Sunday, 3 May 2026

T-326 మూలమూల నమ్ముడుఁ జల్ల ఇది

 తాళ్లపాక అన్నమాచార్యులు
శృంగార సంకీర్తన
326 మూలమూల నమ్ముడుఁ జల్ల ఇది

 పరిచయం

ఈ కీర్తనలో "చల్ల" ఎక్కడా నిర్వచింపబడదు.
అది అర్థాలకు అందదని సూచితము.

ఈ కీర్తన అందం
తెలియని దాన్ని వ్యక్త పరచుటలోనే వుంది.
నిర్మాణము సాధారణము
శిల్పము ఆసాధారణము
భావము బ్రహ్మాండము

గుబ్బెత వొకతి,
జవ్వని వొకతి
వొయ్యారొకతి
అంటూ "చల్ల" కొచ్చిన వయ్యారాలను చెబుతారే కానీ
అన్నమాచార్యులు అదేమిటో చెప్పరు.
చూపుతారు.
వారు చూపినదేమిటో చూద్దాం.

చల్ల చిలికితే వెన్న వచ్చును.
అన్నమాచార్యులు ఏ చల్లను చిలకమంటున్నారో?’ చూతము.

శృంగార సంకీర్తన
రేకు: 70-1 సంపుటము: 5-229
మూలమూల నమ్ముడుఁ జల్ల ఇది
రేలుఁ బగలుఁ గొనరే చల్ల     ॥పల్లవి॥

పిక్కటిల్లు చన్నుల గుబ్బెత వొకతి కడుఁ-
జక్కనిది చిలికిన చల్ల
అక్కునఁ జెమటగార నమ్మీని యిది
యెక్కడఁ బుట్టదు గొనరే చల్ల             ॥మూల॥

వడచల్లు మేని జవ్వని వొకతి కడు-
జడియుచుఁ జిలికిన చల్ల
తడఁబడు కమ్మనితావులది మీ-
రెడయకిపుడు గొనరే చల్ల     ॥మూల॥

అంకులకరముల వొయ్యారొకతి కడు-
జంకెనలఁ జిలికిన చల్ల
వేంకటగిరిపతి వేడుకది
యింకానమ్మీఁ గొనరే చల్ల     ॥మూల॥
Details and Explanations:
పల్లవి:
మూలమూల నమ్ముడుఁ జల్ల ఇది
రేలుఁ బగలుఁ గొనరే చల్ల  ॥పల్లవి॥

భావము:

ఇది ఎక్కడైనా లభించేదే—నమ్మండి.
రాత్రింబగళ్లు ఎప్పుడూ పొందదగినదీ చల్ల.
దాన్ని అనుభవించండి.


గూఢార్థవివరణము:
ఇక్కడ గొనరే” = గ్రహించు తీసికొను పట్టుకొను, లక్ష్యపెట్టు, సరిపడు, నాటు అన్న అర్థంలో వాడారు.  

ఈ పల్లవిలో అన్నమాచార్యులు ఒక సూటి సూచన ఇస్తున్నారు: 
ఇప్పటి మన స్థితి వేడి (=చల్ల కానిది, వ్యతిరేక స్థితి​) —
చల్ల ఎప్పుడూ అందుబాటులోనే ఉంది.

మూలమూల”
మూలమూలలో ఎక్కడైనా లభ్యమయ్యేదే.
అలాగే,
భాగాలుగా కాదు—
సమగ్రంగా అనుభవమయ్యే స్థితి అని కూడా సూచన.

రేలుఁ బగలుఁ”
సమయానికి (కాలానికి) సంబంధించినది కాదు—
ఎప్పుడూ ఉన్నదే.

నమ్ముడుఁ”
ఇది నమ్మమని కాదు—
గమనించమని.
ఇది వెతకాల్సినది కాదు—
గుర్తించాల్సినది.

పల్లవిలోని సూచన​
వ్యతిరేక​ దిశ​ మనది—చల్ల ఎక్కడో లేదు. ఎప్పుడూ ఉన్నదే

మొదటి చరణం:
పిక్కటిల్లు చన్నుల గుబ్బెత వొకతి కడుఁ-
జక్కనిది చిలికిన చల్ల
అక్కునఁ జెమటగార నమ్మీని యిది
యెక్కడఁ బుట్టదు గొనరే చల్ల ॥మూల॥

భావము:

నిండుదనముతో, మృదుత్వముతో ఉన్న ఒక సౌందర్యం చల్లను చిలకబోయింది. శ్రమించి చెమటతో తడిసినపుడు (హృదయాంతరాళంలో) అనిపించినది ఆ "చల్ల" ఎక్కడో పుట్టేది కాదని.


గూఢార్థవివరణము:

ఇక్కడ వాడిన భాషాచిత్రాలు యవ్వనాన్ని కాదు—
తాజాగా, ఎప్పటికప్పుడు కొత్తగా అనిపించే అనుభవాన్ని సూచిస్తున్నాయి..

ఈ చరణంలో అన్నమాచార్యులు ఒక స్పష్టమైన గమనికను ఉంచుతారు:
పిక్కటిల్లు చన్నుల గుబ్బెత వొకతి కడుఁ జక్కనిది
ఇది మానవులు "చల్ల" కొరకు
యుక్త వయసు నుండి చేయు సన్నాహములను సూచించుచున్నది.

అక్కునఁ జెమటగార నమ్మీని యిది
కష్టపడి చెమటోడ్చి అనుభవంతో తడిసినపుడు యెక్కడఁ బుట్టదు
అన్నది సూచిస్తుంది.

యెక్కడఁ బుట్టదు గొనరే చల్ల
చల్ల ఎక్కడో కాదు; లోననే ఎప్పుడూ ఉన్నదే
"గొనరే చల్ల” = జనులారా చేగొనరే చల్ల

రెండవ చరణం:
వడచల్లు మేని జవ్వని వొకతి కడు-
జడియుచుఁ జిలికిన చల్ల
తడఁబడు కమ్మనితావులది మీ-
రెడయకిపుడు గొనరే చల్ల  ॥మూల॥

భావము:
వడచల్లు చల్లని మేనితో జవ్వని ఒకతె బెదురు బెదురుగా చల్లను గిలకొట్ట బోయింది. తడబడుతూ ఆమె చిలుకుతుంటే కమ్మనితావులు కనబడె. జనులారా! మీరిపుడు వదలక గొనరే చల్ల.

గూఢార్థవివరణము:
వడచల్లు మేని జవ్వని వొకతి
భావము, సంవేదన, అనుభూతి లేని స్థితిని సూచించుచున్నది.
ఇది ఆమె అంతర్గత స్థితి.

జడియుచుఁ జిలికిన చల్ల
పిరికిగా చల్లను గిలకొట్ట బోయింది.
ఆమె మనో స్థితి అది.
తడఁబడు కమ్మనితావులది
తొట్రుపాటుతో (ఆత్మ విశ్వాసము లేక​) మథించినది చల్ల​
(my guess: కమ్మని తావులు = గుర్తించ గలిగిన ప్రదేశాలు స్వర్గము మొదలైనవి)
ఆ తడబాటులో కమ్మని తావులే కనబడె.

మీరెడయకిపుడు గొనరే చల్ల
ఇలా జరుగుతానే వుంటవి. మీరు విడువకకుండా గొనరే చల్ల

మూడవ చరణం:
అంకులకరముల వొయ్యారొకతి కడు-
జంకెనలఁ జిలికిన చల్ల
వేంకటగిరిపతి వేడుకది
యింకానమ్మీఁ గొనరే చల్ల ॥మూల॥ 
కడుజంకెనలఁ = అనేక బెదరింపుల మధ్య, అనేక అడ్డంకుల మధ్య

భావము:
సహజ​ అలంకారంతో, సొగసుతో ఉన్న ఒక సౌందర్యం—అడ్డంకుల మధ్యలోను చిలికెను చల్ల​. ఇది వేంకటగిరిపతి వేడుక. ఇంకా నమ్మండి—'చల్ల'ను గ్రహించండి.

గూఢార్థవివరణము:
అంకులకరముల వొయ్యారొకతి
తనకు దొరకిన​, లభించిన దేహ సౌందర్యముతోనే

కడు జంకెనలఁ జిలికిన చల్ల
అనేక సమస్యల మధ్య, అనేక అడ్డంకుల మధ్య
చిలికెను చల్ల

వేంకటగిరిపతి వేడుకది
ఇక్కడ “వేడుక” వేంకటగిరిపతిది—
మనది  కాదు.

మన అనుభవాలన్నీ— మనవి.
ఈ ఇల లోనివి.
ఈ అనుభవాలను దాటి వున్నవాడు వేంకటగిరిపతి.

ప్రయత్నములు, తడబాటులు వెలుగు నీడల ఆట లోనివి.—
ఈ అనుభవ ప్రపంచమును మించి,
జీవుల ​ జోక్యములేని,
ఒక అలౌకిక నడకలో సాగుతున్నది ప్రపంచము.

కాని ఈ అనుభవమంతటికీ మధ్యలో—
మన చేతిలో ఉన్నది ఒక్కటే:
ఈ జీవించుట అను అవకాశము సమగ్రముగా స్వీకరించుట.

ఆ స్వీకరణలో ఉన్నపుడు—
గమనించుట జరగవచ్చు.
వేంకటగిరిపతి వేడుకది.

సంక్షిప్త నిర్ధారణ
పల్లవి వ్యతిరేక​ దిశ​ మనది—చల్ల ఎక్కడో లేదు.
మొదటి చరణం అతి ప్రయత్నము పని చేయదు.
రెండవ చరణం తడబాటులో కనిపించినది నిలబడదు.
మొదటి రెండు చరణాలు:  చల్ల అనుభవంలో పుట్టేది కాదు.
మూడవ చరణం ఉన్నదానిని సమగ్రముగా స్వీకరించిన స్థితిలో,
చల్ల ఒక చూపుగా గోచరించవచ్చు.

1 comment:

  1. అసాధారణమైన శిల్పముతో, గహనమైన భావముతో అందగించిన ఈ అన్నమయ్య కీర్తనను చక్కగా విశద
    పరిచారు శ్రీనివాస్ గారు. చల్ల చిలకట
    మనేది మామూలుగా చిలికే చల్ల కాదని, ఈ చల్ల ఎప్పుడూ ఉండునదే యని, కాలాతీతమైనదని, మూలమూలలలో
    ఎక్కడైనా సరే నిత్య నూతనముగా ఉండే ప్రయత్నపూర్వకమైన అనుభవానికి మాత్రమే పరమాత్మ స్థితి లభ్యమగునని, సమగ్రమైన అట్టి అలౌకిక స్థితినున్న వేంకటగిరిపతిని వేడుకగా కనుగొనమని ఆచార్యులవారు ఈ కీర్తనలో బోధించుచున్నారు.

    ఓం తత్ సత్
    🙏🙏🙏
    కృష్ణమోహన్

    ReplyDelete

T-337 విచ్చేయవమ్మా వెన్నెలబొమ్మా

  తాళ్లపాక అన్నమాచార్యులు 337 విచ్చేయవమ్మా వెన్నెలబొమ్మా For English Version Press Here పరిచయం వెన్నెలబొమ్మ మనిషి ఈ ప్రపంచములోనికి ప్రవే...