Friday, 8 May 2026

T-327 చాలుఁ జాలు నీ జాజర నన్ను

 తాళ్లపాక అన్నమాచార్యులు
327 చాలుఁ జాలు నీ జాజర నన్ను

పరిచయం
ఈ చిత్రమెవరిది?

అన్నమాచార్యులు అద్భుతమైన చిత్రాలను చూపరు.
దైనందిన జీవితంలోని చిత్రాలనే మన ముందుంచుతారు.
దేనినుంచైతే మనము తప్పించుకోవాలనుకుంటామో,
ఎక్కడినుంచైతే వెతకడం మొదలుపెడతామో—
అక్కడినుంచే తెలియనిదాన్ని వెతకడం మొదలవుతుంది.
తెలియనిది బయట ఎక్కడో ఉందన్న ఆశతో.

కానీ,
తెలియనిది ఇక్కడే ఉంది.
జీవిస్తున్న ఈ క్షణంలోనే.
ఆ చిత్రం ఎవరిదో కాదు.
మనదే.

కానీ,
 మనకు ఒక ఊహ, ఒక ఉజ్జాయింపు ఉంటుంది
జీవితం ఎలా ఉండాలో.
ఆ ఊహలకు సరిపోనిది
మన దృష్టిలో వ్యర్థమైపోతుంది.

పోనీ—
ఆ చిత్రాన్నే వాస్తవం అని అంగీకరించామనుకుందాం.
దానితోనే ఎటూ మరలకుండా ఉండగలమా?

కానీ,
మనము మన జీవితాన్ని
ఆ మరలుచుటలోనే తెలుసుకుంటాము.
ఇదే జీవితం” అని గుర్తించిన క్షణమే—
చూపు మరలినట్లే.

అదే అన్నమాచార్యుల ప్రత్యేకత.
ఒక యోగి.
ఒక ద్రష్ట.
ఎక్కడా సిద్ధాంతాలు లేవు.
వాదనలు లేవు.
చూడమంటారు.
అంతే.

శృంగార సంకీర్తన
రేకు: 87-1 సంపుటము: 5-332
చాలుఁ జాలు నీ జాజర నన్ను
జాలిఁ బరచె నీ జాజర         ॥పల్లవి॥

వలపు వేదనల వాడేను యీ-
తలనొప్పులచేఁ దలఁకేను
పులకలమేనితోఁ బొరలేను కడుఁ-
జలిగొని చల్లకు జాజర         ॥చాలు॥

ఒల్లని నినుఁగని వుడికేను నీ-
చిల్లరచేఁతలఁ జిమిడేను
కల్లగందవొడిఁ గాఁగేను పైఁ
జల్లకు చల్లకు జాజర           ॥చాలు॥

తివిరి వేంకటాదిప నేను నీ-
కవుఁగిటికబ్బితిఁ గడు నేను
రవరవ చెమటఁ గరఁగి నేఁడు యిదె
చవులాయను నీ జాజర        ॥చాలు॥
Details and Explanations:
పల్లవి:
చాలుఁ జాలు నీ జాజర నన్ను
జాలిఁ బరచె నీ జాజర ॥పల్లవి॥
పదం / భాగం
అర్థం
చాలుఁ జాలు
చాలు — ఇక ఆపు
జాజర
మోసం, వంచన, సూక్ష్మమైన స్వీయ​ మోసం
నీ జాజర
ఈ నీ మోసం (బయటిదే అనవసరం లేదు; కొనసాగుతున్న ఒక కదలిక)
జాలిఁ బరచె
జాలి, నిస్సహాయతలోకి నెట్టివేయుట (స్వీయ జాలిలోకి త్రోసివేస్తున్నట్లు)


భావము:
(ఒక వ్యక్తి  తానెవరికి చెప్పుకోవాలో తెలియక తనలో ఇలా అనుకుంటున్నాడు)
చాలు చాలు — ఈ మోసాలిక చాలు.
ఇది నన్ను (స్వీయ) జాలిలోకి, నిస్సహాయతలోకి నెట్టివేస్తోంది.

గూఢార్థవివరణము:
ఇక్కడ అన్నమాచార్యులు
జీవితంలోని అలుపును ఘర్షణను సూచిస్తూ ప్రారంభిస్తారు.
“చాలు జాలు” = ఇక ఆపు అన్నట్లుగా.

నీ జాజర”
ఇది స్పష్టంగా “ఎవరో చేసిన మోసం” కాదు.
ఇది సూచించేది:
దారి మళ్లించే ఒక కదలిక
మళ్లీ మళ్లీ అదే దారికి తీసుకువెళ్లే స్థితి
తాను చిక్కుకొని ఉన్నానని తెలిసి పెనుగులాడే అంతర్గత చలనం.

జాలిఁ బరచె”
ఈ మోసం కేవలం తప్పుదారి పట్టించదు
అందులోనే తిప్పుతది.
తనపైన తానే జాలి పడటం
ఒక నిస్సహాయత
“నేను చిక్కుకుపోయాను” అనే భావన
అంటే ఈ కదలిక:
మోసం ప్రతిస్పందన తనపైన తనకే జాలి

ఒక వాక్యంలో
దారి తప్పించేది—
దారి తప్పిపోయిన భావననూ నిలబెడుతుంది.

మొదటి చరణం:
వలపు వేదనల వాడేను యీ-
తలనొప్పులచేఁ దలఁకేను
పులకలమేనితోఁ బొరలేను కడుఁ-
జలిగొని చల్లకు జాజర        ॥చాలు॥
పదం / భాగం
అర్థం
వలపు వేదనలు
వలపు, ఆకర్షణ వలన కలిగే వేదనలు
వాడేను
వాడిపోవును, అలసిపోవును, శక్తి కోల్పోవును
తలనొప్పులచేఁ దలఁకేను
తలనొప్పుల నిరంతర ఒత్తిడిలో నలిగిపోవును
పులకలమేనితోఁ బొరలేను
పులకరములతో, వెంట్రుకలు నిక్కబొడుచుకొగా (లోలోపల ఉద్రేకపు తరంగాలలో కొట్టుకుపోవుట)
కడుఁ జలిగొని
మిక్కిలి దడతో అదురుతో (ఈ పదములు మనలో జరుగుతున్నదానిని చూపుతాయి. వాటి అర్థము కంటే  అవి చూపే భావనను గమనించమని ప్రార్థన​. ).
చల్లకు జాజర
లేని చల్లదనం / ఉపశమనాన్ని వెతుకుట తిరుగుట

భావము:
ఆ వ్యక్తి—
వలపు వేదనలతో వాడిపోతూ,
తలనొప్పులతో నలుగుతూ,
పులకరింతల గగుర్పాటులలో,
మిక్కిలి దడతో కొట్టుకుంటున్న హృదయముతో—​
ఎక్కడో "లేని" ఒక చల్లదనాన్ని,
"ఉండని" ఒక ఉపశమనాన్ని వెతుకుతాడు.

గూఢార్థవివరణము:
వలపు వేదనల వాడేను”
ఇది సాధారణ కోరిక కాదు.
మళ్లీ మళ్లీ లాగుతూ
మనసును అలసిపోయే స్థితిలోకి నెట్టే
ఆకర్షణల కదలిక.

తలనొప్పులచేఁ దలఁకేను”
ఇది తాత్కాలిక బాధ కాదు.
వదలని తలనొప్పిలా వెంటాడే అంతర్గత భారం.

పులకలమేనితోఁ బొరలేను”
పులకరములతో,
లోని ఉద్రేకపు తరంగాలు పెల్లుబుకుతు
కట్టలు తెంచుకునే ఆవేశంతో దొర్లుతు
అలా మనిషి జీవితంలో పడి కొట్టుకుపోతూనే ఉంటాడు.

కడుఁ జలిగొని చల్లకు జాజర”
వీటిలో పడి
లోపల కలతను భరించలేక—
క్షణక్షణం అల్లాడుతూ
ఎక్కడో
ఎండమావిలోని నీరు లాంటి చల్లదనం కోసం
ఎడారిలో ఉండని ఉపశమనం కోసం
దేవులాడుతాడు

కీలక​ పరిశీలన
కలతను సృష్టించేది—
దానికి ఉపశమనమని చెప్పేది —ఒకే కదలిక.

రెండవ చరణం:
ఒల్లని నినుఁగని వుడికేను నీ-
చిల్లరచేఁతలఁ జిమిడేను
కల్లగందవొడిఁ గాఁగేను పైఁ
జల్లకు చల్లకు జాజర॥చాలు॥
పదం / భాగం
అర్థం
ఒల్లని నినుఁగని
అక్కడెక్కడో నువ్వున్నావని భావించి
వుడికేను
వుడికిపోవుట, ఆతృతతో అల్లాడుట
చిల్లరచేఁతలఁ జిమిడేను
చిల్లర పనులలో పడి చిమిడిపోతాడు (వలసిన దానికన్నా ఎక్కువ బాధపడతాడు)
కల్లగందవొడిఁ గాఁగేను
(కల్ల = నిజముగాని; గందవొడిఁ = గంధపుపొడి) కానిదానికోసము ఆవేశపడతాడు. (లేనిదానిలో సుగంధం వెదుకు తాపత్రయము)
పైఁ జల్లకు చల్లకు
పైపైన చల్లదనం కోసం పరితపించు
జాజర
మోసం, తిరిగి తిరిగి అదే చలనంలో పడవేయు స్థితి

భావము:
ఆ వ్యక్తి—
తనలో లేనిదేదో బయట ఉందని భావించి
ఆతృతతో అల్లాడుతాడు.
చిల్లర పనులలో పడి చిమిడి ఎక్కువ బాధపడతాడు.
లేనిదానిలోనే సుగంధం వెతుకు తాపత్రయమే మండిస్తుంటే.
అంతలో—
ఎక్కడైన కొంతైనా ఊరట,  తెఱపి
దొరుకుతుందేమోనని అక్కఱపడును.

గూఢార్థవివరణము:
మొదటి చరణంలో:
కలత, అలసట, ఉపశమనాన్వేషణ
చూపించబడింది.
ఈ చరణంలో: లోలోపలి భావనలు దహించుతూ ఉంటే
ఊహించినదాన్ని ఆసరాగా తీసుకునే నైజము చూపిస్తున్నారు
కొంచమైనా ఊరడింపుకోసం
చన్నీళ్ళ చిలకరింపు కోసం
ఆరాటము చూపుతారు.

ఒల్లని నినుఁగని వుడికేను”
నీకు వలసినది
అల్లన దూరంలో ఉన్నదనుకొని
భావించిన ఆ క్షణం—
ఆరాటము మొదలవుతుంది.
అక్కడి నుంచే:
వ్యాకులత
అశాంతి
అందుకోవాలనే తొందర
పుడతాయి.

చిల్లరచేఁతలఁ జిమిడేను”
చిమిడిన అన్నము అనగా ఎక్కువగా ఉడికిన అన్నము
వలసిన దానికన్నా ఎక్కువ బాధపడడం చూపుతోంది
చిల్లర పనులలో  చిక్కి ఎక్కువ అవస్థపడతాడు

కల్లగందవొడిఁ గాఁగేను”
లేనిదానిలోనే మాధుర్యం ఊహిస్తాడు.
ఆ ఊహే:
ఆ మంట. అదే కంటకము.
అదే తృష్ణ​. తీరని దాహము..

పైఁ జల్లకు చల్లకు జాజర”
ఈ మండుటను భరించలేక.
చల్ల ఒక ఊహా స్థితి.
పైఁ జల్ల నీటిపై బంగారు పైపూత వంటిది
పైఁ జల్లకు చల్లకు జాజర”
ఒక ఊహా స్థితి నుండి ఇంకో దానికి మరలడమే ఆత్మవంచన.
పైపైన ఉపశమనాన్ని వెతుకుతాడు.
ఆ రెండు  స్థితులు తనలోనివే.
అతడు అలాగే ఉంటాడు. అదే "జాజర”
(గమనించండి దేని నుంచి దూరం జరగాలని మొదలుపెట్టాడో
అందులోనే, అంటే వెతుకుట అనే దాంట్లో తిరిగి పడతాడు.)

కీలక​ పరిశీలన
తనలో లేనిదేదో బయట ఉందన్న భావనే—
మౌలికంగా కదలికకు ఇంధనం.

మూడవ చరణం:
తివిరి వేంకటాదిప నేను నీ-
కవుఁగిటికబ్బితిఁ గడు నేను
రవరవ చెమటఁ గరఁగి నేఁడు యిదె
చవులాయను నీ జాజర      ॥చాలు॥
పదం / భాగం
అర్థం
తివిరి
ప్రయత్నపూర్వకముగా, ఆలోచించి, ఉద్దేశపూర్వకంగా
వేంకటాదిప
ఓ వేంకటేశా
నేను నీ కవుఁగిటికబ్బితిఁ గడు నేను

(అబ్బు = దొరకు, ప్రాప్తించు) ఎలాగో నీ కౌగిటిలో చేరిన వాడనయ్యాను

రవరవ చెమటఁ గరఁగి
రవరవలు, కలతలు, చెమటలు కరిగిపోయి
నేఁడు యిదె
ఇప్పుడు ఈ స్థితిలో
చవులాయను
రుచించినది, సమ్మతమైనది అనిపించుట
నీ జాజర
ఈ మోసం, ఈ స్వీయ వంచన కదలిక

భావము:
(ఇది కవి వ్యక్తిగతం)
నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను.
కానీ, అందుమూలమున కాక
ఓ వేంకటేశా
ఎలాగో  ఈ నీ కౌగిలి ప్రాప్తించినది.
రవరవలు కరకరలు కరిగిపోయాయి.
నా శ్రమ తీరిపోయింది.
ఇప్పుడు, ఈ జాజర కూడా రుచించింది.
సరి అనిపించింది.

గూఢార్థవివరణము:
మొదటి రెండు చరణాలలో:
కవి అందరిలాగే సామాన్యుడు.
కలత
వెతుకులాట
ఉపశమనాన్వేషణ
ఊహించిన చల్లదనం
చూపించబడింది.

ఈ చరణంలోను—
ప్రయత్నం ఉంది.
కానీ కవి తనకే తెలియని
కానీ ప్రాప్తించిన దశలో 
ప్రతిఘటన కరుగుతూ
లోని వ్యత్యాసాలు తగ్గుతూ
ఉంటే
తనకు ఊహాలకు మధ్య  ఉన్న పొరలు తొలగుతున్న  స్థితి చూపుతారు.
అపుడు 'జాజర'కు వ్యతిరేకత మటుమాయమైంది.

ఇక్కడ కవి పరమును చూపలేదు
ఇహముతో గాఢానుబంధంలో ఉన్న స్థితి కనిపిస్తుంది.

నేను నీ కవుఁగిటికబ్బితిఁ గడు నేను”
ఇక్కడ కవి ఒక సూక్ష్మమైన విషయాన్ని చూపుతున్నారు.
అబ్బితిఁ”
అంటే:
నేను సాధించాను” అని కాదు.
ఎలాగో జరిగిపోయింది.” అని
ప్రయత్నం ఉన్నా
పనిచేసినది అది మాత్రమే కాదు.

“రవరవ చెమటఁ గరఁగి”
రవరవలు—
అంతరంగపు ఆదుర్దా, కలత.
చెమటలు—
ఆరాటం, శ్రమ, అలసట.
ఇవి అన్నీ
ఈ స్థితిలో కరిగిపోయాయి.

చవులాయను నీ జాజర”
ఇది చాలా సూక్ష్మమైన పరిశీలన.
ఇక్కడ కవి:
మోసం మంచిది”
అని చెప్పడం లేదు.
అలాగే:
మోసం పోయింది”
అని కూడా చెప్పడం లేదు.

కానీ —
ప్రతిఘటన లేదు.
అందువల్ల:
మంచి / చెడు
కావాలి / వద్దు
పొందాలి / వదలాలి
అనే విభజనలు బలహీనపడి వెనక్కి తగ్గుతాయి.

అదే సమత్వం అంటే
ఇది సిద్ధాంతంగా చెప్పిన సమత్వం కాదు
ఆ స్థితిలో ఉండి చెప్పిన  మాట​.
ఒక స్థితి.
ఒక ప్రత్యక్ష అనుభవ స్థితి. 

ఇటువంటి ఇంకొక సమానాంతర పరిశీలన​

వలెననే దొకమాఁట వలదనే దొకమాఁట
సిలుగులీ రెంటికిని చిత్తమే గురి 
ఔను’, కాదు కూడా చిత్తము సృష్టించు బేధభావములే.

వ్యాఖ్యానంతర సమీక్ష​

పై వివరణ చూసిన తరువాత
మనకు సత్యమునకు మధ్య ఉన్నవి తెరలే అన్నది
అనుభవమునకు వచ్చును.
విభేదములు సృష్టించు తెరలు.
ఇవి కరిగినప్పుడు ఈ ప్రపంచం తేటగా కానవచ్చును.
ఈ తెరల గురించి ఇంకొంచెం చర్చించుదాం.
ముందుగా క్రింది వీడియో చూడండి.
(అశక్తతా సోపాన క్రమము) అను దృగ్విషయం ఆవిష్కరించబడింది. 

ఈ వీడియోలో తోడేళ్ళకు నదికి ఉన్న ప్రత్యక్ష సంబంధం సులభంగా బోధపడుతుంది.
తోడేళ్ళు, నది కూడా ప్రకృతి లోనివే.
అలాగే మనిషి కూడా ప్రకృతి లోనివాడే.
మనకు ప్రపంచంతో గల  సంబంధము కేవలము తలపు కాదు.
ఇది వాస్తవమైన  సంబంధం.

మన తలపులన్నీ
దీనిని ఏవిధముగా నేను 'ఉపయోగించుకోగలనుఅనే కాని,
నేను దీనిలోని వాడనను భావన అరుదు.

తనకు  చుట్టూ ఉన్న ప్రకృతిని మనసు అను ద్వీపము నుంచి చూచి
వేరుగా  భావించుట మన ప్రస్తుత స్థాయి.
ప్రకృతికి తనకు విభేదాలు చూచు స్థితి.
దీనికి వ్యతిరేకము కూడా సంభవమే కానీ మనకు అందులో "లాభము" కనబడదు.

X-X-X THE END  X-X-X

No comments:

Post a Comment

T-327 చాలుఁ జాలు నీ జాజర నన్ను

  తాళ్లపాక అన్నమాచార్యులు 327 చాలుఁ జాలు నీ జాజర నన్ను For English version press here పరిచయం ఈ చిత్రమెవరిది ? అన్నమాచార్యులు అద్భుతమైన చిత...