Saturday, 2 May 2026

T-325 ఏమనవచ్చును చెల్లుచున్నవివె యీశ్వర నీమాయలు గొన్ని

తాళ్లపాక అన్నమాచార్యులు 
325 ఏమనవచ్చును చెల్లుచున్నవివె యీశ్వర నీమాయలు గొన్ని

పరిచయం
చూచే చూపే రాజు — చూద్దామంటే బంధం

ఈ అన్నమాచార్యుల కీర్తన ప్రపంచం యొక్క విచిత్రమైన నడతను ప్రతిబింబిస్తుంది.
సత్యము ఒకటే అన్న భావన విస్త్రృతము.
కానీ దాని అనుభవం మాత్రం వేర్వేరుగా అగపడుతుంది.

ఈ విరుద్ధత సృష్టిలోని అంతర్భాగమా?
లేక మన చూపులలో లోపమా?

ఒకే వాస్తవాన్ని ఎదుర్కొన్న మనుషులు ఎందుకు భిన్న నిర్ణయాలకు వస్తారు?
ఎందుకు ఒకే విధమైన చూడటం కుదరదు?
ఇందుకు సమాధానం సూటిగా ఉండకపోవచ్చును.
ఈ భిన్న చిత్రాలు ఎక్కడి నుండి ఉద్భవిస్తున్నాయో
ప్రశ్నించాల్సిన అవసరం కనబడుతోంది.

సత్యము ఒకటే కావచ్చు—
కానీ అది మనకు ఒకటిగా ఎందుకు కనిపించడం లేదు?
ఈ కీర్తన సమాధానం ఇవ్వదు—
జీవితం అనే ప్రశ్నను మధ్యలో నిలబెట్టి పరిశీలించమంటుంది.
చూచేదంతా తప్పని తెలిసినవారు ఉండవచ్చు—
దాన్ని సరిచేసుకునే వారు కొందరే.

గట్టుమీద నుంచే లోతెంతో అంచనా వేస్తామా?
జీవితం వడ్డించిన విస్తరి కాదు—
లోతు దిగితేనే తెలుస్తుంది.
సముద్రంలో అలలు తగ్గితే స్నానం చేద్దామంటే—
అలలు తగ్గవు; అలాగే జీవితం మొదలుకాదు.


అధ్యాత్మ​ సంకీర్తన

రేకు: 344-4   సంపుటము: 4-259

ఏమనవచ్చును చెల్లుచున్నవివె యీశ్వర నీమాయలు గొన్ని
శ్రీమాధవ నీ చిత్తము కొలఁదిఁక చెప్పెడిదేఁటికి జీవులకు  ॥పల్లవి॥

కలిదోషనిరుహరణ కైవల్యాకర హరి
తలఁచినవారిది నేరుపు మిముఁ దలఁచనివారిది నేరమి
కలుషమెడలి సూర్యోదయమైనా కానవుకొన్నిజంతువులు
తెలిసినవారలు కందురు యీతెరఁగలు రెంటికి దినమొకటే          ॥ఏమ॥

శరణాగతరక్షణచతుర సర్వాంతరాత్మక యచ్యుత
సరి నిన్నుఁ గొలిచినవారిది పుణ్యము చలమున మానుటే పాపము
సరుగనఁ గాచేటి చల్లని చంద్రుఁడు జారచోరులకుఁ గడు వేఁడి
అరయఁగఁ గలువలకును హితుఁడు అందుకు నిందుకు గురి యితఁడే        ॥ఏమ॥

శ్రీవేంకటగిరినిలయ శ్రీసతీశ పురుషోత్తమ
మివొద్దనుండితే వైకుంఠము మిమ్ము నెడసితే నరకము
భావములోపల నీవే వుండఁగ భక్తి లేదు కొందరికైతే
శ్రీవైష్ణువులకు నిత్యము యీ చింతలు రెంటికి నీ మహిమే              ॥ఏమ॥
Details and Explanations:
పల్లవి:
ఏమనవచ్చును చెల్లుచున్నవివె యీశ్వర నీమాయలు గొన్ని
శ్రీమాధవ నీ చిత్తము కొలఁదిఁక చెప్పెడిదేఁటికి జీవులకు          ॥పల్లవి॥

భావము:
ఓ ఈశ్వరా! ఈ ప్రపంచం ఇలా నడుస్తున్నది. ఏమనవచ్చును? అంతా నీ మాయలే. నీ చిత్తము మేరకే ఇవన్నీ జరుగుతున్నవి. అయితే—ఈ జీవులకు చెప్పేందుకు ఏమీలేదు.

గూఢార్థవివరణము: 

ఈ పల్లవిలో అన్నమాచార్యులు ఒక ప్రాథమిక ప్రశ్నను నిలబెడతారు:
మనసు సాధారణంగా:
అర్థం చేసుకోవాలనుకుంటుంది
కారణం తెలుసుకోవాలనుకుంటుంది.
ముందే తెలుసుకుని నియంత్రించాలనుకుంటుంది

ప్రపంచం నడుస్తూ ఉంటుంది—
కానీ దానిపై ముందస్తు అంచనాకై యత్నించ అవసరం లేదు.
మనిషి ఆరాటమంతా ముందుగా తెలియుటకే.
అందుకే అన్నమాచార్యులు "ఏమనవచ్చును" "చెప్పెడిదేఁటికి జీవులకు" అన్నారు.

జరిగేది జరుగుతుంది —
కానీ, మన నియంత్రణలో కాదు.


నీ మాయలు గొన్ని” — అర్థం
ఇక్కడ “మాయ” అంటే:
మోసం కాదు.
అనేక విధాలుగా కనిపించే ప్రపంచపు నడత

నీ చిత్తము కొలఁదిఁక”
అంటే:
జరుగుతున్నది ఒక సమగ్ర క్రమంలోనే జరుగుతోంది—
కాని, అది మనకు గ్రహింపుకు రాదు.

పల్లవిలోని సూచన​:

ప్రపంచం నడుస్తోంది—
మనిషి దానికి సాక్షి మాత్రమే, నియంత్రణకర్త కాదు.

జరుగుతున్నది ముందుగా చెప్పబడదు—
జరిగినప్పుడు మాత్రమే తెలుస్తుంది.


మొదటి చరణం:
కలిదోషనిరుహరణ కైవల్యాకర హరి
తలఁచినవారిది నేరుపు మిముఁ దలఁచనివారిది నేరమి
కలుషమెడలి సూర్యోదయమైనా కానవుకొన్నిజంతువులు
తెలిసినవారలు కందురు యీతెరఁగలు రెంటికి దినమొకటే ॥ఏమ॥

భావము:
కలియుగ దోషాలను తొలగించేవాడా! మోక్షాన్ని ప్రసాదించేవాడా! ఓ హరి! నిన్ను తలఁచినవారిది నేరుపు మిముఁ దలఁచనివారిది నేరమి. కలుషములు తొలగి సూర్యోదయమైనా కొన్ని జీవులు గ్రహించలేవు. కానీ, తెలిసినవారు చూచుదురు. ఈ రీతిగా దినములందరికి ఒకటే.

గూఢార్థవివరణము:
తలఁచినవారిది నేరుపు మిముఁ దలఁచనివారిది నేరమి
దైవాన్ని తలచుటలో ప్రత్యేకమైన నేర్పేమీ లేదు.
కానీ, చాలామంది తలచుటను స్తుతించటంతో సమానంగా తీసుకుంటారు.

ఇక్కడ “తలచుట”తో—
తనను ఏది నడిపిస్తోందో గమనించమనే అర్థం వస్తుంది.

అయితే ఇది అంత​ సులభం కాదు.

ఈ సంసారమును పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా—
వదిలినా, వదలకున్నా—
అది మనలను వదలదు.
వదిలినా, వదలకున్నా—
అది మనలను వదలదు.

ఈ స్థితిలో, తనను నడిపిస్తున్నదేంటో గమనించడానికి
మానవునికి తగిన శ్రద్ధ ఉండకపోవడాన్ని
అన్నమాచార్యులు సూచిస్తున్నారని అనుకోవచ్చును.
మానవునికి తగిన శ్రద్ధ ఉండకపోవడాన్ని
అన్నమాచార్యులు సూచిస్తున్నారని అనుకోవచ్చును.


ఈ చరణంలో అన్నమాచార్యులు ఒక స్పష్టమైన గమనికను ఉంచుతారు:
వాస్తవం ఒకటే—
రెంటికి దినమొకటే (= దినములందరికి ఒకటే)
కాని అనుభవం వేర్వేరుగా కనిపిస్తుంది.

 

రెండు ఉదాహరణలు చూపారు.
తలఁచినవారిది నేరుపు / తలఁచనివారిది నేరమి
సూర్యోదయమైనా కానవుకొన్నిజంతువులు

భేదం వస్తువులో కాదు—
చూచే స్థితిలో ఉంది.


రెండవ చరణం:
శరణాగతరక్షణచతుర సర్వాంతరాత్మక యచ్యుత
సరి నిన్నుఁ గొలిచినవారిది పుణ్యము చలమున మానుటే పాపము
సరుగనఁ గాచేటి చల్లని చంద్రుఁడు జారచోరులకుఁ గడు వేఁడి
అరయఁగఁ గలువలకును హితుఁడు అందుకు నిందుకు గురి యితఁడే ॥ఏమ॥

భావము:
శరణు వచ్చిన వారిని రక్షించడంలో నిపుణుడా, అందరిలోనూ అంతర్యామిగా ఉన్నవాడా! మార్పులేని వాడా! ఓ అచ్యుతా! నిన్ను ఆశ్రయించినవారికి పుణ్యం; చంచలత్వమే పాపంగా నిలుస్తుంది. చంద్రుడు చల్లగా ప్రకాశిస్తాడు— కానీ దొంగలకు అది ఇష్టం కాదు; కలువలకు మాత్రం అనుకూలం. అందువల్ల— వాస్తవం ఒకటే కానీ, వేర్వేరు ఫలితాలకు కారణమవుతుంది.

గూఢార్థవివరణము:
నిన్నుఁ గొలిచినవారిది పుణ్యము చలమున మానుటే పాపము
ఇది చూపేది:
దైవాన్ని కొలుచుట ఒక కర్తవ్యం కాదు—
మన స్థితిని బట్టి జరిగే స్పందన.
ఇది ఎంపిక కాదు—
మన అంతర్గత స్థితి..

పల్లవితో అనుసంధానం
పల్లవి ప్రపంచం నడుస్తూ ఉంటుంది.
తర్వాతది ముందుగా చెప్పబడదు.
మొదటి చరణం చూడడంలో భేదం
రెండవ చరణం ప్రతిస్పందనలో భేదం
మొదటి రెండు చరణాలు:  స్పందన మన మనో స్థితి పైననే
అదే ప్రపంచాన్ని మనం వేర్వేరు విధాలుగా అనుభవిస్తాం.

అన్నమాచార్యులు అనేక మార్లు చెప్పినదొకటే
"పరమమనేదొక్కటే ప్రపంచమొక్కటే"
ఇదే ప్రపంచం భక్తులకు పరము గాను,
జీవులకు దృశ్యమయ ప్రపంచముగాను కనబడుచున్నది.

మూడవ చరణం:
శ్రీవేంకటగిరినిలయ శ్రీసతీశ పురుషోత్తమ
మివొద్దనుండితే వైకుంఠము మిమ్ము నెడసితే నరకము
భావములోపల నీవే వుండఁగ భక్తి లేదు కొందరికైతే
శ్రీవైష్ణువులకు నిత్యము యీ చింతలు రెంటికి నీ మహిమే              ॥ఏమ॥

భావము:
వేంకటగిరిలో నివసించే వాడా,  శ్రీసతీశుడా, పురుషోత్తముడా మివొద్దనుండితే వైకుంఠము మిమ్ము నెడసితే నరకము. నీవు మనసులోనే ఉన్నా—కొందరికి భక్తి లేదు. కాని తెలిసినవారికి—ఈ రెండు భావనలూ ఎల్లప్పుడూ నీ మహిమగానే కనిపిస్తాయి.

గూఢార్థవివరణము:
మివొద్దనుండితే వైకుంఠము  మిమ్ము నెడసితే నరకము:
వైకుంఠము లేదా నరకము అనునవి అనుభవ స్థితులు.
మనసు దగ్గరైతే వైకుంఠము.
దూరమైతే నరకము.

భావములోపల నీవే వుండఁగ భక్తి లేదు కొందరికైతే
సత్యం లోపలే ఉన్నా—భక్తి లేక అది గుర్తించబడదు

శ్రీవైష్ణువులకు నిత్యము యీ చింతలు రెంటికి నీ మహిమే.
తెలిసినవారికి—ఈ భావనలు వైకుంఠము, నరకము రెండు నిత్యము.
అవి రెండు నీ మహిమగానే కనిపిస్తాయి.
వానిలో ఒకటి వలదని రెండవది వలెనని తెలియునది భేద భావము.

అర్జునుడు విశ్వరూప సందర్శనలో—
వైకుంఠము, నరకము, ఉష్ణము, తేజము—
సమస్త ప్రపంచమును ఒకటిగా దర్శించెను.


ప్రపంచమునకు అధారమొకటే.
చూసే స్థితిని బట్టి అది మారుచుండును.
చూచేచూపు తెలియుట భక్తి.
తక్కినవన్ని కావు.

సంక్షిప్త నిర్ధారణ
పల్లవి మనిషి ప్రపంచంలో సాక్షి మాత్రమే, నియంత్రణకర్త కాదు.
1వ చరణం చూచే స్థితి నుండి భేదాలు కనబడతాయి
2వ చరణం ప్రతిస్పందనలు రెండు రకాలై తికమక పెడతాయి
3వ చరణంసర్వసమ్మతము భక్తి.  


 

No comments:

Post a Comment

T-334 ఓహోహో యనరో పారి

  తాళ్లపాక పెదతిరుమలాచార్యులు 334 ఓహోహో యనరో పారి For English Version Press Here పరిచయం   “ ఓహోహో యనరో పారి” అనేది కేవలం ఒక భక్తి కీర్తన...