతాయి.
శ్రీవేంకటేశు సేవించ జీవులను దర్శించ
కైవసమైయున్నతమ కన్నులే గుఱి
శ్రీవేంకటేశ్వరుని సేవలో ఉండి, జీవులలో వ్యత్యాసం చూడకుండా సమదృష్టితో చూసే ఆ కన్నులే నిజమైన దృష్టి సాధనాలు.

సూటి భావము:

మనిషి ముక్కు, కళ్ళు, ఇతర ఇంద్రియాలు అన్నీ ఒకే విధంగా పని చేస్తున్నట్టే కనిపించినా — వాటి వెనుక ఉన్న మనోభావమే అసలు తేడాను సృష్టిస్తుంది.

పూల సువాసనను కోరుకోవడం, దుర్వాసనను త్రోసివేయడం — ఇవి మనసులో దాగి ఉన్న ద్వంద్వభావాల ప్రతిబింబాలు. మనకు అనిపించే “మంచి”, “చెడు” అనే భేదం వాసనలలో లేదు; అది మన అంతరంగంలోనే ఉత్పన్నమవుతుంది — మునుపటి అనుభవాల చిట్టాలతో (=రికార్డులతో) ఇప్పటి అనుభూతిని పోల్చడం వలన. 

ఈ ద్వంద్వభావం లేని స్థితిలో, అంటే ఇంద్రియాలు సమదృష్టిలో నిలిచినప్పుడు మాత్రమే —శ్రీవేంకటేశు సేవించ జీవులను దర్శించ” అనగా, ప్రతి జీవిలో శ్రీవెంకటేశుని రూపాన్నే దర్శించగల చైతన్యస్థితి ఉత్పన్నమవుతుంది. అప్పుడు ఆ కన్నులు ఇక “చూడటానికి” కావు — అవి “ద్రష్టత్వం” సాక్షాత్కరించే సాధనాలు అవుతాయి.

 

 


గూఢార్థవివరణము: 

తీర్పులేని దృష్టి — దైవదర్శనానికి ద్వారం
శ్రీవేంకటేశు సేవించ జీవులను దర్శించ
కైవసమైయున్నతమ కన్నులే గుఱి

తీర్పులు, తీర్మానములు, తమకంటూ ప్రత్యేక అభిప్రాయములు లేని  దృష్టి — దైవదర్శనానికి ద్వారం.

“శ్రీవేంకటేశు సేవించ జీవులను దర్శించ” అంటే పెదతిరుమలాచార్యుల దృష్టిలో దైవసేవ (లేదా దైవభక్తి) అంటే ఆ తీర్పులులేని దర్శనం మాత్రమే.

మనము ఈ ప్రపంచమును, అందలి భూతములను జీవులను అవి వున్నవి వున్నట్లుగా చూడగలగడమే దైవదర్శనం. అన్నమాచార్యుల వారు "ఆకాశ పాకాశ మరుదైన కూటంబు" అన్నప్పుడు అస్తవ్యస్తముగా కనబడు ఈ ప్రపంచము మానవులు వూహించగలది కాదు. ఇక్కడే దైవము. ఇక్కడే మనుష్యులు. ఇదే నరకము. ఇదే స్వర్గము. ఐతే ఆ యొక్క యేర్పాటు (విన్యాసం) ప్రస్తుతపు మన కనులకు అందుబాటులో లేనిది.


గీతా తాత్పర్యము

సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరమ్ ।
వినశ్యత్స్వవినశ్యంతం యః పశ్యతి స పశ్యతి ॥ 13-28

సమస్త ప్రాణులలో స్థితుడై  ఉన్న పరమాత్మను క్షీణించు శరీరంలోనే  క్షీణించని నిత్యసత్యమైన దానిని  చూచువాడే ద్రష్ట​.

ఇదే మానవుల అదృష్టము. దానిని సఫలము చేసుకొనుట వారివారి భాగ్యము

అప్పుడు ఆ దృష్టి “కేవలం కన్నుల చూపు కాదు" —   అవి చైతన్యపు కిటికీలు అవుతాయి.


ఈ కీర్తన ముఖ్య సందేశం


పెదతిరుమలాచార్యుల వారు మానవులను ఆటంకపరచు

ఇంద్రియములను వాని ద్వంద్వ ప్రవృత్తిని అతి లాఘవముగా చెప్పారు. 

ఉద్రేకములోనున్న మనసు సత్య నిర్ణయమునకు పనికిరాదని అన్నారు.

పరస్పర వ్యతిరేకములను కలుపు అక్షములో లేని దైవమును చేపట్టు

సన్మార్గమును అత్యద్భుతమైన రీతిలో

ద్రాక్షాపాకముగా మనకు అందించారు. 

Monday, 6 October 2025

T-268 పనిగొన నేరిచితే పాపమే పుణ్యమౌను

 తాళ్ళపాక అన్నమాచార్యులు

268 పనిగొన నేరిచితే పాపమే పుణ్యమౌను 

For English version press here 

ఉపోద్ఘాతము 

అన్నమాచార్యులవారు ఒక్కొక్క కీర్తనలో ఒక్కొక్క అపూర్వమైన సంగతిని వెల్లడించారు. ఈ కీర్తనలో వారు ముఖ్యంగా కర్మపై లోతైన వ్యాఖ్యానం చేశారు. ముఖ్యంగా మాయామయమగు ఈ లోకంలోనే మానవుడు శరణాగతి చేసి ముక్తిని పొందవలెను అన్నారు. పరిస్థితులు బాగా అనుకూలమయ్యే వరకు వేచి చూస్తాను అనేవారు ఎప్పటికీ శరణాగతి చేయలేరు. ఎందుకంటే అటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం లేదు. ప్రతికూల పరిస్థితుల్లోనే అసలు మనిషి బయట పడతాడు. 

మానవులందరి మనసు చంచలమే అయినప్పటికీ కొందరు మహానుభావులు ఆ స్థితి నుండే పరమాత్ముని తలచగలుగుతారు. అటువంటి వారు దేవుని యంత్రంగంలో భాగమై ఈ భూమి మీద జీవులకు యిహపర సాధనములకు మార్గదర్శి అవుతారు. 

ఎక్కడో అడవులకు వెళ్లి తపస్సు చేయవలసిన అవసరం లేదని, తానున్న చోట నుండే దైవమునకు బాహటముగా శరణాగతి అంటే చాలునని ఎలుగెత్తి చెప్పారు. ఈ కీర్తన అత్యద్భుతమని చెప్పడం, సముద్రానికి లోతు ఎక్కువని చెప్పడమే.

 

అధ్యాత్మ​ కీర్తన
రేకు: 172-2 సంపుటము: 2-351
పనిగొన నేరిచితే పాపమే పుణ్యమౌను
నినుఁ గొలిచేయట్టి నీసేవకులకు ॥పల్లవి॥
 
మనసు చంచలమైనా మరి నిన్నుఁ దలఁచితే
జనులకు నిహపరసాధనమౌను
తనువు హేయమైనా తగ నిన్నుఁ గొలిచితే
పనివడి యంతలోనే పవిత్రమౌను॥పని॥
 
కర్మము బంధకమైనా కమ్మి నీసొమ్ముచేసితే-
నర్మిలి మోక్షమియ్య నాధారమౌను
మర్మము కోరికయైనా మహి నీభక్తికెక్కితే
ధర్మములకుఁ బరమధర్మము దానౌను ॥పని॥
 
జగమెల్ల మాయయైనా సరి నీకే శరణంటే
పగటున నదే తపఃఫలమౌను
అగపడి శ్రీవేంకటాధిప నన్నేలితివి
మిగులా నిహమైనా మించి పరమౌను ॥పని॥

Details and Explanations:

పల్లవి
పనిగొన నేరిచితే పాపమే పుణ్యమౌను
నినుఁ గొలిచేయట్టి నీసేవకులకు ॥పల్లవి॥ 
Telugu Phrase
Meaning
పనిగొన నేరిచితే పాపమే పుణ్యమౌను
ఎవరైనా కార్యములను నిజమైన సహజ అవగాహనతో చేస్తే — పాపము  కూడ పుణ్యమవుతుంది.
నినుఁ గొలిచేయట్టి నీసేవకులకు
నిన్ను కొలుస్తూ నీ స్మరణలో మునిగినయట్టి భక్తులకు


 

సూటి భావము:

పరమాత్మ నిరంతర స్మరణతో, ఆయన చైతన్యంలో నిలిచి ఏ పని చేసినా అది పవిత్రమవుతుంది. భక్తులు చేసే ప్రతి కార్యమూ — ఎంత సాధారణమైనదైనా — దైవసేవగా మారుతుంది.


 వ్యాఖ్యాత్మక విశ్లేషణ: 

ఇక్కడ అన్నమాచార్యులు మానవజాతికి అత్యంత ప్రాధాన్యమైన ఒక సత్యాన్ని ప్రకటిస్తున్నారు. “ఓ మానవులారా! కార్యములను ఎలా చేయాలో నిజంగా తెలిసిన వాడే జీవనరహస్యాన్ని ఛేదించినవాడు,” అని ఆయన చెబుతున్నారు. అది తెలిసిన తరువాత, ఫలితములపై దృష్టి అవసరమే లేదు. 

ఆయన జీవనాన్ని పవిత్రం–అపవిత్రం అని విభజించరు. అవి రెండు ఎంతోకొంత పాళ్ళలో వున్నదే అసలు జీవితము. కర్మను నిందించరు, తపస్సును మహిమపరచరు.  బాహ్య ఆచార వ్యవహారాలు ప్రమాణములపై కాదు — అవగాహన మరియు భక్తి పునాదులపై — నైతికత, ఆధ్యాత్మికతలను నిలబెట్టారు. 

“పనిగొన నేరిచితే” అనే మాటలోనే అన్నమాచార్యుల మర్మము దాగి ఉంది. మానవుడు సమస్త సాధ్యాసాధ్యాలను, ప్రయత్నాలను శోధించి చివరికి “చేయదగిన ఏదీ  లేదని” గ్రహించినప్పుడు — నిశ్చేష్టుడై ఏమీ చేయుటకు పాలుపోక సహజమగు మౌనము ఆవరించును. ఆ సమయములో అతడు ఆత్మస్వరూపానికి సమర్పణ చెయు అవకాశం లభిస్తుంది. దైవ సంకల్పం నుండి పుడుతుంది. 


భగవద్గీతలో చెప్పిన “అకర్తారఁ స పశ్యతి” (13-30) అనే భావం ఇక్కడే స్పష్టమవుతుంది — మానవులు తామున్న విద్యుదావేశిత వలయములో ఏదో ఒక పని వైపుకు మనసు పరుగులిడును. వాటి ఆకర్షణలకు లొంగకుండా తటస్థముగా నిలబడుటయే ఏ కార్యమూ ఆచరించక నిలబడుట -అదియే “అకర్తారఁ స పశ్యతి”. అతడు “నేను చేయువాడిని కాదు,” అని గ్రహించిన క్షణంలో లోలోపలి నుండి మౌనమవుతాడు.  

జాగ్రత్తగా గమనించిన మన పనులన్నింట్లోనూ ఎంతోకొంత ఘర్షణ వుంటుంది. ఆ ఘర్షణ కర్త–కర్మల మధ్య బేధమే. ఈ ఘర్షణతో బంధనాలు పుట్టుకొస్తాయి. 

కానీ సమర్పణలో, ఆ కర్త–కర్మల విభజన మాయమవుతుంది. చేసే వాడు–చేయబడే పని రెండూ ఒకే చైతన్యంలో లీనమవుతాయి.

అటువంటి కార్యం ఘర్షణ రహితమైన స్థితిలో పుడుతుంది — శాంతముగా, పవిత్రముగా, ప్రకాశముగా. 


ఇక్కడే అన్నమాచార్యుల మహత్త్వం వ్యక్తమవుతుంది — బయటి జీవన రీతినుంచి ఆయన శాశ్వత లోకానికి సులభంగా మారిపోతారు;

సామాన్యమైన మనుష్యజీవనంలోనుండి అవిభాజ్యమైన ఆధ్యాత్మిక అనుభూతి వైపు మృదువుగా నడిపిస్తారు. 

ఆయన దృష్టిలో జీవితం రెండు భాగాలు కాదు — జీవితం అంతా దైవ సేవ కొరకే; ప్రతి కర్మా అర్పణమే.


మొదటి చరణం:

మనసు చంచలమైనా మరి నిన్నుఁ దలఁచితే
జనులకు నిహపరసాధనమౌను
తనువు హేయమైనా తగ నిన్నుఁ గొలిచితే
పనివడి యంతలోనే పవిత్రమౌను ॥పని॥

 

తెలుగు పదబంధం
భావము
మనసు చంచలమైనా మరి నిన్నుఁ దలఁచితే
మనసు అల్లకల్లోలమైనదైనా — నీ గురించి ఆలోచిస్తే,
జనులకు నిహపరసాధనమౌను
జనులకు ఈ లోకమును, పరలోకమును గ్రహించుటకు సాధనమవుతుంది.
తనువు హేయమైనా తగ నిన్నుఁ గొలిచితే
ఈ క్షణికమైనా, అసహ్యమును గొలుపునదైనా దేహమును నీ సేవకు అంకితం చేస్తే,
పనివడి యంతలోనే పవిత్రమౌను
అది ఆ క్షణంలోనే పవిత్రమవుతుంది.

భావము:

చంచలమైన మనసు కూడా భగవంతుని స్మరణలో నిలిచినపుడు, జనులకు ఈ లోకము–పరలోకముల యథార్థాన్ని బోధించగల సాధనమవుతుంది.
క్షణికమైనా, హీనమైనా దేహమూ — దైవసేవలో నిమగ్నమైనపుడు — అదే పవిత్రమవుతుంది.


గూఢార్థవివరణము:

ఇక్కడ అన్నమాచార్యులు ఒక అసాధారణ సత్యాన్ని చాటి చెబుతున్నారు. వారు పవిత్రమైన మనసు, నిర్దోషమైన శరీరం కోసం ఎదురుచూడవద్దు. చంచలమైన మనసు – హేయమైన శరీరములతోనే పరమాత్మవైపు తిరిగిన క్షణంలో పవిత్రమవుతాయి. కాబట్టి ఇంకా దీనికి మనమంతా అర్హులమే. జనులారా! పరమాత్మవైపు తిరిగి కొలవండి. అదే మానవజీవితమునకు పరమార్థము.

 

జనులకు నిహపరసాధనమౌను” అనే పదబంధం లోతైనది. దైవసేవలో మునిగిపోయిన వాడు జనులకు తానే ఒక సాధనమవుతాడు. అతడి ద్వారా ఇతరులు ఈ లోకపు సత్యాన్ని, పరలోకపు పరమార్థాన్ని దర్శించగలుగుతారు. ఇలాంటి వ్యక్తులు తమకోసం జీవించరు — సమాజం కొరకే జీవిస్తారు. వారి ద్వారా ప్రపంచమునకు వెలుగు ప్రసరిస్తుంది. 

ఈ సినిమా పాటని గుర్తు చేసుకుందాం. కోటికి ఒకరే పుడతారు పుణ్యమూర్తులు. వారి కొరకే వస్తారు సూర్యచంద్రులు.


అన్నమాచార్యులు అలాంటి జీవాత్మ. ఆయన మనసు, శరీరం — దైవ చైతన్యానికి వాహనాలుగా మారాయి. ఆయన రచించిన వేలాది కీర్తనలు మానవాళిని దేవుని వైపు నడిపించే వంతెనలుగా నిలిచాయి. అసాధ్యమైన లోకాలకు వారు వారధులుగా మిగిలారు. ఇక్కడ మనిషి అహంకారాన్ని విడిచి, అవగాహనలో నిలిచినపుడు — అదే మనసు, అదే శరీరం విముక్తికి సాధనమవుతాయని ఆయన చూపిస్తున్నారు.


ఆధునిక కాలంలో జిడ్డు కృష్ణమూర్తి జీవితం కూడా ఇదే మార్గాన్ని ప్రతిబింబిస్తుంది. దివ్యజ్ఞాన సమాజము (థియోసఫీ) ఆయనను “ప్రపంచ గురువుగా” నిలబెట్టినప్పటికీ, ఆయన ఆ బిరుదులు, కీర్తులు అన్నీ త్యజించి, సామాన్యుడిగా జీవించి, సత్యదూతగా మారాడు. అతడు కూడా అన్నమాచార్యుల మాదిరిగానే — సజాగృతమైన, స్వార్థరహితమైన మనస్సు ద్వారా దైవతత్వం ప్రసరించగలదని ప్రపంచమంతా తిరిగి చాటిచెప్పాడు. ఇద్దరికీ మనస్సు–దేహములు అవరోధాలు కావు. అవి స్మరణతో, అవగాహనతో తాకినపుడు —అవే పవిత్రమైన సాధనములవుతాయి.  


అనేకమంది మహాపురుషులు జన్మించిన ఈ ప్రపంచములో అతికొద్దిమంది మాత్రమే దైవతత్వం ప్రసరించగల సాధనములయ్యారు. వారు వర్ణించగరాని, అవగాహనకు అందని పరమాత్మ తత్వమును ప్రజలకు ప్రత్యక్షంగా బోధించు  ముక్తి ద్రోవలో వారు జీవనము సాఫల్యము చేసుకొనిరి. అన్నమాచార్యుల గురించి తరువాతి తరమువారు ఇలా అనిరి. "ఈతఁడే ముక్తిదోవ యీతఁడే మాయాచార్యుఁడీతఁడు గలుగఁబట్టి ఇందరు బదికిరి". 


రెండవ​ చరణం:

కర్మము బంధకమైనా కమ్మి నీసొమ్ముచేసితే-
నర్మిలి మోక్షమియ్య నాధారమౌను
మర్మము కోరికయైనా మహి నీభక్తికెక్కితే
ధర్మములకుఁ బరమధర్మము దానౌను ॥పని॥ 
తెలుగు పదబంధం
భావము
కర్మము బంధకమైనా కమ్మి నీసొమ్ముచేసితే
సాధారణంగా కర్మ బంధనానికి కారణం; కాని దానిని నీవే మూలముగా సమర్పిస్తే, అది స్వరూపం మారుతుంది.
నర్మిలి మోక్షమియ్య నాధారమౌను
నీ ప్రేమతో అది విముక్తి ప్రసాదించే ఆధారమవుతుంది.
మర్మము కోరికయైనా మహి నీభక్తికెక్కితే
నీ అంతర్మర్మాన్ని తెలుసుకోవాలనే కోరికైనా, అది భక్తిరూపముగా లీనమైతే,
ధర్మములకుఁ బరమధర్మము దానౌను
అది సమస్త ధర్మములలో శ్రేష్ఠమైన ధర్మమవుతుంది.

 

సూటి భావము:

(అన్నమాచార్యులు ఇక్కడ మొదటి చరణం యొక్క సూత్రాన్నే కొనసాగిస్తున్నారు). బంధనమునకు కారణమైన కర్మ, స్వార్థరహిత సమర్పణలో లీనమైనప్పుడు — అదే దైవప్రేమకు వాహకమై, విముక్తి యొక్క మూలమవుతుంది. దైవమర్మం తెలుసుకోవాలనే కోరిక కూడా భక్తితో చల్లబడినపుడు — అది పరమధర్మముగా మారుతుంది.


గూఢార్థవివరణము:

"కమ్మి నీసొమ్ముచేసితే" అనే మాటలో ఒక లోతైన ఉపమానం ఉంది — ఎలాగైతే లోహపు తీగ విద్యుత్తుతో అనుసంధానమైతే అది నిర్మలమైన శక్తిని ప్రసారం చేస్తుందో, అలానే మన కర్మలు కూడా దైవసంకల్పముతో అనుసంధానమైతే అవి స్వార్థరహిత ప్రేమను ప్రసారం చేస్తాయి.

 

నర్మిలి మోక్షమియ్య నాధారమౌను”ప్రేమతో చేసే పనులే విముక్తి యొక్క పునాది.
మనసు ఏ క్షణంలోనైనా స్వప్రయోజనాన్ని విడిచి దైవసేవలో లీనమైతే,
ఆ క్షణం నుండి దాని యాత్ర భూలోకంనుండి పరలోకానికి మొదలవుతుంది.

 

మర్మము కోరికయైనా మహి నీభక్తికెక్కితే” అనే వాక్యం అత్యంత సున్నితమైనది.
దైవమర్మం తెలుసుకోవాలనే తపన కూడా సాధారణంగా కోరికగానే కనిపిస్తుంది.
కానీ ఆ తపన భక్తిగా మారినపుడు — అది ఇక తెలుసుకోవాలనే కోరిక కాదు,
తానే తాను లీనమవ్వాలనే ఆకాంక్ష.” ఇది అజ్ఞానానికీ, జ్ఞానానికీ మధ్యనున్న సరిహద్దు.
ఇక్కడ కోరిక జ్ఞానమవుతుంది. జ్ఞానం సమర్పణ అవుతుంది.

 

ధర్మములకుఁ బరమధర్మము దానౌను”దైవమునకు అర్పణమైన పని,
అది ఎంత సాధారణమైనదైనా, దానిలో స్వార్థం లేకపోవుట వలన — అది సమస్త ధర్మములకంటే ఉన్నతమైన ధర్మమవుతుంది.

 

మనిషి చేసే ప్రతి పని స్వతహాగా నిష్పాక్షికం. దానిని బంధనమో, విముక్తియో చేసే అంశం మన చూసే తీరే. అన్నమాచార్యుల దృష్టిలో కర్మలో తప్పు లేదు; కర్మ దైవసంకల్పముతో కలిసిన క్షణంలో అది “యజ్ఞం” అవుతుంది. ఆ కర్మలో చేయువాడు లేడు, చేసేది లేదు — చర్య మరియు చైతన్యం ఒకటైపోతాయి.

 

భగవద్గీతలో చెప్పినట్లే (4-23): గతసంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః, యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే.” అంటే —అటువంటి వారు ప్రాపంచిక అనుబంధాల నుండి విముక్తి చేయబడుతారు మరియు వారి బుద్ధి దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థితమై ఉంటుంది. వారు చేసే ప్రతి పని, యజ్ఞం (భగవత్ అర్పితము)గా ఉంటుంది కాబట్టి వారు అన్ని రకాల కర్మ ప్రతిచర్యల నుండి విముక్తి చేయబడుతారు.

 

ఇదే అన్నమాచార్యుల చరణం చెబుతున్నది. కర్మను విముక్తిగా మార్చే శక్తి భక్తిలో, ప్రేమలో, సమర్పణలో ఉంది. ఆయన చూపించిన దారిలో — జీవితం ఒక యజ్ఞంగా, ప్రేమ ఒక విముక్తి దారిగా మారుతుంది.


మూడవ​ ​ చరణం:
జగమెల్ల మాయయైనా సరి నీకే శరణంటే
పగటున నదే తపఃఫలమౌను
అగపడి శ్రీవేంకటాధిప నన్నేలితివి
మిగులా నిహమైనా మించి పరమౌను ॥పని॥                   
తెలుగు పదబంధం
భావము
జగమెల్ల మాయయైనా సరి నీకే శరణంటే
జగమంతా మాయ అని చెప్పినా సరే, నేను నీ శరణు చేరితే –
పగటున నదే తపఃఫలమౌను
బాహటముగా  అదే స్పష్టమైన తపస్సు ఫలమవుతుంది.
అగపడి శ్రీవేంకటాధిప నన్నేలితివి
ఓ వెంకటాధీశా! నీవే నా హృదయాన్ని  ఏలుతున్నావని తెలుసు
మిగులా నిహమైనా మించి పరమౌను
నీ సన్నిధిలో ఈ నిష్ఫలమైన ఈ లోకం కూడా పరమమైన సత్యరూపమవుతుంది.

 

సూటి భావము:

జగమంతా మాయ అని చెప్పినా, నేను నీ శరణు పొందినప్పుడు —బహిరంగముగా అదే నా తపస్సు, అదే పఃఫలము కూడా. ఓ వెంకటేశ్వరా! నీవే నా హృదయానికి పాలకుడివి. నీ సన్నిధిలో ఈ కలుషమైన లోకం కూడా మరొక దివ్య లోకమై ప్రకాశిస్తుంది.


గూఢార్థవివరణము: 

ఈ మాయాలోకంలోనే శరణు పొందాలి: అన్నమాచార్యులు ఇక్కడ ఒక అద్భుతమైన సత్యాన్ని వెల్లడిస్తున్నారు. జగత్తు మాయయే అయినా సరే — మనసు దైవశరణు చేరిన క్షణంలో మాయ పవిత్రమవుతుంది. అది ఇక భ్రాంతి కాదు; భగవద్కృపలోని వెలుగు.



మిగులా నిహమైనా మించి పరమౌను” — ఈ నిష్ఫలంగా కనిపించే లోకం పరమసత్యరూపమవుతుంది. సాధారణ దృష్టికి జగత్తు గందరగోళముగా కనిపించినా, అవగాహనలో నిలిచిన దృష్టికి అదే జగత్తులో ఒక క్రమం, ఒక శ్రుతి, ఒక నిశ్శబ్ద సౌందర్యం ప్రతిఫలిస్తుంది. ఆ సౌందర్యం వర్ణించలేనిది, స్మృతిలో నిలవనిది.


పగటున నదే తపఃఫలమౌను” — దాచకుండా, హృదయపూర్వకంగా చేసిన శరణాగతి — అదే తపస్సు. అడవులకూ గుహలకూ వెళ్లి దీర్ఘ తపస్సు చేయనక్కరలేదు. మనసారా చెప్పి — “ప్రభో! నేను నీవాడిని; నా శరీరము, నా మనస్సు నీవే నడిపించు” — అన్న క్షణమే తపస్సు ఫలిస్తుంది. అది పాపమును పుణ్యముగా మార్చే చైతన్యం — అదే శరణాగతి.


మేధస్సు యొక్క పరాజయం: అన్నమాచార్యుల దృష్టిలో ఇది మేధస్సు యొక్క పరాజయం. మానవజాతి యుగాలుగా మేధస్సును ఆరాధిస్తోంది. కానీ ఆ మేధస్సు యుద్ధాలను సృష్టించింది, శాంతిని కాదు; అధునాతనతను తెచ్చింది, కానీ కరుణను కోల్పోయింది. ప్రజల మనసులో భయం, ఆందోళన, అశాంతి — ఇవే మన ప్రగతికి ప్రతిబింబాలు. భవిష్యత్తుపై ఆశ చూపేది జ్ఞానం కాదు; ఈ క్షణంలో చైతన్యంగా మేల్కొన్న అవగాహనే విముక్తి. తక్కినవన్నీ వ్యర్థములు.


క్రమానుగత మార్పు — ఒక ఉచ్చు

ఇప్పుడు కూడా అనేకులు “ప్రపంచం నెమ్మదిగా క్రమక్రమంగా మారుతుంది” అనే ఆశగా ఉంటారు. కానీ ఇది కేవలం మనసు యొక్క మాయ. మహాభారతంలో చెప్పిన సంగతులు ఈనాటికీ ఎందుకు నిజమనిపిస్తాయంటే ఆనాటినుంచి ఈనాటి దాకా మనషి మనస్సులో మార్పు రాలేదు. మనలాగే అలోచించే వారున్నంత వరకు ఈ ప్రపంచం ఇలాగే వుంటుంది. మార్పు ఎప్పుడూ క్రమానుగతం కాదు. కాలనుగతం కాదు. సత్యము, ధర్మము సమయానికి బంధింపబడవు. శరణాగతి క్షణం వచ్చినప్పుడు — అదే ఆత్మలో విప్లవం. అణువణువులో విప్లవం.


అగపడి శ్రీవేంకటాధిప నన్నేలితివి” — ఈ మాటలు భక్తిప్రస్ఫురణ మాత్రమే కాదు, జ్ఞానోదయం. దైవచైతన్యం అంతరంగపు పాలకుడై ఉన్నపుడు, మనసు–శరీరం రెండూ దాని సాధనాలవుతాయి. ఇక “నేను” అనే భావం ఉండదు; చైతన్యం ప్రవహించే మార్గమే మిగులుతుంది. అదే "జీవములో దైవచైతన్యం" ప్రతిష్టించ బడుట​.​ ఆ దశలో మాయ, సత్యం, లోకం, పరలోకం అనే విభజనలన్నీ లయమవుతాయి. ఈ లోకమే పరములోకమవుతుంది.


ఈ చరణం అంతరంగ మార్పుకి ఒక ప్రతీక. మనం మారకుండా ప్రపంచం మారాలి అనుకోవడం అవివేకము. మనం సమూలముగా మారితే జగత్తే పరమవుతుంది. ఇది అన్నమాచార్యుల కవిత్వానికి పరాకాష్ట.


ఈ కీర్తన ముఖ్య సందేశం


అన్నమాచార్యులు పాపపుణ్యముల వివాదంలో పడకుండా

సంపూర్ణ భక్తితోటి దైవమును ఆరాధించమని ఉద్బోధ చేశారు.


X-X-The END-X-X

 

310 bayalu moraṃgagu paramamāya idi (బయలు మొరంగగు పరమమాయ ఇది)

  TALLAPAKA ANNAMACHARYULU 310 బయలు మొరంగగు పరమమాయ ఇది (bayalu mora ṃ gagu paramam ā ya idi) తెలుగులో చదవడానికి ఇక్కడ నొక్కండి . INTRODU...